22, ఏప్రిల్ 2011, శుక్రవారం

ముద్రా రాజకీయం..రావణుడుమంచిబాలుడు.. దుర్యోధనుడికి అన్యాయం జరిగింది



మహాత్మాగాంధీ సింప్లీసిటీకి పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుందని సరోజినీ నాయుడు చమత్కరించే వారట! పంచ, చేతిలో కర్ర ఇంతకు మించిన సింప్లీసిటీ ఇంకేముంటుంది. రాజకీయాల్లో బ్రాండ్ ఇమేజ్ ఏంటో ఆ కాలంలోనే మహాత్మాగాంధీ గ్రహించారు. సింప్లీసిటీ బ్రాండ్‌తో దేశ ప్రజలందరినీ ఒక్క మాటమీద నిలబెట్టవచ్చునని, నాయకుడికి ముద్ర అవసరమని దేశ రాజకీయాల్లో మొట్టమొదటి గ్రహించింది ఆయనే. సింప్లీసిటీకి మారుపేరుగా నిలిచిన మహాత్మాగాంధీ ఆధునిక భావాలు ఉట్టిపడే జవహర్‌లాల్ నెహ్రూను దేశ తొలి ప్రధానిగా ముందే నిర్ణయించడం మరో విచిత్రం.


 శివాజీ అనగానే హిందూదేశ పరిరక్షణకు శత్రువుల గుండెలు చీల్చడానికి కత్తిపట్టుకుని గుర్రం మీద పరుగులు తీస్తున్న ముద్ర కనిపిస్తుంది. ఆనాటి కాలం నుండి నేటి వరకు నాయకులు తమకు తెలియకుండానే తమ ముద్రను తాము ప్రజలకు విడుదల చేస్తుంటారు.
ఆనాటి కాలంలో అది తమ ముద్ర అని తెలియకుండానే తమ జీవన శైలి, వ్యవహార శైలి ద్వారా ఒక ముద్రను ఏర్పాటు చేసుకునే వారు కానీ నేటి కాలంలో అలా కాదు.. చక్కని ముందు చూపుతో ఏ కాలానికి ఏది అవసరం వస్తుందో ఆ ముద్ర కోసం నాయకులు తంటాలు పడుతుంటారు. ఐటి జోరుగా నడిచే కాలంలో ఐటి వీరునిగా ముద్ర వేయించుకోవడానికి కోట్లు ఖర్చు చేస్తారు.

 ఐటికి ఓట్లు రాలేట్టు లేదు, రైతు ముద్ర వేయించుకుందామని ఒకేసారి యూటర్న్ తీసుకుంటారు. ఇలాంటి వారికి చివరకు జనం గాలి వాటం ముద్ర వేస్తారు. ఒక ముద్రను నమ్ముకుంటే కాలానికి ఎదురీది ఆ ముద్రకు కట్టుబడి ఉండాలి కానీ గాల వాటంగా ముద్రలు మార్చుకుంటే చివరకు జనం గిరీశం అనే ముద్ర వేస్తారు.
 ముద్ర అనేది వారి పనుల ద్వారా ఏర్పడుతుంది కానీ ప్రయత్నాలతో కాదని గ్రహించే సరికి పుణ్యకాలం ముగిసిపోయి పదవి లేకుంటే బతక లేని జీవి ఇదిగో ఇలానే ఉంటాడు అనే ముద్ర పడుతుంది. కొందరికి మహాత్మాగాంధీ హిందుత్వముద్రలో కనిపిస్తే, నాథూరామ్‌గాడ్సేకు మహాత్ముడు హిందుత్వవ్యతిరేకముద్రలో కనిపించారు.
దేవుళ్లకు సైతం ముద్రలు తప్పవు. శంకరునికి  బోళా అనే బలమైన ముద్ర ఉంది! ఎంతో మంది రాక్షసులకు ఈ ముద్ర సంగతి బాగా తెలుసునని పురాణాలు చెబుతున్నాయి. ఏడుకొండల వెంకన్నకు ఆ కాలం నుండి ఈ కాలం వరకు కోరిన కోరికలు తీర్చే దేవుడని బలమైన ముద్ర ఉండడం వల్లనే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది
. పాపం ఇంద్రుడు దేవుళ్లకు అధిపతి అయినా  తన కున్న ముద్ర వల్ల ఎవరి ఆదరణ సంపాదించలేకపోయారు. చాటు మాటు వ్యవహారాలు ఈయనకు ఎక్కువ అనే ముద్ర నిజమే కదా! 

కుక్కను చంపేప్పుడు అది పిచ్చికుక్క అని ప్రచారం చేయమని ఊరికే అనలేదు. అంటే పిచ్చి అనే ముద్ర వేస్తే చంపినా ఇబ్బంది ఉండదన్నమాట! అలానే రాజకీయ నాయకులు తమపై తాము మంచి ముద్ర వేసుకోవడానికి తమ ప్రత్యర్థులపై పిచ్చి ముద్ర వేయడానికి తెగ తంటాలు పడుతుంటారు.

 సినిమాల్లో నటించేప్పుడు ఎన్టీఆర్‌కు ప్రజలు కనిపించే దైవం అన్నట్టుగా ముద్ర వేశారు. ఆయన అధికారంలోకి రావడానికి ఆ ముద్రే ఉపయోగపడింది. తిరిగి అధికారం నుండి దించడానికి ఆయన కున్న పాత ముద్రను చెరిపేసి కొత్త ముద్ర వేయడానికి అల్లుళ్లతో సహా కుటుంబ సభ్యులు తీవ్రంగానే కష్టపడి విజయం సాధించారు.
 రాజకీయ రంగంలో ఈ ముద్రలు వేసే దానిలో హిట్లర్ ప్రపంచానికే పాఠాలు చెప్పేస్థాయిలో ఉన్నారు. తనను తాను ఆర్య జాతిని ఉద్దరించడానికి జన్మించిన మహనీయునిగా హిట్లర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇలాంటి ముద్రల కోసం ఆయన వద్ద ఒక మంత్రి కూడా ఉండేవారు. ఆయనే గోబెల్స్, నేటి నాయకులకు ఆదర్శ ప్రాయుడు! అబద్ధాన్ని పదే పదే చెప్పించి నిజమని నమ్మించాలని ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని చాలా మంది నాయకులు ఇప్పటికీ అమలు చేస్తూ, తాము గోబెల్స్‌ను అనుసరిస్తూ ఎదుటి వారికి గోబెల్స్ అని ముధ్ర వేస్తారు.
 ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై ఓటరు ముద్ర పడాలంటే ముందు నాయకులు వారి మనస్సుల్లో మంచి ముద్ర వేసుకోవాలి. వైఎస్‌ఆర్ ప్రధాన ప్రత్యర్థిగా మారబోతున్నాడని తెలిసిన వెంటనే అధికారంలో ఉన్న బాబు ఆయన ఫ్యాక్షనిస్టు అని ఫ్యాక్షన్ ముద్ర జనం హృదయాల్లో ముద్రించడానికి తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ వైఎస్ ఆధికారంలోకి వచ్చాక పథకాల ద్వారా ఊహించనంతగా ప్రజానాయకుడనే బలమైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు జగన్ పై లక్ష కోట్ల అవినీతి ముద్ర కోసం ప్రయత్నాలు బలంగానే సాగుతున్నాయి.
భాగవతం రచించిన పోతన మొదలుకుని సమైక్యాంధ్ర వాదానికి ఆధికారిక గీతం లాంటి ‘‘తెలుగుజాతి మనది నిండుగు వెలుగు జాతి మనది ’’ అని రాసిన డాక్టర్ సి నారాయణరెడ్డి వరకు తెలంగాణలో పండితులెంతమంది ఉన్నా.  తెలంగాణ వారు అనగానే యాదగిరి అనే పేరుతో ఇంట్లో పనిమనుషులుగా, మేయిన్ రౌడీకి అసిస్టెంట్‌గా ఉంటూ ఉర్దూ తెలుగు కలగలిపి మాట్లాడతారు అనే  ముద్ర  ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇది మన తెలుగు సినిమాలు తెలంగాణా వారిపై వేసిన బలమైన ముద్ర.

 రాయలసీమ అంటేనే కత్తులు పట్టుకుని తిరుగుతారని, వారు కక్షలనే తిని పెరుగుతుంటారని మన మెదడులో బలంగా నాటుకున్న ముద్ర. శాసన మండలిలో పురాణాలతో ఉదహరిస్తూ పద్యాలతో ఉపన్యసించే సభ్యుడొకరు ఉన్నారంటే ఔనా అనిపిస్తుంది. ఆయన ముస్లిం అని, ఎమ్మెల్సీ షేక్ హుసేన్ అని తెలిశాక మరింత ఆశ్చర్యం కలుగుతుంది. మన మెదడులో సినిమాలు వేసిన ముద్ర ప్రకారం ముస్లిం అంటే అటు తెలుగు, ఇటు ఉర్దూ కాకుండా మాట్లాడాలి మరి.
 పాత ముద్రలు తొలగించి కొత్త ముద్రలు వేసే ప్రయత్నాలు సైతం చాలా కాలం నుండి సాగుతూనే ఉన్నాయి. రావణుడు మంచిబాలుడు,   దుర్యోధనుడికి అన్యాయం జరిగింది, పాండవులందరి కన్నా అతనే వీరాధి వీరుడనే కొత్త ముద్రల ప్రయత్నం తెలుగునాట బలంగానే సాగింది. పాశ్చాత్యుల దృష్టిలో భారత్‌కున్న ముద్ర పాములాడించే వాళ్ల దేశం, సన్యాసుల దేశం. చాలా విషయాల్లో ముద్రలకు వాస్తవానికి సంబంధం ఉండదు. అయినా ఎవరి ముద్రకు వారే బాధ్యులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం