11, ఏప్రిల్ 2011, సోమవారం

అధ్యక్షునికి జలుబు చేయడాన్ని తట్టుకోలేక 50 మంది అభిమానులు ఆత్మహత్య: సరదా కబుర్లు

ఏమండీ! పేపరు చదువుతూ ఆలా ఏడుస్తున్నారేం? అప్పులోళ్లు తిట్టిన తిట్లు గుర్తుకొస్తున్నాయా?’’ అంటూ శ్రీమతి ఆందోళనగా పరిగెత్తుకొచ్చింది. ‘‘పిచ్చిదానా అప్పులోళ్లు తిట్టినందుకే ఏడిస్తే ఈ భూమ్మిద ఎవడూ అంతెందుకు అసలు ప్రభుత్వాలే ఉండవు. అప్పు చేయడం ఒక కళ.. అప్పులోళ్లు తిడితే వినిపించుకోకపోవడం స్థిత ప్రజ్ఞత. మేం అడిగితే ప్రపంచ బ్యాంకు ఎంత రుణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మేం సాధించిన అభివృద్ధి ఇంతకన్నా ఇంకేం కావాలని గతంలో ఒక ముఖ్యమంత్రి అప్పులపై గర్వంగా చెప్పుకునేవారు గుర్తుందా?’’ అని చలపతి అడిగాడు.

‘‘అసెంబ్లీలో లాగ అసలు విషయం పక్కన పెట్టి ఏదో మాట్లాడుతున్నాం ఇంతకూ తమరు ఎందుకేడ్చినట్టు’’ అని శ్రీమతి మళ్లీ తన సందేహాన్ని బయటపెట్టింది. ‘‘ఏడవడం కాదు. ఒక్కో దేశాన్ని వెనక్కి నెట్టి మనం ముందుకెళుతుంటే ఆనందాన్ని తట్టుకోలేక ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలవి’’ అని చలపతి కళ్ల వెంట వస్తున్న నీళ్లను తుడుచుకున్నాడు. మరో దశాబ్దంలో జనభాలో చైనాను దాటి పోతున్నాం.


 ఇంత కాలం ప్రపంచంలోనే అత్యధిక జనాభా అని విర్రవీగే చైనా గర్వమనచబోతున్నాం. ఇప్పుడేమో జపాన్‌ను అదిగమించేశాం అందుకే ఆనందం ’’ అని చలపతి నింపాదిగా కన్నీటి ఉదాంతాన్ని వివరించాడు. ‘‘జపాన్‌లో అన్నీ సమయం ప్రకారం జరుగుతాయి, మనకేమో సమయం విలువ అస్సలు తెలియదాయె అలాంటిది జపాన్‌కు మనకు పోలికెక్కడ’’ అని శ్రీమతి సందేహం వ్యక్తం చేసింది.‘‘ సమయంలో కాదోయ్.. ఆ విషయంలో ప్రపంచంలో మననెవడూ దాటి పోలేడు కానీ. నేను చెప్పేది ఆత్మహత్యల గురించి.


 జపాన్‌లో రైలు ఆలస్యం అయినా చెప్పిన పని సమయానికి చేయకపోయినా, అనుకున్న లక్ష్యాలు సాధించక పోయినా ఆత్మహత్య చేసుకుంటారు. ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్యలు జరిగే దేశం జపాన్. ఎక్కడ విపరీతమైన అభివృద్ధి ఉంటుందో అక్కడ ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది కూడా.. ఇప్పుడు మనం ఆత్మహత్యల్లో జపాన్‌కు పాఠాలు చెప్పేట్టుగా ఉన్నాం’’ అని చలపతి కాసింత గర్వంగానే చెప్పాడు. ‘‘ నిజమా?’’ అని శ్రీమతి ఆశ్చర్యపోయింది.

‘‘సందేహమెందుకోయ్. అంతే కాదు జపాన్ ఆత్మహత్యలన్నీ నిరుపయోగమైనవే. కానీ మన ఆత్మహత్యలు విస్తృత ప్రయోజానాలతో కూడుకున్నవి. రాజకీయ పార్టీల ఇమేజ్ పెంచుతున్నాయి. ఓట్లు కురిపిస్తున్నాయి. మార్కెట్‌లో ఆయా పార్టీల గ్లామర్ పెంచుతున్నాయి. గతంలో ఒక పార్టీ నాయకుడి ఉపన్యాసానికి వచ్చిన జనాన్ని బట్టి ఆ పార్టీ బలాన్ని అంచనా వేసేవారు. ఇప్పుడలా కాదు ఏ నాయకుడి కోసం ఎంత మంది చచ్చారో ఆ పార్టీ అంత గొప్పదని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని చలపతి చెబుతూ పోతుంటే శ్రీమతి మధ్యలో అడ్డుతగిలి.


 ‘‘ఔనండి ఆ మధ్య ఒక సూపర్ హీరో సినిమా టికెట్ల కోసం జరిగిన తోపులాటలో ఒక అబ్బాయి చనిపోతే ఆ సినిమా నిర్మాతలు అన్ని పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. టికెట్ల కోసం తొక్కిసలాటలో ప్రాణాలు తీసేంత జనం వస్తున్నారు. మహాగొప్ప చిత్రం రండి అని పిలిచినట్టుగా ప్రకటన వేశారు’’ అని శ్రీమతి గుర్తు చేశారు.
 ‘‘ నీకు బాగానే గుర్తుందోయ్! అదే ట్రిక్కును ఆ హీరో పార్టీ పెట్టే ముందు కూడా ప్లే చేశాడు, కానీ వర్కవుట్ కాలేదు. పార్టీ పెట్టాలని డిమాండ్ చేస్తూ అభిమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెంది పార్టీ పెట్టాడు, కానీ బహుశా మేం చనిపోయేంత వరకు పార్టీ పెట్టవా? అని వారు పై లోకం నుంచి ఏమన్నారో, ఏం జరిగిందో కానీ అభిమానుల ప్రాణాలు తీసి పుట్టిన పార్టీ పెద్దగా సక్సెస్ కాలేదు’’ అని చలపతి చెప్పాడు.
 అంతేనా? అన్నట్టు శ్రీమతి ముఖం పెడితే ‘‘ ఇంకా ఉంది’’ అని చలపతి మళ్లీ చెప్పసాగాడు.‘‘ ఈ మధ్య ఒక యువనాయకుడు తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ 700 మంది మరణించారని, వారి ఓదార్పు పేరుతో రాజకీయ అరంగ్రేటం చేశాడు. కలిసొస్తే సిఎం లేదంటే ఉన్నది ఊడేదేం లేదు కదా! - అనేది ఆయన లాజిక్. అన్నప్రాస నాడే అవకాయ అన్నట్టు అరంగ్రేటం తోనే ఇంత సానుభూతా అని పదవి ఊడిన మాజీ ముఖ్యమంత్రిగారికి పౌరుషం ముంచుకొచ్చింది.
 సాధారణంగా ఆయన్ని ఆయనే నమ్ముకోడని ఆయన గురించి బాగా తెలిసిన వారందరికీ తెలుసు. అలాంటి నారానాయకుడ్ని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసినప్పుడు బిర్యానీ పెట్టలేదని 30 మంది చనిపోయారట! అదే రోజు బెంగాల్‌లో ఘోరరైలు ప్రమాదం జరిగింది. ప్రయాణీకులు ఈ నాయకుడి అరెస్టును తట్టుకోలేకే ప్రమాదంలో మరణించారు.
 కానీ ఆ విషయాన్ని ఎందుకో కానీ ఆ పార్టీ వాళ్లు ప్రకటించుకోవడం లేదు. మరి మీరు కూడా ఓదార్పు యాత్ర చేపడతారా? అంటే? వేరేవాళ్లను ఓదార్చడం ఎందుకు మా పరిస్థితి చూస్తే ఎవరైనా మమ్ములనే ఓదార్చాలి అని ఆరేళ్ల నుంచి అధికారం లేక వస్తుందో రాదో తెలియక నిరాశ నుంచి పుట్టిన వాస్తవిక వాదంతో ఓ నాయకుడు సెలవిచ్చాడు.
తెలంగాణ కోసం నాలుగు వందల మంది ఆత్మహత్య చేసుకున్నారని టిఆర్‌ఎస్ నాయకులు వాదిస్తుంటే సమైక్యాంధ్ర కోసం రెండు వందల మంది రహస్యంగా ఆత్మహత్య చేసుకున్నారని నెల్లూరు మాజీ మంత్రి ఒకరు శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చారు. ఇప్పుడు మీ నేతను అరెస్టు చేసినందుకే తట్టుకోలేక 30 మంది చనిపోయారంటున్నారు కదా? గతంలో మీరన్నట్టు ఆ పని ముందు మీరే చేయాలని కదా? అని అడిగితే ఎప్పటి పరిస్థితులు అప్పుడు అంటూ తప్పించుకున్నారు.



 పరిస్థితి ఇలానే కొనసాగితే రేపటి వార్తలు... ఫలానా పార్టీ అధ్యక్షునికి జలుబు చేయడాన్ని తట్టుకోలేక 50 మంది అభిమానులు ఆత్మహత్య. ఇది చూసి కంటతడి పెట్టిన మరో నాయకుడి కంటతడిని తట్టుకోలేక గుండె ఆగి వంద మంది మృతి. ఇలా ఉంటాయేమో వార్తలు’’ చలపతి చెబితే అలానే అనిపిస్తోందండి అని శ్రీమతి వంత పాడింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం