3, ఏప్రిల్ 2011, ఆదివారం

కాలం వెనక్కి తిరిగితే.: మీరేం కావాలనుకుంటారు ?

ఆదిత్య 369 సినిమా గుర్తుందా? టైం మిషన్‌లో కోరుకున్న కాలానికి చేరుకుంటారు. ఇంగ్లీష్ సినిమా కాపీనా? తెలుగీకరణనా? ఏదైతేనేం కానీ ఆలోచన మాత్రం అద్భుతం కదూ!

పాత కాలానికి చేరుకోవడం ఆచరణ సాధ్యం కాదు కానీ నిజంగా అలా జరిగితే కొందరికి బ్రహ్మాండంగా ఉంటుంది. మరెందరికీ బోలెడు నిరాశ కలిగిస్తుంది. సినిమాల్లో రింగులు రింగులుగా పొగ వచ్చి ఫ్లాష్ బ్యాక్ కనిపించినట్టు, జీవితాన్ని సైతం అలా ముందు వెనకలకు మన ఇష్టం వచ్చినట్టు వెళ్లే చాన్స్ ఉంటే ఎలా ఉండేదో? అంత కన్నా అదృష్టమా?

అలా అయితే కాలాన్ని వెనక్కి తిప్పి వెంటనే హైదరాబాద్ నడిబొడ్డులో ఐదువేలతో ఐదువందల గజాల ప్లాట్ కొనేసేవాడ్ని అని మధ్యతరగతి వారంతా కోరస్‌గా అనేస్తారు. అప్పటి వరకు ఎందుకు కాలం కనీసం పదేళ్ల వెనక్కి వెళ్లినా ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్ వద్ద పాతిక వేలకు ఎకరంలా నాలుగైదు వందల ఎకరాలైనా కొనిపారేసేవాన్ని అనేది కొందరి మాట!

సగటు జీవి జీవితాశయమంతా సొంతింటిపైనే కాబట్టి కాలం ముందుకు వెళ్లినా వెనక్కి వెళ్లినా ఆలోచనలు ఇంటి చుట్టే తిరుగుతంటాయి.
షోయబ్ మాలిక్‌కు ఈ చాన్స్ దక్కితే ఆయేషా వైపు కనె్నత్తి చూసేవాడు కాదేమో! చూసినా సాక్షాలు లేకుండా అప్పుడే మాయం చేసి ఉండేవాడు. నిఖానామాపై సంతకం చేసేవాడే కాదు. మాలిక్‌కు ఇప్పుడు ఆనాటి దృశ్యాలే కళ్ల ముందు కదులతూ ఉండొచ్చు.

కాలాన్ని వెనక్కి తిప్పే చాన్సుంటే ఏం చేస్తావని గాలి జనార్దన్‌రెడ్డిని అడిగితే తపాలా గణేశ్ అడిగింది ఇచ్చేసి చేతులు దులుపుకుంటానని చెప్పకుండా ఉంటాడా? కాలం వెనక్కి తిప్పగలిగితే జిన్నా పాకిస్తాన్ ఏర్పాటును కోరేవాడే కాదని చరిత్ర కారులంటారు.
ఆరుదశాబ్దాల తరువాత కూడా నిత్యం రక్తసిక్తమవుతున్న పాక్ జీవితాలను చూసిన తరువాత కాలం వెనక్కి తిరిగితే ఎంత బాగుండుననుకునే వారు ఉపఖండంలో చాలా మందే ఉంటారు.
మరి అదే అదృష్టం మన నాయకులకు వరిస్తే వారేమంటారు. కాలాన్ని వెనక్కి తిప్పే చాన్స్ గనుకు వైఎస్‌ఆర్‌కు లభించి ఉంటే రచ్చబండకు హెలికాఫ్టర్‌లో వెళ్లే ప్రోగ్రాం క్యాన్సల్ చేసుకునే వారు.

అదే చాన్స్ ఎన్టీఆర్‌కు వెళ్లి ఉంటే చంద్రబాబును పార్టీలోనే చేర్చుకుని ఉండేవారు కాదు. అమ్మకోసం ( ఇందిరాగాంధీ) అవసరమైతే మామపైనే పోటీ చేస్తానని సవాల్ విసిరి ఓడిపోయిన చంద్రబాబును పార్టీలో అంతా వద్దని చెప్పినా ఎన్టీఆర్ పట్టుపట్టి చేర్చుకున్నారు.
కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే బ్రదర్ ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయమే శిరోధార్యం. అల్లుడి గారిని పార్టీలో చేర్చుకోవద్దని మీరంతా అంటున్నారు మీ మాటే నా మాట అల్లుడికి పార్టీలో నో ఎంట్రీ అని గంభీరంగా ప్రకటించి ఉండేవారు కదా!
దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అదే చాన్స్ వస్తే 95 ఆగస్టు దగ్గర ఆగిపోతారు. రాజకీయ జీవితమంతా బాబుకు వ్యతిరేకంగా ఉద్యమించి వెన్నుపోటు సమయంలో బాబుకు అండగా నిలవడమే తన జీవితంలో ఘోరమైన తప్పిదమని దగ్గుబాటి గ్రహించే సరికి పుణ్యకాలం తీరిపోయింది.

కాలం వెనక్కి రాదు కదా! అని తనలో తానే కుమిలిపోవడం మినహా ఈ వ్యవహారంలో చేయగలిగిందేమీ లేదని ఆయన బాధ. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కనీసం నంబర్ టూ స్థానంలో పోటీకైనా నిలబడేవారు, ఎన్టీఆర్‌ను దించాక టిడిపిలో ఆయనకు స్థానమే లేకుండా పోయింది. కనీసం ప్రతి 40 ఏళ్లకోసారి కాలం వెనక్కి తిరిగి వస్తే కమ్యూనిస్టులకు కాలం కలిసొస్తుంది.

1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన కమ్యూనిస్టులు దశాబ్దాల తరువాత ఔను అప్పుడు తప్పు చేశాం అని ప్రకటించారు. కాలం వెనక్కి వెళితే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాలనేది వారి కోరిక. కమ్యూనిస్టులు కోరుకుంటున్నట్టు కాలం వెనక్కి రావడం కాదు అసలు వారు కాలం చెల్లిపోయిన వారనేది చంద్రబాబు వాదన.
ప్రాణాలు నిలిపే మందు బిళ్లలు , కాలం తీరిన తరువాత విషంగా మారుతాయి. మందు బి ళ్లల మాదిరిగానే మనుషులకైనా, పార్టీల కైనా ఉపయోగించుకోవడానికి నిర్ణీత కాలం ఉంటుందనేది చంద్రబాబు సిద్ధాంతం. కమ్యూనిస్టుల అండతోనే ఎన్టీఆర్‌ను పక్కన దించి అధికారంలోకి వచ్చిన బాబు కొంత కాలం తరువాత కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని గ్రహించారు. కాలం చెల్లిన మందులను మెడికల్ షాపు వారు కూడా దగ్గర పెట్టుకోరు.
బాబు సైతం అంతే ప్రాణాలు నిలిపిన కమ్యూనిస్టులను కాలం చెల్లిందని గ్రహించగానే పక్కన పడేశారు. ఒక్కోసారి విషయం కూడా రోగ నిరోధానికి పనికి వస్తుంది. అలానే అప్పటి వరకు కాలం చెల్లిన విషపూరిత మందులనుకున్న కమ్యూనిస్టులను సైతం చికిత్సకు పనికి వస్తుందని బాబు చేరదీశారు.

కాలం వెనక్కి వెళితే 1995 స్వర్ణయుగాన్ని కమ్యూనిస్టులు ఆహ్వానిస్తారు. బాబు, కమ్యూనిస్టులు చెట్టా పట్టాలేసుకుని తిరిగిన కాలమది. ఒకరు లేనిదే ఒకరు బతకలేరనుకున్న కాలమది. తొలి తెలుగు సూపర్‌స్టార్ నాగయ్య అంతిమ కాలంలో దయనీయమైన జీవితం గడిపారు.
చేతికి ఎముక లేదన్నట్టుగా ధానధర్మాలు చేసిన ఆయన జీవితం అలా ముగియడం చూసిన వారికి కాలం వెనక్కి వెళ్లగలిగితే నాగయ్య జీవితం అద్భుతంగా ఉండేదంటారు. కత్తివీరుడు కాంతారావు పరిస్థితే అంతే. సినిమాల్లో కత్తి యుద్ధంతో రాజులను, సైన్యాధ్యక్షులను ముప్పు తిప్పలు పెట్టిన ఆయన జీవిత పోరాటంలో కత్తి తిప్పలేక చతికిలబడ్డారు.

కాలం వెనక్కి తిప్పగలిగితే ఇప్పుడు తెలుగు చలన చిత్ర సీమను ఏలేస్తున్న నాలుగు కుటుంబాల స్థానంలో నాగయ్య, కాంతారావుల కుటుంబాలు సైతం ఉండేవి కాదా! కాలం వెనక్కి వెళితే మహానటి సావిత్రి జెమినీ గణేశన్ బారిన పడేదే కాదేమో! కళింగ యుద్ధంలో వేలాది మంది మరణించిన తరువాత అశోకుడు కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే ఈ యుద్ధమే చేసేవాడ్ని కాదనుకున్నాడట!

కాలాన్ని వెనక్కి తిప్పలేకపోయినా భవిష్యత్తు కాలంలో తానెప్పుడూ యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. కాలం ఎవరి కోసం ఆగదు, ఎవరి కోసం వెనక్కి రాదు. అలా ముందుకు వెళ్లడమే కాల ధర్మం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం