రాష్ట్రం -రెండు ముక్కలైంది. రెండు రాష్ట్రాలుగా ఊపిరి పోసుకుంది. భారతదేశ పటం మీద ఒకే ప్రాంతీయ భాష తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలుగా రికార్డు మిగుల్చుకుంది. *** ‘విభజన’ ముగిసింది. పట్టింపులు పోయాయి. పంపకాలు పూర్తయ్యాయి. ఎవరి ఉనికి కోసం వారు పరుగు ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో -ఎవరి రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఒకే రాజకీయ తాను నుంచి వచ్చిన ఇద్దరూ -ఎవరి షో వారు ప్రారంభించబోతున్నారు. ఇద్దరి రంగూ రుచీ పాలనలో తేడాలున్నా -పొలిటికల్ షోను ఎవరు రక్తికట్టిస్తారన్నది వెండితెరపై వేచి చూడాలి. *** రాజకీయ వ్యూహాల్లో ఇద్దరూ ఆరితేరారు. ఒకరు స్వయంకృషితో సిఎం పీఠాన్ని అందుకుంటే, మరొకరు -వారసత్వంగా తొలిసారి, ప్రత్యర్థులు సైతం అబ్బురపడేట్టు ఈసారి సిఎం కుర్చీని అందుకున్నారు. మొదటిది -కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. రెండో వ్యక్తి -నారా చంద్రబాబు నాయుడు. ఇద్దరూ ఇద్దరే. గండరగండులే. కానీ, ఎవరి స్టైల్ వారిది. రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరిదీ చెరగని ముద్ర. ఇద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీ సభ్యులు. అత్యంత సన్నిహితులు. కానీ ఇద్దరి మమస్తత్వం భిన్న ధృవాలు. వారి రాజకీయ ఎత్తుగడల్లో ఇంతకాలం ఆ తేడా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు పాలనలో సైతం ఎవరి స్టైల్ వారిది. అనుకూల ప్రచారం కోసం మీడియా మేనేజ్‌మెంట్‌పై ఆధారపడేవారు ఒకరైతే, ఏదో ఒక సంచలన ప్రకటనతో వ్యతిరేక మీడియాను సైతం తనవైపు దృష్టి సారించేలా చేయడం ఇంకొకరి స్టయిల్. అంతిమంగా ఇద్దరి వ్యూహాలు ఫలించాయి. ఇద్దరూ సిఎంలయ్యారు. ఇద్దరి పాలన ఎలా ఉండబోతుందనేదే -పెద్ద క్వొశ్చన్ మార్క్.
కురుసభ.. భీముడిగా ఎన్టీఆర్. దుర్యోధనుడిగా ఎస్వీ రంగారావు. ఎన్టీఆర్ ఎన్నో పద్యాలు పాడి ఎస్వీ రంగారావును భయపెట్టాలని చూస్తాడు. ఎన్టీఆర్ పద్యాలన్నీ చిద్విలాసంతో విన్న ఎస్వీఆర్ ‘హే.. బానిసలకు ఇంతటి అహంభావమా?’ అంటూ ఒక్కముక్కలో తేల్చేస్తాడు. రాజకీయాల్లో కేసీఆర్‌దీ అదే స్టయిల్. ప్రత్యర్థులు ఆయనపై ముప్పేట దాడి జరుపుతుంటే ఆయన మాత్రం ఒక్కముక్కలో ‘సన్నాసులు’ అని తేల్చిపారేస్తారు.
80వ దశకం తరువాత తెదేపా ఆవిర్భావంతో తెలుగునాట నవశకం రాజకీయం ప్రారంభమైంది. ఎన్టీఆర్ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అనిపించుకున్నది -నలుగురు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. వైఎస్ మరణంతో మిగిలిన ముగ్గురి చుట్టే రాజకీయాలు తిరిగాయి. వీరిలో ఇద్దరు నేతలు రెండు రాష్ట్రాలకూ ముఖ్యమంత్రులయ్యారు. నవశకం రాజకీయ నేతల్లో చంద్రబాబు, చంద్రశేఖర్‌రావు రాష్ట్ర రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసిన వారు. ఉద్యమం ద్వారా కేసీఆర్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజకీయాల్లో తమ ముద్ర చూపించారు. ఇద్దరు నేతలూ యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారే. తెదేపాలో బాబుకన్నా కేసీఆర్ ఏడాది సీనియర్. తెదేపా ఆవిర్భవించిన తరువాత చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చంద్రబాబు ఓడిపోతే, సిద్ధిపేటలో తెదేపా తరఫున పోటీ చేసి కాంగ్రెస్ నేత మదన్‌మోహన్ చేతిలో కేసీఆర్ ఓడిపోయారు. 83నాటి చారిత్రక సభలో ఇద్దరూ సభ్యులు కాదు. ఎన్టీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ తెలుగుదేశంలో చేరితే, ఎన్టీఆర్ అల్లుడి హోదాలో చంద్రబాబు తెదేపాకు వచ్చారు. మెదక్ జిల్లాలో కరణం రామచంద్రరావును ఎన్టీఆర్ ప్రోత్సహించడంతో కేసీఆర్ మొదటి నుంచీ చంద్రబాబు వర్గంగా ఉండిపోయారు. ఇద్దరూ రాజకీయంగా ఓనమాలు దిద్దింది యువజన కాంగ్రెస్‌లోనే అయినా అక్కడ ఇద్దరికీ ఎలాంటి పరిచయం లేదు. ఎందుకంటే అప్పుడు ఇద్దరూ నియోజక వర్గస్థాయి నేతలు కూడా కాదు. ఈమధ్య ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు -కేసీఆర్ నా శిష్యుడే అని చెప్పుకొచ్చారు. కానీ తెదేపాలో మొదటి నుంచీ నాయకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంలో కేసీఆర్‌దే కీలక పాత్ర. జన్మభూమి, శ్రమదానం వంటి కార్యక్రమాల రూపకల్పన, పార్టీ శ్రేణులకు శిక్షణ నిర్వహించడంలో కేసీఆర్‌దే ప్రధాన పాత్ర. అయితే తెదేపా నేతలు మాత్రం ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో బాబు ప్రమేయమేమీ లేదు, వ్యూహమంతా కేసీఆర్‌దేనంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అయ్యేదా? పొయ్యేదా? అనుకున్నారు. ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా తెలంగాణను సాధించుకోవడంతో పాటు తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపడుతున్నారు కేసీఆర్. చంద్రబాబు చరిత్ర ముగిసిపోయింది. 1999లోనే అయనకు చివరి విజయం లభించింది. అంటే ఆయనది 20వ శతాబ్ధం విజయం తప్ప 21వ శతాబ్ధంలో విజయమే లేదు. ముగిసిన చరిత్ర అనుకున్నారు. వరుసగా ఉప ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు. అన్ని సర్వేల్లోనూ జగన్‌దే హవా. అయినా మొక్కవోని ధైర్యంతో ఏఒక్క అవకాశాన్ని వదలకుండా విజయం కోసం కృషి చేసి అనుకున్నది సాధించారు చంద్రబాబు. వైకాపా, తెదేపా కూటమి మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతం మాత్రమే. . ఫలితాలు తేలిన తరువాత ఎన్నికల కమిషన్ ప్రకటించిన లెక్కలివి. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన వారిదే విజయం. ఎంత శాతం, ఎన్ని ఓట్లు అనే లెక్కలెలా ఉన్నా ఈ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అనేది మాత్రం వాస్తవం.
‘బిజెపి వల్లనే ఓడిపోయాం. ఇక జీవితంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు’ ఇది 2004లో చంద్రబాబు చేసిన ప్రకటన. ‘అమాయక మైనారిటీల హత్యకు కారణమైన నరేంద్ర మోదీని హైదరాబాద్‌లో అడుగు పెట్టనిచ్చేది లేదు’ ఇది అధికారంలో ఉన్నప్పుడు బాబు చేసిన ప్రకటన. ‘నరేంద్ర మోదీని వెంటనే అధికారం నుంచి తొలగించాలి’ -మోదీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఎంగా చంద్రబాబు బిజెపికి ఇచ్చిన అల్టిమేటం ఇది. కాలచక్రం గిర్రున తిరిగి పదేళ్లు గడిచిన పోయిన తరువాత అదే నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికి బాబు చేయని ప్రయత్నం లేదు. ‘మోదీ, మహాత్మాగాంధీ ఇద్దరూ గుజరాత్‌లోనే జన్మించారు’ పొత్తు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బాబు చెప్పిన మాట ఇది. చంద్రబాబు ప్రయత్నాలు వృధా కాలేదు. పొత్తు కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే మోదీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తారని ఏ పార్టీ కూడా ఊహించలేదు. రావాలని కోరుకోలేదు. చివరకు బిజెపి సైతం మిషన్ 272కు మాత్రమే పరిమితమైంది. గతంలోలాగే తెదేపా మద్దతుపై ఆధారపడి ఎన్డీయే అధికారంలోకి రావాలని, వస్తుందని బాబు అనుకున్నారు. సొంత బలంతో బిజెపి అధికారంలోకి రావడం బాబును కొంత నిరుత్సాహపర్చిన అంశం. తన మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వమైతే తన ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం చంద్రబాబుకు ఉండేది. కానీ ఇప్పుడా అవకాశం లేదు. మోదీ ప్రసన్నమైతే ఆయన ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటే అన్ని ఇస్తారు. ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. అంతే తప్ప ఆయనపై బాబు ఒత్తిడి పని చేయదు. ఒత్తిడి పెట్టాలని బాబు కలలో కూడా అనుకొనే పరిస్థితి లేదు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే వైకాపా ఎంపీలు ఇద్దరు తెదేపా వైపు వెళ్లగాలేనిది, మోదీ ఈలవేస్తే ఏ పార్టీనుంచైనా ఎంపీలు బిజెపివైపు పరుగులు తీయడానికి నిరాకరిస్తారా?
రైతుల రుణ మాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి ఆకర్షణీయ పథకాలకు భారీ ఎత్తున నిధులు వ్యయం చేయాలి. అసలే లోటు బడ్జెట్‌తో ప్రారంభమయ్యే రాష్ట్రానికి ఇంత భారీ వ్యయాన్ని భరించే పథకాల అమలు అంత సులభం కాదు. ఈ కోరికలన్నింటినీ కేంద్రం తీరుస్తుందనే ఎన్నికల్లో బాబు ప్రచారం చేశారు. బిజెపికి మెజారిటీ రాకపోతే అదే జరిగేది కూడా. కానీ పరిస్థితి ఇప్పుడలా లేదు. ఇప్పుడు మోదీ నుంచి అనుకున్నంత సాయం ఒక రాష్ట్రానికి అందుతుందని ఆశించలేం. ఒక రాష్ట్రానికి పెద్దపీట వేస్తే మిగిలిన రాష్ట్రాల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పోనీ తన రాజకీయ మనుగడ కోసం విమర్శలనైనా ఎదుర్కోందాం అనుకోవడానికి -మోదీకి అలాంటి అవసరం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పాలన చంద్రబాబుకు అంత సులభమేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు సాగించిన పాలన వేరు. 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో పాలన వేరు. ఇప్పుడు మనం కొత్త చంద్రబాబును చూడబోతున్నాం. అటు కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోవాలి. ఇన్ని సమస్యలున్నా మీడియా అండ చంద్రబాబుకు కొండంత బలం. ఆయన అధికారపక్షంలో ప్రపంచంలోనే మేటి అని ప్రచారం పొందినా, విపక్షంలో ఉన్నప్పుడు డిపాజిట్లు కోల్పోయినా ధైర్యం వీడకుండా ఉండటానికి మీడియా అండ ఎంతో తోడ్పడింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన విజయానికి అనేక అంశాలు దోహదం చేశాయి. మోదీ వేవ్, పవన్ కల్యాణ్ ప్రచారం వంటి అంశాలతో పాటు మీడియా మద్దతు విజయానికి దోహదం చేసిన జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. నిజాం కాలేజీలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ. తొలిసారిగా రాష్ట్రంలో అక్కడే మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు ఒకే వేదికను పంచుకున్నారు. పక్కపక్కనే ఉన్నా బాబుతో కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడలేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడైనా స్పందించే తీరు వేరుగా ఉంటుంది. కానీ తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, పదేళ్లు విపక్ష నేతగా పని చేసిన అనుభవం, కేంద్రంలో ప్రధానిని, రాష్టప్రతిని నిర్ణయించడంలో కీలక భూమిక పోషించిన అనుభవం ఉన్న చంద్రబాబు స్పందించిన తీరు అనూహ్యం. కరచాలనం చేయడానికే ఇష్టపడని పవన్ ఇంటికి బాబు స్వయంగా వెళ్లి ఆయన మద్దతు కోరిన రాజకీయ చతురుడు చంద్రబాబు. ఈ చర్యకు బాబు అభిమానులు విస్తుపోయారు. పవన్ అభిమానులు, ఓ సామాజిక వర్గం మురిసిపోయింది. ఆ మురిపెం ఓట్ల రూపంలో ప్రభావం చూపినట్టు ఫలితాలే తేల్చి చెప్పాయి. రాజకీయాల్లో విజయం సాధించాలి. దాని కోసం ఏమైనా చేయాలనేదే నేటి రాజకీయం. ఈ రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరారు. లేకపోతే పదేళ్ల నుంచి వరుస పరాజయాలు వెంటాడుతున్నా, డిపాజిట్లు కోల్పోతున్నా ధైర్యంగా నిలబడ్డారు. సర్వశక్తులు ఒడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తన కన్నా మోదీ, పవన్‌లపైనే ఎక్కువ ఆధారపడ్డారు. ఒకరకంగా తన ముఖానికి ఆ ఇద్దరి మాస్క్‌లు ధరించి ప్రచారం చేశారు. ప్రచారం ఎవరు చేస్తేనేం విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది చంద్రబాబు. ఎన్నికల్లో విజయానికి తెరవెనుక వ్యూహాల్లో తనకు సాటిలేరని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు.
విపక్ష నేతగా ఉన్నప్పుడే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పాలన సాగించడంలో సైతం ఆయనకు మీడియా మద్దతు కొండంత అండ. రాజకీయాలంటే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే అనుకుంటే చేసేదేం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చడానికి చంద్రబాబు కృషి చేస్తారని, కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడతారని ఆశిద్దాం. *** తెలంగాణ కొన్ని కోట్ల మంది కల. తెలంగాణ రావాలని కోట్లమంది కోరుకున్నారు. కానీ రానేరాదని అదే తెలంగాణకు చెందిన కోట్లమంది నమ్మారు. చివరకు కేసీఆర్ చదువుకునే రోజులనాటి మిత్రులు కూడా అట్లెట్లోస్తది తెలంగాణ అనేవారట! కానీ మొదటి రోజు నుంచీ ఒక్క కేసీఆర్ మాత్రమే ‘అట్లెట్లరాదు తెలంగాణ’ అని నిర్ణయించుకున్నారు. ఏ అంశంపైనైనా లోతుగా అధ్యయనం చేయడం ఆయనకు అలవాటు. నిజానికి కేసీఆర్, బాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఆలోచించలేదు.
1995 నుంచీ తెలంగాణ ఉద్యమం సాగుతోంది. అయితే అది కొద్దిమంది మేధావులకు మాత్రమే పరిమితమైన ఉద్యమంగా మొక్క తొడగడం మొదలు పెట్టిన రోజులవి. అప్పుడు బాబు మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రి. రెండు మూడేళ్లు గడిచిన తరువాత క్రమంగా తెలంగాణ ఉద్యమం సామాన్యులకు చేరువవుతుండటాన్ని గమనించారు. అదే సమయంలో రాజకీయ మార్పులను నిశితంగా గమనించారు. అందరి సహకారంతో ఎన్టీఆర్‌ను గద్దెదించినా అంతా తానేనని, తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అనుకునే దశకు బాబు చేరుకున్నారు. ఒకవైపు విద్యుత్ ఉద్యమం మొదలైంది. కొంతమంది తెలంగాణ ఉద్యమానికి రాజకీయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై అధ్యయనం మొదలు పెట్టారు. కేసీఆర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అదే సమయంలో అధ్యయనాల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు. ఈ ఆకాంక్ష బలంగా ఉన్నా, దానికి నాయకత్వం వహించే బలమైన నాయకుడు లేడని గ్రహించారు. ఆ పాత్రను తాను పోషించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. విజయవంతంగా ఆ పాత్ర పోషించారు. విజయం సాధించారు. రాజకీయాల్లో కొంతమంది సేఫ్ గేమ్ ఆడతారు. కానీ కేసీఆర్ మాత్రం అనేకసార్లు తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి రిస్క్‌గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో ఆయన ప్రతిసారీ విజయం సాధిస్తూనే ఉన్నారు. తనవల్లే కరీంనగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారని వైఎస్సార్ అంటే సరే తేల్చుకుందాం రా అంటూ రాజీనామా చేసి నాలుగింతల మెజారిటీతో విజయం సాధించి చూపించారు. వైఎస్సార్‌కు మద్దతుగా ఎంఐఎం, కుల సంఘాలు, ఎంఆర్‌పిఎస్ అంతా కలిసి ప్రచారం చేసినా కేసీఆర్‌నే విజయం వరించింది. సురక్షితమైన మెదక్ పార్లమెంటు సీటు విజయశాంతికి ఇచ్చి పార్టీ ప్రభావం ఏమాత్రం లేదని చెప్పుకునే పాలమూరుకు తాను వెళ్లారు. సార్ చాలా రిస్క్ తీసుకుంటున్నారు, ఓడిపోతే తెలంగాణ ఉద్యమం ముగిసినట్టేనని ప్రతిసారి పార్టీ శ్రేణులు హెచ్చరించినా రిస్క్‌లోనే మజా ఉందని చూపించారు. తెలంగాణ ప్రజల మనస్థత్వం ఏమిటో నాకు తెలుసు. వారిపై నమ్మకంతోనే రిస్క్ తీసుకుంటున్నాను అని చెప్పేవారు. చంద్రబాబు మీడియాలో అనుకూల ప్రచారం మాత్రమే కోరుకుంటారు. తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తే సహించలేరు. వాస్తవ పరిస్థితి ఎలా ఉన్నా మీడియాలో వార్తలు మాత్రం వ్యతిరేకంగా రావద్దని బాబు కోరకుంటారు. మీరు తప్పు చేశారా? లేదా? అని కాదు, మీడియాల్లో అలా వార్తలు రాకుండా చూసుకోండి అంటూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు పార్టీ నేతలకు చెప్పిన మాట. ఈ విషయంలో కేసీఆర్‌ది పూర్తిగా భిన్నమైన మనస్థత్వం. తనకు వ్యతిరేకంగా వార్త లు వస్తే ఆయన ఎంజాయ్ చేస్తారు. విమర్శలు రావాలని కోరుకుంటారు. ఒక్కమాటతో రాష్ట్రం మొత్తం తనపై ధ్వజమెత్తే విధంగా పవర్‌పుల్ పంచ్ డైలాగులతో ఎదుటివారు గిజగిజలాడేట్టు చేస్తారు. ఏ విషయంపైనైనా లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే దాని గురించి సాధికారికంగా మాట్లాడతారు.
పుష్కరాలు అనగానే రాష్ట్రంలో ఏ ప్రాంతం వారికైనా గుర్తుకొచ్చేది రాజమండ్రి. ఏ ప్రభుత్వం ఉన్నా పుష్కరాలకు రాజమండ్రికే నిధులు కేటాయించేది. తెలంగాణలో పుష్కరాలకు నిధులు కేటాయించరా? అంటూ కేసీఆర్ ప్రకటన చేయగానే తెలంగాణ సైతం విస్తుపోయింది. ఓసారి మీడియా సమావేశంలో ఓ విలేఖరి పుష్కరాలు అంటే రాజమండ్రినే కదా? అని అనగానే ఆ ప్రశ్న విని ఆయన సంతోషపడిపోయారు. అసలు పుష్కరాలు అంటే ఏమిటీ అని సుదీర్ఘంగా వివరించారు. 12 ఏళ్లకోసారి పుష్కర దేవుళ్లు నదీ ప్రవాహ ప్రాంతంలో పుష్కర స్నానాలు అచరిస్తారు. అప్పటి నుంచి తెలంగాణలో గోదావరి ప్రవహించే ప్రాంతాల్లోనూ పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు మొదలెట్టింది. పుష్కరాల గురించి మాట్లాడాలన్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నా ఏ అంశంపైనా ఆ రంగంలో నిష్ణాతులైన వారితో మంతనాలు జరిపి, తన సందేహాలను తీర్చుకున్న తరువాతనే ఆ అంశం గురించి మాట్లాడడం కేసీఆర్‌కు మొదటి నుంచి అలవాటు. ఒక అంశం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి చిన్న వాడా? పెద్ద వాడా? అనే తేడా ఆయనకు ఉండదు. విషయం తెలిసిన వ్యక్తి అని తెలిస్తే చాలు గౌరవిస్తారు, ఆ అంశం గురించి అభిప్రాయం అడిగి తెలుసుకుంటారు. సామాజిక వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా ఎవరిని ఎవరు తిట్టాలి అనే జాబితాను చంద్రబాబు రూపొందించుకుంటారు. బాబు నేరుగా తిట్టరు, కానీ కులాల వారిగా తిట్టేవారిని ఎంపిక చేసుకుంటారు. ఈ విషయంలో కెసిఆర్ ఎవరిపైనా ఆధారపడరు. ఎదుటి వారు రోజుల తరబడి గంటల తరబడి తిడితే ఒక్కమాటలో సమాధాన తిట్టు ఉంటుంది. ఇక విలేఖరుల సమావేశాల్లో విలేఖరి అడిగిన దానికి బాబు చెప్పిన దానికి సంబంధం ఉండదు. సుదీర్ఘంగా మాట్లాడి విసిగించడం బాబు అలవాటు. కెసిఆర్‌కు విలేఖరులతో ఆడుకోవడం సరదా. ఓసారి ఒక విలేఖరి ఒక ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నకు సమాధానం నీకు కావాలా? మీ యాజమాన్యానికి కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించే సరికి నీళ్లు నమలడం ఆ విలేఖరి వంతయింది. నమ్మి అందలమెక్కించిన అనుచురులు తిట్టి బయటకు వెళ్లిపోయినా కేసీఆర్ పెద్దగా పట్టించుకోరు. వారి గురించి విమర్శలు కూడా చేయరు.
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే జన్మభూమి, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాల్లో ప్రారంభంలో మీడియాతో కలిసి భోజనం చేసేవారు. ఇది కూడా మీడియాలో బాగా హైలెట్ అయ్యేది. నిజానికి ఈ వనభోజనం మీడియా ప్రచారం కోసమే తప్ప నిజంగా అది బాబు నైజం కాదు. బాబు వద్ద అన్నీ దాపరికమే. కేసీఆర్ వద్ద ఏదైనా బహిరంగమే. మరే నాయకుడూ ఎదుర్కోలేనన్ని విమర్శలు కేసీఆర్ ఎదుర్కొన్నారు. ఆక్రోశంతో ప్రత్యర్థి తిడుతుంటే, ఆ తిట్లను సైతం ఎంజాయ్ చేశారు కానీ కృంగిపోలేదు. ఇటుక ఇటుక పేర్చి ఉద్యమదుర్గాన్ని నిర్మించారు. దానికి తెరాస అని రాజకీయరూపం కల్పించారు. వ్యూహాత్మకమైన ఎత్తుగడలతో స్వయం కృషితో తెరాసను విజయశిఖరంపై నిలబెట్టారు. కెసిఆర్‌కు ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా వచ్చింది కాదు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల రూపం. కేసీఆర్ చెప్పినట్టు మనమెవ్వరం వెయ్యేళ్లు బతికేందుకు రాలేదు. బతికేది కొద్ది కాలమే. తరతరాలు గుర్తుంచుకునే విధంగా ప్రజలకు మేలు చేయాలి. ప్రచారం కోసం కాకుండా సహజంగా జనంలో కలిసిపోవడం కేసీఆర్ నైజం. కలెక్టర్ అనగానే అర్భాటాలు అవసరమా? ఇంకా బ్రిటీష్ పాలనలోనే ఉన్నట్టు మనకీ ఆర్భాటాలు అవసరం లేదు అని ఇటీవల కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అంటే సామాన్యుడి ప్రభుత్వమని చూపించాలి.
గతం లో కాంగ్రెస్ నుంచి తెలంగాణ వారుఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఇంటి పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా, ఇదీ మా పాలన అని నిరూపించే విధంగా, తెలంగాణ నేతల రాజకీయ శక్తి సామర్థ్యాలను చూపించే విధంగా కేసీఆర్ పాలన ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. వారి ఆశలను కేసీఆర్ నెరవేరుస్తారో లేదో చూడాలి. *
**
పాలనలోనైనా పార్టీలోనైనా చంద్రబాబుది వన్‌మేన్ షో. కేసీఆర్‌ది వండర్‌మేన్ షో. ఎవరి స్టయిల్ వారికుంది. సో.. ఒక్కటిగా ఉన్న రాష్ట్రం ఎలాగూ రెండైంది. రెండుగా ఉన్న నేతలు మాత్రం -పాలన, అభివృద్ధి విషయంలో ఒక్కటవ్వాలని, ఒకరికి మించి ఒకరవ్వాలని ఆశిద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ప్రజలకు మేలు చేసే విషయంలో ఇద్దరు నేతలూ పోటీ పడాలని కోరుకుందాం. ఆరోగ్యకరమైన పోటీ రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేయాలని ఆశిద్దాం. *
మొత్తానికి గులాబీ దళపతి వీరాభిమాని అనిపించుకున్నారు!
రిప్లయితొలగించండిSuraneni garu మీ సామాజిక బాధ్యతకు అభినందనలు
తొలగించండివన్ మాన్ షో వీరులూ వండర్ మాన్ షో వీరులూ కాదు క్రియాశూరులు కావాలి ఇరురాష్ట్రాలకు!
రిప్లయితొలగించండితన మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వమైతే తన ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం చంద్రబాబుకు ఉండేది. కానీ ఇప్పుడా అవకాశం లేదు.
రిప్లయితొలగించండి>>
ఇప్పుడు మోదీ నుంచి అనుకున్నంత సాయం ఒక రాష్ట్రానికి అందుతుందని ఆశించలేం. ఒక రాష్ట్రానికి పెద్దపీట వేస్తే మిగిలిన రాష్ట్రాల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
>>
మీరు పొరబడుతున్నారు.ఆంధ్రా కోసం బాబు బతిమిలాడాల్సిన పని లేదు. విభజన వల్ల తరుగులో ఉన్న రాష్త్రంగా మన్ మోహన్ సింగ్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం మర్చిపోయారా?వెంకయ్య నాయుడూ ఇంకా భాజపా నాయకులూ దానికి సుముఖంగానే ఉన్నారు కదా!
ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే వైకాపా ఎంపీలు ఇద్దరు తెదేపా వైపు వెళ్లగాలేనిది, మోదీ ఈలవేస్తే ఏ పార్టీనుంచైనా ఎంపీలు బిజెపివైపు పరుగులు తీయడానికి నిరాకరిస్తారా?
>>
దీనికి భిన్నంగా ఒంటరిగానే అధికారం చేపట్టగలిగి ఉండి కూడా మిత్రపక్షాలకి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాడు మోదీ, గమనించారా?
పుష్కరాలు అనగానే రాష్ట్రంలో ఏ ప్రాంతం వారికైనా
>>
పుష్కర పురుషుడు ఆ విశ్లేషణ అంతా గయ్యాళి తనం. నది ప్రవహించే ప్రతి వూళ్ళోనూ చెయ్యొచ్చు.భక్తులు కొన్ని ప్రాంతాల్నే సాంప్రదాయికంగా యెన్నుకుని అలవాటుగా అక్కదే గుమి గూడుతారు.వుదాహరణకి రాజమండ్రి - కోటిలింగాల రేవు లేదా దానికున్న చారిత్రక ప్రసస్తి, బెజవాడ - దుర్గ గుడి ఇలాగ వేరే విధమయిన సంబంధాన్ని బట్టి కూడా చేరదం మొదలయింది.ఒక చోట మరీ యెక్కువగా జన సందోహం ఉంతే ప్రభుత్వం శాంతి భద్రతల కోసమైనా, జనాలకి సౌకర్యంగా ఉంచదం కోసమైనా తను కలగజేసుకుంటుది.తెలంగాణా ఉద్యమమే కాదు, అసలు తెలంగాణా నిజాము సామ్రాజ్యంలో ఉన్న కాలం నుంచీ రాజమండ్రి పుష్కరాలూ, బెజవాద పుష్కరాలూ ప్రసిధ్ధంగా ఉన్నాయనేది మీకు తెలియనిదా?తను వెలికి తియ్యగానే మీకూ జ్ఞానోదయమైపోయిందా?అక్కడున్న భక్తులు మనం ఇక్కడా పుష్కరాలు చేసుకుందాం అనుకుని ఉంటే అక్కడ జనం గుమిగూడితే అక్కడా ఇక్కడి లాగే సాంప్రదాయం అయి వుండేది కదా, దాన్ని కూడా ఆయనే జ్ఞానదంతం వికసించేటట్టు చేశాడన్న మాట!
మీ సామాజిక బాధ్యతకు అభినందనలు
రిప్లయితొలగించండిMurali garu,You are forgetting one thing.Pawan and Modi factors are definite plus for TDPs vicotry but not the sole factors.It was proven with Muncipal and local body elections where TDP has a clear edge .THis time people wanted babu as their CM for andhrapradesh.Dont undermine that factor.
రిప్లయితొలగించండిug శ్రీరామ్ గారు మీ కామెంట్ పోస్ట్ చేయడం లేదు .. మీ మెయిల్ అడ్రెస్ ఇవ్వండి వివరంగా రాస్తాను
రిప్లయితొలగించండిచెప్పటం మరచాను మీరు రాసిన జవాబు ను ఎవ్వరితో పంచుకోవటం జరగగదు. between you and me.
రిప్లయితొలగించండిWonderfully written article. We Madhya site atiga tittatam ledaa soorudu dheeruduantu talakekkinchukovadam. Iddari strengths, weakness baaga analyze chesaru.
రిప్లయితొలగించండిNice analysis..keep writing on new developments
రిప్లయితొలగించండి"విపక్ష నేతగా ఉన్నప్పుడే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పాలన సాగించడంలో సైతం ఆయనకు మీడియా మద్దతు కొండంత అండ"
రిప్లయితొలగించండి"విపక్ష నేతగా ఉన్నప్పుడే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పాలన సాగించడంలో సైతం ఆయనకు *ఒక వర్గానికి చెందిన* మీడియా మద్దతు కొండంత అండ" is more appropriate.