‘‘ చీ పొండి అంత మందున్నారు. మీరు మరీ చిలిపి. సిగ్గులేకుంటే సరి. మన్మథనామ సంవత్సరం ప్రభావం మీ మీద బాగానే పడినట్టుంది. మీకు రోజు రోజుకు సరసాలు ఎక్కువయ్యాయి’’ అంటూ ఆడ చీమ బుగ్గను రాసుకుంటూ ముందుకు వెళ్లింది. మగ చీమ వేగంగా ఆడ చీమను అనుసరిస్తూ వెళ్లింది. మగ చీమ వేగంగా వెళుడుండడంతో వచ్చిన శబ్దం అక్కడున్న వారికి స్పష్టంగా వినబడింది.
నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అధినేత సమావేశ మందిరం లోనికి వచ్చాడు. అధినేత ముఖంలోని కోపాన్ని చూసి చీమలు అక్కడి నుంచి మెల్లగా తప్పుకుని వెళ్లిపోయాయి.
***
‘‘నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. అసలు మనం ఎక్కడికెళుతున్నాం. ఇదేనా మన సంస్కృతి. మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. ఇలాగైతే అలా ముందుకు ఎలా వెళతాం ’’ అంటూ అధినేత ఆవేశంగా ప్రశ్నించారు. (కర్త , కర్మ, క్రియ సక్రమంగా ఉండని ఆయన మాటల నుంచి సారాంశాన్ని తీసుకుంటే వచ్చిన అర్ధం ఇది) చింపిరి జుట్టు నేత ఒకరు తప్ప మిగిలిన వారి ముఖం వెలవెలబోతోంటే, అతని ముఖం మాత్రం వెలిగిపోతోంది. అధినేత అతన్ని చూసి భుజం తట్టి ప్రోత్సహించి మాట్లాడమని చెప్పారు.
మన వాళ్లు సహకరించక పోయినా ఒంటి చేత్తో రణ రంగంలో వీరోచితంగా పోరాడాను అని అతను చెప్పుకొచ్చాడు. వెరిగుడ్ బ్రదర్ అంటూ అధినేత అతన్ని మెచ్చుకున్నారు. అనేక వీధిపోరాటాల్లో ఆరితేరిన ఆ వీరుడు ఇదే అవకాశం అని తన వీరోచిత గాథను చెప్పుకు పోతున్నాడు. ‘‘నేను ఆ సభకు కొత్త కావచ్చు కానీ వీధిపోరాటాలకు కొత్త కాదు. స్కూల్‌లో చదువుకునేప్పుడే సెకండ్ షో సినిమాకు వెళ్లి వస్తుంటే రోడ్లో వీధి కుక్కలు వెంట పడ్డాయి. ఏం చేయాలా? అని క్షణంలో వెయ్యో వంతు ఆలోచించాను. చిన్నప్పుడు తరగతి బుక్స్ కన్నా డిటెక్టివ్ బుక్స్‌నే ఎక్కువ చదివేవాడ్ని. ఇదే సందర్భం ఎదురైతే, షాడో ఏం చేసేవాడో క్షణంలో వందో వంతు సమయం ఆలోచించాను. ఎంతటి క్లిష్టపరిస్థితి ఎదురైనా షాడో క్షణంలో వెయ్యే వంతు కన్నా ఎక్కువ సమయం తీసుకోడు ఫట్ ఫట్ మంటూ ప్రత్యర్థులను మట్టికరిపిస్తాడు. కానీ నాకా ఆవకాశం లేదు. దాంతో క్షణంలో మరో 150వ వంతు సమయం ఆలోచించాను. చిన్న మెదడులో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. నిజానికి చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వారు నా చిన్న మెదడు చిట్లిందని, అది పని చేయదని అంటారు. నా చిన్నమెదడు పని చేయదని వాళ్లూ వీళ్లూ చెప్పడమే కానీ నిజంగా అది పని చేస్తుందో లేదో, చేస్తే ఎలా చేస్తుందో నాకూ తెలియదు. వినడమే తప్ప పని చేసేది చెయ్యంది నేనూ చూడలేదు.
కానీ ఆ రోజు నేను చిన్నమెదడుతోనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నా చిన్నమెదడు పని చేస్తుందని తేల్చుకున్నాను.
‘‘ బాబు ఇంతకూ ఆ రోజు ఏం జరిగిందో చెప్పు సస్పెన్స్‌లో ముంచకు’’ అని వెనక నుంచి మెల్లగా ఎవరో అడిగారు. వీడికి చాన్స్ దొరగ్గానే అధినేత ముందే మైకును తినేస్తున్నాడు. ఆత్మకథ అంతా వినిపిస్తున్నాడు. ఆయన తరువాత మనం మళ్లీ రెండు మూడు గంటల పాటు అధినేత ఉపన్యాసం వినాలి. మనమూ మనుషులమే ఇంత హింసను ఎలా భరిస్తామని పక్కనున్నాయనతో ఒకాయన తన ఆవేదన మెల్లగా చెప్పుకున్నాడు. రోలు వచ్చి మద్దెలతో చెప్పుకుంది అన్నట్టు నాతో చెబితే ఏం లాభం. నేనంటే వృద్ధుడిని నాకు దగ్గు మాత్రమే ఉంది. నువ్వు యువకుడివి దమ్ముంటే అధినేతకే చెప్పవచ్చు కదా అని మెల్లగా చెవిలో చెప్పాడు.
చింపిరి జుట్టు నేత మళ్లీ మైకు సరి చేసుకుంటూ చదువుకునేప్పుడు సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే కుక్కలు వెంట పడితే వాటితో నేను వీరోచితంగా ఎలా పోరాడానో తెలుసుకోవాలనే కదా మీరంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వజ్రాన్ని వజ్రంతో కోయమన్నారు. నేనూ అదే పని చేశాను. కుక్కలు వెంట పడి అరిస్తే, భయపడి పారిపోకుండా ఒక్కసారిగా వాటిని కోపంగా చూశాను, వాటి కన్నా బలంగా అరిచాను, కరిచాను. దాంతో ఒక కుక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కుక్క కరిస్తే బొడ్డు చుట్టు సూదులు తప్పవని ప్రజలు భయపడేవారు. కానీ నేను జాతికి వెలుగునిచ్చాను. ప్రపంచానికి కొత్త విషయాన్ని చెప్పాను. కుక్క కాటుకన్నా మనిషి కాటు ప్రమాదకరం అని నా బాల్యంలోనే కుక్కలకు తెలియజెప్పాను.
పూవు పుట్టగానే పరిమళించినట్టు చిన్నప్పుడే ఇంత గొప్ప ఆవిష్కరణలు చేసిన నేనంటే మా వీధిలో అందరికీ హడల్. ఇప్పుడు నా గొప్పతనం జాతి జనులందరికీ తెలియడానికి అవకాశం కల్పించింది మాత్రం మీరే అని అధినేతకు వినయంగా నమస్కారం చేసి ముగించారు. మీరేం చేయాలో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అని అధినేత తన వారికి చెప్పకనే చెప్పారు.
***
దేశంలో ఎక్కడెక్కడి సభలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే ఇంకా పాత కాలపు సంచలనాలతోనే కాలం గడుపుతున్నందుకు మేం సిగ్గుతో తల దించుకుంటున్నాం. పెద్దలు చూపిన మార్గంలో నడుస్తాం. కసరత్తు చేస్తాం, మల్ల యుద్ధం, కర్ర తిప్పడం, పిడిగుద్దులు గుద్దడం, నోటి తీట తీరేంత వరకు కొత్త కొత్త తిట్లు తిడతామని, నేను నా జాతిపై ప్రమాణం చేస్తున్నాను. కొత్త కొత్త తిట్లు నేర్చుకుంటానని ప్రమాణం చేస్తున్నాం. ఇకపై మరోసారి ఇలా తలదించుకునే పరిస్థితి రాదని, మర్డర్ చేసి సభలోకి రావడం కాదు... సభలో మర్డర్ చేసేంతగా ఎదుగుతామని మాటిస్తున్నాం అని అంతా ప్రమాణం చేశారు.
***
మహిళ, పురుష అనే తేడా లేకుండా జాతి చైతన్యాన్ని ప్రదర్శించాలని అన్ని పక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాయి. ఈ సందర్భంగా మీమీ హోదాలను బట్టి మీకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ఆయా పార్టీల అధినేతలు ప్రకటించడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లారు. ఆ సమయంలో వారిని చూస్తే అచ్చోసిన ఆబోతులు సైతం గజగజ వణికిపోవలసిందే.
****
నన్నపనేని రాజకుమారి , గంగా భవానీ , మోత్కుపల్లి నర్సింహులు లాంటి మహనీయులు నడయాడిన ఈ సభలో వారి తరువాత ఆ మహా సంస్కృతి అంతరించి పోవలసిందేనా ? అనే ఆవేదన ఉండేది .. మేమున్నామని కొత్త తరం వారి వారసత్వాన్ని అంది పుచ్చుకోవడం సంతోషంగా ఉంది అంటూ ఓ సీనియర్ నేత ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకొన్నాడు .
- బుద్దా మురళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం