28, మే 2023, ఆదివారం

ఎన్టీఆర్ ఫోటోలు టాయిలెట్ లో .. పార్టీ రసీదులో బొమ్మ మాయం .ఎండల పేరుతో మహానాడు తేదీ మార్పు:: గుర్తుకొస్తున్నాయి జర్నలిస్ట్ జ్ఞాపకాలు -35 ___________

ఎన్టీఆర్ ఫోటోలు టాయిలెట్ లో .. పార్టీ రసీదులో బొమ్మ మాయం .ఎండల పేరుతో మహానాడు తేదీ మార్పు గుర్తుకొస్తున్నాయి జర్నలిస్ట్ జ్ఞాపకాలు -35 ___________ ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తరువాత హిమాయత్ నగర్ లోని ఓ బిల్డింగ్ లో కొంతకాలం పార్టీని నడిపించారు . భవనం చిన్నది , తక్కువ గదులు , వచ్చి పోయే వారి సంఖ్య చాలా ఎక్కువ . ఆ బిల్డింగ్ లోనే అందరూ ఉపయోగించే కామన్ టాయిలెట్ లోకి వెళ్ళాను . ఓ మూలకు చూస్తే మనసు చివుక్కు మంది . చదువుకునే రోజుల నుంచి నచ్చిన సినిమా నే తప్ప ప్రత్యేకంగా నచ్చిన నటుడు అంటూ లేరు . మార్నింగ్ షో పాత సినిమాలు తక్కువ ధర టికెట్ తో సినిమా హాలులో ప్రదర్శించేవారు . దాదాపు పాత సినిమా అలా చూసిందే . కత్తి చేతబట్టి యస్ వి ఆర్ , రాజనాల , సత్యనారాయణ వంటి విలన్ల ను చిత్తూ చేసిన అందాల హీరోగానే ఎన్టీఆర్ రూపం మెదడులో ముద్రించి ఉంటుంది .ఆ లాంటి ఎన్టీఆర్ ను ఎంత అవమానకరంగా దించేశారు అనే బాధ ఓ వైపు .. దించేసి కొద్ది రోజులకే ఎన్టీఆర్ ప్రచార ఫోటోలు టాయిలెట్ లో ఓ మూలకు వరుసగా పేర్చి ఉండడం తో చివుక్కు మనిపించి , మౌనంగా వెళ్ళిపోయాను . మనసులో ఏమున్నా రిపోర్టర్ గా నా పని నేను చేయలి . ***** ఫోటో గ్రాఫర్ బాలాజీ అని ఉండేవారు . అక్కడ మూలకు ఫోటోలు ఉంటాయి . ఫోటో తీయి ఎవరికీ చెప్పకు అని కోరాను . మనం ఫోటోలు తీసుకున్నట్టు పార్టీ వాళ్లకు , మిగతా ఫొటోగ్రాఫర్లకు తెలియొద్దు అని వార్నింగ్ . మరో రెండు మూడు రోజులు అయితే ఎన్టీఆర్ జయంతి ఆ రోజు వస్తే బాగుంటుంది అని ... ఆంధ్రభూమి మొదటి పేజీలో టాయిలెట్ లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలతో వార్త సంచలనం . అప్పుటికి ఎన్టీఆర్ వర్గం లో మిగిలి ఉన్న కొద్ది మంది లక్ష్మీ పార్వతి , ఇంద్రారెడ్డి లాంటి వాళ్లు ఎన్టీఆర్ కు నివాళి అర్పించి ఈ వార్తను ప్రత్యేకంగా ప్రస్తావించారు . ఎన్టీఆర్ పై బాబు వర్గానికి ఉన్న గౌరవం దీనితో తెలుస్తుంది అని విమర్శించారు . ఎన్టీఆర్ ఫోటోలు తీసుకువెళ్లి అక్కడ పెట్టండి అని బాబు చెప్పాడు అని నేను అనుకోవడం లేదు . కానీ దైవంగా అప్పటివరకు పూజలు అందుకున్న నాయకుడిని ఒక్క సారి దించేసి కిందపడేసిన తరువాత అక్కడ పనిచేసే అటెండర్ కూడా అలానే చూస్తాడు . ఆ ఫోటోలు అక్కడ పెట్టడంలో అతనికి తప్పేమీ అనిపించదు. రాజకీయంగా ఎన్టీఆర్ బొమ్మను మళ్ళీ ఉపయోగించుకునే రోజులు వస్తాయని అక్కడి అటెండర్ లాంటి సామాన్యుడికి ఆలోచన ఎందుకు వస్తుంది . పత్రికలో వార్త రాగానే తీసేశారు . ***** బాబు చేతికి పగ్గాలు వచ్చిన తరువాత మొదట్లోనే ఒకదాని తరువాత ఒకటి ఎన్టీఆర్ గుర్తులు చెరిపేయాలి అని ప్రయత్నించారు . ఎన్టీఆర్ బతికి ఉండగానే బాబు సీఎంగా గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లింది , ప్రజలు పనితీరుచూసి ఆదరిస్తారు అన్నారు పార్టీ సభ్యత్వ రుసుం రసీదుపై ఎన్టీఆర్ ఫోటో ఉండేది . బాబు పార్టీ అధ్యక్షుడు అయిన మొదట్లోనే ఎన్టీఆర్ ఫోటో తొలగించి చంద్రబాబు తన ఫోటో ముద్రించారు . హరికృష్ణ అభ్యన్తరం వ్యక్తం చేశారు . ఇప్పటికీ బాబు ఫోటోనే ఉంది సూర్యుడు పుట్టినప్పటి నుంచి మే నెలలో ఎండలు ఉంటాయి . నిజానికి మే లో ఎండలు కాదు . ఎండలు ఉండే కాలానికే మనం మే అని పేరు పెట్టుకున్నాం . మే 27,28,29 న మహానాడు జరుగుతుంది . తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి , అంటే ఎన్టీఆర్ హయం నుంచి కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజున మహానాడు జరుగుతుంది . . ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజున జరిగే మహానాడు తేదీలు మార్చాలి అని ప్రయత్నించారు . ఒక సంవత్సరం మహానాడు మేలో నిర్వహించలేదు . దానికి ఈనాడులో పెద్ద వార్త రాయించారు . మే లో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మే లో మహానాడు నిర్వహించవద్దు అని నిర్ణయం అని వార్త . ఆ తరువాత మారిన పరిస్థితుల్లో మళ్ళీ ఎన్టీఆర్ ను ముందుకు తీసుకువచ్చి ఏకంగా దేవుడిని చేశారు . ***** బాబు గారే కంప్యూటర్ కనిపెట్టారు , హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు , సత్యనాదెళ్లను చదివించారు అని గట్టిగా నమ్మే టీడీపీ ఐటీ తరం కుర్రాళ్ళు కొందరికి ఈ విషయాలు ఏమీ తెలియవు . బాబు తో ఏదో గట్టు పంచాయతి ఉండి రాస్తున్నాను అనుకోని కామెంట్స్ పెడితే ఒక్క క్షణం అనిపిస్తుంది . రాయడం అవసరమా ? అని అలా అనుకున్న సమయం లోనే ఉదయం మాడభూషి శ్రీధర్ ఫోన్ చేసి ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు చాలా సంతోషం కలిగించాయి . వారు కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషన్ , న్యాయ నిపుణులు , విద్యార్థులకు న్యాయ పాఠాలు బోధించే ప్రొఫెసర్ . ఆనాటి జ్ఞాపకాలు బాగారాస్తున్నారు . రాయండి నేను అప్పుడు లా పాఠాలు బోధించే లెక్చరర్ గా ఉంటూ కూడా వైస్రాయ్ హోటల్ వద్దకు రోజూ వచ్చేవాడిని . మీరు రాసినవి నేను కళ్ళతో చూశాను . న్తర్కు జరిగిన అన్యాయం చూసి చాలా బాధవేసింది . కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో అప్పుడు నేను చూసినవి రాశాను . మీ రాతలు అవన్నీ గుర్తు చేస్తున్నాయి అన్నారు . ఆరోగ్య సమస్య వల్ల కొన్ని రోజుల నుంచి ఎక్కువగా మాట్లాడలేక పోతున్నారు .ఐనా దాదాపు పదిహేను నిమిషాలు కష్టపడి మాట్లాడారు . పూర్తిగా కోలుకొని మాట్లాడేందుకు, రాసేందుకు నాకు ఇంకా రెండేళ్లు పట్టవచ్చు అప్పుడు న్యాయ కోణం లో రాస్తాను అని . ఎన్టీఆర్ కు ఎవరెవరు ఏ విధంగా అన్యాయం చేశారో మాట్లాడ సాగారు . అప్పుడు అనిపించింది వెన్నుపోటులో భాగస్వాములుగా ఉండి ఆర్థికంగా ఎంతో బాగుపడిన వారే నీతులు చెబుతూ రాస్తుంటే మౌనంగా ఉండడం , రాయక పోవడం అన్యాయం అనిపించింది . *** ఎంత కాలం ? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారే ఎన్నికల కోసం ఆయనకు దేవుడి రూపం కల్పించి ఓట్లు అడగడం ఉన్నంత వరకు వెన్నుపోటు గురించి రాస్తూనే ఉంటారు ... ( వేటపాలెం గ్రంథాలయం అందుబాటులో ఉన్న వారు 1996 మేలో ఆ ఫోటోలు వచ్చిన ఆంధ్రభూమి ఫోటో సంపాదిస్తే కృతజ్ఞతలు )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం