28, అక్టోబర్ 2016, శుక్రవారం

హీరోలు నిజం -హీరోయిన్లది నటన

‘‘కొన్ని విషయాలు మనకు అస్సలు అర్థం కావు’’
‘‘ఏంటో.. నీకు అంతగా అర్థం కాని విషయాలు...’’
‘‘ఎంతో అందంగా కనిపించే సినీ హీరోయిన్లను నమ్మడానికి వీలులేదు’’
‘‘నువ్వు ప్రేమించిన హీరోయిన్ ఎవరికైనా సొంతమైందా? ’’
‘‘నా గురించి కాదు.. కమల్‌హాసన్ గురించి? ’’
‘‘పవన్ కల్యాణ్‌లా పెళ్లిళ్లు, సహజీవనంతో కమల్ హాయిగానే ఉన్నాడు కదా? ’’


‘‘నిన్న ‘జీ సినిమా’లో ‘ఆకలి రాజ్యం’ చూస్తున్నా. శ్రీదేవి ఎంత అందంగా ఉందో అని ముచ్చటపడ్డా. శ్రీదేవిని కమల్ హాసన్ మనస్ఫూర్తిగా ప్రేమించాడు. కమల్ హాసన్ ఆకలితో రోడ్డు మీద ఏమైనా దొరుకుతుందా? అని చూస్తుంటే.. టీవీ రిమోట్‌కు నా చేయి తగిలి చానల్ మారింది. మరో ఛానల్‌లో ‘ప్రేమాభిషేకం’లో నాగేశ్వరరావుతో డ్యూయెట్ పాడుతూ కనిపించింది శ్రీదేవి. ఏం.. అంత తొందరెందుకు.. కమల్ హాసన్ కోసం కాసేపు ఆగలేదా? చీ..చీ.. ఇదేం బుద్ధో.. అనుమానం వచ్చి అలా చానల్స్ మారుస్తూ పోయాను. అక్కినేనితో కనిపించిన జయప్రద చివరకు హీందీ హీరోలతో సైతం గెంతుతోంది. ఈ హీరోయిన్లను అస్సలు నమ్మకూడదు.. వీరిది చపలచిత్తం.. వీరికి ప్రాంతం, భాష, దేశం అనే తేడా ఉండదు. ఎవరితోనైనా గెంతుతారని విరక్తి కలిగింది. ’’


‘‘ పిచ్చోడా..! డైరెక్టర్ ఏ హీరోతో డ్యాన్స్ చేయమంటే వాళ్లతో చేస్తారు. శ్రీదేవి, జయప్రద అనే కాదు నిత్యా మీనన్, చివరకు ఐశ్వర్యారాయ్ అయినా అంతే. సినిమాను నిజం అనుకునే నీ అమాయకత్వాన్ని చూస్తే జాలేస్తోంది’’
‘‘పిచ్చి నాకా? మీకా? ఇద్దరు హీరోల అభిమానులు కత్తులతో పొడుచుకుని చంపుకున్నారు కదా? వారికి తెలియదా? హీరోలది నటన అని. హీరోయిన్ ఐతేనేమో అది నటన అంటున్నావ్. మరి హీరో అయితే? ఎన్టీఆర్‌కు ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది హీరోగా ఆయన్ని చూసే కదా? లేకపోతే స్వాతంత్య్ర పోరాటంలో వీరోచితంగా పోరాడాడు అనా? లేక సంపాదించింది అంతా ప్రజలకు దానం చేశాడనా? చిరంజీవికి 18 సీట్లు ఇచ్చినా? పవన్ కల్యాణ్ ఏదో పొడిచేస్తాడని జనం ఎదురు చూస్తున్నా.. హీరోలనే ఒక్క కారణంతోనే కదా? ’’
‘‘అది వేరు, ఇది వేరు. కాంగ్రెస్ కుళ్లిపోయినప్పుడు ప్రత్యామ్నాయం కోసం జనం ఎదురు చూసే సమయంలో వచ్చిన హీరోగా ఎన్టీఆర్‌కు పట్టం కట్టారు. వైఎస్‌ఆర్ వెలిగిపోతున్న సమయంలో వచ్చిన ‘మెగాస్టార్’ చిరంజీవిని తిప్పి కొట్టారు. కొంత వరకు నువ్వన్నది నిజమే సినిమాల్లో హీరోలుగా ఏదో చేసేశారు కాబట్టి నిజ జీవితంలోనూ అలానే చేస్తారనే బలమైన నమ్మకంతోనే అనుకో.’’


‘‘తుంటి మీద కొడితే మూతి పళ్లు రాలుతాయి అంటారు కదా? తుంటికి,మూతి పళ్లకు సంబంధం ఏంటి? ములాయం సింగ్‌కు, అమర్‌సింగ్‌కు గొడవ వస్తే జయప్రద ఎంపి సీటు పోవడం ఏంటి? ములాయం, అమర్‌సింగ్ రెండవ కలయిక తర్వాత ములాయంకు వాళ్ల అబ్బాయికి మధ్య గొడవ వస్తే మళ్లీ అదేదో సినిమా కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవి నుంచి జయప్రదను తప్పించారు. ఇదేం లాజిక్కు. ’’
‘‘కొన్నింటికి లాజిక్కులు ఉండవు.. అంతే ’’
‘‘ఆస్తికులు, నాస్తికులు సరే.. దేవుడు లేడు కానీ- దయ్యాలు ఉన్నాయని నమ్మేవారిని ఏమంటారు?’’
‘‘నాకు తెలియదు.. కానీ అలా ఎవరున్నారు? ’’
‘‘మతం లేదని నమ్మిన వారికి కులం ఉంటుందా? కులం లేకపోతే పిల్లల పెళ్లిళ్లు సొంత కులంవారితోనే జరిపించడం యాధృచ్చికమేనా? ’’
‘‘ఎవరు వాళ్లు’’
‘‘నేను మాట్లాడుతున్నది సినిమా దేవుళ్ల గురించి’’


‘‘చెప్పాను కదా.. కొన్ని విషయాలు లాజిక్కుకు అందవు. టాపిక్ మార్చు’’
‘‘కర్నాటక మాజీ సిఎం యడ్యూరప్పను కోర్టు నిర్దోషిగా తేల్చింది.’’
‘‘పిచ్చోడా! ఈ దేశంలో అవినీతి లేనిదే రాజకీయాలు ఉండవు. రాజకీయ అవినీతి ఎప్పుడూ రుజువు కాదు? యడ్యూరప్ప లాంటి వాళ్లు అమాయకంగా కేసుల్లో చిక్కి పదవులు పోగొట్టుకుంటారు. తెలివైన వారు కేసులకే చిక్కరు. చిక్కినా ‘స్టే’లతో తప్పించుకుంటారు. ’’
‘‘మరి ఇనుప ఖనిజం ఏమైనట్టు?’’
‘‘బెర్ముడా ట్రయాంగిల్‌లో మునిగిన ఓడలు, విమానాలు ఏమైనట్టు? ఇదీ అంతే. నువ్వే చెప్పావు.. కొన్ని విషయాలు మనకు ఎప్పుడూ అర్థం కావు అని ’’
‘‘ యడ్యూరప్ప అవినీతికి పాల్పడ్డాడా? లేదా? ’’
‘‘నువ్వు గాలిని కళ్లకు చూపిస్తే- అవినీతిని నిరూపిస్తా ’’
‘‘ నీకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేదా?’’
‘‘ఏ కుంభకోణం బయటపడినా రాజకీయ నాయకులు చెప్పే మొదటి మాట న్యాయవ్యవస్థ మీద తమకు పూర్తి నమ్మకం ఉంది అని! నిజానికి వారికి న్యాయవ్యవస్థపై పూర్తి అవగాహన ఉంది అని ఆ మాటలకు అర్ధం. న్యాయవాదుల కన్నా నాయకులకే న్యాయ వ్యవస్థపై అవగాహన ఉంటుంది. ఎంత మంది న్యాయవాదులను చూశాం, ఎన్ని కోర్టు సీన్లు చూశాం. బాబు చెప్పక ముందు ‘నాట్ బిఫోర్ మీ’ అనేదొకటి ఉందని మనకు తెలుసా? కొత్త డాక్టర్ కన్నా పాత రోగి మేలు అన్నట్టు ఇదీ అంతే’’


‘‘ఏ కేసూ నిలవనప్పుడు కేసులు పెట్టడం ఎందుకు?’’
‘‘మహాభారత యుద్ధం- ఫలితం ముందే తెలిసినా శ్రీకృష్ణుడు రాయబారం నడపడం ఎందుకు? అంటే ఏం చెబుతాం.. కొన్ని అలా జరుగుతుంటాయి అంతే. ’’
‘‘ఇంతకూ న్యాయం జరుగుతుందా? లేదా? ’’
‘‘కవచ కుండలాలు ఉన్నంత వరకు కర్ణుణ్ణి చంపలేరు. నేరుగా తలపడి వాలిని చంపలేరు. ఆయుధం చేతిలో ఉన్నప్పుడు భీష్ముణ్ణి ఓడించలేరు. . కొందరికి ఇలా వరాలు ఉంటాయి’’
‘‘పోనీ.. ఆ ఎన్‌కౌంటర్ నిజమైనదేనా? ’’
‘‘పోలీసులు నిజం చెప్పరు. పౌర హక్కుల నాయకులు అక్కడ లేరు. మృతులు బతికి వచ్చి నిజం చెబుతారా? నిజం తెలిసేంత వరకు అధికారిక అబద్ధమే నిజం. ’’
‘‘నీతో మాట్లాడడం కన్నా.. అదేదో ‘బతుకు బ స్టాండ్’లో మాజీ హీరోయిన్ల నీతులు వినడం బెటర్’’


‘‘బతుకు జట్కాబండి అంటున్న మాజీ హీరోయిన్లు దాదాపు అందరికీ రెండో పెళ్లి మొగుళ్లే కదా? వీరి జట్కా ప్రోగ్రామ్‌కు మొగుడి మొదటి భార్య వచ్చి పంచాయితీ పెడితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది.’’
‘‘మాజీ హీరోయిన్లు ఇతరుల బతుకును బస్టాండ్ చేస్తారు.. కానీ- తమ బతుకును  చేసుకోరు. రెండవ మొగుడి మొదటి భార్య ఇలాంటి ప్రోగ్రామ్స్ కు వస్తే ఏమవుతుందో బాగా తెలుసు . ’’
* - బుద్దా మురళి జనాంతికం (28.10.2016 ) 

21, అక్టోబర్ 2016, శుక్రవారం

అతి నీతి పరులు..!

‘‘రోజురోజుకూ అవినీతి పెరిగిపోతోంది’’
‘‘ఏంట్రోయ్.. నువ్వు కూడా విలువల కోసం పరితపిస్తున్నావ్! బాగానే సంపాదించినట్టున్నావ్! మాదకద్రవ్యాల వ్యాపారం ఏమైనా మొదలుపెట్టావా? ’’
‘‘మనకంత అదృష్టమా? పేపర్‌లో అవినీతి కుంభకోణం అని కనిపిస్తే యథాలాపంగా ఏదో మాట్లాడాను. కానీ, మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేంత దమ్ము లేదు. చేసినా మరీ విలువల గురించి మాట్లాడేంత నీచ స్థాయిలో మాత్రం సంపాదించను.. నీమీద ఒట్టు’’
‘‘ఒట్టు ఎందుకులే’’
‘‘నిజంగా దేశంలో అవినీతి అంత ప్రమాదకరమైన స్థాయికి పెరిగిందా?’’
‘‘ఔనురా! అవినీతి బాగా పెరిగిందని ఐదువందలు, వెయ్యి రూపాయల నోటు రద్దు చేయాలని ‘బాబుగారు’ అడిగితే మా ఏరియాలో ఏకంగా ఐదు రూపాయల నోట్లను కూడా రద్దు చేసి పారేశారు.’’
‘‘ ఏహే.. నేను సీరియస్‌గా అడుగుతుంటే నువ్వేంటి జోకులు వేస్తున్నావ్’’
‘‘ ఒరే సన్నాసీ.. నీకో ఏడాది గడువిస్తాను. ఉభయ రాష్ట్రాల్లో కనీసం రెండు కోట్ల ఇళ్లు ఉన్నాయి. కనీసం ఒక్కటంటే ఒక్క ఇల్లయినా ఎవడో ఒకడికి ఎంతో కొంత ముట్టచెప్పకుండా కట్టి ఉంటే నాకు చూపించు’’
‘‘అంత దాకా ఎందుకు? మా ఇంటికి రా చూపిస్తాను. ఎవడికీ ఒక్క పైసా లంచం ఇవ్వకుండా కట్టాను’’


‘‘దీన్నే  అజ్ఞానం అంటారు. ఒకప్పుడు నాకూ ఈ అజ్ఞానం ఉండేది. మా బిల్డర్ నాకు జ్ఞానోదయం ప్రసాదించాడు. పైసా లంచం ఇవ్వకుండా ఇల్లు కట్టాను చూడు- అని బిల్డర్‌కు గొప్పగా చెబితే వాడు నన్ను వెర్రివాడ్ని చూసినట్టు చూసి ఇలాంటి పిచ్చోళ్లు ఉంటారని మాకు ముందే తెలుసు సార్! మీకు రేటు చెప్పేప్పుడే లంచం కలిపే చెబుతాం. ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా సరే లంచం రేటు కలిపే ఉంటుందని అన్నాడు. లంచం ఇవ్వకుండా మహా అయితే- విశాఖ సముద్రం ఒడ్డున ఇసుకతో బొమ్మరిల్లు కట్టుకోవచ్చు.. ఇల్లు కట్టడం సాధ్యం కాదు.ఈ విశ్వాన్ని నేనే నడిపిస్తున్నాను అని చెప్పుకొన్న శ్రీకృష్ణుణ్ణి కూడా అవినీతి నడిపించింది 
 జయలలిత సత్య భామగా  అలిగి  గృహం లోకి వెళితే ... ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడిగా లోనికి  ప్రయత్నిస్తే చెలికత్తె అడ్డుకొంటుంది .. బంగారు ఉంగరం లంచంగా ఇచ్చి ఎన్టీఆర్ లోనికి వెళతారు . ’’
‘‘నువ్వు చూశావా ?’’
‘‘ఎన్టీఆర్ చూపించారు ..ఓ సినిమా లో నేను చూశాను ... ’’

‘‘నువ్వు అవినీతిని ప్రోత్సహిస్తున్నావా? ’’
‘‘ అబ్బో.. దానికి బోడి ఒకడి ప్రోత్సాహం అవసరం లేదు. అవినీతి స్వయం ప్రకాశం. విశ్వ వ్యాప్తం .. అజరామరణం ...  గాలి పీల్చుకోకుండా బతికానని ఎవడైనా చెబితే నమ్మకు.. అది సాధ్యం కానే కాదు. అవినీతి కూడా అంతే.. వ్యవస్థకు అది ఆక్సిజన్ లాంటిది. రక్తం నుంచి ప్లేట్‌లెట్స్ వేరు చేయవచ్చు కానీ వ్యవస్థ నుంచి అవినీతిని వేరు చేయలేం.’’
‘‘అలా అందరినీ ఒకే గాటన కట్టేయవద్దు. బాలయోగి దశాబ్దాల పాటు ఏమీ తినకుండా బతికారట! తొమ్మిదేళ్లపాటు సిఎంగా పని చేసిన బాబు ఆస్తి మన వీరయ్య గాడి పూరిపాక విలువంత ఉందట! స్వయంగా లోకేశ్ బాబు చెప్పాడు. ఇవన్నీ నిజం కాదంటావా? ’’
‘‘బాలయోగి గురించి నాకు తెలియదు. భక్తుల మనోభావాలు దెబ్బతీయరాదని తెలుసు. ఎవరి నమ్మకాలు వారివి. అలాంటి వారి సంగతి మనకెందుకు? ’’


‘‘డొంకతిరుగుడుగా మాట్లాడకు.. అవినీతిపరులు దేశానికి ప్రమాదమా? కాదా? సూటిగా సమాధానం చెప్పు’’
‘‘అవినీతిపరుల కన్నా అతి నీతిపరులతో ఈ దేశానికి చాలా ప్రమాదం.’’
‘‘???’’
‘‘నీకు అర్థం కావాలంటే చిన్నప్పుడు చదివిన ఓ కథ చెబుతాను. ఓ ఊళ్లో ఓ మోతుబరి చాలా తెలివైన వాడు. ఓ గురువు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ మోతుబరి ఉంటున్న ఊరికి వచ్చి, ఆ ఇంటి ముందే భక్తులకు విలువలతో కూడిన జీవితం దైవానికి మనిషిని దగ్గరకు చేరుస్తుందని అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇలాంటి వ్యక్తులపై నమ్మకం లేని మోతుబరి అటువైపుకూడా చూడలేదు. ఉపన్యాసాలు ముగించుకుని ఆ గురువు పొరుగూరుకు వెళ్లిపోయారు. మరుసటి రోజు శిష్యుడు మోతుబరి ఇంటికి వచ్చి అయ్యా మీరు క్షమించాలి. మీ ఇంటి ముందు గడ్డిలో కూర్చోని గురువు గారు బోధనలు చేశారు. వెళ్లిపోయేప్పుడు గమనించలేదు. మా గురువు గారి పంచెకు మీ ఇంటి ఆవరణలోని గడ్డిపోచ అంటుకుంది. పరుల సొమ్ము దొంగతనంగా తెచ్చామనే బాధ గురువుగారిని పీడిస్తోంది. మీ గడ్డి పోచను మీరు తీసుకుని క్షమించానని చెప్పేంత వరకు గురువుగారికి ప్రాయశ్చిత్తం లేదని శిష్యుడు వేడుకున్నాడు. ఆ మాటలకు మోతుబరి చలించిపోయాడు. ఇంతటి మహానుభావులు కలికాలంలో ఉండడం, వారు ఇంటి ముందుకు వస్తే అవమానించి పంపానని తనను తాను తిట్టుకుని గురువు కాళ్లమీద పడి తమ ఇంటికి వచ్చి పావనం చేయాల్సిందే.. అని వేడుకున్నాడు. కాదనలేక గురుశిష్యులు ఆ రాత్రి మోతుబరి ఇంట్లో పడుకున్నారు. తెల్లారి లేచి చూసే సరికి గురుశిష్యులు లేరు ఇంట్లో డబ్బు, నగలు లేవు. అతి నీతి పరులైన మహనీయులు ఇలానే ఉంటారు. వారి ఉపన్యాసాలు అచ్చం ఆ గురువుగారిలానే ఉంటాయి. ’’


‘‘నువ్వు సత్యహరిశ్చంద్రుడిని కూడా అనుమానించేట్టుగా ఉన్నావు?’’
‘‘మనం ఈ కాలం సత్యహరిశ్చంద్రుల కాలంలోనే ఉన్నాం. ఆనాటి సత్యహరిశ్చంద్రుడు ప్రాణం పోయినా అబద్ధం చెప్పలేదు, సత్యహరిశ్చంద్రుల లేటెస్ట్ వెర్షన్ ఇప్పుడు ప్రాణం పోయినా నిజం చెప్పరు. ఆస్తుల ప్రకటన కావచ్చు, జీవితం కావచ్చు. ఏదైనా నిజం చెప్పరు.’’
‘‘ఏంటో మీరు అంతా రివర్స్‌లో మాట్లాడుతున్నారు’’
‘‘లోకమే రివర్స్‌గా ఉంది.. నువ్వే దాన్ని సరిగా చూడడం లేదు. నిజం చెప్పవద్దనే శాపం పాలకులకే కాదు.. సామాన్య ఓటర్లకు సైతం ఉంటుంది. పెళ్లికి ముందు నాటి నీ ప్రేమ పురాణం నిజాయితీగా చెబితే మీ ఆవిడ విడాకులిస్తుంది. నాయకులు నిజం చెబితే తల ముక్కలవుతుంది. ఈ ప్రపంచమే అబద్ధల మీద బతుకుతోంది. పర్సంటేజ్‌లో తేడా ఉంటుంది’’
‘‘వీళ్లను గుర్తించే ఉపాయమే లేదా? ’’
‘‘ఎందుకు లేదు? ఎవరైతే నిరంతరం నైతిక విలువల గురించి మాట్లాడతారో? విలువలు పడిపోతున్నాయని ఆవేదన చెందుతారో అలాంటి వారు తడిగుడ్డతో గొంతు కోసే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా మసులుకోవాలి.’’


‘‘మీరు విలువలకు నిలువెత్తు రూపం’’
‘‘ఇదిగో.. ఏదో నెల జీతం మీద బతికే వాడ్ని. నాకేమన్నా కోట్ల రూపాయల ఆస్తులున్నాయనుకుంటున్నావా? విలువల రూపం అంటున్నావ్. ఇంకో సారి అలా తిడితే మర్యాదగా ఉండదు. ’’ *

జనాంతికం - బుద్దా మురళి ( 21. 10. 2016 శుక్రవారం ) 


14, అక్టోబర్ 2016, శుక్రవారం

ఇంటింటా ‘సర్జికల్ స్ట్రైక్’!

‘.‘ఛీ ఛీ  .. బుద్ధి లేకపోతే సరి.’’
‘‘ఏంటోయ్ టీవీ చూస్తూ తిడుతున్నావ్ ఎవరిని?’’
‘‘ఇంకెవరినీ అదిగో వాళ్లనే’’
‘‘అక్కినేని రొమాంటిక్ హీరోగా వెలిగిపోతున్న ‘మురళీకృష్ణ’ సినిమా కాలం వాడివి. కళ్లతోనే హీరోయిన్లు శృంగారాన్ని ఒలికించే కాలం కాదిది. హీరో,హీరోయిన్ల సాంగ్ అంటే వాత్సాయనుడి భంగిమలే. దీనికే ఇలా ఫీలయితే ఎలా? ’’
‘‘నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. ఎన్టీఆర్.. ఊపిరి ఆగిపోయేంతలా అమ్మాయిని ఆలింగనం చేసుకున్న సీన్లను చూస్తూ పెరిగిన శరీరం ఇది. ఇలాంటి సీన్లు నాకో లెక్కా.’’
‘‘మరేంటి?’’
‘‘సినిమాలో డ్యూయెట్లు పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, వాళ్లకు కొంచమైనా ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. ఇంకెంత కాలానికి మారుతారో? ’’


‘‘దేని గురించో చెబితే.. నా వంతు తిట్లు నేనూ తిడతాను’’
‘‘లో బడ్జెట్, భారీ బడ్జెట్ అనే తేడా లేదు అన్నింటిలో ఇదే. హీరో, హీరోయిన్లు వాత్సాయన భంగిమలో పార్కుల్లో కిందా మీదా పడి దొర్లుతూ వారి బాధలేవో వాళ్లు పడుతుంటే హీరోయిన్ వైపు ఓ రెండు డజన్ల మంది, హీరో వైపు మరో రెండు డజన్ల మంది మిమిక్రీ ఆర్టిస్టులు గొంతును ఇమిటేట్ చేసినట్టు. ఈ నాలుగు డజన్ల మంది హీరో,హీరోయిన్ల డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తుంటారు. ఇంట్లో వాళ్లను తప్పించుకుని పార్కుల్లో పాటలు పాడుకుంటున్న వారిని ఒంటరిగా వదిలేయాలనే కనీస జ్ఞానం ఉండదు. ఏం మనుషులో’’
‘‘భలే  వాడివోయ్.. పాపం వాళ్లదేం తప్పు కావాలంటే డైరెక్టర్‌ను తిట్టు. ప్రపంచంలో ఏ జంటా అలా నాలుగైదు డజన్ల మందిని తీసుకెళ్లి డ్యూయెట్లు పాడదు. అస్పత్రిలో జయలలిత, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, తెలంగాణలో కొత్త జిల్లాలు, అమెరికాలో రాజకీయ శూన్యత ఏర్పడిందని అమరావతి నుంచి బాబు ప్రకటన. ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య సర్జికల్ స్ట్రైక్ వంటి కీలక అంశాలు ఎన్నో ఉండగా, ఊహించని విధంగా నువ్వు సర్జికల్ అటాక్ జరిపావు నాపై ’’


‘‘ఉత్తరప్రదేశ్‌లో సైనికులు, మోదీ ఉమ్మడి పోస్టర్లను చూసి ఎన్నికల్లో ఎక్కడ దెబ్బతింటామో అని ఇతర పార్టీలు కంగారు పడి ఏదేదో మాట్లాడుతున్నాయి. కానీ, కామన్ మ్యాన్ ప్రతి రోజూ సర్జికల్ అటాక్‌ల మధ్యనే కాలం గడుపుతాడు కదా? యుద్ధానికి, యుద్ధానికి మధ్య విరామ కాలమే ‘శాంతి’ అని ఎవరో పెద్దాయన అన్నట్టు జనన, మరణాల మధ్య జీవితమంతా సర్జికల్ అటాక్‌ల మధ్య గడపడమే కాదు. మహానగరంలో ఇంటి నుంచి బయట అడుగు పెట్టాక ఎవడు ఎటు నుంచి వాహనంతో మెరుపుదాడి జరుపుతాడో తెలియదు.’’
‘‘సరిహద్దుల్లో ఇవి మామూలే కావొచ్చు. రాజకీయాల్లో మాత్రం ఈ సర్జికల్ అటాక్ లు భలేగా ఉంటాయి. ’’
‘‘ తమ్ముళ్లంతా కాళ్లు మొక్కుతుంటే- నా పేరు చెప్పి ‘చెప్పు’ను నిలబెట్టినా గెలుస్తాడు అని ఎన్టీఆర్ ధీమాగా ఉంటే అల్లుడి జరిపిన సర్జికల్ స్ట్రైక్ నుంచి ఎన్టీఆర్ కోలుకోలేక పోయారు. పాపం ఆ దెబ్బ తరువాతే కదా పెద్దాయన పై లోకానికి వెళ్లింది. రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యూహాత్మక సర్జికల్ స్ట్రైక్ మరోటి కనిపించదు. ’’
‘‘ సర్జికల్ అటాక్  చరిత్ర చాలా పాతదే?’’
‘‘భూమి  పుట్టినప్పటి నుంచి ఉంది? ’’
‘‘ఆలోచిస్తే అలానే అనిపిస్తోంది. మహాభారతంలో అడుగడుగునా సర్జికల్ అటాక్‌లు కనిపిస్తాయి ’’
‘‘ యుద్ధ సమయంలో శత్రు శిబిరంలోకి వెళ్లి- తాతా.. నిన్ను ఓడించడం కష్టంగా ఉంది. నువ్వెలా చస్తావో కాస్త చెప్పు అని ధర్మరాజు తాత భీష్ముడిని అడగడానికి మించిన మెరుపు దాడి ఇంకోటి లేదేమో. నవ్వెలా చస్తావు అని అడగడం, చెప్పడం ప్రపంచ సాహిత్యంలోనే నేటికీ అపురూపం. పాపం ఆ సమయంలో భీష్ముడు మనసులో ఏమనుకున్నాడో? ’’
‘‘అచ్చం సర్జికల్ స్ట్రైక్‌లానే ఆంధ్రలో దోమలపై వ్యూహాత్మక దాడులు జరపుతామని ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు కదా.. ఎంత వరకు వచ్చింది?’’
‘‘దోమలేమన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులా? ఆరోగ్య శాఖ సిబ్బంది భారత సైనికులా? మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి ప్రకటనలు మామూలే అని దోమలకు తెలియదా? ఏంటి? ’’


‘‘మన సంగతికేం కానీ ప్రపంచానికి పెద్దన్నలాంటి అమెరికాకే ఎంత కష్టం వచ్చిపడింది? ’’
‘‘నీకూ నాకూ కష్టం కానీ అమెరికా కేం కష్టం? ఉంటే గింటే ఇతర దేశాలను ఎలా వేధించాలనే ఆలోచనలతో కష్టపడుతుంటారు.’’
‘‘అమెరికాలో నాయకత్వ శూన్యత ఏర్పడిందట కదా? బాబు గారు చెప్పారు వినలేదా? ’’
‘‘అమరావతిలో రాజధాని నిర్మాణం తప్ప ప్రపంచంలో అన్ని విషయాలను బాబుగారు క్షణ్ణంగా అధ్యయనం చేస్తారు. చూడోయ్ ట్రంప్- రేవంత్‌రెడ్డి లాంటి వాడు అని నేను ఎప్పుడో చెప్పాను. సంచలన ప్రకటనలతో మొదట్లో మీడియాలో చోటు సంపాదిస్తారు. తరువాత అదే మీడియా చీ..చీ.. ఇంత దుర్మార్గుడు మరొకరు లేరు అని చెబుతుంది. ట్రంప్‌కు అదే జరిగింది. ఇదే అమెరికా మీడియా అకాశానికెత్తింది. తీరా ఎన్నికలు సమీపించగానే ఇదే మీడియా వీడంత దుర్మార్గుడు లేడు అనే ప్రచారం మొదలు పెట్టింది. ట్రంప్‌కు విషయం అర్థమయ్యే సరికి పుణ్యకాలం దాటిపోయింది. ’’
‘‘ట్రంప్ రాజకీయాలకు తగడు అని బాబుచెప్పిన మాటల ప్రభావం వల్ల అమెరికా ఓటర్లు ట్రంప్‌ను ఓడించే అవకాశం ఉంటుంది కదా? ’’
‘‘ఎన్నికల ఫలితాలు వచ్చాక నువ్వు ఇలా ప్రచారం చేసుకో అడ్డుకునేవారెవరూ ఉండరు.’’
‘‘ అమెరికా లో రాజకీయ శూన్యత గురించి ఆలోచించే లోక నాయకుడిని రాజధాని ఎప్పుడు కడతారు ? పోలవరం పూర్తి చేస్తారా ? జిల్లాల సంఖ్య పెంచుతారా ? అనే సిల్లీ ప్రశ్నలు అడగడం తగదు ... అంతర్జాతీయ స్థాయి లోనే ప్రశ్నలు ఉండాలి .. ఇంతకూ సర్జికల్ అటాక్ జరిగిందో లేదో నీ అభిప్రాయం చెప్పలేదు.’’
‘‘నువ్వు బాగా మందు కొట్టి వెళ్లినప్పుడు మీ ఆవిడ తలపై కొట్టిందని నవ్వు పైకి చెప్పుకోలేవు. బుర్రపై బొడిపెలు రెండు రోజుల తరువాత కనిపించవు. దాడి జరిగిందంటావా? జరగలేదంటావా? ఇంట్లో సంగతులు బయట చర్చించవద్దు. రాజకీయాలను, సైన్యాన్ని కలిపేయవద్దు. ఎవరి డ్యూటీ వాళ్లు చేస్తారు. రాజకీయాలు, సైన్యం రెండింటినీ కలిపిస్తే పాకిస్తాన్ లా వికృత రూపం తయారవుతుంది. 

అది దేశానికే కాదు... ప్రపంచానికీ మంచిది కాదు.

 - బుద్దా మురళి( జనాంతికం14. 10. 2016 శుక్రవారం ) 

11, అక్టోబర్ 2016, మంగళవారం

నవ తెలంగాణకు నాంది

రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణకు అంతటి ప్రాధాన్యతను తెచ్చిపెట్టిన రోజు ఇది. పది జిల్లాల తెలంగాణ 31 జిల్లాల నవ తెలంగాణగా ఆవిర్భవిస్తున్న రోజు. నవ శకానికి నాంది పలుకుతున్న రోజు. జిల్లా కేంద్రం అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉండేదని అని మాత్రమే కాదు. అభివృద్ధికి కేంద్రం. సాధారణంగా రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. అదే విధంగా జిల్లాల్లో జిల్లా కేంద్రం చూట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. పది జిల్లాల స్థానంలో 31 జిల్లాలు అవుతుండడం వల్ల తెలంగాణలో మరో 21 అభివృద్ధి కేంద్రాలకు శ్రీకారం చుడుతున్న రోజు. 

విజయదశమి నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లాను ప్రారంభిస్తారు. ఒకే ముహూర్తంలో కొత్త జిల్లాలు ప్రారంభం అవుతాయి. శుభ కార్యక్రమాన్ని దసరా రోజున శ్రీకారం చుట్టడం తెలంగాణలో ఆనవాయితీ. ఆంధ్రలో సంక్రాంతి పెద్ద పండుగ. తెలంగాణలో దసరా పెద్ద పండుగ. తెలంగాణలో ఇప్పుడు దసరా పండుగకు కొత్త కళ వచ్చినట్లయింది. ఈ దసరా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే పండుగ. 111 ఏళ్ల తరువాత ఈ నేలపై మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇది ఇప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం ఖాయం అనే గట్టి నమ్మకంతో ఉన్న ఉద్యమ నాయకత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అప్పుడే చర్చలు జరిపింది. ఎన్నికల ప్రణాళికలో సైతం పాలన ప్రజలకు చేరువగా ఉండేందుకు జిల్లాలను విభజించనున్నట్టు టిఆర్‌ఎస్ పేర్కొంది. ఉద్యమ పార్టీనే అధికారంలోకి రావడంతో చెప్పిన విధంగా, కోరుకున్న విధంగా తెలంగాణ రూపురేఖలు మార్చేందుకు తెలంగాణను నవ తెలంగాణగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది, అమలు చేస్తోంది. దసరా రోజునే ఆంధ్రప్రదేశ్ పాలన కొత్త రాజధాని అమరావతి నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజున తెలంగాణలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావడం దసరా ప్రత్యేకత.


111 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనే పాలకులకు రాలేదు. 1905లో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 78లో ఏర్పడిన రంగారెడ్డి జిల్లా, 53లో ఏర్పడిన ఖమ్మం జిల్లా మినహాయిస్తే మిగిలిన తెలంగాణలోని జిల్లాలన్నీ 111 సంవత్సరాల క్రితం ఏర్పడినవే.
శతాబ్ద కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి. రాజరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం పోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పాలనా తీరు మారింది. అయినా జిల్లాల సంఖ్యలో మాత్రం మార్పు చోటు చేసుకోలేదు.
ఉన్న జిల్లాలు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి, కొత్త జిల్లాల అవసరం లేదని ప్రజలు, పాలకులు భావించారని కాదు. కొత్త జిల్లాల కోసం కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల ఏదో ఒక రూపంలో ఆందోళన చేశారు. వికారాబాద్ జిల్లా కోసం ఆ ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాల పాటు ఆందోళన చేసి, ఇక సాధ్యం కాదు అనే నిర్ణయానికి వచ్చారు. అలాంటిది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి 21 కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి. దానిని కొందరు విమర్శిస్తుంటే తమ నియోజక వర్గాన్ని జిల్లాను చేయాల్సిందే అని కొందరి ఆందోళన. అందరినీ సంతృప్తి పరచడం ఎవరివల్లా సాధ్యం కాదు. ఒకటో రెండో ఎక్కువ అనిపించవచ్చు, ఒకటి రెండు ప్రాంతాలు మిగిలిన వారి కన్నా జిల్లా కేంద్రంగా మారే అర్హత తమ ప్రాంతానికే ఎక్కువ ఉందనే అసంతృప్తి ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి సాహసోపేతంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలు ఉంటే తెలంగాణ కన్నా చిన్నదైన అస్సాంలో 34 జిల్లాలు ఉన్నాయి. జిల్లాల ఏర్పాటు తేనెతుట్టేలాంటిదని, ముట్టుకుంటే ఏమవుతుందో అని భయపడ్డారు. కానీ చిన్న జిల్లాల వల్ల పాలన ప్రజలకు మరింతగా చేరువ అవుతుందని, ప్రభుత్వ పథకాల అమలు మరింత సమర్ధవంతంగా ఉంటుందనే ఆలోచన చేయలేదు. ఎన్టీరామారావు విప్లవాత్మకంగా ప్రజల వద్దకు పాలనను ఆచరణలో చూపిస్తూ తాలుకాల స్థానంలో మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నియోజక వర్గాల సైజులో ఉండే తాలుకాల్లో అప్పటి వరకు పెత్తందార్లదే పెత్తనం. మండల వ్యవస్థ వల్ల స్థానిక నాయకత్వం చాలా బలపడింది. మండల స్థాయి నుంచి వచ్చిన ఎంతో మంది నాయకులు తరువాత మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు అయ్యారు. ప్రధానంగా అప్పటి వరకు అధికారం చెలాయించిన సామాజిక వర్గాలకు పోటీగా ఇతర అణగారిన సామాజిక వర్గాల నాయకత్వం మండల వ్యవస్థ వల్ల బలపడింది. ఎందుకో కానీ జిల్లాల విషయంలో ఎన్టీఆర్ సాహసం చేయలేకపోయారు. మండలాలు ఏర్పాటు చేసినప్పుడు తీవ్రస్థాయిలో రాజకీయ వ్యతిరేకత వచ్చింది. మండల కార్యాలయాలు లేవు, పాలన అస్థవ్యవస్థంగా మారింది అనే విమర్శలతో కాంగ్రెస్ నాయకత్వంలో ఆందోళనలు జరిగాయి. తహసిల్దారులు తమ అధికార పరిధి తగ్గిందని ఆందోళన చెందారు.


మొండి ఘటాలుగా పేరు పొందిన ఎన్టీరామారావు, వైఎస్‌రాజశేఖర్ రెడ్డి సైతం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సాహసించలేకపోయారు. రాజకీయ తుఫానుకు ఆవకాశం కల్పించినట్టు అవుతుందని సందేహించి అటువైపే చూడలేదు. అలాంటిది 10 జిల్లాలను 31 జిల్లాలుగా మారుస్తుండడంతో విపక్షాలకు ఏం చేయాలో పాలుపోని స్థితి. జిల్లాల ఏర్పాటు కెసిఆర్ లక్కీనంబర్ ప్రకారం చేస్తున్నారని తొలుత విమర్శించారు. కెసిఆర్ లక్కీ నెంబర్ 6 కావడం వల్ల 24 జిల్లాలు అని తొలుత భావించారు. ఇంత కీలకమైన అంశంపై విపక్షాలు లక్కీనంబర్ అంటూ విమర్శలకే పరిమితం అయ్యారు. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న ఆలోచన చేయలేదు. శాస్ర్తియంగా విభజన జరగలేదు అనే మాట తప్ప విభజన ఎలా ఉండాలో చెప్పిన నాయకులు లేరు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్షమైనా జిల్లాల స్వరూపం ఫలానా విధంగా ఉండాలని స్పష్టంగా చెప్పాల్సింది. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సాగేప్పుడే కాదు చివరకు 31 జిల్లాలు ఖరారైన తరువాత కూడా ఎన్ని జిల్లాలు ఉండాలి, జిల్లాల స్వరూపం ఏ విధంగా ఉండాలి అనే మాట ప్రధాన ప్రతిపక్షం నుంచి రాలేదు. టిడిపి నుంచి సలహాలు ఆశించలేం. కానీ ప్రధాన ప్రతిపక్షం సైతం ఇంత కీలక సమయంలో ప్రధాన పాత్ర వహించలేకపోవడం విచిత్రం. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజక వర్గాలను జిల్లాలు చేయాలని పట్టుపట్టారు. కానీ మొత్తం కాంగ్రెస్ పక్షాన జిల్లాల స్వరూపంపై ఎలాంటి ప్రతిపాదన లేదు. రాజకీయ పార్టీలను పక్కన పెట్టి తెలంగాణ జెఎసి తరఫున కూడా ఇలాంటి ప్రతిపాదన లేదు. అమలులో ఉన్న చట్టం కాకుండా కొత్తగా చట్టం తీసుకువచ్చి దాని ప్రకారం జిల్లాలు చేయాలనే డిమాండ్ తప్ప కొత్త జిల్లాల స్వరూపంపై టిజెఎసి కూడా స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు. ఏ జిల్లా గురించి మాట్లాడితే ఏమవుతుందో అనే భయంతో అన్ని రాజకీయ పక్షాలు కప్పదాటు వైఖరి అవలంబించడం టిఆర్‌ఎస్‌కు కలిసి వచ్చింది. అన్ని జిల్లాల ఏర్పాటు క్రెడిట్ ఆ పార్టీనే దక్కించుకుంది. జిల్లాల ఏర్పాటు క్రెడిట్ మొత్తం కెసిఆర్ ఖాతాలోనే పడిపోయే విధంగా విపక్షాలు తమకు తెలియకుండానే సహకరించాయి.
తెలంగాణ జిల్లాల ఏర్పాటు ప్రభావం ఆంధ్రపై కూడా పడుతుంది. సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కింది నుంచి మూడవ స్థానంలో ఉంటుంది. ఉత్తరాఖండ్ సరసన ఉంటుంది. ఆంధ్రలో ఉభయ గోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు ఒక మూలన ఉంటాయి. బ్రిటీష్ కాలంలో నౌకాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలను నిర్ణయించారు. 

ఆంధ్ర రాష్ట్ర పాలన విజయవాడ నుంచి సాగుతోంది. విజయవాడ జిల్లా కేంద్రం కూడా కాదు. ఓడరేవు వల్ల బందరును జిల్లా కేంద్రం చేశారు. బ్రిటీష్ కాలం నాటి జిల్లాల స్వరూపం అదే విధంగా కొనసాగుతోంది. తెలంగాణలో జిల్లాల ఏర్పాటుపై మీడియా అడిగినప్పుడు మాకు అధికార వికేంద్రీకరణ ముఖ్యం, జిల్లాల ఏర్పాటు కాదు అని చంద్రబాబు చిత్రమైన సమాధానం ఇచ్చారు. జిల్లాల సంఖ్య పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. అయితే నిండా రాజకీయల్లో మునిగిపోయిన ఆంధ్రలో ఇప్పట్లో జిల్లాల ఏర్పాటుకు బాబు సాహసించే పరిస్థితి లేదు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న తమ ప్రాంతాన్ని జిల్లా చేయలేదని కొందరు విమర్శిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక సంపద గల హిందువుల ఆలయం ఉన్న తిరుపతి జిల్లా కేంద్రం కాదు. విజయవాడ జిల్లా కేంద్రం కాదు. జిల్లా కేంద్రం కాకముందే వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. జిల్లా కేంద్రం కాకపోవడం వల్ల చారిత్రక ప్రాధాన్యత ఏమీ పోదు. జిల్లాలను ఖరారు చేయడంలో రాజకీయ కోణం లేదా? అంటే కచ్చితంగా రాజకీయ కోణం కూడా ఉంటుంది. కెసిఆర్ ఏమీ తనను తాను అర్పించుకున్న దదీచి, శిబి చక్రవర్తి కాదు. పక్కా రాజకీయ నాయకుడు. ఐతే ఉద్యమ నాయకునిగా తనను ఆదరించిన ప్రజల సమస్యలు తెలిసినవాడు. తానే కాకుండా తన పాలన ద్వారా తన వారసునికి సైతం రాజకీయ అధికారం దక్కాలి అని కోరుకునే రాజకీయ నాయకుడు. తెలంగాణకు ఏం చేస్తే బాగుంటుందో తెలిసిన నాయకులు. ప్రజలు ఎలా పోయినా పార్టీ ముఖ్యం అనుకుంటే తప్పు. కానీ ప్రజలకు, పార్టీకి మేలు కలగాలి అని కోరుకోవడం తప్పు కాదు.


 జిల్లాల ఏర్పాటు ముమ్మాటికీ నవ తెలంగాణకు నాంది పలికే నిర్ణయం. ఈ నిర్ణయం సరైనదా? కాదా? అన్నది అర్ధం చేసుకోవడానికి సమయం పట్టవచ్చు. కానీ కచ్చితంగా ఈ నిర్ణయం తెలంగాణకు మేలు చేస్తుంది.
-బుద్ధా మురళి 11. 10. 2016 (ఎడిట్ పేజీ )

2, అక్టోబర్ 2016, ఆదివారం

పాలకులపై దోమల విశ్వాసం

ఉద్వేగపూరితమైన వాతావరణం.. ‘కమాండర్’ గతంలో ఎప్పుడూ లేనంత సీరియస్‌గా ఉన్నారు.. ఆగస్టు దాటి రెండు నెలలు అవుతోంది.. టెన్షన్‌కు కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో టీవీలో బ్రేకింగ్ న్యూస్‌లు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు.. ముష్కరులను మట్టుపెట్టిన భారత సైన్యం. భారత్‌కు బాసటగా నిలిచిన అనేక దేశాలు. మేము సైతం భారత్ వెంటే అని ప్రకటించిన ఇరాన్.. అంటూ టీవీ పగిలిపోయేలా బ్రేకింగ్ న్యూస్‌లు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో చీఫ్ కమాండర్ యుద్ధతంత్ర రచనలో మునిగిపోయారు. ‘దేశంలో కీలక నిర్ణయం ఏదైనా మన చీఫ్ కమాండర్‌ను అడిగిన తరువాతే చేస్తారు కదా?’ అని బయట నాయకులు మాట్లాడుకుంటుండగానే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఒక దోమ రయ్.. రయ్.. మంటూ బయటకు దూసుకెళ్లింది.


***
సైరన్ మోగడంతో ముఖ్య దోమలు పరుగు పరుగున వచ్చాయి. ‘మన జాతి మొత్తం ప్రమాదంలో పడింది..’ అంటూ గూఢచారి దోమ ఆందోళనగా చెప్పింది. అసలేం జరిగిందో ముందు చెప్పి చావమని దోమల రాణి చిరాగ్గా అంది. మేకప్ వేసుకుంటుంటే సైరన్ విని ఇక్కడికి రావలసి వచ్చినందుకు ఆమెకు కోపంగా ఉంది. మనమంటూ ఉంటేనే కదా మేకప్ వేసుకునేది. ఇప్పుడు కావలసింది కోపం కాదు వ్యూహం.. అని గూఢచారి దోమ చెప్పింది. దోమల గుంపులో ముఖ్యులంతా చేరడంతో అసలు విషయం ఏమిటో చెప్పమని అడిగారు. సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ? ఏం జరిగిందో కళ్లతో చూసి చెవులతో విన్న మన గూఢచారి దోమనే చెబుతుంది.. అని వృద్ధదోమ మైకును అప్పగించింది.


‘ఎప్పటి మాదిరిగానే కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నేను విధి నిర్వహణలో ఉన్నాను. కమాండర్ ఉపన్యాసం వింటూ నిద్ర పోయే వారి రక్తం పీలుస్తూ ఉన్నాను. కాస్త నలతగా అనిపించడంతో కునుకు తీశాను. మేల్కొనే సరికి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అంతా ఆందోళనగా ఉన్నారు. ఏంటా? అని చూస్తే ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టు అయింది. మన జాతిని నిర్మూలించేందుకు నడుం కట్టారు. 2018 నాటికి దోమల రహిత రాజ్యంగా తమ రాజ్యాన్ని తీర్చిదిద్దాలని కమాండర్ నిర్ణయించారు. దీన్ని అల్లాటప్పాగా తీసుకోవడానికి వీలు లేదు. ఓ కొత్త రాజ్యం రాజు గారేమో గతేడాది- ‘దోమల నివారణకు ఔషధ మొక్కలు పెంచండి’ అని చెప్పి ఊరుకున్నారు. అనుభవం గల ఈ రాజు అలా వదిలేయలేదు. తానే చీఫ్ కమాండర్‌ను అని ప్రకటించి దోమలపై యుద్ధానికి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమాలోచనలు జరుపుతున్నారు. దోమలపై యుద్ధానికి సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకోవడానికి కార్పొరేట్ కంపెనీకి బాధ్యత అప్పగించారు. కార్పొరేట్ కంపెనీలో మేధావులంతా సమావేశం అయి దోమల జాతి నిర్మూలనకు సెన్సర్లు ఉపయోగించవచ్చునని నివేదిక ఇచ్చారు. సెన్సర్ల ద్వారా ఎక్కడెక్కడ దోమలు ఉన్నాయి, వాటిలో మగ దోమలు ఎన్ని, ఆడ దోమలు ఎన్ని, ఏ దోమలకు ఏ బ్లడ్ గ్రూప్ ఇష్టం. పిజ్జాలు తినే దోమలు ఎన్ని, శాఖాహార దోమలెన్ని, మాంసాహార దోమలు ఎన్ని? పెళ్లయిన దోమలు, పెళ్లి కాని దోమలు, పెళ్లీడుకు వచ్చిన దోమలు, అసలు పెళ్లే వద్దనుకున్న దోమలు, పునరుత్పత్తి శక్తి ఉన్న దోమలు, ఆ శక్తి లేని దోమలు అంటూ.. దోమల చరిత్ర మొత్తం సెన్సర్లు చెప్పేస్తాయట! సెన్సర్లు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో చీఫ్ కమాండర్‌కే నివేదిక ఇచ్చేస్తాయట! మనకిప్పుడు దిక్కెవరు?


ఇక్కడ నేను సీరియస్ విషయం చెబుతుంటే- ఆ మూలన కుర్ర దోమ పక్కనున్న కుర్రదాన్ని గీకుతున్నాడు. ఏరా! నీకిప్పుడు ఆ పోరిని గీకడం అంత ముఖ్యమా? మనం ఉంటామో? పోతామో? తెలియక మేమేడుస్తుంటే, మనలో ఐక్యత లేకపోవడం వల్లనే మన జీవితాలు ఇలా తగలబడ్డాయి. చివరకు అంతా చిరాకు పడే ఈగ మీద సినిమా తీశారు కానీ దోమ మీద తీయలేదంటే ఈ మనుషులకు మనమీద ఎంత చిన్నచూపో అర్ధం అవుతోంది’’ అని గూఢచారి దోమ తన ఉపన్యాసం ముగించింది.
హాలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 


2018 అంటే.. ఇంకా రెండేళ్లయితే మన జాతి అంతిరించినట్టే అని ముసలి దోమ నిరాశగా పలికింది. ‘ఓయ్ ముసలీ.. నువ్వు తాగని రక్తం లేదు. జీవితంలో అన్నీ అనుభవించావు. నువ్వు ఉన్నా లేకున్నా తేడా లేదు. మేం మాట్లాడేది మా గురించి..’ అని మిగిలిన దోమలు కోరస్‌గా పలికాయి. హైదరాబాద్‌లో మనకూ హక్కుంది. చలో హైదరాబాద్.. రెండేళ్ల తరువాత అప్పటి పరిస్థితిని బట్టి తిరిగి వద్దాం- అని దోమల సైన్యాధ్యక్షుడు ప్రకటించాడు. హైదరాబాద్ సచివాలయంలో మనకూ వాటా ఉంది. చాంబర్ ఉంది. అక్కడ అంతా తల దాచుకుందాం. అటు వైపు నర మానవుడు ఎవరూ రారు. మనకెలాంటి ప్రమాదం లేదు’ అని చెప్పింది.


‘‘మేం సీరియస్‌గా మాట్లాడుకుంటే ముసి ముసిగా నవ్వుకుంటూ ఏమీ పట్టనట్టు ఉన్నావేంటి? కొంపదీసి నువ్వు మనుషుల గూఢచారివా? ’’ అని బలిష్టంగా ఉన్న మధ్య వయసు దోమ వైపు అనుమానంగా చూశాయి.
‘‘పిచ్చి సన్నాసుల్లారా? మీకు కనీసం చీమకున్నంత బుర్ర కూడా లేదు. మనకేమీ కాదు ఇక్కడే ఉందాం. నాదీ హామీ. మా తాతల కాలం నుంచి చూస్తునే ఉన్నాను దొమలపై యుద్ధం అని స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈయనకు పబ్లిసిటీ యావ కాస్త ఎక్కువ కాబట్టి దోమ తెరలు కప్పుకొని రోడ్లపై ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం చేసే యుద్ధంలో ఎప్పుడూ మనదే పై చేయి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. కొత్త హామీ నిలబెట్టుకుంటాడని ఎలా అనుకుంటున్నార్రా! ఇంటికో ఉద్యోగం, 2018లో పోలవరం పూర్తి వంటి హామీలన్నీ అమలు చేస్తే- అప్పుడు 2018లో మనల్ని నిర్మూలిస్తాడని భయపడండి.. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి.’’ అని మధ్యవయసు దోమ చెప్పిన మాటలతో అంతా ఊపిరి పీల్చుకున్నాయ.


 భయం భయంగా సమావేశానికి  వచ్చిన దోమలు- 
పాలకులపై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని ప్రజల రక్తం పీల్చడానికి బతుకు పై సంపూర్ణ ఆశ తో  తమ దారిన తాము వెళ్లిపోయాయి.

జనాంతికం - బుద్దా మురళి(2. 10. 2016)