19, మే 2023, శుక్రవారం

పళ్లూడగొట్టుకొని బంగారు పళ్ళు పెట్టించుకొన్న జర్నలిస్ట్ అద్దె కట్టలేక అటవీ  ప్రాంతం లో అంతిమ రోజులు అతని జీవితం ఓ పాఠం జ్ఞాపకాలు 

పళ్లూడగొట్టుకొని బంగారు పళ్ళు పెట్టించుకొన్న జర్నలిస్ట్ అద్దె కట్టలేక అటవీ  ప్రాంతం లో అంతిమ రోజులు అతని జీవితం ఓ పాఠం జ్ఞాపకాలు  ^ ^  చూశారా బంగారు పళ్ళు పెట్టించుకున్నాను . నా పళ్ళు బాగానే ఉన్నాయి కానీ చిన్నప్పటి నుంచి పేదరికం లోనే గడిపాను . ఇప్పుడు డబ్బులు వచ్చాయి . బాగున్నా పళ్ళు తీసేసి బంగారు పళ్ళు  పెట్టించుకున్నాను ^^ ఇదో జర్నలిస్ట్ వాస్తవ కథ .  పేదరికం  జీవితం లో చాలా పాఠాలు నేర్పిస్తుంది . మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే .  నేర్చుకోక పోతే మరింత పేదరికంలోకి నెట్టేసి క్రూరంగా నవ్వుతుంది . రంగారావు అని ఆంధ్రప్రభలో జర్నలిస్ట్ . నాకు  పెద్దగా పరిచయం లేదు కానీ నా   మిత్రుడికి మంచి ఫ్రెండ్ . మా ఇద్దరి మధ్య తరుచుగా రంగారావు ప్రస్తావన వచ్చేది . ఈ మధ్య కలిసినప్పుడు రంగారావు గురించి అడిగితే రాజమండ్రి సమీపం లో గిరిజన ప్రాంతంలో అనాథలా మరణించాడు అని చెప్పుకొచ్చాడు . సరదాగా బంగారు పళ్ళు పెట్టించుకున్న అతను ఇక్కడ అద్దె భరించలేక నాలుగు వందల రూపాయల అద్దె కోసం గిరిజన ప్రాంతానికి వెళ్లి ఒక్క చిన్న గదిలో చివరి రోజులు గడిపారు . ***** ఖమ్మం లో జర్నలిస్ట్ లకు ప్లాట్ ల కోసం  28 ఎకరాల స్థలం కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది . హైదరాబాద్ జర్నలిస్ట్ లకు భూమి బదలాయించాలి అని ఉద్యమం వార్తలు . ఇవి చూశాక రంగారావు జీవితం గుర్తుకు వచ్చింది . అతను ఆంధ్రప్రభలో కాంట్రాక్ట్ ఉద్యోగి . జీతం తక్కువ ఉంటుంది . ఉద్యోగ భద్రత అస్సలు ఉండదు . జీవితం మొత్తం లో అతను చేసిన ఒకే ఒక లాభసాటి పని సకాలం లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో దరఖాస్తు చేయడం . దరఖాస్తు చేసిన వేళా విశేషం అతనికి ప్లాట్ అలాట్  అయింది . దాదాపు రెండు దశాబ్దాల క్రితం గోపన్ పల్లి లోని ప్లాట్ 36 లక్షలకు  అమ్మేశాడు .  ఇప్పుడు అక్కడ దాని విలువ మూడు కోట్ల రూపాయలు ఉంటుంది . రెండు దశాబ్దాల క్రితం 36 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమే . డబ్బు సంపాదించడమే కాదు దాన్ని హోల్డ్ చేసే సామర్ధ్యం కూడా ఉండాలి .  ఆ డబ్బుతో ఉప్పల్ వద్ద చిన్న ఇల్లు కుటుంబం అంతా జల్సాగా వెళ్లేందుకు ఓ కారు కొన్నాడు . సరిపోవడం లేదు అని కారుతో పాటు ఓమిని కొన్నారు . చదువు ఒంటబట్టక చిన్న ఉద్యోగం చేస్తున్న కొడుకు తో ఉద్యోగం మానేయించి బేకరీ పెట్టించాడు .  చేతిలో ఇంత డబ్బు ఉన్నాక కాంట్రాక్ట్ ఉద్యోగం ఎందుకు అని ఉద్యోగం మానేశాడు . సరైన ప్లాన్ లేకపోతే కొండలే కరిగిపోతాయి 36 లక్షలు ఓ లెక్కనా ? రెండు కార్లలో ఆలయాల సందర్శన . సరదాగా పళ్లూడగొట్టుకొని బంగారు పళ్ళు పెట్టించుకోవడం వంటివి అన్నీ చేశారు . చిన్న పాటి ఇల్లు కూడా  అమ్మేసి అద్దె ఇంట్లోకి మకాం మారింది . వ్యాపారం తెలియక ఎక్కడ అమ్ముడుపోనివి వీరి బేకారికే అంటగట్టే వారు . ఒక శుభముహుర్తం లో  బేకరీ మూసేసి కొడుకు మళ్ళీ ఉద్యోగం లోకి . చిన్న ఇంటికి కూడా హైదరాబాద్ లో అద్దె చెల్లించలేక రాజమండ్రి దగ్గర లోని అటవీ ప్రాంతంలో నెలకు నాలుగు వందల  అద్దెతో చిన్న గదిలోకి జీవితం మారింది . అప్పటి వరకు పేదరికంలో గడిపిన వారికి  హఠాత్తుగా సంపద వస్తే రెండు రకాలుగా  వ్యవహరిస్తారు . పేదరికం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు కాబట్టి  మళ్ళీ తనను పేదరికం ప్రేమించకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకునే వారు కొందరైతే .. నేనిప్పుడు పేదరికం లో లేను నా పరిస్థితి మారింది చూడు అని బంగారు పళ్ళు పెట్టించుకుని  బోల్తా పడేవారు కొందరు . **** జర్నలిస్ట్ లకు ఎవరూ పాఠాలు చెప్పలేరు ... ఎందుకంటే  వాళ్ళు తలుచుకుంటే బార్ షాప్ లో కూర్చొని అమెరికా  పీచమణచగలరు . అందరూ అలా అని కాదు జీవితం గురించి ఏ మాత్రం అవగాహన లేనివారే అలా ఉంటారు . మహబూబ్ నగర్ జిల్లాల్లో  దొంగసారాయి వ్యాపారం గురించి రాసినందుకు డీకే భరత్ సింహా రెడ్డి అనుచరులు రాధాకృష్ణ అనే పార్ట్ టైం విలేకరి ని కిడ్నాప్ చేశారు . ఉదయం లో జొన్నలగడ్డ రాధాకృష్ణ అనే మంచిమనిషి  మహబూబ్ నగర్ రాధాకృష్ణను హైదరాబాద్ కు పిలిచి ఫోటో గ్రాఫర్ గా ఉద్యోగం ఇచ్చారు . అతని కి అదృష్టం కలిసొచ్చి జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ దక్కింది . కిడ్నాప్ తో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అయింది . ఆ ప్లాట్ అమ్మి బోలెడు అద్దెలు వచ్చే విధంగా ఉప్పల్ లో పెద్ద బిల్డింగ్ కొనేసాడు . అతను మేధావి కాదు కాబట్టి అలా చేయగలిగాడు . **** జర్నలిస్ట్ ల అందరి జీవితాలు అందరికీ తెలిసిన ఓ అరడజను మంది జీవితల్లా ఉండవు . పారిశ్రామిక వేత్తలు , సాధారణ జర్నలిస్ట్ నుంచి పత్రికను కొనే స్థాయికి ఎదగడం , పవర్ ప్రాజెక్ట్ లు , కోట్ల ఆదాయం ఉండే వారు మహా అయితే అరడజను లోపే ఉంటారు . ఎక్కువ మంది జీవిత పోరాటం లో బాగా అలసిపోయిన వారే ఉంటారు . ఈ సంగతి మనకూ తెలుసు పాలకులకు తెలుసు . ఉమ్మడి రాష్ట్రం లో వేల కోట్ల రూపాయల భూములు ఆక్రమించుకున్న రాజకీయ కుటుంబాల వారు  వారు సైతం మేం అధికారం లోకి వస్తే జర్నలిస్ట్ లకు ప్లాట్స్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెడతాం అంటున్నారు . ఆక్రమించుకున్న భూమిలో ఓ ఎకరం ఇస్తాం అంటే నమ్మకం కుదిరేది . కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు . అప్పటివరకు వేచి చూడాలి . వచ్చాక రంగారావులం అవుదామా ? రాధాకృష్ణలం అవుదామా ? అనేది మన ఇష్టం . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం