31, జులై 2013, బుధవారం

బేతాళుడు చెప్పిన ఒక రాజ్యం ఇద్దరు స్టార్ బ్యాట్‌మెన్ ల కథ

విక్రమార్కా స్టార్ బ్యాట్‌మెన్ కథ ఒకటి చెబుతాను, సావధానంగా విను. అనగనగా ఒక రాజ్యం.. ఆ రాజ్యంలో ఓ అల్లుడు. అందరి అల్లుళ్ళూ రాజకీయాల్లో ఎదిగిపోతుంటే నేనెందుకు పవర్ ప్రాజెక్టుకే పరిమితం కావాలి అసలైన పవర్ కోసం నేనెందుకు ప్రయత్నించకూడదు అనుకున్న అల్లుడు బెజవాడ గోపాలయ్య రాజకీయాల్లో దూకేసి, చెలరేగిపోయాడు. దేశంలో విభజన రాజకీయం ఊపందుకుంది. ప్రాంతాల వారీ గా మనుషులు చీలిపోయారు. ఆ సమయం లో ఒక ప్రాంతానికి స్టార్ బ్యాట్‌మెన్‌ను నేనే అంటూ గోపాలయ్య భారీ జాతీయ జెండా భుజాన వేసుకుని రాజ్యమంతా తిరిగాడు. చర్చోప చర్చల తరువాత రెండు ప్రాంతాలు యుద్ధ రంగంలో బలా బలాలు తేల్చుకోవడానికి సిద్ధం అయ్యాయి. స్టార్ బ్యాట్‌మెన్‌నని ప్రకటించుకున్న గోపాలయ్య ఊహించని విధంగా తెర వెనక్కి వెళ్లాడు. తెర ముందుకు రాజకిరణాన్ని తీసుకు వచ్చి ఇదిగో ఇతనే మీ స్టార్ బ్యాట్ మెన్ అన్నాడు.


అప్పటి వరకు టీవిల ముందు యుద్ధం చేసి స్టార్ బ్యాట్‌మెన్‌గా నిలిచిన గోపాలయ్య కనిపించని యుద్ధానికి శ్రీకారం చుట్టారు. ఆ యుద్ధంలో భాగమే స్టార్ బ్యాట్‌మెన్‌గా కిరణాన్ని ప్రకటించడం.
క్రికెట్‌లోనైనా, రాజకీయాల్లోనైనా స్టార్ బ్యాట్‌మెన్‌పైనే జట్టు ఆశలు పెట్టుకుంటుంది. మ్యాచ్ గెలిస్తే, సరే లేదంటే స్టార్ బ్యాట్‌మెన్ స్టార్ వ్యతిరేక దిశలో తిరుగుతుంది. క్రికెట్‌లో పాకిస్తాన్ వీర విహారం చేస్తున్న కాలంలో ఆ టీం కెప్టెన్‌ను ఒక పత్రిక వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. ప్రపంచాన్ని గడగడలాడించే బౌలర్లను కూడా మీ వాళ్లు అస్సలు పట్టించుకోకుండా ఎడాపెడా బ్యాటింగ్ చేసేస్తారు ఏమిటీ మీ విజయరహస్యం అని అడిగితే ఆ కెప్టెన్ కూల్‌గా... నాతో పాటు మా టీం సభ్యులకు ఇంగ్లీష్ రాదు అందువల్ల అని సమాధానం చెప్పాడు. ప్రశ్న అడిగిన వానికి బుర్ర తిరిగిపోయింది. ఇంగ్లీష్ రాకపోవడానికి బ్యాటింగ్ అదర గొట్టడానికి సంబంధం ఏమిటని అడిగితే. ఎందుకు లేదు చాలా ఉంది. అంటూ పలానా దేశం జట్టు బౌలర్ యమకింకరుడు, బ్యాట్స్‌మెన్‌కు చమటలు పట్టిస్తారు అంటూ ఏవేవో ఉపమానాలతో ఇంగ్లీష్‌లో మీరు అద్భుతంగా రాస్తారు. అది చదివిన ప్రత్యర్థి టీం వాళ్లు వాడు నిజంగా యమ కింకరుడేనేమో అనుకుని అక్కడే సగం చచ్చిపోతాడు. మైదానంలోకి ప్రవేశించాక బౌలర్‌ను చూశాక మిగిలిన సగం చచ్చిపోతాడు. కానీ మా వాళ్లుకు ఇంగ్లీష్ రాదు కదా అందుకే ఎదుటి నిలిచింది ఎవడైనా ఒకటే చితక బాదేస్తారు అని చెప్పుకొచ్చాడు. మన స్టార్ బ్యాట్ మెన్ భాష విషయంలో నూ కొందరికి ఇలాంటి సందేహాలే ఉన్నాయి. అయినా ఆయన భాషను నమ్ముకుని స్టార్ బ్యాట్‌మెన్‌గా అంతా అంగీకరించేశారు.


స్టార్ బ్యాట్‌మెన్‌గా స్టాంప్ పడగానే కిరణ్‌ను మంత్రులు ఆకాశానికెత్తారు. గోపాలయ్య మాత్రం ముసిముసి నవ్వులతో తెర వెనకే ఉండిపోయారు. ఈ యుద్ధంలో మా స్టార్ బ్యాట్‌మెన్ ఇరగ దీస్తారు. ఒక వేళ మా ప్రత్యర్థి జట్టు విజయం సాధిస్తే, రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని గోపాలయ్య ప్రకటించాడు. దాంతో గోపాలయ్య మీద గౌరవం, కిరణయ్య బ్యాంటింగ్‌పై మరింత నమ్మకం ఏర్పడింది.


సచిన్ టెండూల్కర్ ఆడేప్పుడు టీమ్ అంతా క్యూ కట్టి ఔటయ్యేవాళ్లు ఎందుకలా అంటే డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్ ఆటను టీవిలో చూడవచ్చని అంటారు. అలానే సీమాంధ్ర నేతలంతా బ్యాటింగ్ భారాన్ని స్టార్ బ్యాట్‌మెన్‌పై వేసి తమ తమ వ్యాపారాల్లో తాము మునిగిపోయారు.
మూడేళ్ల నుంచి సీమాంధ్ర స్టార్ బ్యాట్‌మెన్‌గా తనను తానే ప్రకటించుకున్న గోపాలయ్య కూడా స్టార్ బ్యాట్‌మెన్ కిరణయ్య అంటూ ఆకాశానికెత్తారు. నాయకులంతా స్టార్ బ్యాట్‌మెన్‌ను భుజానికెత్తుకుని రాజమాత సమక్షంలో దించా రు. వార్ రూమ్‌లో ఎవరి మధ్య ఎలాంటి యుద్ధం జరిగిందో కానీ కిరణయ్య చిరునవ్వులతో టీవిలకు ఫోజులిచ్చారు. స్టార్ బ్యాట్‌మెట్ వార్ రూమ్ లో రాజమాతను కడిగేశారు, నిలదీశారు, దేశాన్ని పాలించే విధానం ఇదేనా? అని మండిపడ్డారు అంటూ మీడియా కోడై కూసింది.
మీడియాలో వార్తల జీవిత కాలం ఒక రోజే. ఆ రోజు గడిచిపోగానే యుద్ధ గదిలో వాస్తవంగా ఏం జరిగిందో బయటకు వచ్చింది. సంస్థానంలోని రెండు వర్గాల నేతల యుద్ధాన్ని కళ్లారా చూసిన రాజమాత విభజనకు పచ్చజెండా ఊపింది.


విక్రమార్క కథ విన్నావు కదా? అప్పటి వరకు తానే స్టార్ బ్యాట్‌మెన్‌ను అని ప్రకటించుకున్న బెజవాడ గోపాలయ్య యుద్ధ రంగానికి వెళ్లే ముందు వెన్ను చూపినట్టుగా హఠాత్తుగా ఎందుకలా చేశాడు. అని బేతాళుడు ప్రశ్నించాడు. విక్రమార్కుడు నవ్వి బేతాళా నువ్వన్నట్టు గోపాలయ్య కాడిని కింద పారేయలేదు. రాజకీయ యుద్ధం అనేది కంటికి కనిపించకుండా మెదడుతో జరుగుతుంది గోపాలయ్య చేసింది అదే. వార్ రూమ్‌లోకి అనేక సార్లు వెళ్లి వచ్చిన బెజవాడ గోపాలయ్యకు రాజమాత మనసులోని మాట తెలుసు. అది తెలిశాకే తెర వెనుక యుద్ధం ప్రారంభించాడు. స్టార్ బ్యాట్‌మెన్‌గా కిరణయ్యను ప్రకటించడమే కాకుండా విభజన జరిగితే సన్యాసం తీసుకుంటానని అన్నాడు.


విభజనతో అప్పుడేం జరుగుతుంది. స్టార్ బ్యాట్‌మెన్ కిరణయ్య ఘోరంగా ఓడిపోయినట్టు తేలుతుంది. సన్యసించిన గోపాలయ్య ఇంటి ముందు వేల సంఖ్యలో అభిమానులు చేరుతారు. నువ్వు బయటకు రావాలి. మమ్ములను పాలించాలి అని వేడుకుంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఇటు కిరణయ్య నుంచి పోటీ తప్పుతుంది. విభజనతో ఒక ప్రాంతం తన ఆధీనంలోకి వస్తుంది. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు గోపాలయ్య ఒకటి తలిస్తే ఓటరు ఏం తలుస్తున్నాడనేది కాలమే తేల్చాలి అని విక్రమార్కుడు చెప్పగానే బేతాళుడు మాయమయ్యాడు.

3 కామెంట్‌లు:

  1. గోపాలయ్యకి కిరణయ్యకి మొత్తం అమ్మకే వనవాసయోగం రాసుంటే :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిల్లలకు రాజకీయం నేర్పేదే అమ్మ . అమ్మకు పిల్లలందరి కన్నా రాజకీయం బాగా తెలుసు

      తొలగించండి
  2. అదిరింది, భలే వాయించారు. అయితే మన స్టార్ బాట్స్మన్ గోపాలయ్య స్టారు ఇతరత్రా అంత బాలేదు: వ్యాపారలో నష్టం, ఇంటికాడ కష్టాలు వగైరా. నిజంగా రిటైరు అయితేనే బెటర్.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం