26, మే 2023, శుక్రవారం

మోడీని దారిలో ఆపాను .. ... ఆశ్చర్య పోయారు... జర్నలిస్ట్ జ్ఞాపకం

మోడీని దారిలో ఆపాను .. ... ఆశ్చర్య పోయారు... జర్నలిస్ట్ జ్ఞాపకం --------------------------- మోడీని దారిలో ఆపి .... ఒక్క నిమిషం ఆగు ... ఏ మోడీ ?.. నిరవ్ మోడీనా ? కాదు ... మరి లలిత్ మోడీనా ? హే.. కాదు ... నరేంద్ర మోడీ నే .. కలలోనా ? కాదు ... నిజం ... తొమ్మిదేళ్లయినా ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు . మీడియాతో మాట్లాడరు .. ఏ మీడియా ఐనా వ్యతిరేకంగా రాస్తే , మాట్లాడితే మిత్రుడు ఆ మీడియాను కొనేస్తారు . కోపం తెప్పించారని NDTV లాంటి మీడియానే కొనేశారు . అలాంటిది .. నువ్వు ఆంధ్రభూమి రిపోర్టర్ గా ప్రధాని నరేంద్ర మోడీని దారిలో ఆపేసి మాట్లాడాను అంటే మేం నమ్మాలి . నేను ప్రధాని నరేంద్ర మోడీని ఆపాను అని చెప్పలేదు . నరేంద్ర మోడీని ఆపాను అని చెప్పాను . అది కాదు కానీ NDTV లో మహిళా జర్నలిస్ట్ జాకబ్ రాజీనామా ఉదంతం పై మోడీని ఆపిన సంఘటన గుర్తుకు వచ్చింది . మహిళలకు మోడీ ఎంత గౌరవం ఇస్తారు అనే స్టోరీ చేయమని చెబితే - ఆ వివాదం తో 20 ఏళ్ళ ఉద్యోగానికి జాకబ్ రాజీనామా చేశారట . రాజకీయాల్లో ఐనా , మీడియాలో నైనా , చివరకు మన జీవితంలో నైనా తెరవెనుక జరిగింది అంతా బయటకు రాదు . కారణం బయటకు చెబుతున్న దైనా కావచ్చు , చెప్పనిదైనా కావచ్చు ఆమె రాజీనామా నిజం , మోడీ మహిళలకు గౌరవం ఇస్తారనే స్టోరీ NDTV లో రావడం నిజం . మోడీని దారిలో నిలిపాను అని చెప్పి మళ్ళీ ఎక్కడికో వెళుతున్నావు ... ముందు ఆ విషయం చెప్పు .. సరే అక్కడికే వస్తాను . ***** 2004-05 లో హై టెక్స్ కన్వెన్షన్ హాలులో ప్రవాసీ భారతీయ దివస్ జరిగింది . రెండేళ్ల కోసారి ఒక్కో రాష్ట్రంలో జరుగుతుంది . వై యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన తొలి పెద్ద కార్యక్రమం . దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి వివరించి పెట్టుబడులు పెట్టాలి అని nri లను కోరే కార్యక్రమం . ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం కాబట్టి వై యస్ ఆర్ ఏర్పాట్లపై ఎక్కువ దృష్టి పెట్టారు . అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు . వైస్సార్ ఉపన్యాసం రొటీన్ గా ఉంది . ఈ సమావేశం లో నరేంద్ర మోడీ ఉపన్యాసం ప్రత్యేకంగా అనిపించింది . అప్పుడాయన గుజరాత్ ముఖ్యమంత్రి .గుజరాత్ గాలిలోనే వ్యాపారం ఉంటుంది . మీరు ఇక్కడి కన్నా విదేశాల్లో అయితే ఎక్కువ సంపాదించవచ్చు అని పుట్టిన దేశాన్ని వదిలి విదేశం వెళ్లిన వారు . ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే పెడతారా ? ఎక్కడ ఎక్కువ లాభం ఉంటే అక్కడ పెడతారు . కాబట్టి పెట్టుబడి పెట్టండి అని అడగను . ఈ దేశానికి మీరో సహాయం చేయవచ్చు . మీరు ఏ దేశంలో అన్నా అక్కడి వారికీ ఇండియాలోని పర్యాటక ప్రదేశాల గురించి చెప్పండి . ప్రవాస భారతీయులు ఒక్కొక్కరు కనీసం ఐదు మంది ఆ దేశం వారిని ఇండియాకు పర్యాటకులుగా వచ్చేట్టు చేస్తే , ఎంత మంది పర్యాటకులు వస్తారు ? ఎంత విదేశీ మారక ద్రవ్యం వస్తుందో నరేంద్ర మోడీ లెక్కలతో ఉపన్యసించారు . ఉపన్యాసం ప్రత్యేకంగా అనిపించింది . **** హై టెక్స్ చాలా విశాలంగా ఉంది .ఆ ప్రాంతంలో మీడియా కెమెరాలు లేవు . సెక్యూరిటీ హడావుడి లేదు . అప్పుడు ఆంధ్ర జ్యోతిలో పని చేస్తున్న జర్నలిస్ట్ మిత్రుడు వెంకటా చారి (తరువాత జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ) నేనూ ఇద్దరం ఉపన్యాసం విన్నాక హాలులో నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా నరేంద్ర మోడీ ఒక్కరే వస్తున్నారు . గోద్రా అల్లర్లతో అప్పటికే బాగా పాపులర్ . మనకు అవసరం అయిన దానికన్నా ఎక్కువే హిందీ వస్తుంది కదా ? మోడీని పలకరించి చూద్దాం పదా అని ముందుకు వెళ్లి . ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా మేం పలానా మీడియా. మీటింగ్ లో మీ ఉపన్యాసం బాగుంది. అని పొగడ్త బాణం వేసాం . అది బాగానే పని చేసింది . మీడియా నన్ను మెచ్చుకుంటుంది కూడానా ? అని మోడీ నవ్వారు . అంతకు ముందు గోద్రా పై మీడియా మోడీని తీవ్రంగా విమర్శించడం తో మీడియా మెచ్చుకుంటుంది కూడానా ? అని ఆశ్చర్య పోతూ నవ్వారు . మాకు కావలసింది మోడీ ని అక్కడ నిలబెట్టడం కాసేపు మాట్లాడి , అవకాశం ఉంటే మంచి వార్త సంపాదించడం . దారిలో మోడీని ఆపడం , కొద్ది సేపు మాట్లాడడం వరకు సక్సెస్ అయ్యాం . రిపోర్టర్ అనే వాళ్ళు తాజా సమాచారం తో సిద్ధంగా ఉంటే ఎవరితోనైనా ఏమైనా , ఎక్కడైనా మాట్లాడవచ్చు . తాజా సమాచారం అంటే సివిల్స్ కు సిద్ధం అయినట్టుగా కష్టపడాల్సిన అవసరం లేదు . ప్రతి రోజు పేపర్ చదివితే చాలు . పేపర్ చదవడం అంటే మనం రాసిన వార్త మనం చదివి అలసి పోవడం కాదు. పేపర్ మొత్తం సంపాదకీయం తో సహా చదవడం . **** దారిలో నిలిపి మోడీ తో మేం ఇద్దరం అలా మాట్లాడుతుండగానే దారికి ఒక వైపు వివిధ రాష్ట్రాల స్టాల్స్ ఉన్నాయి . మాకు దగ్గర లోనే ఉన్న స్టాల్ లో ఓ మహిళను మోడీ , మోడీని ఆ మహిళ ఒకే సారి చూసి పలకరించుకున్నారు . గుజరాత్ కు చెందిన ఆ మహిళ చాలా కాలం విదేశాల్లో ఉన్నట్టు ఉన్నారు . ముఖం లో ఆ మార్పు ఉంది . బాగా మారిపోయారు అంటూ మోడీ అదే విషయం ప్రస్తావిస్తూ ఆ స్టాల్ దగ్గర ఉన్న మహిళ వద్దకు వెళ్లిపోయారు . ఆమెతో మాట్లాడేప్పుడు కొద్ది సేపు నిరీక్షించినా మా వైపు వచ్చే అవకాశం కనిపించక పోవడంతో వెళ్లి పోయాం . మోడీ మహిళలను గౌరవించడం గురించి ndtv స్టోరీ సంగతి ఎలా ఉన్నా ... మా ముందే మా ఇద్దరు రిపోర్టర్లను మాట్లాడుతుండగానే వదిలేసి మోడీ మహిళ వద్దకు వెళ్లారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం