10, ఏప్రిల్ 2013, బుధవారం

కట్జూ ‘మార్కండేయ’ పురాణం!

రాజ్‌నారాయణ్, కెఎపాల్, శేషన్ వంటి హేమా హేమీ లు భారీ కటౌట్లతో హాలు చూడ ముచ్చటగా ఉంది. వీరితో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరి ఫోటోలు, వారి అతి మేధావి తనం గురించి సంక్షిప్త పరిచయం రాసి ఉందక్కడ. అతి మేధావులను ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సదస్సు అది. మేధావులు ఏదో ఒక రంగంలో దేశానికి అవకాశం ఉన్నంత వరకు ఉపయోగపడతారు. తమ లోకం ఏదో తాముగా జీవిస్తారు. మేధావి తనం ఎక్కువయినప్పుడు అతి మేధావులవుతారు. ప్రారంభ జీవితంలో వీళ్లు కూడా మేధావులే కానీ ఆ గుర్తింపు కాస్తా ఎక్కువయిన తరువాత అతి మేధావులుగా మారుతారు.


కెఎ పాల్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మత బోధకుడిగా మారి సొంత విమానాలు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగారంటే సామా న్య విషయం కాదు. కచ్చితంగా మేధావే. అది కాస్తా ఎక్కువైన తరువాత ప్రపంచాన్ని నేనే నడిపిస్తున్నాను, అమెరికా అధ్యక్షున్ని మార్చేస్తాను, ప్రభువుతో ఇప్పుడే మాట్లాడాను అంటూ అతి మేధావుల జాబితాలో చేరారు.


రాజ్‌నారాయణ్ ఇందిరాగాంధీని ఓడించిన నాయకుడు. అదే ఆయన కొంప ముంచి అతి మేధావిగా మార్చేసింది. రాజకీయాల్లో పిచ్చి మాటలు పిచ్చి చేష్టలతో అతి మేధావులకు అన్నగా మారి... పోయారు. ప్రపంచంలోనే ఎంతో పేరున్న యూనివర్సిటీల్లో పాఠాలు చెప్పే సుబ్రమణ్యస్వామి సైతం పాపం మేధావి తనం పెరిగిపోయి అతి మేధావిగా మారిపోయారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అంటూ ఒకటి ఉంటుందనే విషయమే చాలామందికి తెలియని సమయం లో ఆ కమిషన్ పగ్గాలు చేత బట్టారు .   రాజకీయ నాయకులను హడలెత్తించి, ప్రధానమంత్రిని మించిన పాపులారిటీ సంపాదించిన శేషన్ మేధావి తనం పెరిగిపోవడంతో రాజకీయాలు నేర్పిస్తాను అంటూ రాజకీయ కాలేజీ పెట్టి పెట్టుబడి కూడా తిరిగి రాక తలతిక్క శేషన్‌గా మారిపోయారు.


ఇలాంటి అతి మేధావులందరినీ గుర్తు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సదస్సులో మార్కండేయ కట్జూ ప్రధాన ఉపన్యాసం ఇవ్వసాగారు.
‘‘మన మెదళ్లు పేడ, చెత్త, దుమ్ము, దూళితో నిండిపోయి, కుళ్లి పోయాయి ’’ అని మార్కండేయ కట్జూ అనగానే ఒక్కసారిగా అక్కడ హాహా కారాలు చెలరేగాయి. మనం వెధవలం, మతతత్వ వాదులం అంటూ ఉపన్యాసం దంచేస్తున్నారు. అంతా లేచి ఏదో అరవ సాగారు.


 మార్కండేయ మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆజాను బాహువైన మార్కండేయకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నేనన్న ప్రతి మాటను ఇక్కడే నిరూపిస్తాను? సవాల్ విసిరారు. నిరూపించాలని కొందరు పట్టు పట్టారు. నేనేమన్నాను అంటూ మార్కండేయ ప్రశ్నించాడు. మన మెదడు, పేడ, చెత్తతో కుళ్లిపోయిందన్నాను కదా? అంటూ ఒక్క క్షణం ఆగారు. సభా ప్రాంగణంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆరడుగులపైనే ఉన్న కట్జూ ఒక్కసారి సభలో ఉన్న అందరికీ కనిపించేట్టుగా తన తలను కిందకు వంచాడు. మళ్లీ సభలో కలకలం చెలరేగింది. అంతా ఆశ్చర్యపోయారు. నిజమే ఆయన మెదడులో పేడ, చెత్త స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ చెత్తను చూసి కొందరు నోరెళ్లబెడితే, వాసన భరించలేక కొందరు ముక్కు మూసుకున్నారు.


ఈ మార్కండేయ ఏదైనా ఆధారం లేనిదే మాట్లాడరు, ఇక నేను చెప్పేది వౌనంగా వినండి అని హూంకరించారు. ఎందుకైనా మంచిదని మార్కండేయ అభిమానులు తమ తలపై చేయి పెట్టి చూసుకున్నారు. చేతికి పేడ అంటింది. ఔను నిజం మార్కండేయ చెప్పింది నిజం.. నిజం అని గట్టిగా చప్పట్లు కొట్టి మద్దతు తెలిపారు.


దేశంలో 90 శాతం మందిమి మూర్ఖులం, 80 శాతం మంది మతతత్వ వాదులు. 4.1 శాతం మంది తలతిక్క వాళ్లు, 5.2 శాతం మంది ఏం మాట్లాడతారో వారికే తెలియదు అంటూ వెంకట్రామా అండ్‌కో ఎక్కాల పుస్తకంలోని అంకెలన్నీ కళ్ల ముందు చూపించసాగారు.
గంభీరంగా ఉపన్యాసం సాగుతుంటే కింది నుంచి ఒకరు...గురుడు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏం చేశాడో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడని గట్టిగానే అడిగారు.
‘‘ఏమన్నారు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏం చేశారు అని అడుగుతున్నారా?’’


దేశంలో గతంలో ఎవరూ చేయని భవిష్యత్తులో ఎవరూ చేయలేని పని చేశాను ఒకసారి కాదు రెండు సార్లు సుప్రీంకోర్టులో ముషాయిరా (గానా భజానా) నిర్వహించాను. ఇంత దమ్ము ఇంకెవరికైనా ఉందా? అని మార్కండేయ నిలదీశారు. అరే మనకా సంగతి తెలియదే గొప్ప చాన్స్ మిస్సయ్యాం, తెలిస్తే, బోగం మేళ కూడా నిర్వహించాలని డిమాండ్ చేసి ఉండేవాళ్లం అని తెలుగోడు పక్కనున్న వాడితో చెప్పుకున్నాడు.


మీకు ఇంకెన్నో చిత్రమైన విషయాలు చెబుతాను వినండి ఈ దేశ ప్రధానమంత్రి హిందీలో పాటలు పాడలేరు, పంజాబ్ వాడైనా బాంగ్రా డ్యాన్స్ చేయలేరు. కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసిపోవాలి. శ్రీలంక సమస్య పరిష్కారం కావాలంటే శ్రీలంక ఇండియా కలిసి పోవాలి. ఇరాన్ సమస్యకు పరిష్కారం ఇరాన్ అమెరికాలో విలీనం కావాలి. ఇరవై ఏళ్లలో ఇది జరిగి తీరుతుంది. ఇలాంటి ఐడియాలు నా వద్ద బోలెడు ఉన్నాయి అని చెప్పుకుపోతున్నాడు.


ఆ ఉపన్యాసం వింటున్న మార్కండేయ అభిమానులు ఆయన అతి మేధావి తనానికి బుర్ర తిరిగిపోయింది. ఇంతటి మహా మేధావిని ఇలా ఊరికే ఉంచడం అన్యాయం. లోక్‌సభకు ఎన్నడూ పోటీ చేసి గెలవని వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన అమ్మ, ఈసారి మరో అడుగు ముందుకు వేసి జీవితంలో ఎన్నడూ ఓటు వేసి ఎరుగని ఈ అతి మేధావిని ప్రధానమంత్రిని చేయడం ద్వారా ప్రపంచ సమస్యలు పరిష్కరించడానికి పూనుకోవాలి అంటూ ఆయన అభిమానులు డిమాండ్ చేశారు.

9 కామెంట్‌లు:

  1. మేధావులు అతి మేధావులుగా మారేవిదానమిదన్నమాట :))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన మేధావులు అతి మాటలతో తమకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు Palla Kondala Rao gaau kaadantaaraa ?

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. యూజీ శ్రీరామ్ గారు మీరు రాసిన అభిప్రాయం బాగుంది కాదు.. చాలా బాగుంది ... సుబ్రమణ్య స్వామి ప్రకటనలు కొన్ని అలాంటి అభిప్రాయం కలిగిస్తాయి మీరు చెప్పినట్టు అతని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను

      తొలగించండి
  3. సోనియా అమెరిక cia ఏజెంట్ అంటూ చిత్ర విచిత్ర మైన ప్రకటనలు చేశారు

    రిప్లయితొలగించండి
  4. ug శ్రీరామ్ గారు .. కళ్ళ ఎదుట వాస్తవం కనిపిస్తున్నా నెను నమ్మిందే నిజం అనే వాదన నేను చెయను. సుభ్రమణ్యం లని వారిని అర్థం చేసుకోవడం కొంచం కష్టమే .. మీరు పంపిన విడియోలు ప్రశ్నతంగా చూస్తాను

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం