19, జూన్ 2013, బుధవారం

రాజకీయ రహస్య సహజీవనం

మనుషులకు పెళ్లి చేసినంత కీడు మరేదీ చేయలేదని, మనిషి స్వేచ్ఛను పెళ్లి హరించేసిందంటారు ఓషో రజనీష్. పెళ్లి ప్రస్తావన లేని సమాజం గురించి ఆయన కలలు కన్నారు. కొంత మంది సహజీవనం రూపంలో రజనీష్ కలలను నిజం చేస్తున్నారు. మనుషుల జీవితంలో సహజీవనం విషయం ఎలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం సహజీవనం అత్యవసరం. మన సంప్రదాయంలో పెళ్లి ఏడు జన్మల బంధం అంటారు. మనుషుల జీవితం విషయంలో ఎలా ఉన్నా పెళ్లి రాజకీయాల్లో స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. 

రాష్ట్రంలో అధికార పక్షం, విపక్షం మధ్య రహస్య సహజీవనం జరుగుతోంది అనేది బలంగా ప్రచారంలో ఉంది. రాజకీయ పక్షాల మధ్య చాలా కాలం నుంచే సహజీవనం సాగుతోంది. ఒకప్పుడు రాష్ట్రంలో వామపక్షాలు అధికారంలోకి వస్తాయేమో అన్నంతగా విజృంభించాయి. చివరకు విజయవాడను కాకుండా కర్నూలును ఆంధ్రరాష్ట్ర రాజధానిగా నిర్ణయించడం వెనుక, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వెనుక కమ్యూనిస్టుల ప్రాభల్యమే ప్రధాన కారణం. టిడిపితో వామపక్షాలు బంధం ఎప్పుడైతే ప్రారంభం అయిందో అప్పటి నుంచి వామపక్షాలు అంటే గత చరిత్ర మాత్రమే. వృద్ధనారీ పత్రివ్రత అన్నట్టు మూడు దశాబ్దాల కాపురం తరువాత ఇప్పుడు కనులు తెరుచుకున్న వామపక్షాలు పెళ్లి వద్దు సహజీవనం ముద్దు అంటున్నాయి. దానికి దీనికి తేడా ఏమిటంటే పెళ్లంటే ఇష్టం ఉన్నా లేకున్నా కలిసి ఉండాల్సి వస్తుంది. విడిపోకుండా పట్టుకుని వేలాడేవారు అంటే ఎవరికైనా చిన్నచూపే అదే నచ్చక పోతే విడిపోతారు అనే భయం ఉంటే నిరంతరం ప్రేమిస్తుంటారు. ఈ తేడా తెలుసుకున్న వామపక్షాలు టిడిపితో మాది శాశ్వత బంధం కాదు ఇష్టం వచ్చినప్పుడు విడిపోవడానికి అవకాశం ఉన్న సహజీవనం మాత్రమే అంటున్నాయి.

 ఏ వయసులో చెప్పాల్సిన మాట ఆ వయసులో చెబితే బాగుంటుంది. వృద్ధనారి సరసోక్తులు కూడా చిరాకుగానే ఉంటాయి. అలానే రాజకీయ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు చేతిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా బాగానే ఉంటుంది. ఓటు బ్యాంకు క్షీణించి ప్రజలు మరిచిపోయిన దశలో శాశ్వత బంధం అన్నా, కొద్ది కాలం సహజీవం చేద్దాం అన్నా వినిపించుకునే వారుండరు.
రాజకీయాల్లో అనేక ఆవిష్కరణలకు మూల స్థానంగా నిలిచిన తెలుగునాడు రాజకీయాల్లో సహజీవనానికి శ్రీకారం చుట్టింది. బయటి నుంచి, పక్క నుంచి, పై నుంచి మద్దతు అంటూ జాతీయ రాజకీయాల్లో తెలుగునాడు సహజీవన రాజకీయాలకు తెరలేపింది.


కాంగ్రెస్ పార్టీ కున్న ఫ్లెక్సిబులిటీ దేశంలో మరే పార్టీకి ఉండదేమో. దేశంలో బిజెపితో మినహాయిస్తే ఏ పార్టీతోనైనా కాంగ్రెస్ సహజీవనం చేయగలదు. చేసింది కూడా. తమిళనాడులో అన్నా డిఎంకె, డిఎంకెల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అసెంబ్లీలో బట్టలూడదీసి కొట్టుకుంటారు. అలాంటి రెండు పార్టీలు బిజెపితో మాత్రం చిలకా గోరింకల్లా సహజీవనం చేస్తాయి. అంతే కాదు ఆ రెండు పార్టీలతో అంతే ముచ్చటగా బిజెపి సైతం సహజీవనం చేసిన అనుభవం ఉంది. రాష్ట్రంలో టిడిపికి ఈ అనుభవం ఉంది. అటు వామపక్షాలతో, ఇటు బిజెపితో సహజీవనం చేయడమే కాదు, గతంలో ఒకే సారి అటు లెఫ్ట్ ఇటు రైట్‌తో సహజీవనం చేసి నెట్టుకొచ్చిన ఘనత ఆ పార్టీది.


ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఒకరు లేనిదే ఒకరు క్షణమైనా ఉండలేమంటారు. నీవుకాదంటే కాలేజీ గోడ నుంచి దూకి చస్తానంటాడు. క్లాసులు ఎగ్గొట్టి అప్పులు చేసి మరీ బైకు మీద తిప్పుతాడు. చివరకు అమ్మాయి మనసు కరిగి ఐ లవ్ యూ సందేశానికి ఐ లవ్ యూ అని సమాధానం ఇస్తుంది. పెళ్లవుంది. ఏ ముహూర్తాన నిన్ను కట్టుకున్నానో కానీ రోజూ కష్టాలే. నిన్ను కట్టుకోవడం వల్ల దరిద్రాన్ని కట్టుకున్నట్టు అయింది. నేనంటే ప్రాణమిచ్చే మా వదిన బంధువుల అమ్మాయిని చేసుకున్నా బాగుండేది. ఇప్పుడా అమ్మాయికి మంచి జీతం అంటూ భార్య కనిపించగానే చిరాకు పడతాడు. ఇది మనుషుల వివాహ జీవితంలో సర్వ సాధారణం.


రాజకీయ పెళ్లిళ్లలో సైతం ఈ మాటలు సర్వ సాధారణం. గోద్రా అల్లర్ల తరువాత 2003లో బీహార్ ముఖ్యమంత్రి ( అప్పుడు ఎన్‌డిఏ ప్రభుత్వంలో లో కేంద్ర మంత్రి) నితీష్ కుమార్ ఒక సభలో నరేంద్ర మోడిని ఆకాశానికెత్తేశారు. ఇలాంటి దమ్మున్న నాయకుడు ఒక రాష్ట్రానికే పరిమితం కాకూడదని, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బహిరగంగ సభలో పిలుపు ఇచ్చారు. ఇప్పుడేమో మోడీ లాంటి నాయకుడు ఉన్న పార్టీలతో మేం జత కట్టలేం.. లౌకిక వాదం ఏమైపోతుంది అంటూ విడాకులు తీసుకున్నారు. బిజెపి నాయకులకు కోపం వచ్చి పదేళ్ల క్రితం ఆయన మోడీని ఆకాశానికెత్తుతూ మాట్లాడిన వీడియోను మీడియాకు లీక్ చేశారు. మరీ అమాయకత్వం కాకపోతే ఈ పెళ్లి మా కొద్దు బాబోయ్ అని విడాకులు కోరే జంటకు ప్రేమించుకున్నప్పటి వీడియో చూపిస్తే ఎలా ఉంటుంది. నీవు లేనిదే నేను ఉండలేను ప్రాణాలు తీసుకుంటాను అన్నావు కదా? ఇప్పుడేమో దరిద్రం మొఖం అని తిడుతున్నావు ఇది నీకు న్యాయమా? అని ప్రశ్నించడం న్యాయ మా? ప్రేమించుకున్నప్పుడు చెప్పుకున్న ఊసులను విడాకుల సమయంలో గుర్తు చేయడం ధర్మమా? పొత్తుల పేరుతో శాశ్వత బంధాలు రాజకీయ పక్షాలకు అచ్చిరావు. అంశాల వారి మద్దతు, బయటి నుంచి మద్దతు అంటూ సందర్భానికి తగిన పేరు పెట్టుకుని సహజీవనం చేయడమే మంచిది.


కొన్ని పక్షాలు బహిరంగంగా సహ జీవనం చేస్తే మరి కొన్ని రహస్య సహ జీవనం చేస్తాయి. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం రహస్య సహజీవనం చేస్తున్నాయని ఒకరంటే, అది నిజం కాదు తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ల మధ్యనే రహస్య సహజీవనం సాగుతోందని వారంటున్నారు. ఏడాది గడిస్తే కానీ ఎవరెవరితో సహజీవనం చేస్తున్నారో తేలదు. రాజకీయ పక్షాలకు రజనీష్ మార్గం అనివార్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం