13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

చీకటి రోజు-బ్లాక్‌బస్టర్

‘‘ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు..’’
‘‘ఏమైంది..?’’
‘‘సులభ్ కాంప్లెక్స్‌లో టాయ్‌లెట్‌కు పది రూపాయలు తీసుకున్నాడు. ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉంటుందా? ప్రజలకు బతికే హక్కు లేదా? టాయ్‌లెట్‌కు వెళ్లకుండా ప్రజలు అలానే పైకి పోవాలని కుట్ర పన్నుతున్నారా? ’’
‘‘పోనీలేవోయ్.. అదేదో సినిమాలో మహేశ్‌బాబు సుస్సు పోయిస్తాను అని అంటే అది మంచి లాభసాటి బేరం అనుకుని వీడెవడో సులభ్ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ తీసుకున్నాడట! రోడ్డుపక్కన పోయడమే అలవాటు కావడం వల్ల ఇక్కడికి వచ్చేవారు తగ్గిపోయారు. దాంతో వచ్చిన వాళ్ల నుంచే ఐదు రూపాయలకు బదులు పది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంతోటి దానికి- ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటావా?’’
‘‘అదొక్కటే కాదు.. ఐదుకు బదులు పది తీసుకున్నారు. సరే పోనీ పది తీసుకున్నా కనీసం టాయ్‌లెట్‌లో ఓ లైటు వేయరా? చీకట్లో ఎంత ఇబ్బందో నీకేం తెలుసు?’’
‘‘టాయ్‌లెట్‌లో చీకటిని సింబాలిక్‌గా.. ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అన్నావా? నువ్వక్కడికి వెళ్లినప్పుడు చీకటిగా ఉంటే మొత్తం రోజంతా చీకటిగా ఉన్నట్టేనా? మహాఐతే అక్కడో పది నిమిషాలు ఉండి ఉంటావు. ప్రజాస్వామ్యానికి ఇది పది నిమిషాల చీకటి రోజు అంటే సరిపోతుంది. మరీ మొత్తం చీకటి రోజు అనడమే భావ్యం కాదు.’’
‘‘అదే నాయకులు అంటేనేమో హైలైట్ చేస్తారు. నేనంటేనేమో భరించ లేకపోతున్నావ్..’’
‘‘నాయకుల ప్రకటనలు లెక్కబెడుతూ పోతే సంవత్సరానికి 500 రోజులేమో అని డౌట్ వస్తుంది..’’
‘‘అదేం డౌట్.. సంవత్సరానికి 365 రోజులే. లీప్ సంవత్సరంలో ఒక రోజు ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప ఇదేదో హిట్ సినిమా ఆడినట్టు వెయ్యి రోజులు, ఐదు వందల రోజులు కావు’’
‘‘ఓ నాయకుడు తాను విపక్షంలో ఉంటే రోజుకు రెండు మూడు సార్లు ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనే వాడు. అలా ఆయన చెప్పిన చీకటి రోజులన్నీ లెక్కకడితే ఒక ఏడాదిలో 1500 రోజులు వచ్చాయి తెలుసా?’’
‘‘ఔను.. నేనూ విన్నాను. ఓడిపోయాక అసెంబ్లీ జరిగేప్పుడు మైకు అందుకోగానే మొదటి మాట ఇదే ఉండేది. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని. ఓ రోజు అంబులెన్స్ అడ్డు రావడం వల్ల ఆయన వాహనాన్ని కొద్ది సేపుఆపితే ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనేశారు. ’’
‘‘ప్రజాస్వామ్యానికి చీకటి పగలు అనాల్సింది కదా?’’
‘‘అధికారం లేనిదే ఉండలేని వారికి- ప్రతి రోజు, ప్రతి క్షణం ప్రజాస్వామ్యానికి చీకటి రోజే కదా?’’
‘‘ఔను- ప్రపంచంలో తాము, తమ సౌకర్యం, తమ అధికారం మినహా మరేమీ లేదనే గట్టి నమ్మకాలున్న వారికి అధికారం లేని ప్రతి క్షణం కూడా ప్రజాస్వామ్యానికి చీకటి రోజే. ఎందుకంటే వారి దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే వారే’’
‘‘నిజమేనోయ్.. షూటింగ్ ప్రారంభమైన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. అధికారం కోల్పోయిన తరువాత ప్రతిక్షణం ప్రజాస్వామ్యానికి చీకటి రోజే.’’
‘‘అదేం పోలిక?’’
‘‘అంటే సినిమాలు, రాజకీయాలు ఒకటే అని భావించే వారి కోసం అన్నా..’’


‘‘ఐనా రెండింటికీ పోలిక ఎలా సాధ్యం?’’
‘‘నేను సినిమాలు చూడడం మానేసి చాలా ఏళ్లవుతోంది. కానీ ప్రతి సినిమా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ప్రతి సినిమా వార్తను చదువుతాను. టీవీలోచూస్తాను. కానీ థియేటర్‌లో ఒక్క సినిమా కూడా చూడను.’’
‘‘ఆ సంగతి వదిలేయ్... పోలిక గురించి చెప్పు?’’
‘‘సినిమా షూటింగ్ ప్రా రంభం చాలా అట్టహాసంగా సాగుతుంది. నిజంగా ఆ సినిమా షూటింగ్ జరిగిందో లేదో చాలామందికి తెలియదు. షూటింగ్ పూర్తయి, ఆ సినిమా వెలుగు చూస్తుందో లేదో అనుమానమే. ఈ గండాలన్నీ గట్టెక్కి థియేటర్ ముఖం చూసినా ఒకటి రెండు రోజుల్లోనే ఎత్తేస్తారు. ’’
‘‘లేకపోతే ఏళ్ల పాటు ఒకే సినిమా నడుస్తుందని అనుకుంటున్నావా? షోలే సినిమా ముంబయిలో దశాబ్దాల పాటు నడిచిందట. ఇవి లవకుశ, అడవిరాముడు సినిమాల కాలం కాదు. వారం నడిస్తే ఘన విజయం సాధించినట్టే! సినిమాలు చూడడం లేదు కాబట్టి ఇది నీకు తెలియకపోవచ్చు.’’
‘‘అక్కడికే వస్తున్నా.. సినిమా విడుదలై నాలుగైదు షోలు నడవడమే కష్టం. కానీ సినిమా ప్రారంభంలో మాత్రం- ఇది బ్లాక్‌బస్టర్ సినిమా కాబోతోంది.. కొత్త కథ, సరికొత్త చిత్రీకరణ, నిర్మాత ఖర్చుకు వెనుకాడలేదు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.. అని గొప్పగా ప్రకటిస్తారు. తీరా చూస్తే విడుదలైన రెండో రోజు థియేటర్లలో సినిమా కనిపించదు. దర్శకుడు నిర్మాతకు కనిపించడు. నిర్మాత బయ్యర్లకు చిక్కడు.’’
‘‘అచ్చం సినిమాలానే అనిపిస్తుంది. తల నొచ్చినా, ఇంట్లో భార్య చివాట్లు పెట్టినా నాయకుడు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ప్రకటించడం, విడుదలకు కూడా నోచుకోని సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అని చెప్పుకోవడం ఒకటే అనిపిస్తోంది’’
‘‘ఆ మధ్య ఒకరు వంద రోజులు నడిచే సినిమా కథ కోసం తెగ ప్రయత్నించాడు..’’
‘‘సిన్మా తీశారా?’’
‘‘ఆ తీశారు.. ’’
‘‘వావ్.. ఇంతకీ ఆ సినిమా పేరు..?’’
‘‘శతదినోత్సవం?’’
‘‘??’’
‘‘ఔను- సినిమా పేరే శతదినోత్సవం, రెండు షోలు మాత్రమే నడిచింది. నిర్మాతకు భారీ నష్టాన్ని మిగిల్చింది. శతదినోత్సవ నిర్మాత రికార్డు సృష్టించాడు..’’
‘‘నిజమేనోయ్.. ఈ రోజుల్లో నాయకుల ప్రకటనల్లో వాస్తవం ఉండదు. సినిమాల్లో కథ ఉండదు. రెండూ భ్రమలే’’
‘‘అందుకేనేమో యువత సినిమా నుంచి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు మళ్లుతోంది. ’’
‘‘ఔను.. చంద్రయాన్-2 ప్రయోగంలో అడ్డంకులు ఏర్పడితే ఇస్రోలో అంత పెద్ద అధికారి- బాగా చదివే విద్యార్థికి తక్కువ మార్కులు వస్తే ఏడ్చినట్టు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. ప్రధాని ఆయనను భుజం తట్టి అనునయించాడు. దేశమంతా చలించిపోయింది. సినిమా హీరోలను మించి దేశం మొత్తం ఇస్రో కృషిని అభినందించింది. యువత ఇస్రో చైర్మన్ శివన్‌కు అండగా నిలిచింది. దేశం మారుతోందనడానికి ఇదే బలమైన సంఘటన’’
‘‘ఐతే.. ఏమంటావ్?’’
‘‘దేశం మారుతోంది. యువత మారుతోంది. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనే చిరాకు తెప్పించే రొటీన్ డైలాగ్‌ను దాటి- తాము పైకి రావాలని నాయకులు కూడా గ్రహించాలి..’’
*-బుద్ధా మురళి (జనాంతికం 13-9-2019)

9, సెప్టెంబర్ 2019, సోమవారం

ఆర్థిక భద్రత

ఈ మధ్య జాతీయ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ముంబై ఐఐటి నుంచి బిటెక్, ఎంటెక్ చేసిన యువకుడు శ్రావణ్ కుమార్ రైల్వేలో దన్‌బాద్ డివిజన్‌లో దిగువ స్థాయి ఉద్యోగంలో చేరాడు. అక్కడి రైల్వే అధికారులంతా ఆశ్చర్యపోయారు. వారే కాదు ఈ వార్త చదివిన వారు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రైల్వేలో డీ గ్రూప్ ఉద్యోగం నెలకు జీతం 18 వేల రూపాయలు. మిత్రులంతా కార్పొరేట్ కంపెనీల్లో చేరితే నువ్వు రైల్వేలో దిగువ స్థాయి ఉద్యోగంలో ఎందుకు చేరుతున్నావు అని ప్రశ్నిస్తే అతను చెప్పిన సమాధానం ఉద్యోగ భద్రత కోసం అని...
దేశంలోని ఐఐటిలన్నిటిలో ముంబై ఐఐటి మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి ఏటా క్యాంపస్ సెలక్షన్‌ల వార్తలు మనం చూస్తూనే ఉంటాం. ఏటా కోటి రూపాయల జీతానికి కోటిన్నరకు సెలక్ట్ అయిన ఐఐటి విద్యార్థులు అని. తెలుగు నాట ఐఐటి క్రేజ్ ఇంతా అంతా కాదు. అసలు మనిషి పుట్టిందే ఐఐటి చదువు కోసం అన్నట్టుగా తల్లిదండ్రులు పిల్లలు కష్టపడతారు. ఐఐటిలో చేరేందుకు టెన్త్ నుంచి రామయ్య కోచింగ్, ఆరవ తరగతి నుంచి శర్మ కోచింగ్, ఆరవ తరగతి వరకు స్కూల్‌లో ఐఐటి కోసం ప్రత్యేక శిక్షణ. హైదరాబాద్ నల్లకుంటలో ఉదయం ఐదు గంటల నుంచే ఐఐటి శిక్షణ హడావుడి కనిపిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిందే! ఐఐటి సీటు కోసమే అంత కష్టపడతారు. అలాంటిది ఐఐటిలో బిటెక్, ఎంటెక్ పూర్తి చేసిన తరువాత రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడం వింతగానే అనిపించవచ్చు. అతను చేసింది తప్పా? ఒప్పా? అని మనం నిర్ణయించలేం. అతని జీవితం అతని ఇష్టం. అతని అభిరుచి అతనిష్టం.
ఎందుకిలా చేశావు అని అతన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఐతే భద్రత ఉంటుంది. కార్పొరేట్ రంగంలోనైనా, ప్రైవేటు రంగంలోనైనా భద్రత ఉండదు. నాకు ఉద్యోగ భద్రత ముఖ్యం అని సమాధానం ఇచ్చారు.
అతని నిర్ణయం తీసిపారేయదగినదేమీ కాదు. అలా అని ఆహ్వానించదగింది కూడా కాదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రతతో కూడిన జీవితం అనే నమ్మకం ఉంటుంది. కార్పొరేట్ రంగంలో లక్షల రూపాయల్లో జీతం ఉన్నా ఉద్యోగ భద్రత ఉండదు.
ప్రభుత్వ ఉద్యోగి అయితేనే అమ్మాయిని ఇస్తాం అనే తల్లిదండ్రులు రెండు మూడు దశాబ్దాల క్రితం ఎక్కువగా కనిపించేవారు. చిన్ననాటి నుంచి వాళ్లిద్దరినీ భార్యాభర్తలు అనుకున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం లేదని పిల్లను ఇవ్వడానికి ఇష్టపడలేదు అనే ఉదంతాలు చాలా కుటుంబాల్లో కనిపిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉద్యోగ భద్రత ఉటుంది. రిటైర్ అయిన తరువాత పెన్షన్ ఉంటుంది అనే ధీమాతో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికే పిల్లను ఇవ్వడానికి ఇష్టపడేవారు.
కార్పొరేట్ ఉద్యోగంలో జీతం బాగుంటుంది. రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగంలో జీతం పద్దెనిమిది వేలే. ఇలాంటి సందర్భం వస్తే ఏం చేయాలి అని సందేహం వస్తే ఏం చేయాలి.
ఏదో ఒకటే కోరుకోవడం ఎందుకు రెండింటిని కలిపి కోరుకోలేమా?
అదెలా సాధ్యమా?
డబ్బు లక్షణాలు తెలిస్తే అది సాధ్యమే!
బిఎస్‌ఎన్‌లాంటి సంస్థ భవిష్యత్తు ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఇండియన్ ఏయిర్ లైన్స్, బిఎస్‌ఎన్‌ఎల్ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మన కళ్ల ముందే బిడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, అల్విన్ వంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూత పడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్నో కార్పొరేషన్లు మూత పడ్డాయి. మరి అందులో ఉద్యోగంలో చేరిన వారు కూడా శ్రావణ్ కుమార్ లానే ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండదనుకునే చేరారు కదా?
ముంబై ఐఐటిలో ఎంటెక్ చేసి శ్రావణ్ కుమార్ కేవలం ఉద్యోగ భద్రత కోసం చేసిన రైల్వేలో సైతం శాశ్వతంగా ఉద్యోగ భద్రత ఉంటుంది అనే నమ్మకం లేదు. రైల్వేను ప్రైవేటీకరిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. మన కళ్ల ముందే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం అయినప్పుడు రైల్వే అయితే పెద్దగా ఆశ్చర్యపోవలసిన అవసరం కూడా లేదు.
ప్రభుత్వ ఉద్యోగంలో జీతం తక్కువ అయినా టెన్షన్ ఉండదు, ఉద్యోగ భద్రత ఉంటుంది అనే నమ్మకం తేలిగ్గా తీసేయాల్సిందేమీ కాదు. అదే విధంగా కార్పొరేట్ కంపెనీల్లో లక్షల్లో జీతాలు ఉన్నా పని ఒత్తిడి, ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనే భయం. జీవితానికి భద్రత లేని పరిస్థితి నిజమే.
మరేం చేయాలి? కార్పొరేట్ రంగంలోని ఎక్కువ జీతం, ప్రభుత్వ ఉద్యోగంలోని భద్రత రెండూ సాధ్యం కాదా? అంటే...
డబ్బు గురించి అవగాహన, కొంత ఆలోచన ఉంటే సాధ్యం అవుతుంది.
కాలం మారింది. జీవితం సంక్లిష్టంగా మారింది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగానికే భద్రత లేని పరిస్థితుల్లో కార్పొరేట్ రంగంలో ఉద్యోగ భద్రతపై పెద్దగా ఆశలు పెట్టుకోలేం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు పోతాయో అనే టెన్షన్ నిజమే. అదే సమయంలో ఉద్యోగ అవకాశాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా విస్తృతంగా ఉన్న మాట నిజమే.
కార్పొరేట్ రంగంలో కానీ ప్రైవేటు రంగంలో కానీ ఎక్కువ జీతానికి ఉద్యోగం లభించినప్పుడు ఉద్యోగ భద్రత లేదు అనే దిగులుతో పని చేయడం కన్నా ... జీతం ఎక్కువైన జీవన శైలి మాత్రం తక్కువ ఖర్చు స్థాయిలోనే గడిపితే రేపటికి ఢోకా ఉండదు. 18 వేల జీతంతో రైల్వే ఉద్యోగం కన్నా కార్పొరేట్ రంగంలో లక్ష రూపాయ జీతానికి ఉద్యోగం లభిస్తే, దాదాపు పాతిక వేల ఆదాయం స్థాయిలో జీవితం గడిపి, 75వేల రూపాయలను సరిగ్గా ఇనె్వస్‌ట చేస్తే శ్రావణ్ కుమార్ జీవితానికి బోలెడు భద్రత లభిస్తుంది. 75 శాతం సాధ్యం కాకపోయినా 50 శాతం డబ్బును కనీసం ఐదు పదేళ్లపాటు అతను సరిగా ఇనె్వస్ట్ చేస్తే అతనికి ప్రభుత్వ ఉద్యోగానికి మించిన భద్రత లభిస్తుంది.
కుటుంబ పరిస్థితి, అవసరాలు, ఆర్థిక స్థితి అన్నీ కలిపి ఒక నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తుంది. శ్రావణ్ కుమార్ నిర్ణయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
ఐఐటి అని కాకపోయినా కార్పొరేట్ రంగంలో, ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తున్న ఈ తరం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ అనే అలవాట్లను మొదట్లోనే అలవాటు చేసుకుంటే జీవితానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఐదు -పదేళ్ల పాటు సగం జీతం స్థాయిలో గడిపితే.. ఆ ఇనె్వస్ట్‌మెంట్ ఉద్యోగం పోయినా జీతం అందించే స్థాయికి చేరుకుంటుంది. జీవితానికి ఇంతకు మించిన భద్రత ఇంకేం ఉంటుంది.
-బి.మురళి(ధనం మూలం 8-9-2019)

7, సెప్టెంబర్ 2019, శనివారం

అమెరికా కా? నేపాల్ కా ?

‘‘చెప్పినా వినకుండా... సర్వనాశనం చేస్తున్నారు...’’
‘‘ఏం జరిగిందోయ్...?’’
‘‘మన జీడీపీ ఎంతో తెలుసా? టాటా కార్ల ఫ్యాక్టరీలను రెండు రోజులు మూసేశారన్న సంగతైనా తెలుసా? పార్లే-జీ బిస్కట్లు తింటున్నావా? ఆ ఫాక్టరీలో పదివేల మంది ఉద్యోగులను తొలగించారన్నది తెలుసా?’’
‘‘చూడోయ్.. నాకు ఏ నెల జీతం ఆ నెలకే సరిపోవడం లేదు. మా అ బ్బాయి కారు కొందామని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఈ మహానగరంలో కారైనా, సైకిలైనా ఒకటే స్పీడ్.. హాయిగా మెట్రోరైలెక్కి పోకుండా కారెందుకు రా.. అని నచ్చజెప్పా. కారు తీసుకొని మోండా మార్కెట్‌కు వెళ్లినా, మహంకాళి గుడికెళ్లినా నరకమే! ఎక్కడా పార్కింగ్‌కు అవకాశం లేదు. నడుచుకుంటూ వెళ్లడమే నయం. నామాట విను.. నువ్వు కూడా కారు కొనకు.. హాయిగా బస్సులోనో, మెట్రోలోనో వెళ్లు. మరీ అంతగా కారెక్కాలని అనిపిస్తే ఊబర్ టాక్సీ బుక్ చెయ్’’
‘‘నేనేం చెబుతున్నాను.. నువ్వేం మాట్లాడుతున్నావ్?’’
‘‘అదే లేవోయ్.. టాటా కార్ల ఫ్యాక్టరీని రెండు రోజులు మూసేశారన్నావ్.. అదే కదా? ఈరోజు కొనాలనుకున్నది మరో రెండు రోజుల తరువాత కొంటావేమో? అంతోటి దానికి ఇంత ఆవేశం, ముఖంలో ఇన్ని రూపాలు మార్చడం అవసరమా?’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్?’’
‘‘ఆ.. పార్లే బిస్కట్ల గురించే కదా? ఈ కాలం పిల్లలంతా పిజ్జాలు, బర్గర్‌లు అంటూ జపిస్తుంటే నువ్వేమో ఇంకా పాతకాలం వాడిలా పార్లే బిస్కట్ల కోసం ఇంతగా తపిస్తున్నావంటే.. నువ్వు గ్రేట్‌రా!’’
‘‘ఎహే ఆగు.. ఇంత అజ్ఞానంతో మనుషులు ఎలా ఉంటారో అర్థం కావడం లేదు. నేను పడిపోయిన జీడీపీ గురించి, తగ్గిపోయిన గ్రోత్ రేట్ గురించి, ఆగిపోయిన పరిశ్రమల గురించి.. ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతుంటే- నువ్వేంటి.. సిల్లీగా బిస్కట్లు, చాక్లెట్లు అంటూ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నావ్!’’
‘‘చెప్పుకుంటే సిగ్గుచే టు కానీ, ఆర్థిక సంక్షోభం అంటే ఏంటి? అంతా దా నిపై తెగ మాట్లాడేస్తున్నా రు. మన చిన్నప్పుడు స్కై లాబ్ పడిపోయి ప్రపం చం అంతా భస్మీపటలం అవుతుందని తెగ భయపడేవారు. ఇప్పుడలాంటిదేమన్నా భూగోళానికి ముప్పుగా మారిందా?’’
‘‘అంతకన్నా పెద్ద ముప్పు! ప్రపంచానే్న గడగడలాడిస్తోంది..’’
‘‘ఫేస్‌బుక్‌లో చూశా.. ఆంధ్రపదేశ్‌లో బాబు ఓడిపోయి జగన్ గెలవడం వల్ల, బాబుకు మద్దతు ఇచ్చే మీడియాను కాదని, జగన్‌కు మద్దతు ఇచ్చే మీడియా వల్లనే ప్రపంచానికి ఈ ప్రమాదం ముంచుకొచ్చిందని కొందరు రాశారు. అస్సలు అర్థం కాలేదు. మరీ బడాయి కాకపోతే జగన్‌కు ఆంధ్రలో బలం ఉంది నిజమే, ప్రపంచాన్ని గజగజలాడించేంత బలం ఉందంటావా?’’
‘‘ఎహే.. జగన్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి ప్రపంచం ఆర్థిక సంక్షోభం బాట పట్టింది’’
‘‘అంటే- బాబు వల్లనే ప్రపంచానికి ఆర్థిక సంక్షోభం అంటావా?’’
‘‘అబ్బా- నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ప్రపంచంలో ఏం జరిగినా ఐతే బాబు లేదంటే జగన్.. ఆ ఇద్దరి వల్లనే అంటావా? నీకు వీళ్లే ప్రపంచంలా కనిపిస్తున్నారా? ప్రపంచం వీరిద్దరి కార్యక్షేత్రాల కన్నా పెద్దగా ఉంటుంది.’’
‘‘ఔను.. మోదీ వల్లనే అని బాగా ప్రచారం జరుగుతోంది. మోదీ వల్ల ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడుతుందా? ఆయనెవరో- శివసేన నాయకుడు ఇప్పటికైనా మన్మోహన్ సింగ్‌ను పిలవండి, ఆయన సలహాలు తీసుకుని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడండని సలహా ఇచ్చినట్టు ఉన్నాడు. ప్రపంచాన్ని రక్షించేంత సత్తా మన దేశానికి చెందిన నాయకుడికి ఉండడం గర్వకారణం. ఆయన ఏ పార్టీ ఐనా కానీ, ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసింది మా సింగ్ గారే అని చెప్పుకోవడం మనకెంత గర్వకారణంగా ఉంటుంది?’’
‘‘నీకు ఆర్థిక అంశాల గురించి ఏమీ తెలియదని నాకు అర్థమైంది’’
‘‘చిన్నప్పుడు జేమ్స్‌బాండ్ సినిమాలు చాలా చూశా. ప్రపంచం సంక్షోభంలో పడిపోయినప్పుడు జేమ్స్‌బాండ్ అందమైన అమ్మాయితో కలిసి సాహసాలు చేసి ప్రపంచాన్ని రక్షిస్తాడు. హాలివుడ్ వాళ్లు సినిమాల్లో మాత్రమే ప్రపంచాన్ని రక్షించారు. కానీ మా సర్దార్జీ నిజంగా ప్రపంచాన్ని రక్షించాడని చెప్పుకోవడం ఎంత గర్వంగా ఉంటుంది’’
‘‘నీకు విషయం అర్థం కావడం లేదు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది. అంటే డబ్బులకు కటకట అన్నమాట’’
‘‘వావ్- ఎంత మంచి మాట చెప్పావురా! నెలాఖరులో మనం డబ్బులకు కటకటలాడుతాం. చివరి మూడు రోజులు టీ, టిఫిన్‌లకు కూడా డబ్బులుండవు. అంటే దేశాలు కూడా మనలాంటి వేతన జీవులే అన్నమాట. ఖర్చుకు డబ్బు లేక కటకటలాడుతున్నాయి.’’
‘‘అది కాదు.. జీడీపీ అని ఒకటుంటుంది లే! మన జీడీపీ గ్రోత్ రేట్  పాకిస్తాన్ కన్నా తక్కువ. బంగ్లాదేశ్ జీడీపీ గ్రోత్ రేట్ 8 శాతం, నేపాల్ 7.9, భూటాన్ 7.4 పాకిస్తాన్ 5.4 కానీ- ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 5 శాతమని తెలుసా?’’
‘‘వాట్సాప్‌లో ఈ ప్రచారం చూశాను. నీకో మంచి ఐడియా ఇవ్వా లా?’’
‘‘ఇవ్వు.. ’’
‘‘మీ అబ్బాయిని అమెరికా కా ?  కెనడా కా ? ఎటు పంపాలి అని తెగ ఆలోచిస్తున్నావు కదా ? అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నావు కదా? ఆ ప్రయత్నాలన్నీ మానేయ్’’
‘‘ఎందుకు?’’
‘‘అమెరికా వెళ్లాలంటే అరకోటి ఖర్చు. ట్రంప్ అక్కడ ఉండనిస్తాడో వెనక్కి పంపుతాడో తెలియక రోజూ టెన్షన్‌తో చావాలి. పైగా అమెరికా జీడీపీ గ్రోత్ రేట్ 50 ఏళ్ళ నుంచి 3శాతమే. అదే నేపాల్‌కో, పాకిస్తాన్‌కో పంపించావనుకో ఎనిమిది శాతం జీడీపీ గ్రోత్ రేట్ . మన రూపాయికి అక్కడ రెండు రూపాయిలిస్తారు. రైలులో వెళ్లి పోవచ్చు. ఏమంటావ్?’’
‘‘ఏం చెప్పదలుచుకున్నావ్..’’
‘‘ప్రతి విషయం మీద మనం మాట్లాడొద్దు. సాహో సినిమా గురించి మాట్లాడడం వేరు. ఆర్థిక సంక్షోభం, జీడీపీ వంటి విషయాలు వేరు. ఇదేమీ రెండు గంటల సినిమా కాదు. ఆ రంగంలో నిపుణులు చెప్పింది విందాం. తెలియని దాని గురించి ఏదో అయిపోతుందని ప్రచారం చేయకు. ఈ దేశానికి సంక్షోభాలు కొత్త కాదు. ఎదిరించి నిలబడింది. నిలబడుతుంది. భవిష్యత్తు మనదే.
బుద్దా మురళి (జనాంతికం 7-9-2019)