7, ఏప్రిల్ 2011, గురువారం

మా కాలమే వేరు :వ్యంగ్యం

‘‘ఏమండీ మన పనిమనిషి రంగి కూతురు మంగికి ఆరో తరగతిలో 94 శాతం మార్కులొచ్చాయట! పేదరికం చదువుకు అడ్డం కాదని రంగి కూతురు నిరూపించింది కదండి. మన పిల్లలూ ఉన్నారు ఎందుకు నానా గడ్డికరిచి మీరు సంపాదించింది విచ్చలవిడిగా ఖర్చు చేయడం తప్ప చదువుకుందామనే ధ్యాసే లేదు ’’ అంటూ తెలుగు ఎమ్మెల్యే తింగయ్య భార్య భర్త నిద్ర లేచీ లేవకముందే క్లాస్ తీసుకోసాగింది. తింగయ్యకు ఒక్కసారిగా మండుకొచ్చింది.


నీకసలు బుద్ధుందా అని గద్దించాడు. నిద్రలో ఉన్న వాడికి భార్య ఏం చెప్పినా మొగుడనే వాడికి కోపం రావడం సహజమే ’’ అని భార్య చెప్పింది. నేను తిట్టింది అందుకు కాదు ఆరో తరగతిలో94 శాతం మార్కులు వచ్చినందుకు అదేదో మంగి గొప్పతనం, వాళ్ల అమ్మాయి గొప్పతనం అన్నట్టుగా మాట్లాడితేనే నాకు మండుకొస్తుంది’’ అని తింగయ్య బదులిచ్చాడు. ఆ పిల్ల బాగా చదివితే చదివిన పిల్ల , చదివించిన తల్లి , చదువుచెప్పిన పంతుళ్ల గొప్పతనం అవుతుంది. కానీ వాళ్లను కాకుండా ఇంకెవరిని మెచ్చుకుంటారు’’ అని భార్య అడిగింది.

‘‘నీకు జనరల్ నాలెడ్జ్ లేదు, పత్రికలు చదవ్వు అందుకే నీకు అసలు విషయాలు తెలియవు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చినప్పుడు చూశావా? అని అడిగాడు. ఆమె చూడలేదంది. మరదే పత్రికలు చూస్తే అసలు విషయం తెలుస్తుంది. పదవ తరగతిలో, ఇంటర్మీడియ్‌లో మంచి మార్కులకు కారణం మా చంద్రబాబుగారి పాలన అంటూ తింగయ్య ఇంకా చెప్పబోతుంటే భార్య మధ్యలోనే అడ్డుకుని మోకాలికి బొడిగుండుకు పోలికలా, ఆరేళ్ల క్రితం అధికారం నుంచి దిగిపోయిన మీ బాబుగారికి పదో తరగతి ఫలితాలకు సంబంధం ఏమిటండి అంటూ భార్య కాస్త వెటకారంగానే అడిగింది.

ఇప్పుడు పదో తరగతి పిల్లకాయలు అంటూ మా బాబుగారు అధికారంలో ఉన్నప్పుడు నాలుగో తరగతి చదువుతుండే వాళ్లు. మొక్కయి వంగనిదే మానై వంగదంటారు కదా! ఆ పిల్లకాయలు నాలుగో క్లాస్‌లో ఉండగా బాబుగారు బాగా చదువుకోండిరా పిల్లకాయలూ అంటూ రోజూ వాళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించేవారు ఆ ప్రభావంతోనే వాళ్లిప్పుడు బాగా చదివారు అని తింగయ్య చెప్పుకొచ్చాడు.


ఔను లేండి ఈ గొప్పతనం మీ బాబుగారికే చెందుతుంది ఆయన అధికారంలో ఉండగా, జన్మభూమి, పచ్చ్ధనం పరిశుభ్రత అంటూ ఏదో ఒక పేరుతో ఆయన పార్టీ కార్యక్రమాలకు చదువుకునే పిల్లకాయలను తరలించే వారు. శోష వచ్చి పడిపోయినా వదిలేవారు కాదు. ఓడిపోయాక పిల్లలకు ఆ బాధ తప్పింది. బహుశా దీని వల్లనే వాళ్లు మంచి ఫలితాలు సాధించి ఉంటారు. అందుకే ఈ ఫలితాల ఘనత కచ్చితంగా మీ బాబుకే చెందాలి అంది.

భర్త ఉత్సాహంగా సానియా మీర్జా అంతర్జాతీయ క్రీడాకారిణి ఎలా ఐందనుకున్నావ్! అని అడిగాడు. అధికారంలో ఉన్నప్పుడు క్రీడలకు ఇచ్చిన ప్రోత్సహం వల్లనే సానియా మీర్జా టెన్నిస్ స్టార్‌గా వెళుగొందిందని ఒకసారి బాబుగారు చెప్పినట్టు పత్రికలో చదివానండి. బాగానే గుర్తుంది. ఆ పిల్ల పాకిస్తానోడిని పెళ్లాడడంలో కూడా మీ బాబుగారి సలహా ఏమైనా ఉందంటారా? అని భార్య అమాయకంగా అడిగింది. ఎవరైనా పాపులర్ అయితే అందులో మా బాబుదే ప్రధాన పాత్ర ఉంటుంది కానీ వారు వివాదాల్లో చిక్కుకున్నప్పుడు మా బాస్ పాత్ర అస్సలు ఉండదు అని తింగయ్య వెంటనే సమాధానం చెప్పాడు.

ఔనండి సత్యం రామలింగరాజు ఓ వెలుగు వెలిగినంత కాలం నా వల్లనే అని చెప్పుకున్న బాబు ఆయన వ్యవహారం బయటపడగానే సత్యంలో పాజిటివ్ కోణం మొత్తం నాదే నెగిటివ్ వ్యవహారాలన్నీ వైఎస్‌ఆర్‌వి అని ఎంత బాగా చెప్పారండి ’’ అని భార్య చెప్పింది. తింగయ్య ఆలోచనలో పడ్డాడు.అసలు మా బాబు కాలమే వేరు ఇప్పుడు గాలి వీస్తుందంటే అది మా బాబు పాలనా కాలంలో వేసిన పునాదే కారణం, ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు ఎండలు ఇంతగా ఎందుకు మండిపోతున్నాయనుకుంటున్నావ్! అని తింగయ్య అడిగాడు.

అది కూడా మీరే చెప్పండి వింటాను అని భార్య ముందుకొచ్చింది. మా బాబుగారి చల్లని పాలన లేనందు వల్లనే ఎండలు మండిపోతున్నారు. తుపాన్లు కూడా అందుకే విజృంభిస్తున్నాయి ’’ అంటూ తింగయ్య ఉపన్యసిస్తూ పోతున్నాడు.ఔనండి మొన్న మన పక్కింటి వాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. గతంలో రోజుకు 20 గంటలే ఉండవట కదా! మీ బాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాతే మళ్లీ రోజుకు 24 గంటలు సంవత్సరానికి 365 రోజులు అయ్యాయట ! కదా! నిజమేనా? అని భార్య అమాయకంగా ప్రశ్నించింది. తింగయ్య ఇంట్లోనే అసమ్మతి వర్గం ఉందని తెలిసి బాధపడ్డాడు. నువ్వెన్నయినా చెప్పోయ్ మ బాబుగారి కాలమే వేరు నెలకు నాలుగు వానలు కురిసేవి, కరవు, ఆకలి, నిరుద్యోగం, నేరాలు అనేవి తెలిసేవే కాదు. నువ్వు నమ్మూ నమ్మకపో నీ ఇష్టం మా బాబుగారి కాలమే వేరు అని తింగయ్య ముగించాడు.

***

ఔను ఆ కాలమే వేరు అంటూ జగన్ ఆవేదన చెందారు. మా నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఎదురే లేకుండేది. నేను అధికారంలోకి వస్తే స్వర్ణయుగం వస్తుంది.. నేను తీసుకు వస్తాను అని జగన్ రాష్ట్ర పర్యటన మొదలు పెట్టారు.

***

కాలమే వేరు అంటూ తన రాజకీయ ప్రవేశ కాలాన్ని, ఇప్పటి కాలాన్ని తలుచుకుంటూ రోశయ్య ఆవేదన చెందుతున్నారు. ప్రజలు సైతం ఆ కాలమే వేరు అంటూ నిత్యావసర వస్తువుల ధరలు తక్కువగా ఉన్న కాలాన్ని తలుచుకుంటున్నారు. మొత్తం మీద పాలకులు, ప్రతిపక్షీయులు, ప్రజలు ఎవరికీ ఈ కాలం నచ్చడం లేదు. ఎప్పుడూ తామున్న కాలం ఎవరికీ నచ్చదు. రజనీష్ చెప్పినట్టు మనిషే ఒక జబ్బు తానున్న స్థితి నచ్చక పోవడం ఆ జబ్బు లక్షణం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం