10, ఏప్రిల్ 2011, ఆదివారం

మన మాటల్లో నిజమెంత ? తేల్చి చెప్పేన్యూస్పీక్

బుచ్చమ్మ వింటుందనుకుంటే గిరీశం ఎప్పుడూ విడో మ్యారేజేస్ గురించి మాట్లాడుతుంటాడు. విడో మ్యారేజెస్ ద్వారా సంఘ సంస్కరణ ఎలా సాధించవచ్చునో వెంకటేశంతో గిరీశం ఉపన్యసిస్తుంటే తలుపు చాటు నుంచి వింటున్న బుచ్చమ్మ తెగ సంతోషడుతుంది.
ఆమె వినాలనే గిరీశం వితంతు వివాహాలపై ఉపనస్యసిస్తాడు తప్ప గిరీశం మనసులో ఏ మాత్రం సంఘసంస్కరణాభిలాష ఉండదు. మన ఓటర్లు నాయకుల మాటలను నమ్మి పడిపోయినట్టుగానే బుచ్చమ్మ గిరీశం మాటలకు పడిపోతుంది.

జార్జి ఆర్వెల్ అనే ఓ పాశ్చాత్యుడు వందేళ్ల క్రితం ‘1983’ అనే ఒక పుస్తకం రాశాడు. అందులో ‘న్యూస్పీక్’ అనే ఒక పదం వాడాడు. ప్రజలను మోసగించడానికి రాజకీయ నాయకులు, అధికారులూ, అధికారులూ అసలు అర్ధంతో కాకుండా వాడే పదాలతో కూడిన భాషకు ఆర్వెల్ ‘న్యూస్పీక్’ అనే పదాన్ని ఉపయోగించినట్టు ప్రెస్ అకాడమీ వారి తెలుగు పత్రికల చరిత్ర చెబుతోంది. ఆర్వెల్ న్యూస్పీక్ పదం రాజకీయ నాయకులు, అధికారుల కోసమే ఉపయోగించారు కానీ నిజానికి ఈ పదానికి అర్హులు కానిదెవరో చెప్పండి.

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అంతా అయ్యాక ఇప్పుడు తప్పించుకుంటున్నాడని అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుని అబ్బాయి ఇంటి ముందు వౌనదీక్షలు చేసే కేసులు రోజూ ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి కదా! ఈ కేసుల్లో అబ్బాయిల భాష న్యూస్పీక్ కాకుంటే మరేమవుతుంది. నీ కోసం అకాశం నుంచి చుక్కలను తెంపుకు రమ్మంటావా చెప్పు సుశీ చెప్పు అంటూ అబ్బాయి గారాబంగా పార్కుల్లో అమ్మాయి తొడపైన తల పెట్టి చెప్పే కబుర్లన్నీ న్యూ స్పీక్ భాషలోనే కదా!

సినిమా రంగంలో ఈ భాష చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సినిమా రంగంలో ఒక జీవికి మరో జీవికి అస్సలు పడదు. కంటిచూపుతోనే చంపేయాలని ప్రయత్నిస్తుంటారు, కానీ అందరి ముందు మాత్రం ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నట్టు అచ్చం సినిమా డైలాగుల్తో ప్రేమను ఒలకబోసుకుంటారు మరది న్యూస్పీక్ భాష కాకుంటే మరేమిటి?ప్రేమికులు, సినిమా వాళ్లు, అధికారులు, నాయకులనే తేడా ఏమిటి? ఈ కాలంలో ప్రతి ఒక్కరూ న్యూ స్పీక్ భాషను ఉపయోగించకపోతే రోజులు గడుస్తాయా? న్యూ జనరేషన్‌కు నూ స్పీక్ భాషే జీవనాధారం. చనిపోయిన ఏడునెలల తరువాత పరామర్శించడానికి వెళ్లి అనునయిస్తే ఆ భాష న్యూస్పీక్ భాష అవుతుంది కానీ నిజంగా పరామర్శ భాష కాదు కదా! ఆర్వేల్ కన్నా చాలా ముందుగానే ఇలాంటి భాష వాడిని గిరీశాన్ని మనకు గురజాడ అప్పారావు పరిచయం చేశారు.

న్యూ స్పీక్‌కు వందేళ్ల క్రితం గిరీశం మానవ రూపంగా కనిపిస్తే ఇప్పుడు ప్రతి నాయకుడు గిరీశాన్ని తలదనే్న విధంగా తయారయ్యాడు. కన్యాశుల్కం అంతా చదివి అద్భుతం అనదగిన విషయం ఇందులో ఏముంది, గిరీశం పాత్రలు రోజూ మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా! అని ఒకరు ఆశ్చర్యపోతే వందేళ్లకు ముందే ఇలాంటి పాత్రలను గురజాడ ఊహించడమే ఆ నాటకంలోని అద్భుతం అని మరొకరు సమాధానం చెప్పారు. న్యూస్పీక్‌కు సమానమైన పదాన్ని గిరీశం అని వాడేసుకోవచ్చు కానీ నాయకులంతా ఒకరిని మించిన గిరీశం ఒకరు కావడం వల్ల ఆ పదం సరిపోదేమోననిపిస్తోంది. పాలకులు ఆర్థిక సంస్కరణలు అంటారు అంటే దానర్ధం సబ్సిడీలు తగ్గించి పేదలను రోడ్డున పడేస్తారన్నమాట! గోల్డెన్ షేక్‌హ్యాండ్ అబ్బో పేరెంత ముచ్చటగా ఉందో. కానీ అసలు అర్ధం ఉద్యోగాన్ని ఊడబెరకడానికి పెట్టుకున్న ముద్దు పేరు.

ఒక నాయకుడు తనను నమ్ముకున్న వారేమడిగిన కాదనే వారు కాదు. నగరంలోని వందల ఎకరాల భూములపై అభిమానులు మనసు పడితే కబ్జాలను లీగలైజ్ చేసేశారు. సాధారణ భాషలో దీన్ని దోచిపెట్టడం అనాలి కానీ న్యూస్ స్పీక్ భాషలో నమ్ముకున్నవారిని ఆదరించాడు అని చెప్పుకోవాలి. మిగిలిన అందరి కన్నా చంద్రబాబుకు న్యూస్పీక్ పదాన్ని ఎక్కువగా ఉపయోగించాలి. సాధారణంగా కొందరు నాయకులు తమ ఉపన్యాసాల్లో కొన్న అంశాల్లో న్యూస్పీక్ భాషలో మాట్లాడుతారు.
కానీ చిత్రం చంద్రమాబు ఉపన్యాసం అంతా న్యూస్పీక్ భాషలోనే ఉంటుంది ఎక్కడో ఒక చోట తప్ప ఎప్పుడూ ఆయన మనసులో మాట చెప్పరు. నిజం అస్సలే చెప్పరు. ఎన్టీఆర్ సేవకే నా జీవితం అంకితం అని ఆయన ప్రకటించిన కొద్ది రోజులకే ఎన్టీఆర్‌ను ఇంటికి పంపి తాను పదవి చేపట్టారు. ఔను ఇది సేవ లాంటిదే కదా! పరిపాలన అంటే ఎంతో కష్టమైన పని ఈ వయసులో ఎన్టీఆర్ ఏం శ్రమిస్తారని విశ్రాంతి కోసం ఇంటికి పంపి, బాధ్యతలు బాబు భుజాన వేసుకోవడం అంటే ఎన్టీఆర్ సేవలో ఉన్నట్టే కదా! అని బాబు అభిమాని న్యూ స్పీక్ భాషలో బాబును సమర్ధించారు.
ఓసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, అస్పత్రిలో ఉన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పరిస్థితి అటూ ఇటూ అన్నట్టుగా ఉందని సమాచారం అందింది.ముఖ్యమంత్రిగా ఉన్న బాబు అక్కడి నుంచే ఆస్పత్రికి వెళ్లారు. అంతా అనుకున్నట్టుగా అప్పటికి కోట్లకు ఏమీ కాలేదు. లోనికి వెళ్లి బయటకు వచ్చిన బాబు మీడియాను చూడగానే లోపల ఏం జరిగిందో చక్కగా వర్ణించి చెప్పారు.
‘‘బాబూ నీ పాలన చాలా బాగుంది అద్భుతంగా పరిపాలనసాగిస్తున్నావు, పేదలు, రైతులు, బిసిలు, మైనారిటీల కోసం ఎన్నో చేస్తున్నావు ’’ అని కోట్ల అన్నట్టు బాబు చెప్పుకు పోసాగాడు. బాబు ఏం చెప్పాడో వినే స్థితిలో కోట్ల లేడు, విన్నా అది తప్పని ఖండించే పఠిస్థితి కాదు, దాంతో బాబున్యూస్పీక్ భాషలో విజృంభించేశారు.
మత సామరస్యం గురించి నగరంలో ఎంఐఎం నాయకులు, గుజరాత్‌లో మోడీల అద్భుత ఉపన్యాసాలన్నీ న్యూస్పీక్ భాషలోనే సాగుతుంటాయి. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి ముతక నాయకులకు ఈ భాష అంతగా నచ్చదు అందుకే వాళ్లు ముతక భాషలోనే తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు.ఇలాంటి నాయకులకు మరీ ముతక అభిమానులే ఉంటారు....ఏమయనా ఇంగ్లీషూ న్యూస్పీకూ ఈ దేశంలో శాశ్వతంగా ఉంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం