31, మార్చి 2017, శుక్రవారం

ఇంతకీ ఆయనెవరు..?

‘‘ప్రతి విజయం వెనుక...’’
‘‘ఇక చాల్లే... నాకు తెలుసు...!’’
‘‘ఏదీ చెప్పు చూద్దాం?’’
‘‘ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి బుడ్డోడూ అమ్మాయిలను ఇంప్రెస్ చేద్దామని రాసే మొదటి మాట ఇదే. ప్రతి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అనే కదా? నువ్వు చెప్పబోయేది’’
‘‘కాదు.. నువ్వు చెప్పింది సామాన్య కుటుంబరావుల విజయం వెనుక ఉండే మహిళ గురించి.. నేను చెప్పేది అది కాదు. ప్రతి విజయం వెనుక ఆయన ఉంటారు?’’
‘‘ఎవరాయన..?’’
‘‘నీకు పేరు కావాలా? విజేతల జాబితా కావాలా?’’
‘‘నీకో విషయం తెలుసా? మాయాబజార్ కన్నా ముందు ఎన్టీఆర్ ఒక నాటకంలో కృష్ణుడిగా నటిస్తే చెప్పులు విసిరారట! కృష్ణుడంటే ఈలపాటి రఘురామయ్యను తప్ప మరొకరిని ఊహించడానికి ఇష్టపడలేదట! అలాంటి ఎన్టీఆర్‌ను మయాబజార్ తర్వాత కృష్ణుడంటే ఎన్టీఆరే అని జనం మనసులో ముద్ర వేసేసుకున్నారు. దీనికి కారణం ఎవరనుకున్నావు?’’
‘‘ఎవరు?’’
‘‘ఆయనే’’
‘‘మాయాబజార్ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత చూసిన వారు పెదవి విరిచాక దర్శకుడు కెవిరెడ్డి తిరిగి చేర్చిన దృశ్యాలతో- ఆ కళాఖండం 60 ఏళ్లయినా అజరామరంగా నిలిచింది. కృష్ణుడిగా ప్రేక్షక జన హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారు. ఆ ఇమేజ్ తరువాత రాజకీయ పరమపద సోపానానికి సైతం ఉపయోపడంది. కొంప తీసి ఆ రోజు సలహా ఇచ్చింది నువ్వే అంటావా? ’’
‘‘నేను కాదు ఆయన..’’
‘‘ఇంతకీ ఆయనెవరండీ ?’’
‘‘ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారో తెలుసా? ’’
‘‘పార్టీ పెట్టినప్పుడు చెప్పారు కదా? సినిమా నటునిగా ఇన్ని దశాబ్దాల పాటు తనను ఆదరించిన ప్రేక్షకులకు ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పుకున్నారు. సరే.. ఆ తరువాత ఎన్టీఆర్‌ను దించేసిన నాదెండ్ల భాస్కరరావు మాత్రం ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తెచ్చింది తానే అని చెప్పుకున్నారు. ఒకటి రెండు సార్లు సినీ రచయిత త్రిపురనేని మహారథి కూడా ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని చెప్పింది తానేనని చెప్పుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంతకూ నువ్వేమంటావు? ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది నాదెండ్ల భాస్కరరావు. ‘ఆయన’ అంటే నాదెండ్ల అనా? నీ ఉద్దేశం..’’
‘‘కాదు... ఆయనంటే ఆయనే... నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్‌ను హోటల్ క్యాంపులతో విజయవంతంగా ఎదుర్కోవావాలని ....’’
‘‘ ముందు ఆయనెవరో తేల్చండి. మిగిలిన సంగతులు తర్వాత. సస్పెన్స్ సినిమాలో విలన్ ఎవరో చివర్లో చెప్పడం పాత సినిమా టెక్నిక్. హీరో ఎంత శక్తిమంతుడో విలన్ కూడా అంతే.. ఇది పూరి జగన్నాథ్ మార్కు విలనిజం. అప్పటి వరకు ‘గుమ్మడి’ పెద్దమనిషిలా కనిపించి చివరలో విలన్ అంటే ఆశ్చర్యపోయే అమాయక రోజులు కావు ఇవి. క్యాబినెట్ మీటింగ్‌లే లీకవుతున్నాయి. సినిమా విడుదలకు ముందే సస్పెన్స్ లీకవుతుంది. ఈ టెక్నిక్ ఈ రోజుల్లో నడవదు. ముందు ఆయనెవరో చెప్పండి’’
‘‘ఆయన అద్వైతవాది’’
‘‘???’’
‘‘చిన్నికృష్ణుడు మన్ను తిన్నాడని చెబితే యశోద నోరు తెరవమంటే ఏమైందో తెలుసు కదా? చిన్నికృష్ణుని నోట్లో భూ గోళం అంతా టేబుల్ ఫ్యాన్‌లా తిరుగుతూ కనిపించింది కదా?’’
‘‘ఔను అయితే?’’
‘‘యశోద, చిన్నకృష్ణుడు భూమిపైనే ఉన్నారు కదా? మరి కృష్ణుని నోట్లో భూమి కనిపించింది అంటే అప్పుడు చిన్ని కృష్ణుడు ఎక్కడున్నట్టు?’’
‘‘ఔను.. ఎక్కడున్నట్టు?’’
‘‘అద్వైతం అంటే ఇదే? చిన్నికృష్ణుడు, భూమి, యశోద వేరు వేరు కాదు.. అంతా ఒకటే.. అందుకే గోకులంలో ఎవరింట్లో చూసినా చిన్ని కృష్ణుడే కనిపించేవాడు’’
‘‘ఆయన అంటావు? అద్వైతం అంటావు? విషయం చెప్పు?’’
‘‘వ్యవస్థను మార్చడం నా ఒక్కడి వల్ల కాదు అని, ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రమ్మని తానే చెప్పినట్లు చంద్రబాబు సెలవిచ్చినట్టు విన్నా.. అదిగో నేను చెప్పడం పూర్తి కాక ముందే ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు. ఇక నేరుగా ఇదే విషయం చెబితే నీ రియాక్షన్ ఎలా ఉండేదో తెలుసు’’
‘‘నువ్వు చెప్పింది నమ్మాలంటావు?’’
‘‘శ్రీకృష్ణ పరమాత్ముడు తలుచుకుంటే మహాభారత యుద్ధం నివారించే వాడు కాదా? ఆయన తలుచుకుంటే కంటిచూపుతో కౌరవ సైన్యాన్ని మట్టి కరిపించే వాడు కాదా? కానీ అలా చేయలేదు. అర్జునుడితో యుద్ధం చేయించి, యుద్ధంలో కీర్తి అర్జునుడికి దక్కేట్టు చేశాడు. ఎందుకంటావు? వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే అన్నీ తాను చేయడం కాదు.. చేయించాలి. ఆయన కూడా అంతే తానే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి వ్యవస్థలను మార్చడం సాధ్యం కాక కాదు. శ్రీకృష్ణుడికి అర్జునుడిలా తనకూ ఓ ఎన్టీఆర్ అవసరం అని రాజకీయాల్లోకి రమ్మన్నారు.. అంతేకానీ తన శక్తి సరిపోక కాదు.’’
‘‘మరి అంత కీలక సమయంలో ఆయన ఎన్టీఆర్ వైపు ఉండక, కాంగ్రెస్ వైపు ఉన్నారేం?’’
‘‘మహాభారతంలో మహా పరాక్రమ వంతుడు, ధర్మం తెలిసిన వాడు భీష్ముడు. ఆయనకు యుద్ధ ఫలితం ఏమిటో తెలియదా? ఇచ్చిన మాటకు కట్టుబడి కౌరవుల వైపు ఉన్నాడు? అలానే ‘ఆయన’ కూడా ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించి, పార్టీ పెట్టించి, తాను చేరకుండా కాంగ్రెస్‌లో ఉండడం విలువలతో కూడిన రాజకీయాలుగా చూడాలి.’’
‘‘అంటే.. కౌరవులను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న శకుని చివరి వరకు కౌరవులతోనే ఉన్నట్టు’’
‘‘మహాభారతంతో వచ్చిన చిక్కే ఇది.. ప్రతి సందర్భానికి, కావలసిన విధంగా అక్కడి నుంచి ఉదాహరణలు తీసుకోవచ్చు. పెద్దలు ఏం చేసినా ధర్మ సంస్థాపనార్థం అని గుర్తించుకో.. అది చాలు. నువ్వు, నేను వేరు కాదు.. కుర్చీలో నువ్వు కూర్చుంటే ఏంటి? నేను కూర్చుంటే ఏంటి? అనే అద్వైత భావంతో కుర్చీలో ఉన్న వారిని కిందికి దించి, తాను కూర్చున్నాడు.. అంతే తప్ప.. పదవీ కాంక్షతో కాదు’’
‘‘ఈ రోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావేంటి? ’’
‘‘వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీకి మూడవ తరం వారసుడు మంత్రి కాబోతున్నాడు. లోకకల్యాణానికి ఇంకేం కావాలి?
నాలుగవ తరం వారసుడి పట్ట్భాషేకం కూడా కనులారా తిలకిస్తా.. ఈ జన్మకు ఇది చాలు’’
‘‘ఇంతకూ ఆయనెవరు? ’’
‘‘లోకకల్యాణం కోసం.. లోకాన్ని పుట్టించిన మహనీయుడు’’
*
- బుద్దా మురళి(జనాంతికం 31-3-2017)

24, మార్చి 2017, శుక్రవారం

బాహు‘బలి’ కావద్దు..!

‘‘ఏంటి గురూ..! దేశంలో ఏ గ్రామంలోనైనా మన పార్టీ అభ్యర్థి సర్పంచ్‌గా గెలిచాడా? గాంధీభవన్ అంతా సందడిగా ఉంది.’’ అని ఒక నేత పక్కనున్న నేతను చమత్కారంగా ప్రశ్నించాడు. ‘సీరియస్ విషయాల్లో ఇలాంటి సిల్లీ జోకులు వద్దు’ అని మరో నేత నుంచి విసుగ్గా సమాధానం.. కవిత్వం ,జోకు.. ఏదో రూపంలో బయటకు తన్నుకు వస్తుంటుంది? కవి నిరంతరం తన కవిత్వం వినే వాడి కోసం వెతుక్కున్నట్టే ఆ నేత గాంధీభవన్‌లో తన మాటలు వినే వాళ్ల కోసం వెతుక్కుంటున్నాడు. పార్టీలో ఎవడికి వాడే బాస్.. ఒకరి మాట మరొకరు వినరు. ఇదే పార్టీ సిద్ధాంతం అని అర్థమై వౌనంగా ఉండిపోక తప్పదు. గాంధీభవన్‌లోని తన గదిలో కాంగ్రెస్ నేత జానారెడ్డి సీరియస్‌గా ఉన్నాడు. కెసిఆర్‌ను మట్టికరిపించి అధికారం హస్తగతం చేసుకోవడం ఎలా? అనే ఆలోచనలో ఆయన మునిగిపోయాడు.
జానారెడ్డి టీవీలో సినిమా చూస్తున్నాడు. ఎన్టీఆర్ నటించిన ఓ జానపద సినిమా ‘బ్లాక్ అండ్ వైట్’ అయినా.. అందులోని ఒక్కో దృశ్యానికి జానారెడ్డి ముఖంలో రంగులు మారుతున్నాయి.


‘కెసిఆర్‌ను మట్టికరిపించేందుకు గాంధీభవన్‌లో జానారెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఈ దెబ్బతో కెసిఆర్ ఓటమి ఖాయం..’ అంటూ టీవీ చానళ్లలో బ్రేకింగ్ న్యూస్‌లు బెంబేలెత్తిస్తున్నాయి.
అప్పుడు కెసిఆర్ తన ఫాం హౌజ్‌లో‘‘ఏరా.. ఈసారి అల్లం పంట బాగానే ఉండేట్టుగా ఉంది. బెంగళూరు మిర్చి కోతకు వచ్చింది’’ అంటూ పొలంలో పని చేస్తున్న వాళ్లను అడుగుతున్నారు.
జూనియర్ టీవీ విలేఖరికి ఐడియా వచ్చి కెసిఆర్ ఫాం హౌజ్‌లో ఉన్నాడని తెలిసి, కెసిఆర్‌కు, జానారెడ్డికి లింకు కలపుతూ - ‘జానారెడ్డి వ్యూహం ముందే లీక్ కావడంతో కంగారు పడ్డ కెసిఆర్ ఫాం హౌజ్‌లో మేధో మథనం జరుపుతున్నారు.. ఈ ప్రమాదం నుంచి ఎలా గట్టేక్కాలా? అని ఆలోచిస్తున్నారు. కనీసం ఒక రోజు ముందస్తుగానైనా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు’ అని స్టోరీ ఇచ్చి, ‘తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి’ అన్నట్టు సీనియర్‌ల వైపు చూశాడు.
‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికెన్ని సీట్లు?’ అంటూ దమ్మున్న ఓ చానల్ తనదైన కథనాన్ని మొదలు పెట్టి ‘మాతో పెట్టుకోకు’ అని కూడా పనిలోపనిగా ప్రకటించింది.
చానళ్లలో వస్తున్న వార్తలను ఒక స్లిప్ మీద రాసి ఎప్పటికప్పుడు జానారెడ్డికి పంపుతున్నా వాటి వైపు ఆయన చూడలేదు. టీవిలో వస్తున్న సినిమాలో మునిగిపోయాడు. ఆ సినిమాలో- ముసలి రాజు, రాణిలను బంధించి జైలులో పెట్టాక విలన్ ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. రాజుకు విశ్వాసపాత్రుడైన వంటమనిషి రాజుగారి పిల్లలను రాజభవనం నుంచి తప్పించి పూటకూళ్లమ్మ ఇంట్లో రహస్యంగా పెంచుతున్నాడు. విలన్ రాజనాల వికటాట్టహాసం చేస్తూ కొరడాతో ముసలి రాజును, రాణిని కొడుతున్నాడు. అనే్నళ్లపాటు కొరడా దెబ్బలు భరించిన ఆ ముసలి దంపతులు ఒక్కసారిగా ఆవేశంతో- ‘వస్త్రాడ్రా ? మా యువరాజు విజయ్.. నీ పీచమణచడానికి ఎక్కడో పెరుగుతూనే ఉన్నాడు’ అని చెప్పగానే- రాజనాల వికృతంగా నవ్వుతూ.. ‘ఇంకెక్కడి యువరాజు..? మా వాళ్లు ఎప్పుడో పై లోకానికి పంపించేశారు’ అని చెబుతుండగానే- యువరాజు ఎన్టీఆర్ ఒంటి చేత్తో గుర్రాన్ని పరుగెత్తిస్తూ, మరో చేత్తూ చెమట బిందువులను చేతితో తీసి కింద పడేసి గుర్రపు స్వారీ చేస్తూ కనిపించాడు.
గుర్రంపై స్వారీ చేస్తున్న ఎన్టీఆర్‌ను చూడగానే జానారెడ్డికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఆయన ముఖంలో అంత సంతోషం ఎప్పుడూ కనిపించలేదు.


***
జానారెడ్డి బయటకు రాగానే పెద్ద సమూహంలా మీడియా గుమికూడింది. కెసిఆర్‌ను గద్దె దించడానికి రహస్యంగా మీరు వ్యూహరచన చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.. మీరేమంటారు..? అని ఒక విలేఖరి అడిగాడు. ముందు అలవాటు ప్రకారం ‘నో కామెంట్’ అని చెప్పాలనుకున్న జానారెడ్డి తనవైపు ఎంతో ఆశగా ఫోకస్ చేసిన అన్ని కెమెరాలను నిరాశ పరచలేక- ‘‘కెసిఆర్‌ను ఓడించేందుకు అద్భుమైన వ్యూహరచన చేశాం. మమ్మల్ని గెలిపించేందుకు బాహుబలి వస్తున్నాడు’’ అని చెప్పి కారు ఎక్కి వెళ్లిపోయాడు.
***
జానారెడ్డి ప్రకటనతో ఏదో జరిగిపోతోంది అని అన్ని పార్టీల్లో నాయకులు ఆందోళన చెందారు. మోదీనే బాహుబలి.. తెలంగాణలో మేం చేసేదేమీ లేదని చెప్పడంతో మేదీనే రంగంలోకి దిగుతున్నారు.. అని తెలంగాణ, ఆంధ్ర బిజెపి నాయకులు ఉమ్మడిగా వినిపించారు.
‘‘బాబు అభిమాన హీరో ఎవరో? ఆ ఒక్క సీక్రెట్ తెలిస్తే ఆ హీరో స్ట్రాటజీలే అమలు చేసి మనం బాబును ఈజీగా ఓడించవచ్చు’’అని జగన్ అంబటి రాంబాబుకు చెప్పాడు. ‘చదువుకునే రోజుల్లో జయప్రదను అభిమానించినట్టు తెలుసు. తనను తాను అభిమానించుకోవడం తప్ప హీరోను అభిమానించే అలవాటు బాబుకు లేదు’’అని రాంబాబు తేల్చి చెప్పాడు. నేనే బాహుబలిని అని చెప్పుకుంటే బాగుంటుందా? లేదా? అనే ఆలోచనలో జగన్ మునిగిపోయాడు.
***
సెక్రటేరియట్‌కు రాకపోయినా ఫరవాలేదు కానీ, క్యాబినెట్‌కు రాకపోతే బాగోదని కెసిఆర్ మంత్రివర్గ సమావేశానికి వచ్చారు. ‘‘ మా పార్టీలో బాహుబలి మా కెసిఆర్ సారే అని చెప్పాం’’ అని కోరస్‌గా మంత్రులు అన్నారు.
కెసిఆర్ అందరి వైపు చూసి- ‘‘బాహుబలి.. వాడెవడు?’’అని అడిగారు. అంతా ఆశ్చర్యపోయి తమకు తోచిన విధంగా చెప్పారు. కెసిఆర్ అంతా విని- ‘మనం ఏం మాట్లాడుతున్నామో మనకన్నా తెలియాలి. బాహుబలి వస్తాడంటూ జానారెడ్డి , బిజెపి వాళ్లు చెబుతున్నారు అంటే కెసిఆర్‌ను ఓడించే దమ్ము మాకు లేదు అని చెప్పడమే కదా? దానర్థం.. అన్నీ విని ఊరుకోవాలి. ‘బాహుబలి’ నేనైతే చూడలేదు. అన్ని రకాల మాఫియాలను ఎదిరించి ఉద్యమానికి కోట్లాది మంది ప్రజలను సమాయత్తం చేసి తెలంగాణ సాధించిన నన్ను- సినిమాలో వెన్నుపోటుకు గురైన పాత్రతో పోల్చడం .. ఏది పోగడ్తో, ఏది విమర్శనో కూడా తెలియకపోతే ఎలా?’ అని క్లాస్ తీసుకున్నారు.


‘బాహుబలి బలైపోయిన పాత్ర. రాజకీయాల్లో ఉన్న వాళ్లు ఆలోచించాల్సింది కట్టప్ప గురించి.. ప్రతి ఓటరూ కట్టప్పనే... చెప్పింది చేస్తే ఆదిరిస్తారు. చేయకపోతే కట్టప్పలా పోటు పొడుస్తారు అర్థమైందా? ఇక వెళ్లండి’ అని కెసిఆర్ మంత్రులను పంపించేశారు. *

 - బుద్దా మురళి(జనాంతికం 24-3-2017)


17, మార్చి 2017, శుక్రవారం

చందమామపై కుట్ర..!

‘చల్లని రాజా ఓ చందమామా..’
‘‘చల్లని రాత్రి వేళ నిండు పున్నమిని చూస్తూ ఈ పాట వింటుంటే ఆకాశంలో తేలిపోతున్నట్టుంది. చందమామ మీద అన్నీ అద్భుతమైన గీతాలే. ఆ రోజులే వేరు.. పున్నమి చంద్రుణ్ణి అందంగా చూపడమే కాదు, అంత కన్నా అద్భుతంగా పాటలు రాశారు ఆ నాటి సినీ కవులు.. ఇన్ని దశాబ్దాలు అయినా ఆ పాటలు వింటుంటే మరో లోకంలోకి వెళ్లినట్టుగా ఉంటుంది. వౌనంగా ఉన్నావ్... ఏదైనా మాట్లాడు’’
‘‘దీని వెనక పెద్ద కుట్ర ఉంది..’’


‘‘అబ్బా.. ఆ మేధావుల భాష వదలవా? చందమామ అంటే కుట్రలు అంటావ్.. ’’
‘‘నా దృష్టి ఎప్పుడూ బాధితుల వైపే ఉంటుంది కానీ బాధించే వారి వైపు ఉండదు’’
‘‘వావ్.. నా కన్నా నువ్వే చందమామ చిలిపి పనుల గురించి అద్భుతంగా చెప్పావు. నిజమే వయసులో ఉన్నప్పుడు అందరూ చందమామ బాధితులే. చల్లని సాయంత్రం .. పిల్లగాలులు.. పక్కన అందమైన అ మ్మాయి ఉన్నప్పుడు ఆ బాధ.. ’’
‘‘అది కాదు.. అసలు చందమామనే బాధితుడు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. కవులంతా చందమామ చల్లదనాన్ని పొగుతూ రాశారు కానీ వెలుగును ఇచ్చే సూర్యుడి గురించి రాశారా? లైటు లేనిదే కనిపించని రాత్రి పూట వచ్చే చందమామ గొప్పవాడా? పగలు వెలుతురులో కనిపించే సూర్యుడు గొప్పవాడా? ఒక వ్యూహం ప్రకారం సూర్యుని గొప్పతనం వెలుగులోకి రాకుండా కుట్ర చేశారు?’’


‘‘వాతావరణం వేడెక్కి పోయేట్టుగా ఉంది. ఇంకేంటి విశేషాలు? తెలంగాణలో లక్షలాది మంది గొర్రెల కాపరులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నారట కదా? ’’
‘‘ఔను.. ఇందులో పెద్ద కుట్ర దాగుంది? బడుగు బలహీన వర్గాలే 90 శాతం మంది ఉన్నారు కదా? వీళ్లలో ఎవరైనా ముఖ్యమంత్రి పదవి కోసం తనకు పోటీ వస్తారని ముందు చూపుతో కులవృత్తుల వారంతా కుల వృత్తిలోనే ఉండేట్టు పెద్ద కుట్ర పన్నారు’’
‘‘నిజమా?’’
‘‘నీకు ఏదైనా పురాణాల ఉదాహరణలతో చెబితేనే అర్ధం అవుతుంది కదా? శ్రీకృష్ణుడితోనే తనకు ప్రాణభయం ఉందని కంసుడు పిల్లలందరినీ హతమార్చాడు కదా? ఇప్పుడూ అలానే అన్న మాట.. అందరినీ కుల వృత్తుల్లో ఉండేట్టు చేసి తాను సిఎంగా ఉండాలని కెసిఆర్ కుట్ర’’
‘‘నిజం చెప్పు.. ఈ ఆలోచన నీదా? ఐలయ్య బాబాయ్‌దా?’’
‘‘ఉత్తమన్నది, హనుమన్నది ఎవరిదైతేనేం.. వాస్తవమే కదా? ’’
‘‘ కారు స్టార్ట్ అయితే వేడి పుడుతుందని చిన్న పిల్లాడికీ తెలుసు.. ఎన్నికల ప్రచారంలో కారు ఇంజన్ పక్కన కరెన్సీ నోట్లు పెడితే కాలిపోతాయని తెలియని ఉత్తమన్నది అయ్యే చానే్స లేదంటున్నారు’’
‘‘ఐన్‌స్టీన్ ఇంటి అడ్రస్ మరిచిపోయి తన ఇంటికి ఫోన్ చేసి అడ్రస్ అడిగేవారట! ఇంట్లో నుంచి పిల్లి బయటకు వెళ్లడానికి తలుపునకు రెండు కన్నాలు చేశాడట! ఒకటి చిన్నపిల్లి పోవడానికి, రెండోది పెద్దపిల్లి పోవడానికి.. మేధావుల పనులెప్పుడూ ఇలానే ఉంటాయి.. మాకు తెలియదు అనుకోకు. ఉత్తమన్న ముమ్మాటికీ మేధావి’’
‘‘నీ అభిప్రాయం నీ ఇష్టం.. కాదనడానికి నేనెవరిని? ’’


‘‘ఇంకోటి చెప్పాలా? జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నారు కదా? ఏదో ఒక రోజు మా వాటా మాకు కావాలని వాళ్లు తిరుగుబాటు చేయకుండా ‘కల్యాణ లక్ష్మి’ పేరుతో పెళ్లికి 75వేలు ఇస్తున్నారు. చదువుకుంటే రాజకీయ అధికారం కోసం పోరాడుతారు. పెళ్లి చేసుకుంటే సంసార జంజాటంలో ఇరికి పోతారు.. ఇదీ కల్యాణ లక్ష్మి పథకం వెనక కుట్ర’’
‘‘ఇది మాత్రం నీ ఆలోచన కాదని కచ్చితంగా చెప్పగలను? ’’
‘‘ నాది కాదు.. మహిళా ఉద్యమకారుల అభిప్రాయం వాస్తవం అనిపించడంతో నమ్ముతున్నాను’’
‘‘గ్రామాల్లో బాల్య వివాహాలు కామన్. ‘కల్యాణ లక్ష్మి’ కింద సాయం పొందాలంటే 18 ఏళ్లు నిండిన వారికే పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తుంది, కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా అప్పటి వరకూ ఆడపిల్లల్ని చదివిస్తారు. నువ్వేమో దీనికి రివర్స్‌గా చెబుతున్నావ్’’
‘‘అంటే మహిళల గురించి దశాబ్దాల పాటు ఉద్యమించిన వారి కన్నా నీకు ఎక్కువ తెలుసా? ’’


‘‘కుట్ర అంటే ఏంటో?’’’
‘‘హలో.. ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వచ్చిన ప్రతి సినిమా చూడందే వదలను. రాజకోట రహస్యం, గండికోట రహస్యం నుంచి కంచుకోట వరకు అన్నీ చూసేశాం. రాజులను దింపడానికి రాజమహల్‌లో ఎలా కుట్రలు పన్నుతారో తెలియదనుకోకు.. ఏ సినిమాలో రాజకోట కుట్రలను ఎన్టీఆర్ ఎలా భగ్నం చేసి, విలన్ రాజనాలను ఎలా చిత్తుచేశాడో చెప్పమంటావా? ’’
‘‘ఎన్టీఆర్ రాజుల సినిమాలు చూసిన నీకే కుట్రల గురించి ఇంత తెలిస్తే.. ఆ పాత్రల్లో నటించిన ఎన్టీఆర్‌కు కుట్రల సంగతి ఇంకెంత తెలియాలి ? ’’
‘‘ఔను నిజమే’’
‘‘మరి.. తాను ఎన్నో సినిమాల్లో అవలీలగా పోషించిన పాత్రల సన్నివేశాలు తన జీవితంలోనే జరిగితే ఓడిపోయి కుమిలిపోయి తట్టుకోలేక ప్రాణాలు వదిలేశాడు.. కాబట్టి సినిమాలు వేరు- కుట్రలు వేరు.. జీవితం వేరు. పథకాలు వేరు ’’
‘‘కన్‌ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తున్నావ్.. ఎన్నికల్లో గెలవాలనే కుట్రతో కాదా ఈ స్కీమ్‌లన్నీ?’’
‘‘ఎవరైనా తిరిగి ఎన్నికల్లో గెలవడానికే ప్రయత్నిస్తారు కానీ ఓడిపోయేందుకు తీవ్రంగా కృషి చేసే పార్టీలు కూడా ఉంటాయా? కుట్రల గురించి నమ్మలేని నిజం ఒకటి చెప్పాలా? కుట్ర చట్టం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సెక్షన్ కింద ఒక్క కేసు కూడా రుజువు కాలేదు. రాంనగర్ కుట్ర కేసు నుంచి వైస్రాయ్ కుట్ర కేసు వరకూ అన్నీ ఇంతే?’’
‘‘మేధావుల సిద్ధాంతాల కన్నా- సామాన్యుల ప్రాక్టికల్ అనుభవం ఎక్కువ విలువైంది. ఏది కుట్రో, సమాజానికి దేని వల్ల మేలు కలుగుతుందో వాళ్లే చెబుతారు.’’
‘‘అంటే?’’


‘‘1999 ఎన్నికల్లో బాబు పార్టీ పరిస్థితి గాలిలో దీపంలా ఊగిసలాడుతూ ఉండేది. ఎన్నికల ముందు ‘దీపం’ పథకంతో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తుంటే ఇదే కాంగ్రెస్ హనుమంతన్న కోర్టుకు వెళ్లి దీపం పథకం నిలిపివేయించి ఎన్టీఆర్ భవన్‌లో దీపం వెలిగించారు. కొన్ని వ్యూహాలు అంతే రివర్స్‌లో పని చేస్తాయి. ఇప్పుడు కులవృత్తులపై దాడిలో.. ఇలాంటి కుట్ర ఏదో ఉందేమో అనిపిస్తోంది.’’
-బుద్దా మురళి (జనాంతికం 17-3-2017)
*

10, మార్చి 2017, శుక్రవారం

సంపన్నులు కావాలంటే..



‘ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా?’.. అంటూ పాట వస్తుంటే అక్కడ ‘అక్కినేని’ కనిపించడం లేదు.. భక్తతుకారాం కనిపిస్తున్నాడు.
‘‘ఎంత మధురమైన గాత్రం.. ఎంత భక్తి.. ఇప్పటి వాళ్లు ఎన్ని జన్మలెత్తినా భక్తతుకారాం లాంటి సినిమా తీయలేరు. ఏమంటావు?’’
‘‘ఏమీ అనను’’
‘‘నీకో సంగతి తెలుసా? మహాభక్తునిగా నటనలో జీవించిన అక్కినేని నాస్తికుడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనిపించుకున్న ఎన్టీఆర్ నాస్తికుడు. ఎన్టీఆర్ అనగానే చాలా మందికి శ్రీరాముడు కనిపిస్తాడు. ఆయనకు మాత్రం రావణుడంటే వల్లమాలిన అభిమానం.’’
‘‘నాస్తికుడంటే?’’
‘‘కులం నిజం, మతం అబద్ధం అని నమ్మేవాళ్లు నాస్తికులు, కులం, మతం రెండింటిని నమ్మేవాళ్లు ఆస్తికులు’’
‘‘నాకైతే ఎన్టీఆర్‌ను చూస్తే అచ్చం శ్రీకృష్ణుణ్ణి చూసినట్టే ఉంటుంది?’’
‘‘శ్రీకృష్ణుడిని నువ్వు చూశావా? ’’
‘‘లేదు’’
‘‘మరి... అచ్చం శ్రీకృష్ణుడిలా ఉన్నాడని ఎలా చెప్పగలవు?’’
‘‘ఆ సంగతి వదిలేయ్! తుకారాం భక్తి పారవశ్యంలో పిల్లవాడిని మట్టిలో తొక్కుతున్నా ముఖంలో ఏ మార్పు లేకుండా నువ్వు సినిమా ఎలా చూడగలవు?’’
‘‘వందల సినిమాలు చూసినోడ్ని. దేవుడు ప్రత్యక్షమవుతాడు.. తుకారాం భక్తిని మెచ్చి అన్నీ ఇచ్చేస్తాడు. సావిత్రి, అంజలి, జమున, కాంచన, ప్రభ, కృష్ణకుమారి పాట ముగించగానే ప్రత్యక్షమైన దేవుడు అక్కినేని నాగేశ్వరావుకు ప్రత్యక్షం కాడా? ఎంత అమాయకుడివి..?’’
‘‘నాకో అనుమానం.. కన్నాంబ నుంచి నిన్న మొన్నటి సౌందర్య వరకు ఎంతోమంది హీరోయిన్లు కష్టాల్లో ఉండి పాట పాడగానే దేవుళ్లు ప్రత్యక్షమై కష్టాలు తీరుస్తారు కదా? మరి మనకు ఒక్క దేవుడు కూడా ప్రత్యక్షం కాడేం? దేవుడు మన భక్తిని తక్కువగా అంచనా వేస్తున్నాడా? ’’
‘‘కాదు.. మనను సరిగా అంచనా వేస్తున్నాడు కాబట్టే దేవుడు ప్రత్యక్షం కావడం లేదు. ప్రత్యక్షం అయితే తనను కూడా మేనేజ్ చేస్తారని దేవుని సందేహం.’’
‘‘దేవుడిని తక్కువగా అంచనా వేస్తున్నావ్’’
‘‘కాదు.. మనిషిని సరిగా అం చనా వేస్తున్నాను’’
‘‘మన దేశంలో 69 శాతం మంది నిజాయితీ పరులు ఉన్నారని ఓ సర్వేలో తేలింది. ’’
‘‘నువ్వు తప్పు చెబుతున్నావు. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ సంస్థ జరిపిన సర్వేలో మన దేశంలో 69 శాతం మంది లంచం ఇచ్చినట్టు తేలింది. ’’
‘‘పదాలు వేరు కానీ అర్ధం ఒకటే . 69 శాతం మంది లంచం ఇచ్చామని నిజాయితీగా చెప్పారు. మిగిలిన 31 శాతం మంది చెప్పలేదు.. అంతే తేడా! మార్చురీలోని శవాలు, ప్రభుత్వ కార్యాలయానికి జీవితంలో ఎప్పుడూ వెళ్లని మనుషులు తప్ప- జీవితంలో ఏదో ఒక సందర్భంలో లంచం ఇవ్వని మనిషిని ఒక్కరినైనా చూపిస్తావా?’’
‘‘నేను అడిగిన ప్రశ్నకు, నువ్వు చెప్పిన సర్వేకు సంబంధం ఏమిటి? ’’
‘‘ సంబంధం ఉంది. దేవుడు ప్రత్యక్షం అయితే ఆయనను కూడా మనం కరప్ట్ చేసి మన కోరికలు తీర్చుకుంటాం. కనీసం ఇప్పుడు- మరణంలోనైనా అంతా సమానులే. మనిషికి దేవుడు కనిపిస్తే ఆ ఒక్క దానిలోనూ సమానత్వం మిగిలేది కాదు. లంచాలిచ్చి కొందరు ఆయుష్షు కొనుక్కునే వాళ్లు. మనిషి శక్తి సామర్ధ్యాలు తెలిసే దేవుడు మనిషికి కనిపించే సాహసం చేయడం లేదు.’’
‘‘అవన్నీ సినిమాలు, నువ్వు సినిమాలను జీవితాన్ని కలిపేస్తున్నావ్’’
‘‘మన కళ్లకు కనిపించేది ఏదీ నిజం కాదు అంతా నటన అని వేదాంతం చెబుతోంది. సినిమా నిజం కాదు... మన జీవితం నిజం కాదు అంటే సినిమాలు, మన జీవితం ఒకటే అని కదా? అర్థం. ఎంతోకాలం తపస్సు చేసిన మహనీయులు మన జీవితం అంతా భ్రమ అని చెబితే, సాధారణ ప్రజలు కూడా సినిమా, జీవితం ఒకటే అని ఎప్పుడో గ్రహించారు. నాడు ఎన్టీఆర్‌ను ఆదరించినా, నేడు పవన్ కల్యాణ్‌పై ఆశలు పెట్టుకున్నా జీవితానికి, నటనకు తేడా లేదు.. అంతా నటనే అనే తాత్విక ధోరణే.’’
‘‘ఏదీ సరిగా మాట్లాడవా? ’’
‘‘ఏదీ సరిగా లేనప్పుడు, మాటలు మాత్రం సరిగా ఎలా వస్తాయి?’’
‘‘అటు చూడు.. పూరీలు లాగించేస్తున్న వాడెవడో పెద్ద మాఫియా అని నా అనుమానం’’
‘‘హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఎవరైనా సూర్యాపేటలో పూరీలు లాగించేస్తారు.. అతనూ అంతే’’
‘‘అతని చేతికి వాచీ ఉంది.. వేలికి ఉంగరం ఉంది... ప్లేట్ల కొద్ది పూరీలు లాగించేస్తున్నాడు. వేల కోట్ల ఆస్తి ఉండే ఉంటుంది’’
‘‘నేను నమ్మను’’
‘‘పొద్దునే్న చట్నీ లేకుండా రెండు ఇడ్లీలు, మధ్యాహ్నం ఆయిల్ లేకుండా రెండు పుల్కాలు మాత్రమే తింటానని.. చేతికి వాచీ లేదు, ఉంగరం లేని పేదను అని ఆ ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పారు గుర్తుందా? నెలకు రూపాయి జీతం తీసుకునే ఆయన దగ్గర ఏముంటుంది? ఐదు నెలల క్రితం ‘చినబాబు’ ఆస్తి 15 కోట్లు , అదిప్పుడు పిల్లలు పెట్టి 330 కోట్లు అయింది. చట్నీ లేకుండా ఇడ్లీ తినే వాళ్ల వద్దే ఇంత డబ్బుంటే ప్లేట్ల కొద్ది పూరీలు లాగించేస్తూ చేతికి వాచీ పెట్టుకున్న వాడి వద్ద ఎన్ని కోట్లుండాలి? ’’
‘‘పూవు పుట్టగానే పరమళించినట్టు చినబాబుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పడం తప్ప ఇంకేం చెప్పగలను? చినబాబు ఇడ్లీలు చట్నీతో తింటారో, చట్నీ లేకుండా తింటారో? సాంబారుతో తింటారో? ఇప్పటి వరకు చెప్పలేదు.’’?
‘‘ఇంతకూ ఏమంటావు?’’
‘‘ఆ మధ్య ఓ ఆయుర్వేద వైద్యశిఖామణి ఆరోగ్యం కోసం అందరూ ఉప్పు, నూనె లేకుండా పచ్చి కూరగాయలు తినాలని చెప్పేవారు. ఈ మధ్య ఆయనకు ఆరోగ్యం బాగా లేనట్టుంది.. ఎక్కడా కనిపించడం లేదు.’’
‘‘నేను కోటీశ్వరుడ్ని అయ్యే అవకాశం ఉందంటావా? ’’
‘‘చట్నీ లేకుండా ఇడ్లీ, ఆయిల్ లేకుండా పుల్కాలు తినడం అలవాటు చేసుకో.. ఏదో ఒకనాడు కోటీశ్వరుడివి అవుతావు’’
‘‘నా చర్మ సౌందర్య రహస్యం లక్స్ అని ఐశ్వర్యారాయ్ చెబుతుంది. మరి కొన్ని లక్షల మంది లక్స్ వాడుతున్నారు కదా? వాళ్లంతా యాక్టర్లు కావడం లేదేంటి? ’’
‘‘ నువ్వు చట్నీతో ఇడ్లీ తింటావు కాబట్టే నీకు ఇలాంటి తల తిక్క సందేహాలు వస్తాయి. నా మాట విని చట్నీ లేకుండా ఇడ్లీ తినడం అలవాటు చేసుకో, వందల కోట్లు వచ్చి పడతాయి’’
‘‘ఆకలితో నైనా చస్తా కానీ చట్నీ లేకుండా ఇడ్లీ తినను ’’
‘‘ఐతే నువ్వు ఎప్పటికీ సంపన్నుడివి కావు పో ’’
*

 - బుద్దా మురళి(జనాంతికం-10. 3. 2017)


3, మార్చి 2017, శుక్రవారం

కుక్కలొస్తున్నాయ్

‘‘ఏమైంది..? అలా ఉలిక్కిపడి లేచి పిచ్చిచూపులు చూస్తున్నారు? గ్యాస్ సిలిండర్‌కు వంద రూపాయలు పెంచగానే అలా వెర్రిచూపులు చూడాలా? అచ్చే దిన్ అంటే ఈ మాత్రం భరించాలి తప్పదు’’
‘ తగ్గితే పిచ్చిచూపులు చూస్తానేమో కానీ, బడ్జెట్ రోజు సిగరెట్ల ధర, రోజూ పప్పుల ధర, వారానికోసారి పెట్రోల్ ధర పెరిగితే ఆశ్చర్యపోయేంత పిచ్చోన్ని కాను.’’
‘‘మరి ఆ ఉలికిపాటు ఎందుకు?’’
‘‘కలలో కుక్కలు వస్తే అరిష్టమా? ’’
‘‘ఎవరికి నీకా? కుక్కలకా? ’’

‘‘అసలే గుండె దడగా ఉంది.. జోకులు వేస్తే నవ్వే స్థితిలో లేను. పిచ్చి పిచ్చి కలలు వచ్చాయి? ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. తెల్లవారు జామున వచ్చిన కలలు నిజం అవుతాయని అంటారు.. అందుకే నా భయం’’
‘‘సమయానికి గరికపాటి వారి ప్రవనచనాలు కూడా రావడం లేదు. ఆయనేమైనా చెప్పి ఉండేవారేమో? పేరును బట్టి ఫలితం ఉండొచ్చు. రావెల, దివాకర్ లాంటి పేర్లు ఉంటే కుక్కే కామధేనువు అవుతుంది. మన లాంటి వారికే కుక్కే ప్రాణాపాయం కావచ్చు ఇంతకూ మీ కలేంటో?’’
‘‘ఒకదానికొకటి సంబంధం లేకుండా పిచ్చిపిచ్చిగా కల వచ్చింది?’’

‘‘అర్ధరాత్రి వరకు న్యూస్ చానల్స్ చూస్తూ అలానే నిద్రలోకి జారుకుంటారు. బారెడు పొద్దెక్కిన తరువాత టీవిల్లో చర్చలను అలానే కలత నిద్రలో వింటారు. పిచ్చికలలు కంటూ లేచాక పిచ్చిమాటలు కాకుంటే ఇంకేం వస్తాయి?’’
‘‘ఇదిగో.. నేనేదో అడిగానని, నీ కోపం కూడా కలిపి చెప్పకు. తెలియక పోతే తెలియదను. మేధావులకు తెలియదు అనే పదం పలకడం రాదు. ఈ జాబితాలో నువ్వూ చేరుతున్నావా? ’’
‘‘మాటలు మర్యాదగా రానివ్వండి.. ఏమైనా అనండి కానీ మేధావి అంటే ఊరుకునేది లేదు’’
‘‘సర్లేవోయ్.. ఏదో చమత్కరించాను. భార్య మీద ఆ మాత్రం జోకులేసే అధికారం లేదా?’’
‘‘సరే.. ఇంతకూ ఏం కల వచ్చింది?’’
‘‘నీకో సంగతి తెలుసా? రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు పడడం వెనుక ఆశ్చర్యకరమైన విషయం ఉంది తెలుసా? నిజానికి అక్కడ అణుబాంబు వేయాలనేది అమెరికా ప్లాన్ కాదు. యుద్ధవిమానానికి కుక్క అడ్డు రావడం వల్ల ఎక్కడో వేయాలనుకున్న బాం బులు హిరొషిమా,నాగసాకిల్లో అణుబాంబులు పడ్డాయి’’
‘‘నిజమా..? రావెల కుమార రత్నం అమ్మాయి చేయి పట్టుకోవడానికి రోడ్డుపై అడ్డదిడ్డంగా పరిగెత్తిన కుక్కే కారణం, దివాకరుని బస్సు పడిపోయి పదిమంది చనిపోతే కుక్కే కారణం అని తెలుసు.. కానీ ఆకాశంలో కూడా కుక్కలుంటాయా? ’’
‘‘నువ్వు మరీ ఇలా అడిగితే నేనేం చెప్పాలి? నాకు కలలో కనిపించింది. చెప్పాను.. విమానంలోనే కుక్క అడ్డం వచ్చిందో లేక విమానానికి కుక్క అడ్డం వచ్చిందో అంత కరెక్ట్‌గా గుర్తు లేదు. కల కదా? ’’

‘‘సరే.. మీ కల మొత్తం చెప్పండి?’’
‘‘అమెరికాలో మన పిల్లలు ట్రంప్‌ను నిలదీశారు. ఔను.. మన పిల్లలు అమెరికాకు ఎప్పుడు వెళ్లారు?’’
‘‘ఆ.. మన పిల్లలు అమెరికాలో ట్రంప్‌కు బుద్ధి చెప్పారా? తుమ్మక ముందే ఊడిపోయే ప్రైవేటు ఉద్యోగం. పిల్లలను అమెరికా పంపేంత సీన్ మీకు లేదు, వెళ్లేంత సీన్ వాళ్లకు లేదు.. పనికి మాలిన కలలు. రెండు నెలల నుంచి సినిమాకు తీసుకెళ్లమని అడిగితే దిక్కు లేదు. పిల్లలు అమెరికాలోనట!’’
‘‘అబ్బా.. ఉండవే? ట్రంప్ అమెరికన్లకు ఇండియాలో ఆశ్రయం ఇవ్వాలని వేడుకుంటూ ఉత్తరం రాసినట్టు కలొచ్చింది’’
‘‘దీనికి ఉలికిపడడం ఎందుకు? ఏమో నిజం కావచ్చు. నేతల్లో నైతిక విలువలు, మన పాలకుల నోట్లో నిజాలు, గుంతలు లేని రోడ్లు, సమయానికి వచ్చే రైళ్లు, లంచాలు తీసుకోని ప్రభుత్వ ఆఫీసులు, గ్రహాంతర వాసులు, కాశ్మీర్ సమస్య పరిష్కారం, పాకిస్తాన్‌లో శాంతి, యోగా శిబిరాల్లో తాలిబన్లు, అమరావతికి దావోస్, మోత్కుపల్లికి గవర్నర్ పదవి.. ఏమో నిజం కావచ్చు.. ఎవరు చెప్పొచ్చారు?’’
‘‘ఇదిగో కల వచ్చింది.. నాకు నువ్వు చెబుతున్నవి ఎప్పటికీ జరగని కలలు’’

‘‘మిమ్మల్ని అంతగా భయపెట్టిన కలేంటో చెప్పండి.’’
‘‘ఒక్క క్షణం ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా విను. ఒకేసారి ఊర్లో ఉన్న కుక్కలన్నీ మనపైకి దాడి చేసి జీవితమంతా కష్టపడి కట్టుకున్న ఇంటిని స్వాధీనం చేసుకుని మనను బయటకు పంపిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించు’’
‘‘ఇదేం కల? ఇళ్లు, స్థలాలు, చివరకు శ్మశాన వాటికలైనా మనుషులు ఆక్రమిస్తారు కానీ- ఇదేం వింతండీ.. కుక్కలు ఆక్రమించుకోవడం ఏంటి? ’’
‘‘అదేనే- అడవిలో, గ్రామాల్లో, నగరంలో ఉన్న జంతువులన్నీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమావేశం జరిపాయి. తమ మనోభావాలను దెబ్బతీసిన మనుషులపై యుద్ధానికి సిద్ధం అయినట్టు కలొచ్చింది.

ప్రధానమంత్రిని ఓ నాయకుడు విమర్శిస్తే ఆయనేమో ‘ఔను.. నేను గాడిదనే నమ్మిన బంటును’ అంటూ మనల్ని కించపరుస్తున్నాడు. మనిషివా? పశువ్వా? అని ఒకరు, నీకన్నా కుక్కలు నయం అని ఒకరు, ఎక్కడ ఏం జరిగినా కుక్క అడ్డం వచ్చిందని మరొకరు.. ఇలా మనుషులు హీనంగా మన పేరును వాడుకుంటూ మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు.. అని జంతువులన్నీ సమావేశంలో మనుషులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి.  మనుషుల అంతు చూడాలని నిర్ణయించుకున్నాయి. కుక్క, నక్క, గాడిద  కూడా ఆవేశంతో  ఊగిపోతూ బాధ్యతలు మరిచి పోయిన మనుషులతో జంతువులను పోల్చడం జంతువుల హక్కుల ఉల్లంఘనే అని ఆగ్రహించాయి . 

. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నది మనుషులే కానీ జంతువులు కాదు. లంచం తీసుకునే ఒక్క కుక్కనైనా చూపించండి అంటూ కుక్కలు. మా తెరువు వస్తే వెనక కాళ్లతో తంతాం కానీ మేమేమన్నా తడిగొంతుతో ప్రాణాలు తీసే మనుషులమా? అని గాడిదలు. చీమ నుంచి ఏనుగు వరకు మనం అంతా ప్రకృతి ధర్మం ప్రకారం నడుచుకుంటాం. సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ఒక్కరూ నిజాయితీగా ఉండరు.. అలాంటి అల్ప మానవులతో మన జంతువులను పోల్చడమా? అని గండు చీమ ఆవేదనగా పలికింది. మనుషులు తమ మనోభావాలు దెబ్బతీశారని, మనుషులపై దాడికి మూకుమ్మడిగా వస్తున్నట్టు కల వచ్చింది. ప్రతి గల్లీ మాకు తెలుసు అని కుక్కలు ముందు పరిగెత్తుకొస్తూ దారి చూపుతుంటే వాటి వెనుక సమస్త జంతుజాలం వస్తోన్నట్టు కలొచ్చింది. తెల్లవారు జామున వచ్చిన కల నిజమవుతుందంటారు కదా?’’
‘‘నిజం అయితే బాగుండు!’’
- బుద్ధా మురళి (జనాంతికం 3.3. 2017)