25, సెప్టెంబర్ 2016, ఆదివారం

వరద బాధితుల గాథలు

‘‘ప్రపంచం చాలా మారిపోయిందన్నయ్యా!’’
‘‘ చిన్న వయసులో అంత వైరాగ్యం’’
‘‘మీడియాలో ఉన్నందుకు మనకు అన్నీ తెలుస్తాయనుకుంటాం. ఏ స్టోరీని ఎలా కవర్ చేయాలనుకుంటే ప్రపంచం అలానే ఉందనుకుంటాం. కానీ కాదన్నయ్యా ప్రపంచం చాలా మారిపోయింది.’’
‘‘ఏమైంది?’’
‘‘వరద న్యూస్ కవర్ చేస్తున్నా కదన్నయ్యా! అప్పుడు తెలిసొచ్చిందన్నయ్యా! మనం అనుకున్నట్టు ప్రపంచం లేదు. కరవు అనగానే నెర్రెలు బారిన పొలంలో ఒక వృద్ధ రైతు ఆకాశం వైపు చూస్తూ చెయ్యి పైకెత్తిన ఫోటో చూపించేస్తాం కదన్నయ్యా! అలానే వరద బాధితులు అనగానే మనం విసిరేసే పులిహోర ప్యాకెట్ల కోసం దీనంగా ఎదురు చూస్తూ ఆకాశంలో విమానం కనిపించగానే జోలె పట్టి అన్నం పొట్లాల కోసం ఆశగా చూస్తారని అనుకుంటాం కదన్నయ్యా! నిజంగా అలా ఉండరన్నయ్యా!’’
‘‘నువ్వు ఇంత దీనంగా మాట్లాడడం ఎప్పుడూ చూడలేదురా! మూడు నెలల నుంచి జీతం రాకపోయినా.. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇస్తారు ఎక్కడికెళతాయి అని చిన్నవాడివైనా పెద్ద మనసుతో మాకు ధైర్యం చెప్పేవాడిని ఇలా మాట్లాడుతున్నావేంటిరా! ఎక్కడో నువ్వు బాగా హర్ట్ అయినట్టున్నావురా!’’


‘‘నాన్న వల్ల చిన్న వయసులోనే పాత సినిమాలు అలవాటై మారిన ప్రపంచాన్ని అస్సలు గుర్తించలేకపోయా అన్నయ్యా! మా నాన్న కీలుగుర్రం కాలం నాటి వాడు. నేనేమో ఆకలి రాజ్యం కాలంలో పుట్టాను. ప్రపంచం ఇంకా ఆ రెండు సినిమాల కాలం మధ్యనే ఉందనుకున్నాను. కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచం వీటిని దాటి బాహుబలిని వెనక్కి నెట్టి ఆవిడెవరో స్వాతి నాయుడు వీడియోలు స్వైర విహారం చేస్తోందని గ్రహించలేక పోయా.’’
‘‘వరద కవరేజ్‌కే నువ్వు ఇలా అయిపోతే రోజుకు మూడుసార్లు బాబు ప్రెస్‌కాన్ఫరెన్స్‌ను, బహిరంగ సభలను దశాబ్దన్నర కాలం కవర్ చేసిన మేమెంత వైరాగ్యంలో ఉండాలి. ?’’
‘‘ చెప్పడం కాదన్నయ్యా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోలా రింగులు రింగుల ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకు వెళతా నువ్వే స్వయంగా చూడు’’


***
‘‘రెండు రోజుల పాటు భారీ వర్షాలను బాగా కవర్ చేశాం. ఈరోజు వరద బాధితుల సహాయ కార్యక్రమాలపై ఫోకస్ పెడదాం తలా ఓ చోటుకు వెళ్లండి. అన్నం లేక జనం బాధ పడడం, దయార్ధ్ర హృదయులు వారికి అన్నం ప్యాకెట్లు అందించడం. మానవత్వం పరమళించిన వేళ అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తూ ఈ న్యూస్ చూపించాలి పదండి ఇక వెళ్లండి.’’
‘‘సార్ మూనె్నల్ల నుంచి జీతాలు లేక కిశోర్ ఇబ్బంది పడుతున్నాడు. కనీసం ఆ ఒక్కనికైనా ఎంతో కొంత ఇవ్వండి సార్. పాపం ఇంట్లో వాళ్లు పాల బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక... ’’
‘‘పని చెప్పగానే మీ ఎడుపు ఒకటి ముందు కదలండి’’
‘‘డ్రైవర్ పదవోయ్! నిజాంపేట బండారి ఎన్‌క్లెవ్‌లో మంచి సీన్లు దొరుకుతాయట. మా ప్రెండ్ వాళ్ల ఎన్‌జివో ఒకటి అక్కడ అన్నం పొట్లాలు పంచేందుకు వెళుతున్నారు. ఎవరూ వెళ్లక ముందే వెళదాం.’’
‘‘వీడెవడ్రా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపగానే డోర్ కొట్టి మరీ లోపల పులిహోర ప్యాకెట్లు వేసేస్తున్నాడు. బాబూ మేం వరద బాధితులం కాదు వరద బాధితుల వద్దకు వెళుతున్నాం.’’
‘‘బండారి వెంచర్ ఇదేనాండి’’
‘‘ఔను ఇదే ఎవరు కావాలి’’
‘‘మీరు ఇక్కడే ఉంటారా?’’
‘‘నేను కాలనీ ప్రెసిడెంట్‌ను. నీకేం కావాలో ముందు చెప్పు?’’
‘‘బండారి వెంచర్‌లో వరద బాధితులంతా అన్నమో రామచంద్రా అని చేతులు జోడించి వినియంగా నిలబడి ఉంటారనుకుంటే ఇలా మాట్లాడుతున్నారు?
‘‘నేనెలా మాట్లాడితే నీకెందుకోయ్! నాకెమన్నా పెళ్లి సంబంధం తీసుకొచ్చావా? నీకేం కావాలో చేసుకోని వెళ్లిపో! ’’
‘‘వరద బాధితులకు పులిహోర పొట్లాలు పంచితే నేను కెమెరాలో షూట్ చేసుకొని వెళ్లిపోదామని వచ్చాను’’
‘‘నీ జీతం ఎంత? నెల జీతం నీకు ఆరు నెలలకోసారి ఇస్తారు. నా నెల జీతం నీ మూడు నెలల జీతమంత తెలుసా?’’
‘‘లెక్క అస్సలు అర్ధం కాలేదు.. కానీ విషయం అర్ధమైంది. మీరే ఎలాగైనా నన్ను రక్షించాలి. మీ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌లు, పని వాళ్లు ఉంటారు కదా వారందరినీ క్యూలో నిలబెడితే మా ప్రెండ్ పులిహోర పొట్లాలు ఇచ్చేస్తాడు. నేను షూట్ చేసుకోని వెళ్లిపోతాను. ’’
‘‘సరే మరీ బతిమిలాడుతున్నారు. మన జిల్లా వాడినని చెబుతున్నావ్! మీ జీవితాన్ని కాపాడేందుకు ఒప్పుకుంటున్నా అంతా క్యూలో నిల్చుంటారు. అరగంటలో మీ షూటింగ్ ముగించుకోండి. మా కాలనీ వాళ్లకు భోజనం ఏర్పాటు చేశాం. మీరూ తినేసి వెళ్లండి. ’’

***
‘‘తినకుండా వెళితే  కొడతాడో ? ఏమంటాడో?  అని భయపడి అన్నదానం చేసేందుకు వెళ్లి  అన్నం తినాల్సి వచ్చింది. అప్పుడు బుర్రలో లైట్ వెలిగింది. కమర్షియల్ సినిమా సెట్టింగ్ వేసి ఆర్ట్ సినిమా తీయాలనుకున్నట్టు ఉంది నా తెలివి అని నన్ను నేను తిట్టుకుని వెంకటాపురం గుడిసెవాసులు వరద బాధితులని తెలిసి మంచి షాట్స్ దొరుకుతాయని కారును వేగంగా అటు పోనిచ్చాం. అక్కడ పరిస్థితి మరి అవమానకరం. స్పీడ్‌గా కారు పోనిచ్చి గుడిసెవాసుల ఇంటి ముందు ఆపగానే నడివయస్కుడు వచ్చి ఏంటి అని కనులతోనే ప్రశ్నించాడు. వరద బాధితులకు అన్నం పొట్లాలు అని చెప్పడం పూర్తి కాక ముందే మరి ఇక్కడ క్యూలో ఉన్న కార్లు అన్నీ సినిమా చూసేందుకు వచ్చాయనుకున్నావా? క్యూలో నిలబడు వాళ్ల పని ముగించుకున్నాక నీ వంతు వచ్చినప్పుడు పిలుస్తాం. పులిహోర ప్యాకెట్లు విసిరేసి పుణ్యం పట్టుకెళ్లాలని ప్రతోడు వచ్చేయడమే అని కోపంగా పంపించాడు. అక్కడ మా కన్నా ముందు పది కార్లు క్యూలో ఉన్నాయి.
పులిహోర పొట్లాలు ఇచ్చి ఉత్త పుణ్యానికి వాళ్ల నుంచి బోలెడు పుణ్యాన్ని కొట్టేస్తున్నామనే భావన అక్కడున్న వారిలో కనిపించింది.
పుణ్యం ఉత్త పుణ్యానికి రాదు అని ఒకడు సెటైర్ కూడా వేశాడు.’’


‘‘ అన్నమో రామచంద్ర అనే రోజులు పోయాయని సంతోషించాలా? చానల్స్‌కు అనువైన దృశ్యాలు కరువయ్యాయని దిగులు పడాలా? ’’
-

జనాంతికం - బుద్దా మురళి (25-9-2016)


18, సెప్టెంబర్ 2016, ఆదివారం

ఆ రోజులే వేరు...

‘‘నాంచారయ్య మనవడిని అని చెప్పుకోవడానికి మించిన అదృష్టం ఈ జీవితానికి ఇంకోటి లేదు’’
‘‘నాంచారయ్య నటుడా? గొప్ప సాహితీకారుడా? గురజాడ సమకాలీనుడా? దాశరథి క్లాస్‌మెట్‌నా? శ్రీశ్రీ మిత్రుడా? ’’
‘‘అలాంటిదేమీ లేదు’’
‘‘స్వాతంత్య్ర సమర యోధుడా? వీర సైనికుడా?’’
‘‘కాదు ’’
‘‘మరేంటి?’’
‘‘మహాత్మాగాంధీని దూరం నుంచి చూశాడు.. సింప్లీసిటీకి మారుపేరైన గాంధీజీని చూసిన నాంచారయ్య మనవడిని అని చెప్పుకోవడం నా పూర్వ జన్మ సుకృతం’’


‘‘నడుముకు వాచీ ధరించే బాపూజీని చూసిన నాంచరయ్య మనవడిగా నువ్వింత సంబర పడితే, అసలు వాచీనే లేని బాబూజీ పాలనలో ఉన్నందుకు నేనెంత మురిసిపోవాలి’’
‘‘నీ కన్నీ వెటకారాలే!నన్నేమైనా  అను . కానీ మహనీయుల సింప్లిసిటీపై సెటైర్లు వేస్తే ఊరుకునేది లేదు. నువ్వెన్నయినా చెప్పు ఆ రోజులే వేరు’’
‘‘ఏ రోజులు ఉద్యోగం లేక ఎవడు అప్పిస్తాడా? అని ఊర్లు పట్టి తిరిగిన రోజులా? బాబూ ధర్మం అని ఇండియా అమెరికా వాడ్ని బతిమిలాడుకున్న రోజులా? భద్రత కోసం రష్యా సంకలో చేరిన రోజులా? ’’
‘‘నీకు మనుషులు, మనుషుల అభిరుచుల గురించి పట్టదా? పాత రోజుల్లో త్యాగాలు చేసేందుకు పోటీ పడేవాళ్లు అనుమానంగా ఉంటే పాత సినిమాలు చూడు’’


‘‘ఏంటో ఆ త్యాగం’’
‘‘ఆ రోజుల్లో హీరోయిన్ మరో అమ్మాయి కోసం హీరోను త్యాగం చేసేది. నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం అని శ్రీశ్రీ చెప్పినట్టు చెప్పాలంటే తెలుగు సినిమాల కథల చరిత్ర సమస్తం త్యాగాల మయం. ఈ రోజుల్లో ఈ త్యాగాన్ని మనం ఊహించగలమా?’’
‘‘లేదు అస్సలు ఊహించలేం ఈ రోజుల్లో అయితే ప్రేమించిన యువతిని ఎలా వదిలించుకోవాలా? అని ఆలోచించే స్వార్థపరులే. ఆరోజుల్లో హీరోను సైతం త్యాగం చేసి దుఃఖాన్ని దిగమింగి భారమైన హృదయంతో కొండల వైపు నడుస్తూ వెళ్లే వాళ్లు. హీరోయిన్లు ఎందుకలా త్యాగం చేస్తారో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదోయ్’’
‘‘త్యాగంలోనే జీవిత పరామర్థం ఉంది. అందుకే తల్లిపాత్ర, తండ్రి పాత్రలు త్యాగాలకు సింబల్‌గా ఉండేవి. పోటీ పడి త్యాగాలు చేసి కడుపు మాడ్చుకునే వాళ్లు. మధ్యలో హీరో వదిన కూడా త్యాగాల్లో నేనేం తక్కువ తినలేదు అని తాను తినకుండా మరిదిని గారాబం చేస్తూ ఎర్ర చీరకు నల్ల అతుకు వేసుకుని కట్టెల పొయ్యిపై వండుతూ కట్టెల పొగ, కన్నీళ్లు రెండు కలిసిపోయి ఎంత కదిలించేవో ఆ దృశ్యాలు. ఇప్పుడు సినిమాల్లో చివరి సీన్లో హీరో విలన్ గ్యాంగ్ మధ్య భీకరమైన పోరాటం జరిగినట్టు ఆ కాలంలో తెలుగు సినిమాల్లో ప్రతి పాత్ర త్యాగంలో పోటీ పడేది. హీరోయిన్ హీరోను త్యాగం చేస్తే, హీరో క్యాన్సర్ రోగంతో హీరోయిన్‌ను త్యాగం చేసేవాడు. హీరో స్నేహితులు, దగ్గుదమ్ముతో ఉన్న తల్లి,తండ్రి, కుంటి తమ్ముడు, గుడ్డి చెల్లెలు త్యాగాల్లో పోటీ పడేవాళ్లు. కానీ హీరో/హీరోయిన్ మేన మామకు మాత్రం త్యాగాల వాసన గిట్టేది కాదు. అందుకే అప్పటి నుంచి మామలను నమ్మొద్దు అని నిర్ణయించుకున్నాను.’’
‘‘మరీ అలా తీసిపారేయకు. ఈ రోజుల్లో కూడా త్యాగాలకు కొదవ లేదు. దానికి సరైన ప్రచారం లభించడం లేదు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న నాయకులు రోజుకు రెండు ఇడ్లీలు, వంద గ్రాముల పాలు, చెంచాడు పెరుగు తింటూ తమ జీవితాన్ని ప్రజలకు త్యాగం చేస్తున్నారు. ఆ కాలంలో రాజకీయ నాయకులు దేశం కోసం సర్వం త్యాగం చేసే వారు. ఇప్పుడు దేశమే నాయకుల కోసం సర్వం త్యాగం చేస్తోంది. మొన్నటికి మొన్న ఒక ఎంపి వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు. అంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఆమె నియమ నిబంధనలను త్యాగం చేసినట్టే కదా? ’’


‘‘ఇది త్యాగమా?? అలా అంటే చాలా మంది సిగ్గు, నీతి, నియమాలను త్యాగం చేస్తున్నారు?’’
‘‘త్యాగాన్ని గుర్తించక పోతే ఎలా? ప్రతి రాజకీయ నాయకుడు తమ కుటుంబం మొత్తాన్ని రాజకీయాలకు, ప్రజలకు త్యాగం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరినీ కళామతల్లికి త్యాగం చేస్తున్న హీరోల త్యాగనిరతిని ఎంత పొగిడినా తక్కువే?
‘‘పిల్లలను కంటే స్వార్థం పెరుగుతుందని జీవితాలను త్యాగం చేసిన వారి కథలు విన్నాం, చదివాం కానీ పిల్లలను కనడం కూడా త్యాగమేనా? ’’
‘‘త్యాగాన్ని త్యాగమయులే అర్థం చేసుకుంటారు. నీలాంటి వారికి అర్థం కాదు’’
‘‘చూస్తుంటే నరుూమ్‌ది కూడా త్యాగం అనేట్టుగా ఉన్నావ్’’
‘‘ అనుమానం ఎందుకు? రోజుకో చోట ఉంటూ తిన్న చోట తినకుండా కంటికి కునుకు లేకుండా నరుూమ్ క్షణ క్షణం భయం భయంగా బతకడం అంటే జీవితాన్ని త్యాగం చేయడమే కదా?’’
‘‘వామ్మో’’
‘‘నిజం మాట్లాడితే ఇలానే ఉంటుంది. బావ కళ్లల్లో ఆనందం చూడాలని మొద్దు శీను అనుకున్నట్టు కృష్ణయ్యను సిఎం కుర్చీలో చూడాలని, కృష్ణయ్య కళ్లల్లో ఆనందం చూడాలని నరుూమ్ అనుకోవడం వల్లనే ఎన్‌కౌంటర్ చేశారు’’


‘‘ఎన్‌కౌంటర్ వెనక మతలబు ఉందంటావా?’’
‘‘నరుూమ్ ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ ఒక్క గొప్ప అవకాశాన్ని కోల్పోయింది. మేధావులంతా ఒకేరకంగా ఆలోచిస్తారు అనడం అక్షర సత్యం అనడానికి నయిమ్ సంగతే సాక్షం. కృష్ణయ్యను సిఎంను చేయాలని బాబు కల కన్నారు. నరుూమ్ సైతం అదే కల కన్నారు. నరుూమ్ హోంమంత్రిగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుంటే అమరావతిపాలకుడు అక్కడి నుంచి కృష్ణయ్యను దీవిస్తుంటే ఆ దృశ్యం చూసేందుకు ఎంత అద్భుతంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకో’’
‘‘హోంమంత్రా’’
‘‘ వెటకారం కాదు హోంమంత్రిగా నరుూమ్‌ను మించి ఈ దేశంలో ఎవరికీ అర్హత లేదు. పోలీసు వ్యవస్థ లోటు పాట్లు, బంది పోట్ల ఎత్తుగడలు, మాఫియా రహస్యాలు, నాయకుల నేర చరిత్ర, పాలనా వ్యవస్థలోని రంధ్రాలు, తీవ్రవాదులు ఆసుపాసులు నరుూమ్‌కు తెలిసినంతగా మొత్తం పాలనా వ్యవస్థకు కూడా తెలియదు. తెలంగాణను ఎక్కడికో తీసుకు వెళ్లాలని చూస్తుంటే మీరేమో అక్కడికి రారు. ఇక్కడే ఉంటారు. మీ ఖర్మ మీ ఇష్టం’’- 

జనాంతికం - బుద్దా మురళి(18-9-2016)

11, సెప్టెంబర్ 2016, ఆదివారం

నడుస్తున్న సినిమా!

‘‘వాళ్లిద్దరూ ఎన్టీఆర్ సావిత్రిలా, అక్కినేని వాణిశ్రీలా, శోభన్‌బాబు జయలలితలా, రాజబాబు, రమాప్రభలా చెట్టాపట్టాలేసుకొని తిరిగే వారు కదా? ఇప్పుడేమైంది. అలా తిట్టుకుంటున్నారు.’’
‘‘ఎన్టీఆర్, అక్కినేనిల మునిమనవళ్లు, దూరపు బంధువులు కూడా హీరోలయ్యారు. నువ్వు అక్కడే ఆగిపోయావు’’
‘‘ మరీ సాంకేతికంగా తప్పులను వెతికి చూడకు. ఆ పంచాయితీ ఏంటో తెలిస్తే చెప్పు’’


‘‘వాళ్లిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగింది నిజమే! పెళ్లి అనే పదం ఉపయోగించేందుకు సాంకేతికంగా ఇబ్బంది వస్తుంది. భార్య హోదా కన్నా ఎక్కువ హోదా ఇస్తాను అని ప్రపోజ్ చేశాడట! అమ్మాయి అన్నయ్యకు చిర్రెత్తి మాట ఇచ్చేప్పుడు ఈ సంగతి గుర్తుకు రాలేదా? అని వాడి మూతి పగులగొట్టాడు’’
‘‘రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది’’


‘‘ఊరక రారు మహానుభావులు’’
‘‘రాజకీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామని వచ్చాను’’
‘‘కల్వకుర్తి ఎత్తి పోతల పథకాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 12ఏళ్ల క్రితం తొమ్మిదేళ్లపాటు మేం పాలించినప్పుడే ప్రాజెక్టు పూర్తి చేశాం, ప్రాజెక్టు కనిపించకుండా దాచిపెట్టి ఇప్పుడు చూపిస్తున్నారని తెలంగాణ టిడిపి నాయకులు గోల. నీలం సంజీవరెడ్డి కాలంలోనే ప్రాజెక్టు పూర్తి చేసి బిజీగా ఉండడం వల్ల ప్రారంభోత్సవం మరిచిపోయామని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు. హరీశ్‌రావు అర్థరాత్రి వరకు ప్రాజెక్టు వద్ద నిద్ర చేసి ప్రాజెక్టు పూర్తి చేశారు అని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు’’
‘‘ప్రాజెక్టుల కోసమే ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న వాళ్లు ఒక రోజు ముందో వెనకో ప్రాజెక్టులు కట్టుకుంటారు. అందులో పెద్ద విశేషం ఏముంది కానీ.. నేను అడిగేది దాని గురించి కాదు.. విశేషాలు ఏంటీ? అని ’’
‘‘చోళీకే పీచే క్యా హై అని మంచి వయసులో మాధురీ దీక్షిత్ అంటే దేశంలో కుర్ర కారు ఊగిపోయారు. ఈ ముసలి వయసులో నెల్లూరు కమల నాయుడు, చిత్తూరు ఎర్ర నారాయణ నాయుడు పంచల చాటున ఏ ముంది? అని సరసమాడుకోవడం సిల్లీగా ఉంది ’’
‘‘నువ్వు పుట్టక ముందు నెల్లూరు నాయుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడట! ఇక ఆయన గెలిచేది లేదు, ఆయన పార్టీ పరిస్థితి అంతే, నారాయణ పుట్టిన కొత్తలో కమ్యూనిస్టులు గెలిచారు. ఇప్పుడు వాళ్లు డైనోసార్స్‌లా అంతరించి పోయా రు. ఈ వయసులో పంచెల గోల అవసరమా? ఇంతకు మించి విశేషాలు లేవా?’’
‘‘డొంక తిరుగుడు ఎందుకు నేరుగా అడగ వచ్చు కదా? పవన్ కళ్యాణ్ సభ గురించే కదా? అదియూ నీ పతి ప్రాణంబులు తప్ప అని యముడు సావిత్రితో అన్నట్టు ఏదైనా మాట్లాడతాను పవన్ ఉపన్యాసం తప్ప ’’
‘‘అదేంటి నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అభిమానివా? ’’
‘‘అదేంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయితే పవన్ గురించి మాట్లాడవద్దా? ఈ సంగతి నాకు తెలియదే? ’’
‘‘మరి పవన్ ఉపన్యాసం తప్ప ఏదైనా మాట్లాడతాను అని ఎందుకంటున్నావ్?’’


‘‘ నిజం చెప్పాలా? పవన్ ఏం మాట్లాడాడు? అని అడుగుతావ్! నాకు అర్ధమై చస్తేకదా? ఏదో అర్ధమైన నాలుగు ముక్కలు చెబితే అలా ఎందుకు మాట్లాడాడు అంటావు? పవన్‌ను ఎన్నికల్లో పోటీ చేస్తాడా? బాబుకు అనుకూలమా? జగన్‌కు వ్యతిరేకమా? బిజెపి నడిపిస్తుందా? టిడిపి స్పాన్సర్డ్ మీటింగ్‌లా? చిరంజీవి ముందున్నాడా? కాపునాడు పక్కనుందా? వెనక ఎవరున్నారు? జనసేన రాజకీయ పార్టీనా? అభిమాన సంఘమా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తావు? అన్నీ చెబితే పవనిజం అంటే ఏమిటి? అంటావు. ఈ ప్రశ్నలకు ముందు సమాధానం నాకు తెలియాలి కదా?’’
‘‘నిజంగా తెలియదా?’’
‘‘నాకే కాదు బహుశా పవన్‌కు కూడా తెలియదేమో?’’
‘‘తెలియకుండా మీటింగ్‌లు ఎందుకు?’’
‘‘కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. కాలం చెబుతుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు ఫలితం ఆశించకు అని గీతాకారుడు చెప్పాడు కదా? బహుశా పవన్ అది నమ్మి ముందు మీటింగ్‌లు పెడుతున్నారేమో’’
‘‘నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అనే సామెత చెప్పినట్టు బాబు ఒకందుకు పవన్‌ను ఉపయోగించుకోవాలనుకుంటే పవన్ మరొకందుకు మీటింగ్‌లు పెడుతున్నారేమో?’’


‘‘రాజకీయాల్లో బయటకు కనిపిస్తున్నది, చెబుతున్నది నిజం కాదు. చెప్పిన మాటల వెనుక రహస్యం, చూపిన దృశ్యం వెనుక  చెప్పని మతలబు ఏదో ఉంటుంది. హనుమంతుని ముందు కుప్పిగంతులు అన్నట్టు బాబు ముందు ఈ రాజకీయాలు నడవవు. సినిమా రంగంలో కనిపించే దైవంగా పూజలు అందుకున్న ఎన్టీఆర్‌నే నమిలి మింగేసి వాతాపి జీర్ణం అన్నట్టు జీర్ణం చేసుకుని విగ్రహం ఏర్పాటు చేసి పూజించేట్టు చేసిన గొప్ప నేత బాబు. దేవుడినే విగ్రహాన్ని చేసిన బాబుకు చిరంజీవి తమ్ముడు ఒక లెక్కా’’


‘‘ఇంతకూ మీటింగ్‌పై నీ అభిప్రాయం ఏంటి?’’
‘‘ఏదేశమేగినా...పొగడరా... రాసింది రాయపోలు సుబ్బారావు అని మనం ఇంత కాలం అనుకుంటున్నాం... కాదట! గురజాడ అప్పారావు రాశారని పవన్ చెప్పేంత వరకు బయటి ప్రపంచానికి తెలియలేదు. గురజాడను రాయప్రోలు వారు కాపీ కొట్టారన్న మాట!
‘‘నిజమా?’’
‘‘పవన్ ఉపన్యాసంలోఇంకా చాలా సమాచారం ఉంది. తాపేశ్వరం, బందరు లడ్డూలు తియ్యగా ఉంటాయని అందరికీ తెలిసొచ్చింది. సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేదు కానీ విజయవాడ బాబాయ్ హోటల్‌లో ఇడ్లీ సాంబర్ బాగుంటుంది, ఆత్రేయ పురంలో పూతరేకులు, నెల్లూరులో రెడ్డి మెస్‌లో భోజనం, విజయవాడ వెళ్లేప్పుడు సూర్యాపేటలో పూరీ, హైదరాబాద్‌లో బిర్యానీ, మదీనా హోటల్‌లో ఇరానీ టీ, నీలోఫర్‌లో ఉస్మానియా బిస్కట్లు, కరీంనగర్‌లో సర్వపిండి చాలా బాగుంటుందని చెప్పడానికి సమాచారం సేకరించినా, సమయం లేక చెప్పలేకపోయాడని తెలిసింది’’
‘‘ఇంతకూ ఏమంటావు’’
‘‘తెలుగునాట సినిమా ప్రభావం కొంచం ఎక్కువే. ఇది నడుస్తున్న సినిమా, కథేమిటో? హీరో ఎవరో? విలన్ ఎవరో? ముగింపు ఏమిటో సినిమా ముగిసేంత వరకు తెలియదు. సినిమా చూస్తూ ఉండాలి అంతే.’’

-జనాంతికం - బుద్దా మురళి (11-9.2016)

4, సెప్టెంబర్ 2016, ఆదివారం

అంపశయ్య---స్టే!

‘‘ దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావ్?
‘‘స్టే’’
‘‘నువ్వు రాజకీయం మాట్లాడుతున్నావ్’’
‘‘జీవితమే రాజకీయం.’’
‘‘స్టే అనగానే నువ్వు ఏదో ఊహల్లోకి వెలుతున్నావ్’’
‘‘రాజకీయం కాదా? ఐతే ఇంకే స్టే ఉంటుంది చెప్పు’’
‘‘స్టే అంటే ఒక్క రాజకీయాలకే పరిమితం అని దాని పరిధి చిన్నగా చేయకు. అసలు లోకంలో స్టే లేంది ఎక్కడో చెప్పు. మన జీవితం తెల్లవారగానే స్టేతో మొదలవుతుంది. స్టేతో ముగుస్తుంది. ఆఫీసు ఇల్లు, చివరికు రాత్రి నిద్ర పోవడం స్టే లేందే మన జీవితం లేదు’’
‘‘నేను నమ్మను’’


‘‘నేను నిజం చెబుతున్నాను. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. పొద్దున అలారం మ్రోగితే మరో పది నిమిషాలు పొడిగించి నిద్ర పోతావ్ స్టే అంటే ఇదే. మేల్కొవడానికి మరో పది నిమిషాలు స్టే విధించడంతో నీ దిన చర్య మొదలవుతుంది. పిల్లలూ ప్లీజ్ మమీ కొద్ది సేపటి తరువాత లేస్తాను అని మారాం చేయడం అంటే లేవడానికి స్టే విధించడం అన్నమాట!’’
‘‘ఔను!నిజమే ప్రతి ఇంట్లో తెల్లవారు జామున ఇది మామూలే’’
‘‘గవర్నమెంట్ ఆఫీసుకు ఏదైనా పని మీద వెళితే గంటలో ముగిసే పనిని రెండు నెలలు తిప్పించుకోవడం, ఎనిమిది వారాల స్టేనే’’
‘‘ఔను మా ఆవిడ వడ్డాణం చేయించమని పెళ్లప్పుడు అడిగింది, తప్పకుండా అని చెప్పి పాతికేళ్లు కావస్తోంది. ఇదీ స్టేనే కదా? ’’
‘‘ఔను!ఇప్పుడు నీకు విషయం సరిగ్గా అర్ధమైంది.’’


‘‘కలికాలంలో స్టే మనిషి జీవితంలో భాగం అయిందటావు?’’
‘‘దేవుళ్ల జీవితంలో కూడా భాగమే. ప్రకృతి వయసు ఎంతో? స్టేకూ అంతే. దేవుళ్లు కూడా కష్టకాలంలో స్టేనే నమ్ముకున్నారు. దశావతారాల్లో ఏ అవతారాన్నయినా తీసుకో స్టే లేనిదే ఆ దేవుని జీవితం లేదు. కొన్నిసార్లు స్టే కొన్ని జీవిత కాలాల పాటు సాగుతుంది. రామావతారంలో విధించిన స్టేను కృష్ణావతారంలో ఎత్తేసిన సందర్భాలు కోకొల్లలు. తెలుగు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ తూటా తగిలిన తరువాత కూడా బోలెడు డైలాగులు చెప్పి ప్రాణాలు వదిలితేనే మనం నవ్వుకుంటాం. అంపశయ్య అంటే ఏంటి సుదీర్ఘమైన స్టే. భీష్ముని జీవితం స్టేకు అద్భుతమైన ఉదాహరణ. భీష్ముడు అంపశయ్యపై పరుండి తన జీవితం ముగింపు కోసం ఎదురు చూడడం అదే. బాణాలు తగలగానే నెలకొరిగిపోతారు. కానీ భీష్ముడు మాత్రం ఉత్తరాయణం వరకు శరీరం విడిచిపెట్టను అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మాఘమాసం తర్వాత రథసప్తమి వరకు భీష్ముడు తన మరణంపై స్టే విధించుకున్నారు. ఇలాంటి అవకాశం మన నేతలకు ఉంటే కేసులే కాదు మరణాలకు సైతం స్టేలు సంపాదించుకుని శాశ్వతంగా మనను పాలిస్తూ, కేసుల్లో స్టేలు పొందేవారేమో అనిపిస్తుంది. ’’
‘‘ఔను అన్యాయం.. చట్టం అందరికీ సమానం అన్నప్పుడు స్టేలు కొందరికే పరిమితం కావడం అన్యాయం కదూ?’’
‘‘విషయం చెబుతున్నాను విను నన్ను ఇరికిస్తే కనీసం స్టే కోసం ప్రయత్నించేవారెవరూ లేరు. నేరుగా బొక్కలో వేస్తారు. నీకొచ్చే లాభం ఏంటి చెప్పు’’
‘‘నాకా ఉద్దేశం ఏమీ లేదు. స్టే అనేది శాశ్వత పరిష్కారమా? స్టే గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది చెప్పు వింటాను’’
‘‘సత్యనారాయణ వ్రతం అనుకుంటున్నావా? ఇంకా చెప్పమంటున్నావ్! సమస్యకు స్టే పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం అసలే కాదు. అడిగావు కాబట్టి చెబుతా విను. శిశుపాలుని కథ తెలుసు కదా? స్టే శాశ్వతం అనుకుని అహంకారంతో విర్ర వీగాడు ఏమైంది?’’


‘‘శివుపాలుడిది కూడా స్టే కథేనా?’’
‘‘అనుమానం ఎందుకు? శిశుపాలుడి మరణం శ్రీకృష్ణుడి చేతిలో ఉందని గుర్తించిన తల్లి శ్రుత దేవి, శిశుపాలుడ్ని చంపవద్దని కోరుకుంటుంది. మేనత్త ప్రాధేయపడడంతో వంద తప్పుల వరకు క్షమిస్తానంటాడు. వంద తప్పుల వరకు శిశుపాలుడికి స్టే దక్కినట్టు అన్నమాట! స్టే లేకపోతే మొదటి తప్పుకే పైకి పోయేవాడు. కానీ వంద తప్పుల వరకు బతికి ఆ తరువాతే శ్రీకృష్ణుడి చేతిలో పోయాడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన స్టే కాలమే శిశుపాలుడి జీవిత కాలం.’’
‘‘మనం కూడా స్టేలను నమ్ముకుంటే’’
‘‘హలో ఏ లోకంలో ఉన్నావ్! డ్రైవింగ్ లైసెన్సో, హెల్మెటో లేకపోతే ట్రాఫిక్ పోలీసుల కంటపడకుండా గల్లీల్లోంచి దొంగల్లా పారిపోయే మనమెక్కడ? స్టేలతో కాలం గడిపిస్తే ప్రపంచానికి నైతిక విలువలు బోధించే నిప్పులాంటి నాయకులెక్కడ? కొన్ని మందులు కొందరికే పని చేస్తాయి. స్టేలు కొందరికీ జీవితాన్ని ప్రసాదిస్తాయి.’’


‘‘రాజకీయాల్లో స్టే కవచకుండలాల వంటివి ’’
‘‘అందరికీ అలాంటి అదృష్టం ఉండదనుకో? స్టేలు కొందరి జీవితానికి శాపంగా మారుతాయి. నరుూమ్‌ను ఎన్‌కౌంటర్ చేసింది. వాడికి భయపడి కాదు, స్టేకు భయపడి. అరెస్టు చేసి లోపలేస్తే స్టే తీసుకొని బయటకు వచ్చి అంతర్జాతీయ నేర సామామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడేమో అని భయపడ్డారని అంటారు. ఒకవేళ అరెస్టు చేస్తే న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కడిగిన ముత్యంలా బయటకు వస్తాను. సమాజంలో మార్పు కోసం విలువల కోసమే నా పోరాటం అంటూ ఎంత చక్కగా ఇంటర్వ్యూలు ఇచ్చేవారో. మొద్దు శీను డైలాగులు పేలాయి కానీ టీవిలో చూస్తుంటే నరుూమ్ నటన బాగుంది.’’


‘‘నువ్వెంత వ్యంగ్యంగా మాట్లాడినా స్టే పొందడం కూడా ఓ ఆర్టే కాదంటావా?’’
‘‘ఎంత మాట అదో అద్భుతమైన కళ. రాజకీయాలు శాస్తమ్రా? కళనా అని ఎంతో కాలం నుంచి మేధావులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వకళల, సర్వ శాస్త్రాల సమాహారం రాజకీయం. ప్రజలను ఆకట్టుకునే కళ ఉంటే ఒక కాలంలో రాజకీయాల్లో రాణించే వారు. ఇప్పుడు స్టే పొందే పరిజ్ఞానం ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. ఒకటిన్నర డజన్ల కేసుల్లో స్టేలు పొందడం సామాన్యమా?’’
‘‘ఇంతకూ ఏమంటావు’’
‘‘స్టే అనేది ప్రాణవాయువు. స్టే ఎంత కాలం ఉంటే అంత కాలం రాజకీయ జీవితానికి ఢోకా లేదు’’
‘‘స్టే వెకెట్ ఐతే?’’
‘‘మన చర్చకు స్టే విధిస్తున్నాను’’

- జనాంతికం - బుద్దా మురళి( 4.9. 2016)