7, ఏప్రిల్ 2011, గురువారం

తెలంగాణా కోసం కే సి ఆర్ చండి యాగం

తెలంగాణా కోసం కే సి ఆర్ చండి యాగం జరపనున్నట్లు ప్రకటించారు. సోనియమ్మే దేవత అనుకున్న నేత ఇప్పుడు యగాలను నమ్ముకున్నారు . ఎవరే యాగం చేసిన అసలు మతలబు వేరు
ప్రేమలో పడ్డవాడి కళ్లు ప్రేయసి కోసం వెతుకుతున్నట్టు, ట్రాఫిక్ పోలీసు కళ్లు ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించే వాడి కోసం వెతికినట్టు, దొంగ దొంగతనానికి అనుకూలంగా ఉండే ఇంటి కోసం నిరంతరం వెతికినట్టుగానే రాజకీయ జీవి నిరంతరం ఆధికారం కోసమే ఆలోచిస్తుంటాడు.

ప్రతి ఘటననూ తనకు ప్రయోజనం కలిగే కోణం నుంచి చూస్తాడు. ఐదేళ్లపాటు వరుస కరవులతో రాష్ట్రం విలవిలలాడినప్పుడు వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసినా, వైఎస్‌ఆర్ మరణం తరువాత కొన్ని వందల మంది మరణిస్తే వారి పరామర్శ పేరుతో జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేసినా అంతిమ లక్ష్యం అధికారమే.

నదులన్నీ సముద్రంలో కలిసి తీరాల్సిందే రాజకీయ నాయకుడి ప్రతి చర్య అధికారమనే సముద్రంలో కలవాల్సిందే! పాదయాత్ర అయినా ఓదార్పు యాత్ర అయినా, బాబుగారి ‘మీకోసం’ యాత్ర అయినా అన్నీ అధికారం కోసం సాగించిన యజ్ఞాలే.

వర్షం, ఎండ, ప్రచండమైన గాలులను సైతం లెక్క చేయకుండా ఋషులు తపస్సు చేస్తే దేవుళ్లు భక్తులకు ఎన్నో పరీక్షలు పెట్టి చివరకు కరుణించే వారు. ఎంత క్లిష్టమైన యజ్ఞం చేస్తే దేవుళ్లు అంతగా సంతసించి వరాలు ప్రసాదిస్తారు. అందుకే ఎర్రటి ఎండను లెక్క చేయకుండా వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసినప్పుడు జనం కరిగిపోయి ఓట్ల వర్షం కురిపించి అధికారం అప్పగించారు.

ఏదో ఒక భారీ యజ్ఞం చేస్తే తప్ప అదికారం సిద్ధించేట్టుగా లేదని అన్ని పార్టీల వారు నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఉంది. తనకు పెద్దగా నమ్మకాలపై విశ్వాసం లేదు అని చెప్పిన చంద్రబాబు ఓటమి సూచనలు కనిపించిన తరువాత అన్నింటిపైనే నమ్మకాలు పెట్టుకున్నారు. అంతా తన వల్లనే సాధ్యం అనుకున్నవాడు సైతం పరాజయం తరువాత భగవంతుడిపై భారం వేస్తాడు. బాబు వర్గీయుల పరిస్థితి కూడా అలానే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించారు, అమెరికా అధ్యక్షులు సైతం విస్తుపోయేట్టు చేశాడు, మన బాబు కాకుంటే ఇంకెవరు గెలుస్తారని అనుకున్న దేశీయులకు రెండోసారి ఓటమి తరువాత దిమ్మతిరిగి పోయింది.
దాంతో ఇప్పుడు కంటిచూపుతో చంపేసే వారిని, ఒక్క దెబ్బతో వందలాది సుమోలు తలకిందులయ్యేట్టు చేసే బుడ్డ ఎన్టీఆర్‌ను నమ్ముకోవడం కన్నా యజ్ఞయాగాలను నమ్ముకోవడం మంచిదనుకుంటున్నట్టున్నారు. తిరుపతిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు కోసం రాజ్యాధికార యజ్ఞం చేశారు.అదే పార్టీ నుంచి వచ్చిన కే సి ఆర్ తెలంగాణా కోసం యాగాలను నమ్ముకున్నారు ఎన్టీఆర్‌కు సైతం ఇలాంటి యజ్ఞాలపై బాగా నమ్మకం ఉండేది. దేవతలకు ప్రీతి కలిగించేందుకు యజ్ఞం చేస్తారు. మన పురాణాల్లో అనేక రకాల యజ్ఞాలను ప్రస్తావించారు. అశ్వమేధము, రాజసూయమువంటియజ్ఞాలున్నాయి. పూర్వమంటే అశ్వమేధ యాగంలో అశ్వం ఎంత వరకు పరిగెడితే అంత వరకు ఆ భూమిపై అధికారం సిద్ధించేస్తుంది.

ఇది ప్రజాస్వామ్య యుగం ఇప్పుడలా సాధ్యం కాదు. ప్రభుత్వ భూమిని, చెరువులను, అవసరం అయితే సముద్రాలను సైతం కావలసినంత ఆక్రమించుకోవచ్చు కానీ అధికారం ఆక్రమించుకోవడం మాత్రం అంత సులభం కాదు. నాలుగు దశాబ్దాల నుంచి ఆయుధాలు చేతపట్టుకుని ప్రయత్నిస్తున్న అన్నలకే సాధ్యం కాలేదు. మాయ చేసో, ప్రజల అభినామాన్ని సంపాదించో ఏదో రకంగా ఓట్లు వేయించుకుంటేనే అధికారం వస్తుంది తప్ప ఆక్రమించుకుంటే రాదు.

జమ్మిక్కుల్లో అందరూ ఆరితేరిన వారు కావడం వల్ల ఇప్పుడు అధికారం లభించడం అనేది అంత సులభం కాదు. ప్రజలు ఏ సమయంలో ఎవరిని విశ్వసించారో ఓట్ల లెక్కింపు జరిగేంత వరకు తేలడం లేదు. మంగళహారతులు పట్టి స్వాగతం పలికిన నియోజక వర్గాల్లో డిపాజిట్లు గల్లంతవుతున్నాయి. అందుకే ప్రజలను నమ్ముకోవడం కన్నా యజ్ఞయాగాలను నమ్ముకోవడం మంచిదనుకుంటున్నారు.
నిజానికి రాజకీయ నాయకులు చేసే ప్రతి పని రాజ్యాధికారం కోసం సాగించే యజ్ఞం లాంటిదే! కానీ ప్రత్యేకంగా రాజ్యాధికార యజ్ఞం అని పేరు పెట్టరు. కానీ అడగందే అమ్మయినా పెట్టదు మరి దేవుడు అడకపోతే ఎందుకు పెడతారనుకున్నటుట్టగా ఉంది.
దాంతో తెలుగు తమ్ముళ్లు మోహమాటాన్ని పక్కన పారేసి , మాకు కావలసింది అధికారం ఇందులో మోహమాటం ఏ ముంది అధికారం కావాలి అందుకే రాజ్యాధికార యజ్ఞం నిర్వహిస్తున్నామని ప్రకటించేశారు. పొలిటికల్ సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు కలిసినా అధికారం సిద్ధించనప్పుడు ఇక మిగిలింది యజ్ఞాలే కదా! తమ కోరికలు నెరవేర్చుకోవడానికి యజ్ఞాలు చేయడం కొత్తేమీ కాదు. దశరథుని పుత్ర కామేష్టి యజ్ఞం తరువాతనే కదా రాముడు పుట్టాడు, జనకుడికి సీతాదేవి లభించింది. నాయకులకూ యజ్ఞాల చరిత్ర గొప్పదే! అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోస్తా పండితుని సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ పార్టీ కార్యాలయంలోనే యజ్ఞం చేసారు. ఎన్నికల ఫలితాలు చూశాక యజ్ఞం ప్రభావం చూపలేదనిపించింది. ఏ పుట్టలో ఏ పాముందో , ఏ యజ్నం లో ఏ పలముందో నని కే సి ఆర్ మళ్లీ యాగాన్ని నమ్ముకున్నారు .
బంగారాన్ని తాకట్టు పెట్టిన కాలంలో అధికారంలోకి వచ్చి ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్తునే మార్చేసిన పివి నరసింహారావుకు ఇలాంటి వాటిపై బాగానే నమ్మకం ఉందనేది ప్రచారం. ఆయనకు సలహాలివ్వడానికి ఓ బాబానే ఉండేవారు. ఏ యజ్ఞంలో ఏం లోటు జరిగిందో కానీ చివరకు పివి నరసింహారావుతో పాటు ఆ బాబా సైతం ఎన్నో కేసులో ఇరుక్కున్నారు.

పివి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన పివిఆర్‌కె ప్రసాద్ తానే స్వయంగా పివితో కొన్ని యజ్ఞాల గురించి ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. పివి నరసింహారావు అధికారాన్ని నిలపడానికి యజ్ఞం చేయించారట! యజ్ఞ ఫలమో? లేక అదృష్టమో కానీ మెజారిటీ లేకపోయినా ఏ దిగులూ లేకుండా ఐదేళ్లపాటు దేశాన్ని పాలించారు.

పివిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏడాది కూడా కుదురుగా పని చేయనివ్వలేదు. అలాంటిది ఏకంగా ఐదేళ్లు ప్రధానిగా ఉన్నారంటే ఏ యజ్ఞ ఫలమో! **

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం