29, జనవరి 2014, బుధవారం

ఈ తరం జాతి నేతలు కిరణ్ వీరప్పన్ .. వారి జీవితమే మనకు సందేశం

ఇప్పుడు మనం అనుభవిస్తున్నవన్నీ ఓ శతాబ్దం క్రితం కలలో కూడా ఊహించి ఉండం. రోజులో ఎక్కువ భాగం టీవికే అంకితం. ఫేస్‌బుక్ లేనిదే ఉండలేం. కంప్యూటర్ లేనిదే గడవదు. ల్యాప్ టాప్ పక్కలో లేందే నిద్ర పట్టదు. గూగుల్ సెర్చ్ పని చేయకపోతే ఊపిరి ఆగిపోతోందేమో ననిపిస్తోంది. నాకు గూగుల్‌తో పని లేదు, మా ఆవిడకు అన్నీతెలుసు అనే మాట రాసున్న టీ షర్ట్ ఒకటి ధరించిన మొగుడి గారి ఫోటో ఫేస్‌బుక్‌లో బాగానే చక్కర్లు కొడుతోంది. ఆ మొగుడ్ని వదిలేస్తే గూగుల్ లేకుంటే అమ్మో ఇంకేమైనా ఉందా? ఎక్కడున్నా సెల్‌ఫోన్ పుణ్యమా అని క్షణాల్లో ఒకరికొకరు పలకరించుకోవచ్చు. ఇంతటి మహత్తర మైన కాలంలో మనం ఉండడం మన అదృష్టం. వందేళ్ల క్రితం ఇవేవీ ఆ నాటి ప్రజలకు లేవు. ఒక్కో సారి మనమే అదృష్టవంతులం అనిపిస్తోంది, మరోసారి కాదే మో అనిపిస్తోంది. ఎందుకా డైలమా? అంటే ?


నా జీవితమే నా సందేశం అంటూ చెప్పింది చేశారు, చేసిందే చెప్పి తన జీవితానే్న సందేశంగా ఇచ్చారు ఆనాటి తరానికి మహాత్ముడు. బగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, లాల్‌బాల్‌పాల్ ఒక్కోక్కరి పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చదువును, భవిష్యత్తును పక్కన పారేసి దేశం కోసం త్యాగం చేయడానికి ఆనాటి యువతను చైతన్య పరిచిన మహనీయులు బతికిన కాలం అది. వాళ్లకు సెల్‌ఫోన్ లేకపోవచ్చు, ఇంటర్‌నెట్ పేరు విని ఉండకపోవచ్చు. ఫేస్ వాల్యూ తప్ప వారికి ఫేస్‌బుక్ గురించి విని ఉండక పోవచ్చు.


ఇవేవీ లేని ఆ నాటి తరానికి ఆనాటి మహనీయులు మా జీవితమే మా సందేశం అని చెబితే, అన్నీ సౌకర్యాలు ఉన్న మన కాలంలో కూడా కొందరు మహనీయులు నా జీవితమే నా సందేశం అని చెబుతున్నారు.


కిరణ్ అని ఓ కుర్రాడు టీవిల్లో తెలుగు జాతిని ఉద్దేశించి గంభీరమైన ఉపన్యాసం చేశారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లు రాత్రికి రాత్రి కోట్లు సంపాదిస్తున్నారు. దేశం ఎక్కడికి పోతోంది. ఈ దేశానికి నిజాయితీ పరులైన వారు, యువత కావాలి అంటూ చక్కని ఉపన్యాసం ఇచ్చాడు. బావ కళ్లల్లో మొద్దు శీను ఆనందం చూసినట్టుగా, ఆ యువకుడి కళ్లల్లో వెలుగును చూసిన చానల్ వాళ్లు దాన్ని తమకు మాత్రమే పరిమితం చేసుకోకుండా ఆఖిలాంధ్ర తెలుగు ప్రేక్షకులకు చూపించారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను అనే మాట ద్వారా బోసుబాబు ఆనాటి యువత రక్తం మరిగేట్టుగా చేశాడు.
యువతలో ఆత్మవిశ్వాసం కోసం వివేకానందుడు తన జీవితాన్నే అంకితం చేశాడు .  హిందుమత ఔన్నత్యాన్ని అమెరికాలో అమెరికా వారికి చెప్పి వచ్చాడు. మరి నేనేం చేసి సందేశం ఇవ్వాలా? అని కిరణ్ బాగా ఆలోచించి తనిష్కలో కేజీల కొద్ది బంగారం దోచేశాడు. మీకేం ఎన్నయినా మాట్లాడతారు. ఆ కుర్రాడు నేను సందేశం ఇస్తాను అంటే టీవి చానల్ గేటు లోపలికి రానిస్తారా! మూడు రోజుల్లో కేజీల కొద్ది బంగారం దోచుకోవడం ఎలా? అనే అంశంలో నైపుణ్యం సాధించాడు కాబట్టి ఆ యువకుడు జాతిని ఉద్దేశించి చేసే ఉపన్యాసాన్ని టీవిలో లైవ్‌గా చూపించారు. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా? లేదా అనేది ముఖ్యం. ఇలాంటి జాతీయ యువ యోధులను మన చానల్స్ మరింతగా ప్రోత్సహించి మరింత మంది కిరణ్ లను అర్జంట్ గా తాయారు చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది . ఎలాగైతేనేం సందేశం ఇచ్చే చాన్స్ వచ్చిందా? లేదా? అనేది ముఖ్యం. 

విభజన హడావుడి వల్ల ఆ కుర్రాడి సాహసోపేత సందేశానికి మీడియా ఆ కుర్రాడు ఆశించిన మే రకు ప్రాధాన్యత ఇవ్వలేదమోననిపిస్తోంది. లేకపోతే కిరణ్‌కు పిజ్జా అంటే ఇష్టమా? ప్యారడైజ్ బిర్యానీ ఎన్ని రోజులకోసారి తింటాడు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానా?  పవనిజంపై అతని అభిప్రాయం ఏమిటి? మహేశ్‌బాబు సినిమాలు ఎన్ని చూశారు? హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం? రాష్ట్ర విభజనపై మీ అభిప్రాయం ఏమిటి? విభజన వల్ల కలిగే నష్టాలు, సమైక్యాంధ్ర కోసం మీరు చేయాలనుకుంటున్న త్యాగాలు ఏమిటి? అనే ప్రశ్నలు బోలెడు వేసి ఉండేవారు. ఎలాగో ఇతను రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నాడు కనుక అప్పుడు టీవిలో ఈ ప్రశ్నలన్నీ అడగొచ్చు.


ప్రపంచాన్ని జయించాలనుకుని బయలు దేరిన అలెగ్జాండర్ మరణించాక శవపేటికలో తన రెండు చేతులు బయటకు వచ్చేట్టు ఏర్పాటు చేయమని ముందే చెప్పాడట! అలెగ్జాండర్ కూడా వెళ్లేప్పుడు ఏమీ తీసుకు వెళ్లలేదని చెప్పడానికి. అలానే కిరణ్‌కు ఇంకాస్త సమయం ఇస్తే ఇలాంటి సందేశం ఏదో ఒకటి ఇచ్చేవాడే.
మన తెలుగు తేజం ఘన కార్యం తక్కువ చేసి చూపడం కాదు కానీ అప్పుడెప్పుడో వీరప్పన్ కూడా జాతికి ఇలాంటి సందేశమే ఇచ్చాడు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి కన్నడ జాతికి గొప్ప సందేశం ఇచ్చాడు. అయ్యా ! నీ డిమాండ్లు ఏమిటి? అని ప్రశ్నిస్తే, కన్నడ సమాజానికి గొప్ప సందేశం ఇవ్వడానికే ఈ కిడ్నాప్ అని చెప్పుకొచ్చారు.
సరే ఏమిటా? సందేశం అని అడిగితే కన్నడ నాట కన్నడ భాష అమలు తీరు పట్ల వీరప్పన్ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ సంస్కృతి, సంప్రదాయాలు, కన్నడ భాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని గట్టిగా వాదించారు. అడవుల్లో గంధం చెట్లు దొంగకు అడవి జంతువుల భాష తప్ప కన్నడ భాషమీద ఇంత అభిమానం ఉంటుందని ఎవరూ అనుకోలేదు. సచివాలయంలో ఉండే సచీవులకన్నా అడివలో ఉండే గందం చెట్ల స్మగ్లర్‌కే ఎక్కువ భాషాభిమానం ఉందని భాషాభిమానుల కళ్లు చెమ్మగిల్లాయి. లోగుట్టు పేరమాళ్ళ కెరుక. పెద్ద మొత్తంలో డబ్బుకోసమే కిడ్నాప్ చేశాడని, డబ్బులు చేతులు మారాకే రాజ్‌కుమార్‌ను విడుదల చేశారని తరువాత ప్రచారం జరిగింది. కిడ్నాప్ తరువాత కన్నడ భాష అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టయితే కనిపించలేదు.


ఇంతటి మహనీయుల సందేశాలను లైవ్‌గా వినగలుగుతున్న మనం అదృష్టవంతులమా? దురదృష్టవంతులమా? ఆధునిక సౌకర్యాలు లేకపోయినా మహనీయుల జీవితాలనే సందేశాలుగా చూసిన తరం గొప్పదా? ఏమో అన్నీ ప్రశ్నలే. ఎవరికి నచ్చిన సమాధానం వారు చెప్పుకోవలసిన కాలమిది.

2 కామెంట్‌లు:

  1. పాపం, నిజాయితీపరుడే!
    లేకపోతే సందేశం ఇవ్వడానికి అన్ని కేజీల బంగారం వదిలేసుకుంటాడా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. bonagiri garu అనుకుంటాం కాని దొంగ తనం చేయడం కన్నా , దోచిన దాన్ని దాచే దైర్యం ఉండాలి - తనిష్క నీతి కథ

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం