3, ఆగస్టు 2011, బుధవారం

మహిళల బేషర్మీ మోర్చా( సిగ్గుమాలిన సమాఖ్య)

 రాజధాని నగరంలో ‘సిగ్గులేని నడక’ సాగిద్దామనుకుంటున్నాను ఎలా ఉంటుందంటావు?- అని హరి మిత్రుడ్ని నవ్వుతూ ప్రశ్నించాడు. ‘‘నువ్వు కొత్తగా మొదలు పెట్టడం ఏమిటిరా? ఎంత మంది మహనీయులు ఎప్పుడో దిగ్విజయంగా నడక యాత్ర సాగిస్తుంటేనూ? ’’ అని గిరీశం నుండి వినిపించిన సమాధానంతో హరి విస్తుపోయాడు.

‘‘సిగ్గులేని నడక అని అనగానే ఆశ్చర్యపోయి అదేం నడక అని నేను విస్తుపోతానని అనుకున్నావు. ప్రేక్షకులు ఊహించినట్టుగా ఉంటే అది సినిమా కాదు... ప్రజలు ఆశించినట్టు నడిస్తే అది ప్రభుత్వం అనిపించుకోదు..

 నేను ఆశ్చర్యపోయి సిగ్గులేని నడక ఏమిటి? అని అడిగితే నేను గిరీశాన్ని ఎందుకవుతాను. నీకెందుకు శ్రమ నువ్వు చెప్పదలుచుక్నుదేమిటో కూడా నేనే చెబుతాను విను ’’ అని గిరీశం
‘’ కెనడాలోని టోరంటో నగరంలో పనికి మాలిన కానిస్టేబుల్ ఎవడో ఆడవాళ్లు రెచ్చగొట్టే విధంగా దుస్తులు వేసుకోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని, వాగితే ఆ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ అదే దేశంలో ఈ సంవత్సరం స్లట్ వాక్ నిర్వహించారు. ఆ ప్రేరణతో మన దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద సంఖ్యలో ఆడవాళ్లు బేషర్మీ మోర్చా( సిగ్గుమాలిన సమాఖ్య) పేరుతో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు.

 టోరంటోను ఢిల్లీ అనుసరిస్తే, ఢిల్లీని మనం అనుసరించాలి కాబట్టి నువ్వు సిగ్గులేని నడక నిర్వహిద్దాం మీడియాలో బోలెడు ప్రచారం వస్తుంది అని చెప్పబోతున్నావు అంతే కదా? అని గిరీశం చెప్పాడు. పిచ్చోడా! నిజంగా టోరంటోను చూసి మనం కాపీ కొట్టడమే పెద్ద సిగ్గులేని తనం. సిగ్గులేని తనంలో మనను మొత్తం ప్రపంచ కాపీ కొట్టాలి. ఎలానా? చెబుతా విను. ఈ దేశ జనాభా నూట ఇరవై కోట్లు దాటింది. ఆ అంకె రాయాలంటేనే ఐదు నిమిషాలవుతుంది. రాసిన అంకె కరెక్టే కాదా? అని తేల్చుకోవడానికి పాతిక నిమిషాలు పడుతుంది. ఇంత పెద్ద దేశానికి నాయకత్వం వహించడానికి ఒక్క భారతీయుడు కూడా లేడు. విదేశీయురాలే సమర్ధవంతమైన నాయకురాలు అని మనం అనుకోక తప్పని పరిస్థితులకు మించిన సిగ్గులేని తనం ఇంకేముంటుంది.

 సరే ఆ విషయం వదిలేద్దాం. మనం రేషన్ కార్డు కోసమో, సిమ్ కార్డు కోసమో, కాంప్లిమెంటరీ పాసుల కోసమో తప్పుడు అడ్రస్‌లు ఇచ్చేసినంత ఈజీగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి, కొత్త అడ్రస్‌తో, ప్రధానమంత్రి పదవి కొట్టేయడం కన్నా సిగ్గులేని తనం ఇంకోటి ఉంటుందా? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సీ నంబర్ కోసం ఆర్టీఏ వారికి తాను పుట్టిపెరిగింది, జీవితం సాగిస్తున్నది ఆదిలాబాద్ జిల్లాలోని మారు మూల గ్రామంలో అని తప్పుడు అడ్రస్ చెబితే ముక్కున వేలేసుకున్నాం. కానీ ఏకంగా ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యత్వం కోసం తాను అస్సామీనని, అస్సాంలో తనకో ఇల్లుందని అడ్రస్ సృష్టించడానికి మించిన సిగ్గులేని తనాన్ని ఊహించగలమా?

 పూర్వం ఆశ్వమేధయాగం చేస్తే గుర్రాన్ని వదిలి దమ్మున్న వారెవరైనా గుర్రాన్ని పట్టుకుని మాతో యుద్ధం చేయండి అని సవాల్ విసిరే వాళ్లు. ఆ గుర్రం దేశ దేశాలు తిరిగేది. అడ్డగించిన వారితో ఆ గుర్రం వెంట ఉన్న సైన్యం యుద్ధం చేసేది. అడ్డంకులు లేకుండా ఆ గుర్రం ఎన్ని దేశాలు తిరిగితే ఆ దేశాలన్నింటిని జయించినట్టు అన్నమాట! ఇప్పుడు కూడా మన దేశం నిర్భయంగా ఇలాంటి అశ్వమేధయాగాన్ని నిర్వహించవచ్చు. సిగ్గులేని తనంలో మాతో పోటీకి వచ్చేవారెవరైనా ఉంటే గుర్రాన్ని అడ్డగించండి మీ సిగ్గులేని తనం ఏమిటో చెప్పండి మా సిగ్గులేని తనాన్ని చెప్పి విజయం సాధిస్తాం అని చాటింపు వేయించవచ్చు.... ఇదిగో నీ మైనింగ్ బాగోతం, నువ్వు అవినీతికి పాల్పడ్డావు అని లోకాయుక్త చెబితే ముఖం చాటేయకుండా విజయయాత్ర అన్నట్టు తన మద్దతు దారులతో కలిసి బెంగళూరు పురవీధుల్లో ఊరెగుతూ వెళ్లి యెడ్యూరప్ప గవర్నర్‌కు రాజీనామా ఇచ్చిన దృశ్యాన్ని చూస్తే సిగ్గులేని ర్యాలీ అంటే ఇది కదా? అనిపించింది. ఏ రాయి ఐతేనేం పళ్లూడగొట్టుకోవడానికి అని పాత అవినీతి పరురాలు జయలలితకు తమిళసోదరులు పట్టం కడితే అదిగో అక్కడ అవినీతిపై జనం తిరగబడి ఆమెను గెలిపించారు. ఇక్కడా అలానే నన్ను గెలిపిస్తారు అని బాబు నిర్లజ్జగా చెప్పడం వింటే ముచ్చటేస్తుంది కదూ! అధికారంలో ఉన్న రోజుల్లో అవినీతిలో మునిగిపోయి ఇప్పుడు అవినీతి రహిత పాలన కోసం బాబాలతో కలిసి ఉద్యమిస్తానని ఢిల్లీయాత్రకు వెళుతున్న బాబు ధైర్యాన్ని మెచ్చకుండా ఉండగలమా? ....లక్ష కోట్లు నొక్కేశావురా బాబూ అంటే మా నాన్న పదవి నాకివ్వకుండా అన్యాయం చేశారని జగన్ నిర్వస్తున్న యాత్ర సిగ్గులేని నడకను గుర్తు చేయడం లేదా?

 50 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, 35 మంది జగన్‌తో ఉన్నారు అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి లేని ప్రభుత్వానికి నాయకత్వం వహించి పాలించడం సిగ్గులేని యాత్రే కదా! వారి సంగతెందుకు మన అడుగులను ఒక్కసారి చూసుకుందాం. హజారే దీక్షకు జేజేలు పలికే మనం ప్రభుత్వ కార్యాలయానికి పని కోసం వెళ్లేప్పుడు విచారించేది ఎవరికి ఎంత డబ్బిస్తే పనవుతుందనే కదా! ’’ అని గిరీశం హరికి తత్త్వోపదేశం చేశాడు..
ముక్తాయింపు: ఢిల్లీలో ఒక బార్బర్ వద్దకు చిదంబరం కటింగ్ కోసం వచ్చాడు. సార్ ఈ 2జి స్పెక్ట్రమ్ అంటే ఏంటిసార్ అని బార్బర్ అడిగాడు. కటింగ్ చేయించుకుని చిదంబరం ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయాడు. తరువాత మన్ మోహన్‌సింగ్ వచ్చాడు, అతన్ని అలానే అడిగాడు, తరువాత ప్రణబ్ ముఖర్జీ వంతు మళ్లీ అదే తంతు. రాత్రికి రాత్రి పోలీసులు బార్బర్‌ను కిడ్నాప్ చేసుకెళ్లారు. నువ్వెవరివో చెప్పు సిఐఎ ఏజెంట్‌వా? ఐఎస్‌ఐ ఏజెంట్‌వా? తీవ్రవాదివా? ఎవరివో నిజం చెప్పు అని చితగ్గొట్టారు. బాబోయ్ నాకేం తెలియదు 2జి స్పెక్ట్రమ్ పేరు వినగానే కాంగ్రెస్ నాయకుల వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. దాని వల్ల నేను సులభంగా కటింగ్ చేయగలుగుతున్నాను ఇంతకు మించి నాకేం తెలియదు అని మొత్తుకున్నాడు.

10 కామెంట్‌లు:

 1. ఒకవేళ అశ్లీల దుస్తులు వేసుకోవడం రేప్‌లకి కారణం కాదని వాళ్ళు నమ్మితే ఆ విషయం నోటితో చెప్పాలి కానీ నగ్నంగా వీధుల్లో ఊరేగాల్సిన పని లేదు. అశ్లీల దుస్తులు వేసుకోవడం ఏదో తమ ప్రాథమిక హక్కు అని చెప్పినట్టు ఉంది.

  రిప్లయితొలగించు
 2. మురళి గారు,
  బాబు గారి అవినీతి గురించి ఒక సమగ్రమైన వ్యాసం మీ నుండి ఆశిస్తున్నాను. ఆయన నాశనం చేసిన ప్రజా సంక్షేమ వ్యవస్థల గురించి కూడా.

  రిప్లయితొలగించు
 3. వావ్ అద్భుతం మాస్టారు...మీకిలాంటి ఐడియాలెలా వస్తాయి? ఏది ఆ కిటుకులేవో చెప్పండి మాకు కొంచం...శిష్యరికం చేస్తాం!

  రిప్లయితొలగించు
 4. @.ప్రవీణ్ గారు డిల్లీ లో అమ్మయిలు గౌరవప్రదమైన దుస్తుల్లోనే ప్రదర్శన చేశారండి
  @వీర గారు ఎన్ని లోపాలు ఉన్నా మన ప్రజాస్వామ్యం చాలా గొప్పది . యెంత మంది జగన్,బాబులనైన తట్టుకొని నిలబడగలదు .
  @ సౌమ్య గారు ఉద్యోగం ఉడినా సలహాలు అమ్ముకొని బతికేయవచ్చు అన్నంత దైర్యం ఇస్తోందండి మీ కామెంట్
  @బాలు గారు థాంక్స్

  రిప్లయితొలగించు
 5. ఒక్క పోస్ట్.. ఎన్ని సిగ్గుమాలిన చర్యల గురించి.. తెలుసుకున్నాం. జనం అజ్ఞానం తొలగిపోవాలని ఆశిస్తూ.. ధన్యవాదాలు మురళి గారు.

  రిప్లయితొలగించు
 6. ఆహా... మన సిగ్గులేని తనాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పారండి... ఇంత పెద్ద దేశంలో ఒక మంచి నాయకుడు లేకుండా పోయాడు.... ఇంతకు మించిన సిగ్గులేని తనం ఎక్కడ వుంటుంది?

  రిప్లయితొలగించు
 7. మురళిగారు, ఈసారి పోస్టులో వెటకారం ఘాటు కొద్దిగా తగ్గినట్టుంది.అంటే అంతా సూటిగానే ఉందని. నసాళానికి అంటేట్లుగా మన సిగ్గుమాలిన తనాన్ని మరోసారి గుర్తుచేసారు.ఉద్యోగం- ఏం చేస్తే ఉంటుంది, ఏం చెయ్యకపోతే ఊడుతుంది అన్ని విషయం అంత బాగా తెలిసినా మీరు చేస్తున్న ఈ సాహసం..నిజంగా ప్రశంసార్హమైనది.గో ఎహెడ్...మరిన్ని మంచి పోస్టుల కోసం ఎదురుచూస్తున్నాం.

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం