1, ఏప్రిల్ 2011, శుక్రవారం

కొంప కూల్చే మూడో కన్ను

సీమాంధ్ర తెలంగాణ నాకు రెండూ రెండు కళ్లు అంటూ చంద్రబాబు చెప్పిన సూపర్ హిట్ డైలాగు రాజకీయాల్లో బాగానే పేలింది. సీమాంధ్ర, తెలంగాణ వివాదాలను సైతం పక్కన పెట్టి అంతా బాబు కళ్లమీదే దృష్టిపెట్టారు. కాపీ కొట్టేందుకు కూడా ధైర్యం ఉండాలి. చాలా మంది ఇతరుల డైలాగులు కాపీ కొట్టేందుకు సిగ్గుపడుతుంటారు.
కానీ చంద్రబాబు మాత్రం ఇతరుల డైలాగులే కాదు సమయాన్ని బట్టి తన డైలాగును తానే కాపీ కొట్టి ఉపయోగించుకుంటారు. బాబు రెండుకళ్ల డైలాగు చెప్పడం ఇదే మొదటిసారేమీ కాదు. ఎన్నికల సమయంలో మైనారిటీల మీటింగ్‌లో హిందువులు, ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు అని చెప్పేవారు. ఈ డైలాగు ఆయన సొంతమేమీ కాదు. స్వాతంత్య్ర పోరాట సమయంలో గాంధీజీ హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్లు అనే చెప్పారు.
గాంధీజీ చెప్పిన డైలాగును ఆయన చెప్పిన దాని కన్నా ఎక్కువ సార్లు మైనారిటీ ఓటర్లున్న ప్రతి మీటింగ్‌లోనూ బాబు చెబుతూ వచ్చారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలను చూడలేక రెండు నెలల పాటు ఇంట్లోనే కళ్లు మూసుకుని కాలం గడిపారు. బాబును బయటకు లాగితే కానీ నిద్ర పోని కాంగ్రెస్ నాయకులు ఆయన కలుగులో ముఖానికి ముసుగేసుకుని దాక్కున్నాడని విమర్శించారు.

బాబుకు మూడో కన్ను తెరవాలన్నంత కోపం వచ్చినా, తనకున్నది రెండే కళ్లని గుర్తొచ్చింది. వాల్మీకికి శోకం నుంచి శ్లోకం పుట్టుకు వచ్చినట్టుగానే రెండు కళ్ల నుంచే బాబుకు బ్రహ్మాండమైన ఐడియా పుట్టుకొచ్చింది. రెండుకళ్లను గట్టిగా నలుపుకున్న ఆయన సీమాంధ్ర, తెలంగాణ నాకు రెండూ రెండు కళ్లు అంటూ డైలాగు పేల్చాడు. సీమాంధ్రలో ధైర్యంగా ఆయన చేసిన ప్రకటనకు చప్పట్లు బాగానే పడ్డాయి, ఇదే డైలాగు తెలంగాణలో చెప్పి చూడు అంటూ తెలంగాణ వాదులు సవాల్ చేశారు. నాకేం భయం ఎలాంటి డైలాగునైనా ఎన్ని సార్లయినా చెబుతానని ప్రకటించారు.

తెలంగాణకెప్పుడొస్తావన్నా అనెవరైనా అడిగితే నాకన్నా ముందు చిరంజీవి వస్తానన్నారు కదా! ఆయన వచ్చి వెళ్లిన తరువాత వస్తానని చెబుతున్నారు. ఆయన రెండు కళ్లలో ఒకటి మెల్లకన్ను అని ఒక నాయకుడు విమర్శిస్తే, రెండు కళ్లు అయితే పరవాలేదు కానీ బాబుకు రెండు నాల్కలనేదే మా బాధ అని మరో ఉత్తారాంధ్ర హస్తం నేత జోకాడు.
రెండు కళ్ల డైలాగును ఎలా అర్ధం చేసుకోవాలి సార్ అని తమ్ముళ్లు అడిగితే ఎలాగైనా అర్ధం చేసుకునేట్టు చెప్పడం తమిళ తంబి చిదంబరం ఒక్కడి సొత్తా ఏమిటి? మాకూ వచ్చాని బాబు నవ్వుతున్నాడు. మనిషి శరీరంలో కళ్లమీదున్నన్ని సినిమా పాటలు మరే అవయవం మీద లేవేమో!

అవే కళ్లు అంటూ కేవలం కళ్లమీదనే ఒక సినిమా కూడా వచ్చింది. పురాణ, ఇతిహాసాల నుంచి సినిమాలు రాజకీయాల వరకు కళ్లతోనే రాజకీయాలు జరిపిన వారే ఎక్కువ. కనులు మాటలాడునని ఒక సినిమాలో హీరోయిన్ పాడింది. కనులు మాటలాడే విషయం ఎలా ఉన్నా రాజకీయాలు మాత్రం బాగానే చేస్తున్నాయి.


క్షీరసాగర మధనంలో హాలాహలం పుడితే దేవతలాంతా అమ్మో మా వల్ల కాదంటూ పారిపోగా, ఒక్క శివుడు మాత్రమే హాలాహాలాన్ని కూల్ డ్రింగ్ తాగినంత ఈజీగా నోట్లో పోసేసుకున్నాడు. అందుకే మిగిలిన దేవుళ్లకు రెండు కళ్లున్నా ఆయన ఒక్కరికే మూడో కన్నుంది. భక్తులపై చల్లని చూపు చూసేందుకు రెండు కళ్లు ఉపయోగిస్తే, ఆగ్రహం వస్తే మాత్రం మూడో కన్ను ఉపయోగిస్తాడు .


శివునికే కాదు చాలా మందికి కనిపించని మూడో కన్ను ఉంటుంది. మనిషిలో కనిపించని మనిషి ఉన్నట్టుగానే కనిపించని మూడో కన్ను ఉంటుంది. రెండు కళ్లతో చూసి తీసుకునే నిర్ణయాల కన్నా మూడో కంటితో ఆలోచించి తీసుకునే నిర్ణయాలే నిస్పక్షపాతంగా ఉంటాయంటారు. బాబుకు సీమాంధ్ర తెలంగాణ రెండు కళ్లయితే కనిపించని మూడో కనే్న హెరిటేజ్ అనేది ఆయన వ్యతిరేకులు వేసే జోకు.

ఆమెది వళ్లంత కళ్లేసుకుని చూసేంత అందం అని మురిసిపోతుంటాడు పాత సినిమాలో హీరో వాళ్లమ్మతో అమ్మాయి గురించి చెబుతూ. ఎంత అందగెత్తె అయినా చూసేందుకు రెండు కళ్లు సరిపోతాయి కానీ మరి అద్భుతమైన అందగత్తె అని చెప్పడానికా ఉపమానం ఉపయోగిస్తారు.
కానీ వాస్తవానికి వళ్లంతా కళ్లున్నది పురాణాల్లో ఒక్క ఇంద్రుడికి మాత్రమే ఋషి పత్నిని మోహించినందుకు ఇంద్రునికి వళ్లంతా కళ్లుయి పోతాయి. రాజకీయాలకు కళ్లకు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఉంది. తన కుమారులు చేసే పాపాలను చూడాల్సి వస్తుందని ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి తనంతో పుట్టాడమేమో! కౌరవ సభలో శ్రీకృష్ణని విశ్వరూపాన్ని సందర్శించేందుకు కళ్లను వరంగా పొంది, ఆ రూపాన్ని చూడగానే మళ్లీ తన కళ్లను తీసేసుకోమని కోరతాడు.

తాను పుట్టిగుడ్డి కావడం వల్ల భార్య కళ్లకు గంతలు కట్టుకుని జీవితాంతం గుడ్డితనాన్ని తెచ్చిపెట్టుకుంది. కళ్లు రాగానే కనీసం ఆమెను చూసేందుకైనా ధృతరాష్ట్రుడు తన కళ్లను అటువైపు మళ్లించలేదు. ధృతరాష్ట్రుడుతన కళ్లతో చూసింది కేవలం శ్రీకృష్ణున్ని మాత్రమే. రెండు కళ్లున్న చాలా మంది అధికారమనే కుర్చీపై కూర్చోని ఆ కళ్లతో తమ పిల్లల బాగోగులను మాత్రమే చూసుకుంటారు.

వీరి కన్నా కళ్లులేని ధృతరాష్ట్రుడు నయం కదా! రెండు కళ్లవరకు సరే మనుషులందరికీ మూడో కన్ను ఉంటే ఎలా ఉంటుంది. స్పేర్‌లో ఒక కన్ను పడి ఉంటుంది పరవాలేదు అనుకోవచ్చు. కానీ ఆ కంటికి మనకు నచ్చని వారిని భస్మం చేసే శక్తి ఉంటే! ఏమవుతుంది ? ఈ ప్రపంచంలో ఎవడికి మరొకుడు అస్సలు నచ్చడు.

నచ్చని వారిని భస్మం చేసే శక్తి ఉంటే మొత్తం విశ్వసం భస్మమై బోలెడు బూడిద మిగిలేది. ఆ బూడిదను చూసేందుకు ఒక్క కన్ను కూడా ఉండేది కాదు. మనకు రెండు కళ్లున్నా ఒక కన్ను కుడివైపు, మరో కన్ను ఎడమవైపు చూస్తే ఎలా ఉంటుంది. అలా చూడ్డం సాధ్యం కాదు.
కానీ కొందరు నాయకులు సాధ్యమవుతుంది. ఒక కంటితో సీమాంధ్రవైపు, మరో కంటితో తెలంగాణవైపు చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. **

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం