21, మే 2023, ఆదివారం

మానసిక ఆరోగ్యం... ధైర్యం కోసం ఆ మీడియానే చూడండి .. చదవండి ఓ జ్ఞాపకం

మానసిక ఆరోగ్యం... ధైర్యం కోసం ఆ మీడియానే చూడండి .. చదవండి ఓ జ్ఞాపకం హా ... హా ... ఇప్పుడేమంటావ్ ? 2018 డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయమే టివిలో చూస్తుంటే ఫోన్ లో హా ... హా ... ఇప్పుడేమంటావ్ ? అనే ప్రశ్న ఆమె స్వరం లో అంత సంతోషం చాలా కాలం తరువాత విన్నాను . ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై ఆమె అంతకు ముందే నాతో పందెం వేసింది . ఏబీఎన్ ఛానల్ లో మహాకూటమి దూసుకెళ్తుంది . మహాకూటమికి 30 కి పైగా స్థానాలు ఇచ్చి తెరాస కు అందులో పావు సగం స్థానాలు కూడా ఇవ్వలేదు .. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ల హయాంలో తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన మహిళా నాయకురాలు అట్లూరి రమాదేవి . కృష్ణాజిల్లా మూలాలు ఉన్న నిజామాబాద్ నాయకురాలు . ఎన్టీఆర్ హయం లో రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు , నామినేటెడ్ పదవులు చేపట్టిన ప్రముఖ నాయకురాలు ఫోన్ చేసి ఇప్పుడేమంటావు ...నీ మీద విజయం సాధించాను చూడు అన్నట్టు మన పందెం ఇంకాస్త పెంచుదామా ? ధైర్యం ఉందా ? అని ఆమె ప్రశ్నించింది . ఎంతో కాలం తరువాత ఆమెలో ఉత్సాహం , ఆ స్వరంలో ఆనందం చూసి .. వాటిని ఎందుకు దూరం చేయాలి అనుకొని ... మీ ఇంట్లో మీరు ఏబీఎన్ ఛానల్ చూస్తున్నారు కదా ? అని అడిగాను . ఔను అని సమాధానం వచ్చింది . మనం డబ్బు కోసం పందెం కాయలేదు కదా ? మన అంచనా ఎవరిది కరెక్ట్ అవుతుంది అని తెలుసు కోవడానికి అంతే ... అంతకు ముందు 2004 నుంచి ప్రతి ఎన్నిక , 2014 లో తెలంగాణ ఏర్పాటు , తరువాత ఎన్నికలు అన్ని పందాల్లో ఆమె అంచనాలు తప్పడం ఇప్పుడు టివిలో మహాకూటమి దూసుకెళ్తుండడం తో ఆమె చాలా సంతోషంగా ఉంది . మళ్ళీ పందెం పెంచడం ఎందుకు కానీ ,ఓట్ల లెక్కింపు ఇప్పుడే మొదలైంది కదా ? కొంత సమయం తరువాత మాట్లాడుకుందాం అని ఆమె సంతోషానికి భంగం కలుగనివ్వ లేదు . ***** 2018 ఎన్నికల్లో మహాకూటమి ఏ దశలోనూ తెరాస కు దరిదాపుల్లోకి రాలేదు . 30 సీట్లకు ఓట్ల లెక్కింపు ప్రారంభం లో రాలేదు . ఓట్ల లెక్కింపు ముగింపు లోనూ రాలేదు . ఐతే మహా కూటమి ఏర్పాటు సన్నాహాల నుంచి కూడా ఆంధ్ర జ్యోతి , abn అండగా నిలిచాయి . నిజమైన స్నేహితుడు ఓటమిలో కూడా భుజం తట్టి అండగా నిలుస్తాడు అని నిరూపిస్తూ ... ఓట్ల లెక్కింపు ప్రారంభం ఐన తరువాత కూడా ఈ మీడియా తన మద్దతు కొనసాగించింది .. ఉదారంగా ప్రారంభం లోనే 30 స్థానాలు ఇచ్చి , అందులో పావు సగం కూడా తెరాస కు ఇవ్వకుండా తమ ఛానల్ లో తెరాస ను చిత్తుగా ఓడించారు . ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో మీడియా ఉంది కానీ , ఎలక్షన్ కమిషన్ లేదు . ఐనా ఈ మీడియా మహాకూటమి ని విజయ పథం లో తీసుకెళ్తే ఎన్నికల కమిషన్ మాత్రం అస్సలు పట్టించు కోకుండా తెరాస దూసుకెళ్తున్నట్టు లెక్కలు చెప్పింది . తాను ఒంటి చేత్తో మహాకూటమికి విజయం చేకూరుస్తున్నా ... మిగిలిన ఛానల్స్ అన్నీ ఎన్నికల కమిషన్ ఫలితాలే చెబుతుండడం తో దమ్మున్న ఛానల్ కూడా ఎన్నికల కమిషన్ చెప్పిన ఫలితాలనే చూపక తప్పలేదు ...మహాకూటమి తరుపున చంద్రబాబు విస్తృత ప్రచారం తో హడలెత్తించారు . ప్రముఖ పత్రికలను , ఛానల్స్ ను చూస్తే ఎంతటి వారికైనా మహా కూటమి విజయం ఖాయం అనిపించి తీరుతుంది . అలానే అనుకున్నారు . **** కొన్ని గంటల తరువాత నీరస మైన స్వరం తో అట్లూరి రమాదేవి ఫోన్ చేసి .... ఏంటి ఇలా జరుగుతోంది అని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు . 2004 ,2009 , 2014 ఎన్నికల ఫలితాలు , 2014 లో తెలంగాణ వస్తుంది అని , 2014 , 2018 ఎన్నికలు ఏంటీ అన్నీ నీ అంచనాలే కరెక్ట్ అయ్యాయి .... ఈ అన్ని విషయాల్లో ఇద్దరం పందెం వేసుకున్నాం . పందెం వేసుకోవడమే తప్ప గెలిచినా తీసుకున్నది లేదు . తెలంగాణ వస్తుంది అనే పందెం పై మాత్రం వదిలేది లేదు ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాను . ఎన్నికల జోస్యం వేరు తెలంగాణ ఆవిర్భావ పందెం వేరు అన్నాను . ***** సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు ? అని ప్రశ్నిస్తే ... నేను మా ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో మీరు ఏ ఛానల్ చూస్తున్నారో చెప్పగలిగాను అంటే అంతో ఇంతో అంచనా వేయగలను అని తెలియడం లేదా అన్నాను .తెలంగాణలోనే కాదు ఆంధ్ర లో కూడా ఇలానే ఉంటుంది అన్నాను . నన్నేం చేయమంటావు అని మళ్ళీ అడిగితే మీ ఇంట్లో అన్ని గదుల్లో ఆంధ్రజ్యోతి వేయించుకోండి abn ఛానల్ చూడండి అన్నాను ... నేను బాధలో ఉంటే నీకు జోకులా అని సీరియస్ అయ్యారు . మీకు జోక్ అనిపించ వచ్చు కానీ నేను సీరియస్ గా చెబుతున్నాను . ఆ మీడియా మాత్రమే మిమ్ములను రక్షిస్తుంది . తెలంగాణ ఏర్పాటు , ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా పోవడం , 2019 లో ఆంధ్రాలో వచ్చే ఫలితాలు చిన్న దెబ్బలు కాదు . వాటిని తట్టుకొని మానసికం గా నిలబడడం అనేది చిన్న విషయం కాదు . ప్రత్యర్థి ఘన విజయం సాధించినా మరుసటి రోజు నుంచే టీడీపీ ని ఆకాశానికి ఎత్తడం మాములు విషయం కాదు . ఆ వార్తలు పత్రికల్లో ఛానల్ లో చూస్తే పరవాలేదు మళ్ళీ మనం వస్తాం , నిన్న అలా రిజల్ట్స్ వచ్చాయి కానీ ఈరోజు ఎన్నికలు జరిగినా మనం వస్తాం అనే ధైర్యం వస్తుంది . జోక్ అనుకుంటే మీ ఇష్టం కానీ పాత పరిచయం తో చెబుతున్నా మీరు మానసికంగా క్రుంగి పోకుండా ఆత్మ విశ్వాసం తో ఉండాలి అంటే ఆ మీడియానే చదవండి , వినండి మరో మీడియా వైపు వెళ్ళకండి అని నిజాయితిగా సలహా ఇచ్చాను . ఐతే నేను సలహా ఇవ్వక పోయినా వాళ్ళు చేసే పని అదే అని నాకు తెలుసు . రాజకీయాల సంగతి ఎలా ఉన్నా ... 175 లో 23 స్థానాలకే పరిమితం అయి దిక్కు తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్న పార్టీకి భుజం తట్టి లేవండి రేపటి రాజ్యం మీదే అని ఆత్మవిశ్వసాన్ని కలిగించడం మాములు విషయం కాదు .. వారిది మాములు సేవ కాదు . మోటివేషనల్ స్పీకర్లు , సైకాలజిస్ట్ లు తమ వద్దకు వచ్చిన వారికి మహా అయితే ఓ గంట సేపు కౌన్సిలింగ్ చేస్తారు . కానీ మీడియా మాత్రం ప్రతి రోజు , ప్రతి క్షణం రోజుల తరబడి , ఏళ్ల తరబడి ఒక సమూహం మొత్తానికి కౌన్సిలింగ్ చేయడం మాములు విషయం కాదు . దానికి చాలా దమ్ముండాలి . .. నన్ను అపార్ధం చేసుకుంటారు కానీ ఎంతో మందికి నేను ఇలా సలహా ఇచ్చాను . మీ ఆరోగ్యం కోసం ఆ మీడియానే చూడండి మరో మీడియా చూడకండి అని .... **** కుమార్ అని హిందీ మిలాప్ లో జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవాడు . జీతం విషయం లో అసంతృప్తి ...చాలా ఏళ్ల క్రితం ఓ రోజు సచివాలయం లో ఆంధ్ర జ్యోతి ఢిల్లీ కి వెళుతున్నా అని చెప్పాడు . నీ మెంటాలిటీ కి అస్సలు సూట్ కాదు వద్దు అన్నాను . ఓ ఆరేడు నెలల తరువాత తిరిగి వచ్చాడు . అదే సచివాలయం లో అన్నా అక్కడ జరిగేది ఒకటి వీళ్ళు రాయమనేది ఒకటి నా వల్ల కాదు అని వచ్చేశాను అన్నాడు . పది రూపాయలు పెట్టి షాప్ లో ఆ పేపర్ కొంటే ... మూడు రూపాయలు ఎక్కువ ఇచ్చావు అని షాప్ వాడు సంతోష పడే వాడు . నీకు ఢిల్లీ వరకు వెళ్లాల్సిన శ్రమ తప్పి విషయం తెలిసేది కదా అన్నాను . ఏదైనా అనుభవం ఐతే కానీ తత్త్వం బోధపడదు ... ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది ... ఒకే పార్టీకి మీడియా ఉన్న ఆ రోజులే వేరు ... నోట్ - ఆరోగ్యం కోసం ఆ మీడియాను చూడండి అంతే కానీ చూసింది నిజమే అనుకోని పందాలు కాసి దెబ్బ తినకండి ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం