‘‘ఎన్నయినా చెప్పు ఏదీ శాశ్వతం కాదు’’
‘‘ అవును ఈ ఇరానీ హోటల్‌లో మనం వన్‌బై టూ చాయ్ తాగుతూ గంటల కొద్ది మాట్లాడుకునే వాళ్లం. పాటకో ఐదు పైసలు తీసుకుని ఇష్టమైన పాట వేసేవాడు. ఇది శాశ్వతం అనుకున్నాం. ఇప్పుడా కుర్చీలు లేవు, కూర్చోని మాట్లాడుకునే ఛాన్స్ లేదు.’’
‘‘వన్‌బై టూ టీ గురించి కాదు ’’
‘‘హీరోల గురించా? తెలుగు సినిమాల్లో మేమే బాద్షాలం, నంబర్ వన్‌లం అనుకున్న టాప్ హీరోలందరూ ఒక్క హిట్ కూడా లేక గండిపేట ఎండిపోయాక నీళ్లు లేక చేపలు కొట్టుకున్నట్టు హిట్ కోసం గిలగిల లాడుతున్నారు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తాను అని కేకలేసిన మనవడికి అల్లుడి మనుషులు కిందకు నీళ్లు తెచ్చే దాకా ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. కంటిచూపుతో చంపడం కన్నా తడిగుడ్డతో గొంతు కోయడం ఇంకా ప్రమాదకరం అని అర్ధం చేసుకునే వయసు కాదాయె. మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీర్, పవన్ కళ్యాణ్‌లలో టాప్ వన్ ఎవరో తేల్చుకోలేక అభిమానులు తలలు పట్టుకున్నారు. ముగ్గురికీ ఒకేసారి బ్రహ్మాండమైన ప్లాపులు వచ్చాయి. విజయాలు ఎవరికీ శాశ్వతం కాదని ముగ్గురి పరాజయాలు నిరూపించాయి. ’’
‘‘నేనేం చెప్పాలనుకుంటున్నావో నన్ను చెప్పనిస్తావా? లేదా? ఏదీ శాశ్వతం కాదు నువ్వనుకుంటున్న రజనీకాంత్ కూడా శాశ్వతం కాదు. ఆ కాలంలో ఎన్టీఆర్, అక్కినేని, కాంతారావు, కృష్ణ, జగ్గయ్య హీరో ఎవరైనా రామయ్య తాత, హిందీలో రామూ కాకా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు వాళ్లెక్కడా కనిపించడం లేదు. ’’
‘‘ అంటే నువ్వు చెప్పదలుచుకున్నది ఎన్టీఆర్ గురించే కదా నిజమే కాంగ్రెస్‌ను కూకటి వెళ్లతో పెకిలించిన ఎన్టీఆర్ కీర్తి తప్ప ఏదీ శాశ్వతం కాదు. ఎన్టీఆర్ కలియుగ దైవం. తెలుగు వారి ఆశాజ్యోతి. అందుకే గోదావరి ఒడ్డున దేవుని రూపంలో పూజలందుకుంటున్నారు’’
‘‘చూడోయ్ నువ్వన్నట్టు ఎన్టీఆర్ దైవం అనుకుంటే ఆ దైవాన్ని సైతం మట్టికరిపించిన అల్లుడు దేవదేవుడు అవుతాడు కదా? ఎన్టీఆర్ అత్యంత శక్తివంతుడు అయితే అలాంటి ఎన్టీఆర్‌ను ఓడించిన అల్లుడు మహా శక్తివంతుడు కదా? అయినా నేను చెప్పాలనుకుంటున్నది సినిమా వాళ్ల గురించి కాదు ’’
‘‘మరెవరి గురించో చెప్పవచ్చు కదా? ’’
‘‘ కొత్త సెల్‌ఫోన్ కొన్నాను. అప్పటి నుంచి గమనిస్తావేమో, అడుగుతావేమో అనుకున్నాను. ’’
‘‘ ఓహో అదా సంగతి.. ఏదీ శాశ్వతం కాదన్నది సెల్‌ఫోన్ల గురించా? ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోనే అద్భుతం. హైదరాబాద్ లాంటి మహానగరంలో పదేళ్లు నిరీక్షిస్తే కానీ ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ వచ్చేది కాదు. టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ వాళ్లను ఏదైనా సమస్యపై కలవాలంటే ప్రధానమంత్రిని కలిసినంత కష్టపడాల్సి వచ్చేది. పాపం వాళ్లు అదే శాశ్వతం అనుకున్నారు. అదే సెల్‌ఫోన్ సిబ్బంది మన గల్లీలోకి కూడా వచ్చి కూరగాయలు అమ్ముకున్నట్టు రోడ్డు పక్కన ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇస్తాం, తీసుకోండి బాబు తీసుకోండి అంటూ పిలుస్తుంటే నాకూ అలానే అనిపించింది. నిజమే మనం అనుకుంటాం కానీ ఏదీ శాశ్వతం కాదు. జెమ్స్‌బాండ్ 007లా ప్రతోడు అప్పట్లో పేజర్‌ను ప్యాంటు జేబుకు తగిలించుకుని స్టైల్‌గా కనిపించేవాడు. రోజుకో మాడల్ సెల్‌ఫోన్లు మారుతున్న రోజుల్లో ఏదీ శాశ్వతం కాదనే విషయం బాగానే అర్ధమైంది.’’
‘‘ ఈ లోకంలో ఇదే పెద్ద సమస్య. ప్రతోడు జాతిని ఉద్దేశించి మాట్లాడేందుకు ఉత్సాహం చూపిస్తాడు కానీ ఎదుటి వాడు ఏదో చెప్పాలనకుంటున్నాడు. వాడి మాట కూడా వినాలనుకోరు. ’’
‘‘సర్లే చెప్పు వింటా.. ఏదో చెప్పాలనకుంటే వెంటనే చెప్పేయాలి. వేదాలకు భాష్యం చెబుతున్నంత ఫోజు కొట్టి ఏదో చెప్పబోతున్నాను అని ముఖం పెట్టి వౌనంగా ఉంటే, వినడానికి అంత సేపు ఓపిక పట్టేంత సహనం ఎవరికుంటుంది? ఇప్పుడు నాలెడ్జ్ ఏ ఒక్కడి సొత్తో కాదు. గూగుల్ అందరికీ అందుబాటులో ఉంది. అప్పుడంటే మీడియా మొఘల్ తన కళ్లతో జగతిని చూపించే వారు. ఫేస్‌బుక్ వాల్ కూడా మీడియా లాంటిదే, ఈరోజుల్లో ఎవరి కళ్లతో వాళ్లు ప్రపంచాన్ని చూస్తున్నారు, ఇతరులకు చూపిస్తున్నారు.’’
‘‘ దాని గురించి కాదు. నోకియా అంటే ఒకప్పుడు సెల్‌ఫోన్‌కు పర్యాయ పదం. ఫిన్‌లాండ్ అనే చిన్న దేశం అర్థిక వ్యవస్థ మొత్తం ఆ సెల్‌ఫోన్ కంపెనీపైనే ఆధారపడి ఉండేది. తామే శాశ్వతం అనుకున్న నోకియా చివరకు నష్టాల్లో పడి అమ్ముకోవలసి వచ్చింది. నోకియాను కొన్నందుకు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీకే నష్టం తప్పలేదు. ఏదీ శాశ్వతం కాదు కాలం మారుతుంది అనే చిన్న విషయాన్ని గ్రహిస్తే నోకియా అలానే వెలిగిపోయేది. ఏదీ శాశ్వతం కాదనే విషయం సత్యం కంప్యూటర్స్ దెబ్బతో ఐటి కుర్రాళ్లు గ్రహించారు.’’
‘‘ హమారా బజాజ్ అంటూ బజాజ్ స్కూటర్ ప్రకటన చూస్తే ఇప్పటి సినిమాల కన్నా ఎక్కువ సంతోషం వేసేది. అచ్చం ల్యాండ్ లైన్ ఫోన్లలానే పదేళ్లపాటు వెయిట్ చేస్తే కానీ బజాజ్ స్కూటర్ దొరికేది కాదు. ఒక్కసారిగా వెనకబడి, కాలగర్భంలో కలిసిపోయింది. ’’
‘‘ తలనొప్పికి పర్యాయ పదం అమృతాంజన్. పాపం తలనొప్పి శాశ్వతం కాదు అమృతాంజన్‌కు నంబర్ వన్ స్థానం శాశ్వతం కాదు అని తేలిపోయింది. ’’
‘‘ ఏదీ శాశ్వతం కాదు అనేది గ్రహిస్తే జీవిత తత్వం బోధపడుతుంది. పోయే లోపే నాలుగు మంచి పనులు చేస్తాం. ’’
‘‘ ఏదీ శాశ్వతం కాదు అనే విషయాన్ని జ్ఞానులు, తత్వవేత్తలు, ఆథ్యాత్మిక వాదులు వీరందరి కన్నా ముందే రాజకీయ నాయకులు గ్రహించారని నా కచ్చితమైన నమ్మకం’’
‘‘ ఎలా ?ఎలా? ’’
‘‘ అధికారంలోకి రాగానే పదవి శాశ్వతం కాదని నాయకులు అధికారంలో ఉన్నప్పుడే తర తరాలకు సరిపడా సంపాదిస్తున్నారు. రాజకీయ వారసులకు పెట్టుబడి సమకూర్చుకుంటున్నారు. 58 ఏళ్ల వరకు శాశ్వతం అనే నమ్మకం ఉన్నా కొందరు ఉద్యోగులేమో దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకుంటున్నారు ఏదీ శాశ్వతం కాదనే గట్టి నమ్మకంతో ’’-బుద్దా మురళి (జనాంతికం 29. 1. 2016)