30, నవంబర్ 2018, శుక్రవారం

‘నానో’ రాజకీయం!

అడిగిన చోటకు ఉద్యోగిని బదిలీ చేయకపోతే రాజీనామా చేసి రాజకీయ పార్టీ స్థాపిస్తారా?’’
‘‘ఎవరి గురించి..?’’
‘‘నన్ను ఎవరైనా పిలవండి వచ్చి చేరిపోతాను. వ్యవసాయ శాఖ మంత్రిని అవుతాను అన్నారు కదా?’’
‘‘ఎవరు?
‘‘ఏ పార్టీలో చేరాలనే ఆలోచన నుంచి కొత్త పార్టీ.. అటు నుంచి నడవని పార్టీని టేకోవర్ చేసుకోవడం, కొత్త పార్టీ మధ్య ఊగిసలాడుతున్నారు కదా? ’’
‘‘ఎవరిష్టం వారిది. ఫేస్‌బుక్ తరహాలో ప్రజల అభిప్రాయాలు పంచుకునే వేదికపై ఇటీవల ఒకరు- ‘కొందరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు ఎందుకు ఉద్యోగాలు వదిలేస్తున్నారు?’ అని అడిగారు. దానికో ఆలిండియా సివిల్ సర్వీస్ అధికారి స్పందిస్తూ- ‘రాజకీయ వత్తిడి వల్ల రాజీనామా అనేది తప్పు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. మా అమ్మకు క్యాన్సర్.. అమెతోనే ఉండాలని రాజీనామా చేశాను. నా గురువుకు పుస్తకాలు రాసుకోవడం ఆసక్తి దాని కోసం ఉద్యోగం వదిలేశాడు’ అంటూ తన మిత్ర బృందంలోని కొందరు ఏయే కారణాలతో సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేశారో చక్కగా రాశారు.’’
‘‘నేనడిగిందేమిటి? నువ్వు చెబుతున్నదేమిటి? ’’
‘‘మూడు దశాబ్దాల క్రితం ఇదే విధంగా ఎన్నికల సమయంలో మెదక్ జిల్లాలో బిఎన్ శాస్ర్తీ అనే బ్యాంకు అధికారి కాంగ్రెస్ నేత బాగారెడ్డిపై ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమయ్యాడు. బ్యాంకు ఉద్యోగులకు ఓ సౌలభ్యం ఉంది. ఉద్యోగంలో ఉంటూ ఇండిపెండెంట్‌గా పోటీ చేయవచ్చు. అప్పట్లో బాగారెడ్డికి మెదక్ జిల్లాలో తిరుగులేదు. బ్యాంకు అధికారి శాస్ర్తీ కొన్ని వాహనాలను సమకూర్చుకున్నాడు, కార్యకర్తలను మాట్లాడి పెట్టుకున్నాడు. ఎన్నికల్లో పోటీ గురించి అతను చెబుతుండగా, మనలాంటి పెద్ద మనిషి ఒకరు- ‘చూడోయ్.. బాగారెడ్డి అంటే ఆషామాషీ కాదు. చేతి చమురు వదలడం తప్ప నువ్వు చేసేదేమీ లేద’ని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ మెదడులో అలోచనలను ప్రోది చేసుకుని వాటిని మాటలుగా మార్చి వివరించడానికి సిద్ధమవుతుండగా, బిఎన్ శాస్ర్తీ ఆవేశంగా- ‘ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటి? అని ప్రతివాడూ నీతులు చెప్పడమే..’ అంటూ తన వాదన ప్రారంభించాడు’’
‘‘ఏమని?’’
‘‘నా డబ్బు- నా ఇష్టం. ఒకడికి తాగుడు అలవాటుంటుంది. మరొకడికి పేకాట, గుర్రప్పందాలు, జూదం అలవాటు ఉంటుంది. ఈ అలవాట్లతో వాళ్లు సంతోష పడతారు. వాళ్లకు ఆ వ్యసనం ఉన్నట్టే నాకు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. ‘బిఎన్ శాస్ర్తీ జిందాబాద్’ అంటూ వాహనాల్లో పదిమంది కార్యకర్తలు ఊరేగుతుంటే వచ్చే కిక్కే వేరు. మందు కొట్టినా ఆ కిక్కు రాదు. మందుకిక్కు కొన్ని గంటలైతే ఎన్నికల్లో పోటీ చేసే కిక్కు జీవితమంతా ఉంటుంది. నేను సంపాదించిన డబ్బును నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తా.. అడగడానికి వీళ్లెవరు? చెప్పన్నా నా అభిప్రాయం కరెక్టా? కాదా? అంటూ ప్రశ్నించగానే- అప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల డబ్బు వృథా అని చక్కగా బోధించాలని అనుకున్న నేను అవాక్కయ్యాను. ఇంకా నయం..! శాస్ర్తీ నోరు తెరవక ముందే నా అభిప్రాయం చెప్పి ఉంటే నా పరువు పోయేది.. నువ్వెవడివి సలహా ఇవ్వడానికి.. నా డబ్బు- నా ఇష్టం అనేవాడే’’
‘‘ఇంతకూ శాస్ర్తీ పోటీ చేశాడా?’’
‘‘చేశాడు.. బాగారెడ్డి భారీ మెజారిటీతో గెలిచాడు. తనకు ఎన్ని ఓట్లు వచ్చాయో శాస్ర్తీ పట్టించుకోలేదు, నేనూ పట్టించుకోలేదు. పోటీ చేయడం, నలుగురూ తన గురించి మాట్లాడుకోవడం మాత్రమే అతని లక్ష్యం. అతని లక్ష్యం నేరవేరింది. దానికి కొంత ఖర్చయిందనుకో.. మద్యం, జూదంతో పోలిస్తే ఇది తక్కువ ప్రమాదకరమైన వ్యసనమే కదా? ఆ శాస్ర్తీ ఉదంతం నాకు ముప్పయి ఏళ్ల క్రితమే మంచి నీతిని బోధించింది’’
‘‘ఏంటది?’’
‘‘ఎవడి లెక్కలు వాడికి ఉంటాయి. ఆ లెక్కలు తెలియకుండా జ్ఞానబోధ చేయాలనుకుంటే పప్పులో కాలేస్తాం అని తెలిసొచ్చింది. నిజానికి ఎన్నికల గురించి శాస్ర్తీకి ఆ రోజు నేనే బోధించాలని బోలెడు హోంవర్క్ చేసి సిద్ధపడి వెళ్లాను. కానీ తీరా అతడే నాకు బోలెడు జ్ఞానం బోధించాడు. ’’
‘‘ఈ ‘కొత్త పార్టీ ఆయనకు’ ఏం లెక్కలుంటాయి?’’
‘‘రెండు దశాబ్దాల క్రితం ఓ పార్టీ ఆధ్వర్యంలో చంపాపేటలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే వారు. ఆ పార్టీ అధినేత ప్రారంభోపన్యాసం ముగియగానే మీడియా కొంత దూరం వచ్చాక ఒక నాయకుడు డాక్టర్ జంటను మీడియాకు పరిచయం చేశాడు. శిక్షణ తరగతుల్లో ఈ జంట వైద్య సహాయ శిబిరం నిర్వహిస్తోంది అని, వెంటనే ఆ మహిళా డాక్టర్‌ను- మీరు ఏ నియోజకవర్గం ఆశిస్తున్నారని ప్రశ్నించాను. అతని పరిచయానికి నా ప్రశ్నకు అస్సలు సంబంధం లేదు. కానీ కొన్ని రోజులకు ఆ లేడీ డాక్టర్ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రాజకీయాల గురించి ఈ మధ్య ఓషో వీడియో ప్రసంగం వింటుంటే ఇది గుర్తుకొచ్చింది. నాయకులు తొలుత ఏదో ఒక సేవా కార్యక్రమాల ద్వారానే రాజకీయాలు ప్రారంభిస్తారని ఓషో రాజకీయాల స్వరూపం గురించి వివరించారు. యూ ట్యూబ్‌లో వీడియో ఉంది.. ఆసక్తి ఉంటే దాన్ని చూడు..’’
‘‘ఓషో రాజకీయ నాయకుడా?’’
‘‘కాదు. సర్వం తెలిసిన వాడు. అతనికి రాజకీయమే కాదు తెలియనిది ఏదీ లేదు. మర్రి వృక్షం కూడా చిన్న విత్తనంతోనే ప్రారంభం అవుతుంది. ఏదో ఒక రూపంలో సేవ ద్వారానే రాజకీయాలు మొదలవుతాయి. అది వేసవిలో మంచి నీటి ట్యాంకుల సరఫరా కావచ్చు, రక్తదాన శిబిరాలు, కుల భోజనాల్లో వాటర్ బాటిల్స్ పంపిణీ.. ఇలా సేవారూపం ఏదైనా కావచ్చు. నియోజకవర్గ స్థాయిని బట్టి, నాయకుని స్థాయి బట్టి సేవ ఉంటుంది. ఐతే సేవ చేసేవారందరి లక్ష్యం అదే అని నేను అనడం లేదు. మానసిక తృప్తి కోసం సేవ చేసే వారు కూడా ఉంటారు. ఆ స్టైల్ వేరుగా ఉంటుంది.’’
‘‘సరే.. కొత్త పార్టీకి గిరాకీ ఎలా ఉంటుందంటావు’’
‘‘నానో కారు మార్కెట్‌లోకి విడుదల చేసినప్పుడు టాటా ఎన్నో ఆశలు పెట్టుకొని భావోద్వేగంతో విడుదల చేశారు. మూసేసినప్పుడు కూడా అంతే భావోద్వేగం చూపారు. నానో కారును నేను అద్భుతంగా నడిపిస్తానని ఎవరైనా ముందుకు వస్తే మనమెందుకు వద్దనాలి. టేకోవర్ చేసిన ఎన్నో కంపెనీలు బాగా నడిచిన ఉదంతాలు ఉన్నాయి. నడవనివీ ఉన్నాయి. ఎవరి బడ్జెట్ లెక్కలు వారికుంటాయి. ఏం జరుగుతుందో చూద్దాం...’’
*

బుద్దామురళి (జనాంతికం 30-11-2018)

26, నవంబర్ 2018, సోమవారం

డబ్బు మహత్యం

సతీ సక్కుబాయి, సతీ అనసూయ, సంతోషీమాతా సినిమా పేర్లు ఏదైతేనేం కానీ పతివ్రతల కథల సినిమాల్లో ఓ దృశ్యం తప్పనిసరిగా కనిపిస్తుంది. భక్తురాలిని వేధించేందుకు ఇంట్లో పాత్రలను, బట్టల మూటను ఆమె ముందు వేస్తారు. గుట్టల్లా పేరుకుపోయిన ఆ పాత్రలు, బట్టలు చూడగానే సినిమా చూసే ప్రేక్షకులు జాలితో కరిగిపోతారు. పాపం ఆమె ఒక్కత్తె ఆ పని ఎలా చేస్తుందా? అని బాధపడతారు. ఇంతలోనే ఆ భక్తురాలిని కాపాడేందుకు ఏ దేవతో తన మంత్రశక్తితో ఆ పాత్రలను కడిగేస్తుంది. బట్టలు ఉతికేస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటారు.
కోరుకుంటే అలాంటి మాయలు మంత్రాలు మనకూ సాధ్యమే. అంటే మనం మహాభక్తులం కాబట్టి ఏ దేవుడో మన కోసం ఆ పని చేస్తాడని కాదు అర్థం. మనం ఇతరుల సమయాన్ని కొనుక్కోని ఆ పని చేయించవచ్చు.
సమయాన్ని కొనుక్కోవచ్చు. డబ్బుతో పని చేయించవచ్చు. ఈ రెండూ తెలిసిన వారు సంపన్నులు అవుతారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క క్షణాన్ని కూడా కొనలేం అంటారు. ఇలాంటి మాటలు కథలు, కవితల వరకు నిజమే కాని సంపద మొత్తం సమయాన్ని ఖరీదు చేసుకొనే వారి వద్దనే ఉంటుంది.
సమయాన్ని కొనుక్కోవచ్చు. సమయాన్ని కొనుక్కొనే టెక్నిక్ తెలియడం వల్లనే కొందరు సంపన్నులు అవుతున్నారు. కొందరు గానుగెద్దుల్లా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోతున్నారు.
ఉదాహరణకు మీ నెల జీతాన్ని గంటల్లోకి మారిస్తే మీరు గంటకు మూడు వందల రూపాయలు సంపాదిస్తారు. మీ ఇంటి పనికి పనిమనిషి గంట సంపాదన వంద రూపాయలు అనుకుందాం. మీ ఇంటి పని మీరు చేయడంకన్నా ఇతరులకు వంద రూపాయలు ఇచ్చి ఆ పని చేయించినప్పుడు మీ వద్ద గంట సమయం ఉంటుంది. వంద రూపాయలతో మీరు గంట సమయాన్ని కొనుక్కున్నారు. ఆ సమయాన్ని మీరు మూడు వందల రూపాయలు సంపాదించేందుకు ఉపయోగించవచ్చు. ఎందుకంటే మీ సంపాదన విలువ గంటకు మూడు వందలు. ఇదో ఉదాహరణ మాత్రమే కచ్చితమైన లెక్క కాదు. తెలియని వారు జీవితమంతా బతకడానికే కష్టపడుతుంటారు. సమయాన్ని కొనుక్కోవడం వల్ల మనకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మన సమయం విలువను ఎప్పటికప్పుడు పెంచుకొనే ఆలోచన చేయవచ్చు. సంపన్నులను సంపన్నులుగా మార్చేది ఇతరుల సమయాన్ని కొనుక్కొనే విధానమే.
ఒక ఐటి కంపెనీలో ఓ పది మంది పని చేస్తున్నారని అనుకుందాం. ఒక్కొక్కరి నెల జీతం 50 వేల రూపాయలు అనుకుంటే నెలకు వీరికి చెల్లించే జీతం ఐదు లక్షలు. పది మంది ఉద్యోగుల నెల సమయాన్ని కొనుక్కునే యజమాని వీరి పని ద్వారా నెలకు పది లక్షలు గడించవచ్చు.
అంటే ఐదు లక్షలకు కొనుక్కున్న సమయాన్ని పది లక్షలకు అమ్ముకుంటాడు. ఉద్యోగులతో పది లక్షల రూపాయల విలువైన పని చేయిస్తారు. ఒక్కో ఉద్యోగి చేసే పనిని మదింపు చేసి ఉద్యోగికి చెల్లించే జీతాన్ని మించి పని చేసినప్పుడే కొనసాగిస్తారు. లేకపోతే ఇంటికి పంపిస్తారు. ఏ ప్రైవేటు సంస్థలోనైనా జరిగేది అదే.
సమయాన్ని కొనుక్కోవడం అనేది ఏ ఐటి కంపెనీకో వేలాది మంది పనిచేసే సంస్థకో పరిమితం కాదు. ఇంట్లో పనిమనిషి కావచ్చు, రచయితలు, టెక్నీషియన్లు కావచ్చు. కిరాణా షాపు కావచ్చు. ఇంటింటికి వెళ్లి వస్తువులు విక్రయించే సేల్స్‌మెన్, సేల్స్ ఉమెన్ ఎవరైనా కావచ్చు. ఏదో ఓ రంగం నుంచి డబ్బు సంపాదించడానికి మనకు అవగాహన ఉంటే ఇతరుల సమయాన్ని తక్కువ ధరకు కొనుక్కుని, మన తెలివి జోడించి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు.
డబ్బుతో పని చేయించడం...
మనం ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకొంటే మన తరఫున ఎవరైనా పని చేసి డబ్బు సంపాదిస్తే ఎంత బాగుంటుంది. మనం ఇంట్లో మనకు నచ్చిన ‘మాయాబజార్’ సినిమానో ‘పోకిరీ’ సినిమానో చూస్తూ గడిపేస్తుంటే మన తరఫున ఎవరైనా పని చేస్తూ మనకు నెల నెలకు కావలసిన డబ్బులు ఇస్తే ఎంత బాగుంటుంది. కవితలు రాయడం, కథలు రాయడం మనకు ఆసక్తి. మిత్రులతో కవితా గోష్ఠులు, కథా పఠనాల్లో మనం జీవితాన్ని అనుభవిస్తుంటే నెలనెల మన ఖర్చులు వాటంతట అవే వచ్చి పడితే ఎంత బాగుంటుంది. కలలు కనడానికి బాగానే ఉంది. ఇది సాధ్యమా? అంటే ఎందుకు సాధ్యం కాదు. సాధ్యమే.
చాలా మంది రాజకీయ నాయకులు నిరంతరం ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగి పోతారు. ఇలాంటి వారికి డబ్బులు ఎలా అంటే డబ్బులతో పని చేయించడం వారికి తెలుసు కాబట్టి. రాజకీయ నాయకులు అక్రమాలు అక్రమ సంపాదన అనే విమర్శల సంగతి పక్కనపెడితే చాలామంది రాజకీయ నాయకులు నెలనెలా తమ ఖర్చులకు సరిపడా ఆదాయం కోసం ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. డబ్బు సంపాదించేందుకు మనమే కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బు డబ్బును సంపాదిస్తుంది. ముందు నుంచే ఒక క్రమపద్ధతిలో మన కోసం సంపాదించేందుకు కొంత డబ్బు సమకూర్చుకోవాలి. కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న సంపన్నులే కాదు, చిరుద్యోగులు సైతం ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే సంపాదన కోసం తాము కష్టపడటమే కాదు, తమ తరఫున తమ డబ్బు పని చేసే విధంగా పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌పై దృష్టి సారించాలి. నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగి ఓ 30 శాతం జీతం అనుకొంటే ఓ భవనంపై నెలకు లక్ష అద్దె రూపంలో సంపాదించేవారు ఉన్నారు. ఎప్పుడో ఇంటిపై పెట్టిన పెట్టుబడి నెలకు లక్ష రూపాయలు జీతంలా సంపాదించి పెడుతుంది. చాలామంది రాజకీయ నాయకులు ఇలా భారీ ఎత్తున కమర్షియల్ భవనాలపై పెట్టుబడి పెట్టి అద్దెలతో జీవించేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది మంచి అద్దెలు వచ్చే ఇళ్లను నిర్మించి రిటైర్మెంట్ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. పెన్షన్ మొత్తాన్ని మించి అద్దె సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. డబ్బు డబ్బును సంపాదిస్తుంది అనే విషయం ఎంత త్వరగా గుర్తిస్తే భవిష్యత్తు ప్రశాంత జీవనానికి అంత ముఖ్యం.
మరెందుకాలస్యం? మీ డబ్బుకు డబ్బును సంపాదించే పనిని వెంటనే అప్పగించండి.
-బి.మురళి( 25-11-2018)

24, నవంబర్ 2018, శనివారం

బేతాళుడూ విప్పలేని చిక్కుముడి!

‘‘రావోయ్.. కాంపోజిట్ మాథ్స్.. రా..!’’
‘‘ఎంతకాలానికి వినిపించిందిరా..! ఆ పిలుపు.. దేశాలు తిరిగాం, ఎంతో జీవితాన్ని చూశాం. నాలుగు దశాబ్దాల తరువాత కాంపోజిట్ మాథ్స్ అంటూ నువ్వు పిలిచిన పిలుపుతో మరోసారి బాల్యంలోకి వెళ్లినట్టుంది. మన బ్యాచ్‌లో మీరంతా టెన్త్‌లో జనరల్ మాథ్స్ తీసుకుంటే నేనొక్కడినే కాంపోజిట్ మాథ్స్ తీసుకున్నా.. అప్పుడు నా పేరు కన్నా- ఈ పేరుతోనే పిలిచేవారు మీరంతా’’
‘‘సరే లేరా! నువ్వు లెక్కల్లో చాలా క్లవర్‌వి కదా? నీకో చిన్నలెక్క చెబుతా.. సమాధానం ఇస్తావా..?’’
‘‘తిరుపతిలో లడ్డూలు, ఆర్‌బిఐలో డబ్బులు ఎలానో నా బుర్రలో లెక్కలు అలా.. ఏమడుగుతావో అడుగు.. పదహేడవ ఎక్కం కింది నుంచి పైకి చెప్పాలా? పై నుంచి కిందికి చెప్పాలా? పోనీ 37వ ఎక్కం చెప్పమంటావా? అదీ కాదంటే 12346ను 14తో భాగిస్తే ఎంత అవుతుందో చెప్పాలా? 12తో హెచ్చిస్తే ఎంతవుతుందో చెప్పాలా?’’
‘‘తొందర వద్దు అడుగుతా.. అనగనగా ఒక రాజ్యం.. అక్కడ మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికలకు వెళుతున్నారు.’’
‘‘డొంక తిరుగుడు ఎందుకు? తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి.. వాటికి ఎన్నికలు జరుగుతున్నాయని సూటిగా అడుగు’’
‘‘నేను అడిగేది అడుగుతా! నువ్వు ఊహించుకునేది ఊహించుకో’’
‘‘సరే అడుగు’’
‘‘119 నియోజకవర్గాల్లో హస్తం, ప్రొఫెసర్, ఎరుపు, చెరుకు, సైకిల్ పార్టీలు ఒక బృందంగా ఏర్పడి పోటీ చేయాలనుకున్నాయి. మొదట్లోనే ‘చెరుకు’ను పిప్పిలా పక్కన పడేశారు. ఇక మిగిలినవి నాలుగు. ప్రొఫెసర్ 30 స్థానాలను డిమాండ్ చేసి చివరకు 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు వాటి పేర్లు అధికారికంగా ప్రకటించారు. 14 చోట్ల నామినేషన్ వేశారు .8 మావే అన్నారు. మూడు మాత్రమే మిగిల్చారు. బృందంలో పెద్దన్న హస్తం మాత్రం చివరకు ప్రొఫెసర్‌కు ఎనిమిది స్థానాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో మూడు స్థానాల్లో హస్తం వారికి అవకాశం ఇచ్చారు. మరో దానిలో సైకిల్ వెళ్లింది. సైకిల్‌కు పధ్నాలుగు ఇచ్చారు. ఇవి సరిపోవు.. ఇంకో నాలుగైనా కావాలని ఆడిగి, పన్నెండుచోట్ల నామినేషన్లు వేసి, ఒకటి గాలికి వదిలేశారు. ‘ ఒకటి మరిచి పోయారు.ఎర్ర’ పార్టీ డజను సీట్లు అడిగి, ఐదింటితో సంతృప్తి చెందుతామంటే మూడిచ్చారు. ఒక చోట వెన్నుపోటు, రెండింటిలో సహాయ నిరాకరణ, ఇంకోచోట అష్టకష్టాలు. కథ విన్నావు కదా? ఇప్పుడు చెప్పు ఇందులో బృందంలోని పార్టీల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది? ఎన్ని స్థానాల్లో బృందం సభ్యుల మధ్య స్నేహ పూర్వక పోటీ ఉంది. ఎన్ని చోట్ల వెన్నుపోట్లు? ఎన్ని చోట్ల అగచాట్లు చెప్పు? ఎన్ని చోట్ల తిరుగుబాట్లు ’’
‘‘ఇదేం లెక్క.. అస్సలు అర్థం కాలేదు’’
‘‘అర్థం కాలేదా? సమాధానం చెప్పలేవా? పత్రికలు చూస్తున్నావా? చూడు అభ్యంతరం లేదు. పత్రికలు చూడు, క్యాలిక్యులేటర్ ఉపయోగించుకో, ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో సంప్రదించు, బృందంలోని పార్టీల నాయకులకు ఫోన్ చేసి తెలుసుకో.. అభ్యంతరం లేదు.’’
‘‘ఒక్కో పత్రికలో ఒక్కో లెక్క వేశారు. సమాధానం ఎలా చెప్పాలి?’’
‘‘చిన్నప్పుడు టెన్త్‌లో కాంపోజిట్ మాథ్స్ తీసుకున్నోడివి- 119 సీట్ల లెక్క చెప్పలేవా? ల్యాప్‌టాప్ తీసుకో నోప్రాబ్లమ్’’
‘‘బుర్ర వేడెక్కుతోంది’’
‘‘సరే కొద్ది సేపు ఇతర విషయాలు మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ అందరం జనరల్ మాథ్స్ తీసుకుంటే నీకు కాంపోజిట్ మాథ్స్ తీసుకోవాలని ఎందుకనిపించిందిరా?’’
‘‘నిజం చెప్పాలంటే మనమంతా ఒక గ్రూప్‌గా ఉన్నా నేను మీ అందరి కన్నా తెలివైన వాడినని గుర్తింపు పొందాలన్న ఆశ బలంగా ఉండేది. మీతో ఉన్నంత వరకు నన్ను కూడా అందరిలో ఒకడిగానే చూసిన వరలక్ష్మితో పాటు నేను కాంపోజిట్ మాథ్స్ తీసుకోగానే నన్ను ఎంత ఆరాధనగా చూసిందో తెలుసా? మేం స్కూల్ ముగిశాక మా కాలనీలో కలుసుకుని మాట్లాడుకునే వాళ్లం. ’’
‘‘ఆ సంగతి మాకు తెలుసులేరా! మన మల్లేష్ గాడు అంతకు ముందు వరకు ఆ అమ్మాయిని మూగగా ఆరాధించే వాడు. మాట్లాడే ధైర్యం చేయలేదు. ఈ లోపు నువ్వు లైనేశావు. వాడు ఆ రోజు నుంచే తన జీవితం ముగిసిపోయిందని అనుకున్నాడు పాపం..’’
‘‘మీరంతా నన్ను చూసి కుళ్లుకుంటుంటే నేను ఎంజాయ్ చేసేవాడ్ని.. ఏదో బాల్యం.. తెలియని తనం.’’
‘‘ఇప్పుడు చెప్పు 119 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?’’
‘‘పోనీ- ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పాలా?’’
‘‘నేను సూటిగా అడిగాను. 119 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని?’’
‘‘సమాధానం చెప్పడం నా వల్ల కాదు. నువ్వు చెప్పు?’’
‘‘నేను చెబుతాననలేదు. నిన్ను చెప్పమని అడిగాను. కాంపోజిట్ మాథ్స్‌తో టెన్త్ చదివిన లెక్కల మేధావివి.. చెప్పలేవా?’’
‘‘చెప్పలేను, నువ్వు చెప్పురా! లెక్క విన్న తరువాత బుర్ర పని చేయడం లేదు. ఇంటికి వెళ్లినా ప్రశాంతంగా ఉండలేను. నీకు తెలుసు కదా? నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా లెక్క వింటే అది సమాధానం తెలియనిదే నిద్ర పట్టదు.’’
‘‘సమాధానం నీకే కాదు, నాకూ తెలియదు. ఇన్ని దశాబ్దాల నా కసి ఇప్పుడు తీరిందిరా! నాలుగు దశాబ్దాల క్రితం లెక్కల్లో తెలివైన వాడినని నువ్వు విర్ర వీగితే మేం మనసులో ఇంత కాలం ఎంత మథనపడ్డామో నీకేం తెలుసురా?’’
‘‘ఐతే అమరావతి వెళ్లొస్తా’’
‘‘ఆయనకూ తెలియదు. 2009 నాటి కూటమిలో ఎవరికెన్ని సీట్లో ఇప్పటి వరకు లెక్క తేలలేదు. 2018ది ఎప్పుడు తేలాలి?’’
‘‘సమాధానం లేని లెక్క అంటే నాకు నిద్ర పట్టదు. ఏదో ఒక మార్గం చెప్పు’’
‘‘లెక్కల్లో నీ తెలివితో మేం నాలుగు దశాబ్దాలు క్షోభ అనుభవించాం. ఇప్పుడు నీ వంతు. దీంతోనైనా మా క్షోభ నీకు అర్థం అవుతుంది.’’
‘‘చెప్పరా ఎవరికెన్ని స్థానాలో..’’
‘‘పెద్ద పెద్ద ప్రొఫెసర్లకే సమాధానం తెలియదు. నువ్వు, నేను ఎంత? బేతాళుడు కూడా చెప్పలేని చిక్కు ప్రశ్న ఇది. ’’
‘‘బాల్య స్నేహితుడిని ఇలా అమానుషంగా హింసించడం అన్యాయం. నాలుగు దశాబ్దాలు నువ్వు ఇంత కసితో రగిలిపోతున్నావని, ఆ కక్ష నీలో ఇంత బలంగా ఉందని ఊహించలేదు. సమాధానం తెలిసే దాకా నిద్ర పట్టదు. ఎవరికెన్ని సీట్లో చెప్పి పుణ్యం కట్టుకో ప్లీజ్..’’
బుద్దా మురళి (జనాంతికం 23-11-2018) )
*

22, నవంబర్ 2018, గురువారం

మనిషికున్న వరం

మనం బల్లిని చూసినా భయంతో కేకలు పెడతాం. దోమలు కూడా మనల్ని ఆటాడుకుంటాయి. కంటికి కనిపించని చిన్నచిన్న సూక్ష్మ జీవులు కూడా కొన్ని విషయాల్లో మన కన్నా శక్తివంతమైనవి. ఇక సింహం, పులి వంటి కూృర జంతువులను చూస్తే మనం వణికిపోవలసిందే. మన కన్నా ఎన్నో రెట్లు పెద్దదైన ఏనుగు, అడవికి రాజైన పులి వంటి జంతువులు. అనేక విషయాల్లో జంతువులు మనకన్నా ఎన్నో రెట్లు బలవంతమైనవి. ఇంతటి శక్తివంతమైన జంతువులు సైతం తమ ఆహారాన్ని ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకోవలసిందే. అంతే తప్ప నేను పులి రాజును నెల రోజులకు అవసరం ఐన ఆహార పదార్థాలు ఒకే రోజు తెచ్చిపెట్టుకుంటాను అంటే కుదరదు.
ఈ విషయంలో ఒక్క మనిషికి మాత్రమే అద్భుతమైన అవకాశం ఉంది. కానీ చాలా మంది మనుషులకు ఈ విషయం తెలియదు. తెలిసిన రోజు, అర్థం చేసుకున్న రోజు అదృష్టవంతునిగా మారుతాడు.
చిన్నా పెద్దా అనే తేడా లేదు ఏ జంతువైనా ఎప్పటి ఆహారాన్ని అప్పుడే సంపాదించుకోవాలి. కానీ మనిషి మాత్రం జీవిత కాలం మొత్తానికి కావలసింది కొద్ది కాలంలో సంపాదించుకోవచ్చు.
ఒక వ్యక్తికి నెల రోజుల ఇంటి ఖర్చు పాతిక వేల రూపాయలు అనుకుందాం. పక్షులు, జంతువుల తరహాలో ఎప్పటికప్పుడు వీటిని సంపాదించాల్సిందే. చాలా మంది చేసేది అదే. కానీ కొద్ది శాతం మంది మాత్రమే దీనికి భిన్నంగా ఆలోచించి, మనుషులకు ఉండే వరాన్ని ఉపయోగించుకుంటారు.
మనిషి తనకు శక్తిసామర్థ్యాలు ఉన్నంత వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండాల్సిందే. చేయాలి కూడా. కానీ ఇల్లు గడవడం కోసం చేసే పనికి ఆసక్తితో చేసే పనికి తేడా ఉంటుంది.
ఇరవై ఐదు వేల రూపాయలు నెలకు ఇంటి ఖర్చు అనుకున్నప్పుడు ఎంత త్వరగా మనం పని చేయకపోయినా నెలకు 25వేల రూపాయలు వచ్చే ఏర్పాటు మనం చేసుకుంటామో అప్పుడు మనకు ఆర్థిక స్వేచ్ఛ లభించినట్టు. ఒకవైపు పదవీ విరమణ వయసు పెంచాలనే డిమాండ్ వినిపిస్తుండగా, కొంత మంది యువత అదే సమయంలో ఎర్ల్రీ రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఇల్లు గడవడానికి నెలకు పాతిక వేలు అవసరం అయితే అప్పటి వరకు తాను చేస్తున్న ఉద్యోగం మానేసినా నెలకు 25వేల రూపాయలు వచ్చే ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు జీవించడం కోసం ఉద్యోగం అనే అవసరం తీరిపోతుంది. అప్పుడు తనకు నచ్చిన విధంగా ఆ వ్యక్తి బతక వచ్చు. అంటే దాని అర్థం పనీ పాటా లేకుండా జులాయిగా తిరగడం అని కాదు. కొందరికి నటన ఇష్టం కావచ్చు, రాయడం ఇష్టం కావచ్చు, సినిమాలు తీయడం, షార్ట్ ఫిల్మ్‌లు తీయడం, ఏదో ఒక కళలో ఆసక్తి ఉండవచ్చు. ఆసక్తిని చంపుకుని జీతం కోసం ఉద్యోగం చేస్తారు. సంపాదించిన జీతం నుంచి క్రమ పద్ధతిలో పొదుపు చేసి దానిని ఆదాయం వచ్చే వాటిలో ఇనె్వస్ట్ చేస్తే కొంత కాలానికి జీతానికి మించి ఈ పెట్టుబడిపై ఆదాయం వస్తుంది. ఐతే దీని కోసం రిటైర్‌మెంట్ దశలో ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం ఏదైనా కావచ్చు. సంపాదన మొదలు పెట్టిన ప్రారంభం నుంచే పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభిస్తే కొంత కాలానికి జీతాన్ని మించిన ఆదాయం పొందవచ్చు. అప్పుడు జీవితాన్ని తమకు నచ్చిన విధంగా జీవించవచ్చు.
జంతువులు, పక్షులకు లేనిది మనకున్న అద్భుతమైన వరం ఇదే. ఎంత బలవంతమైన జంతువు కూడా జీవిత కాలం మొత్తానికి కావలసింది సంపాదించుకోలేదు. మనిషి అలా చేయగలడు. తొందరగా రిటైర్ కావడం అంటే ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం అని కాదు. తనకు నచ్చిన పని చేస్తూ సంపాదించడం. చాలా మంది విషయంలో ఇలా తమ జీతానికి మించి సంపాదించిన వాళ్లు, సంపాదిస్తున్న వాళ్లు ఉన్నారు. ఉద్యోగం వదిలి బయటకు వెళ్లి నచ్చిన పని చేద్దాం అంటే ఆ పనిలో సక్సెస్ కాకపోతే ఎలా అనే అనుమానం మనల్ని వెంటాడుతుంది. కానీ జీతానికి సరిపోయే ఆదాయం సమకూర్చుకున్న తరువాత ఉత్సాహంగా నచ్చిన పని చేస్తూ గతంలో కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్లు, జీవితాన్ని నచ్చిన విధంగా జీవిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఇటీవల ఎర్ల్రీ రిటైర్‌మెంట్ అనే భావన చాలా బలంగా వినిపిస్తోంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ కోణంలో యువత ఆలోచిస్తోంది.
ఉత్తరాదిలో ఇటీవల ఒక ఐఎఎస్ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. సివిల్ సర్వీస్‌లో ఉన్న వాళ్లు ఇలా మధ్యలోనే ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెడుతున్నారు. అని కోరాలో ఒకరు ప్రశ్నించగా, తన సొంత కారణంతో పాటు తనకు పరిచయం ఉన్న పలువురు అధికారులు ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టారో వివరించారు.
రాజకీయ వత్తిడి అనే కారణం ప్రచారం జరుగుతున్నా అది నిజం కాదని, ప్రారంభంలో ఉద్యోగం సంపాదించడమే ముఖ్యం అనే భావన ఉంటుందని కానీ కొంత కాలం తరువాత తమకు నచ్చిన పని చేయాలనే ఆలోచన వల్ల మధ్యలోనే ఉద్యోగాన్ని వదిలివేస్తున్నారని తన మిత్రులు కొందరి గురించి వివరించారు. సీనియర్ ఐఎఎస్ అధికారి ఒకరికి రచనలు చేయడం ఇష్టం. జీతం లేకపోయినా బతికే ఆర్థిక స్థోమత వచ్చిన తరువాత అతను కేవలం రాయడం కోసమే ఉద్యోగం వదిలిపెట్టారు.
అఖిలభారత స్థాయిలో లక్షలాది మందితో పోటీ పడి సంపాదించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్‌లో ఉన్నవాళ్లు సైతం తమకు నచ్చిన పని చేసేందుకు ఉద్యోగాలు వదిలివేయగలుగుతుండడాన్ని గమనించాలి. జీవితం ఒకటే . జీవితమంతా ఇష్టం లేని పనిని కేవలం జీతం కోసం చేస్తూ జీవితాన్ని ముగించే బదులు ఉద్యోగంలో చేరిన మొదట్లోనే కనీసం పది శాతం జీతాన్ని దీర్ఘకాలిక ఇనె్వస్ట్‌మెంట్ కోసం పక్కన పెడితే, అలా పక్కన పెట్టిన డబ్బే కోరుకున్న విధంగా జీవించేందుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.
ఐటి కంపెనీల్లో పెద్ద జీతంతో చేరిన యువతకు డబ్బుకు సంబంధించి ఇలాంటి అవగాహన ఉన్నప్పుడు దాదాపు పదేళ్ల పొదుపు + పెట్టుబడితో స్వతంత్ర జీవితం గడపవచ్చు.
-బి.మురళి( 18November 2018)

17, నవంబర్ 2018, శనివారం

ప్లాస్టిక్ కరెన్సీతో దారి తప్పొద్దు

టీవీల్లో కొన్ని క్షణాల పాటు కనిపించే ప్రకటనలు మనపై చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. మనకు అది కొన్ని క్షణాలే కనిపించ వచ్చు కానీ దాని వెనుక పెద్ద పెద్ద వ్యూహాలు, కోట్ల రూపాయల ఖర్చు, అంత కన్నా ఎన్నో రేట్ల ఆదాయ వ్యూహాలు ఉంటాయి.
భారతీయుల్లో సగటున దాదాపు 30శాతం పొదుపు ఉంటుంది. అమెరికాలో ఇది చాలా తక్కువ. ఇంత పెద్ద మొత్తంలో మన పొదుపు శాతం ఉండడం అమెరికా కంపెనీలకు ఏ మాత్రం నచ్చలేదు. మనకు చిత్రంగా అనిపించవచ్చు కానీ మన పొదుపు శాతం తగ్గించాలి అంటే ఏం చేయాలని అమెరికాలో కంపెనీలు సదస్సులు నిర్వహించారు.
తమ ఆదాయం కోసం ఆయా దేశాల్లో అలవాట్లను సైతం మార్చేయగల శక్తి సామర్థ్యాలు బహుళ జాతి కంపెనీలకు ఉంటాయి. కొంత వరకు అవి తమ ప్రభావం చూపించాయి కూడా! మనకే తెలియకుండా మన మీద ప్రభావం చూపిస్తారు. మనకు తెలియకుండానే మన జేబులు ఖాళీ చేయగలరు.
టీవీలో వచ్చే ఈ ప్రకటన చూసే ఉంటారు.
ఒక అమ్మాయి అబ్బాయి ఓ మాల్‌లో వస్తువులు కొనేందుకు వెళతారు. ఒకరినొకరు కొంటె చూపులు చూసుకుంటారు. ఇద్దరూ వరుసగా ఒకే రకమైన వస్తువులు కొంటారు. బిల్లు చెల్లించేందుకు కౌంటర్ వద్దకు వచ్చినప్పుడు యువకుడు తన జేబుల్లో నుంచి డబ్బులు తీస్తాడు. చిల్లర నాణాలు, నోట్లు అన్ని జేబుల్లో నుంచి తీసి ఇస్తాడు. అప్పటి వరకు అతన్ని ప్రేమగా చూసిన ఆ యువతి దీంతో అతన్ని చిరాగ్గా చూస్తుంది. తాను మాత్రం స్టైల్‌గా కార్డు ద్వారా బిల్లు చెల్లిస్తుంది. నగదు చెల్లించడం అసహ్యకరం అన్నట్టుగా ఉంటుంది ఈ ప్రకటన.
ఆ సంస్థ తమ కార్డుల అమ్మకాలు పెంచడం కోసం ఇప్పటి వరకు మనకున్న నగదు చెల్లించే అలవాటును అసహ్యకరం అని మనకే అనిపించేట్టు ఇలాంటి ప్రకటనల ద్వారా చేస్తారు.
డబ్బు విలువ తెలియాలి అంటే కార్డుతో చెల్లించడం కన్నా కష్టపడి సంపాదించిన ఆ డబ్బును చేతితో తడిమి ఇవ్వడం మంచిది. ఇతర మార్గాల ద్వారా లెక్కలేనంత ధనం సంపాదించిన వారి సంగతి వేరు. కష్టపడి సంపాదించే మధ్యతరగతి, దిగువ తరగతి వారు, నెల నెలా జీతంపై బతికే వారు ఆర్థిక క్రమశిక్షణ అలవాటు ఉన్న వారు కార్డుపై చెల్లించడం కన్నా నగదు చెల్లించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
దీని కోసం యూనివర్సిటీలు పెద్ద పెద్ద ప్రయోగాలు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరే తేడా తెలుసుకుంటారు. ఇంట్లోకి అవసరం అయిన ఒక నెల వస్తువులను షాపునకు వెళ్లినగదు చెల్లించి తీసుకోండి ఎంత బిల్లు అవుతుందో చూడండి. అదే పెద్ద మాల్‌కు వెళ్లి కార్డు ద్వారా చెల్లించి చూడండి తేడా తెలుస్తుంది.
డబ్బు లెక్క పెట్టి చెల్లించడం ద్వారా ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? ఖరీదైన ఈ వస్తువు కొనడం అనివార్యమా? అనే అనేక ఆలోచనలు వస్తాయి. కార్డు ద్వారా అయితే డబ్బుకు సంబంధించిన ఆలోచనే రాదు. కార్డు ఇస్తున్నాం తప్ప డబ్బు ఇవ్వడం లేదు కదా? అనే ఆలోచన ఉంటుంది. ఇలాంటి ఆలోచన పెద్ద వారి కన్నా యువతకు ఎక్కువ. కార్డు ద్వారా చెల్లించడం వల్ల డబ్బు విలువ తెలియదు. ఖర్చుపై అదుపు ఉండదు.
వేల రూపాయలు పెట్టి ఈజీగా కార్డుపైనో, ఇఎంఐలతోనో ఖరీదైన టీవిలు కొనేస్తాం కానీ నగదు చెల్లించి కొనాలంటే నాలుగుసార్లు ఆలోచిస్తాం. ఇది అవసరమా? అని ప్రశ్న మొదట ఉదయిస్తుంది.
ఆఫీసుకు వెళ్లే హడావుడిలో విద్యుత్ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి విద్యుత్ బిల్లు కట్టడం వంటి వాటి విషయం వేరు. బిల్లులు చెల్లించేందుకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఖరీదైన వస్తువులు కార్డు ద్వారానో, ఆన్‌లైన్‌లోనో, ఇఎంఐల ద్వారానో కొనేప్పుడు డబ్బుకు విలువ ఇచ్చే వారు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఇది కొనడం అవసరమా? ఇప్పుడే కొనడం అవసరమా? అనే ప్రశ్నను మీకు మీరే వేసుకోవాలి. డబ్బు విలువ తెలియాలి అంటే వాటిని చేతితో సృజించి చెల్లించడమే మంచిది. నగదు ద్వారా అయితే బేరం ఆడే శక్తి ఉంటుంది. కార్డుకు ఆ సౌలభ్యం ఉండదు. ధరను కూడా సరిగా చూడరు. మనలోని ఈ అలవాటునే ఉపయోగించుకుని ప్రతి దానికి కార్డును ఉపయోగించే అలవాటు చేస్తున్నారు.
డిజిటల్ ఇండియా, టెక్నాలజీ, కాలం మారింది , నగదు రహిత చెల్లింపులు అంటూ పాలకులు చేసే ప్రచారం ఎలా ఉన్నా మీ డబ్బు విలువ మీకు తెలియాలంటే డబ్బును వ్యయం చేసేప్పుడు వాటిని చేతితో ముట్టుకోవడం అవసరం. యువతకు కార్డుల ఉపయోగం ఒక వ్యసనంగా మారింది.
అనివార్యం, అత్యవసరం అయితేనే క్రెడిట్ కార్డుల వంటివి ఉపయోగించాలి. క్రెడిట్ కార్డులు వచ్చిన కొత్తలో ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న ఉద్యోగులకు కూడా ఎడా పెడా ఇచ్చేశారు. కార్డును ఉపయోగించి వస్తువులను కొన్న వాళ్లు తీర్చలేక జీవితాలను దుర్భరంగా మార్చుకున్నారు. కార్డు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చాలా జరిగాయి. ప్రతినెలా కార్డునే ఉపయోగించే అలవాటు మీకు ఉంటే ఒక్క నెల నగదు చెల్లించి చూడండి ఆ నెల మీ ఖర్చులో తేడా మీకే తెలుస్తుంది.
క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆర్థిక క్రమ శిక్షణ లోపిస్తుంది. పది శాతం చెల్లించి మిగిలిన డబ్బును నెలనెలా కిస్తుల్లో చెల్లించవచ్చు ఆనే ఆకర్షణీయమైన ఆఫర్‌కు లొంగిపోతే వడ్డీల ఉచ్చులో కూరుకపోతారు. క్రెడిట్ కార్డుపై దాదాపు 36శాతం వరకు వడ్డీ విధిస్తారు. కార్డుల ఉపయోగం టీవీ ప్రకటనల్లో కనిపించేంత అందంగా ఉండదు. ఆ అందం వెనుక మనల్ని అప్పుల్లో ముంచెత్తే వ్యూహాలు ఉంటాయి. కష్టపడి సంపాదించిన డబ్బు కార్డుల పాలు కానివ్వకండి.
ప్లాస్టిక్ కరెన్సీకి మీ సంపాదనను దోచుకునే అవకాశం ఇవ్వకండి.
పొదుపు అంటే మనం సంపాదించే దానిలో కొంత మిగులు. ఇఎంఐ అంటే మనం సంపాదించే డబ్బును కూడా ముందే ఖర్చు చేయడం. సంపాదించిన దాని కన్నా ఎంతో కొంత తక్కువగా ఖర్చు చేయడం భారతీయుల లక్షణం. దానికి భిన్నంగా సంపాదించబోయేది కూడా ఖర్చు చేస్తే మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.
-బి.మురళి(Saturday, 3 November 2018)

సంపన్నులను చేసే అప్పు

అప్పు అంటే కొందరి దృష్టిలో మహాపాపం . రూపాయి ఆస్తి లేకపోయినా పైసా అప్పు లేకపోతే సంపన్నుడే అన్నట్టుగా భావించే వారు ఒకప్పుడు. అప్పు లేని వాడే అసలైన సంపన్నుడు అనే సామెతలు మనకు ఎన్నో ఉన్నాయి.
నిజంగా అప్పు పాపమా? అప్పు లేకపోవడమే ఆదృష్టమా?
కాదు కానీ కాదు. అప్పు ఉండడం తప్పేమీ కాదు. ఐతే ఆ ఆప్పుతో ఏం చేశాము అనేది ముఖ్యం. సరైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటే మీరు చేసే అప్పు కూడా మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది. నిర్ణయాల్లో తేడా ఉంటే అదే అప్పు మీ జీవితాన్ని నరకంగా మారుస్తుంది. అప్పుల ఊబిలో ముంచేస్తుంది.
అప్పు అంటే మీరు ఇతరులకు చెల్లించాల్సిన డబ్బు. ఇతరులకు తిరిగి చెల్లించాల్సింది ఎప్పుడైనా భారమే కదా? అనిపించవచ్చు. నిజమే కానీ అప్పులు లేనిదే ప్రపంచం లేదు. దేశాలు, రాష్ట్రాలు, కంపెనీలు, సంస్థలు, చివరకు వ్యక్తిగతంగా మనం అప్పులు చేయందే సాధ్యం కాదు.
కుటుంబరావు పెద్ద మనిషి ఒక్క రూపాయి అప్పు కూడా లేదు. అప్పు చేయడం పాపం చేయడమేనని ఆయన గట్టి నమ్మకం. ఉన్నదాంట్లో సంతోషంగా బతకాలి అప్పులు చేసి కష్టాలు పాలు కావద్దు అనేది ఆయన తత్వం. అలానే మధ్య తరగతి జీవితాన్ని సాగిస్తున్నారు.
ప్రకాశ్‌రావుకు 50లక్షల రూపాయల అప్పు ఉంది.
ఇద్దరిలో తెలివైన నిర్ణయం ఎవరిది అంటే అప్పు చేయక పోవడం అంత గొప్ప విషయం ఏమీ కాదు. కానీ ప్రకాశ్ 50 లక్షల రూపాయలు దేని కోసం అప్పు చేశారు. 50లక్షల అప్పుకు అతను చెల్లిస్తున్నది ఎంత? అతనికి వస్తున్నది ఎంత అనే లెక్కలతో అతని అప్పు మంచిదా? కాదా? అని తేలుతుంది. అంబానీ వారసులకు కూడా వేలకోట్ల రూపాయల అప్పు ఉంటుంది. అయితే వారు విలాసాల కోసం కాదు కంపెనీల విస్తరణ కోసం, వ్యాపారం కోసం ఆ అప్పుచేస్తారు.
చీరలు మొదలుకొని విదేశాల్లో విహార యాత్రల వరకు అన్నింటికీ అప్పు లభిస్తుంది. మన మానాన మనం పని చేసుకుంటూ ఉన్నా ఫోన్ చేసి మరీ అప్పులిచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉన్నాయి. అప్పులకు అవకాశాలు ఎలా ఉన్నా మనం చేసే అప్పు దేని కోసం అనేది ముఖ్యం.
ఈ మధ్య సెలవుల్లో యాత్రలకు, ప్రయాణాలకు సైతం కొన్ని సంస్థలు అప్పులు ఇస్తున్నాయి.
కారు కొనేందుకు, పెళ్లి వంటి శుభకార్యాలు, యాత్రలు, ఇంట్లో ఫర్నిచర్, ఎసి వంటి వాటి కోసం చేసే అప్పులు మీ జేబులను ఖాళీ చేసేవి. ఉదాహరణకు ఐదారు లక్షల రుణంతో కారు కొంటే ఆ కారుకు నెలకు ఆరువేల రూపాయల వరకు వడ్డీ, ఎంతో కొంత అసలు, నిర్వాహణా వ్యయం దాదాపు నెలకు 30వేల రూపాయల వరకు అవుతుంది. పైగా ఏటేటా కారు విలువ తగ్గిపోతుంది. అవసరం అనుకుంటే కారు కొనడం వేరు. ఇతరులకు చూపించుకోవడానికి అప్పుతో కారు కొనడం అనేది ఏ విధంగానూ సరైన నిర్ణయం కాదు. అదే ఆదాయం కోసం అప్పుతో కారు కొనడం ప్రయోజన కరమే.
ఉదాహరణకు ఆరులక్షల అప్పుతో కారు కొని దానిని ఓలా వంటి సంస్థకు అప్పగిస్తే ఇఎంఐ ఇతర ఖర్చులు 15వేలు, మీకు నెలకు 30వేలు వస్తుంది అనుకుంటే ఆ కారు వల్ల మీకు నెలకు 15వేల రూపాయల ఆదాయమే కాబట్టి దీన్ని మంచి అప్పుగా భావించవచ్చు.
ఇంట్లో ఫర్నిచర్ వంటి వాటిని నెల నెల కిస్తులుగా చెల్లించడానికి అప్పు చేయడం కన్నా నగదుతో కొనుక్కునే స్థాయికి చేరుకునేంత వాటిని కొనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే సరైన నిర్ణయం.
ఇంటి కొనుగోలు వంటి వాటికి అప్పు చేసినా తరువాత అప్పుపై చెల్లించే వడ్డీని మించిన ప్రయోజనం చూపిస్తాయి కాబట్టి ఇలాంటివి మంచి అప్పులు అవుతాయి.
ఉదాహరణకు హైదరాబాద్ వంటి నగరంలో ఇండిపెండెంట్ ఇంటిని బ్యాంకు రుణంతో కొనుగోలు చేస్తే. గత కొన్ని సంవత్సరాల రికార్డును చూస్తే హైదరాబాద్‌లో ఇంటి విలువ ఏటా 20 శాతం వరకు పెరుగుతుంది. సగటును ఇంటిపై నాలుగు శాతం ఇంటి అద్దె వస్తుంది. అంటే 20 శాతం వరకు ధర పెరగడం, నాలుగు శాతం అద్దె అంటే ఏటా 24శాతం ఆదాయం ఉంటుంది. దీనితో పాటు పన్ను రాయితీ లభిస్తుంది. ఇక దీనిపై చెల్లించాల్సిన వడ్డీ దాదాపు 8శాతం వరకు ఉంటుంది. 24శాతం పెరుగుదలలో ఎనిమిది శాతం వడ్డీ చెల్లిస్తే ఇంటి అప్పుపై ఏటా 16శాతం ఆదాయం లభిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో మరే ఇనె్వస్ట్‌మెంట్‌లోనూ ఆదాయం లభించే అవకాశం లేదు. అందుకే ఎక్కువ మంది అప్పుతో ఇంటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
లక్ష రూపాయల జీతం ఉన్నా చాలా మంది ఐటి ఉద్యోగాల్లో ఉన్న యువత అప్పులకు సంబంధించి సరైన అవగాహన లేకపోవడం వల్ల విలాస వంతమైన జీవితం గడిపేందుకు అవసరమైన వాటి కోసం అప్పులు చేస్తున్నారు. ఇలాంటి అప్పులు ఎప్పుడైనా ప్రమాదకరమే. లక్ష జీతం వస్తుంది కదా అని కారుతో సహా అన్ని అప్పులతో కొని నెల జీతం మొత్తం కిస్తులు చెల్లించడానికే సరిపోయే జీవితాలు ఎన్నో ఉన్నాయి. కంపెనీ పరిస్థితి మారి ఉద్యోగం ప్రమాదంలో పడితే ఇలాంటి వారి పరిస్థితి దయనీయంగా మారుతంది. జీతం ఎంతైనా కావచ్చు. ప్రమాదకరమైన అప్పుల జోలికి వెళ్లవద్దు. అప్పుతో ఇంటిని కొన్నవారి ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడవచ్చు కానీ మిగిలిన వారితో పోలిస్తే వీరికి అప్పు అంత ప్రమాదమేమీ కాదు. నాలుగైదేళ్లలో ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ఆ సమయంలో అమ్ముకున్నా అప్పులు తీరిపోయి ఇంకా మిగులుతుంది. కానీ అదే అప్పుతో కారు కొంటే మొత్తం కారు అమ్మినా సగం అప్పు తీరదు. ఇటు కారు మిగలదు, అటు అప్పు తీరదు.
అన్నింటి కన్నా ప్రమాదకరమైన అప్పులు క్రెడిట్ కార్డు. ఈ నెల బిల్లుపై పది శాతం చెల్లించండి మిగిలింది వాయిదాలపై చెల్లించండి అంటూ అడగ ముందే అప్పు ఇస్తుంటారు. వీటికి దాదాపు 36శాతం వరకు వడ్డీ పడుతుంది. అత్యంత ప్రమాదకరమైన అప్పులు ఇవి. మనం అప్పు తీసుకుంటున్నప్పుడు వాటికి ఎంత శాతం వడ్డీ చెల్లిస్తున్నాం, మనకు వచ్చే వడ్డీ శాతం ఎంత అనే స్పష్టమైన లెక్కలు ఉండాలి. లెక్కలు అర్థం కాకపోతే జీవితం తలక్రిందులవుతుంది. అప్పుల్లో మునిగిపోతారు.
ఆదాయం ఇచ్చే అప్పు ఆరోగ్యకరం. కంటికి కునుకు లేకుండా చేసేది అనారోగ్యకరమైన అప్పు.
-బి.మురళి( Saturday, 27 October 2018)

డబ్బు లక్షణాలు

ఎంత డబ్బు వచ్చినా నిలవడం లేదు. ఇద్దరు పని చేసేది ఒకే చోట. ఇద్దరి జీతం ఒకటే ఇద్దరి హోదా ఒకటే కానీ మా వద్ద డబ్బు అస్సలు నిలవదు. కానీ వారి పరిస్థితి బాగుంది. డబ్బు నిలుస్తోంది. ఎందుకిలా జరుగుతోంది. ఇలాంటి సందేహాలు మనలో చాలా మందికి వచ్చే ఉంటాయి. వస్తూనే ఉంటాయి.
మనిషికి కొన్ని లక్షణాలు ఉన్నట్టే డబ్బుకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. నిన్ను అభిమానించే వారి వద్దకే నువ్వు వెళతావు. అలాంటి వారితో ఉండడానికే నువ్వు ఇష్టపడతావు. డబ్బు కూడా అంతే తనను బాగా చూసుకునే వారి వద్దనే ఉంటుంది. వారి వద్దనే వృద్ధి అవుతుంది. తోటి మనుషులను, ఇంట్లో వాళ్లను ప్రేమగా ఎలా చూసుకుంటామో డబ్బును కూడా అలా చూసుకుని దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తేనే అది నీ వద్ద నిలుస్తుంది. లేదంటే బంధాలు నిలవనట్టే డబ్బు కూడా నిలువదు.
డబ్బు లక్షణాలను వివరించే విధంగా మనకెన్నో సామెతలు, నానుడులు ఉన్నాయి. పైసే పైసాకు కీంచ్‌తా అనేదో నానుడి. డబ్బుకు డబ్బును ఆకర్శించే లక్షణమే కాదు, తనను నిర్లక్ష్యం చేసే వారికి దూరంగా వెళ్లడం కూడా సంపద ప్రధాన లక్షణం.
ఆర్థిక నిపుణులు డబ్బు లక్షణాలు కొన్నింటివి వివరిస్తూ మీవద్ద కూడా సంపద నిలిచి ఉండాలంటే ఏం చేయాలో వివరించారు. మన వద్ద డబ్బు నిలవాలి అంటే ముందు ఆ డబ్బుకుండే లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలి. ప్రధానంగా డబ్బుకు ఐదు లక్షణాలు ఉంటాయని నిపుణులు తేల్చారు.
డబ్బు మొదటి లక్షణం తనకు తగిన గౌరవం, విలువ ఇచ్చిన వారి వద్దనే అది నిలుస్తుంది. అంటే మీ వద్ద డబ్బు నిలవాలి అంటే దానికి తగిన గౌరవం ఇవ్వాలి. డబ్బు మనిషి కాదు కదా? దానికి విలువ ఇవ్వడం ఏమిటీ అనుకోవద్దు. అది మనిషి కాకపోయినా మనిషిలా స్పందించే గుణం లేకపోయినా, మాట్లాడక పోయినా డబ్బు తనకు విలువ ఇస్తున్నారా? లేదా అని గ్రహించే శక్తి దానికి ఉంటుంది. విలువ ఎలా ఇవ్వాలి అంటే మీ జీతం, సంపాదన ఎంతైనా కావచ్చు దానిలో కనీసం ఒక పది శాతం పొదుపు చేయాలి, అలా పొదుపు చేసిన డబ్బును తనకు, తన కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే విధం ఇనె్వస్ట్ చేయాలి. చాలా మంది ప్రతి నెలా ఎంతో కొంత ఇనె్వస్ట్ చేస్తారు. తిరిగి ఏదో పని పడినప్పుడు ఆ డబ్బును ఖర్చు చేస్తారు. మా వద్ద డబ్బు నిలవడం లేదు అని ఆవేదన చెందుతారు. ఆరంభశూరత్వం అన్నట్టు ఐదారు నెలలు పొదుపు చేయడం కాదు. కనీసం పది శాతం పొదుపు చేయడం అనేది సంపాదన ప్రారంభించినప్పటి నుంచీ ఉండాలి. వీలుంటే పొదుపు లేదంటే లేదు అనే వైఖరి కాకుండా క్రమం తప్పకుండా ఈ పొదుపు ఉండాలి. రెగ్యులర్‌గా పొదుపు చేసి మదుపు చేసే వారి వద్దనే డబ్బు నిలుస్తుంది. సంపద సమకూరుతుంది. ఇది డబ్బుకు సంబంధించి మొదటి లక్షణం.
ప్రలోభాలకు లొంగని వారి వద్దనే ధనం నిలుస్తుంది. ఇది డబ్బుకు సంబంధించి రెండో సూత్రం. అంటే మీరు పొదుపు చేసిన డబ్బును సక్రమంగా ఇనె్వస్ట్ చేయాలి. రెండేళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది. జూదం, లాటరీలు, అక్రమ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రి సంపన్నులం కావాలి అనుకునే వారి వద్ద డబ్బు నిలువదు. చిన్న విత్తనమే భూమిలో పాతిన తరువాత కొంత కాలానికి మహావృక్షం అవుతుంది. జ్ఞానం అయినా, ధనం అయినా క్రమంగా పెరుగుతుంది. చట్టబద్ధమైన, ధర్మబద్ధమైన పెట్టుబడుల్లోనే డబ్బు న నిలుస్తుంది.
ఓపిక ఉన్న వారి వద్దనే ధనం నిలుస్తుంది. ఓపిక లేని వారి వద్ద ధనం నిలవదు. ఇది ధనానికి సంబంధించి మూడవ లక్షణం. డబ్బుకు సంబంధించి నిర్ణయాలు అన్ని కోణాల్లో ఆలోచించి సావధానంగా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఓపిక ఉండాలి. హడావుడి పనికి రాదు. నీ చేతిలో ఉన్నంత వరకే అది నీ డబ్బు నీ చేయి దాటి పోయింది అంటే దానిపై నీకు అజమాయిషీ ఉండదు. డబ్బును ఎవరికైనా అప్పుగా ఇచ్చినా, చే బదులు ఇచ్చినా, ఇనె్వస్ట్ చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మన నిర్ణయం సరైనదేనా అని ఆలోచించాలి. ఏటిలో డబ్బు వేసినా లెక్కబెట్టి వేయాలి అంటారు. అంటే డబ్బుకు సంబంధించి లెక్కలు స్పష్టంగా ఉండాలి. ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎక్కడ ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎవరికెంత ఇచ్చాం అనే లెక్కలు ఉండాలి. ఓపిక ఉన్నవారిలో మాత్రమే డబ్బుకు సంబంధించి ఈ లెక్కల్లో స్పష్టత ఉంటుంది. అలాంటి వారి వద్దనే డబ్బు నిలుస్తుంది.
తెలియని రంగం వైపు వద్దు
ఎవరినైనా ఆర్థికంగా దెబ్బతీయాలి అంటే వారితో లారీ కొనిపించాలి అని ఒక జోక్ వ్యాపార వర్గాల్లో ప్రచారంలో ఉంది. లారీ వ్యాపారంలో లాభాలు ఉండవని కాదు కానీ లారీల వ్యాపారం గురించి ఏ మాత్రం తెలియకుండా, ఆ రంగంలో అడుగు పెడితే అనుభవం వచ్చే నాటికి పెట్టుబడి మాయం అవుతుంది. వాహన రంగం ఒక్కటే కాదు ఏ వ్యాపారంలోనైనా దాని గురించి లోతు పాతులు తెలియకుండా అడుగు పెడితే అలాంటి వారి వద్ద ధనం నిలువదు. ఏదో ఆకర్శణతో తమకు ఏ మాత్రం అనుభవం లేని రంగంలో అడుగు పెట్టి ఆర్థికంగా చితికి పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా, వ్యాపారం చేయాలన్నా ఆ రంగం గురించి నిపుణులతో చర్చించాలి. తగిన అవగాహన కలిగి ఉండాలి. కూరగాయలు అమ్మే వ్యక్తితో కూరగాయల గురించి సలహాలు తీసుకోవచ్చు కానీ స్టాక్‌మార్కెట్ గురించి కాదు. అంటే ఏ రంగంలో నిపుణులు ఐతే వారిని నుంచి ఆ రంగానికి సంబంధించి సలహాలు తీసుకోవచ్చు. ఒక రంగంలో నిపుణులు ఐనంత మాత్రాన వారికి అన్ని రంగాల గురించి అవగాహన ఉంటుందని కాదు.
అత్యాశా పరులు వద్ద ధనం నిలువదు. ఇది ధనానికి సంబంధించి ఐదవ సూత్రం. అత్యాశతో ధనాన్ని ఎప్పుడూ పెట్టుబడి పెట్టవద్దు. లాటరీలు, జూదం, ఏడాదిలో ధనం రెట్టింపు అవుతుంది. కాకరకాయ పొడితో ఆరునెలల్లో ధనం రెట్టింపు. బంగారం కడిగితే రెట్టింపు అవుతుంది అంటూ మోసం చేసే వారిని నమ్మేది అత్యాశా పరులే. ధనం అనేది క్రమ బద్ధంగా పెరుగుతుంది. క్రమ బద్ధంగా పెరగాలి అలాంటి వారి వద్దనే ధనం నిలుస్తుంది. ధనానికి మనం విలువ ఇస్తేనే అది మన వద్ద నిలుస్తుంది.
-బి.మురళి(11-11-2018)

16, నవంబర్ 2018, శుక్రవారం

ఎన్నికలు - ఓషో చెప్పిన కథ

కలికాలం కలిబుద్ధులు.. ఈ కలియుగాంతానికి కాలం దగ్గరపడినట్టనిపిస్తోంది.. పెద్దలంటే గౌరవం లేదు.. ఎవరిని ఎవరూ ఖాతరు చేయరు.. ఏదో ఒక రోజు ఈ లోకం పాపంలో పడి మునిగిపోతుందనిపిస్తుంది..’’
‘‘ఏరా.. మీ అబ్బాయితో గొడవ జరిగిందా?’’
‘‘ఔను.. నీకెలా తెలుసు?’’
‘‘ఊహించాను..’’
‘‘రోడ్డు మీదకు వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి వస్తాడనే నమ్మకం కలగడం లేదు. మన రోడ్ల మీద మొక్కజొన్న కంకులు అమ్మినట్టుగా అమెరికాలో గన్‌లు అమ్ముతున్నారు. వాటితో పేల్చుకుని చావకుండా ఇంకేం చేస్తారు? సంపద వచ్చి పడిందని కళ్లు నెత్తికెక్కితే ఇలానే ఉంటుంది.’’
‘‘ఏరా.. మీ అబ్బాయికి అమెరికా యూనివర్సిటీలో సీటు ఇక రానట్టేనా? ’’
‘‘అవేవో ఐలెట్ పరీక్షల్లో మంచి మార్కులు రావాలట.. వాడు మూడు సార్లు రాస్తే 36వేల రూపాయల చేతి చమురు వదిలింది కానీ వాడికి మార్కులు రాలేదు. మనల్ని మోసం చేసి ఇలా డబ్బులు గుంజే ఐడియానే కానీ- ఆ ట్రంప్ మన పిల్లలకు చదువుకునే అవకాశం ఇచ్చేట్టు లేడు.’’
‘‘అంతే కావచ్చు’’
‘‘అది సరే.. నేను మాట్లాడిన దానికి, నువ్వు ప్రశ్నించిన దానికి అస్సలు సంబంధం లేదు. నేను అమెరికాలో ఆయుధాల దాడుల గురించి మాట్లాడితే నువ్వు మా అబ్బాయికి అమెరికాలో సీటు రాలేదా? అని అడిగావు. ఎలా ఊహించావు. ఆశ్చర్యంగా ఉందిరా! టెలీపతినో భిక్షపతినో ఏదో అంటారు కదా? అలాంటి విద్య ఏమైనా నేర్చుకున్నావా?’’
‘‘కాదులే..’’
‘‘ఎన్నికల వాతావరణం వేడెక్కింది. డబ్బులు మంచినీళ్లలా ఖర్చుపెడుతున్నారు. పోయే కాలం .. విలువలు లేవు.. నమ్మకాలు లేవు. ఇంతకూ ఎవరు గెలుస్తారంటావ్?’’
‘‘గతంలో ఎన్నికలంటే రిగ్గింగ్‌లు, మద్యం ప్రవహించడం, బూతులు, దాడులు అబ్బో.. నానా బీభత్సంగా ఉండేది. అవేమీ లేకుండా ప్రశాంతంగా ఉంది ఇప్పటి వాతావరణం. ’’
‘‘నీకలానే అనిపిస్తుందిలే! ఫలితాలు ఎలా ఉంటాయనుకుంటున్నావ్’’
‘‘నీకో కథ చెబుతా.. మనం చర్చ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నింటికి నీకీ కథలో సమాధానం దొరుకుంది. కథ నాది కాదు ఓషో రజనీష్ చెప్పింది’’
‘‘సరే చెప్పు..’’
‘‘ఒక హరిదాసు రామకథను చెబుతున్నాడు. శ్రీరాముని కథ చెప్పేప్పుడు హనుమంతుడు కూడా అక్కడికి వచ్చి కూర్చుంటాడని మన వాళ్ల నమ్మకం. రావణాసురుడు సీతమ్మను అపహరించి అశోకవనంలో ఉంచాడు. ఆ సమయంలో అశోకవనంలో చుట్టూ పూలు ఉన్నాయి. ఆ పూలు తెల్లగా మెరిసిపోతున్నాయి అని రామ దాసు కథ చెబుతుండగానే హనుతమంతుడు వచ్చి ఆ పూలు తెల్లగా లేవు, ఎరుపుదనంతో మండిపోతున్నాయని అంటాడు. హరిదాసు హనుమంతుడిని చూసి ఇంతకూ నువ్వెవరు అని ప్రశ్నిస్తే- నేను హనుమంతుడినని అంటాడు. కావ చ్చు.. కానీ అక్కడ తెల్లపూలే ఉన్నాయని హరిదాసు వాదిస్తాడు. సరే- శ్రీరాముడినే కలి సి తేల్చుకుందాం అని ఇద్దరూ వెళతారు. హరిదాసు తెల్ల పూలు అన్నారు కాబట్టి ఆ పూలు తెల్లవే అని శ్రీరాముడు చెబుతాడు. హనుమంతునికి కోపం వచ్చి అశోకవనంలో సీతమ్మ ఉన్నప్పుడు అక్కడ శ్రీరాముడు లేడు, కథ చెబుతున్న హరిదాసు లేడు. ఉన్నది సీతమ్మ, నేను మాత్రమే మీరంతా అబద్ధం చెబుతున్నారంటూ మండిపడతాడు. సీతమ్మనే అడుగుదామని ఆమెను పిలుస్తారు. వివాదం గురించి చెప్పిన హనుమంతుడు అశోకవనంలో పూలు ఎలా ఉండేవని అడుగుతారు. హరిదాసు అబద్ధం ఆడడు కాబట్టి ఆయన చెప్పిందే నిజం ఆ సమయంలో అశోక వనంలో పూలు తెల్లగా ఉండేవని సీతమ్మ చెబుతుంది. హనుమంతుడు ఆశ్చర్యపోయి హరిదాసు, శ్రీరాముడు, సీతమ్మ కలసి అబద్ధం చెబుతున్నారు.. మీరంతా కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారు.. నేను స్వయంగా చూశాను ఆరోజు అశోకవనంలో పూలు ఎర్రగా ఉన్నాయి.. కానీ మీరంతా తెల్లగా ఉన్నాయంటున్నారని విస్తుపోతాడు. శ్రీరాముడు నవ్వి- నువ్వు చెప్పింది సరైనదే, హరిదాసు చెబుతున్నది సరైనదే. రావణుడు సీతమ్మను అశోకవనంలో ఉంచినప్పుడు ఆగ్రహంతో ఉన్న నీకు అశోకవనంలోని పూలన్నీ ఎర్రగా కనిపించాయి. రామకథ చెబుతున్న హరిదాసు ప్రశాంతంగా ఉన్నాడు అందుకే అతనికి పూలు తెల్లగా కనిపించాయి అని శ్రీరాముడు చెప్పాడు’’
‘‘ ఓషో చెప్పిన ఈ రామకథకు, ఎన్నికల వాతావరణానికి, నా సమస్యకు సబంధం ఏముంది?’’
‘‘ఎన్నికలకు, నీ సమస్యకే కాదు.. సమస్త మానవాళి అభిప్రాయాలకు, దేశ రాజకీయాలకు సంబంధం ఉంది కాబట్టే చెప్పాను’’
‘‘అదే.. ఏంటా సంబంధం?’’
‘‘నీకు ఒపిక ఉంటే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చు, సమాజం ఎలా ఉంది? అంటూ నీకు తోచిన ప్రశ్నలు  ఓ పది మందిని  అడిగి చూడు.’’
‘‘అడిగితే?’’
‘‘పది మందిని అడిగితే , ఆ పది మంది ఒకే సమాధానం చెప్పరు. భిన్నమైన అభిప్రాయాలు చెబుతారు. ఒకే ఎన్నికల గురించి, ఒకే సమాజం గురించి ప్రశ్నించినప్పుడు భిన్నాభిప్రాయాలు వస్తాయి’’
‘‘కావచ్చు.. ఓషో రజనీష్ చెప్పిన శ్రీరాముని కథకు, మన చర్చకు, నువ్వు చెబుతున్న దానికి సంబంధం ఏంటో చెప్పు’’
‘‘సంబంధం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. సీత అశోక వనం లో ఉన్నప్పుడు చెట్టు కింద పూలు నిజానికి తెల్లరంగులోనే ఉన్నాయి. హనుమంతుడు ఆ సమయంలో రావణుడిపై ఆగ్రహంతో ఉండడం వల్ల ఎరుపు రంగులో కనిపించాయి. కథ చెబుతున్న హరిదాసు ప్రసన్నవదనంతో ఉండడం వల్ల తెల్లగా కనిపించాయి. ప్రపంచాన్ని మనం మన కళ్లతో చూస్తాం అంటే ఆ సమయంలో మన ఆలోచనలు ఎలా ఉంటే మనకు ప్రపంచం అలా కనిపిస్తుంది. నీ పిల్లలు నీ మాట వినకపోతే ప్రపంచమంతా అలానే ఉందనిపిస్తుంది.మా పిల్లలు నా మాట వింటున్నందున ప్రపంచం అంతా ఇలానే ఉందని నాకనిపిస్తుంది  ’’
‘‘అదా కథ.. అంటే ఈ ఎన్నికల్లో ఎవరు గెలవాలి? ఎవరు ఓడాలి? అని మనం అనుకుంటున్నామో ఫలితాలు అలానే వస్తాయని అనిపిస్తుంది కదూ?’’
‘‘ఔను...’’
‘‘అంటే సర్వేలు, అభిప్రాయాలు అన్నీ అబద్ధమేనా?’’
‘‘కాదు.. మనం ఉన్న స్థితి నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే నిజం అర్థం అవుతుంది. అలా ఆలోచించే సామర్థ్యం మనకు ఉందా? లేక గుంపులో గోవిందయ్యలా ఆలోచిస్తున్నామా? అనేది మనం చెప్పిన ఫలితం, వాస్తవ ఫలితం బట్టి తేలుతుంది’’ *
బుద్దా మురళి (జనాంతికం 16-11-2018)

2, నవంబర్ 2018, శుక్రవారం

విప్లవ కవి వీరుడు!

ఎన్నాళ్లకెన్నాళ్లకు వచ్చావ్.. నీ అమెరికా యాత్ర విశేషాలు వినేందుకు మూడు వారాల నుంచి ఎదురు చూస్తున్నాను..’’
‘‘అక్కడున్నా- మన విప్లవకవుల గ్రూపులో రోజూ విప్లవ కవిత్వంతో అందరినీ పలకరిస్తూనే ఉన్నాను కదా?’’
‘‘కవిత్వంతో పలకరించడం, కాఫీ తాగుతూ ఎదురెదురుగా కూర్చుని పలకరించడం వేరు వేరు. చెల్లెమ్మా.. నీ చేత్తో ఇచ్చిన కాఫీ తాగి ఎన్ని రోజులు అవుతుందో.. కాఫీ ఇవ్వమ్మా!’’
‘‘బాగున్నారా.. అన్నయ్య గారూ.. అమెరికాలో అబ్బాయి ఇంట్లో ఉన్నామన్న మాటే కానీ ఆయన స్మార్ట్ఫోన్‌కు అతుక్కుపోయి నిరంతరం కవితా లోకంలోనే ఉండేవారు.’’
‘‘అంత దూరంలో ఉండి- విప్లవ కవిత్వంతో నువ్వు కురిపించిన అగ్ని జ్వాలలు చాలా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. నువ్వు అగ్ని పునీతుడివి.. అమెరికా సామ్రాజ్యవాద ప్రభావం పడకుండా స్వచ్ఛమైన అగ్ని గోళాలను కురిపించావ్.. నువ్వు గ్రేట్ రా!’’
‘‘అభ్యుదయం అనే కవితా వాయువును శ్వాసించే మనలాంటి విప్లవ కవులు ఎక్కడున్నా అంతే. స్టార్ హోటల్‌లో కూర్చున్నా పేదరికంపై కన్నీళ్లు పెట్టించేలా రాయగలం.’’
‘‘తెలుగులో రాస్తున్నావు.. అదే కవిత్వాన్ని ఇంగ్లీష్‌లో రాసి ఉంటే అమెరికా యువత కూడ సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా అడవి బాట పట్టేది. ఏరా.. అమెరికాలో అచ్చం ఇక్కడున్నట్టే అడవులు ఉంటాయా? అడవుల్లో అన్నలుంటారా?’’
‘‘మనకు రికార్డుల్లో అడవులుంటాయి. అక్కడ అడుగడుగునా అడవిలానే ఉంటుంది. నిజమైన అడవులుంటాయి. కానీ ఏం లాభం.. అడవుల్లో అన్నలుండరు. చెట్లే ఉంటాయి.’’
‘‘నువ్వు ఎటువైపు..? అంటూ మన అప్పారావు కవులను ప్రశ్నిస్తూ రాసిన విప్లవ కవిత్వంపై నువ్వేమంటావ్?’’
‘‘చాలా కష్టమైన ప్రశ్న. ఎటూ తేల్చుకోలేం. ప్రతి జిల్లాలో అడవులున్నాయి. ప్రతి అడవిని ఆధారం చేసుకుని నాలుగైదు విప్లవ గ్రూపులున్నాయి. మల్లారెడ్డి స్వీట్స్ సక్సెస్ కాగానే- గల్లీకో రెడ్డి స్వీట్స్ షాప్‌లు ఏర్పడ్డాయి. ’’
‘‘ఔను.. మల్లారెడ్డి స్వీట్స్ తరువాత నాకంతగా నచ్చింది సహోదర్‌రెడ్డి స్వీట్స్. చాలామంది రెడ్డేతరులు కూడా వేరువేరు పేర్లతో స్వీట్స్‌షాప్‌లు పెట్టారనుకో. ’’
‘‘ఇక్కడ చర్చ స్వీట్స్ గురించి కాదు. ఒక్కో అడవిలో కనీసం నాలుగైదు విప్లవ గ్రూపులు ఉన్నాయి కదా? వీటిలో ఏ గ్రూపునకు మద్దతుగా విప్లవ కవిత్వం రాయాలో తేల్చుకోలేక పోతున్నాను. విప్లవ గ్రూపుల జేఏసీ ఏర్పాటు చేసి దానికి మనం కన్వీనర్‌గా ఉంటే ఎలా ఉంటుందంటావ్’’
‘‘అంటే నువ్వు కూడా అడవిలోకి వెళతావా?’’
‘‘్ఛ..్ఛ.. ఆ ఖర్మ నాకేం పట్టింది? బయటే ఉండి అడవిలోని వారికి మార్గదర్శనం చేస్తాను. ’’
‘‘ అది సరే- మీ అబ్బాయిని పంపినట్టే అమ్మాయిని కూడా అమెరికా పంపిస్తానన్నావు ఎంత వరకు వచ్చింది?’’
‘‘ట్రంప్ అధికారంలోకి రావడానికి కన్నా ముందు అబ్బాయి అమెరికా వెళ్లాడు. ఇప్పుడు ట్రంప్ రో జుకో రూల్ తెస్తున్నాడు. అమెరికా పంపించాలా? కెన డా పంపించాలా? ఎటూ తేల డం లేదు. రెండు దేశాల్లో చ దువుకేమో ఖర్చు ఒకటే, కానీ చదువు పూర్తయ్యాక వారి సంపాదన కూడా చూడాలి కదా? అమెరికా డాలర్‌కైతే మన కరెన్సీలో 74 రూపాయలు వస్తాయి. అదే కెనడా డాలర్ ఐతే 53 రూపాయలు మాత్రమే అంటే- వారి సంపాదనలో ఒక్కో రూపాయికి 21 రూపాయల తేడా ఉంటుంది. ఎటూ తేల్చుకోలేక పోతున్నా..’’
‘‘నిజమేరా! ఇదంత ఈజీగా తేల్చుకునే విషయం కాదు. అమెరికా వాడేమో రావద్దని, వచ్చిన వాళ్లు ఉండొద్దని మొకాళ్లు అడ్డంగా పెడుతున్నాడు. కెనడా వాడేమో రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతున్నాడు.. ఐతే మాత్రం 21 రూపాయల తేడా మాటేంది? ’’
‘‘దాని గురించే ఆలోచిస్తూ ఏ నిర్ణయం తీసుకోలేక కవిత్వం కూడా రాయలేక పోతున్నాను.’’
‘‘మనిషి జీవితంలో ఇలాంటి సమస్య వస్తూనే ఉంటుంది. ఉడిపి శ్రీకృష్ణ భవన్‌లో అటు చూస్తే బాదం హల్వా, ఇంటు చూస్తే సేమ్యా ఇడ్లీ అంటూ శ్రీశ్రీ లాంటి వారు అటా? ఇటా? అని ఎటూ తేల్చుకోలేక పోయారు. ’’
‘‘బాగా చెప్పావు.. చూడడానికి చిన్న సమస్యలానే అనిపిస్తుంది. రెండింటిలో ఏదో ఒకటి ఎన్నుకోవచ్చు కదా? అంటారు కానీ అదెంత కష్టమో నిర్ణయం తీసుకునేవాడికి తెలుస్తుంది. బాదం హల్వా తెప్పించుకున్నాక పక్కనోడు ఇడ్లీ తెప్పించుకుంటే అరె- తప్పు చేశాం మనమూ ఇడ్లీ తెప్పించుకోవాల్సింది అనిపిస్తుంది’’
‘‘ప్రపంచానికి, దేశాలకే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నువ్వు, నేను ఎంత ? అమెరికా వైపా? రష్యా వైపా? తేల్చుకోమంటే నెహ్రూ లాంటి వారే ఎటూ తేల్చుకోలేక అలీన విధానం అంటూ మూడోది ఎన్నుకున్నారు.’’
‘‘్భ మండలంపైనే నివాసానికి అవకాశం ఉంది కాబట్టి బతికి పోయాం. ఇప్పుడు మరో గ్రహంపై కూడా మానవ నివాసానికి అవకాశాలు ఉంటాయంటున్నారు. రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవాలంటే ఎంత కష్టమో?’’
‘‘నీ కవిత్వం చదివితే ఈ వయసులో నాక్కూడా అడవి బాట పట్టాలనిపిస్తుంది. అలాంటిది యువకుల్లో ఎంత ప్రభావం ఉంటుందో చెప్పలేం. నీ కవిత్వం చదివి మీ పిల్లలేమంటారు?’’
‘‘వాళ్లకు తెలుగు రాదు..’’
‘‘ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసి వినిపిస్తే అమెరికా, కెనడాలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం కాదు కచ్చితంగా అడవి బాట ఎంపిక చేసుకుంటారు. నీ అడవి బాట కవితా సంకలంనలో యువత ఎటు పోవాలో చక్కగా చెప్పావు. ఆ కవిత్వం వింటే మీ పిల్లలు కూడా అడవి బాట పడతారు. నీ వారసత్వాన్ని నిలబెడతారు.’’
‘‘ఆ మాటలు అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? బంగారు భవిష్యత్తు ఉన్న నా పిల్లలు అడవిబాట పట్టాలంటావా? నువ్వసలు మనిషివేనా?’’
‘‘అన్నయ్యా.. అని మిమ్ములను ఎంత గౌరవంగా పిలిచాను. నువ్వసలు మనిషివేనా? మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివా? ఇంత కాలం అన్నయ్యా అని ఆప్యాయంగా అనిపిలిచాను కాబట్టి క్షమించి వదిలేస్తున్నా, అదే మరొకడు ఈ మాట అనుంటే రోకలి బండతో కొట్టేదాన్ని’’
‘‘నేను తప్పు మాటేమన్నానురా! మీ దంపతులు నన్నలా చూస్తున్నారు. నీ విప్లవ కవిత్వం విని ఎంతోమంది అడవి బాట పట్టారని నువ్వే ఎన్నో సభల్లో గర్వంగా చెప్పుకున్నావ్! నీ కవిత్వం ప్రభావం మీ పిల్లలపై ఉంటుందంటే తప్పా?’’
‘‘ఇంకో మాట మాట్లాడావంటే నేనేం చెస్తానో నాకే తెలియదు. గెటౌట్!. పైన తథాస్తు దేవతలు ఉంటారు . ఏమేవ్ పిల్లలకు దిష్టి తీయి . మన పిల్లల మీద వీడి కన్ను పడుతుంది అని కలలో  కూడా అనుకోలేదు ’’

బుద్దా మురళి (జనాంతికం 2-11-2018)
*