5, అక్టోబర్ 2014, ఆదివారం

ఎన్టీఆర్ తో స్టెప్పు లేయించాడు .. అనాధలా మరణించాడు .....లయ తప్పిన స్టెప్పులు -- ధనం మూలం13



అది హైదరాబాద్ ఆర్ టి సి x  రోడ్ లోని  సంగం థియేటర్‌.  వేటగాడు సినిమా ప్రదర్శన. ఆకు చాటు పింద తడిచే పాట రాగానే పెద్ద సంఖ్యలో యువకులు తెర ముందుకు వెళ్లిపోయి అచ్చం ఎన్టీఆర్‌లానే స్టెప్పులేస్తున్నారు. కొందరు తెరపైకి నాణాలు విసురుతున్నారు. కొద్దిమంది సీట్లలోనే కూర్చోని ఈలలతో హోరెత్తించారు. 80 వ దశకంలో కొన్ని సినిమాలకు ఇలాంటి దృశ్యాలు  కనిపించేవి . ఆ తరువాత మరే భాషలోనూ, మరే ప్రాంతంలోనూ ఇలాంటి దృశ్యాలు కనిపించలేదు.
ప్రేక్షకులను  తమ సీట్లలో తమను కూర్చోనివ్వకుండా తెర ముందుకు పరిగెత్తించి వారితో నృత్యాలు చేయించిన  ఆ నృత్య దర్శకుడు సలీం.
***

రాజకీయాల్లో హై కమాండ్ ముఖ్యమంత్రులతో స్టెప్పులేయించడం మామూలే. కానీ ఆయన సినిమాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులతో స్టెప్పులేయించారు. సలీం స్టెప్పులు వేయించిన తరువాత వాళ్లు ముఖ్యమంత్రులయ్యారు. ఎంజి రామచంద్రన్, జయలలిత, ఎన్టీరామారావు ఈ ముగ్గురితోనూ ఆయన స్టెప్పులు వేయించారు. స్టెప్పుల్లోనే నిరంతరం మునిగిపోయిన ఆయన తన జీవిత స్టెప్పులను మాత్రం సరిగా కంపోజ్ చేసుకోలేక పోయాడు. సినిమాలో స్టెప్పులు సరిగా రాకపోతే రీ టేక్ ఉంటుంది. జీవితంలో అలా ఉండదు అందుకే ఆయన 80 ఏళ్ల వయసులో అనాధలా మరణించాడు.
***
ప్రమాదంలో ఒక చేయి పని చేయని స్థితికి చేరుకున్న తరువాత కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు లేకపోయినా నిరంతరం డ్యాన్స్‌నే ప్రేమించాడు. అతను సినిమాల్లో డ్యాన్స్‌ను ఎంతగా ప్రేమించాడంటే? జరిగిందేదో జరిగిపోయింది ఇక చాలు డ్యాన్స్‌ల పిచ్చి వదిలేయండి.. కుటుంబం కావాలో ఆ డ్యాన్సులు కావాలో తేల్చుకోండి అని భార్య అడిగితే, ఏ మాత్రం ఆలోచించకుండా సలీం డ్యాన్స్‌కే ఓటు వేశాడు. డ్యాన్స్ కావాలా? విడాకులు కావాలా? అని భార్య అడిగితే విడాకులు తీసుకొని డ్యాన్స్‌ను నమ్ముకున్నాడు.
దాంతో 941 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఆయన 80 ఏళ్ల వయసులో ఎవరూ లేని అనాధలా, తినడానికి తిండి, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేకుండా 2011 అక్టోబర్ 16న మద్రాసులో కన్నుమూశాడు.
***
రోడ్లు ఊడ్చడం నీ వృత్తి అయితే ఆ వృత్తిని కూడా ప్రేమించు. ఆ రోడ్డును ఎవరైనా చూస్తే ఎంత బాగా ఊడ్చాడు అని నిన్ను గుర్తు చేసుకోవాలి అలా ఉండాలి నీ వృత్తిలో నీ పనితనం అంటాడో ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస సాహిత్య కర్త ఒకరు. వృత్తిలో అంతటి నిబద్ధత అవసరమే? కానీ సరైన ముందు చూపు లేకపోతే ఆ వైఖరే అనాథలా జీవితాన్ని ముగించేట్టు చేస్తుందని చెబుతుంది సలీం జీవితం.
***
అడవిరాముడులోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ జయప్రద ఎన్టీఆర్‌లతో స్టెప్పులేయించింది, వేటగాడులో శ్రీదేవి ఎన్టీఆర్‌ల జంటతో శృంగారం ఒలకబోయించింది. రగులుతోంది మొగలి పొద  అంటూ మాధవి, చిరంజీవి పెనవేసుకొని పోయేట్టు చేసింది ఆయన స్టెప్పులే. ఖైదీలోని ఆ నృత్యం చిరంజీవిని మెగాస్టార్‌ను చేసింది. 82లో ఎన్టీఆర్ రాజకీయ సినిమా హిట్టు కావడానికి అంత కన్నా ముందు వచ్చిన వేటగాడు, ఆడవిరాముడు సూపర్ హిట్లు దోహదం చేశాయి. పాట, ఆటలే ఆ సినిమాలను విజయవంతం చేశాయి. కానీ సలీంకు మాత్రం తిండిపెట్టలేకపోయాయి.
సలీం వైఫల్యంలో సలీంకు మాత్రమే బాధ్యత ఉంది. ఒక్క సలీం విషయంలోనే కాదు ఏ వ్యక్తి విజయం సాధించినా, పరాజయం పాలైనా దారిద్య్రంతో మరణించినా, అంతిమ కాలంలో ప్రశాంతంగా కన్ను మూసినా అంతకు ముందు ఆ వ్యక్తి వేసిన అడుగులే ఆ పరిస్థితికి కారణం అవుతుంది తప్ప మరెవరిదో బాధ్యత కానే కాదు.


దక్షిణ భారత దేశంలోనే నంబర్ వన్ కొరియోగ్రాఫర్‌గా సలీం నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషా సినిమాల్లో ఒకటి రెండు సంవత్సరాలు కాదు సుదీర్ఘ కాలం బహుశా మరో కొరియోగ్రాఫర్ ఎవరూ ఇంతటి సుదీర్ఘ కాలం సినిమా ఫీల్డ్‌లో లేరు. 941 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. నృత్యాలు సలీం అని సింగిల్ కార్డు మాత్రమే ఉండాలి. ఒక్క పాటకు పరిమితం కావడం ఒక్కసారి కూడా జరగలేదు. ఆ కాలంలోనే ఒక్కో పాటకు లక్ష రూపాయల పారితోషికం తీసుకునే వారు.
మరి డబ్బంతా ఏమయింది అంటే ఆయన గర్వంగా నన్ను అంతా కుట్టి ఎంజిఆర్ అని అభిమానంగా పిలిచేవారు. ఎంజి రామచంద్రన్ దాన ధర్మాలకు పెట్టింది పేరు, అలా సలీం కూడా అడిగిన వారికల్లా సహాయం చేస్తుంటే చిన్న ఎంజిఆర్ అని ముద్దుగా పిలిచేవారట! ఇది సలీమే చెప్పుకున్న మాట. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, కృష్ణ, రజనీకాంత్, కమలహాసన్, జితేంద్ర వారు వీరని కాదు ఆ కాలంలో హీరోలందరితో డ్యాన్సులు చేయించారు సలీం.
***
సినిమాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు. అంతా పోయి తినడానికి తిండిలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో ఎవరో వచ్చి నీకు కోటి రూపాయలు ఇస్తాను ఏం చేస్తావు అంటే ఏమంటారు.


మన ఊహ తప్పు. వారి నుంచి మనం అనుకున్న సమాధానం రాదు. ఆ కోటితో మళ్లీ సినిమా తీస్తాను అంటాడు తప్ప ఇకనైనా కుటుంబంతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాను అనడు. .. సినిమా వ్యామోహంలో చిక్కుకున్న చాలా మంది తమ జీవితంతోనే జూదం ఆడుతారు.
సరిగ్గా సలీం కూడా ఇదే మాట అన్నాడు. సలీం బాగున్న కాలంలో కొన్న ఒక భవనం వివాదంలో చిక్కింది. తినడానికి తిండి కూడా లేని సమయంలో ఆ భవనం తనకే దక్కుతుందని అనేవాడు. ఆ భవనం అమ్మితే మూడు కోట్ల రూపాయల వరకు వస్తాయి. ముమ్ముట్టితో ఖైదీ 2 సినిమా తీస్తాను అని ప్రకటించాడు.


హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో ఎడమ చేయి ప్రమాదంతో పని చేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆయనకు సినిమాలు లేవు. ఐనా ఒక చేయితో కూడా నేను డ్యాన్స్ చేయించి చూపగలను అని ధీమాగా ఎవరూ ఆయన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆయన శిష్యులే డ్యాన్సర్లుగా వెలిగిపోతున్నా, తన జీవితం గురించి తానే పట్టించుకోని గురువు గురించి శిష్యులు ఎందుకు పట్టించుకుంటారు. ఒంటి చేత్తో డ్యాన్స్‌లు చేయడానికి సలీం ఉత్సాహపడ్డా భార్యా బిడ్డలు కూడా ఇష్టపడలేదు. నీ జీవితం నీది మా జీవితం మాది అంటూ వెళ్లిపోయారు. నా ప్రాణం ఉన్నంత వరకు డ్యాన్స్ చేస్తాను అని సలీం చెప్పినా ఆయనకు అవకాశం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.


కేరళకు చెందిన సలీం మక్కా సందర్శించాలనేది జీవిత లక్ష్యం. దాని కోసమే మద్రాసు వచ్చిన ఆయన ఎంతో మందికి సహాయం చేశారు. చివరి దశలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా కనులు మూశారు. ఓ పెద్ద భవనం అద్దె కున్న వారితో వివాదం. ఆ భవనంపై సలీం వాదన అద్దెకుండేవారి వాదన వేరువేరుగా ఉంది. ఆ భవనం వ్యవహారంలో హత్య జరిగిందని అంటారు. తప్పు ఎవరిదో ఏం జరిగిందో కానీ సలీం జీవితం మాత్రం రోడ్డున పడింది. 941 సినిమాలు అంటే దాదాపుగా నాలుగువేల పాటలకు నృత్యాలను కంపోజ్ చేసిన సలీం చివరి రోజుల్లో కడుపులో తిండి చేతిలో చిల్లిగవ్వ లేకుండా కనులు మూయడం బాధాకరం.


మనిషి చందమాను ఎప్పుడో తాకేశాడు. మార్స్‌వైపు అడుగులు వేస్తున్నాడు. కానీ కొన్ని అంశాల్లో మనకు చీమకున్నంత ముందు చూపు కూడా లేదేమోననిపిస్తుంది. రేపటికి ఎలా అనే ఆలోచన అంత చిన్న జీవి చీమకు ఉన్నప్పుడు చీమ కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్ద సైజులో ఉండే మనకు ఉండాల్సిన అవసరం లేదా? సలీంనో, మరో సినిమా ప్రముఖుడినో తప్పు పట్టడం మన ఉద్దేశం కాదు. అంత స్థాయికి ఎదిగిన వారే ముందు చూపు లేకపోతే ఎందుకూ కొరగాకుండా పోయారు. సామాన్యులం మనమెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికే ఈ ప్రయత్నం. వృత్తిని ప్రేమించాల్సిందే కానీ జీవితాన్ని, కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువ గౌరవించాలి. ఏదో ఒక దశలో నీ వృత్తి నీ నుంచి దూరం కావచ్చు, నువ్వు వీడ్కోలు పలికే రోజు రావచ్చు కానీ నీ కుటుంబం మాత్రం నీవున్నంత వరకు నీతో ఉంటుంది. *

5 కామెంట్‌లు:

  1. ఇలా సినీరంగాన్నీ నాటకరంగాన్నీ‌ నమ్ముకుని అమాయకంగా జీవితాలను బలిపెట్టుకున్న వారి చరిత్రలతో ఒక గ్రంథం వ్రాస్తే బాగుండును ఎవరైనా! అలాగే ఆ జీవితాలను ధారావాహికలుగా చిన్నతెరమీద చూపితే మరింత మేలు. ఇలా కళారధచక్రాలక్రింద నలిగిపోయిన వాళ్ళకు ఇంకా వారసులు పుట్టుకు రాకుండా అపటం అనేది అవసరం.

    రిప్లయితొలగించండి
  2. "వృత్తిని ప్రేమించాల్సిందే కానీ జీవితాన్ని, కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువ గౌరవించాలి. ఏదో ఒక దశలో నీ వృత్తి నీ నుంచి దూరం కావచ్చు, నువ్వు వీడ్కోలు పలికే రోజు రావచ్చు కానీ నీ కుటుంబం మాత్రం నీవున్నంత వరకు నీతో ఉంటుంది. * ...


    డెఫినిట్ గా కళ్ళముందు ఎన్నో జీవితాలు సినీ వ్యామోహంతో నాశనమై పోవడం సలీం గారు చిత్ర పరిశ్రమలో చూడకుండా వుండే అవకాశమే లేదు. అయినా, కుటుంబాన్ని కూడా ఏ మాత్రపు దూరదృష్టి, వాస్తవికత లేకుండా దూరం చేసుకోవడం మూర్ఖత్వం కాక మరేమంటాం !?

    రిప్లయితొలగించండి
  3. పెద్ద నాయకులు కోట్ల కొద్దీ పారితోషకం తీసుకుంటారు. స్టూడియోలకు కోసమంటూ కారు చౌకగా కబ్జాలు చేసిన వారు వందలాది కొత్లకూ పడగలు ఎత్తుతున్నారు. మంగల్యాన్ కంటే ఖరీదయిన సినిమాలో వస్తున్నాయి. అయినా ఇదే రంగంలో ఎందరి బతుకులో బుగ్గవుతున్నాయి. The show goes on!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం