8, మే 2016, ఆదివారం

పవన్ తో ఆంధ్రకు .. రజనీకాంత్ తో విశ్వానికే ప్రత్యేక హోదా

‘‘పవన్ కళ్యాణ్ తలుచుకుంటే నిమిషంలో ప్రత్యేక హోదా వస్తుందని శివాజీ చెప్పారు. వస్తుందంటావా? ’’
‘‘ ఏ శివాజీ? చత్రపతి శివాజీని నేను చూడలేదు, శివాజీ గణేషన్ పోయి చాలా కాలం అయింది. ’’
‘‘ నీ కన్నీ వెటకారాలే? శివాజీ అని ఓ మాజీ హీరోలే. ప్రత్యేక హోదా కోసం ఆయన చేసే ఉద్యమాలు ఒక ప్రత్యేక ఛానల్‌లో మాత్రమే కనిపిస్తాయి. ’’
‘‘ నిజమే పవన్ తలుచుకుంటే ఆంధ్రకు ప్రత్యేక హోదా, బాలకృష్ణ తలుచుకుంటే ఏకంగా దేశానికే ప్రత్యేక హోదా వస్తుంది. ’’

‘‘అదెలా సాధ్యం? ’’
‘‘ తెలుగు సినిమా హీరోల శక్తి నీకు తెలియడం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వారినే తాలిబన్లు ముప్పు తిప్పలు పెడితే తెలుగు హీరో మాత్రం వాళ్లతో తెలుగులో మాట్లాడి మూడు చెరువుల నీళ్లు తాగించి వాళ్లను మట్టుపెడతాడు తెలుసా? వర్థమాన హీరోనే అలా చేస్తే ఇక సీనియర్ హీరోలు చేయలేంది ఏముంటుంది. హీరోలు తలుచుకుంటే పాకిస్తాన్, చైనాను ఒకేసారి మట్టికరిపించగలరు. ’’
‘‘నీది పోయేదేముంది. పాకిస్తాన్, చైనాతో పాటు అందులో అమెరికాను కూడా చేర్చు ’’
‘‘ పప్పులో కాలేశావ్! నీకు సినిమా బిజినెస్ గురించి ఏ మాత్రం అవగాహన లేదు. అమెరికాలో మన తెలుగు వాళ్లు చాలా మంది ఉన్నారు. తెలుగు సినిమాకు ఓవర్సిస్ వ్యాపారం కూడా బాగా ఉంది. ఇక్కడ విడుదలైన సినిమాలు ఒకటి రెండు రోజుల ముందే అమెరికాలోనూ విడుదలవుతాయి. తెలుగు హీరోపైన ఎంత నమ్మకం ఉన్నా? తాము పని చేసే అమెరికాపై వారికి అంతకు మించి అభిమానం ఉంటుంది కాబట్టి తెలుగు హీరో చేతిలో సూర్య చంద్రులు ఓడిపోయినా సహిస్తారు కానీ అమెరికా ఓడిపోవడాన్ని అస్సలు తట్టుకోరు. కావాలంటే తెలుగు సినిమా చరిత్రను అధ్యయనం చేయి ఒక్కటంటే ఒక్క కథ కూడా అమెరికాను ఓడించినట్టు ఉండదు. ఐతే రజనీకాంత్‌కు మినహాయింపు ఉంది ఆయన తలుచుకుంటే విశ్వానే్న జయిస్తాడు. ప్రపంచానికే ప్రత్యేక హోదా సాధిస్తారు’’
‘‘ సినిమా సంగతి కాదు.. హోదా కోసం పవన్ ప్రయత్నించవచ్చు కదా? ’’

‘‘ పవనే అవసరం లేదు బాలయ్య బాబైనా, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, చివరకు బన్నీ అయినా సరే వంద కోట్లు ఉంటే సాధించవచ్చు’’
‘‘ వావ్ వంద కోట్లతో కేంద్రం మెడలు వంచి సాధించవచ్చునంటే అంత కన్నా సంతోషం ఏముంటుంది? ఎలా ఎలా? ’’
‘‘గణాధిపత్యం కోసం ఇద్దరు కుమారుల మధ్య శివపార్వతులు పోటీ పెడితే వినాయకుడు ఏం చేశాడు? సుబ్రమణ్య స్వామిలా నేనంత స్పీడ్‌గా మూడు లోకాలు చుట్టి రాలేను అని తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి షార్ట్‌కట్‌లో మూడు లోకాలు చుట్టి వచ్చాడు కదా? అలానే కేంద్రాన్ని ఒప్పించడం కష్టం కాబట్టి షార్ట్‌కట్‌లో కార్యం సాధించుకోవచ్చు’’
‘‘ ఎలా? ఎలా? ’’
‘‘ ఓ వంద కోట్లతో కేంద్రం మెడలు వంచిన కథతో సినిమా తీసి’’
‘‘ నేనింత సీరియస్‌గా అడుగుతుంటే సినిమా కథ చెబుతావేంటి? ప్రజల జీవితాలు నీకు సినిమా కథలా కనిపిస్తున్నాయా? ’’

‘‘ తెలుగు వారికి సినిమా, రాజకీయం, జీవితం అన్నీ ఒకటే. శ్రీకృష్ణ తులాభారంలో తులసీ దళం వేశాక కానీ శ్రీకృష్ణుడి బరువుకు సమానం అయినట్టు అప్పటి వరకు త్రాసు అటూ ఇటూ ఊగుతుంటే పవన్ కళ్యాణ్ అనే తులసీ దళంతోనే కదా త్రాసు బాబు వైపు తూగింది. సినిమా వేరు జీవితం వేరు అని ప్రజలు అనుకుంటే త్రాసు అలా తూగేది కాదు కదా? ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినా చిరంజీవికి ఎన్నో కొన్ని ఓట్లు సీట్లు వచ్చినా సినిమా గ్లామరే కదా? లేకపోతే దేశం కోసం వాళ్లేం త్యాగం చేశారని... దేశంలో మిగిలిన వారి సంగతి వేరు కానీ తెలుగు వారికి మాత్రం సినిమా, రాజకీయం, జీవితం మూడూ ఒకటే అన్నీ కలిసిపోయే ఉంటాయి. మోదీ మోసం చేశాడని కోపంగా ఉంటే ఆ కథలో చివరకు ఆయన్ని కూడా అధికారం నుంచి దించేసినట్టు చూపించి ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ సైతం రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ అయ్యారు. అదే మన తెలుగునాట చోటా మోటా శివాజీ కూడా దేశ పటం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను వేరు చేస్తామని సినిమా డైలాగులు చెబుతుంటారు. మీడియా ఆకాశానికెత్తుతుంది. గడ్డం చేసుకునే ఓపిక లేని మాజీ నటుడు  భారీ డైలాగులు చెబుతుంటే మీడియా సీరియస్‌గా తీసుకొని ప్రసారం చేయడమే సిల్లీగా అనిపించడం లేదూ! ’’

‘‘ఇంతకూ అసలు విషయం చెప్పడం లేదు? హోదా వస్తుందా? రాదా? ఆ విషయం చెప్పు’’
‘‘సినిమా డైలాగులు తప్ప చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరుగుతున్నాయా? నువ్వు చెప్పు ముందు? ’’
‘‘ అంటే మోదీ ఢిల్లీని తలదనే్నలా రాజధాని నిర్మిస్తాను అన్నారు కదా? ’’
‘‘ ఎన్నికల ప్రచారంలో మోదీ అలా చెప్పింది నిజమే. చత్తీస్‌ఘడ్ రెండు వేల కోట్లతో రాజధాని నిర్మించుకుందని పార్లమెంటులో మొన్న జైట్లీ చెప్పిందీ నిజమే! చూడోయ్ చదువుకునేప్పుడు ప్రేమించే రోజుల్లో నువ్వు అమ్మాయిలకు ఎన్ని కబుర్లు చెప్పావు. ఆకాశం దింపాలా? నెల వంక తుంచాలా? అంటూ ఎన్ని పాటలు పాడావు? ’’
‘‘ నిజమేనోయ్ ఆరోజులు తలుచుకుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది? ’’

‘‘ కదా? ప్రేమించి పెళ్లి చేసుకుని మరిప్పుడేం చేస్తున్నావ్ కరివేపాకు తెంపుకురా అని భార్య పిలిచినా పేపర్ చదువుతున్నాను అని చిరాకు పడతావు. ఆకాశం దింపుతానన్నోడికి కరివేపాకు తుంచడం ఓ సమస్యనా? ’’
‘‘ అది వేరు ఇదివేరు’’
‘‘ ప్రేమించేప్పుడు మాయమాటలు చెప్పినట్టు, ఎన్నికల సమయంలో నాయకులు వారి స్థాయిలో వారు మాయమాటలు చెబుతారు’’

‘‘ఓటరు దేవుళ్లను మోసం చేస్తే’’
‘‘దేవుడి పేరుతో అధికారంలోకి వచ్చి దేవుడినే పక్కన పెట్టారు. ఓటరు దేవుడ్ని పక్కన పెట్టడం ఓ లెక్కా’’
‘‘ ఒక్క విషయంలో మాత్రం ఇరు రాష్ట్రాలు సంతోషపడాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలను కేంద్రం సమానంగా చిన్నచూపు చూస్తోంది. ’’
‘‘ అంటే మన కర్మ ఇలా కాలిపోవలసిందేనా? ’’
‘‘ సినిమా, రాజకీయం, జీవితం మూడింటిని వేరు చేసేంత వరకు ఇంతే’’ 
-బుద్దా మురళి (జనాంతికం 8. 5. 2016)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం