దివి నుంచి భువికి దిగివచ్చే దిగివచ్చే
పారిజాతమే నీవై నీవై...
ఎంత మధురమైన పాట తరాలతో సంబంధం లేకుండా ఏ తరం వారినైనా ఊహాలోకాల్లో విహరింపజేసే పాట.
‘తేనె మనసులు ’ సినిమాలోనిది ఈ పాట. అంతా కొత్తవారితోనే నిర్మించిన ఈ సినిమాలో రాం మోహన్, కృష్ణ హీరోలు. ప్రధాన హీరో రాంమోహనే. ఆయనపైనే ఈ పాట చిత్రీకరించారు.
ఎలాంటి ఆలోచనలు లేకుండా కళ్లు మూసుకుని ఈ పాట వింటే ఆనంద సాగరంలో మునిగిపోతాం. కావాలంటే ఓ సారి ప్రయత్నించి చూడండి. కానీ ఈ పాటలో నటించిన ఈ సినిమాలోని హీరో జీవితం గురించి తెలిస్తే మాత్రం మనసు కకావికలం అవుతుంది. ఏమిటో ఈ మాయ అనిపిస్తుంది.
నాలుగు దశాబ్దాల క్రితం బేగంపేట విమానాశ్రయంలో గ్రౌండ్ ఇంజనీర్. మంచి ఉద్యోగం, మంచి కుటుంబం. జీవితం హాయిగా గడిచిపోతోంది. అలాంటి పరిస్థితిలో రామ్మోహన్‌ను సినిమాల్లో నటించాలనే పురుగు తొలిచింది. ఆదుర్తి సుబ్బారావు నిర్మించినతేనె మనసులు ’ సినిమాలో హీరోగా నటించాడు. సూపర్ స్టార్ కృష్ణతో పాటు ఒకేసారి సినిమాల్లో హీరోగా పరిచయం అయ్యారు. అభిమానులు ‘ఆంధ్రా దేవానంద్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. రాం మోహన్ స్టైల్ దేవానంద్‌ను గుర్తుకు తెచ్చే విధంగా ఉండేది.
తెరపై నటించే నటులు సైతం నటనలో జీవించే వారి పట్ల అప్రమత్తంగా ఉండక పోతే అందమైన జీవితం విషాదంగా మారుతుందనడానికి రాం మోహన్ జీవితమే సాక్ష్యం.
విషాదాంత సినిమా కథను మించిన విషాదంతో తొమ్మిదేళ్ల క్రితం రాం మోహన్ జీవితం మల్కాజిగిరిలో ముగిసింది. సినిమా రంగానికి వెళ్లిన అతను ‘స్టార్ట్.. కెమెరా.. యాక్షన్’ అనగానే నటించాలని మాత్రమే నేర్చుకున్నాడు. కానీ అలాంటి డైలాగులు ఏమీ లేకుండానే తన మిత్రులుగా నటిస్తూనే తన జీవితానికి చరమ గీతం రచించే మహానటులు తన చుట్టే ఉంటారనే విషయం గ్రహించలేదు. గ్రహించే సరికి జీవితం ముగింపునకు వచ్చింది.
ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవారితోనే‘తేనె మనసులు ’ సినిమా తీయాలని అనుకున్నారు. మా సినిమాలో నటించేందుకు ‘కొత్త వారు కావలెను’ అని ప్రకటన ఇచ్చారు. వందల మంది ముందుకొచ్చారు. రాం మోహన్‌ను చూడగానే తెలుగు సినిమా రంగానికి మంచి నటుడు దొరికాడని అనుకున్నారు. ‘తేనె మనసులు’లో కృష్ణ, రాం మోహన్ ఇద్దరిని హీరోలుగా ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ జరిగే రోజుల్లో ఈ ఇద్దరు హీరోలు ఎన్నో కలలు కన్నారు. సినిమా రంగంలో స్థిరపడేందుకు ఒకరికొకరం సహకరించుకుందామనుకున్నారు. ‘తేనె మనసు’లో సినిమా టైటిల్స్‌లో కృష్ణ పేరు ముందు వేశారా? రాం మోహన్‌ది ముందా? అనే సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఎవరి పేరు వేయలేదు. అంతా కొత్తవారే, కొత్త తారలే అంటూ తారల పేర్లు లేకుండానే టైటిల్స్ చూపించారు.
సినిమా హిట్టయింది. ఇద్దరికీ మంచి అవకాశాలు రాసాగాయి.
రాం మోహన్‌కు ఎదురు లేదనుకున్నారు. అవకాశాల వరద రాం మోహన్‌ను ముంచెత్తింది. తేనె మనసులు (1965) రంగుల రాట్నం(1966) తేనెమనసులులో నటించిన బృందంతోనే 1966లోకన్నె మనసులు తీశారు. సుడిగుండాలు (1967), పసిడి మనసులు (1970) ఇందులో శోభన్‌బాబు హీరో. రాజశ్రీ కాంతారావు తదితరులు నటించిన ఎవరు మొనగాడు(1978)లో నటించారు.
ఏం జరిగిందో తెలియదు కానీ తెర వెనుక ఎక్కడో కుట్ర జరిగిందంటారు ఆ కాలం నాటి సినిమా పరిశ్రమ లోతులు తెలిసిన వారు. రాం మోహన్ తనకు తెలియకుండానే ఒక వలలో ఇరుక్కున్నారు.
సన్నిహిత మిత్రులు మాటలతో తమ ప్రభావం చూపించారు. నువ్వు గొప్ప హీరోవి. పాపులర్ హీరోవి సమయానికి వెళితే నీ గొప్పతనం ఏముంటుంది. ఎంత ఆలస్యంగా వెళితే అంత గొప్ప అని నమ్మించారు. మందు బృందం మాటలు రాం మోహన్‌పై బాగానే పని చేశాయి. నిత్యం మందు బృందంతో మందులో మునిగిపోయారు. షూటింగ్‌కు ఎంత ఆలస్యంగా వస్తారో, వస్తారో రారో తెలియని పరిస్థితి. మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. అవకాశాలు తగ్గుతున్నా కొద్దీ మిత్రుల సంఖ్య క్రమంగా తగ్గింది. మందులో ముంచెత్తిన మిత్ర బృందం తాము వచ్చిన పని అయిపోయిందన్నట్టు వెళ్లిపోయారు. తాగనిది ఉండలేని పరిస్థితి కానీ తాగుడు అలవాటు చేసిన మిత్రులు లేరు. అవకాశాలు లేవు.. అడిగే వారు లేరు. రాం మోహన్ మద్యానికి బానిస అయిన తరువాత కుటుంబం కూడా విచ్ఛిన్నం అయింది.
విమానాశ్రయంలో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తున్న రాంమోహన్‌కు సినిమా నటన అంటే ప్రాణం. చేస్తున్న ఉద్యోగానికి నెల రోజుల పాటు సెలవు పెట్టి మద్రాస్ వెళ్లారు. సినిమా హిట్టయితే సరే లేదంటే మళ్లీ బుద్ధిగా ఉద్యోగం చేసుకోవాలనుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు రాకుండా ఉండి ఉంటే ఇప్పుడు రాం మోహన్ పిల్లా పాపలతో హాయిగా విశ్రాంతి జీవితం గడుపుతూ ఉండేవాడు. సినిమా హిట్టయింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. అదే అతని పాలిట శాపంగా మారింది. రాం మోహన్ అలవాట్లతో కుటుంబం విచ్ఛిన్నమైంది. సినిమాల కోసమే మద్రాస్ వెళ్లిన రాం మోహన్ సినిమా జీవితం ముగిశాక అక్కడ తనను పలకరించే వారు లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చారు. చేసిన సినిమాలతో పెద్దగా సంపాదించిందేమీ లేదు. చేతిలో ఉద్యోగమూ లేదు.
మంచి ఉద్యోగాన్ని వదులుకుని సినిమా రంగానికి వెళ్లినప్పుడు రాం మోహన్ తొలుత తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాల్సింది. సినిమా మెరుపుల్లో మునిగిపోయిన రాం మోహన్‌కు రేపు ఎలా అనే ఆలోచనే రాలేదు.
చదువు సంధ్య లేకుండా, బతుకు తెరువు కోసం సినిమా రంగానికి వెళ్లిన జీవితం కాదు రాం మోహన్‌ది. చదువుకున్న వాడు. విమానాశ్రయంలో గ్రౌండ్ ఇంజనీర్. పెళ్లయింది. హాయిగా గడిచిపోతున్న జీవితం. . తేనె మనసులు ఆ తరువాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తుండడంతో ఉద్యోగాన్ని వదులుకున్నారు.
సినిమా రంగం అతన్ని వదలుకున్న తరువాత తనకు తెలిసిన హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. సినిమా కాటేసిన తరువాత అతని జీవితం తెగిన గాలిపటం అయింది. ఉద్యోగం లేదు. సినిమాల్లో అవకాశాలు లేవు. సికింద్రాబాద్ మల్కాజిగిరిలో తనకు తెలిసిన మిత్రుడికి అద్దె సైకిల్ షాపు ఉంది. మిత్రున్ని వెతుక్కుంటూ వెళ్లాడు. అతని జీవితం అంతంత మాత్రమే. తనకేమీ అభ్యంతరం లేదని ఆశ్రయం ఇచ్చాడు. సైకిల్ షాపులోనే జీవితం గడిపాడు. ఆక్కడే ఆయన జీవితం ముగిసింది. ఆయన్ని హీరోగా చూసిన వారు ఆ సైకిల్ షాపులో ఓనరుకు సహాయకునిగా ఉన్నప్పుడు చూసిన వారికి ఔను జీవితం నిజంగా భగవంతుడు ఆడించే నాటకం అనుకున్నారు. విమానాశ్రయం మేనేజర్ హీరో కావడం .. ఆంధ్రా దేవానంద్‌గా పిలిపించుకోవడం . అమ్మాయిల కలల రాజకుమారుడిగా గుర్తింపు. చివరకు ఒక సైకిల్ షాపులో జీవితం.
సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా పని చేయడం గుర్తుకు వచ్చిందా? సత్యహరిశ్చంద్రున్ని దేవతలు పరీక్షించి విజయం సాధించాక మళ్లీ ఆయన సంపదను ఆయనకిచ్చేశారు. ఇక్కడ ఆంధ్రా దేవానంద్‌కు అలాంటి పరీక్షలేమీ లేదు. తన సంపద తనకు తిరిగి దక్కలేదు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన రాం మోహన్... ఎలాంటి గుర్తింపు లేకుండా ఎవరికీ తెలియకుండా తొమ్మిదేళ్ల క్రితం మల్కాజిగిరిలో మరణించారు.
ఇందులో తప్పేవరిదీ అంటే ఎవరి జీవితానికి వారే బాధ్యులు. చదువు, వ్యాపారం, సినిమా ఏ రంగం అయినా కావచ్చు పోటీ ఉంటుంది. ప్రత్యర్థి నిన్ను ఎలాగైనా దెబ్బతీయాలని ప్రయత్నిస్తాడు. జీవితం ఒక యుద్ధమే. యుద్ధంలో ఏదీ తప్పు కాదంటారు. ఇక్కడ దురదృష్టం ఏమంటే యుద్ధరంగంలో నీ శత్రువు సైతం నీతో నేను యుద్ధం చేస్తున్నానని యుద్ధ్భేరీ ప్రకటించి యుద్ధం మొదలు పెడతాడు. కానీ రాం మోహన్‌కు మాత్రం ఎలాంటి యుద్ధ భేరీ మ్రోగించకుండా స్నేహితులుగా ఉంటూనే అతనితో యుద్ధం చేసి కోలుకోలేని విధంగా ముంచేశారు. సినిమా కాటుకు రాం మోహన్ జీవితం విషాదంగా ముగిసింది.
‘తేనె మనసులు ’ సినిమా
దివి నుంచి భువికి ...పాట
ఎంత విషాదకరమైన జీవనయానం.
రిప్లయితొలగించండికళ్ళవెంట నీళ్ళు వచ్చాయి.
ఇంకేం చెప్పాలో తెలియటం లేదు!
కాంతారావు - తన జీవితకథలో రామ్ మోహన్ గురించి ప్రస్తావించారు, ప్చ్! కొన్ని జీవితాలు - విధివిలాసం- సగటు మనిషి జీవితాలు - అతని పరిచితులు చెప్పుకుంటారు, సినీ హీరో కదా! ఈ మాత్రం వెలుగులోకి వచ్చింది, ఉదయ కిరణ్ ది కూడా ఇలాంటి కథ - akhilavanitha. blog/ konamanini.blog
తొలగించండితేనెమనసులు వచ్చినపుడు ఆంధ్రా దేవానంద్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ మోహన్,ఆ రోజుల్లో కృష్ణకి నవ్వు రాదు,నడక రాదు,పరుగు రాదు!ముఖంలో అభినయం పలకదు!అయన సినిమాల్లో రాణించడు!అన్నారు సిని పండితులు!కాని కృష్ణ నిలదొక్కుకున్నాడు!రామ్మోహన్ తాగుడు వల్ల స్నేహితుల వల్ల ఆలస్యంగా షూటింగ్ లకు అతి ఆలస్యంగా వస్తూ నిర్మాతదర్శకులను తిప్పలు పెట్టి చెడ్డపేరు తెచ్చుకున్నాడు!హరనాథ్ ను కూడా అలాగే సినిమా అమ్మాయిలు తాగుడు పాడు చేశాయంటారు!తన మీద తనకు నియంత్రణ సంయమనం లేని వాళ్ళు సినిమాల్లోనే కాదు ఏ రంగంలోనూ రాణించలేరు!బుద్దా మురళి మంచి టపా పరపరా రాసిపారేశారు! మల్కాజిగిరిలో కూలిన గిరిశిఖరం మీద పరిశోధన చేసి ఆర్ద్రంగా టపా రాసి పారేశారు!గుండె బరువెక్కింది!
రిప్లయితొలగించండిVery touching post...! keep it up,,!
రిప్లయితొలగించండిమద్యానికి బానిసలై హరనాథ్, రామ్మోహన్‌లు పతనమయ్యారని తెలుసు. కాని రామ్మోహన్ చరమ జీవితం ఇంత దీనావస్థలో గడచిందని తెలియదు. అయ్యో పాపం!
రిప్లయితొలగించండిఇంతకీ అతనికి మిత్రులుగా ఉంటూ తప్పుదారి పట్టించినవారిలో పెద్ద తలకాయలు లేదా అతనికి పోటీ అయిన వారు ఎవరైనా ఉన్నారా అనేది చెప్పలేదు మీరు. ఏమైనా అతని జీవితం మనకి ఓ గుణపాఠం.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఏ రంగంలోనైనా తెలివితేటలు,ఆత్మనిగ్రహం, సంయమనం అత్యవసరం.అందులోను సినిమారంగంలో ఇంకా అవసరం.అందులో గ్లామరు.ఆకర్షణలు ఎక్కువ కాబట్టి.(opposite sex,drunkenness).విజయం సాధిస్తున్నప్పుడు భజనమండలి,మిత్రరూపంలోఉన్న శత్రుల విషయంలో జాగ్రత అవసరం.నటులుగాఉన్నవాళ్ళు సినిమా నిర్మాతలుగా మారడం కూడా ప్రమాదకరమే.(ఏ కొద్దిమంది విషయంలోనో తప్ప.) మా డాక్టర్లలోకూడా కొందరు అనవసరంగా సినిమాలు, రియల్ ఎస్టేట్ లోను పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు.స్వయంకృతాపరాధానికి ఏం చెయ్యగలం?
correct..
తొలగించండిసినిమా పరిశ్రమను పాకుడురాళ్ళు అంటారు కదా.
రిప్లయితొలగించండిThene Manasulu is a 1965 film from the cinema of Andhra Pradesh. It is the first movie of Krishna. The movie is also notable for being the first full-length color feature movie in the Telugu movie industry. Director Adurthi Subba Rao recruited Krishna, Varanasi Ram Mohan Rao, ... Varanasi Ram Mohan Rao went on to become an established actor in many ...
రిప్లయితొలగించండి