19, ఆగస్టు 2011, శుక్రవారం

సుమనే నిజమైన హీరో .......................... సఖల సుమన్ అభిమానులకు బహిరంగ సవాల్

 మీరు సుమన్ అభిమానులా? ఏ సుమన్ అంటున్నారా ? సూర్యుడు అంటే ఏసూర్యుడు అనే ప్రశ్న ఉదయిస్తుందా? చంద్రుడు అంటే ఏచంద్రుడు  అని అడుగుతారా? భూమి , ఆకాశం అంటే ఏ ఆకాశం, ఏ భూమి అని అడుగుతారా? అలానే సుమన్ అంటే ఏ సుమన్ అనే ప్రశ్నే రాదు .. రాకూడదు. మన సుమన్  బుజ్జ్లు, బ్లాగ్స్ సూటి పోటి మాటలను ఖాతరు చేయకుండా మన సుమన్ మరో సినిమాతో దూసుకు వెళుతున్నారు .. ఈనెల ౨౧న  వాళ్ల టీవి లో మన సుమన్ హీరోగా నటించిన ఉషా పరిణయం సినిమా వస్తోంది. ఆ సినిమా చూసి మనసుమన్ కు నైతిక దైర్యాన్ని అందించాలని అందరిని కోరుతున్నాను. అన్నా హాజరేకు సుమన్ సినిమాలు వరుసగా చూపిస్తే దారికొస్తాడు అని ఢిల్లీ లో కొందరు కాంగ్రెస్స్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తిప్పాయపాలెం లో పొలం పనులు చేసే రంగయ్య అంటుంటే విన్నాను అని గంగాయపాలెం లో ఉండే మా మిత్రుడు చెప్పాడు. మన సుమన్ ప్రతిభ ఢిల్లీ వరకు వెళ్ళినందుకు మనం సంతోషించి తీరాలి. చిన్నప్పుడు నేను చూసిన జేమ్స్ బాండ్ సినిమాల్లో ఆమెరికా వాడికి పెద్ద సమస్య వచ్చి తల పట్టుకున్నప్పుడు  అమ్మాయిలతో ఆడుకుంటున్న జేమ్స్ బాండ్  గుర్తుకొస్తాడు. అలానే మన హస్తిన పాలకులకు సుమన్ గుర్తుకు రావడం అంటే మనకు సంతోషమే కదా . స్వయంగా శ్రీకృష్ణుడు భూలోకానికి వచ్చి సుమన్ ను కృష్ణుడి  వేషం లో చూసి నేను ఇంత అందంగా ఉన్నానా ? అని సిగ్గు పడతాడు అని మా తాలూకా అభిప్రాయం ( ఏ తాలూకా అని అడుగుతున్నారా? ఇప్పుడు తాలుకాలు ఎక్కడున్నాయి ? )
సుమన్ ను మించిన రియల్ హీరో రాష్ట్రం లో లేడని నా నిజమైన అభిప్రాయం ( వ్యంగ్యంగా అంటున్నానని అనుకునేరు , అందుకే నిజమైన 
అభిప్రాయం అని చెబుతున్నాను) 
ఎందుకంటే చెబుతాను వినండి. 
నందమూరి తారక రామారావును అధికారం నుండి దించినప్పుడు నాకు ఆయన మీద బోలెడు జాలి కలిగింది. పాపం నానా కష్టాలు పడి అధికారం లోకి వస్తే అంతా కలిసి కింద పడేశారు అని బాధ పడ్డాను. తనను తొలగించడానికి రామోజీ రావు కుట్ర పన్నాడు. బాబుతో కలిసి రామోజీ పన్నిన కుట్రకు బలయ్యాను అని రామారావు ఆవేదన చెందారు. ౯౫ లో ఆయన చనిపోవడానికి ఒకటి రెండు వారాల ముందు శ్రీశైలం లో  విలేఖరులతో మాట్లాడుతూ  రామోజీ  కుట్ర పన్ని కూల్చి వేశాడు అతని సంగతి త్వరలోనే తేలుస్తాను అన్నాడు . ( అనుమానం ఉన్నా వారు అప్పటి ఈనాడును గ్రంధాలయం లో వెతికి చూడ వచ్చు ) . బతికి ఉంటే  ఏ చేసేవారో తెలియదు కానీ ఒకి రెండు వారాలకే చని పోయారు. అంతటి జనాకర్షణ గల రామారావు కూడా రామోజీని ఎమీ చేయలేక పోయారు. ఇక ఆ తరువాత అధికారం లోకి వచ్చిన అంతకన్నా మొండి ఘటం  రాజశేఖర్ రెడ్డి , ఉండవల్లి  అరుణ్ కుమార్ కలిసి ఆయన ఆర్ధిక  మూలాలను దెబ్బతీశారు, పాతిక శాతం వాటా అమ్ముకునేట్టు చేశారు. . మార్గదర్శిడిపాజిట్లు  వసూలు చేయకుండా చేశారు అంతకు మించి ఎమీ చేయలేక పోయారు . మరి అదే మన హీరో వద్దకు వస్తే ముచ్చెమటలు పోయించారు. తన తండ్రి ఎలాంటి వ్యక్తో సాక్షికి పేజీల కొద్దీ ఇంటర్వ్యులు ఇచ్చి తండ్రికి నిద్ర లేకుండా చేశాడు. ఆ దృశ్యాన్ని  ఉహించుకుంటే భక్త ప్రహ్లాద   సినిమాలో యస్వీ రంగ రావు అసమాన నటన గుర్తుకు వచ్చిందని ఓ మిత్రుడి ఉవాచ . భక్త ప్రహ్లాద కన్నా మన సుమన్ మిన్న ఎందు కంటే  మన సుమన్ మళ్లీ తండ్రి వద్దకు చేరడమే కాకుండా ఎడా పెడా సినిమాలు తిసేస్తున్నాడు . మరి ఆతను  రియల్ హీరో కాకుంటే మరేమిటి ?  కోట్లాది మంది ప్రజలు  ఎన్ను కున్న ప్రభుత్వం కన్నా నేనే మిన్న అనుకునే వ్యక్తిని, ముఖ్యమంత్రిని సైతం  తన కంపెనీ లో  పని చేసే ఒక   ఎగ్జిక్యుటివ్ గా చూసే వ్యక్తి కి నిదుర లేకుండా చేసే వ్యక్తి హీరో కాకుంటే మరేమిటి 
మీ నాన్న మాటనే వినని నువ్వు కోన్ కిష్క బ్లాగర్స్ మాట వింటావా ? బ్లాగ్స్ లో నిన్ను ఎవరేం  విమర్శించిన పట్టించు కోకు మాలాంటి ఆభిమానుల కోసం మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తూనే ఉండు. తెలుగు సినిమాను కొత్త మలుపు తిప్పు సుమన్. చాలా సినిమాల్లో హీరోయిన్ తండ్రే విలన్ అని తేలుతుంది. నిన్ననే ఏదో టివిలో ఏదో సినిమా చూశాను. జయప్రద హీరోయిన్ రామారావు హీరో . ఇంత చేస్తే జయప్రద తండ్రే విలన్ అని తేలుతుంది . హీరోయిన్ తండ్రే విలన్ ఎందుకు కావాలి నువ్వు ఈ ట్రెండ్ను మర్చి హీరో తండ్రిని విలన్ గా  నువ్వే కథ రాసి, హీరోగా నటించి సినిమా తీయి. చూడడానికి మేం ఉన్నాం కదా . ఇప్పుడు చెప్పండి మీరు సుమన్ అభిమానులైనా ? వ్యతిరేకులైన సుమన్ రియల్ హీరో అంటే ఒప్పుకుంటారా? లేదా?
( ఫోటో సౌజన్యం....... .).

KAMMA VAARI KI GURTHIMPPU THECHCHINA GREAT HERO

10 కామెంట్‌లు:

 1. ఆదివారం నేనూ ఏ ప్రోగ్రామూ పెట్టుకోకుండా, రాత్రికి కూడా వంట ఉదయమే చేసి ఉంచి,(చూశాక వంట చేసే స్థితిలో నేను లేకపోతేనో?)ఉషా పరిణయంలో బొద్దు కన్నయ్య చేసే చిలిపి మహిమలు చూడ్డానికి సిద్ధమైపోయా ఇప్పటికే!

  రిప్లయితొలగించు
 2. మురళి..గారు.. నేను ఆ సమయానికి..హైదరాబాద్..లో.. ఎయిర్ పోర్ట్ లోఉంటాను..చూడ వీలుపడదు..కనుక దయ చేసి..చూసి మీరే..చెప్పాలి.. కృష్ణాష్టమి కదండీ..ఏమిటో.. అయినా మాకు..అదృష్టం లేదు..చూసి.తరించడానికి. ప్చ్.

  రిప్లయితొలగించు
 3. @సుజాత గారు మీ స్పూర్తి , దైర్యం , అంకిత భావం సఖల తెలుగు జనులకు ఉండాలని కోరుకుంటున్నాను.
  @ వనజవనమాలి గారు అయ్యో యెంత మాటండి . మీరు చెప్పిన చిన్న పని చేయనని ఎలా అంటాను. కానీ నిజ్జంగా ఆ సినిమా వచ్చే సమయానికి నాకు ఏదో అర్జంట్ పని పడబోతుందండి. లేకపోతే చూసి తరించే వాడినే ... నిజమండీ నమ్మండీ ..

  రిప్లయితొలగించు
 4. బాగుంది సార్. సుమన్ రియల్ గానే రియల్ హీరో అని చాలా కన్విన్సింగుగా చెప్పారు. అయితే చిక్కేంటంటే మనకొక రియల్ హీరో ఈపాటికే ఉన్నాడు కాబట్టి ఈయనకి మరో పేరు - మరింత గంభీరంగా ఉండే పేరు - వెతికితే బావుంటుందనిపించింది. అంచేత సుమన్ని సర్రియల్ హీరో అనొచ్చని నా ఉద్దేశం -పరిశీలించగలరు.

  రిప్లయితొలగించు
 5. భీభత్స, భీకర, భయంకర హీరో అంటే ఎలా ఉంటుందో చూడండి.

  రిప్లయితొలగించు
 6. సూర్యుడు అంటే ఏసూర్యుడు అనే ప్రశ్న ఉదయిస్తుందా? చంద్రుడు అంటే ఏచంద్రుడు అని అడుగుతారా?
  ఉదయిస్తుందండీ.. నా మటుకు సూర్యుడు అనగానే అప్పట్లో వైఎస్ వెనుక ఉన్న సూరీడు, చంద్రుడు అనగానే మన చంద్రబాబూ టక్కున గుర్తొచ్చేస్తారు..
  ఇక సుమన్ బాబు గురించి.. 'ఉషా పరిణయం' రిలీజ్ రోజే థియేటర్లో చూసినప్పటికీ, మళ్ళీ టీవీ షో కోసం ఒక్కలెక్కన ఎదురు చూస్తున్నా.. మీరన్న రియల్ హీరో, చదువరి గారు చెప్పిన సర్రియల్ హీరో రెండూ కూడా ఆమోదయోగ్యమే!!

  రిప్లయితొలగించు
 7. లేదు లేదు. ఖచ్చితంగా ఒప్పుకోము. చదువరి గారు చెప్పినట్టు ఆల్రెడీ ఒక రియల్ హీరో ఉండగా శ్రీ శ్రీ శ్రీ సుమన్ బాబు ని అలా ఎలా పిలవగలం మురళీ గారూ? సుమన్ బాబు రియల్ హీరో కాదు ఆయనే ఏకైక హీరో ఈ ప్రపంచంలో. అంచేత ఓన్లీ హీరో సుమన్ బాబు అని పిలుద్దాం.

  హీరో తండ్రి విలన్ గా చాలా సినిమాలు వచ్చాయండీ. సుమన్ బాబు తెలుగు చలన చిత్ర చరిత్రలోనే, అసలా మాటకొస్తే ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఒక అద్భుత ప్రయోగం నాన్ స్టాప్ అనే మహత్తర కళాఖండం ద్వారా చేసిన విషయం మరచిపోతున్నారు మీరు. అప్పట్లో "ఈ సినిమా చూసి హీరో ఎవరో, విలన్ ఎవరో చెప్పగలిగితే చెప్పండి....బ్రహ్మాండమైన కారు గెలుచుకోండి" అని సంచలనం సృష్టించిన ప్రకటన మరిచిపోయారా మురళీ గారూ? ప్రేక్షకులే హీరో, విలన్ లు ఎవరో నిర్ణయించాలని ప్రజాభీష్టానికి అంతటి విలువిచ్చిన మహా నటుడిని, మహా మనీషిని పొగడటానికి ప్రపంచంలో భాషలు సరిపోవు మురళీ గారూ సరిపోవు. ఖళ్ ఖళ్....ఖళ్

  రిప్లయితొలగించు
 8. మళ్ళీ వెయ్యిన్నొక్కో సారి నాకు టీవీ లేకపోవటమనే దౌర్భాగ్యానికి కడుంగడు సంతాపిస్తూ,ఆ ఆనందం యేదో మీరే పొందమని కోరుకుంటున్నా

  రిప్లయితొలగించు
 9. కేక పోస్టండీ..
  అదృష్టవశాత్తూ నేను ఆఖరి పావుగంట మాత్రమే చూడగలిగాను. ఒక సుమన్ అభిమానిగా చాలా చింతిస్తున్నాను.. ;)

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం