27, అక్టోబర్ 2014, సోమవారం

సినిమా లకే కాదు రాజకీయాలకూ రీమేక్ లు

రీమేక్ అనే మాట సినిమా రంగంలో తరుచుగా వినిపిస్తుంటుంది. కానీ అన్ని రంగాల్లోనూ రీమేక్‌లు అప్పుడప్పుడు కనిపిస్తునే ఉంటాయి. రీమేక్‌లు ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యాయి అని బాగా ఆలోచిస్తే రీమేక్ కింగ్, రీమేక్ సామ్రాట్ అనే బిరుదుకు అర్హత గల వారు విశ్వామిత్రుడు అని గట్టిగా నమ్మకం కలుగుతోంది. త్రిశంకును స్వర్గనికి పంపాలని విశ్వామిత్రుడు తెగ ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో స్వర్గాన్ని రీ మేక్ చేసింది ఆయనే కదా? సరే త్రిశంకు అటు సర్గంలోకి ఇటు నరకంలోకి వెళ్లక మధ్యలో ఉండొచ్చు కానీ సృష్టికి ప్రతి సృష్టి చేయడం ద్వారా తొలి రీమేక్ సామ్రాట్‌గా విశ్వామిత్రుడు రికార్డు సృష్టించాడు. స్వర్గం ఉందో లేదో అనేది ఒక అనుమానం అయితే స్వర్గానికి రీమేక్ లాంటి త్రిశంకు స్వర్గం ఏమైందో ఎవరికి తెలుసు?


ఇక దేవుళ్లలోనూ ఈ రీమేక్ గోల ఉంది. అచ్చం శ్రీకృష్ణుడిలానే పౌండ్రుక వాసుదేవుడు పిల్లన గ్రోవితో ఉండేవాడు. నిజానికి సినిమాల్లో రీమేక్ అనే మాట ఇప్పుడేదో కొత్తగా వినిపిస్తున్నదేమీ కాదు. తెలుగు సినిమాకు పెద్ద బాలశిక్ష లాంటి మాయాబజార్ రీమేకే.. అంత కన్నా ముందు వచ్చిన శశిరేఖా పరిణయంను మాయాబజార్‌గా అద్భుత దృశ్యకావ్యంగా మలిచారు. ఎన్టీఆర్ పరమానందయ్య శిష్యుల కథ కన్నా ముందు కస్తూరి శివరావు అక్కినేని నాగేశ్వరరావుతో పరమానందయ్య శిష్యుల కథ తీశారు. కథలో మార్పులు చేర్పులు ఉండొచ్చు కానీ పరమానందయ్య, వాళ్ల శిష్యుల తీరులో మార్పు ఉండదు కదా?


అప్పట్లో చాలా పెద్దవాళ్లకు మాత్రమే చిన్ననాటి విషయాలు చెప్పే చాన్స్ ఉండేది. నా చిన్నప్పుడు అంటూ మహాత్మాగాంధీ లాంటి నాయకులకో, మహాకవుకో రాసుకునే చాన్స్ ఉండేది. ఫేస్‌బుక్ పుణ్యమా అంటూ అందరికీ చిన్ననాటి సంగతులు రాసుకునే గుర్తు చేసుకునే అవకాశం లభించింది. మనం చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నట్టే సినిమా పెద్దలకు వృత్తిలోకి వచ్చిన కొత్తలో తీసిన సినిమాలను గుర్తు చేసుకోవడం ఓ సరదా.. అలానే రామానాయుడు ఆ మధ్య రాముడు భీముడును రీ మేక్ చేయాలనుంది అని మాటవరుసకు ఎక్కడో అంటే ఏ పాత్రకు ఎవరు సరిపోతారు అంటూ మీడియాలో బోలెడు కథనాలు. గుండమ్మ కథపై కూడా ఇలానే పేజీలకు పేజీలు కథలోచ్చాయి. ఏ పాత్రకు ఎవరు సరిపోతారు అంటూ నటీనటులను ఎంపిక చేసేశారు. అన్ని పాత్రలకు అందరూ దొరుకుతున్నారు కానీ సూర్యకాంతం పాత్రకే ఎవరూ దొరకరు అని ఒకరు తేల్చేస్తే, అందరూ దొరక వచ్చు కానీ ఎస్‌వి రంగారావుకు సరిపోయే నటుడు ఎవరూ లేరని మరి కొందరు తేల్చేశారు. దీనిపై వాదోపవాదాలు బాగానే జరిగాయి కానీ ఆ సినిమా రీమేక్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ మధ్య అభిషేక్ బచ్చన్‌ను మీ నాన్న సినిమాల్లో దేన్ని రీమేక్ చేస్తే మీరు నటిస్తారు అని అడిగితే ఆయన నవ్వి ఏదీ రీమేక్ చేయవద్దని వేడుకున్నారు. ఆయనది సరైన నిర్ణయమే ఎందుకంటే రాంగోపాల్ వర్మ లాంటి వారే షోలేను ఆగ్ అంటూ రీ మేక్ చేసి ఇంత చెత్త సినిమా ఇంత వరకు రాలేదని తానే తిట్టుకున్నారు. 

చిరంజీవి కుమారుడు హిందీలో అడుగు పెట్టడానికి జంజీర్‌ను రీమేక్ చేస్తే, ఆ సినిమా కొట్టిన దెబ్బకు హిందీలోనే కాకుండా తెలుగులోనూ దెబ్బలు తగిలాయి. సూపర్ స్టార్ కృష్ణలాంటి వారు దేవదాసును రీమేక్ చేసి దెబ్బతిన్నారు. సినిమాలో కృష్ణ విజయనిర్మల నటన బాగున్నా, రీమేక్ కావడంతో అబ్బే అక్కినేనిలా నటించలేదు అని పెదవి విరిచారు. ఇలాంటి దాన్ని ముందే ఊహించి కృష్ణ సూపర్ హిట్ సినిమా అల్లూరి సీతారామరావు రీమేక్‌కు ఎన్టీఆర్ ససేమిరా అన్నారు.
ఈ మధ్య కూడా దేవదాసు, ప్రేమ్ నగర్ లాంటి సినిమాల రీమేక్ గురించి కొంత చర్చ జరిగినా, రీమేక్ చేస్తే ఏమవుతుందో తెలిసే వౌనంగా ఉండిపోయారు. నిజానికి అద్భుతమైన కళాఖండాలను కావాలంటే మళ్లీ మళ్లీ చూసుకోవచ్చు కానీ రీమేక్ చేసి చెడగొట్టడం ఎందుకు? ఈ ఆలోచనతోనే మాయాబజార్‌ను రీమేక్‌కు బదులు రంగుల్లోకి మార్చి ఊరుకున్నారు. విశ్వామిత్రుని నుంచి సినిమాల వరకు అన్ని చోట్ల రీమేక్ ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎందుకుండదు?


82లో ఎన్టీఆర్ తెలుగుదేశంను ప్రారంభిస్తే, 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో దాన్ని రీమేక్ చేయాలని చూసి దెబ్బతిన్నారు. నిజానికి 82నాటి టిడిపిని 95లో ఎన్టీఆర్ రీమేక్ చేయాలని ప్రయత్నిస్తేనే సాధ్యం కాలేదు. అదేదో సినిమాలో కోట శ్రీనివాస్ మహాభారతంను తెలంగాణలో మాండలికంలో చెబుతూ సావిత్రమ్మ ఎస్‌వివోడు పిలిస్తేనే రాలేదు అంటూ ఏదో చెబుతాడు. అలానే ఎన్టీఆర్ పెట్టిన పార్టీని  ఆయనే మళ్లీ రీమేక్ చేయాలని చూస్తే సాధ్యం కానప్పుడు చిరంజీవికి సాధ్యం అవుతుందా? 82 నాటి టిడిపి కాపీ రైట్ హక్కులు అల్లుడు లాగేసుకోవడంతో దాన్ని ఎన్టీఆర్ టిడిపి అని రీమేక్ చేయాలని చూసి ఎన్టీఆర్ ఘోరంగా దెబ్బతిన్నారు.
77 అత్యవసర పరిస్థితి తరువాత పుట్టిన జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలో మేధావులు ఎక్కువ కావడం, అనుచరుల కన్నా మహామేధావులైనా నాయకులు ఎక్కువ కావడం వల్ల ఎక్కువ రోజులు నిలువలేకపోయింది. జనతాను రీమేక్ చేయాలని అప్పటి నుంచి చాలా ప్రయత్నాలు జరిగినా సాధ్యం కాలేదు. కానీ జనతా నుంచి తమ ముక్కను తాము తీసుకుని జనసంఘ్ బయటకు వెళ్లి బిజెపి పేరుతో జనసంఘ్‌ను రీమేక్ చేసి అధికారం చేపట్టారు. ఇప్పుడు ఒరిజినల్ కన్నా జనసంఘ్ రీమేక్ బిజెపి బలంగా ఉంది.


 ఏమవుతుందో తెలియదు కానీ గాంధీల శకం ముగిసినట్టేనని, మోదీ శాశ్వత ప్రధాని అని మీడియాలో ప్రచారం బాగానే జరుగుతోంది. తెలంగాణ ప్రజాసమితిని కొంచం అటూ ఇటూ మార్చి అదే లక్ష్యంతో తెలంగాణ రాష్టస్రమితిగా రీమేక్ చేసి కెసిఆర్ సక్సెస్ అయ్యారు. ఒకటి అర సందర్భాలు మినహాయిస్తే, తెలుగునాట రాజకీయాల్లో రీమేక్‌లు పెద్దగా సక్సెస్ అయిన సందర్భాలు లేవు. రాజకీయాల్లో వామపక్షాలు రీమేక్‌కు లొంగనివి. వాటికి రీమేక్ ఉండదు, ఒరిజినల్‌కు భవిష్యత్తు ఉండదు. 

26, అక్టోబర్ 2014, ఆదివారం

తెలుగులో తొలిసారిగా స్టార్ ఇమేజ్ పొందిన హాస్యనటి గిరిజ విషాద జీవితం-...ధనం -మూలం 16


పాతాళభైరవిలో ఎన్టీఆర్‌ను నరుడా ఏమీ నీ కోరిక అని అడిగేది ఎవరో గుర్తుందా? ఆమె గిరిజ. ఎన్టీఆర్‌ను ఏమీ నీ కోరిక అని దేవతగా అడిగిన గిరిజకు నిజజీవితంలో మాత్రం ఏ దేవుడు దయనీయమైన స్థితిలో ఉన్న ఆమె జీవితాన్ని కాపాడలేకపోయారు. దేవతా ఏమి నీ కోరికా అని అడగలేదు . 

సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టు అని రేలంగి పాడితే కంపు కొట్టు ఈ సిగరెట్టు కాల్చకోయి నాపై ఒట్టు అని గిరిజ ఒక్క ముక్కలో సిగరెట్టు బడాయిని తీసిపారేస్తుంది.


కాశీకి పోయాను రామా హరి గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి అని రేలంగి అంటే కాశీకి పోలేదు రామా హరి ఊరి కాల్వలో నీళ్లండి... మురికి కాల్వలో నీళ్లండి రామా హరి అని గిరిజ రేలంగి కపట సన్యాసాన్ని బయటపెట్టేస్తుంది. ఈ పాటలు గుర్తున్నాయా?
ఆ పాటల్లోనే కాదు అన్ని సినిమాల్లోనూ ఆమెది సరదా పాత్రలే. సినిమాలో నవ్వించడమే కాదు. నిజ జీవితంలో సైతం ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. చిన్నా పెద్దా అందరినీ నవ్వుతూ పలకరించేది. రేలంగి, గిరిజ ఉన్నారంటే ఆ సినిమా గ్యారంటీ హిట్టు అనే గట్టి నమ్మకం ఉండేది ఆ రోజుల్లో.
సినిమాల్లో ఆమెది ఎంత సరదా పాత్రనో, సినిమా వైభవం ముగిశాక నిజ జీవితంలో అంత విషాద ముగింపు ఆమె కథ.

***
గిరిజ ఎవరో ఈ తరం వారికి తెలియక పోవచ్చు. తెలుగులో తొలిసారిగా స్టార్ ఇమేజ్ పొందిన హాస్యనటి. ఇప్పుడు మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ ఎంత గొప్ప హీరోలైనా కావచ్చు ఆ సినిమా హిట్టు కావాలంటే బ్రహ్మానందం ఉండాల్సిందే.. అలానే 50-60 ప్రాంతాల్లో సినిమా సూపర్ హిట్టు కావాలంటే రేలంగి, గిరిజ జంట ఉండాల్సింది. వీరుంటే సినిమా హిట్టు అని ఆ కాలం నాటి తెలుగు సినిమా సక్సెస్ ఫార్ములా . హాస్యనటిగా నటిస్తూనే ఎన్టీఆర్, ఎన్‌ఆర్ లాంటి అగ్రనటులతో హీరోయిన్‌గా నటించిన ఘనత ఆమెదే. గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల నటి దాసరి తిలకం. ఆమె సినిమాల్లో కూడా నటించింది. 1946లో వచ్చిన వరూధినిలో ఆమెలో నటించారు. గిరిజ కుమార్తె శ్రీరంగ దాసరి నారాయణరావు నిర్మించిన మేఘసందేశంలో అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించింది. మూడు తరాల నట కుటుంబంగా తొలి ఘనత ఆమెదే. కానీ ఏం లాభం సినిమాల్లో సంపాదించిందంతా సినిమాలకు అర్పితం చేసి ఏమీ నిరుపేదగా జీవితాన్ని ముగించింది.

***
ఆనాటి సినీనటి గిరిజ జీవితంలో రీళ్లు చాలా వేగంగా కదిలిపోయాయి. మహారాణిలా జీవించిన గిరిజ సినిమా కథలానే ఊహించని మలుపులతో ఇల్లు గడవడం కోసం చేయి చాచాల్సిన స్థితిలో పడిపోయింది.
ఆమె ఎక్కువగా హాస్య ప్రధానమైన పాత్రల్లోనే నటించింది. కోట్లాది మందిని దశాబ్దాల పాటు నవ్వుల్లో ముంచెత్తింది. కష్టాలు మరిచిపోయి ఆ మూడు గంటల పాటైనా నవ్వుకునే అవకాశం ఆమె సినిమాల్లో దొరికేది. కానీ చివరకు ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసిపోయింది.
***
‘‘మా కాలంలో తల్లిదండ్రులే అన్ని వ్యవహారాలు చూసుకునే వారు. ఇప్పుడున్నట్టుగానే భవిష్యత్తు ఉంటుందనే భరోసా లేదు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి అనే ఆలోచనలు మాకు ఉండేవి కాదు అంతా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు అనుకునే వాళ్లం. ఆమె ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండేది. గిరిజకు పెళ్లయిన తరువాత గిరిజ భర్త దర్శకత్వంలోనే ఆమె జీవితం సాగింది. మద్రాస్‌లో పెద్ద భవంతి కూడా ఉండేది. అంతా పోయింది. గిరిజ జీవితం ఇలా అయిపోయింది అని షూటింగ్‌లో ముచ్చట్లు వినిపించేవి.’’ అంటూ ఆమె సహనటి ఒకరు గిరిజ గురించి చెప్పారు.
గిరిజ 17 ఏళ్ల వయసులో ఉండగా, తల్లి మరణించింది. ఒక్క క్లిక్‌తో ప్రపంచంలోని సమాచారం మొత్తం కళ్ల ముందు కనిపించే ఈ కాలంలోనే ఐటి ఉద్యోగికి సైతం మనీ మేనేజ్‌మెంట్ గురించి తెలియదు. ఇక 17 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. తళుకుబెళుకుల సినిమా ప్రపంచంలో రారాణిగా వెలిగిపోతున్న గిరిజకు మనీ మేనేజ్‌మెంట్ ఎలా తెలుస్తుంది. తెలియకపోవడమే ఆమె పాలిట శాపం అయింది.

తొలి కామెడీ స్టార్ కస్తూరి శివరావు 1950లో తానే దర్శకత్వం వహించి నిర్మాతగా పరమానందయ్య శిష్యుల కథ సినిమా తీశారు. అదే గిరిజకు తొలి సినిమా. అందులో అక్కినేని హీరో, గిరిజ హీరోయిన్. వైభోగాన్ని అనుభవించిన కస్తూరి శివరావు జీవిత చరమాంకంలో దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. అందులో హీరోయిన్‌గా నటించిన గిరిజ జీవితం కూడా దాదాపు అలానే ముగిసింది. హాస్యనటి గానే కాకుండా అగ్ర నటులు ఎన్టీఆర్ మంచిమనసుకు మంచిరోజులు, ఏఎన్‌ఆర్‌తో వెలుగునీడలు, శివాజీ గణేశన్‌తో మనోహర, హరనాథ్‌తో మా ఇంటి మహాలక్ష్మి వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆనాటి అగ్ర నటులతో పోటీపడి నటించడమే కాదు ఆమె సంపాదన కూడా అలానే ఉండేది.
సియస్‌రాజు అనే దర్శకుడ్ని ఆమె పెళ్లి చేసుకుంది.

పరిస్థితుల్లో క్రమంగా మార్పు... కొత్త వారు రంగ ప్రవేశం చేశారు. మార్పును గిరిజ కొంత వరకు అర్థం చేసుకుంది. కొత్త నీరు వచ్చింది తాను తప్పుకోవాలి లేదా తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అంత వరకు బాగానే ఉంది కానీ భవిష్యత్తుపై దృష్టిపెట్టి రేపటి కోసం పెట్టుబడి అనే ఆలోచన చేయలేదు. అప్పటి వరకు సంపాదించిన ఆస్తిని వేగంగా కరిగిపోతుంటే చూస్తూ ఉండిపోయింది. మారిన పరిస్థితులను గ్రహించిన గిరిజ ఇక ఒక ఇంటి దాన్ని కావాలనుకుంది. కానీ భర్తను నిర్మాతగా నిలబెట్టాలని ప్రయత్నించి తాను రోడ్డున పడింది.

సి సన్యాసి రాజు గిరిజ భర్త. విజయగిరి ధ్వజాప్రొడక్షన్స్‌ను స్థాపించి 69లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో భలే మాస్టారు సినిమా తీశారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్ చంద్రకళతో పవిత్ర హృదయాలు తీశారు. ఆ సినిమా అంతే. గిరిజ ఆస్తులు వేగంగా కరిగిపోవడం ప్రారంభమైంది. మద్రాస్‌లో ఆమెకు రెండంతస్థుల విశాలమైన భవనం ఉండేది. ఆమె భర్త నిర్మాతగా మారిన తరువాత ఆ భవనం చేజారిపోయింది. ఆమె అప్పుల్లో కూరుకు పోయింది. రేలంగి మరణించిన తరువాత ఆమెకు సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయి.

1937లో పుట్టిన గిరిజ గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాస్‌లో తల్లి వద్దకు వెళ్లింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. కస్తూరి శివరావుకు ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా రేలంగి పరిచయమయ్యారు. ఆయన ప్రయత్నంతోనే పాతాళభైరవిలో అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. హీరో, హీరోయిన్‌లతో సమానంగా గుర్తింపు పొందారు.
అచ్చం సినిమా కథలా పెద్ద భవంతిని వదిలి చిన్న అద్దె గదిలోకి మారింది. పూట గడవడానికి కూడా తెలిసిన వారి ముందు చేయి చాచాల్సిన పరిస్థితి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. గిరిజ తారగా ఒక వెలుగు వెలిగే కాలంలో ఆమె వైపు చూసేందుకు కూడా సాహసించని అనారోగ్యం, పేదరికం, చివరి రోజుల్లో మాత్రం ఆమెను అంటిపెట్టుకొని ఉన్నాయి. తెలిసిన వారు కూడా గుర్తు పట్టలేని స్థితి. ఆ తరం నటీమణులు రాజశ్రీ, భీష్మ సుజాత వంటి వారు ఎంతో కొంత సహాయం చేసి ఆదుకున్నారని సినిమా వాళ్లు చెబుతారు.
గిరిజా ఏమీ నీ కోరిక అని చివరి దశలో ఆమెను తోటి నటులు అడిగి ఉంటే బాగుండేది. కనీసం ప్రశాంతంగా కన్ను మూసి ఉండేది.

డబ్బును మనం గౌరవిస్తే అణకువగా సేవకునిలా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఎంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటుందో కొందరు సినిమా వారి జీవితాలను చూసి నేర్చుకోవచ్చు. * 

21, అక్టోబర్ 2014, మంగళవారం

లైఫంతా పైసాతోనే ...

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు రోడ్డెక్కిస్తే.. ట్రాఫిక్ కానిస్టేబుల్ చటుక్కున పట్టుకుని చలానా రాసేస్తాడు.
***
వెంట అమ్మాయి లేకుంటా పబ్బుకి అడుగుపెడితే.. బౌన్సర్ గుమ్మం నుంచే మెడపట్టుకుని బయటకు గెంటేస్తాడు..
***
ఐడి కార్డు లేకుంటే ఆఫీసుకి వెళ్తే.. సెక్యూరిటీ గార్డు గేటులోనే కాసేపు నిలబెడతాడు.
***
కింది క్లాసులో పరీక్ష తప్పితే..స్కూలు ప్రిన్సిపాల్ పై తరగతికి చచ్చినా అనుమతించడు..
***
ఇన్ని పనులకు ఇన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ, ప్రతి పనికీ అవసరమయ్యే నిబంధన -డబ్బు. ప్రతి రోజూ ప్రతి క్షణం డబ్బుతో పనిలేని పని ఉండదు. కానీ ఆర్థిక అక్షరాస్యత లేకున్నా -జనం మాత్రం బతుకు బండి లాగించేస్తున్నారు. ఇక్కడ మనమూ ఓ నిబంధన పెట్టుకుంటే...?
==================
ఎలాగోలా బతికేద్దామని అనుకుంటే ఫరవాలేదు. కానీ ఆర్థికంగా ఎదగాలనే నిబంధన పెట్టుకుంటే మాత్రం ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాల్సిందే. కొత్తగా కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన కాలంలో -50ఏళ్ల పెద్దాయనకు  కూడా పాతికేళ్ల టీచరమ్మ పాఠం చెప్పేది. అక్కడ విద్య, కంప్యూటర్‌పై నైపుణ్యం అవసరం కనుక వయసుతో సంబంధం లేదు. కొత్త టెక్నాలజీకి అలవాటు పడకుంటే వెనకబడిపోతామన్న భయం ఉండేది కనుక -పాతికేళ్ల పిల్ల దగ్గర కూడా 50ఏళ్ల పెద్దలు  అవసరం కొద్దీ కంప్యూటర్ విద్యను ఔపోసన పట్టేవారు. ఆర్థిక అక్షరాస్యతా అలాంటిదే. వయసుతో సంబంధం లేదు. పుట్టిన దగ్గర్నుంచీ చచ్చేవరకూ -జీవితంలో ప్రతి దశా డబ్బుతోనే ముడిపడి ఉంది కనుక ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పెంచుకోవడం అనివార్యం. అదులోనూ -యువతకు మరీ మఖ్యం.
**
దేశ జనాభాలో యువత శాతం 60కి పైనే. ప్రపంచంలో మరే దేశానికి ఇంత పెద్ద శక్తి లేదు. సమర్థంగా పని చేయగల వయసు, సంపాదనలో నాలుగు డబ్బులు వెనకేయాలన్న మనసు -ఈ దశలోనే పదిలపర్చుకోవాలి. అంటే -20 ఏళ్ల వయసునుంచే ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవాలంటున్నారు నిపుణులు. ఇప్పటికే 30వ పడిలోకి వచ్చేసివుంటే -ఆలోచించకుండా మొదలు పెట్టాలనీ సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు వెలగబెడుతూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్న వాళ్లకు సైతం -ఆర్థిక అంశాలపై ఏమాత్రం అవగాహన ఉండటం లేదని లెక్కలేనన్ని సర్వేలు గగ్గోలు పెడుతున్నాయి కనుక.
***
కాలం మారింది. కనుక -రెండు పదుల వయసునుంచే సంపాదన మొదలు పెట్టేస్తోంది యువత. ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించడానికీ ఇదే పదునైన టైం అన్నది నిపుణుల మాట. 20 ఏళ్ల వయసులో చేసే పొదుపు అత్యంత శక్తివంతమైంది. ఎందుకంటే ఈ వయసులో దాచింది.. మీకు 40ఏళ్లు వచ్చేసరికి పది రెట్లు విలువకు చేరి కూర్చుంటుంది. అంటే 20ల్లో వెయ్యి దాస్తే నలభైల్లోకి వచ్చేసరికి విలువ పదివేలు అవుతుందన్న మాట. 20ల్లో నెలకు వెయ్యి పొదుపు కష్టం కాదు. కానీ 40ల్లో నెలకు 10 వేలు తీసి పక్కన పెట్టాలంటే చుక్కలు కనిపించడం ఖాయం. ఎలా అన్నదానిపై ఓ ఆర్థిక నిపుణుడు చిన్న చిట్కా చెప్పాడు. 20 ఏళ్ల వయసులో నువ్వు పని చేస్తూ జీతం పొంది, అందులో వెయ్యి దాస్తే, ఆ పొదుపు చేసిన సొమ్ము కూడా నీకోసం పని చేయడం మొదలు పెడుతుంది. అంటే, డబుల్ ఇన్‌కం స్టాయికి చేరకుంటున్నావన్న మాట. రిటైర్మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని 30 ఏళ్ల వయసునుంచైనా పొదుపు ప్రారంభిస్తే, అదే భవిష్యత్‌కు పెద్ద భరోసా అవుతుందని అంటున్నారు నిపుణులు. దీన్ని వ్యాపార కోణంలో కాకుండా, సామాన్యుడి జీవిత కోణం నుంచే చూడాలని కూడా సలహా ఇస్తున్నారు. సొంత ఇల్లు, పిల్లల చదువు, వారి భవిష్యత్, రిటైర్మెంట్ తరువాత ప్రశాంత జీవితం.. -వీటన్నింటికీ 20ల్లో ప్రారంభమయ్యే పొదుపే మూలం అంటే నమ్మగలమా? కానీ, నమ్మితీరాలి.
ఉన్నత విద్యావంతులైనా -కంప్యూటర్ పరిజ్ఞానం లేకుంటే ఆధునిక నిరక్షరాస్యులే అన్నట్టుగానే -ఇప్పుడు డబ్బు వ్యవహారాల్లో కనీస అవగాహన లేకుంటే ఆర్థిక నిరక్ష్యరాస్యుల కిందే లెక్క. సంపాదన ఎంత? ఖర్చు ఎంత? పొదుపు ఎంత? ఎక్కడ ఇనె్వస్ట్ చేయాలి? ఎలా ఇనె్వస్ట్ చేయాలి? ఇనె్వస్ట్ చేసిన మొత్తం ఎంతకు పెరగొచ్చు. దీనివల్ల అదనంగా వచ్చే ఫలం, ప్రతిఫలం ఏమిటి? ఇత్యాది కనీస లైఫ్ లెక్కలు నేర్చుకోవలసిన వయసు యువతది.
**
తప్పదు నేర్చుకోవాలి. పిఎఫ్, ఇపిఎఫ్, జిపిఎఫ్, ఆదాయం పన్ను శాఖ నుంచి వచ్చే రాయితీ? చట్టబద్ధంగా పన్ను రాయితీ కోసం ఎలాంటి పెట్టుబడులు ఎంపిక చేసుకోవాలి? మారుతున్న ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ వివరాలు? రిటైర్మెంట్ తరువాత చేతికివచ్చే పెన్షన్.. అప్పటికి అది సరిపోతుందా? లేకపోతే ఏం చేయాలి? వీటన్నింటిపైనా కనీస అవగాహన అవసరం. ఇన్‌స్టాల్‌మెంట్స్‌పై కారు కొనడం మంచిదేనా? వడ్డీ ఎంతవుతుంది? కారు అవసరమా? ఇలాంటివన్నీ ఎవరి పరిస్థితిని బట్టి వారే లెక్కలువేయాలి? గృహ రుణాలు, విద్యా రుణాలు, బీమావంటి వాటిపై అవగాహన ఉందా? క్రెడిట్ కార్డు వరమా? శాపమా? కార్డు ఉంటే జేబులో డబ్బులకట్టలు ఉన్నట్టేనా? తిరిగి కట్టాలనే ఆలోచన చేసిన తరువాతే క్రెడిట్ కార్డు ఉపయోగించాలనే విషయం మీకు తెలుసా? ఆన్‌లైన్‌లో ఐటి రిటర్న్స్ దాఖలు చేయడం వచ్చా? మీ క్రెడిట్ కార్డుపై వసూలు చేసే ఫీజుల గురించి మీకు తెలుసా? క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు సకాలంలో చెల్లిస్తే ఏమవుతుంది? చెల్లించక పోతే ఏంనష్టం? సిబిల్ క్రెడిట్ రిపోర్ట్ స్కోరింగ్ గురించి తెలుసా? మీ క్రెడిట్ రేటింగ్‌పై ప్రభావం చూపించే అంశాలపై మీకు అవగాహన ఉందా? జీవితం అంతా డబ్బు చూట్టే తిరుగుతుంది అనేది నిజం.
అలాంటప్పుడు డబ్బు వ్యవహారాలపై అవగాహనకు ఆలస్యం ఎందుకు? మీరు సంపాదించే డబ్బును ఖర్చు చేస్తున్నప్పుడు ప్రతి రూపాయి వ్యయం గురించి మీకు అవగాహన ఉండాలి. అది ఇప్పుడైనా మొదలుపెట్టండి.

19, అక్టోబర్ 2014, ఆదివారం

గుండెల్లో నిద్ర పోతా...!అను జర్నలిస్టో పాఖ్యానం

మీడియా వాళ్లు అంతా వచ్చారా? ’’ అని అప్పటికి మూడవ సారి అడిగారు పొన్నాల.
‘‘లేదు సార్’’ అని చెప్పగానే అలాగా అని పొన్నాల నిద్రలోకి జారుకున్నారు.
కెమెరా మెన్‌ల తొక్కిసలాట రిపోర్టర్ల హడావుడితో నిద్ర నుంచి మేల్కొన్న పొన్నాల ‘‘గుండెల్లో నిద్ర పోతా’’ అంటూ ఆవేశంగా పలికారు.
‘‘సార్ ఇంకా అందరూ రాలేదు. ముందు కెమెరాలను సెట్ చేయనివ్వండి. మీరిలా ఇష్టం వచ్చినప్పుడు అలా డైలాగు చెబితే ఎమోషన్ పోతుంది. మేం లేపుతాం కదా’’ అని భరోసా ఇవ్వడంతో పొన్నాల మళ్లీ నిద్రలోకి జారుకున్నారు.


ప్రెస్‌కాన్ఫరెన్స్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో అక్కడున్న కొందరు విలేఖరులు పొన్నాల చాంబర్‌లోకి వెళ్లారు. పొన్నాల వారిని చూడగానే లేచి ఏదో చెప్పి పక పకా నవ్వాడు. కొత్తగా వచ్చిన జర్నలిస్టు ఒకరు కంగారు పడి భయం భయంగా చూసి గది బయటకు వచ్చాడు.
హాలులో ఉన్న సీనియర్ ఒకరు అతని భుజంపై చేయి వేసి ‘‘్ఫల్డ్‌కు కొత్తనా?’’ అని ఆప్యాయంగా పలకరించాడు.


‘‘ఔను బాబాయ్ మా తాత కోరికపై వచ్చాను. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రూలతో పాటు ఆనాటి ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులంతా జర్నలిస్టులుగానే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని నన్ను ఎలాగైనా జర్నలిస్టును చేయాలని మా తాత పట్టుపట్టి పంపించాడు. ఇక్కడంతా గందరగోళంగా ఉంది. ఒక్కరూ నిజం చెప్పరు. నాయకులే కాదు మన కళ్లముందు జరిగిందాన్ని కూడా మనం ఉన్నది ఉన్నట్టు చెప్పడం లేదు. ఈ ఉద్యోగం నా వల్ల కాదు హాయిగా ఊరెళ్లి పొలం చేసుకుని బతుకుదామనుకుంటున్నాను’’ అని కుర్ర జర్నలిస్టు విరక్తిగా చెప్పుకొచ్చాడు.
బాబాయ్ సిగరెట్ వెలిగించి జ్ఞానబోధకు సిద్ధమవుతూ గట్టిగా పొగ పీల్చి నవ్వుతూ పక్కనే ప్రెస్ క్లబ్ ఉంటుంది అక్కడికి వెళ్లి మాట్లాడుకుందాం పదా అని తీసుకెళ్లాడు.


‘‘పొన్నాల జోకుకే నువ్విలా బెంబేలెత్తిపోతే ఎలా ? తానేదో జోకు చెప్పానని ఆయన ఉద్దేశం. మనకు వార్త కావాలంటే భలే జోకు చెప్పారు సార్ అంటూ మనం కూడా నవ్వాలి అలా నవ్వితేనే మనకు వార్తలు వస్తాయి. ఇలా భయపడితే నాయకుడు బెదిరిపోతాడు. చేపను పట్టేప్పుడు వల వేసేవాడికి ఎంత ఓపిక ఉండాలో ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు వచ్చిన జర్నలిస్టుకు అంత ఓపిక ఉండాలి. నాయకుల నుంచి కూపీ లాగేందుకు అంతకన్నా మించి ఓపిక ఉండాలి’’ అని బాబాయ్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఎన్నింటినో తట్టుకుంటే కానీ రంగంలో నిలువలేం.
ఇంకా చెబుతూ ‘‘చూడు బ్రదర్ పొన్నాలకే ఇలా బయపడితే కుందూరు జానారెడ్డి వస్తే ఏమవుతావు. ఏ డిక్షనరీలోనూ కనిపించని ఆయన తెలుగును విని తట్టుకుంటే కానీ ఈ యుద్ధ రంగంలో నిలువలేవు’’ అని బాబాయ్ అనునయించాడు.
‘‘బాబాయ్ ఆయన జోక్ చెప్పాడా? నామీద ఒట్టేసి చెప్పు ఆయన గట్టిగా నవ్వడం ఏదో అర్ధం కాని మాటలు మాట్లాడం తప్ప అందులో జోకేముంది బాబాయ్’’ అని జూనియర్ అమాయకంగా అడిగాడు.
‘‘పిచ్చివాడా! నీకు జోకులే కావాలంటే ఇలీబన్ బస్‌స్టేషన్‌కెళ్లి బుక్‌స్టాల్‌లో జోకుల బుక్ తీసుకో, పది రూపాయలకు వెయ్యి జోకులు దొరుకుతాయి. కానీ వార్తలు కావాలంటే నాయకులు జోక్ అని భ్రమించి ఏం చెప్పినా వారితో పాటు పక పక మని నవ్వాలి అప్పుడే వార్తలు దొరుకుతాయి’’అని బాబాయ్ వృత్తి రహస్యం విప్పి చెప్పాడు.


‘‘బాబాయ్ మీరు ఎంత చెప్పినా నాకు మాత్రం ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. మా ఊరెళ్లి వ్యవసాయం చేసుకోవాలనిపిస్తోంది,’’ అన్నాడు.
‘‘ఇది పద్మవ్యూహం. లోపలకు రావడమే కానీ బయటకు వెళ్లడానికి దారి ఉండదు. విజయమో వీర స్వర్గమో ఇక్కడే తేల్చుకోవాలి. యుద్ధ రంగంలోకి ప్రవేశించేంత వరకే నీ ఇష్టా ఇష్టాలతో పని. ఒక్కసారి ప్రవేశించాక ఎవరో ఒకరితో యుద్ధం చేస్తూనే ఉండాలి. నీ దారిలో పొన్నాల జోకులు, జానారెడ్డి మాటలు నిన్ను కలవరపెట్టొచ్చు, రోజుకు ఆరుసార్లు గంటన్నర పాటు సాగే బాబు విలేఖరుల సమావేశాలు. ఆరునెలలైనా మీడియా ముందుకు రాని కెసిఆర్ చిన్నచూపు. అన్నింటినీ నువ్వు భరించి ముందుకు వెళ్లాలి. తారా చౌదరి నైతిక విలువల గురించి బోధించినా, స్టే తెచ్చుకున్న నేత అవినీతి రహిత సమాజం గురించి మాట్లాడినా, బెయిల్‌పై వచ్చిన నేత నిజాయితీ గురించి మాట్లాడినా చెవులతో వినాలి. 


వంద రోజుల్లో విదేశాల నుంచి నల్లధనం తెప్పిస్తామని మోదీ చెప్పినప్పుడు మౌనంగానే వినాలి, అధికారంలోకి వచ్చాక ఒప్పందాలు ఉన్నాయి నల్లధనం వివరాలు కోర్టుకు చెప్పం అని ఆదే మోదీ చెప్పినా  వినాలి. అదిగో అటు చూడు సోఫాపై అలా పడుకున్న ఆ వృద్ధ యోధున్ని  చూశావా?  అయన పక్కన పోర్క్ తో చికెన్ ను పొడుస్తున్నాడు చూడు  ఆ వృద్ధ యోధుడు   నీలానే ఏదో పొడిచేద్దామని వచ్చారు. కొంత కాలం నశాన్ని, తరువాత చుట్టలను, ఇప్పుడు సిగరెట్లను పీల్చేస్తూ చికెన్ మంచూరియాను పొడుస్తూ కాలం గడుపుతున్నారు. ఈ భవనంలో ఏదో ఓ మూల వాలిపోయే వృద్ధ భీష్ములు. అదిగో అటు చూడు పచ్చని భారీ కారులో వస్తున్న అతను ఒకప్పుడు నీలానే బెరుకు బెరుకుగా భాగ్యనగరంలో అడుగు పెట్టాడు. అలాంటి కార్లు అతనికి బోలెడున్నాయి. తిండికి ఠిఖాణా లేనివాళ్లు, కోట్లకు పడగెత్తిన వారు అంతా ఉన్నారిక్కడ. అటు చూడూ గడ్డం మధ్యలో ముఖం కనిపిస్తుందా? మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు తమ మేధాస్సు అంతా ఈ గడ్డంలోనే ఉందని నమ్మే వీళ్లో రకం. ఔట్ సోర్సింగ్ ద్వారా కొన్నిసార్లు బయటి నుంచి కొందరిని రప్పించుకుని మేధోప్రదర్శన చేస్తుంటారు ఇలాంటి జీవులు’’ అని బాబాయ్ సుదీర్ఘంగా వివరించాడు.
‘‘సరే బాబాయ్ టైం అవుతుంది వెళదామా?’’ అని అడిగాడు.
‘‘నువ్వు వెళ్లు’’ అని బాబాయ్ చెపితే, ‘‘నాకు దారి తెలియదు అక్కడిదాకా రావచ్చు కదా?’’ అని అడిగాడు.


‘‘చూశావా? ఈ క్లబ్బు నుంచి బయటకు వెళ్లే దారే నీకు తెలియదు. ఇక ఈ వృత్తి నుంచి బయటకు ఎలా వెళతావు అది చెప్పడానికే అలా అన్నాను .పద నేనూ వస్తాను,’’ అని జూనియర్ భుజంపై చేయి వేసి బాబాయ్ పొన్నాల దగ్గరకు వచ్చాడు.
నిద్రలేచి హాలులోకి వచ్చిన పొన్నాల ‘‘కెసిఆర్ గుండెల్లో నిద్ర పోతాను,’’ అంటూ ఆవేశంగా ఏదో చెప్పి తిరిగి నిద్ర పోవడానికి తన చాంబర్‌కు వెళ్లిపోయారు.

ఓ పొరపాటు ఆ హీరో జీవితాన్ని కాటేసింది

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే  కొట్టాలంటారు. లక్ష్యం మంచిదే కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకునేప్పుడు నీ శక్తిసామర్ధ్యాలను కూడా సరిగా అంచనా వేసుకోవాలి. లేకపోతే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని ప్రయత్నించిన వారే ఏనుగు చేతిలో కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే జరిగితే హీరో జీవితం కూడా తలక్రిందులవుతుంది. అచ్చం అలనాటి ఆంధ్రా కమల్ హాసన్‌లానే... నీడలేని ఆడది సూపర్ హిట్ సినిమాతో హీరోగా తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసిన నరసింహరాజు చిన్న పొరపాటు వల్ల నీడలేని హీరోగా మారిపోయారు.

మీకు టీవి సీరియల్స్ చూసే అలవాటు ఉంటే నర్సింహరాజును చూడగానే గుర్తుపడతారు. వయసుకు మించిన వృద్ధుని పాత్రల్లో దర్శనమిస్తుంటారు. 60 ఏళ్ల వారు సినిమాల్లో హీరోలుగా పడుచు హీరోయిన్ల వెంట పడడం మామూలే. కానీ అదే సమయంలో నరసింహరాజు నాలుగు పదుల వయసులో ఏడుపదుల వయసుగల వృద్ధునిలా టీవీ సీరియల్స్‌లో నటిస్తూ గడిపారు.... గడుపుతున్నారు.

ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో జానపద హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరో అతను అంటే నిజమా? అనే ప్రశ్న వస్తుంది.

***
పోలీసు వాడు కొట్టే గుమ్కి దెబ్బలు అస్సలు కనిపించవు. అనుభవించిన వాడికి నొప్పి ఉంటుంది కానీ దెబ్బలు కొట్టినట్టు ఆనవాలు ఉండదు. కొందరు కడుపు మీద కొట్టే దెబ్బలకు మహా మహా హీరోలు సైతం గింగిరాలు తిరిగి పడిపోవాల్సిందే. బతుకు తెరువు కోసం హీరో నుంచి క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా పెద్ద తెర నుంచి బుల్లి తెరకు మారాల్సిందే. ఎన్టీరామారావు, కాంతారావుల తరువాత జానపద సినిమాల హీరోగా నరసింహరాజు తిరుగులేని విధంగా చెలరేగిపోయారు.

34 ఏళ్ల క్రితం వచ్చిన జగన్మోహిని సినిమా తెలుగు సినిమాల చరిత్రలో ఒక రికార్డు. ఆ సినిమా నర్సింహరాజు జీవితంలో మైలురాయి. ఒకటికాదు రెండు కాదు డజన్ల కొద్ది సినిమాల్లో హీరోగా నటించారు. బోలెడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 70-80ల ప్రాంతంలో తిరుగులేని హీరోగా నిలిచారు.
ఏం జరిగిందో, ఎక్కడ తేడా వచ్చిందో కానీ నరసింహరాజు ఎన్టీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. 82లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తే బహిరంగంగానే విమర్శించిన నరసింహరాజు తాను భారతదేశం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ నరసింహరాజు భారతదేశం పార్టీని పెట్టలేదు, సినిమాల్లో కనిపించకుండా అదృశ్యం అయ్యారు.

హీరో ఒంటి చేత్తో విలన్లను చితగ్గొడతాడు సినిమాల్లో... సినిమా రంగంలో హీరో అయినా సరే తోక జాడిస్తే, ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో తెలియకుండా కడుపు మీద చావు దెబ్బలను కొడతారు. అలా తిన్న దెబ్బలు వారిని తిరిగి కోలుకోనివ్వకుండా చేస్తుంది.
సినిమాల్లో అవకాశాల మాట దేవుడెరుగు సినిమా జీవులందరూ ఆయనకు దూరమయ్యారు. నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టే అయనా ఆర్థికంగా పరిస్థితి అంతంతమాత్రమే.

జానపద బ్రహ్మ విఠలాచార్య సినిమాల్లో రాజకుమారుడు ఎలుకగానో, చిలుకగానో మారిపోతాడు. విఠలాచార్య జానపద సినిమాల ద్వారా హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన నరసింహరాజు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సినిమాలకు దూరం కావలసి వచ్చింది. సినిమా అయితే చిలుక రూపంలో ఉన్న రాజకుమారుడు తిరిగి హీరోగా మారుతాడు. కానీ జీవితం కాబట్టి నరసింహరాజుకు శాప విమోచనం కలగలేదు. దాంతో బతుకు తెరువు కోసం టీవీ సీరియల్స్‌లో క్యారక్టర్ నటునిగా నటిస్తున్నారు.

నరసింహరాజును ఆంధ్రా కమల్‌హాసన్ అని పిలిచేవారు. నీడలేని ఆడది, తూర్పు పడమర, కన్యాకుమారి, ఇదెక్కడ న్యాయం, జగన్మోహిని సినిమాలు ఆ రోజుల్లో నరసింహరాజు హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలు. 1974లో నీడలేని ఆడది సినిమాలో హీరోగా చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నరసింహరాజు హీరోగా నిలదొక్కుకున్నారు. వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా ప్రభ, నరసింహరాజులకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక 78లో వచ్చిన జగన్మోహిని విజయం నరసింహరాజును ఎక్కడికో తీసుకు వెళుతుంది అనుకున్నారు. 1974 నుంచి 1980 వరకు నరసింహరాజు కాలం అని చెప్పవచ్చు. ఆరేళ్ల కాలంలో నరసింహరాజు హీరోగా నటించిన దాదాపు 20 సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.

నీడలేని ఆడది(74) అత్తవారిల్లు, తూర్పు పడమర( 76) కన్యాకుమారి, రంభ ఊర్వశి మేనక, అమ్మాయిలూ జాగ్రత్త, ఇదెక్కడి న్యాయం (77) జగన్మోహిని, ప్రయాణంలో పదనిసలు (78) వంటి హిట్ సినిమాల్లో నటించారు. వందకు పైగా సినిమాల్లో నటించిన నరసింహారావు దాదాపు 30కి పైగా హిట్ సినిమాల్లో నటించారు.
మూడు పదుల వయసులో సూపర్ హిట్ చిత్రాల హీరోగా నిలిచిన నరసింహరాజుకు ఆవేశం తప్ప సినిమా రాజకీయాలు అర్థం కాలేదు. కొండను ఢీకొనాలనుకున్నాడు.

అంతే ఒక్కసారిగా అతని పరిస్థితి తలక్రిందులు అయింది. ఎవరు చేశారు, ఎందుకిలా జరిగింది అంటే ఎవరో ఒకరి పేరు చెప్పడానికి ఆధారాలు ఉండవు. నరసింహరాజు పరిస్థితి తలక్రిందులు అయింది అన్నది మాత్రం వాస్తవం. నరసింహరాజు ఆవేశం, ఆలోచనా లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాడు అంటారు సినిమా రంగం గురించి తెలిసిన వారు. అప్పటి వరకు హీరోగా వెలుగొందుతున్న నరసింహరాజుకు ఒక్కసారిగా తలుపులు మూసుకు పోయాయి. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. కొంత కాలం చీకటి లోనే గడిపారు .. 

మరి కొంత కాలం గడిచాక  టీవీలో సీరియల్స్ ప్రారంభమయ్యాయి. సినిమా రంగానికి సంబంధం లేని వారు టీవీ సీరియల్స్ తీశారు. దాంతో మరో దారి లేక నరసింహరాజు టీవీ సీరియల్స్‌ను నమ్ముకున్నారు. దూరదర్శన్‌తో పాటు ప్రైవేటు చానల్స్‌లోని సీరియల్స్‌లో వయసులో ఉండగానే వయసు మీరిన పాత్రల్లో కనిపించడం మొదలు పెట్టారు.

యుద్ధ రంగంలో ఉన్నంత నిజాయితీ, సినిమా యుద్ధంలో ఉండదు. ఎవరైనా కావచ్చు ఫలానా నటునికి అవకాశాలు ఇవ్వవద్దని ఎవరికీ ప్రత్యేకంగా చెప్పకపోవచ్చు. కానీ అతను కొండను ఢీ కొనేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తే, ఎవరికి వారు దూరంగా వెళ్లిపోతారు అది ఏ రంగంలోనైనా సహజమే. దీనే్న నరసింహరాజు ఊహించలేకపోయారు. అతని వయసు అలాంటిది. నరసింహరాజు ఎదుగుతున్న సమయం ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ లాంటి వారు హీరో వేషాలకు దూరం అవుతున్న కాలం. 

దాన్ని ఆయన సరిగా అంచనా వేయగలిగి కొద్దిగా ఓపిక పట్టి ఉంటే నరసింహరాజు భవిష్యత్తు మరో రకంగా ఉండేది. ఒక స్టార్‌గా వెలిగిపోతూ ఉండే వారు. ఒక పొరపాటుకు యుగములు వగచేను అనే పాటలా నరసింహరాజు జీవితంలో సైతం ఒక పొరపాటు ఆయన జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఆవేశం కాదు ఆలోచన ముఖ్యం. ఎదుగుతున్న సమయంలో ముందుకే కాదు పక్కలకు కూడా చూసుకోవాలనే జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది నరసింహరాజు జీవితం. 

ఆ దెబ్బతరువాత నరసింహరాజు ఎక్కడా వివాదాస్పదం కాదు కదా కనీసం పిచ్చాపాటి మాట్లాడినట్టుగా కూడా రిపోర్ట్ కాలేదు. సూపర్ హిట్ హీరో వేషాల నుంచి ఒక్కసారిగా టీవీ సీరియల్స్‌లో చిన్న పాత్రలు సైతం వేసేందుకు తనను తాను మానసికంగా సిద్ధం చేసుకున్న నరసింహరాజును అభినందించాలి. కానీ యుక్తవయసులో ఆయనకు జీవిత రహస్యాలను ఎవరైనా విప్పి చెప్పి ఉంటే ఆ హీరో పరిస్థితి మరోలా ఉండేది. 
*

13, అక్టోబర్ 2014, సోమవారం

వర్మకు శ్రీదేవి ప్రేమలేఖ!

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అని విఫల ప్రేమ  గీతాలు పాడు కుంతున్నరేమో వర్మ...  రాంగోపాల్‌వర్మకు శ్రీదేవిపై ఎక్కడ లేని ప్రేమ. ఆ సంగతిని ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. అయినా రాంగోపాల్ వర్మ కావచ్చు, శర్మ కావచ్చు ఆ కాలంలో శ్రీదేవిని ప్రేమించని వారెవరు? బడిపంతులులో ఎన్టీఆర్‌కు శ్రీదేవి మనవరాలిగా నటించింది. అదే శ్రీదేవితో వేటగాడులో ఎన్టీఆర్ చెలరేగిపోలేదా? శ్రీదేవి అందాన్ని, పాటల్లోని గెంతులను చూశారు తప్ప ఇద్దరి మధ్య వయసు తేడా ఎవరైనా పట్టించుకున్నారా? ఐనా అదే మన్నా మూడు కాలాల పాటు నిలిచే వివాహ బంధమా? మూడు గంటల సినిమా బంధమే కాబట్టి వయసు తేడాను ప్రేక్షకులెవరూ పట్టించుకోలేదు.


ఆ సినిమా శ్రీదేవి అందానికి మెరుగులు దిద్దింది. తాతయ్యలే శ్రీదేవిని ప్రేమించేసినప్పుడు సమ వయస్కులు ప్రేమించడంలో వింతేముంది. అందరిలానే వర్మ శ్రీదేవిని ప్రేమించేశాడు. కానీ ఆ విషయం శ్రీదేవికి చెప్పుకునే చాన్స్ వర్మకు ఉంది, మిగిలిన వారికి లేదు అంతే తేడా! అలాంటి శ్రీదేవి నుంచి వర్మకో లేఖ అందింది. ఫ్రమ్ శ్రీదేవి అని చూడగానే రాంగోపాల్ వర్మ నువ్వా దరినీ నేనీ దరిని అని పాడుకున్నారో లేక తన సినిమాలో దయ్యాన్ని చూసి భయంతో చిత్రంగా వ్యవహరించినట్టుగా ఎగిరి గంతేశారో ఏం చేశారో కానీ శ్రీదేవి నుంచి వర్మకు లేఖ వచ్చిన విషయం మాత్రం నిజం.
ఏదో సినిమాపై చర్చించడానికి బోనీకపూర్ ఇంటికి వర్మ వెళ్లాడు. అక్కడ తన స్వప్న సుందరి శ్రీదేవిని చూసేందుకు తహ తహలాడారు. బట్టతల బోనీ కపూర్ కోసం దేవకన్యలాంటి శ్రీదేవి సాధారణ గృహిణిలా ట్రేలో టీ తీసుకు రావడాన్ని చూసి మనసు చెదిరిపోయిందని వర్మనే చెప్పుకున్నారు. బోనీ కపూర్‌ను పైకి పంపించైనా శ్రీదేవిని తాను తీసుకు వెళ్లాలని ఆ క్షణంలో అనిపించిందట! పావురాలు, చిలకలు, మేఘాలతో ప్రేమ సందేశాలు పంపినట్టుగా ఈ విషయాన్ని వర్మ ఒక ఇంటర్వ్యూ ప్రేమ సందేశం పంపించారు. శ్రీదేవిని ప్రేమించిన విషయం గురించి ఆయన ఇంటర్వ్యూలో తెగ చెప్పేశారు. ఆ ఇంటర్వ్యూలను శ్రీదేవి చదివారో? లేదో? చదివితే ఏమనుకున్నారో బహిరంగంగా మాత్రం చెప్పలేదు.


అంతగా ప్రేమించిన రాంగోపాల్ వర్మకు శ్రీదేవి లేఖ పంపించింది. లేఖను చదువుకున్న వర్మ ప్రతిస్పందన ఏమిటో ఇప్పటి వరకు ఆయన తన ట్విట్టర్‌లో కూడా చెప్పలేదు కాబట్టి తెలియదు. తన బాల్యపు ప్రేమ కథకు రాంగోపాల్ వర్మ తన పేరు పెట్టడం శ్రీదేవికి కోపాన్ని తెప్పించింది. దీనిపై ఆమె వర్మకు నోటీసు ఇచ్చింది. పీత కష్టాలు పీతవి.. వర్మ కష్టాలు వర్మవి! ఈ మధ్య ఆయనేం చేసినా వివాదాస్పదమే అవుతోంది. ఇలా అనడం కన్నా ఆయన అన్నీ వివాదాస్పదం చేస్తున్నారు అనడం సబబేమో! సావిత్రి అనే టైటిల్‌తో ఒక సినిమా ప్రకటన చేశారు. రోజుకు పాతిక సినిమాల పేర్లు రిజిస్టర్ అవుతాయి. అందులో ఈయనదొకటి. నెలకో ప్లాప్ సినిమా ఆయన తీసేస్తున్నారు, అందులో ఇదొకటి అని ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎవరూ విమర్శలు చేయని పనులు చేస్తే ఆయన వర్మ ఎలా అవుతారు. తన చిన్నప్పుడు ఇంగ్లీష్ టీచర్ అంటే తెగ ఇష్టం ఉండేదని, అలానే మీ చిన్నప్పుడు మీ టీచర్‌ను ప్రేమిస్తే దాన్ని మాకు పంపిస్తే సినిమా కథలో చేరుస్తామని ప్రకటించారు. ఓరి దుర్మార్గుడా! చిన్నప్పుడు టీచర్‌ను ప్రేమించడం ఏమిటి? ఆ కథతో సినిమా ఏంటి అంటూ శాపనార్ధాలు మొదలయ్యాయి. ఆ మరుసటి రోజే సావిత్రి పేరును కాస్తా శ్రీదేవిగా మార్చేశాడు వర్మ. బహుశా ఇలా వివాదాస్పదం అవుతుందని ముందుగానే శ్రీదేవి పేరును కూడా ఆయన రిజిస్టర్ చేయించుకుని ఉండవచ్చు అనేది కొందరి అనుమానం. సావిత్రి పేరున్న వారు పతివ్రతలు అయితే ఇతర పేర్లు ఉన్నవారు కదా? అంటూ వర్మ సమాజాన్ని అతి తెలివిగా ప్రశ్నించేశారు. ఆయన ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు కానీ శ్రీదేవి నోటీసు పంపింది. నా పేరుతో సినిమా ఎలా తీస్తావని ప్రశ్నించింది. ఆమె పేరుతో సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాలో ఆమె ఉంటే ఊరుకునేది కానీ ఆమె లేకుండా ఆమె పేరుతో సినిమా తీస్తే ఆమెలా ఊరుకుంటుంది? పేరులో ఏముంది అనుకుంటాం కానీ వర్మను ఈ పేర్లు వెంటాడుతున్నాయి. అయినా శ్రీదేవి పేరు మీద శ్రీదేవి కాపీరైట్ ఎప్పుడు తీసుకున్నారో? శ్రీదేవి వాళ్ల అమ్మమ్మ కూడా పుట్టక ముందు నుంచే శ్రీదేవి పేరుంది కదా?
ఈ న్యాయపోరాటంలో శ్రీదేవి విజయం సాధిస్తే ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చినట్టు అవుతారు. దశరథుడికి కచ్చితంగా తెలుగు తమ్ముళ్ల నుంచి నోటీసులు వెళతాయి. తారక రాముడు అనే పేరు మీద సర్వహక్కులు వారివే కదా? దశరథుడు కూడా ఈ కాపీ రైటు హక్కును ఉల్లంఘించి తన కుమారుడికి ఈ పేరు పెట్టారని వారికి గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఐటి శాఖ మంత్రి పేరు తారక రామారావు అని ఉండడంపై వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.


ప్రేమ పగ సినిమా టైటిల్‌కు కథలా శ్రీదేవి, వర్మల వ్యవహారంలో ఈ మలుపులు ఏమిటో? ఎక్కడ చెడిందో? ఏం జరిగిందో కానీ తన డ్రీమ్ గర్ల్ నుంచి రాంగోపాల్ వర్మ నోటీసు అందుకోవలసి వచ్చింది. ఎందుకూ పనికి రాని సినిమా అని అందులో పని చేసిన వారంతా గట్టిగా నమ్మిన శివ కాలం కలిసొచ్చి తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. అదే కాలం కలిసి రాకపోతే వర్మ ప్రతి సినిమా డిజాస్టరే. పైగా బోలెడు కేసులు ఏం మాట్లాడినా కేసులు పెడుతున్నారు.
కులాలు, మతాలు, భాషలు, రాష్ట్రాలకు అతీతంగా వర్మను ద్వేషించేస్తున్నారు. వినాయకుడిపై ఆయనేదో అంటే పోటీ పడి కేసులు పెట్టారు. బాల్యావస్థలు దాటి వర్మ బాల్య ప్రేమకథ సినిమా వస్తుందా? రాదా? వస్తే శ్రీదేవి పేరుతో వస్తుందా? మరో దేవి పేరుతో తీస్తారా? కోర్టు అనుమతి ఇస్తుందా? శ్రీదేవి కరుణిస్తుందా?
సంపన్నుడు శాశ్వతంగా సంపన్నుడిగా ఉండాలనేమీ లేదు బికారిగా మారిపోవచ్చు. హీరో శాశ్వతంగా హీరోగానే ఉండిపోవాలని లేదు క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోవచ్చు, మాజీ అయిపోవచ్చు. అలానే సినిమా మేధావి వర్మ శాశ్వతంగా మేధావిగానే ఉండిపోవాలనేం లేదు. ఉట్టి వర్మగా కూడా మారవచ్చు. తెలుగు సినిమా ప్రవక్త అంటూ పొగిడించుకున్న వర్మకు తాను ప్రేమించిన శ్రీదేవి నుంచే నోటీసు రావడం కాల మహిమ? కాదంటావా వర్మా..?  డాటర్ ఆఫ్ వర్మ అని ఎవరో సినిమా తీస్తే నాగురించే అని గోల చేసిన వర్మ ఇప్పుడు శ్రీదేవి పేరుతో సినిమా తీస్తుంటే శ్రీదేవి  ఆయనకు నోటిసు ఇవ్వడం వింతే 

12, అక్టోబర్ 2014, ఆదివారం

అందాల హీరోను జీరోగా మార్చిన వ్యసనం


ధనం -మూలం 14


‘‘విలాసవంతమైన కారులో తిరిగిన హరనాథ్ చివరి దశలో బస్సు కోసం బస్టాప్‌లో వేచి ఉండడాన్ని చూశాను. నాకు జీవితం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు‘‘  అని ఒక సందర్భంలో హాస్యనటుడు అలీ హరనాథ్ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. బాలనటునిగా వచ్చి హీరోగా ఎదిగిన అలీకే కాదు ఈ తరం నటులు ఎంతో మందిపై అలనాటి నటుల అవసాన దశ తీవ్రమైన ప్రభావం చూపించింది.


ఆచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అనే మాట అచ్చంగా సరిపోయే నటుడు హరనాథ్. హీరో అంటే అందంగా ఉంటాడు అనే మాటకు సాక్షం హరనాథ్.
అంత అందమైన హీరోతో జతగా నటించేందుకు ఆనాటి హీరోయిన్లు ఆసక్తి చూపించే వారు. ఒక్క విషపు చుక్క మొత్తం పాలను పనికిరాకుండా చేసినట్టు ఒక్క వ్యసనం చాలు ఎంత గొప్ప హీరో జీవితాన్నయినా కాల్చి బూడిద చేసేందుకు.
***
చేసే వృత్తిని ప్రేమించాలి. వృత్తిని ప్రేమించాల్సిన చోట వ్యసనాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది. తొలి తెలుగు అందాల హీరో హరనాథ్ జీవితం అవుతుంది.
వృత్తిని ప్రేమించాలని మహాత్మాగాంధీ ఏనాడో చెప్పారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల దేశంలో పర్యటించినప్పుడు ఢిల్లీలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఇదే మాట చెప్పారు. వృత్తిని ప్రేమించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారి జీవితాలు ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. వ్యసనాన్ని ప్రేమించి జీవితాన్ని విషాదంగా మార్చుకున్న వారి జీవితాలు ఇతరులకు జీవితం పట్ల జాగ్రత్తలు చెబుతాయి.
***
గుండమ్మ కథ సినిమాను చూడని తెలుగు వారు ఉండరేమో! ఇందులో ఎన్టీఆర్‌తో పాటు హరనాథ్ నటించారు. కావాలంటే ఈ సినిమా మరో సారి చూడండి హరనాథ్ ఎన్టీఆర్ కన్నా పొడుగ్గా ఉంటాడు. అందంగా కనిపిస్తాడు. కనిపించడమే కాదు నిజంగా అందగాడు. ఎంత అందగాడు అంటే హరనాథ్‌ను రోడ్డు మీద చూసి ఒక నిర్మాత హీరోగా అవకాశం ఇచ్చాడు. సినిమాల్లో నటించాలని ఉన్నా దాని కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మద్రాస్ నగరంలో ఈ అందగాడ్ని చూసి సినిమాల్లో నటిస్తావా? అని అడిగి మరీ గుత్తా రామినీడు తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా హరనాథ్ సినిమా జీవితం ప్రారంభం అయింది. అతనికి సినిమాలో నటించడం తెలుసు కానీ విపరీతమైన పోటీ ఉండే సినిమా రంగంలో తన చుట్టూ పోటీదారులే ఉంటారని, వారితో కూడా నటించాల్సి ఉంటుందనే విషయం గ్రహించలేదు. కొందరు జాగ్రత్తలు చెప్పినా అప్పటికే ఇతరుల మాటలు వినలేనంత మత్తులో పడిపోయాడు. పోటీ రాజకీయం ఒక అందమైన నటుని జీవితానికి విషాద ముగింపు పలికింది.
***
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారు అంటే అచ్చం ఎన్టీఆర్‌లా ఉంటారు అనేంత గట్టి నమ్మకం తెలుగు ప్రేక్షకులకు. మరి అలాంటి ఎన్టీఆర్‌కు సైతం హరనాథ్‌లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కనిపించాడు. స్వయంగా ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడి పాత్ర కోసం ఎవరా? ఎవరా? అని తెగ ఆలోచించిన తరువాత హరనాథ్ వారి ముందు శ్రీరామునిగా ప్రత్యక్షం అయ్యారు. ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకొని శ్రీరామునిగా హరనాథ్ మెప్పించారు. ఒక్క శ్రీరాముడే కాదు శ్రీకృష్ణుడి వేషంలో ఎన్టీఆర్‌కు తిరుగులేదు. కానీ భీష్మలో స్వయంగా ఎన్టీఆర్ సూచన మేరకే హరనాథ్‌కు శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం లభించింది.
***
‘‘సినిమా రంగం తీవ్రమైన పోటీ ఉండే రంగం. నీ పోటీ వల్ల ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో వారు నిన్ను దెబ్బతీయాలని ప్రయత్నించవచ్చు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యం ’’ అంటూ ఓ సందర్భంలో అలనాటి హీరో రంగనాథ్ సినిమా రాజకీయాల గురించి చెప్పుకొచ్చారు. ఒక్క సినిమా అనే కాదు ఏ రంగంలోనైనా పోటీ ఉంటుంది. పోటీదారుడు దెబ్బతీయడానికి ఎంతకైనా తెగిస్తాడు. జీవితంలో ఎదగాలనుకునే వారు ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలి. ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు.
హరనాథ్‌పై కూడా ఇలా ఏదో కుట్ర జరిగిందనే ప్రచారం సినిమా రంగంలో బలంగా ఉంది. జరిగితే జరిగి ఉండవచ్చు కూడా... కానీ తన పరిస్థితికి తానే బాధ్యుడు అవుతాడు. అందమైన హరనాథ్ జీవితం అలా ముగియడానికి అతనే కారణం అవుతారు తప్ప మరొకరు కాదు.
***
అందమైన హీరోయిన్‌ను తెరపై చూస్తేనే ప్రేక్షకుడు సమ్మోహితుడు అవుతాడు. అది తెర అని తాను చూసేది బొమ్మ అని తెలుసు అయినా ఆ హీరోయిన్ అందం అంతగా స్పందింపజేస్తుంది. అలాంటిది అంత అందగత్తె పక్కన నటించే హీరోలు ఎలాంటి స్పందన లేకుండా ఉండేవారు అని వారి వారి అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. ఈ ప్రచారంలోని నిజా నిజాలు దేవుడికే తెలియాలి.
ఆయా వర్గీయుల ప్రచారం ఎలా ఉన్నా గ్లామర్ ప్రపంచం అయినా సినిమారంగంలో వ్యవసనాలు లేని వారు చాలా అరుదు. అయితే జీవితంలో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో లెక్కలు తెలిసిన వారు జాగ్రత్తగా ఉన్నారు. ఆ లెక్కలు తెలియని వారు బొక్క బోర్లా పడ్డారు.
అంత అందమైన రూపం ఉండి ఏం లాభం. హరనాథ్‌కు కొద్ది పాటి ముందు చూపు లేక జీవితంలో దెబ్బతిన్నారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ తరువాత స్థానం హరనాథ్‌దే అని స్థిరపడిపోయింది. సాధారణ అభిమానులే కాదు హీరోయిన్లు కూడా హరనాథ్‌కు అభిమానులుగా మారిపోయారు.


ఈ దశలోనే ఎస్‌వి రంగారావు హరనాథ్‌ల స్నేహం బాగా పెరిగిపోయిందని సినిమా పరిశ్రమలో ప్రచారం.
ఇద్దరూ మహానటులే. నటనలో పోటీ పడితే బాగుండేది కానీ వ్యసనంలో పోటీ పడ్డారు. సినిమా షూటింగ్‌కు వస్తారో? రారో తెలియదు. వస్తే మద్యం మత్తులో వస్తారో, మామూలుగా వస్తారో తెలియదు. అవకాశాలు ఒక్కొక్కటిగా జారిపోయాయి. హరనాథ్ తరువాత వచ్చిన కృష్ణ, శోభన్‌బాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకుని తమ స్థానాలను సుస్థిరపరుచుకుంటున్న సమయంలో హరనాథ్ మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు.

1959లో మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా చిత్ర రంగ ప్రవేశం చేసిన హరనాథ్ చివరకు బతికేందుకు ఏదో ఒక సినిమా అనే దశకు చేరుకుని 84లో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు సినిమాలో అసలు డైలాగులే లేని పాత్రలో నటించారు. అదే ఆయన చివరి సినిమా. కలిసి ఉంటే కలదు సుఖం, భీష్మ, గుండమ్మ కథ, పెంపుడు కూతురు, మురళీ కృష్ణ, అమర శిల్పి జక్కన్న, సర్వర్ సుందరం, భక్త ప్రహ్లాద, కథానాయిక మొల్ల, లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. జమున హరనాథ్ జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్టయ్యాయి. ఏదో వివాదంతో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లు జమున పై నిషేధం విధించారు ఆమెతో నటించేందుకు నిరాకరించారు. ఆ సమయంలో జమున, హరనాథ్‌ల జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.
సెప్టెంబర్ 2, 1936లో తూర్పు గోదావరి జిల్లా రాపర్తిలో జన్మించిన హరనాథ్ పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాధరాజు . హరనాథ్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ప్రముఖ నిర్మాత శ్రీనివాసరాజు హరనాథ్ కుమారుడే.

ఒక వ్యసనం 53 ఏళ్ల ప్రాయంలోనే హరనాథ్ జీవితాన్ని ముగించేట్టు చేసింది. సినిమాలకు దూరమై నవంబర్ 1, 1989లో హరనాథ్ కన్ను మూశారు. 1961 నుంచి 72 వరకు తెలుగు సినిమాలో హరనాథ్ స్వర్ణయుగం కనిపించింది. వ్యసనాన్ని నువ్వు సరదాగానే ప్రారంభించవచ్చు .. కానీ వ్యసనానికి పరాచికాలు నచ్చవు ఎలాగైనా నిన్ను దొంగ దెబ్బతీయాలని, నీ జీవితాన్ని తన అదుపులోకి తీసుకోవడానికి సీరియస్‌గా ప్రయత్నిస్తుంది. ఇది గ్రహిస్తే జీవితం నీ చేతిలో   ఉంటుంది లేదంటే విషాదం లో కలిసిపోతుంది . 

7, అక్టోబర్ 2014, మంగళవారం

చంపండి .. చావండి కానీ రాజీ పడొద్దు

చంపండి .. చావండి కానీ రాజీ పడొద్దు 
అవసరం అయితే చంపండి .. చావండి .. రాజీ మాత్రం పడొద్దు 
ఎందుకు రాజీ  పడాలి నువ్వు మగాడివి ...నువ్వు రాజీ  పడితే మగ జాతికే అవమానం 
నువ్వు స్త్రీ అయినంత మాత్రాన  రాజీ  పాడాలా ? నువ్వూ  సంపాదిస్తున్నావు రాజీ పడాల్సిన ఖర్మ నీకేం 
అస్సలు తగ్గొద్దు 
చస్తూ కూడా  పగ తీర్చుకోవాలి .. చచ్చిన వాడి పై కూడా  జాలి పడొద్దు .. రాజీ  పడొద్దు 
 కలిసుందాం అని బార్యని కోరి  భంగ పడి పిల్లలలను చంపి  కలిసుందామని లేఖ రాసి .. ఆమె పని చేసే కంపెనీ కో లేఖ రాసి పిల్లలలు చంపి తాను  ఆత్మ హత్య చేసుకొని రాజీ లేని పోరాటం చేసి అతను ప్రతీకారం తీర్చుకొన్నాడు 
చూశాడా వాడెంత దుర్మార్గుడో అని చెబుతూ తన వాదనను కొనసాగిస్తూ రాజీ లేని పోరాటం సాగిస్తోంది ఆమె 
అస్సలు రాజీ  పడొద్దు .. పిల్లలు .. కుటుంబాలు .. కుటుంబం స్మశాన వాటికలైన పరవాలేదు 
రాజీ మాత్రం పడొద్దు 
భార్యా భర్తలు రాజీ  పడి  ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటే  అందరికి మీకు తేడా ఏముంటుంది రాజీ  పడొద్దు 
రాజీ  పడితే కుటుంబాన్ని మించిన స్వర్గం ఉండదు 
స్వర్గం - నరకం లాంటి ట్రాష్ ను నమ్మొద్దు రాజీ  పడొద్దు 

6, అక్టోబర్ 2014, సోమవారం

భేతాళుడు చెప్పిన రుణ మాఫీ కథ

‘‘రాజా నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెబుతాను ’’అని శవంలోని భేతాళుడు అనగానే విక్రమార్కుడు నవ్వాడు. ‘‘రాజా ఈ కాలంలో కూడా కథ లేమిటనే కదా నీ నవ్వుకు అర్ధం. కథలను అంత తేలిగ్గా తీసిపారేయకు! అందమైన అమ్మాయి అబ్బాయికి పడిపోయేది కథలు వినే! నాయకుల నిజ స్వరూపం తెలిసినా ఓటర్లు పడిపోయేది ఎన్నికల సమయంలో వాళ్లు చెప్పే కథలు వినే! హీరో అయినా హీరోయిన్ అయినా ముందు పడిపోయేది కథ విన్నాకే! అందుకే కాలం ఏదైనా కథ పవర్ తగ్గలేదు. కథ చెబుతా విను అంటూ భేతాళుడు చెప్పడం ప్రారంభించాడు.
***
అనగనగా రెండు రాజ్యాలు.
ఏ కథ అయినా అనగనగా ఒక ఊరు అని లేదా అనగనగా ఒక రాజ్యం అని ప్రారంభం అవుతుంది. కానీ అనగనగా రెండు రాజ్యాలు అని చెప్పాల్సి రావడానికి కారణం ఒకప్పుడు ఇదీ ఒక రాజ్యమే. కాలమాన పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల రెండు రాజ్యాలు అయ్యాయి. చంద్రవర్మ, విష్ణువర్మ ఈ రెండు రాజ్యాలను పాలిస్తున్నారు. ఇద్దరు రాజులు ఒకే పాఠశాలలో చదువుకొని వచ్చారు. ఈ ఇద్దరే కాదు పాలించే రాజులందరిదీ ఒకే సిలబస్, ఒకే స్కూల్. అందువల్ల అంతకు ముందే వీరిద్దరి మధ్య స్నేహం, వృత్తిపరమైన ద్వేషం, వైరం అన్నీ ఉన్నాయి. రాజ్యాధికారం చేపట్టాక ఇద్దరి మధ్య పోటీ ఏర్పడింది.


మాకు పట్ట్భాషేకం చేస్తే రైతుల అప్పులను రాజ ధనాగారం నుంచి చెల్లిస్తామని ఇద్దరూ హామీ ఇచ్చారు. రంగరంగ వైభవంగా పట్ట్భాషేకం జరిగింది. దేశ దేశాల ప్రధానులు, దేశంలోని ప్రజలు పట్ట్భాషేకాన్ని వేనోళ్లుగా పొగిడారు. పట్ట్భాషేక వేడుకలు ముగిశాక ధనాగారం వైపు ఆశగా అడుగులు వేశారు. తాళం తీసి చూస్తే పట్ట్భాషేకానికి ఎంత ఖర్చు చేశారో అంత మొత్తం సొమ్ము కూడా ధనాగారంలో లేదు. రైతుల అప్పులు అన్నీ ఇప్పుడే తీర్చలేం అని విష్ణువర్మ చెప్పగానే రైతుల్లో హాహాకారాలు బయలు దేరాయి. రాజుగారి సొంత ఊరిలోనే రైతులు రోడ్డున పడ్డారు. గొట్టాలు రోడ్డుపైకి వచ్చి విప్లవ శంఖాలు పూరించాయి. తడబడ్డ రాజు ఆలోచనలో ఉన్నామని ప్రకటించారు. పొరుగున ఉన్న చంద్రవర్మ సైతం దీన్ని తీవ్రంగా ఖండించారు. విష్ణువర్మ తన హామీని సంపూర్ణంగా నెరవేర్చకపోతే పొరుగుదేశం రైతుల కోసం మేము సైతం ఉద్యమిస్తామని చంద్రవర్మ ప్రకటించారు. దీం తో విష్ణువర్మ తన హామీ నెరవేరుస్తాడని రైతులకు పూర్తి నమ్మకం కలిగింది. దేవుళ్ల పటాల స్థానంలో రైతులు విష్ణువర్మ ఫోటోలను అమర్చుకున్నారు. రైతులు నాగళ్లకు విష్ణువర్మ ఫోటోలు తగిలించి పూజలు చేసి పొలం దున్నతున్న బొమ్మలు రాజ్యమంతా రాజ్యమేలాయి. కొన్ని రోజులు గడిచాయి. లెక్కలు, కూడికలు, తీసివేతలతో మేధావులు కుస్తీ పట్టారు. చంద్రవర్మ రైతుల అప్పు పాతిక శాతం తీర్చి మూప్పాతిక శాతం అప్పుకు లిఖిత పూర్వకంగా భరోసా ఇచ్చి గండం నుంచి బయటపడ్డాడు.


విష్ణువర్మ మాత్రం అలా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. అమావాస్య అడ్డంగా వచ్చింది, చక్రవర్తి కరుణించడం లేదు, కోశాధికారికి జలుబు చేసింది అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాడు. రాజాధి రాజ రాజమార్తాండ జయహో అంటూ విష్ణువర్మ కీర్తనను వందిమాగదులు వేనోళ్లుగా పొగడసాగారు.
***
రాజా కథ విన్నావు కదా ఇప్పుడు చెప్పు ఇద్దరు రాజుల పోటీలో విజేత ఎవరు? గెలించింది ఎవరు? ఓడింది ఎవరు? అని భేతాళుడు ప్రశ్నించాడు.
‘‘నేను చంద్రవర్మ పేరు చెబుతానని అనుకున్నావేమో కాదు.. ముమ్మాటికీ విష్ణువర్మదే విజయం...’’ అన్నాడు విక్రమార్కుడు. ప్రేమలో, యుద్ధంలో అన్నీ చెల్లుబాటు అవుతాయి. యుద్ధంలో గెలుపు ముఖ్యం, ప్రజాస్వామ్యంలో అధికారం ముఖ్యం. ఎలా గెలిచాడు అని కాదు గెలవడం ముఖ్యం. కోశాగారం నుంచి నిధులు తీసి రైతులకు చెల్లించడంలో గొప్పతనం ఏముంది. ఖాళీ ఖజానా... రైతుల కోసం నిధులు ఇచ్చింది లేదు, మాట నిలుపుకొన్నది లేదు. కానీ పూజలందుకుంటున్న ప్రచారం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. రాజు దేవుని రూపం అంటారు. కానీ ఏకంగా దేవునిలా రాజు పూజలు అందుకుంటున్నట్టు ప్రచారం పొందడం సామాన్యమైన విజయమా? నా సమాధానం నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఏ కోణంలో చూసినా విష్ణువర్మదే విజయం అని విక్రమార్కుడు చెప్పాడు.


విక్రమార్కుడికి మౌనభంగం కలగగానే సంప్రదాయం ప్రకారం భేతాళుడు తిరిగి చెట్టుపైకి వెళ్లాలి. కానీ ఏదో ఆలోచనలో మునిగి భేతాళుడు అక్కడే ఉండిపోయాడు. రాజా నా సందేహం ఇంకా తీరలేదు. విష్ణువర్మ ఇంతకూ రైతులను రుణవిముక్తి చేశాడా? లేదా? చేయకపోతే ఎప్పుడు చేస్తాడు ఈ ఒక్క సందేహం తీర్చండి లేకపోతే ఈ ప్రశ్న నన్ను నిద్ర పోనివ్వదు అని భేతాళుడు వేడుకున్నాడు.


విక్రమార్కుడు నవ్వి పిచ్చివాడా! దైవలీలను విప్పిచెప్పడానికి మనమెంతటి వారం. ఆ రెండు రాజ్యాల విభజన జరిగి ఎవరి రాజ్యం వాళ్లు పాలించుకుంటున్న తరువాత కూడా ఇంతకూ విష్ణువర్మ రాజ్యవిభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఇక రుణమాఫీకి సమాధానం దొరుకుతుందని నువ్వెలా అనుకుంటున్నావు. దేవుడు ఉన్నాడా? లేడా? అంటే నువ్వేమంటావు. కోడి ముందా గుడ్డు ముందా? అంటే నువ్వేం చెబుతావు. చెట్టు ముందా? విత్తు ముందా? అని అడిగితే సమాధానం లభిస్తుందా? అని విక్రమార్కుడు అడిగాడు.


‘‘లేదు రాజా! బ్యాంకుకు వెళ్లి అడిగితే నీ అప్పు అలానే ఉందంటున్నాడు. పొలంలోకి వెళ్లి చూస్తే విష్ణువర్మ ఫోటోలకు పూజలు జరుగుతున్నాయి. ఏది నిజం... ఏది అబద్ధం. అర్ధం కాక మీరైనా సందేహం తీరుస్తారేమోనని అడిగాను’’ అని భేతాళుడు వినయంగా అడిగాడు. ‘‘యద్భావం తద్భవతి’’ అన్నట్టు దేవుడు ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు లేడు అనుకుంటే లేడు. అలానే రుణమాఫీ అయింది అనుకుంటే అయింది కాలేదు అనుకుంటే కాలేదు. ఇంతకు మించి ఆలోచిస్తే నా తల కాదు నీ తల ముక్కలవుతుంది అని విక్రమార్కుడు చెప్పగానే భేతాళుడు బుర్ర గోక్కుంటూ చెట్టు పైకి వెళ్లాడు. సమాధానం లేని ఇలాంటి ప్రశ్నలపై ఆలోచించడం కన్నా చెట్టుపైన తలక్రిందులుగా వేలాడడమే మేలు అనుకున్నాడు భేతాళుడు.

5, అక్టోబర్ 2014, ఆదివారం

ఎన్టీఆర్ తో స్టెప్పు లేయించాడు .. అనాధలా మరణించాడు .....లయ తప్పిన స్టెప్పులు -- ధనం మూలం13



అది హైదరాబాద్ ఆర్ టి సి x  రోడ్ లోని  సంగం థియేటర్‌.  వేటగాడు సినిమా ప్రదర్శన. ఆకు చాటు పింద తడిచే పాట రాగానే పెద్ద సంఖ్యలో యువకులు తెర ముందుకు వెళ్లిపోయి అచ్చం ఎన్టీఆర్‌లానే స్టెప్పులేస్తున్నారు. కొందరు తెరపైకి నాణాలు విసురుతున్నారు. కొద్దిమంది సీట్లలోనే కూర్చోని ఈలలతో హోరెత్తించారు. 80 వ దశకంలో కొన్ని సినిమాలకు ఇలాంటి దృశ్యాలు  కనిపించేవి . ఆ తరువాత మరే భాషలోనూ, మరే ప్రాంతంలోనూ ఇలాంటి దృశ్యాలు కనిపించలేదు.
ప్రేక్షకులను  తమ సీట్లలో తమను కూర్చోనివ్వకుండా తెర ముందుకు పరిగెత్తించి వారితో నృత్యాలు చేయించిన  ఆ నృత్య దర్శకుడు సలీం.
***

రాజకీయాల్లో హై కమాండ్ ముఖ్యమంత్రులతో స్టెప్పులేయించడం మామూలే. కానీ ఆయన సినిమాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులతో స్టెప్పులేయించారు. సలీం స్టెప్పులు వేయించిన తరువాత వాళ్లు ముఖ్యమంత్రులయ్యారు. ఎంజి రామచంద్రన్, జయలలిత, ఎన్టీరామారావు ఈ ముగ్గురితోనూ ఆయన స్టెప్పులు వేయించారు. స్టెప్పుల్లోనే నిరంతరం మునిగిపోయిన ఆయన తన జీవిత స్టెప్పులను మాత్రం సరిగా కంపోజ్ చేసుకోలేక పోయాడు. సినిమాలో స్టెప్పులు సరిగా రాకపోతే రీ టేక్ ఉంటుంది. జీవితంలో అలా ఉండదు అందుకే ఆయన 80 ఏళ్ల వయసులో అనాధలా మరణించాడు.
***
ప్రమాదంలో ఒక చేయి పని చేయని స్థితికి చేరుకున్న తరువాత కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు లేకపోయినా నిరంతరం డ్యాన్స్‌నే ప్రేమించాడు. అతను సినిమాల్లో డ్యాన్స్‌ను ఎంతగా ప్రేమించాడంటే? జరిగిందేదో జరిగిపోయింది ఇక చాలు డ్యాన్స్‌ల పిచ్చి వదిలేయండి.. కుటుంబం కావాలో ఆ డ్యాన్సులు కావాలో తేల్చుకోండి అని భార్య అడిగితే, ఏ మాత్రం ఆలోచించకుండా సలీం డ్యాన్స్‌కే ఓటు వేశాడు. డ్యాన్స్ కావాలా? విడాకులు కావాలా? అని భార్య అడిగితే విడాకులు తీసుకొని డ్యాన్స్‌ను నమ్ముకున్నాడు.
దాంతో 941 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఆయన 80 ఏళ్ల వయసులో ఎవరూ లేని అనాధలా, తినడానికి తిండి, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేకుండా 2011 అక్టోబర్ 16న మద్రాసులో కన్నుమూశాడు.
***
రోడ్లు ఊడ్చడం నీ వృత్తి అయితే ఆ వృత్తిని కూడా ప్రేమించు. ఆ రోడ్డును ఎవరైనా చూస్తే ఎంత బాగా ఊడ్చాడు అని నిన్ను గుర్తు చేసుకోవాలి అలా ఉండాలి నీ వృత్తిలో నీ పనితనం అంటాడో ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస సాహిత్య కర్త ఒకరు. వృత్తిలో అంతటి నిబద్ధత అవసరమే? కానీ సరైన ముందు చూపు లేకపోతే ఆ వైఖరే అనాథలా జీవితాన్ని ముగించేట్టు చేస్తుందని చెబుతుంది సలీం జీవితం.
***
అడవిరాముడులోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ జయప్రద ఎన్టీఆర్‌లతో స్టెప్పులేయించింది, వేటగాడులో శ్రీదేవి ఎన్టీఆర్‌ల జంటతో శృంగారం ఒలకబోయించింది. రగులుతోంది మొగలి పొద  అంటూ మాధవి, చిరంజీవి పెనవేసుకొని పోయేట్టు చేసింది ఆయన స్టెప్పులే. ఖైదీలోని ఆ నృత్యం చిరంజీవిని మెగాస్టార్‌ను చేసింది. 82లో ఎన్టీఆర్ రాజకీయ సినిమా హిట్టు కావడానికి అంత కన్నా ముందు వచ్చిన వేటగాడు, ఆడవిరాముడు సూపర్ హిట్లు దోహదం చేశాయి. పాట, ఆటలే ఆ సినిమాలను విజయవంతం చేశాయి. కానీ సలీంకు మాత్రం తిండిపెట్టలేకపోయాయి.
సలీం వైఫల్యంలో సలీంకు మాత్రమే బాధ్యత ఉంది. ఒక్క సలీం విషయంలోనే కాదు ఏ వ్యక్తి విజయం సాధించినా, పరాజయం పాలైనా దారిద్య్రంతో మరణించినా, అంతిమ కాలంలో ప్రశాంతంగా కన్ను మూసినా అంతకు ముందు ఆ వ్యక్తి వేసిన అడుగులే ఆ పరిస్థితికి కారణం అవుతుంది తప్ప మరెవరిదో బాధ్యత కానే కాదు.


దక్షిణ భారత దేశంలోనే నంబర్ వన్ కొరియోగ్రాఫర్‌గా సలీం నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషా సినిమాల్లో ఒకటి రెండు సంవత్సరాలు కాదు సుదీర్ఘ కాలం బహుశా మరో కొరియోగ్రాఫర్ ఎవరూ ఇంతటి సుదీర్ఘ కాలం సినిమా ఫీల్డ్‌లో లేరు. 941 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. నృత్యాలు సలీం అని సింగిల్ కార్డు మాత్రమే ఉండాలి. ఒక్క పాటకు పరిమితం కావడం ఒక్కసారి కూడా జరగలేదు. ఆ కాలంలోనే ఒక్కో పాటకు లక్ష రూపాయల పారితోషికం తీసుకునే వారు.
మరి డబ్బంతా ఏమయింది అంటే ఆయన గర్వంగా నన్ను అంతా కుట్టి ఎంజిఆర్ అని అభిమానంగా పిలిచేవారు. ఎంజి రామచంద్రన్ దాన ధర్మాలకు పెట్టింది పేరు, అలా సలీం కూడా అడిగిన వారికల్లా సహాయం చేస్తుంటే చిన్న ఎంజిఆర్ అని ముద్దుగా పిలిచేవారట! ఇది సలీమే చెప్పుకున్న మాట. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, కృష్ణ, రజనీకాంత్, కమలహాసన్, జితేంద్ర వారు వీరని కాదు ఆ కాలంలో హీరోలందరితో డ్యాన్సులు చేయించారు సలీం.
***
సినిమాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు. అంతా పోయి తినడానికి తిండిలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో ఎవరో వచ్చి నీకు కోటి రూపాయలు ఇస్తాను ఏం చేస్తావు అంటే ఏమంటారు.


మన ఊహ తప్పు. వారి నుంచి మనం అనుకున్న సమాధానం రాదు. ఆ కోటితో మళ్లీ సినిమా తీస్తాను అంటాడు తప్ప ఇకనైనా కుటుంబంతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాను అనడు. .. సినిమా వ్యామోహంలో చిక్కుకున్న చాలా మంది తమ జీవితంతోనే జూదం ఆడుతారు.
సరిగ్గా సలీం కూడా ఇదే మాట అన్నాడు. సలీం బాగున్న కాలంలో కొన్న ఒక భవనం వివాదంలో చిక్కింది. తినడానికి తిండి కూడా లేని సమయంలో ఆ భవనం తనకే దక్కుతుందని అనేవాడు. ఆ భవనం అమ్మితే మూడు కోట్ల రూపాయల వరకు వస్తాయి. ముమ్ముట్టితో ఖైదీ 2 సినిమా తీస్తాను అని ప్రకటించాడు.


హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో ఎడమ చేయి ప్రమాదంతో పని చేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆయనకు సినిమాలు లేవు. ఐనా ఒక చేయితో కూడా నేను డ్యాన్స్ చేయించి చూపగలను అని ధీమాగా ఎవరూ ఆయన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆయన శిష్యులే డ్యాన్సర్లుగా వెలిగిపోతున్నా, తన జీవితం గురించి తానే పట్టించుకోని గురువు గురించి శిష్యులు ఎందుకు పట్టించుకుంటారు. ఒంటి చేత్తో డ్యాన్స్‌లు చేయడానికి సలీం ఉత్సాహపడ్డా భార్యా బిడ్డలు కూడా ఇష్టపడలేదు. నీ జీవితం నీది మా జీవితం మాది అంటూ వెళ్లిపోయారు. నా ప్రాణం ఉన్నంత వరకు డ్యాన్స్ చేస్తాను అని సలీం చెప్పినా ఆయనకు అవకాశం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.


కేరళకు చెందిన సలీం మక్కా సందర్శించాలనేది జీవిత లక్ష్యం. దాని కోసమే మద్రాసు వచ్చిన ఆయన ఎంతో మందికి సహాయం చేశారు. చివరి దశలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా కనులు మూశారు. ఓ పెద్ద భవనం అద్దె కున్న వారితో వివాదం. ఆ భవనంపై సలీం వాదన అద్దెకుండేవారి వాదన వేరువేరుగా ఉంది. ఆ భవనం వ్యవహారంలో హత్య జరిగిందని అంటారు. తప్పు ఎవరిదో ఏం జరిగిందో కానీ సలీం జీవితం మాత్రం రోడ్డున పడింది. 941 సినిమాలు అంటే దాదాపుగా నాలుగువేల పాటలకు నృత్యాలను కంపోజ్ చేసిన సలీం చివరి రోజుల్లో కడుపులో తిండి చేతిలో చిల్లిగవ్వ లేకుండా కనులు మూయడం బాధాకరం.


మనిషి చందమాను ఎప్పుడో తాకేశాడు. మార్స్‌వైపు అడుగులు వేస్తున్నాడు. కానీ కొన్ని అంశాల్లో మనకు చీమకున్నంత ముందు చూపు కూడా లేదేమోననిపిస్తుంది. రేపటికి ఎలా అనే ఆలోచన అంత చిన్న జీవి చీమకు ఉన్నప్పుడు చీమ కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్ద సైజులో ఉండే మనకు ఉండాల్సిన అవసరం లేదా? సలీంనో, మరో సినిమా ప్రముఖుడినో తప్పు పట్టడం మన ఉద్దేశం కాదు. అంత స్థాయికి ఎదిగిన వారే ముందు చూపు లేకపోతే ఎందుకూ కొరగాకుండా పోయారు. సామాన్యులం మనమెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికే ఈ ప్రయత్నం. వృత్తిని ప్రేమించాల్సిందే కానీ జీవితాన్ని, కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువ గౌరవించాలి. ఏదో ఒక దశలో నీ వృత్తి నీ నుంచి దూరం కావచ్చు, నువ్వు వీడ్కోలు పలికే రోజు రావచ్చు కానీ నీ కుటుంబం మాత్రం నీవున్నంత వరకు నీతో ఉంటుంది. *