మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది . ఒక వైపు నుంచి కాదు అన్ని వైపుల నుంచి . అసలు మీడియా ఉనికే ప్రమాదం లో పడుతోంది . కరోనా మీడియా ను ఆర్థికంగా దెబ్బ తీస్తే వీధి రౌడీలు సైతం ప్రారంభిస్తున్న యూ ట్యూబ్ ఛానల్స్ అసలు మీడియా ఉనికినే ప్రమాదం లో పడేస్తున్నాయి . తెలుగులో తొలి తరం పత్రికలు 121 సంవత్సరాల క్రితం పుట్టిన కృష్ణా పత్రిక (1902) ఆంధ్ర పత్రిక (1908 ) నుంచి ఇప్పటి వరకు మీడియా కు సంబంధించి సాంకేతికం గా ఎంతటి ముందడుగు వేసినా ఉనికికి సంబంధించి ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం గతం లో ఎప్పుడూ లేదు . మీడియాకు సంబంధించి అత్యవసర పరిస్థితిని చాలా గడ్డు కాలం అనే వారు . ఐతే అత్యవసర పరిస్థితి లోనూ మీడియా మూత పడలేదు . విశ్వసనీయత , ఉనికికి సంబంధించి ఇంతటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోలేదు . పైగా అత్యవసర పరిస్థితికి వ్యతిరేకం గా పోరాడాయి అని మీడియా పై ఆ రోజుల్లో గౌరవం పెరిగింది . అత్యవసర పరిస్థితి కాలం లో సంపాదకీయం స్థానం లో ఏమీ ప్రచురించకుండా తెల్లపేపర్ వదిలేయడం ద్వారా కూడా పత్రికలు నిరసన వ్యక్తం చేశాయి . మరి ఇప్పుడు నచ్చక పోతే పారిశ్రామిక వేత్తల ద్వారా ఆ మీడియానే కొనేస్తున్నారు . దేశం లో నంబర్ వన్ స్థానం లో నిలిచినా ఎన్ డి టివి ఇలానే అదానీ హస్తగతం అయింది . ఇప్పుడు ఒక వైపు కనిపించని అత్యవసర పరిస్థితి , మరో వైపు యూ ట్యూబ్ ఛానల్స్ పేరుతో సాగుతున్న అరాచకం , నిర్వహణా వ్యయం పెరగడం , ఆదాయం తగ్గడం వీటన్నిటితో మీడియా కొట్టుమిట్టాడుతోంది .
30, మార్చి 2023, గురువారం
యూట్యూబ్ ఛానల్స్‌తో ప్రమాదం లో మీడియా ఉనికి
ప్రింట్ అయిన కరపత్రం అయినా ఒకప్పుడు దానికి ఓ విలువ ఉండేది . మరి ఇప్పుడు వీధి రౌడీ కత్తి పట్టుకొని వీధిలో అందరినీ భయపెట్టినట్టు ఒక్క సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో యూ ట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి జనం మీద పడిపోవచ్చు .
మీడియా - రాజకీయ పక్షాల అనుబంధం కొత్తదేమీ కాదు . అసలు మీడియా పుట్టిందే రాజకీయ పక్షాలకు అనుబంధం గా . బ్రిటిష్ పాలనా కాలం లో దేశం లో మీడియా ప్రారంభం అయింది . స్వాతంత్య్ర పోరాటం , మీడియా కలిసే సాగాయి . మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ , తెలుగునాట ప్రకాశం పంతులు ,ఒక వైపు స్వతంత్ర సమర యోధులుగా కాంగ్రెస్ నాయకులుగా పోరాడుతూనే పత్రికలు నడిపారు . కాంగ్రెస్ నాయకత్వం లో స్వాతంత్య్ర పోరాటం లో పాల్గొన్న మహనీయులు అందరూ తమ పోరాట ప్రచారం కోసం పత్రికలు ప్రారంభించారు . తెలంగాణ లో గోల్కొండ పత్రిక వంటివి హైదరాబాద్ రాష్ట్రం లో స్వతంత్ర పోరాటం లో పాల్గొన్నాయి . కాంగ్రెస్ పార్టీకి అనుబంధం గానే దేశం లో మీడియా అనేది ప్రారంభం అయినా , ఆనాటి మీడియా పై ఒక పార్టీకి అనుకూలం అనే విమర్శ రాలేదు . ఎందుకంటే దేశం లో ప్రజలందరి లక్ష్యం స్వాతంత్య్రమే కాబట్టి మీడియాకు పార్టీ అనుబంధం అనే అంశం పెద్దగా విమర్శల పాలు కాలేదు . ఎక్కువ పత్రికలు కాంగ్రెస్ కు అనుబంధం గా ఉంటే కమ్యూనిస్ట్ లకు కూడా పత్రికలు ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకూ ఉన్నాయి .
1980 వరకు తెలుగు నాట బహుళ పత్రికల ప్రాభల్యం ఉండేది . చిన్న పత్రికలూ ఆయా ప్రాంతాల్లో ప్రభావం చూపేవి . తెలుగు దేశం ఆవిర్భావం , తెలుగుదేశం కు ఒక మీడియా మద్దతు క్రమం గా పరిస్థితులు మారిపోయాయి . అత్యధిక సర్క్యూ లేషన్ గల పత్రిక టీడీపీకి అండగా నిలిచింది . మొత్తం పాఠకుల్లో ఒక దశలో 90 శాతం మంది అత్యధిక సర్క్యు లేషన్ పత్రిక వెంటే ఉండేవారు . దాంతో దాదాపు 1995 వరకు మెజారిటీ మీడియా టీడీపీ వైపే . మధ్యలో దాసరి నారాయణరావు పత్రిక తుపాన్ లా వచ్చినా ఎక్కువ రోజులు నిలువ లేదు .
చివరకు ఇప్పుడు ప్రతి రాజకీయ పక్షానికి ఒక మీడియా ఉంది . ప్రత్యక్షంగా పార్టీకి అనుబంధం గా కావచ్చు , పరోక్షం గా ఔట్ సోర్సింగ్ మద్దతు గా కావచ్చు . రెండు రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు మీడియా ఉంది . చివరకు పాత నగరానికే పరిమితం అయిన ఎం ఐ ఎం పార్టీకి సైతం సొంత మీడియా ఉంది . సాక్షి ప్రారంభించే సమయం లో ఉమ్మడి రాష్ట్రం లో దగ్గుబాటి వెంకటేశ్వర రావును అసెంబ్లీ లాబీ లో కొమ్మినేని శ్రీనివాస్ ఒక రాజకీయ పార్టీ నేరుగా పత్రిక ప్రారంభించడం ఏమిటి అని విస్మయం ప్రకటించారు . నిష్పక్ష పాత మైన మీడియా ఉంటే మంచిదే , కానీ అది కల . ఒకే పార్టీకి మీడియా ఉండడం కన్నా , అన్ని పార్టీలకు మీడియా మంచిది అంటే దగ్గుబాటి సమర్ధించారు . తనకు జరిగిన వెన్నుపోటు లో మీడియా పాత్ర ఉందని ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు . మీడియా మొత్తం ఒకే పార్టీ వైపు ఉండడం అత్యంత ప్రమాదకరం . దీని కన్నా అన్ని పార్టీలకు మీడియా బెటర్ .
2005 తరువాత మీడియాలో చాలా మార్పులు వచ్చాయి . అన్ని పార్టీలకు సొంత మీడియా ఉండడం తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా విజృంభణ మొదలైంది . అంతకు ముందు ఉన్నవే మూడు పత్రికలు ఒక దానిలో ఎడిటర్ కు కోపం వచ్చి ఉద్యోగం తీసేస్తే రోడ్డున పడాల్సిందే . గోయంకా కు చెందిక పత్రికలో ఇలా ఉద్యోగం పోయి గుండెపోటు తో మరణించిన జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు . ఇలాంటి దుర్భర కాలాన్ని చూసిన వారికి 2005 తరువాత వచ్చిన మీడియా బూమ్ అనేక అవకాశాలు కల్పించింది . కరోనా కాలం వరకు ఇది సాగింది .
ఇప్పుడు యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల బూమ్ కాలం . దీనిలో అంతా చెడే అని చెప్పలేం . మంచి చేడు రెండూ ఉన్నాయి . చెడును తొలగించుకుంటే మీడియా బతుకుతుంది . లేదంటే ఈ చేడు మొత్తం మీడియానే మింగేస్తుంది . మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు కూడా తమ పత్రికలో రాకూడదు అని అత్యధిక సర్క్యూ లేషన్ ఉన్న పత్రిక యజమాని ఆంక్షలు విధించారు . ఆయన ఏం మాట్లాడినా మెజారిటీ పాఠకులకు తెలియదు . కానీ యూ ట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయారు . లక్షల మంది ఉపన్యాసాలు విన్నారు . ఎక్కడో ఓ మూల పేరు వస్తే చాలు అనుకునే దశ నుంచి ఉపన్యాసం నేరుగా లక్షల మందికి పైసా ఖర్చు లేకుండా యూ ట్యూబ్ ఛానల్స్ చేరుస్తున్నాయి . ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభిస్తున్నాయి.
. ఉద్యోగం పోయినా రోడ్డున పడం యూ ట్యూబ్ ఛానల్ పెట్టుకొని బతికేద్దాం అనే ధీమా జర్నలిస్ట్ లకు కలిగింది . యూ ట్యూబ్ ఛానల్స్ కు సంబంధించి ఇవి పాజిటివ్ అంశాలు . కానీ నెగిటివ్ అంశాలు మొత్తం మీడియా ఉనికినే ప్రశ్నార్ధకం గా మార్చేట్టుగా ఉన్నాయి .
ప్రతి రాజకీయ పక్షానికి సొంత మీడియా ఉన్నట్టే సొంతంగా పలు యూ ట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి . తమ పార్టీ నాయకులను ఆకాశానికి ఎత్తడం , ప్రత్యర్థి పార్టీ పై , నాయకులపై భూతులు , మార్ఫింగ్ , అసత్యాలు ప్రచారం చేయడం ఈ బృందం పని . తమ పార్టీ యూ ట్యూబ్ బృందమే తనకు వ్యతిరేకం గా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆ మధ్య కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాపోయారు . సొంత పార్టీ లో నచ్చని వారిని సైతం యూ ట్యూబ్ ఛానల్స్ ద్వారా దాడులు చేస్తున్నారు . రేడియా పుట్టి పుట్టి వందేళ్లు అవుతున్నా వార్తలు ప్రసారం చేయడానికి అనేక ఆంక్షలు . ఎఫ్ ఏం రేడియోలో ట్రాఫిక్ ఎక్కడ ఎలా ఉందొ చెప్పడం తప్ప వార్తలు చెప్పడానికి వీలు లేదు . ఓ వంద కాపీ లు ముద్రించే పత్రికను సైతం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి , అనేక ఆంక్షలు ఉంటాయి . క్షణాల్లో లక్షల మందికి చేరే యూ ట్యూబ్ ఛానల్ విషయం లో మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు . ఎంత విచ్చల విడి తనం ప్రదర్శిస్తే అంత గొప్ప . అసహ్యంగా మాట్లాడ వచ్చు , ఆ భ్యంతర కరం గా మార్ఫింగ్ చేయవచ్చు . వెకిలి తనం ప్రదర్శించినా , ఆడవారిని అగౌరవ పరిచినా ఏమీ కాదు పైగా చూసే వారి సంఖ్య పెరుగుతుంది . ఆదాయం వస్తుంది అనే నమ్మకం బలం గా ఏర్పడింది . నిజంగా ఎలాంటి నియమ నిబంధనలు ఉండవా ? విచ్చల విడి తనం ఆమోదిస్తారా ? అంటే అలా ఏమీ ఉండదు . అడ్డుకునే వారు లేనంత వరకు ఇది సాగుతుంది .
జర్నలిజం లోకి యూ ట్యూబ్ రౌడీ ఇజం ప్రవేశిస్తే ఏమీ చేయలేమా ? యూనియన్లు ఏమీ చేయలేవా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి . మూడు నాలుగు పత్రికలు మాత్రమే ఉన్న రోజుల్లోనే యూనియన్లు కొద్దిపాటి ప్రభావం చూపించాయి . మీడియా - రాజకీయ పక్షాల అనుబంధం , మీడియా బూమ్ తరువాత యూనియన్ల పాత్ర నామమాత్రం గానే మారింది . దేశం లో ఏదో ఓ రాష్ట్రం లో మీటింగ్ జరిగితే ప్రతి నిధులుగా పాల్గొనడానికి మించి యూనియన్లు చూపే ప్రభావం తక్కువ .
రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారం లో నిరవ్ మోడీ వంటి ఆర్ధిక నేరస్తుల గురించి ప్రస్తావిస్తూ మోడీ ఇంటి పేరున్న వారిపై చేసిన వ్యాఖ్యకు రెండేళ్ల జైలు శిక్ష విధించారు . ఇంటి పేరు పై చేసిన వాఖ్య కే రెండేళ్ల శిక్ష విధిస్తే తమకు నచ్చని నాయకులు , వారి కుటుంబం పై విచ్చల విడిగా అంత అసహ్యకరం గా యూ ట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతుంటే వీరికి చట్టం వర్తించదా ? అనిపిస్తుంది .
జర్నలిజం పేరుతో వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్న వారి పై జర్నలిస్ట్స్ యూనియన్లు చేయగలి గింది ఏమీ లేదు . మీడియా పది కాలాల పాటు ఉండాలి అని కోరుకునే జర్నలిస్ట్ లు , ప్రజాస్వామిక వాదులు , బాధితులు న్యాయ స్థానాలను ఆశ్రయించాలి .
అబద్దాలు ఐనా సరే ప్రచారం చేయండి అని స్వయం గా హోమ్ మంత్రి అన్నట్టు పత్రికల్లో వచ్చింది . బిజెపి అధికారం లోకి రావడం లో సామాజిక మాధ్యమాల ప్రచారం పాత్ర పెద్దది . వీటి నుంచి ప్రయోజనం పొందుతున్న పార్టీ కేంద్రం లో అధికారం లో ఉంది . సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించే అధికారం కేంద్రానిది . వీటి నుంచి ప్రయోజనం పొందుతున్న వారి నుంచి సంస్కరణలు ఆశింయించలేం .
అత్యాచారానికి గురైన మహిళ పేరు , ఫోటో చూపకూడదు . అలా చూపినందుకు ఓ ప్రముఖ ఛానల్ పై ఓ మహిళా న్యాయవాది కోర్టుకు వెళ్లారు . కోర్ట్ ఛానల్ కు జరిమానా విధించింది . నా ఉద్దేశం ఛానల్ శిక్ష పడాలి అని కాదు ఇలా కేసు వేయడం వల్ల నిబంధనల గురించి జర్నలిస్ట్ లకు తెలుస్తుంది అని ఆ మహిళా న్యాయవాది కేసు ఉద్దేశాన్ని వివరించారు . యూ ట్యూబ్ ఛానల్ పెట్టి ఎవరినైనా ఎంత అసహ్యకరం గా నైనా తిట్ట వచ్చు , మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేయవచ్చు అని భావిస్తున్న వారికి కేసుల ద్వారానే నిబంధనలు నేర్పడం అవసరం . లేక పోతే రౌడీ ఇజానికి జర్నలిజానికి తేడా లేకుండా పోతుంది .
- బుద్దా మురళి
NAMASTHE TELANGANA 27-3-2023
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)