20, మే 2023, శనివారం

ఏం పిల్లడో వెల్దమొ స్త వా ? ... వెళితే బతుకు బస్టాండే వంగపండుతో .. ఓ జ్ఞాపకం

ఏం పిల్లడో వెల్దమొ స్త వా ? ... వెళితే బతుకు బస్టాండే వంగపండుతో .. ఓ జ్ఞాపకం ఎన్టీఆర్ భవన్ లో 2004 .. టీడీపీ అధికారం కోల్పోయిన కొత్తలో .. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే వెళ్ళాను . వేదిక పై ఉన్న అతను బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఉన్నారు , ఎవరో గుర్తుకు రావడం లేదు . ఒక ప్రముఖ నాయకుడి ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి అతను రాకముందు రెండు మూడు బృందాలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించడం అక్కడ కొత్తేమీ కాదు . ఐతే అక్కడున్న వ్యక్తి ఎవరా ? అనే ఆలోచనలోనే మునిగిపోయాను . ఎన్టీఆర్ భవన్ లో మనకు తెలియని నాయకుడా ? అని అతన్నే చూస్తూ ఆలోచిస్తున్నాను . నేను వంగపండును అంటూ అతను మాట్లాడడం మొదలు పెట్టాక అర్రే ప్యాంట్ , షర్ట్ లో ఉండడం వల్ల గుర్తు పట్టలేక పోయాను . వీరు పాటపాడేప్పుడు ధోవతి తో ఉంటారు కదా అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను . చంద్రబాబు విధానాలు నచ్చి టీడీపీలో చేరాను అని , టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నట్టు .. చంద్రబాబు విధానాలపై ప్రచారం చేస్తాను . ఇదీ వంగపండు ప్రెస్ కాన్ఫరెన్స్ సారాంశం . వంగపండు మాట్లాడడం ముగించి కిందికి వచ్చిన తరువాత నన్ను నేను పరిచయం చేసుకొని చంద్రబాబు విధానాలు మీకు ఏం నచ్చాయో చెబితే .. మేమూ అనుసరిస్తాం చెప్పండి అంటే .. కొద్ది సేపు ఆగి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాం అనే హామీ అని చెప్పారు . ఎన్నికల్లో కూడా బాబు ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసు కోవాల్సి వస్తుంది అని చెప్పారు . వైయస్సాఆర్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది . అదే ఒక గొప్ప సిద్ధాంతం అనుకుంటే ఉచిత విద్యుత్ ఇస్తున్న కాంగ్రెస్ సిద్ధాంతం అవుతుంది కానీ వస్తే ఇస్తాం అంటున్న టీడీపీ సిద్ధాంతం ఎలా అవుతుంది అంటే .. ఏమీ చెప్పలేక పోయారు . తన పాటలతో లక్షలాది మందిని ఉర్రుతలూగించిన వంగపండు మౌనంగా ఉండి పోయారు . ఆయన పాటలంటే నాకు చాలా ఇష్టం . నాయకుడితో మాట్లాడినట్టు కాకుండా గాయకుడితో మాట్లాడినట్టు మాట్లాడాను . ఆయన ఇబ్బంది గమనించి మీకు నేను చదివిన ఓ ఉదంతం గురించి చెబుతాను అని హిందీ నటుడు రాజ్ కపూర్ గురించి చదివింది చెప్పాను . **** ఓ సారి రాజ్ కపూర్ స్మగ్లర్ హాజీ మస్తాన్ ఇంటికి వెళ్లారు . దీనిపై తీవ్రవిమర్శలు వచ్చాయి . మహానటుడు స్మగ్లర్ ఇంటికి వెళ్లడం ఏమిటా ? అని .. రాజ్ కపూర్ కు ఇది తెలిసి నేను హాజీ మస్తాన్ ఇంటికి వెళ్లడం తెలిసి మీరంతా విమర్శిస్తున్నారు కదా ? ముంభైలో భారీ సభ ఏర్పాటు చేసి అందరి ముందు హాజీ మస్తాన్ కాళ్ళు మొక్కుతాను అన్నారు . ఎందుకూ అంటే .. మేరా నామ్ జోకర్ సినిమా ప్ ఫ్లాప్ అయిన తరువాత నిండా మునిగిపోయాడు . చుట్టూ అప్పులు . ఆత్మహత్య చేసుకోవాలి అని గోవా వెళ్ళాడు . అదే గోవాలో హాజీ మస్తాన్ ఉన్నాడు . . ఇలా వచ్చారేమిటి అని రాజ్ కపూర్ ను పలకరించాడు . ఊరకనే అని చెబితే .. కాదు మీ ముఖం లో ఏదో తేడా ఉంది . సమస్య ఏమిటో చెప్పండి అంటే .. సినిమాలో లాస్ , అప్పుల గురించి చెప్పాడు . ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఆ జాబితా ఇవ్వండి . మళ్ళీ మీరు సినిమా చేయడానికి ఎంత కావాలి అని అడిగి . మరుసటి రోజు ఎవరికి చెల్లించాల్సింది వారికి వెళ్ళిపోయింది . రాజ్ కపూర్ ను ఇష్టపడే భారతీయులు ఒక్కొక్కరు ఒక్క రూపాయి ఇచ్చినా రాజ్ కపూర్ కు ఆత్మహత్య ఆలోచన రాకపోతుండే .. హాజీ మస్తాన్ ఎవరు అనేది నాకు అనవసరం . అవసరానికి నన్ను ఆదుకున్నాడు నాకు ఆ కృతజ్ఞత ఉంది అని రాజ్ కపూర్ చెప్పారు . ఇది చెబితే వంగపండు ఆసక్తిగా విన్నారు . తరువాత నేను నాయకుల నుంచి వార్తలు సేకరించే పనిలో పడిపోయాను . **** వంగపండుతో మాట్లాడేప్పుడు మిగిలిన జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు . బయటకు వెళ్ళడానికి మెట్ల వద్దకు వచ్చినప్పుడు వంగపండు తన దగ్గరకు రమ్మని పిలిస్తే వెళ్ళాను . మీరు చెప్పింది కరెక్ట్ . అందరికీ వంగపండు పాట కావాలి కానీ వంగపండు కుటుంబ సమస్యలు ఎవరికీ పట్టవు . నా వల్ల మా అబ్బాయికి ఉద్యోగం రావడం లేదు , పెళ్లి కావడం లేదు . అమ్మాయికి ఆరోగ్య సమస్యలు , చికిత్సకు డబ్బు లేదు . గద్దర్ ఒక్కరే కాదు ఎంతో మంది పాడడం లో నన్ను అనుసరించారు . పేరు ప్రఖ్యాతులు పొందారు ఎక్కడో ఉన్నారు . నా పరిస్థితి మాత్రం బాగాలేదు . టీడీపీ వాళ్ళు ఆర్ధిక సహాయం చేస్తామన్నారు అని చెప్పుకొచ్చారు . తన పాటలతో లక్షలాది మందిలో వేడి పుట్టించి ఉర్రుత లూగించిన గాయకుని పరిస్థితి బాధేసింది . మిమ్ములను ఇంతకు ముందు ఎప్పుడూ కలువక పోయినా మీ పాట బాగా ఇష్టం . ముందు మనిషి బతకాలి . దాని కోసం ఒకరికి అపకారం చేయకుండా ఏం చేసినా తప్పు కాదు . మీరు టీడీపీకి ప్రచారం చేయడం అస్సలు తప్పు కాదు . ఐతే మీరు చేసే పనికి ఒక సిద్ధాంతం ఆపాదించడమే నాకు తప్పు అనిపించింది అన్నాను . **** వివిధ ఇజాలపై ఊగిపోయే మిత్రులతో మాట్లాడేప్పుడు ఓ మాట చెబుతుంటా ... ఆర్ యస్ యస్ , ఆర్ యస్ యు , మావోయిజం , స్త్రీ వాదం , పురుష వాదం ఆ ఇజం ఈ ఇజం , తాజాగా పవన్ ఇజం .. ఈ ఇజాలు ఏవైనా కావచ్చు . అవి గొప్పవి అనను , చెడ్డవి అనను .. ఆ ఇజాలపై అద్భుతంగ ఉపన్యాసాలు ఇచ్చే వారు ఉంటారు కదా ? వారితో ఓ సారి మాట్లాడి అడగాల్సింది ఇజం లో సందేహాలు కాదు . మీరు అద్భుతంగా సిద్ధాంతాలు చెబుతున్నారు బాగున్నాయి , కానీ ఏ ఇజం అనుసరించినా ఇల్లు గడవడానికి ఒక ఉపాధి మార్గం ఉండాలి కదా ? మీరు ఎలా బతుకుతున్నారు అని అడగాలి . పెన్షన్ , ఉద్యోగం , ఎన్జీవో , సొంత వ్యాపారం ఏదైనా కావచ్చు . వారి ఉపాధి మార్గం తెలుసుకొని , ముందు వారిలా సంపాదించడం మొదలు పెట్టి ఆ తరువాత వారి జెండాలు మోయమని చెబుతుంటా ... **** మీరు చేసింది తప్పేమీ కాదు అని వంగపండు తో అభిప్రాయాలు పంచుకున్నాను . తొలుత టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడి పదవి యిస్తామని అన్నారు . ఇప్పుడేమో సాంస్కృతిక విభాగం లో పని చేయమంటున్నారు అని వంగపండు చెప్పారు . రాజకీయమే అంత అన్నాను . ఆ రోజు తరువాత వంగపండు మళ్ళీ ఎన్టీఆర్ భవన్ లో కనిపించలేదు . వంగపండు కమ్యూనిస్ట్ పార్టీల కోసం గజ్జె కట్టారు . తరువాత టీడీపీ , 2009 లో కాంగ్రెస్ కోసం పని చేసారు . వంగపండు కుమార్తె  వై యస్ ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం