31, ఆగస్టు 2013, శనివారం

సంక్షోభ సుడిగుండంలో తెలుగుదేశం!

‘‘టిడిపికి సంక్షోభాలు కొత్త కాదు, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం, బయటపడ్డాం ’’ ఇది చంద్రబాబు నాయుడు తరుచుగా అనే మాట... కానీ చివరకు ఆయన ఈ మాట కూడా చెప్పలేక పోతున్నారు. దీన్ని బట్టి టిడిపి ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అర్ధమవుతోంది. సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు అందె వేసిన చేయి. కానీ రాష్ట్ర విభజన సంక్షోభంలో చిక్కుకున్న చంద్రబాబు, పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే మాట అటుంచి ఈ సంక్షోభం నుంచి ఎలా భయపడాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.


1994లో టిడిపి అధికారంలోకి వచ్చిన ఎనినిమిది నెలలకే ఎన్టీఆర్‌ను దించేసి వ్యూహాత్మకంగా చంద్రబాబు అధికారం చేపట్టగలిగారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాలుగునెలలకే ఎన్టీరామారావు మరణించారు. ఇలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం అని ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో బాబుపై ఆగ్రహం వ్యక్తం చేయాలి.  ఇలాంటి క్లిష్టపరిస్థితిలోనే నాయకుడి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఎన్టీఆర్ మరణించారని తెలియగానే బంజారాహిల్స్‌లోని రామారావు నివాసానికి జయప్రదతో పాటు కొందరు నాయకులు వస్తే అభిమానులు రాళ్లతో దాడి చేశారు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు అక్కడికి వస్తే దాడులు జరుగుతాయని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రావద్దని కొందరు నాయకులు సూచించారు. కానీ చంద్రబాబు ధైర్యంగా ఎన్టీఆర్ నివాసానికి వచ్చి పరిస్థితిని తన అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఎన్టీఆర్ మరణంలో లక్ష్మీపార్వతిపై అనుమానాలు రేకెత్తించే విధంగా చేయడంలో సఫలం అయ్యారు.
 ఆ సమయంలో చంద్రబాబు అలా వెళ్లి ఉండక పోతే ఎన్టీఆర్ మరణానికి బాబే కారణం అనే ప్రచారం బలంగా సాగేది. సరే అప్పుడు చేతిలో అధికారం ఉంది కాబట్టి అవసరమైన చర్యలు తీసుకుని ముందడుగు వేశారు.
ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సంక్లిష్టపరిస్థితిలోనే చంద్రబాబు చిక్కుకున్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న సీమాంధ్రలో ఆత్మగౌరవం పేరుతో యాత్ర జరపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తొలుత ఆగస్టు 25 నుంచి యాత్ర అనుకున్నారు. ఇప్పుడు చేతిలో అధికారం లేదు. అధికారం చేతినుంచి జారిపోయి తొమ్మిదేళ్లు అవుతోంది. అందుకే అడుగులు తడబడుతున్నాయి. కొంత మంది వారించడంతో 25న యాత్ర ప్రారంభించలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 1న గుంటూరు నుంచి యాత్ర ప్రారంభించనున్నారు.


రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఒక మాట అటూ ఇటుగా తెలంగాణకు అనుకూలంగా తమ నిర్ణయాలను ప్రకటించాయి. 2009లో వచ్చిన తెలంగాణాను అడ్డుకున్నాడని తెలంగాణ ప్రజలతో విమర్శలను ఎదుర్కొన్న చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుకు బాబే కారణం అంటూ సీమాంధ్రలో ప్రత్యర్థుల నుంచి బలమైన విమర్శ ఎదుర్కొంటున్నారు.
వైఎస్‌ఆర్ మరణించిన ఇడుపుల పాయలో జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా వైకాపా నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికల్లో, పాదయాత్ర సందర్భంగా అనేక సార్లు విజయమ్మ, షర్మిల తెలంగాణకు అనుకూల ప్రకటనలు చేశారు.
తెలంగాణపై కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో రాజకీయ పక్షాలన్నీంటికీ ముందే అవగాహన ఉంది. సిడబ్ల్యుసి నిర్ణయం వెలువడక ముందే వైకాపా హఠాత్తుగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. ఏం జరుగుతుందో ప్రత్యర్థులు అర్ధం చేసుకునే లోపే ఎదుటివారిపై దాడి చేయాలి ఇది యుద్ధ నీతి! వైకాపా చేసింది అదే!! తెలంగాణలో వైకాపాకు పెద్దగా ఉనికి లేదు. అలాంటప్పుడు తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కన్నా తెలంగాణలో జెండా పీకేసి సీమాంధ్రకే పరిమితం కావడం లాభసాటి నిర్ణయం అనుకున్నారు. టిడిపి పరిస్థితి అలా కాదు. ఆ పార్టీ సీమాంధ్రలో బలంగా ఉంది, అదే విధంగా తెలంగాణలోనూ బలంగా ఉంది. దాంతో వైకాపా అంత స్పీడ్‌గా సమైక్యాంధ్ర ఉద్యమంలో టిడిపి పాలు పంచుకోలేకపోయింది. నిజానికి రాజకీయాల్లో ఏది లాభసాటిగా ఉంటే ఆ నిర్ణయం తీసుకోవడంలో చంద్రబాబు.. జగన్‌కే కాదు వైఎస్‌ఆర్‌కు సైతం పాఠాలు చెప్పగలరు.


 బిజెపి పవనాలు వీస్తున్నాయన్నప్పుడు 99లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అంతకు ముందే మసీదులు కూల్చే పార్టీ అని తిట్టిన విషయం మరిచిపోయి అప్పటి లాభం అప్పుడు చూసుకొని 99లో అధికారంలోకి రాగలిగారు. 2009లో టిఆర్‌ఎస్‌తో అదే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఒక మాట అన్నాం దానికి కట్టుబడి ఉండాలి అనే ఉదాత్తత ఏమీ కాదు. ఇక్కడ వైకాపాకు, టిడిపికి మధ్య తేడా.. టిడిపి రెండు ప్రాంతాల్లో బలంగానే ఉంది. వైకాపా ఒక ప్రాంతానికే పరిమితం అయింది. అంతే తప్ప బాబుకు తెలియని రాజకీయ వ్యూహాలేవో జైలులో ఉన్న జగన్‌కు తెలుసని కాదు.


వచ్చిన తెలంగాణాను అడ్డుకున్నాడనే బలమైన విమర్శ బాబుపై తెలంగాణలో ఉంది. ఇక తీరా ఇప్పుడు తెలంగాణ సాకారం అవుతున్న వేళ సీమాంధ్రలో టిడిపి ప్రజాప్రతినిధులంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బాబు రాసిన లేఖ వల్లనే కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని సీమాంధ్రలో కాంగ్రెస్, వైకాపా బలంగా ప్రచారం చేస్తున్నాయ. పోనీ బాబువల్లనే తెలంగాణ వస్తోందనే అభిప్రాయం తెలంగాణ ప్రాంతంలో ఉందా? అంటే అలాంటిదేమీ లేదు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటే బాబు ఎందుకు చర్య తీసుకోవడం లేదని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. సీమాంధ్రలో ఆందోళనలు ప్రారం భం అయ్యాక బాబు స్వరం మారుస్తున్నారని తెలంగాణలో విమర్శలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు అటు సీమాంద్రలో, ఇటు తెలంగాణలో విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. రెండు ప్రాంతాల్లోనూ ప్రత్యర్థులు టిడిపినే ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు.
తెలంగాణ ఏర్పాటు అనివార్యం అనే విషయం వైకాపా నాయకత్వాని స్పష్టంగా తెలుసు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఎలాగూ నామ మాత్రంగా మారింది. ఇక ప్రధాన ప్రత్యర్థి టిడిపి... అందుకే ఆ పార్టీని దెబ్బతీయడానికి బాబు లేఖ వల్లనే విభజన జరుగుతోందని వైకాపా ప్రచారం చేస్తోంది. లేఖ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. లేఖలు,అభిప్రాయ సేకరణల పర్వం ముగిసిందని కాంగ్రెస్ హై కమాండ్ ఎప్పుడో ప్రకటించింది. లేఖ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడానికి వైకాపాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే తెలంగాణలో ఆ పార్టీ లేదు. కానీ టిడిపి పరిస్థితి అలా కాదు.
మాట తప్పని వంశం అని చెప్పుకునే జగన్‌కు ఇడుపుల పాయలో తీసుకున్న నిర్ణ యం నుంచి వెనక్కి మళ్లడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు. ఆ పార్టీ ఉనికి సీమాంధ్రలోనే ఉంది. తెలంగాణపై ఇచ్చిన మాట తప్పిన అంశాన్ని తెలంగాణ వాళ్లు గుర్తుపెట్టుకుంటారేమో కానీ సీమాంధ్రలో ఇదసలు సమస్యనే కాదు.


ఇలాంటి వాతావరణంలో సీమాంధ్రలో పర్యటించి వాస్తవాలు వివరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నాయకులు కొందరు పరిస్థితులు బాగాలేవు, యాత్రలు వద్దని వారించారు. విభజనపై బాబు వౌనంగా ఉండడం, అదే సమయంలో విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం మొత్తం వైకాపా ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు ప్రచారం సాగింది. టిడిపి సర్దుకునే లోపుగానే వైకాపా దూసుకెళ్లింది.
సీమాంధ్రలో టిడిపి పని ఐపోయిందనే ప్రచారం సాగిస్తున్నారు. ఒక పార్టీకి నిజంగా బలం ఉందా? ఒక పార్టీ పని అయిపోయిందా? అనేది తేల్చేది మీడియాలో కథనాలు కాదు, పత్రికల్లో వార్తలు కాదు. ఎన్నికల ఫలితాలే వీటిని తేలుస్తాయి. అన్నా హజారే అవినీతిపై ఉద్యమించినప్పుడు ఢిల్లీ వీధులన్నీ జనంతో కిక్కిరిసాయి. కొద్ది రోజుల తరువాత ఆయన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే మీడియా, పోలీసులు, ప్రజలు కలిసి వెయ్యి మంది కూడా లేరు. చానల్స్‌లో వార్తల హడావుడి చూసి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. ప్రచారం విషయంలో చంద్రబాబు శక్తిని తక్కువ అంచనా వేయలేం.
లేఖ ఇవ్వడం ద్వారా తెలంగాణ ఏర్పాటుకు మేమే కారణం అని తెలంగాణలో, హైదరాబాద్ లాంటి అభివృద్ధి సీమాంధ్రలో సాకారం కావాలంటే మా వల్లనే అని సీమాంధ్రలో ప్రచారం చేయగల గడసరితనం టిడిపికి ఉంది. కానీ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్రులను బాబు ఏవిధంగా సముదాయస్తూ తన వాదనకు అనుగుణంగా మలచుకుంటారనేది ప్రధాన ప్రశ్న. విభజన అంశాన్ని సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించి తీర్పు చెబితే అన్ని పార్టీలను శిక్షించాల్సి ఉంటుంది. అన్ని పార్టీలు తెలంగాణపై అనుకూలత వ్యక్తం చేశాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సెప్టెంబర్ ఒకటి నుంచి చంద్రబాబునాయుడు సీమాంధ్రలో పర్యటించనున్నారు.


ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న వరంగల్ జిల్లాలోనే బాబు లేఖ ఇవ్వక ముందే విజయవంతంగా పర్యటించారు. పర్యటన వద్దని ఎంత మంది సూచించినా ఆయన పర్యటించారు. అలానే ఇప్పుడు సీమాంధ్రలో పర్యటన పెద్ద కష్టమేమీ కాదు. కానీ జనం బాబు మాటలను ఎంత వరకు స్వీకరిస్తారు అనేదే ముఖ్యం. ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయిన టిడిపికి ఈ ఎన్నికలు చావుబతుకుల సమస్య. ఈ ఎన్నికల్లో ఏదో ఒక ప్రాంతంలో అధికారంలోకి వస్తేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. టిడిపి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని ఉండవచ్చు కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నది మామూలు సంక్షోభం కాదు. ఈ సంక్షోభం నుంచి బయటపడితే కానీ బాబుకు, టిడిపికి రాజకీయ భవిష్యత్తు ఉండదు.

28, ఆగస్టు 2013, బుధవారం

సమన్యాయం!

నాయకులంటే వేలిముద్ర గాళ్లు అని తేలిగ్గా చూస్తారు కానీ భాషామాతల్లికి వారు చేసిన సేవ సామాన్యమైనదేమీ కాదు. కళామతల్లికి హీరోలు చేసే సేవకు ప్రచారం లభించినట్టుగా భాషామతల్లికి నాయకులు చేసే సేవ గుర్తింపునకు నోచుకోలేదు. నాయకులు ఎనె్నన్నో కొత్త పదాలు కనిపెట్టి భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. అంతరించి పోతున్న పదాల గురించి ఆందోళన చెందుతున్నారు కానీ నాయకులు కొత్తగా కనిపెట్టిన పదాలను చూసి సంబరపడడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎంత గొప్ప పదం! మనిషి మెదడు కన్నా కంప్యూటర్ గొప్పదే కావచ్చు కానీ ఆ కంప్యూటర్ కూడా ఎవరో ఒకరు ఆపరేట్ చేస్తేనే పని చేస్తుంది. మరి చట్టం తన పని తాను ఎలా చేసుకుపోతుందో? అంతుచిక్కని వ్యవహారమే. చట్టవ్యతిరేక పనులకు పాల్పడే సందర్భంలోనే చట్టం గురించి ఈ మాట ఎక్కువగా మాట్లాడతారు. బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు ఈ పదాన్ని జాతికి అంకితం చేశారు. దేశానికి స్వాతం త్య్రం తెచ్చిన వారికి స్వాతంత్య్రం పెద్దగా ఉపయోగపడనట్టుగానే ఈ పదాన్ని సృష్టించిన పివికి పెద్దగా ఉపయోగపడలేదు. కానీ రాజకీయ దొంగలందరికీ ఇది బుల్లెట్ ఫ్రూప్ అంత భద్రత కల్పిస్తోంది. ప్రధానమంత్రిగా ఉండి చివరకు తన కేసులను వాదించిన న్యాయవాదులకు ఫీజులు చెల్లించేందుకు సొంత ఇంటిని అమ్మకానికి పెట్టాడంటే పివికి ఈ పదం ఏ మాత్రం ఉపయోగపడలేదని అర్ధం అవుతూనే ఉంది.

 మాటలను అమ్ముకునే రాజకీయాల్లో మౌనం ఎంత శక్తి వంతమైన భాషో ఆయన నిరూపించారు. వీటి తరువాత అత్యంత శక్తివంతమైన పదం నో కామెంట్ దీన్ని కూడా రాజకీయ నాయకులే భాషామతల్లికి అంకితం చేశారు. నో కామెంట్ ఆవిష్కర్త ఎవరో కానీ దీన్ని పలకని నేరస్తుడు, రాజకీయ నాయకుడు ఉండడు.


ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ఏటేటా కొత్త కొత్త పదాలను చేరుస్తుంటారు. అలానే మన నాయకులు కనిపెట్టిన పదాలతో కొత్త నిఘంటువు రూపొందించే పనికి ఎవరైనా పూనుకుంటే బాగుండేది. మహాభారతంలో స్ర్తి పాత్రలు, రామాయణంలో పురుష పాత్రలు అంటూ ఎవేవో వాటిపై పిహెచ్‌డిలు చేసేవాళ్లు ఒకసారి మన నేతలు కనిపెట్టిన పదాలు అనే అంశంపై పరిశోధన చేస్తే భాషామ తల్లికి తెలుగు నాయకులు చేసిన కృషి ప్రపంచానికి తెలిసొస్తుంది. చెన్నారెడ్డి కాలంలో కోటి అనేది చాలా పాపులర్ వర్డ్. ఇప్పుడు కోటి కాస్తా లక్ష కోట్లకు చేరుకుంది. అంజయ్య కాలంలో పాపం ఆరణాలే పాపులర్. కోట్లకు పడగలెత్తినా నిర్మోహమాటంగా నీతులు చెప్పగలుతున్న నేటి నాయకులను చూసిన వారికి ఆరణాల కూలీ అంటే పిచ్చోడేమో అనిపిస్తుంది.


ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత పాపులర్ పదం సమ న్యాయం. సమ న్యాయం అంటే ఏమిటో? దాన్ని తెరపైకి తీసుకు వచ్చిన వారు కూడా చెప్పడం లేదు. భాషా శాస్తవ్రేత్తలు నానా కష్టాలు పడి మొత్తం 51 న్యాయాలను గుర్తించారు. ఆ 51 జాబితాలో లేనిదే ఈ 52వ న్యాయం. దీన్ని మన నాయకులు కనిపెట్టారు. దీని పేరు ‘‘సమ న్యాయం.’’ తెనాలి రామలింగడు తిలకాష్ట మహిష బంధనం అంటే ఎవరికీ అర్ధం కాలేదు. తీరా పలుపుతాడును చూశాక ఇదా?అనుకున్నారు. అలానే ఈ సమ న్యాయం ఏమిటిరా? బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. అల్లుడికి బయ్యారం గనులు, కొడుక్కు బ్రాహ్మణీ స్టీల్ ఇదే కదా సమ న్యాయం అనేది కొందరి  అనుమానం .
 తారక రాముడి  అధికారం  వచ్చినట్టుగా ... అదే సంప్రదాయం ప్రకారం అల్లుడిగా వారసత్వం తన కొడుక్కు దక్కాలనేది హరికృష్ణ వాదన. అల్లుడు గారేమో తన కొడుకునే వారసునిగా తయారు చేస్తున్నాడు .. దాంతో కోపం వచ్చిన హరికృష్ణ చైతన్య రథం ఎక్కుతున్నారు . రాజ్యం ఎలాగు రెండు ముక్కలు అవుతుంది కాబట్టి అర్థ రాజ్యం తన కొడుక్కు , మిగిలిన అర్థ రాజ్యం అల్లుడికి ఇచ్చి సమన్యాయం పాటించ వచ్చు అనేది మధ్య వర్తుల సలహా . అప్పడు ఇటు లోకేషుడు , అటు తారకుడు ప్రజలకు సేవ చేసుకొని  సమన్యాయం తో తరిస్తారు.. గిట్టని వారేమో తాత  గారిలా 60 ఏళ్ళ వయసులో సినిమా జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం రావచ్చు కదా అప్పుడే తొందరేమిటి అంటున్నారు . రాజ్యం తో బాటే రాజకీయ జీవితం ముగిసిపోతుందని కొందరి బాధ   


తనకు పోటీగా ఉన్న భక్తుడు ఏం కోరుకుంటే నాకు రెట్టింపు ఇవ్వండి అన్నాడట వెనకటికో భక్తుడు. ఓహో అలానా! అయితే నాకు ఒక కన్నుపోయేట్టుగా వరం ఇవ్వు స్వామి అని రెండో భక్తుడు వేడుకుంటే వీడికి ఒక కన్ను పోటీ దారునికి రెండు కళ్ళూ పోయాయి. అసలు మాకు దక్కని హైదరాబాద్ వాళ్లకీ దక్కొద్దు మీరు తీసుకెళ్లండి అని కేంద్రాన్ని కోరడం సమ న్యాయం అందామా? అంటే ఇది సమ అన్యాయం అవుతుంది కానీ సమ న్యాయం ఎలా అవుతుందని సందేహం. తెలంగాణకు అన్యా యం జరిగింది కాబట్టి మేం విడిగా ఉంటామని వాళ్ళు డిమాండ్ చేస్తే మీ డిమాండ్‌కు మా మద్దతు అని మహానేత మరణించిన ఇడుపుల పాయలో మాట తప్పని వంశానికి చెందిన వంశోద్ధారకుడు బహిరంగ ప్రకటన చేశారు. తీరా సమయం వచ్చే సరికి అమ్మగారు సమ న్యాయం చేయండి లేదంటే సమైక్యంగా ఉంచండి అంటున్నారు. సమైక్యంగా ఉంచితే అది సమన్యాయం ఎలా అవుతుంది ఒక ప్రాంతానికి అన్యాయం చేసినట్టే అవుతుంది కదా? అప్పుడు వారికి ఎలా సమ్మతం అవుతుందో? సమ న్యాయం అంటే ఏమిటో వాళ్లు చెప్పక పోవడం వల్ల ఎవరికి వారు నిఘంటువుల వేటలో పడిపోయారు. దీన్ని అర్జంట్‌గా 52వ న్యాయంగా చేర్చాలి తప్పదు. ఆకాశంలో చంద్రుడు మనం ఎటు పోతే అటు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. రెండు కొమ్మల మధ్య కదలని చంద్రుడిని చూపించి చంద్రుడు కదలడు అని చెబుతారు. ఆజ్ఞానులు నిజాన్ని గ్రహించలేనప్పుడు విజ్ఞులు ఇలా అర్ధం చేసి చెప్పడాన్ని ‘శాఖా చంద్ర న్యాయం’ అన్నారు.


ముసలి నీటిలో ఎంతో బలంగా ఉంటుంది. స్థాన బలిమి తప్ప తన బలం కాద ని చెప్పడానికి ‘శ్వాన మకర న్యాయం’ అన్నారు. గుడ్డివాళ్లు ఏనుగును వర్ణించడాన్ని ‘ఆంధగజన్యాయ’మన్నారు.‘కాకతాళీయ న్యాయం’, ‘అజాగళస్తన న్యాయం’, ‘గోము ఖ వ్యాఘ్ర న్యాయం’ వంటి న్యాయాలను గుర్తించిన మ న పెద్దలు సమ న్యాయాన్ని మాత్రం ఊహించలేక పోయారు. ఇలాంటి కొత్త కొత్త పదాలను సృష్టించిన నాయకుల సేవలను గుర్తుంచుకోవడం మన ధర్మం.
ఇప్పుడు సమైక్య రాజ్యం లో రెండు సామజిక వర్గాల మధ్యనే అధికార మార్పిడి జరుడుతోంది. రాజ్యం రెండు ముక్కలయితే .. తక్షణం కాక పోయినా ఆ తరువాతైనా  ఈ రెండు సామజిక వర్గాలకు సమ న్యాయం దక్కుతుందని అంటున్నారు .. ఎలా అంటే రెండు సామజిక వర్గాలకు అధికారం దూరం అయ్యే అవకాశాలు సుదూరంగా కనిపిస్తున్నాయి .. 

21, ఆగస్టు 2013, బుధవారం

సన్యాసుల సమ్మేళనం

ఎలాగైనా తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకోవాలి?
ఏర్పడినా ఏర్పడకపోయినా నీకొచ్చిన నష్టమేముంది. అంత కంగారు పడుతున్నావు.
నాకే కాదు మొత్తం దేశానికే ప్రమాదం.
అబ్బా ఈ వాదన చాలా కాలం నుంచి వింటున్నదే? ఏదైనా కొత్తది చెప్పు.
అది కాదు.
సరే ఇప్పుడంటే ఐటి రంగం ద్వారా మనం ప్రపంచంలో గుర్తింపు పొందాం కానీ పూర్వ కాలం నుంచి కూడా ప్రపంచంలో మన దేశానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు ఏమిటో తెలుసా?
సమాధానం కూడా నువ్వే చెప్పు?
సన్యాసులు
ఔను ప్రపంచంలో ఎక్కడా కనిపించని సన్యాసులు మన దేశానికే పరిమితం. అయితే కావచ్చు... తెలంగాణ ఏర్పడితే సన్యాసుల కొచ్చిన సమస్య ఏముంది?
అదే నీకు తెలియని విషయం.
తెలంగాణ ఏర్పడితే సన్యాసులు ప్రమాదంలో పడతారు.
అస్సలు అర్ధం కావడం లేదు. అదేలా?
అంటే నువ్వు వార్తలు సరిగా ఫాలో కావడం లేదన్నమాట!
అవుతున్నాను కానీ సన్యాసులకు తెలంగాణకు సంబంధం ఏమిటో ఫాలో కాలేకపోతున్నాను.
తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం సన్యాసులతో నిండిపోతుంది. రాష్ట్రంలో టెక్కీలను మించి సన్యాసులు కనిపించేస్తారు.ఇ ప్పటి వరకు ఉన్న సన్యాసులకు వీళ్లు గట్టి పోటీ అవుతారు .
అయితే ఏమవుతుంది?

ఎమవుతుందంటే నీకో కథ చెప్పాలి, 
***
ఇన్‌స్టెంట్ సన్యాసి గురించి రజనీష్ ఓ ఉదంతాన్ని వివరించారు. ఒక సంపన్ను
డికి ఎందుకో గానీ చాలా కోపం వచ్చి నమ్ముకున్న వారిని హత్య చేశాడు. శవాన్ని చూడగానే కోపం చల్లారి ఒక సాధువువద్దకు అంతే స్పీడ్‌గా పరిగెత్తి ఈ సంపద, ఈ జీవితంతో నేను విసిగిపోయాను సన్యాసం ఇప్పించండి అని వేడుకున్నాడు. సన్నాసిలా బతికే నీకు సన్యాసం అంత ఈజీకాదు చాలా కష్టం. ఇంత విలాసంగా బతికే నీకు సన్యాసిగా కాషాయం ధరించడం చాలా కష్టం అని ఆ సాధువు చెప్పుకుంటూ పోతుంటే ఆయన మాటలు ఇంకా ముగియక ముందే నేను ధరించిన ఈ విలువైన దుస్తులు నాకు అడ్డంకిగా మీరు భావిస్తున్నారా? వీటిని త్యజించడం నాకు పెద్ద కష్టం ఏమీ కాదు అని చెప్పి ఆ సంపన్నుడు బట్టలన్నీ విప్పి పారేసి నగ్నంగా నిలబడి ఇప్పుడు సన్యాసం ఇప్పించండి అని ఆవేశంగా అడిగాడు. దానికి సాధువు చిరునవ్వు నవ్వి మారానని నువ్వు అనుకుంటున్నావుకానీ నీవేమీ మారలేదు. హత్య చేసినప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉండేదో ఇప్పుడూ అలానే ఉంది. ఎంత ఆవేశంగా హత్య చేశావో అంతే ఆవేశంగా నీ బట్టలన్నీ విప్పి నగ్నంగా నిలబడ్డావు. ఇక నీలో మార్పు ఏముంది. సన్యాసం నీ వల్లకాదు అని చెప్పి పంపించాడు సాధువు.
*****

రాష్ట్రం తెలంగాణ, సమైక్యాంధ్ర అంటూ ఆగ్నిగుండంగా మారిపోతే సన్యాసుల గొడవేమిటంటారా? ఈ సన్యాసుల గొడవ ప్రస్తుత ఉద్యమాలకు సంబంధం ఉంది. అప్పుడెప్పుడో 1981లో ఢిల్లీలో ప్రపంచ సాధువుల సమ్మేళనం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి సన్యాసులు ఢిల్లీ వచ్చారు. వారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వచ్చారు. ఢిల్లీ సన్యాసులతో కళకళలాడింది అప్పుడు. ఇప్పుడు కాబోయే సన్యాసులతో ఢిల్లీ సందడిగా మారింది. తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని లగడపాటి రాజ్‌గోపాల్ గత మూడేళ్ల నుంచి చెబుతున్నారు. మాట మీద నిలబడాలనే హామీ కూడా ఆయన నుంచి కెసిఆర్ టీవిల్లో ప్రజల సాక్షిగా తీసుకున్నారు. లగడపాటి నువ్వు హీరోవి, ఐ లవ్‌యూ ... నువ్వు మాట మీద నిలబడతావు అంటూ టీవి లైవ్ షోలో కెసిఆర్ లగడపాటికి కితాబు ఇచ్చారు. లగడపాటి ఎన్నికల్లో విజయవాడ ఓటర్లకు  ఇచ్చిన హామీలకే కట్టుబడి లేడు, ఇక కెసిఆర్‌కిచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా?అనేది కొందరి అనుమానం. అంతా సోనియాగాంధీ అనుకున్నట్టు జరిగితే లగడపాటి ఇచ్చిన మాట ప్రకారం సన్యాసం స్వీకరించేందుకు సిద్ధపడాలి.
సన్నాసి, సన్యాసి పదాల్లో చిన్నపాటి గందరగోళం ఉంటుంది. అందుకే ఒకసారి కెసిఆర్ దీనిపై సుదీర్ఘంగానే వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వౌనంగా ఉం టున్న కాంగ్రెస్ నాయకులు, మంత్రులు సన్నాసులు అని ఆయన తిట్టారు. అయినా వారిలో ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో నేను మిమ్ములను సన్యాసులు అన్నానని అనుకుంటున్నారా? సన్యాసి అంటే గౌరవనీయులే, నేనన్నది సన్నాసి అని విడమరిచి చెప్పారు.

సినిమాల్లోనే కాదు ఎన్టీరామారావుకు రాజకీయాల్లో సైతం ఏ వేషం వేసినా ఆచ్చుగుద్దినట్టు సరిపోయేది. రాజసం ఉట్టిపడే ఆయనకు నిజజీవితంలో సన్యాసి వేషం కూడా బాగా నప్పింది. ఎన్టీఆర్ ఒక వైపు రాజకీయాలు సాగిస్తూనే మరోవైపు సన్యసించారు. నేను రాజర్షిని అని ముద్దుగా చెప్పుకున్నారు. రుషుల మాది రిగానే ఎన్టీఆర్ సైతం అలానే లక్ష్మీపార్వతితో ప్రేమ తరువాత సన్యాసానికి స్వస్తిపలికారు.
తెలంగాణ ఏర్పడితే సన్యసిస్తానని రాయపాటి సాంబశివరావు ప్రకటించేశారు. దేశ దేశాల్లో కాంట్రాక్టులు చేసే ఆయన అంతటి వాడే సన్యసిస్తే నేనేమన్నా తక్కువ తిన్నానా? అని కర్నూలు నుంచి ఓ స్వరం లేచించింది. తెలంగాణ ఏర్పడితే మా ప్రాంతం ఎడారిగా మారుతుంది కాబట్టి నేనూ సన్యసిస్తాను అని రైల్వే మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించేశారు. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించేందుకే సన్యాసి వేషం వేస్తారని కొందరి విమర్శ. రైల్వే మంత్రిగా కోట్ల టికెట్ తీసుకోవలసిన అవసరమే ఉండదు కాబట్టి ఆయన సన్యాస ప్రకటనను అనుమానించాల్సిన అవసరమే లేదు.

పెద్దలంతా ఇలా సన్యాస ప్రకటనలు చేస్తుండడంతో సమైక్యాంధ్ర ఉద్యమ కారులకు కోపం వచ్చి మీరు ప్రత్యేకంగా సన్యాసం తీసుకోవడం ఎందుకు ఎన్నికలు రానివ్వండి మీ సంగతి తేల్చి మేమే మీకు సామూహిక సన్యాసం ఇప్పిస్తామంటున్నారు. చూస్తుంటే ఢిల్లీలో త్వరలోనే సన్యాసుల సమ్మేళనం జరిగేట్టుగానే ఉంది.

20, ఆగస్టు 2013, మంగళవారం

21 ఏళ్ళకు ఉద్యోగం 40లో రిటైర్మెంట్ .. కాలం మారింది

జీవితమంతా ఉద్యోగం చేసుకుంటూ పోతే - ఉద్యోగమే జీవితమైపోయి జీతం
మిగులుతుంది తప్ప,జీవితం ఉండదు.అందుకే -పాశ్చాత్య దేశాలతోపాటు
భారతీయ కుర్రాళ్లూ ఓ కొత్త ట్రెండ్‌ను లేటెస్ట్‌గా ఫాలో అవుతున్నారు.
పెద్ద ఉద్యోగం, పెద్ద పెద్ద జీతాలు అందుతున్నాగానీ -దానికోసం కొద్దిపాటి
జీవితాన్నే  కేటాయించాలనే కొత్త ధోరణి ఇప్పటి కుర్రాళ్లలో కనిపిస్తుంది. 

నాలుగు పదుల వయసు వచ్చేసరికి ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇచ్చేసి -
మిగిలిన జీవితాన్ని ఇష్టమైన సద్యోగంతో గడపాలన్నదే కుర్రాళ్ల
లేటెస్ట్ ట్రెండ్. ‘జీవితం చిన్నదే. కాదనం. ఉన్న చిన్ని జీవితాన్ని
జీవితాంతం జీతం కోసమే వెచ్చిస్తానంటే ఎలా? అందుకే -చిన్ని
జీవితంలో అతి చిన్న భాగాన్ని జీతం కోసం పనిచేసి, మిగిలిన
జీవితాన్ని ఆనందం కోసం వెచ్చించాలని అనుకుంటున్నాం. జీతం కున్నా,
ఫలితం అంతగా లేకున్నా ఇష్టమైన వృత్తిలోనో, సంతృప్తినిచ్చే వ్యాపకంలోనో
గడపాలన్నది మా ఆలోచన. అందుకే ఎర్లీ రిటైర్మెంట్‌కు ప్లాన్ చేస్తున్నాం’
అంటున్నారు ఈ తరహా కుర్రాళ్లు. అదీ -ఉద్యోగంలోకి అడుగుపెడుతున్న తొలి రోజుల నుంచే..

 అలాగని అంచనాలు లేకుండా ట్రెండ్‌ను గుడ్డిగా ఫాలో
అయిపోతే, -వెనక్కితిరిగి చూసుకోవడానికి ఆనందమూ ఉండదు, జీవితమూ కనిపించదు. సో.. ఎర్లీ రిటైర్మెంట్ తరువాతా బతుకు బండి హాయిగా సాగాలంటే కచ్చితమైన ప్లాన్ ఉండాలి. లేదంటే -సర్వం ఢమాల్. 
***
ఏం బాబాయ్ ఇదేనా రాక. ఎలా ఉన్నారు? -ఇంట్లోకి వస్తూనే
బాబాయ్ కనిపించడంతో ప్రదీప్ ఉత్సాహంగా పలకరించాడు. బాగానే
ఉన్నా. ఎలాగుందీ నీ ఉద్యోగం? తిరుగు ప్రశ్నతో ప్యాయంగా పలకరించాడు
బాబాయ్. ‘ఇంకెక్కడి ఉద్యోగం బాబాయ్. మూడు నెలల క్రితమే
రిటైరయ్యాను’ ఠక్కున సమాధానమిస్తూ నవ్వేశాడు ప్రదీప్. బాబాయ్‌కు ఒక్కసారిగా మనసు చివుక్కు మంది. ఆయన మరో రెండేళ్లలో రిటైర్
కానున్నాడు. తన రిటైర్మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని కుర్రకుంక పెద్దంతరం చిన్నంతరం లేకుండా పరాచికాలు ఆడుతున్నాడని బాధేసింది. నిజమే
మరి ప్రదీప్‌కు 40 ఏళ్లు. వాళ్ల నాన్న కూడా ఇంకా ఉద్యోగం చేస్తూనే న్నాడు.
40ఏళ్ల ప్రదీప్ రిటైరయ్యానని అంటే 56ఏళ్ల బాబాయ్‌కి కోపం రాకుండా ఎలా
ఉంటుంది? ‘పెద్దవాళ్లతో అవేం మాటలురా?’ కాస్త కోపంగానే అన్నాడు
బాబాయ్. ‘లేదు బాబాయ్. నిజమే చెప్తున్నా’ ప్రదీప్ సమాధానం. ఈసారి
ఆశ్చర్యపోవటం బాబాయ్ వంతయ్యింది. ప్రదీప్ నింపాదిగా తన రిటైర్మెంట్ గురించి చెప్పుకొచ్చాడు. రోజులు మారాయి బాబాయ్. ఇప్పుడు మీలా
వృద్ధాప్యం రిటైర్‌మెంట్స్ ఉండటం లేదు. కాస్త వయసుండగానే రిటైర్ అవుతున్నారు. బాబాయ్ ముఖ కవళికలు చూస్తే అర్థంకాలేదన్నట్టు
అనిపించింది. ఐటి పుణ్యమా అని ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయి.
ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని 21ఏళ్ల వయసులో ఐటి కంపెనీలో మంచి
జీతంతోనే ఉద్యోగంలో చేరుతున్నాం. ఎంత ఖర్చు చేసుకున్నా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మొదటి నెలనుంచే సగం జీతాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ మెంట్ రూపంలో పొదుపు చేయొచ్చు. పొదుపు సొమ్ము కొంత కాలానికి జీతం తో పోటీ పడుతూ  ఆదాయన్ని సమకూర్చి పెడుతుంది. 
కాస్త మంచి జీతం ఉన్నవాళ్లయితే ఒక ఫ్లాట్ నివాసానికి, మరొకదాన్ని అద్దెకిచ్చి డబ్బు సంపాదించేందుకు సమకూర్చుకుంటున్నా రు. ఎవరి అభిరుచిని బట్టి వారి నిర్ణయం. రెండు దశాబ్దాల ఉద్యోగంతో భవిష్యత్ హాయిగా గడిచిపోవడానికి
అవసరమైన డబ్బు సమకూర్చుకోవచ్చు. అప్పుడు రిటైర్మెంట్ తీసుకుని మనకు ఇష్టమైన వృత్తిని మళ్లీ కొనసాగించొచ్చు. నాకైతే వ్యాపారం చేయాలని ఉంది. మా క్లాస్‌మెట్ బాబ్జి నీకు తెలుసు కదా! వాడికి
చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి.నాలానే వాడూ ఎర్లీ రిటైర్మెంట్‌కు
ముందునుంచే ప్లాన్ చేసుకుని ఇప్పుడు సినిమాల్లో  అ వకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.

 అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ జీవితంలో తనకు ఇష్టమైన పని చేయడానికి
ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు కాకపోతే ఎదోక రోజు వాడి కోరిక తీరుతుంది. 21నుంచి 40 ఏళ్ల వరకు చేసిన ఉద్యోగంలో సంపాదించిన దానిలో పొదుపు చేసిన డబ్బు ఒక మంచి ప్లానింగ్‌తో ఇన్వెస్ట్ చేశాడు. అదే ఇప్పుడు వాడిని
బతికిస్తోంది. వాడేమో సినిమా కోసం బతుకుతున్నాడు.. అని ప్పుకొచ్చాడు
ప్రదీప్. మా కాలంలో అయితే గంపెడు కుటుంబానికి ఒకే ఒక ఆధారం కాబట్టి
రిటైర్మెంట్ తరువాత కూడా ఏదోక పని చూసుకోవాల్సి వచ్చేది. అందుకే -రిటైర్మెంట్ అనే పదం వింటేనే భయం వేస్తుంది. బాగుందిరా మీ నవతరం ఆలోచన అని బాబాయ్ మనస్ఫూర్తిగా అభినందించాడు.
============
చెప్పడం చాలా సులువు. అమలే కష్టం. ప్రణాళికను సరిగ్గా అమలు
చేయలేకపోతే -జీవితం నుంచే రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి
రావచ్చు. దైనికైనా డబ్బే కదా ముఖ్యం. ఏమంటారు? టైం మర్చిపోవద్దు.
ఎర్లీ రిటైర్మెంట్ కానె ్సప్ట్ బావుందని, సరైన టైంటేబుల్ లేకుండా ముందుకెళ్తే -జీవితం గోవింద. ఎంతకాలం పనిచేయాలి, ఎంతకాలం ముందు
రిటైర్మెంట్ తీసుకోవాలి అన్నది ఉద్యోగంలో చేరేటప్పుడే స్పష్టమైన
టేబుల్ ఫిక్స్ చేసుకోండి. అప్పుడిక తిరుగుండదు. ముందుంటుంది
మొసళ్ల పండుగ. ఉద్యోగం నుంచి ఒక్కసారే రిటైరైపోతే తరువాత ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థంకాదు. అందుకే -ఎర్లీ రిటైర్మెంట్ టైం
దగ్గర పడుతున్నపుడే భవిష్యత్ వ్యాపకం మీద దృష్టిపెట్టి కొద్దికొద్దిగా
అలవాటు చేసుకోవాలి. ‘లెక్కా’పత్రం లేకపోతే జీవితం పేజీల్లేని పుస్తకంలా
అయిపోవచ్చు. దేనికి ఎన్ని పేజీలఅన్నది మనసులో ముందే పుస్తకం
రాసేయ్యాలి. స్కెచ్‌లో తేడాలొస్తే -సినిమా అట్టర్ ఫ్లాపవుతుంది. అందుకే
తొలి జీతం నుంచీ పొదుపు అడుగులు బలంగా, స్థిరంగా పడాలి.

14, ఆగస్టు 2013, బుధవారం

పార్టీ పెట్టుకుందాం రా!

ఏమి సోమయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?

 మరో మూడు నెలలైతే రిటైర్ అవుతాను. బల్ల మీది నుంచి, కింది నుంచి, పక్కల నుంచి బాగానే సంపాదించాను కానీ. ఇంత కాలం బిజీగా గడిపి ఇప్పుడు ఒక్కసారిగా ఏ పనీ లేకుండా ఉండాలంటేనే ఎదోలా ఉంది ’’అంటూ సోమయ్య బంజారా క్లబ్‌లో మిత్రుడితో తన గోడు వెళ్లబోసుకున్నాడు.
‘‘నా దగ్గరో మంచి ప్లాన్ ఉంది. ఒక్కనితో వర్కవుట్ కాదని వౌనంగా ఉన్నాను. నువ్వు చేతులు కలుపుతానంటే కలిసి చేద్దాం’’ అని సుదర్శనం ఉత్సాహంగా అన్నాడు.
అబ్బా వ్యాపారమా నాకు ఆసక్తి లేదు. రిస్క్,శ్రమ రెండూ ఎక్కువే’’అని సోమయ్య తల అడ్డంగా ఊపాడు.
‘‘వ్యాపారమే కానీ రిస్క్, శ్రమ తక్కువ, ఆదా యం, ప్రచారం ఎక్కువగా ఉండే రాజకీయ వ్యా పారం’’ అని సుదర్శనం పక పకానవ్వాడు.
‘‘ఆ వ్యాపారం మన వల్ల అవుతుందంటావా?
ఏ పార్టీ గెలుస్తుందో తెలియదు. మనతో బోలెడు ఖర్చు చేయిస్తారు. రిస్క్ ఎక్కువనుకుంటాను’’ అని సోమయ్య సందేహం వ్యక్తం చేశాడు.
‘‘ఒక పార్టీలో చేరాల్సిన ఖర్మ మనకెందుకు. మనమే పార్టీ పెట్టేసుకుందాం. మన మన సామాజిక వర్గాల్లో మనకు బాగానే పలుకుబడి ఉంది. నువ్వు పైలట్ నేను కో పైలట్ నన్న మాట. మనం పార్టీ పెట్టగానే అధికారంలోకి వస్తామనే అత్యాశలు పెట్టుకోకు. రాజకీయ వ్యాపారంలో బడా బడాపెట్టుబడి దారులు ప్రవేశించారు. కార్పొరేట్ ఎత్తుగడలన్నీ రాజకీయ వ్యాపారంలో ప్రవేశించాయి. వాల్‌మార్ట్ విజృంభిస్తున్నా వీధి చివర్లో పచారీ కొట్లు ఏదోలా బతికేస్తున్నట్టుగానే మన చిన్నారి పార్టీ బతికేస్తుంది. పార్టీతో లాభమేమిటనే కదా నీ అనుమానం. వెయ్యిరూపాయల ఖర్చుతో కోట్ల రూపాయల ప్రచారం పొందొచ్చు. ఏ సమస్యపైనైనా టీవిలో చిట్టిపార్టీ ప్రతినిధులుగా ఆవేశంగా మాట్లాడవచ్చు. అఖిలపక్ష సమావేశాలకు భారీ కండువాలు కప్పుకొని వెళ్ళొచ్చు. ప్రతి రోజు టీవిల్లో అమెరికా ఆధిపత్యం మొదలుకుని అంగన్‌వాడి టీచర్ల సమస్యల వరకు, రూపాయి విలువ పడిపోవడం మొదలుకుని పిల్లలకు పాకెట్ మనీ ఎన్నిరూపాయలివ్వాలి అనే అంశం వరకు, తారా చౌదరి నుంచి తారా శశాంకం వరకు ఏ సమస్యపైనా మనకు తోచింది మాట్లాడవచ్చు. టీవిలో మనను చూసి అదిగో మా తాతయ్య అని నీ మనవరాలు తన స్నేహితులకు చెప్పుకుని మురిసిపోతే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఊహించుకో... రిటైర్ అయ్యాక ఇంట్లో భార్యా పిల్లలు కూడా మాట్లాడేందుకు చిరాకు పడతారు. అలాంటిది అన్నింటిపై టీవిలో మన అభిప్రాలు చెప్పుకునే చాన్స్ లభించడం అదృష్టం కాకుంటే మరేమిటి?
ఏ వ్యూహం క్లిక్కవుతుందో, ఏ రూపంలో అదృష్టం వరిస్తుందో? మనమూ గెలవవచ్చు.

 రాష్ట్రంలో ఇప్పుడు ఏ పార్టీ పేరు విన్నా జనం థూ అని తిడుతున్నారు. మాది అన్ని పార్టీల లాంటి పార్టీ కాదు. ఈ అన్ని పార్టీల సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించే సిద్ధాంతంతో పుట్టింది మా పార్టీ అని చెప్పుకుందాం. ఒక్క కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతో పుట్టిన పార్టీకి జనం 15 ఏళ్లు అధికారం అప్పగించారు. అలాంటిది మనం బోలెడు పార్టీల వ్యతిరేకమనే సిద్ధాంతం అని చెబితే ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచిం చు’’ అని సుదర్శనం చెబితే సోమయ్య ముఖంలో మార్పులు స్పష్టంగా కనిపించసాగాయి.

 అయినా ముఖంలో సందేహాలు ఇంకా పూర్తిగా తొలిగి పోక పోవడంతో ‘‘దీని కోసం నేను కొంత వర్క్ చేశాను. రిటైర్ మెంట్ వయసులో హీరోలు పార్టీలు పెట్టి విజయం సాధించారు’’ అని సుదర్శనం చెబితే, ‘‘అలా పార్టీ పెట్టి అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ కూడా ఉంది ’’ అని సోమయ్య విజయశాంతిని గుర్తు చేశారు.
‘‘80వ దశకంలో సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన నరసింహరాజు అనే నటుడు గుర్తున్నా డా? జయమాలినితో జగన్మోహినిలో హీరోగా నటించాడు. ఆయనకు ఎందుకో కానీ ఎన్టీఆర్‌పై కోపం వచ్చి భారత దేశం అనే పార్టీ పెట్టాడు. ఆ పార్టీ ఏమైందో ఆయనకే తెలియదు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు తెలుగు సీరియల్స్‌లో క్యారెక్టర్ నటునిగా బతుకుతున్నాడు.
పూర్వం రుషుల కోపం నుంచి శ్లోకాలు పుట్టినట్టు ఈ కాలంలో నాయకుల కోపం నుంచి రాజకీయ పార్టీలు పుడుతున్నాయి. సిఎంను చేయలేదని జగన్‌కు సోనియాపై వచ్చిన కోపంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పుట్టింది. బాబుపై కెసిఆర్ కొచ్చిన కోపం నుంచి టిఆర్‌ఎస్ పుట్టింది.ఇందిరాగాంధీపై కోపంతో జనతా పార్టీపుట్టింది. జనతాలో అందరూ మేధావులే, ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చక ఒకరిపై ఒకరికి కోపాలు వచ్చి డజన్ల కొద్ది పార్టీలు పుట్టాయి. బైరెడ్డికి తన మీద తనకే కోపం వస్తే రాయలసీమ పార్టీ పుట్టింది. నెహ్రూ వాళ్ల నాన్నకు కూడా కాంగ్రెస్‌పై కోపం వచ్చి పార్టీ పెట్టారు. ఆంగ్ల అక్షర మాలలో ఎన్ని అక్షరాలున్నాయో అన్ని కాంగ్రెస్ పార్టీలున్నాయని ఎన్టీఆర్ అనేవారు. తెలుగు కుటుంబాల్లో ఎన్ని బంధుత్వాలు ఉన్నాయో అన్ని తెలుగుదేశం పార్టీలు పుట్టా యి, అల్లుడిపై కోపంతో’’ అంటూ సుదర్శనం పార్టీల పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకొచ్చాడు.అందరు కోపంతో పార్టీ లు పెడితే ఒకాయన ప్రేమే మార్గం సేవే ధర్మం అంటూ ఏదో నినాదం తో వచ్చి పాపం వ్యాపారం నడవక  మూసేశాడు 
‘‘సరే పార్టీ పెట్టుకుందాం’’ అని సోమయ్య తల ఊపాడు. ‘‘అన్ని పార్టీల లక్ష్యం సూట్‌కేసే అని ఆ పేరుతోనే జస్పాల్ భట్టీ పార్టీ పెట్టాడు. మరి మనమేం పార్టీ పెడదాం’’అని సోమయ్య అడిగా డు. ‘‘ప్రజల్లో బాగా నానుతున్న పేరును పె ట్టుకుంటే ప్రచారంలో కలిసొస్తుంది. లక్ష కోట్లు, తెలంగాణ, సమైక్యాంధ్ర, సీమాంధ్ర ఇప్పుడు రాష్ట్రంలో పాపులర్ వర్డ్స్, దీనిలో ఏదో ఒకటి ఖాయం చేసుకుందాం ’’ అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు   ఏదైనా మంచి పేరు సూచించండి . 

7, ఆగస్టు 2013, బుధవారం

గుమ్మడి కాయ- హైదరాబాద్- అనపకాయ

హైదరాబాద్ బూడిద గుమ్మడి కాయ లా ఉంటుంది. దీన్ని అనపకాయలా మార్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని, నువ్వెన్నయినా చెప్పురా! సోనియాగాంధీ అలా చేసి ఉండాల్సింది కాదు! మనలాంటి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు కదా? ’’ అంటూ ప్రభాస్ హోటల్‌లో మిత్రులకు ఉపన్యాసం ఇవ్వసాగాడు.
 వాళ్ల నాన్న హోటల్ ముందు స్కూటర్ ఆపి ‘‘దరిద్రం వెదవా ఒక్క పనీ సరిగా చేయలేవా! ఆఫీసుకెళ్లాలి షర్ట్ ఐరన్ చేసి పెట్టరా! అంటే ఇదేనారా ఐరన్ చేసే పద్ధతి అంటూ తిట్టాల్సినవి హడావుడిగా తిట్టి వెళ్లిపోయాడు. ఈయన పని చేసేదేదో బాలీ
వుడ్ అయినట్టు ఈయన్ని చూసి ఐశ్వర్యారాయ్ మనసు పారేసుకుంటుందన్నట్టు పెద్ద ఫోజు ’’అని అని తిట్టుకుని మళ్లీ చర్చల్లో మునిగారు.
‘‘మీ పార్టీ అధ్యక్షుడు అన్ని కోణాల్లో ఆలోచించి తీసుకున్న నిర్ణయమే కదరా మళ్లీ సోనియాగాంధీని తప్పంటావు’’ అని అశోక్ గుర్తు చేశాడు. ‘‘మీకు మా నాయకుడ్ని ఆడిపోసుకోవడం తప్ప మరో పని లేదా? మాట మీద నిలబడడమే మీ యువ నాయకుడి బ్రాండ్ ఇమేజ్ అని ప్రచారం చేసుకుంటారు కదా. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు మాట మార్చాడు కదా ఇదేనా మీ నాయకుడి మాట తప్పని తనం’’ అని ప్రభాస్ ఎత్తిపొడిచాడు. ఆయా ప్రాంతాల వాస్తు ప్రకారం నిర్ణయం మార్చుకున్నారు తప్ప నాయకుడి తప్పు కాదు అని అశోక్ సమర్ధించుకున్నాడు.

భాస్కర్ జోక్యం చేసుకుని మా అధ్యక్షుని నిర్ణయం కూడా అంతే మేం సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు. ముహూర్తాన్ని వ్యతిరేకిస్తున్నాం. మనం బస్సెక్కాలన్నా, ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలన్నా ముహూర్తం చూస్తాం కదా? కానీ సోనియాగాంధీ ఇంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించేప్పుడు సరైన ముహూర్తంలో ప్రకటించలేదని ప్రభాస్ చెబితే పక్కనే ఉన్న పంతులుగారి కొడుకు ప్రకాశ్ జోక్యం చేసుకుని అది బ్రహ్మాండమైన ముహూర్తం అని మా నాన్న చెప్పాడు అన్నాడు. అందరూ నమ్మనట్టుగా చూస్తే, నిజంరా బాబు నామీద ఒట్టు తంగిరాల పంచాంగాన్ని చూసి మరీ చెప్పాడు తలమీద చెయ్యి పెట్టి నమ్మమన్నాడు. ప్రభాస్ వెంటనే అదీ అసలు విష యం నేమాని వారి పంచాంగం చూస్తే సరైన ముహూర్తం దొరికేదే కానీ తంగిరాల పంచాంగాన్ని బట్టి ముహూర్తం నిర్ణయించారు కాబట్టి సమస్య అక్కడే వచ్చింది. అని తన వాదనను బలపర్చుకున్నాడు.

 మరి ఆ రోజు నువ్వు ఇంటర్వ్యూకు నేమాని పంచాంగం చూసి మంచి ముహూర్తంలో వెళితే సెలక్ట్ కాలేదు కదరా? అని పక్కనున్న సులేమాన్ అడిగాడు. సందట్లో సడేమియా అని పంచాంగాల గురించి నీకేం తెలుసు, తెలిసినా నీకెందుకురా! అని అంతా సులేమాన్ నోరు మూ యించారు.

 అది సరే మీ నాన్న రాక ముందు హైదరాబాద్ గుమ్మడి కాయ అని ఏదో చెప్పావు. అక్కడికే వస్తున్నా! దిష్టిపడకుండా గుమ్మడి కాయను కడతారు. హైదరాబాద్ నగరం కూడా అచ్చం గుమ్మడి కాయలా ఉండేది. దాని వల్ల ఎంత అభివృద్ధి చెందినా ఎవరి దిష్టి తగల లేదు. దిష్టికే దిష్టి తగలదు కదా! కానీ హైటెక్ సిటీ అంటూ, ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్ అంటూ దక్షిణం వైపు నగరాన్ని విస్తరించారు. దీంతో గుమ్మడి కాయలా ఉన్న హైదరాబాద్ కాస్తా ఆనపకాయలా మారిపోయింది. గుమ్మడి కాయ దిష్టిని తట్టుకుంటుంది కానీ అనపకాయ తట్టుకోలేదు కదా? అందుకే ఈ సమస్యలన్నీ వచ్చాయని ప్రభాస్ చెబుతుంటే అంతా అవాక్కయ్యారు.

అందుకేనా హైదరాబాద్ వాస్తు సరిచేయడానికే మంత్రి టిజి వెంకటేశ్ గద్వాల, ఆలంపూర్‌ను రాయలసీమలో కలిపేయాలని మంచి ఉద్దేశంతో చెబితే అక్కడ ఆయన ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి అలా చెబుతున్నాడని తప్పుగా అర్ధం చేసుకున్నారు అని ముఖేష్ గుర్తు చేశాడు.

ఇదేమీ పట్టనట్టు నిఖిల్ నింపాదిగా కూర్చుంటే ...
ఏరా అంతా కంగారు పడుతుంటే నువ్వేంటి అంత నిబ్బరంగా ఉన్నావని అడిగారు.
మీ కంగారు చూస్తుంటే నాకు నవ్వొస్తున్నదిరా! ఏదో అయిపోతుందని తెలంగాణ వచ్చేస్తుందని మీరంతా అనుకుంటున్నారు కానీ అలాంటిదేమీ జరగదు. నేను చెబుతున్నాను రాసి పెట్టుకోండి అన్నాడు.
అంత ధీమాగా ఎలా చెప్పగలవు అని అడిగితే
జిన్నా ఎలా చనిపోయాడు? అని ప్రశ్నించాడు.
ఏదీ ఆ సైకిల్ పంక్చర్ బాగు చేసే జిన్నా నా? లారీ గుద్ది పోయాడన్నారు. అబ్బా ఆ జిన్నా కాదురా పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా ఎలా పోయాడు? అని అడిగాడు.
ఎలా పోతే మనకేంటి? అని అడిగారు.
అసలు కథ అక్కడే ఉంది.
మహాత్మాగాంధీని గాడ్సె హత్య చేయడం వెనుక ఎవరున్నారనుకుంటున్నారు?
సంజయ్‌గాంధీ బతికుంటే మన దేశం పరిస్థితి ఇలా ఉండేది కాదు మహామహానాయకులు ఎంతో మంది తెరమరుగై ఉండేవారు.
అది సరేరా! జిన్నాకు, గాంధీకి, తెలంగాణపై ప్రకటనకు సంబంధం ఏమిటి/
అదంతే బాబు కొన్ని విషయాలు అంత సులభంగా అర్ధం కావు.
అది సరే మన దేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్య్రం వచ్చింది కాదంటావా ?. 
ఎందుకంటాను ?
మరింకే తెలంగాణ రాదు.
ఆ ,,ఆ ...???????

ముక్తాయింపు .. కొన్ని చర్చలు అంతే ,, వాటికి లాజిక్ ఉండదు ,,

5, ఆగస్టు 2013, సోమవారం

తెలంగాణ , ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ పార్టీలే మేలు

తెలంగాణ ఏర్పాటుకు యుపిఏ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. సమైక్యాంధ్ర,తెలంగాణాల పేరు తో రాష్ట్రంలో ప్రజలు, పార్టీలు ఇంత కాలం రెండుగా చీలిపోయాయి. పోటాపోటీ ఉద్యమాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అని రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు కానున్నాయనే వాస్తవాన్ని గ్రహించాలి. రెండు రాష్ట్రాలు ఇక ఉద్యమాలతో కాదు అభివృద్ధిలో పోటీ పడాలి. పొరుగున ఉన్న తమిళనాడు తరహా రెండు ప్రాంతీల పార్టీల రాజకీయాలు మన రెండు రాష్ట్రాల్లో ప్రారంభం అయితే రెండు రాష్ట్రాలకు మేలు.

తెలుగుదేశం ఆవిర్భవించిన సమయంలో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి అందుకే ప్రాంతీయ పార్టీలు పుడుతున్నాయి అని ప్రాంతీయ పార్టీలను స్వాగతించిన వారు బలంగా చేసిన వాదన. తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలకు, మన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు చాలా తేడా ఉంది. రంగులు, ప్రచార తీరుతో సహా అచ్చంగా తమిళనాడు ప్రాంతీయ పార్టీని అనుకరించి టిడిపిని ఏర్పాటు చేసినా ఎందుకో గానీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలు గు భాషను నిలబెట్టే విషయంలో తమిళ పార్టీలను మన తెలుగు పార్టీలు ఏ మాత్రం అనుసరించలేకపోయాయి.

నిజంగా ఆయా రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను ప్రాంతీయ పార్టీలు నెరవేర్చాలంటే తమిళనాడు తరహాలో బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు ఉండాలి తప్ప, మన రాష్ట్రంలో మాదిరిగా ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ మధ్య పోటీ అనేది ఉపయోగకరం కాదని తేలిపోయింది. టిడిపి ఆవిర్భావానికి ముందు, తరువాత కూడా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల గురించి బాగానే ప్రయత్నాలు జరిగాయి.

తెలుగు సంస్కృతి, భాష, తెలుగు వాడి ఆత్మగౌరం అంటూ, సామాజిక న్యాయం అంటూ ఎన్ని ముసుగులు వేసినా రాజకీయ పార్టీల అసలు లక్ష్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే. తెలుగు సంస్కృతి, తెలుగు వారి అత్మగౌరవం, తెలు గు భాష అంటూ టిడిపి ఆవిర్భావ సమయంలో ఎన్ని మాటలు చెప్పినా చివరకు టిడిపి సైతం అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించే ఒక పార్టీగానే మారింది తప్ప. తెలుగు కోసం ప్రత్యేకం అనే గుర్తింపు నిలుపుకోలేక పోయింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో తెలుగు అమలు ఎంత అద్భుతంగా ఉందో అందరికీ తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చాక తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, తెలుగు భాష పేరు మీదనే ఏర్పడిన రాజకీయ పార్టీ ఒకటిన్నర దశాబ్దాల పాటు పాలించిన రాష్ట్రం అయినా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో తెలుగు అమలు సిగ్గుపడాల్సిన స్థాయిలో ఉంది. తెలుగు పేరుతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ వచ్చీ రాగానే చేసిన పని తెలుగు భాష, సంస్కృతుల కోసం అంతో ఇంతో పని చేసే అకాడమీలను రద్దు చేశారు. ఆస్థాన కవిని ఇంటికి పంపించారు. సరే అప్పటి వరకు ఆయా స్థానాల్లో ఉన్నది కాంగ్రెస్ అభిమానులు అనే కోపం ఉంటే వారిని తప్పించి టిడిపి అభిమానులను నియమించినా బాగుండేది కానీ ఏకంగా వాటిని రద్దు చేసి తెలుగుదనం అనేది కనిపించకుండా చేశారు. తెలుగు మహిళా బహిర్భూమి వంటి తెలుగు పేర్లు తప్ప అధికార భాషగా తెలుగు అమలు కోసం పెద్దగా కృషి జరిగిందేమీ లేదు. ఆ తరువాత వచ్చిన తెలుగు పాలకుల తీరు సైతం అంతే.

తమిళనాడులో మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి. తమిళ భాష, సంస్కృతుల విషయంలో ప్రధాన ప్రాంతీయ పార్టీలు రెండింటి మధ్య పోటా పోటీ ఉంటుంది. తమిళనాడులో అయితే డిఎంకె, లేదంటే ఏఐఎడిఎంకెనే అధికారంలోకి వస్తుంది. జాతీయ పార్టీలు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దానికి తోకల్లా ఉండాల్సిందే. బిజెపి, కాంగ్రెస్ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారితో జత కట్టడానికి ఈ రెండు పార్టీలకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా తమిళనాడుకు చెందిన రెండింటిలో ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమితో కలిసి పోతుంది. దీనివల్ల ఆ రాష్ట్రానికి కేంద్రం పెద్దపీట వేయక తప్పని పరిస్థితి. రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ మన నాయకులు తమిళనాడుతో పోలుస్తూ మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని విమర్శిస్తుంటారు.
మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ మధ్యనే ప్రధానంగా పోటీ సాగింది. జాతీ య పార్టీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అంతే. ఆ పార్టీ ఎంపిలు రాష్ట్రంలో ఎంత మంది ఉన్నా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేంత పరిస్థితి ఉండదు. ఒక వేళ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండి కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంటే, ప్రభుత్వంలో కూడా చేరరు కాబట్టి రాష్ట్రానికి మొండి చేయి తప్పదు. కేంద్రంలో అయితే కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి, లేదంటే బిజెపి నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ పార్టీలకు దూరంగా ఉండడం వల్ల రాష్ట్రం భారీగానే నష్టపోవలసి వచ్చింది.

 ఏ పార్టీతో జత కట్టాలి, ఏ పార్టీకి దూరంగా ఉండాలనేది ఆయా పార్టీలు లాభనష్టాల లెక్కలు వేసుకుని నిర్ణయం తీసుకుంటాయి అవి వాటి ఇష్టం కానీ..ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ మధ్య ఉండే పోటీ వల్ల రాష్ట్రం నష్టపోయింది. అలా కాకుండా రెండు ప్రాంతీయ పార్టీలు, లేదా రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. తెలుగుదేశం అయినా ప్రజారాజ్యం అయినా సిద్ధాంతాలు ఎన్ని చెప్పినా ఆ పార్టీలకు అధికారం కోరుకునే సామాజిక వర్గాల అండ తప్పని సరిగా ఉంటుంది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్‌ఆర్ ఇమేజ్ వెలిగిపోతున్న సమయంలో ఆవిర్భవించడం వల్ల ప్రజారాజ్యం నిలబడలేకపోయింది. దాంతో రెండు ప్రాంతీయ పార్టీల వ్యవస్థ ఏర్పాటు అవకాశం తప్పిపోయింది.

ఇక ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి పోయి నట్టే . తెలంగాణ ప్రాంతానిదో ప్రత్యేక రాజకీయం. సీమాంధ్రలో ఇంత కాలం  అయితే కాంగ్రెస్ లేదంటే టిడిపి అన్నట్టుగా పరిస్థితి ఉంటే, తెలంగాణలో మాత్రం అసెంబ్లీలో గుర్తింపు పొందిన పార్టీలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీల ప్రతినిధులు తెలంగాణ నుంచి గెలిచిన వారున్నారు. టిడిపి, కాంగ్రెస్, టిఆర్‌ఎస్, ఎంఐఎం, బిజెపి, లోక్‌సత్తా, సిపిఐ, సిపిఎం పార్టీల ప్రతినిధులు తెలంగాణ నుంచి గెలిచారు.
ఇప్పుడు తాజాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రంగ ప్రవేశం చేసింది. తెలంగాణలో ఆ పార్టీ ఉనికిస్వల్పమే . కేంద్రం తెలంగాణా ఏర్పాటు పై నిర్ణయం తీసుకోగానే  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యం యల్ ఏ లు  రాజీనామా చేయడం తో తెలంగాణాలో పార్టీ తుడిచిపెట్టుకు పోయింది.అయితే సీమాంధ్రలో బలంగా ఉంది. ఒకవేళ తెలంగాణ ఏర్పడి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీనే, ఇప్పుడున్న నాయకులే  తిరిగి అధికారంలోకి వస్తే రాజకీయ ముఖ చిత్రంలో తక్షణం  పెద్దగా మార్పు కనిపించక పోవచ్చు. క్రమంగా మార్పు అనివార్యం . 

స్వాతంత్య్ర పోరాట కాలంలో ఈ దేశానికి స్వాతంత్య్రం అవసరం లేదు, బ్రిటీష్ వారే పాలించాలని వాదించిన కొన్ని సామాజిక వర్గాలు,  జమిందార్లు స్వాతంత్య్రం రాగానే ఖద్దరు ధరించి అధికారం చేపట్టారు. ఇది ఎక్కడైనా తప్పని అనివార్యమైన పరిణామం. ఇప్పుడు తెలంగాణ వస్తే ఇదే దోరణి తెలంగాణలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. వీళ్లు కొత్తగా ఖద్దరు ధరించాల్సిన అవసరం కూడా లేదు. ఖద్దరులోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ మంత్రులు కొందరు ముఖ్యమంత్రికి అండగా నిలిచారు. ఓవైపు యువకుల ఆత్మహత్యలు జరుగుతుంటే మరోవైపు తమ నియోజక వర్గాల నుంచి జనాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకు వెళ్లిన  తెలంగాణ మంత్రులు ఉన్నారు. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేయగానే హైదరాబాద్‌లో సభను నిర్వహించి బోనాలు ఎత్తుకుని హడావుడి చేసిన మంత్రులే ఆ తరువాత తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రికి సన్నిహితం అయ్యారు. చివరకు తాజాగా కోర్ కమిటీ సమావేశం తరువాత ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ తెలంగాణ ఆవశ్యకతపై గట్టిగా వాదించగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం అంత కన్నా గట్టిగా వాదించారు. కోర్‌కమిటీ తరువాత సీమాంధ్ర మంత్రులు ముఖ్యమంత్రిని కలిస్తే, తెలంగాణ మంత్రులు కొందరు దామోదర్‌ను, కొందరు కిరణ్ కుమార్‌రెడ్డిని కలిశారు. ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి పదవికి జరిగే పోటీలో ముందు వరుసలో ఉంటారని భావిస్తున్న మంత్రి మొదటి నుంచి తెలంగాణ వాదానికి దూరంగా, ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటున్నారు. తెలంగాణ ప్రకటన రాగానే ఇప్పుడు మళ్ళి వారి హడావుడే కనిపిస్తోంది . అదే జరిగితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో పెద్దగా మార్పు ఉండదు.

తెలంగాణ అంశంలో కెసిఆర్ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా, టిఆర్‌ఎస్‌ను ఒక రాజకీయ పార్టీగా అభివృద్ధి చేయడంలో ఆశించిన స్థాయిలో జరగలేదు . కొన్ని లక్షల మందికి చెందిన రాజకీయ పార్టీ భవిష్యత్తుపై ఆయన అలవోకగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌లో కలిపేస్తాను అని ఒకసారి, కలిపేది లేదని ఒకసారి మాట్లాడుతున్నారు. 
 ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం అవసరమని కెసిఆర్ తెలంగాణ ప్రజలను ఒప్పించ గలిగారో దాని కోసం కృషి చేయడమే అసలైన సవాల్. దాని కోసం టిఆర్‌ఎస్ తెలంగాణలో బలమైన రాజకీయ పక్షంగా నిలవాలి.
తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ రెండేసి బలమైన ప్రాంతీయ పార్టీలు ఉంటే తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకోవడానికి రెండు రాష్ట్రాలు, రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. తమిళనాడులో తమిళ సంస్కృతి, భాషకు దక్కే గౌరవం, అభివృద్ధి విషయంలో ఆ రాష్ట్రానికి లభించే ప్రాధాన్యత కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు దక్కే అవకాశం ఉంది.

2, ఆగస్టు 2013, శుక్రవారం

నువ్వు మహాత్ముడి కన్నా గొప్పా ?


నాకు ఆ mla అంటే చాలా అభిమానం 
మంచిదే.. అభిమానించడానికి కారణం . బాగా పని చేస్తరనా ? లేక మీ  ?????
చా......  చా ... అలాంటిదేమీ లేదు 
నాకు కులం, మతం , ప్రాంతం వంటి సంకుచిత బావలేమి లేవు .. 
నిజమా అయితే మీరు చాలా గొప్ప వారు .. రజనీష్ చెప్పిన ఒక కథ చె బుతను ఆ తరువాత కుడా ఈ మాట మీద  నువ్వు నిలబడితే ..నీ  అంత గొప్ప వారు ఎవరు లేరు . .
ఓషో రజనీష్ మహాత్మా గాంధీ గురిచి చెబుతూ .. మహాత్ముడు చాలా గొప్పవారు  దీనిలో నాకెలాంటి సందేహం లేదు . జీవిత కాలమంత మత సామరస్యం కోసం కృషి చేశారు . నిరంతరం ఈశ్వర్ అల్లా తేరే నామ్  అని ప్రార్ధించారు .
 గాడ్సే పేల్చినా తూటా తగలగానే 
హే  రామ్ అంటూ నేల  కోరిగారు . అప్పుడు ఈశ్వర్ అల్లా తేరే నామ్  అనకుండా హే రామ్ అని ఎందుకన్నారు అంటే 
మహాత్ముడు హిందువు .. 
ఒక హిందువు గానే హే  రామ్ అన్నారు 
మర్యాదల కోసం మనం ఎన్ని ముసుగులు ధరించినా మనం మనుషులం .. కులం, మతం, ప్రాంతం పై మన సహజ స్పందనలు వేరు .. ముసుగులో మాట్లాడే మాటలు వేరు 
ఇప్పుడు చెప్పు నువ్వు వీటికి అతీతమా 
ముసి ముసి నవ్వులు .
ప్రేమించు తప్పు లేదు .. అలానే ఇతరుల కులం,మతం, ప్రాంతాన్ని కుడా గౌరవించు 
( చాలా రోజుల క్రితం ఒకరితో జరిగిన చర్చ )