21, ఆగస్టు 2013, బుధవారం

సన్యాసుల సమ్మేళనం

ఎలాగైనా తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకోవాలి?
ఏర్పడినా ఏర్పడకపోయినా నీకొచ్చిన నష్టమేముంది. అంత కంగారు పడుతున్నావు.
నాకే కాదు మొత్తం దేశానికే ప్రమాదం.
అబ్బా ఈ వాదన చాలా కాలం నుంచి వింటున్నదే? ఏదైనా కొత్తది చెప్పు.
అది కాదు.
సరే ఇప్పుడంటే ఐటి రంగం ద్వారా మనం ప్రపంచంలో గుర్తింపు పొందాం కానీ పూర్వ కాలం నుంచి కూడా ప్రపంచంలో మన దేశానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు ఏమిటో తెలుసా?
సమాధానం కూడా నువ్వే చెప్పు?
సన్యాసులు
ఔను ప్రపంచంలో ఎక్కడా కనిపించని సన్యాసులు మన దేశానికే పరిమితం. అయితే కావచ్చు... తెలంగాణ ఏర్పడితే సన్యాసుల కొచ్చిన సమస్య ఏముంది?
అదే నీకు తెలియని విషయం.
తెలంగాణ ఏర్పడితే సన్యాసులు ప్రమాదంలో పడతారు.
అస్సలు అర్ధం కావడం లేదు. అదేలా?
అంటే నువ్వు వార్తలు సరిగా ఫాలో కావడం లేదన్నమాట!
అవుతున్నాను కానీ సన్యాసులకు తెలంగాణకు సంబంధం ఏమిటో ఫాలో కాలేకపోతున్నాను.
తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం సన్యాసులతో నిండిపోతుంది. రాష్ట్రంలో టెక్కీలను మించి సన్యాసులు కనిపించేస్తారు.ఇ ప్పటి వరకు ఉన్న సన్యాసులకు వీళ్లు గట్టి పోటీ అవుతారు .
అయితే ఏమవుతుంది?

ఎమవుతుందంటే నీకో కథ చెప్పాలి, 
***
ఇన్‌స్టెంట్ సన్యాసి గురించి రజనీష్ ఓ ఉదంతాన్ని వివరించారు. ఒక సంపన్ను
డికి ఎందుకో గానీ చాలా కోపం వచ్చి నమ్ముకున్న వారిని హత్య చేశాడు. శవాన్ని చూడగానే కోపం చల్లారి ఒక సాధువువద్దకు అంతే స్పీడ్‌గా పరిగెత్తి ఈ సంపద, ఈ జీవితంతో నేను విసిగిపోయాను సన్యాసం ఇప్పించండి అని వేడుకున్నాడు. సన్నాసిలా బతికే నీకు సన్యాసం అంత ఈజీకాదు చాలా కష్టం. ఇంత విలాసంగా బతికే నీకు సన్యాసిగా కాషాయం ధరించడం చాలా కష్టం అని ఆ సాధువు చెప్పుకుంటూ పోతుంటే ఆయన మాటలు ఇంకా ముగియక ముందే నేను ధరించిన ఈ విలువైన దుస్తులు నాకు అడ్డంకిగా మీరు భావిస్తున్నారా? వీటిని త్యజించడం నాకు పెద్ద కష్టం ఏమీ కాదు అని చెప్పి ఆ సంపన్నుడు బట్టలన్నీ విప్పి పారేసి నగ్నంగా నిలబడి ఇప్పుడు సన్యాసం ఇప్పించండి అని ఆవేశంగా అడిగాడు. దానికి సాధువు చిరునవ్వు నవ్వి మారానని నువ్వు అనుకుంటున్నావుకానీ నీవేమీ మారలేదు. హత్య చేసినప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉండేదో ఇప్పుడూ అలానే ఉంది. ఎంత ఆవేశంగా హత్య చేశావో అంతే ఆవేశంగా నీ బట్టలన్నీ విప్పి నగ్నంగా నిలబడ్డావు. ఇక నీలో మార్పు ఏముంది. సన్యాసం నీ వల్లకాదు అని చెప్పి పంపించాడు సాధువు.
*****

రాష్ట్రం తెలంగాణ, సమైక్యాంధ్ర అంటూ ఆగ్నిగుండంగా మారిపోతే సన్యాసుల గొడవేమిటంటారా? ఈ సన్యాసుల గొడవ ప్రస్తుత ఉద్యమాలకు సంబంధం ఉంది. అప్పుడెప్పుడో 1981లో ఢిల్లీలో ప్రపంచ సాధువుల సమ్మేళనం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి సన్యాసులు ఢిల్లీ వచ్చారు. వారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వచ్చారు. ఢిల్లీ సన్యాసులతో కళకళలాడింది అప్పుడు. ఇప్పుడు కాబోయే సన్యాసులతో ఢిల్లీ సందడిగా మారింది. తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని లగడపాటి రాజ్‌గోపాల్ గత మూడేళ్ల నుంచి చెబుతున్నారు. మాట మీద నిలబడాలనే హామీ కూడా ఆయన నుంచి కెసిఆర్ టీవిల్లో ప్రజల సాక్షిగా తీసుకున్నారు. లగడపాటి నువ్వు హీరోవి, ఐ లవ్‌యూ ... నువ్వు మాట మీద నిలబడతావు అంటూ టీవి లైవ్ షోలో కెసిఆర్ లగడపాటికి కితాబు ఇచ్చారు. లగడపాటి ఎన్నికల్లో విజయవాడ ఓటర్లకు  ఇచ్చిన హామీలకే కట్టుబడి లేడు, ఇక కెసిఆర్‌కిచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా?అనేది కొందరి అనుమానం. అంతా సోనియాగాంధీ అనుకున్నట్టు జరిగితే లగడపాటి ఇచ్చిన మాట ప్రకారం సన్యాసం స్వీకరించేందుకు సిద్ధపడాలి.
సన్నాసి, సన్యాసి పదాల్లో చిన్నపాటి గందరగోళం ఉంటుంది. అందుకే ఒకసారి కెసిఆర్ దీనిపై సుదీర్ఘంగానే వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వౌనంగా ఉం టున్న కాంగ్రెస్ నాయకులు, మంత్రులు సన్నాసులు అని ఆయన తిట్టారు. అయినా వారిలో ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో నేను మిమ్ములను సన్యాసులు అన్నానని అనుకుంటున్నారా? సన్యాసి అంటే గౌరవనీయులే, నేనన్నది సన్నాసి అని విడమరిచి చెప్పారు.

సినిమాల్లోనే కాదు ఎన్టీరామారావుకు రాజకీయాల్లో సైతం ఏ వేషం వేసినా ఆచ్చుగుద్దినట్టు సరిపోయేది. రాజసం ఉట్టిపడే ఆయనకు నిజజీవితంలో సన్యాసి వేషం కూడా బాగా నప్పింది. ఎన్టీఆర్ ఒక వైపు రాజకీయాలు సాగిస్తూనే మరోవైపు సన్యసించారు. నేను రాజర్షిని అని ముద్దుగా చెప్పుకున్నారు. రుషుల మాది రిగానే ఎన్టీఆర్ సైతం అలానే లక్ష్మీపార్వతితో ప్రేమ తరువాత సన్యాసానికి స్వస్తిపలికారు.
తెలంగాణ ఏర్పడితే సన్యసిస్తానని రాయపాటి సాంబశివరావు ప్రకటించేశారు. దేశ దేశాల్లో కాంట్రాక్టులు చేసే ఆయన అంతటి వాడే సన్యసిస్తే నేనేమన్నా తక్కువ తిన్నానా? అని కర్నూలు నుంచి ఓ స్వరం లేచించింది. తెలంగాణ ఏర్పడితే మా ప్రాంతం ఎడారిగా మారుతుంది కాబట్టి నేనూ సన్యసిస్తాను అని రైల్వే మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించేశారు. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించేందుకే సన్యాసి వేషం వేస్తారని కొందరి విమర్శ. రైల్వే మంత్రిగా కోట్ల టికెట్ తీసుకోవలసిన అవసరమే ఉండదు కాబట్టి ఆయన సన్యాస ప్రకటనను అనుమానించాల్సిన అవసరమే లేదు.

పెద్దలంతా ఇలా సన్యాస ప్రకటనలు చేస్తుండడంతో సమైక్యాంధ్ర ఉద్యమ కారులకు కోపం వచ్చి మీరు ప్రత్యేకంగా సన్యాసం తీసుకోవడం ఎందుకు ఎన్నికలు రానివ్వండి మీ సంగతి తేల్చి మేమే మీకు సామూహిక సన్యాసం ఇప్పిస్తామంటున్నారు. చూస్తుంటే ఢిల్లీలో త్వరలోనే సన్యాసుల సమ్మేళనం జరిగేట్టుగానే ఉంది.

1 కామెంట్‌:

  1. మురళి గారు! ఎంత శుభవార్త! మీ నోట్లో పంచదారపోయాలి, సన్యాసులనిలయం కాబోతోందని చెప్పినందుకు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం