19, ఏప్రిల్ 2011, మంగళవారం

జీవితం అంటే రెండు ఏడుపుల మధ్య నున్న విరామ సమయం

జీవితం అంటే రెండు ఏడుపుల మధ్య నున్న విరామ సమయం. మనిషి పుట్టినప్పుడు తానేడ్చి, పోయినప్పుడు ఇతరులను ఏడిపిస్తాడు. మరి మనందరి జీవితం రెండు ఏడుపుల మధ్య నుండే సమయమే కదా! పిల్లలు తాము కోరుకున్నది సాధించుకోవాలంటే ఏడుపును మించిన ఆయుధం లేదని మాటలు రాకముందే గ్రహించేస్తారు. 


రామాయణమంతా కైక ఏడుపుతోనే కదా! కైక ఏడిస్తే దశరథుడు శ్రీరామున్ని అడవులకు పంపి తాను ఏడ్చి జీవితం చాలించాడు. కైకనే కాదు ఇప్పుడు నాయకులు సైతం ఏడుపు ద్వారానే ఏదైనా సాధించవచ్చునని భావిస్తున్నారు. మీ జీవితం ఎంత దుర్భంగా ఉందో మీకు తెలియదు, మీ బాధలు చూస్తే నాకే ఏడుపొస్తుంది అంటూ నాయకులు ఏడుపుగొట్టు రాజకీయాలు మొదలు పెట్టారు.
 నిజానికి వీరి ఏడుపులో ఎదుటివారి ఏడుపును పోగొట్టాలనే కోరిక కన్నా ఏడవడం ద్వారా వారి జీవితం పట్ల వారు ఏడ్చేట్టు చేసి అధికారం సాధించాలని ఉంటుంది. జలుబు,కండ్ల కలక లానే ఏడుపు సైతం అంటు వ్యాధి. ఇది ఒకరి నుండి ఒకరికి చాలా వేగంగా విస్తరిస్తుంది.
మొదట్లో ఏడుపును ఆధారం చేసుకున్న సినిమాలు నిర్మాతలకు కనకవర్షం కురిపించేవి. టీవిలు వచ్చిన కొత్తలో సీరియళ్లు కూడా ఏడుపునే నమ్ముకున్నాయి. ఏడుపు వల్ల మనసు తేలికపడుతుందని, గుండె జబ్బులు రావని అంటారు. మనసులోనే ఏడవడం కన్నా బిగ్గరగా బయటకు ఏడవడం మనిషి ఆరోగ్యానికి మంచిది, నాయకుల రాజకీయ జీవితానికి అంతకన్నా మంచిది.

కొందరు జీవితమంతా ఏడుస్తూ జీవించడానికి ఇష్టపడతారు. మనుషులే కాదు వ్యవస్థలు, నాయకులు, పార్టీలు సైతం ఈ ఏడుపుకు అతీతులు కారు. అసలు రాజకీయ సిద్ధాంతాలే ఏడుపులు. ఒక రాజకీయ సిద్ధాంతంపై ఏడ్చి ఇంకో సిద్ధాంతాన్ని నమ్మమని ఏడవడమే కదా? ఇజాలన్నింటికి కాలం చెల్లిందని అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన నేత   అధికారం పోయాక ఏడుపిజాన్ని నమ్ముకున్నారు. ఆయనే కాదు ఇప్పుడు రాష్ట్రంలో నాయకులంతా ఏడుపిజానే్న నమ్ముకుని ఏడ్చేస్తున్నారు. ఒకప్పుడు ఈ తెలుగునేలను కమ్యూనిజం కమ్మేస్తుందేమోననుకున్నారు.

 కమ్యూనిజం కనిపించకుండా పోవడమే కాదు చివరకు కమ్యూనిస్టులు సైతం తమ పార్టీ సిద్ధాంతం కన్నా ఏడుపిజానే్న ఎక్కువగా నమ్ముకున్నారు. మీరు మాకు ఎన్ని సీట్లు విదుల్చుతారనేది కాదు ముఖ్యం మా పక్క పార్టీ సిపిఐ కన్నా ఒక్కసీటు ఎక్కువ ఇస్తేనే పొత్తు అని సిపిఐ-ఎమ్- అంటుంది. మాకే ఒకసీటు ఎక్కువ కావాలని సిపిఐ అంటుంది. గత తార్కిక భౌతిక వాదం, మావోయిజం వీటన్నింటి కన్నా పక్కవాడిపై ఏడుపులోనే ఈ రెండు పార్టీలు సంతోషాన్ని పొందుతున్నారు. కాంగ్రెస్‌తో జత కడుతున్నారా? టిడిపితోనా? పిఆర్‌పితో జతకడతారా? అనే తేడా లేదు సిపిఐ కన్నా ఒక్కసీటు మాకెక్కువ కావాలనేది సిపిఎమ్ ఏడుపు.
 రష్యాలో కమ్యూనిజం విఫలమయ్యాక సిద్ధాంతాలను పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉందనే చర్చ పార్టీలో సాగింది కానీ పక్కవాడికన్నా ఒక్క సీటు ఎక్కువ పొందాలనే సిద్ధాంతంలో మాత్రం ఎలాంటి మార్పుకు అంగీకరించలేదు. ఒక్కసీటుపై వీరి ప్రేమను చూసి ప్రజలు సైతం ఈసారి ఎన్నికల్లో సిపిఎమ్‌ను ఒక్కసీటుకే పరిమితం చేశారు.
 ఎన్నికల్లో తాము ఓడిపోయినందు కన్నా బాబు అధికారంలోకి రానందుకు ఎక్కువ ఏడ్చిన రాఘవులు పార్టీకి తమ కన్నా సిపిఐకి మూడు సీట్లు ఎక్కువ వచ్చినందుకు మరింత ఎక్కువ దుఃఖం !ఇక  వీరి అభిమాన నాయకుడు అధికారంలోకి రాలేకపోయాననే ఏడుపు కన్నా అందరూ అధికారం అనుభవించేస్తున్నారు, మేం అధికారంలో ఉండగా, ఇంతేసి ఆదాయం వస్తుందని ఊహించలేదు అని ఏడ్చేస్తున్నారు. కుంభకోణాలు అంటూ ఇప్పుడాయన చెబుతున్న వన్నీ ఆయన హయాంలో ఆయన ప్రారంభించినవే. అనుమతులిచ్చింది నేను కాబట్టి ఇప్పటి ఆదాయంలో నాకూ రాయల్టీ చెల్లిస్తామని ఒక్క మాటైనా చెప్పవచ్చు కదా? అనే ఆవేదన కూడా ఆయన మాటల్లో కనిపిస్తుంది.
 హీరోగారికి కష్టం వస్తే సినిమాల్లో ప్రకృతి స్థంబించినట్టుగా, తాను అధికారంలో లేనందున మొత్తం రాష్ట్రం స్థంబించి పోవాలనేది ఆయన కోరిక. ఆయన హయాంలో కరవుతో పొలాలు బీడుబారాయి ఇప్పుడు వర్షాలు బాగుండడం వల్ల పచ్చగ కలకలలాడుతున్నాయి. పొలాలను దోచేసుకుంటున్నారంటే ఎలా? అనేది కొందరి వాదన. అధికారం అంటేనే దోచుకోవడం కదా? మేం ఉన్నప్పుడు 20 ఏళ్ల వరకు ఉంటాం అని కొద్దికొద్దిగా తిన్నాం, ఇప్పుడు మీరు స్పీడ్‌గా తినేస్తున్నారని ఏడిస్తే ఏం లాభం.
పిల్లవాడికి అవకాశం కల్పించకుండా ఈ పెద్దాయన  రోశయ్య కు అవకాశం ఇచ్చరేమిటని పిల్లగాడి గ్రూపు ఏడుస్తున్నారు. ఏడాది నుండి మంత్రి పదవుల కోసం ఏడుస్తున్నాం మా గురించి పట్టించుకునేవారేరి అంటూ ఆశావాహులు లోలోన కుమిలిపోతున్నారు. ఇంట్లో గుక్కపట్టి ఏడుస్తున్నారు.  రాకరాక వచ్చిన అధికారాన్ని అనుభవించనీయకుండా అందరూ నన్ను చూసి ఏడుస్తున్నారేంటి అని రోశయ్య ఏడ్చి ఇంటికెళ్ళి పోయారు .
. కెసిఆర్ అంటే గిట్టని వాళ్లు ఫ్రంట్ పెట్టుకుని ఆయనపై ఏడుస్తున్నారు. అందరి మీద ఏడిస్తేనే కదా నేను ఏదో ఒకటి రాయగలిగేది  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం