27, అక్టోబర్ 2014, సోమవారం

సినిమా లకే కాదు రాజకీయాలకూ రీమేక్ లు

రీమేక్ అనే మాట సినిమా రంగంలో తరుచుగా వినిపిస్తుంటుంది. కానీ అన్ని రంగాల్లోనూ రీమేక్‌లు అప్పుడప్పుడు కనిపిస్తునే ఉంటాయి. రీమేక్‌లు ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యాయి అని బాగా ఆలోచిస్తే రీమేక్ కింగ్, రీమేక్ సామ్రాట్ అనే బిరుదుకు అర్హత గల వారు విశ్వామిత్రుడు అని గట్టిగా నమ్మకం కలుగుతోంది. త్రిశంకును స్వర్గనికి పంపాలని విశ్వామిత్రుడు తెగ ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో స్వర్గాన్ని రీ మేక్ చేసింది ఆయనే కదా? సరే త్రిశంకు అటు సర్గంలోకి ఇటు నరకంలోకి వెళ్లక మధ్యలో ఉండొచ్చు కానీ సృష్టికి ప్రతి సృష్టి చేయడం ద్వారా తొలి రీమేక్ సామ్రాట్‌గా విశ్వామిత్రుడు రికార్డు సృష్టించాడు. స్వర్గం ఉందో లేదో అనేది ఒక అనుమానం అయితే స్వర్గానికి రీమేక్ లాంటి త్రిశంకు స్వర్గం ఏమైందో ఎవరికి తెలుసు?


ఇక దేవుళ్లలోనూ ఈ రీమేక్ గోల ఉంది. అచ్చం శ్రీకృష్ణుడిలానే పౌండ్రుక వాసుదేవుడు పిల్లన గ్రోవితో ఉండేవాడు. నిజానికి సినిమాల్లో రీమేక్ అనే మాట ఇప్పుడేదో కొత్తగా వినిపిస్తున్నదేమీ కాదు. తెలుగు సినిమాకు పెద్ద బాలశిక్ష లాంటి మాయాబజార్ రీమేకే.. అంత కన్నా ముందు వచ్చిన శశిరేఖా పరిణయంను మాయాబజార్‌గా అద్భుత దృశ్యకావ్యంగా మలిచారు. ఎన్టీఆర్ పరమానందయ్య శిష్యుల కథ కన్నా ముందు కస్తూరి శివరావు అక్కినేని నాగేశ్వరరావుతో పరమానందయ్య శిష్యుల కథ తీశారు. కథలో మార్పులు చేర్పులు ఉండొచ్చు కానీ పరమానందయ్య, వాళ్ల శిష్యుల తీరులో మార్పు ఉండదు కదా?


అప్పట్లో చాలా పెద్దవాళ్లకు మాత్రమే చిన్ననాటి విషయాలు చెప్పే చాన్స్ ఉండేది. నా చిన్నప్పుడు అంటూ మహాత్మాగాంధీ లాంటి నాయకులకో, మహాకవుకో రాసుకునే చాన్స్ ఉండేది. ఫేస్‌బుక్ పుణ్యమా అంటూ అందరికీ చిన్ననాటి సంగతులు రాసుకునే గుర్తు చేసుకునే అవకాశం లభించింది. మనం చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నట్టే సినిమా పెద్దలకు వృత్తిలోకి వచ్చిన కొత్తలో తీసిన సినిమాలను గుర్తు చేసుకోవడం ఓ సరదా.. అలానే రామానాయుడు ఆ మధ్య రాముడు భీముడును రీ మేక్ చేయాలనుంది అని మాటవరుసకు ఎక్కడో అంటే ఏ పాత్రకు ఎవరు సరిపోతారు అంటూ మీడియాలో బోలెడు కథనాలు. గుండమ్మ కథపై కూడా ఇలానే పేజీలకు పేజీలు కథలోచ్చాయి. ఏ పాత్రకు ఎవరు సరిపోతారు అంటూ నటీనటులను ఎంపిక చేసేశారు. అన్ని పాత్రలకు అందరూ దొరుకుతున్నారు కానీ సూర్యకాంతం పాత్రకే ఎవరూ దొరకరు అని ఒకరు తేల్చేస్తే, అందరూ దొరక వచ్చు కానీ ఎస్‌వి రంగారావుకు సరిపోయే నటుడు ఎవరూ లేరని మరి కొందరు తేల్చేశారు. దీనిపై వాదోపవాదాలు బాగానే జరిగాయి కానీ ఆ సినిమా రీమేక్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ మధ్య అభిషేక్ బచ్చన్‌ను మీ నాన్న సినిమాల్లో దేన్ని రీమేక్ చేస్తే మీరు నటిస్తారు అని అడిగితే ఆయన నవ్వి ఏదీ రీమేక్ చేయవద్దని వేడుకున్నారు. ఆయనది సరైన నిర్ణయమే ఎందుకంటే రాంగోపాల్ వర్మ లాంటి వారే షోలేను ఆగ్ అంటూ రీ మేక్ చేసి ఇంత చెత్త సినిమా ఇంత వరకు రాలేదని తానే తిట్టుకున్నారు. 

చిరంజీవి కుమారుడు హిందీలో అడుగు పెట్టడానికి జంజీర్‌ను రీమేక్ చేస్తే, ఆ సినిమా కొట్టిన దెబ్బకు హిందీలోనే కాకుండా తెలుగులోనూ దెబ్బలు తగిలాయి. సూపర్ స్టార్ కృష్ణలాంటి వారు దేవదాసును రీమేక్ చేసి దెబ్బతిన్నారు. సినిమాలో కృష్ణ విజయనిర్మల నటన బాగున్నా, రీమేక్ కావడంతో అబ్బే అక్కినేనిలా నటించలేదు అని పెదవి విరిచారు. ఇలాంటి దాన్ని ముందే ఊహించి కృష్ణ సూపర్ హిట్ సినిమా అల్లూరి సీతారామరావు రీమేక్‌కు ఎన్టీఆర్ ససేమిరా అన్నారు.
ఈ మధ్య కూడా దేవదాసు, ప్రేమ్ నగర్ లాంటి సినిమాల రీమేక్ గురించి కొంత చర్చ జరిగినా, రీమేక్ చేస్తే ఏమవుతుందో తెలిసే వౌనంగా ఉండిపోయారు. నిజానికి అద్భుతమైన కళాఖండాలను కావాలంటే మళ్లీ మళ్లీ చూసుకోవచ్చు కానీ రీమేక్ చేసి చెడగొట్టడం ఎందుకు? ఈ ఆలోచనతోనే మాయాబజార్‌ను రీమేక్‌కు బదులు రంగుల్లోకి మార్చి ఊరుకున్నారు. విశ్వామిత్రుని నుంచి సినిమాల వరకు అన్ని చోట్ల రీమేక్ ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎందుకుండదు?


82లో ఎన్టీఆర్ తెలుగుదేశంను ప్రారంభిస్తే, 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో దాన్ని రీమేక్ చేయాలని చూసి దెబ్బతిన్నారు. నిజానికి 82నాటి టిడిపిని 95లో ఎన్టీఆర్ రీమేక్ చేయాలని ప్రయత్నిస్తేనే సాధ్యం కాలేదు. అదేదో సినిమాలో కోట శ్రీనివాస్ మహాభారతంను తెలంగాణలో మాండలికంలో చెబుతూ సావిత్రమ్మ ఎస్‌వివోడు పిలిస్తేనే రాలేదు అంటూ ఏదో చెబుతాడు. అలానే ఎన్టీఆర్ పెట్టిన పార్టీని  ఆయనే మళ్లీ రీమేక్ చేయాలని చూస్తే సాధ్యం కానప్పుడు చిరంజీవికి సాధ్యం అవుతుందా? 82 నాటి టిడిపి కాపీ రైట్ హక్కులు అల్లుడు లాగేసుకోవడంతో దాన్ని ఎన్టీఆర్ టిడిపి అని రీమేక్ చేయాలని చూసి ఎన్టీఆర్ ఘోరంగా దెబ్బతిన్నారు.
77 అత్యవసర పరిస్థితి తరువాత పుట్టిన జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలో మేధావులు ఎక్కువ కావడం, అనుచరుల కన్నా మహామేధావులైనా నాయకులు ఎక్కువ కావడం వల్ల ఎక్కువ రోజులు నిలువలేకపోయింది. జనతాను రీమేక్ చేయాలని అప్పటి నుంచి చాలా ప్రయత్నాలు జరిగినా సాధ్యం కాలేదు. కానీ జనతా నుంచి తమ ముక్కను తాము తీసుకుని జనసంఘ్ బయటకు వెళ్లి బిజెపి పేరుతో జనసంఘ్‌ను రీమేక్ చేసి అధికారం చేపట్టారు. ఇప్పుడు ఒరిజినల్ కన్నా జనసంఘ్ రీమేక్ బిజెపి బలంగా ఉంది.


 ఏమవుతుందో తెలియదు కానీ గాంధీల శకం ముగిసినట్టేనని, మోదీ శాశ్వత ప్రధాని అని మీడియాలో ప్రచారం బాగానే జరుగుతోంది. తెలంగాణ ప్రజాసమితిని కొంచం అటూ ఇటూ మార్చి అదే లక్ష్యంతో తెలంగాణ రాష్టస్రమితిగా రీమేక్ చేసి కెసిఆర్ సక్సెస్ అయ్యారు. ఒకటి అర సందర్భాలు మినహాయిస్తే, తెలుగునాట రాజకీయాల్లో రీమేక్‌లు పెద్దగా సక్సెస్ అయిన సందర్భాలు లేవు. రాజకీయాల్లో వామపక్షాలు రీమేక్‌కు లొంగనివి. వాటికి రీమేక్ ఉండదు, ఒరిజినల్‌కు భవిష్యత్తు ఉండదు. 

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం