11, అక్టోబర్ 2016, మంగళవారం

నవ తెలంగాణకు నాంది

రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణకు అంతటి ప్రాధాన్యతను తెచ్చిపెట్టిన రోజు ఇది. పది జిల్లాల తెలంగాణ 31 జిల్లాల నవ తెలంగాణగా ఆవిర్భవిస్తున్న రోజు. నవ శకానికి నాంది పలుకుతున్న రోజు. జిల్లా కేంద్రం అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉండేదని అని మాత్రమే కాదు. అభివృద్ధికి కేంద్రం. సాధారణంగా రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. అదే విధంగా జిల్లాల్లో జిల్లా కేంద్రం చూట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. పది జిల్లాల స్థానంలో 31 జిల్లాలు అవుతుండడం వల్ల తెలంగాణలో మరో 21 అభివృద్ధి కేంద్రాలకు శ్రీకారం చుడుతున్న రోజు. 

విజయదశమి నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లాను ప్రారంభిస్తారు. ఒకే ముహూర్తంలో కొత్త జిల్లాలు ప్రారంభం అవుతాయి. శుభ కార్యక్రమాన్ని దసరా రోజున శ్రీకారం చుట్టడం తెలంగాణలో ఆనవాయితీ. ఆంధ్రలో సంక్రాంతి పెద్ద పండుగ. తెలంగాణలో దసరా పెద్ద పండుగ. తెలంగాణలో ఇప్పుడు దసరా పండుగకు కొత్త కళ వచ్చినట్లయింది. ఈ దసరా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే పండుగ. 111 ఏళ్ల తరువాత ఈ నేలపై మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇది ఇప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం ఖాయం అనే గట్టి నమ్మకంతో ఉన్న ఉద్యమ నాయకత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అప్పుడే చర్చలు జరిపింది. ఎన్నికల ప్రణాళికలో సైతం పాలన ప్రజలకు చేరువగా ఉండేందుకు జిల్లాలను విభజించనున్నట్టు టిఆర్‌ఎస్ పేర్కొంది. ఉద్యమ పార్టీనే అధికారంలోకి రావడంతో చెప్పిన విధంగా, కోరుకున్న విధంగా తెలంగాణ రూపురేఖలు మార్చేందుకు తెలంగాణను నవ తెలంగాణగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది, అమలు చేస్తోంది. దసరా రోజునే ఆంధ్రప్రదేశ్ పాలన కొత్త రాజధాని అమరావతి నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజున తెలంగాణలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావడం దసరా ప్రత్యేకత.


111 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనే పాలకులకు రాలేదు. 1905లో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 78లో ఏర్పడిన రంగారెడ్డి జిల్లా, 53లో ఏర్పడిన ఖమ్మం జిల్లా మినహాయిస్తే మిగిలిన తెలంగాణలోని జిల్లాలన్నీ 111 సంవత్సరాల క్రితం ఏర్పడినవే.
శతాబ్ద కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి. రాజరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం పోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పాలనా తీరు మారింది. అయినా జిల్లాల సంఖ్యలో మాత్రం మార్పు చోటు చేసుకోలేదు.
ఉన్న జిల్లాలు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి, కొత్త జిల్లాల అవసరం లేదని ప్రజలు, పాలకులు భావించారని కాదు. కొత్త జిల్లాల కోసం కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల ఏదో ఒక రూపంలో ఆందోళన చేశారు. వికారాబాద్ జిల్లా కోసం ఆ ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాల పాటు ఆందోళన చేసి, ఇక సాధ్యం కాదు అనే నిర్ణయానికి వచ్చారు. అలాంటిది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి 21 కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి. దానిని కొందరు విమర్శిస్తుంటే తమ నియోజక వర్గాన్ని జిల్లాను చేయాల్సిందే అని కొందరి ఆందోళన. అందరినీ సంతృప్తి పరచడం ఎవరివల్లా సాధ్యం కాదు. ఒకటో రెండో ఎక్కువ అనిపించవచ్చు, ఒకటి రెండు ప్రాంతాలు మిగిలిన వారి కన్నా జిల్లా కేంద్రంగా మారే అర్హత తమ ప్రాంతానికే ఎక్కువ ఉందనే అసంతృప్తి ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి సాహసోపేతంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలు ఉంటే తెలంగాణ కన్నా చిన్నదైన అస్సాంలో 34 జిల్లాలు ఉన్నాయి. జిల్లాల ఏర్పాటు తేనెతుట్టేలాంటిదని, ముట్టుకుంటే ఏమవుతుందో అని భయపడ్డారు. కానీ చిన్న జిల్లాల వల్ల పాలన ప్రజలకు మరింతగా చేరువ అవుతుందని, ప్రభుత్వ పథకాల అమలు మరింత సమర్ధవంతంగా ఉంటుందనే ఆలోచన చేయలేదు. ఎన్టీరామారావు విప్లవాత్మకంగా ప్రజల వద్దకు పాలనను ఆచరణలో చూపిస్తూ తాలుకాల స్థానంలో మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నియోజక వర్గాల సైజులో ఉండే తాలుకాల్లో అప్పటి వరకు పెత్తందార్లదే పెత్తనం. మండల వ్యవస్థ వల్ల స్థానిక నాయకత్వం చాలా బలపడింది. మండల స్థాయి నుంచి వచ్చిన ఎంతో మంది నాయకులు తరువాత మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు అయ్యారు. ప్రధానంగా అప్పటి వరకు అధికారం చెలాయించిన సామాజిక వర్గాలకు పోటీగా ఇతర అణగారిన సామాజిక వర్గాల నాయకత్వం మండల వ్యవస్థ వల్ల బలపడింది. ఎందుకో కానీ జిల్లాల విషయంలో ఎన్టీఆర్ సాహసం చేయలేకపోయారు. మండలాలు ఏర్పాటు చేసినప్పుడు తీవ్రస్థాయిలో రాజకీయ వ్యతిరేకత వచ్చింది. మండల కార్యాలయాలు లేవు, పాలన అస్థవ్యవస్థంగా మారింది అనే విమర్శలతో కాంగ్రెస్ నాయకత్వంలో ఆందోళనలు జరిగాయి. తహసిల్దారులు తమ అధికార పరిధి తగ్గిందని ఆందోళన చెందారు.


మొండి ఘటాలుగా పేరు పొందిన ఎన్టీరామారావు, వైఎస్‌రాజశేఖర్ రెడ్డి సైతం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సాహసించలేకపోయారు. రాజకీయ తుఫానుకు ఆవకాశం కల్పించినట్టు అవుతుందని సందేహించి అటువైపే చూడలేదు. అలాంటిది 10 జిల్లాలను 31 జిల్లాలుగా మారుస్తుండడంతో విపక్షాలకు ఏం చేయాలో పాలుపోని స్థితి. జిల్లాల ఏర్పాటు కెసిఆర్ లక్కీనంబర్ ప్రకారం చేస్తున్నారని తొలుత విమర్శించారు. కెసిఆర్ లక్కీ నెంబర్ 6 కావడం వల్ల 24 జిల్లాలు అని తొలుత భావించారు. ఇంత కీలకమైన అంశంపై విపక్షాలు లక్కీనంబర్ అంటూ విమర్శలకే పరిమితం అయ్యారు. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న ఆలోచన చేయలేదు. శాస్ర్తియంగా విభజన జరగలేదు అనే మాట తప్ప విభజన ఎలా ఉండాలో చెప్పిన నాయకులు లేరు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్షమైనా జిల్లాల స్వరూపం ఫలానా విధంగా ఉండాలని స్పష్టంగా చెప్పాల్సింది. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సాగేప్పుడే కాదు చివరకు 31 జిల్లాలు ఖరారైన తరువాత కూడా ఎన్ని జిల్లాలు ఉండాలి, జిల్లాల స్వరూపం ఏ విధంగా ఉండాలి అనే మాట ప్రధాన ప్రతిపక్షం నుంచి రాలేదు. టిడిపి నుంచి సలహాలు ఆశించలేం. కానీ ప్రధాన ప్రతిపక్షం సైతం ఇంత కీలక సమయంలో ప్రధాన పాత్ర వహించలేకపోవడం విచిత్రం. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజక వర్గాలను జిల్లాలు చేయాలని పట్టుపట్టారు. కానీ మొత్తం కాంగ్రెస్ పక్షాన జిల్లాల స్వరూపంపై ఎలాంటి ప్రతిపాదన లేదు. రాజకీయ పార్టీలను పక్కన పెట్టి తెలంగాణ జెఎసి తరఫున కూడా ఇలాంటి ప్రతిపాదన లేదు. అమలులో ఉన్న చట్టం కాకుండా కొత్తగా చట్టం తీసుకువచ్చి దాని ప్రకారం జిల్లాలు చేయాలనే డిమాండ్ తప్ప కొత్త జిల్లాల స్వరూపంపై టిజెఎసి కూడా స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు. ఏ జిల్లా గురించి మాట్లాడితే ఏమవుతుందో అనే భయంతో అన్ని రాజకీయ పక్షాలు కప్పదాటు వైఖరి అవలంబించడం టిఆర్‌ఎస్‌కు కలిసి వచ్చింది. అన్ని జిల్లాల ఏర్పాటు క్రెడిట్ ఆ పార్టీనే దక్కించుకుంది. జిల్లాల ఏర్పాటు క్రెడిట్ మొత్తం కెసిఆర్ ఖాతాలోనే పడిపోయే విధంగా విపక్షాలు తమకు తెలియకుండానే సహకరించాయి.
తెలంగాణ జిల్లాల ఏర్పాటు ప్రభావం ఆంధ్రపై కూడా పడుతుంది. సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కింది నుంచి మూడవ స్థానంలో ఉంటుంది. ఉత్తరాఖండ్ సరసన ఉంటుంది. ఆంధ్రలో ఉభయ గోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు ఒక మూలన ఉంటాయి. బ్రిటీష్ కాలంలో నౌకాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలను నిర్ణయించారు. 

ఆంధ్ర రాష్ట్ర పాలన విజయవాడ నుంచి సాగుతోంది. విజయవాడ జిల్లా కేంద్రం కూడా కాదు. ఓడరేవు వల్ల బందరును జిల్లా కేంద్రం చేశారు. బ్రిటీష్ కాలం నాటి జిల్లాల స్వరూపం అదే విధంగా కొనసాగుతోంది. తెలంగాణలో జిల్లాల ఏర్పాటుపై మీడియా అడిగినప్పుడు మాకు అధికార వికేంద్రీకరణ ముఖ్యం, జిల్లాల ఏర్పాటు కాదు అని చంద్రబాబు చిత్రమైన సమాధానం ఇచ్చారు. జిల్లాల సంఖ్య పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. అయితే నిండా రాజకీయల్లో మునిగిపోయిన ఆంధ్రలో ఇప్పట్లో జిల్లాల ఏర్పాటుకు బాబు సాహసించే పరిస్థితి లేదు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న తమ ప్రాంతాన్ని జిల్లా చేయలేదని కొందరు విమర్శిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక సంపద గల హిందువుల ఆలయం ఉన్న తిరుపతి జిల్లా కేంద్రం కాదు. విజయవాడ జిల్లా కేంద్రం కాదు. జిల్లా కేంద్రం కాకముందే వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. జిల్లా కేంద్రం కాకపోవడం వల్ల చారిత్రక ప్రాధాన్యత ఏమీ పోదు. జిల్లాలను ఖరారు చేయడంలో రాజకీయ కోణం లేదా? అంటే కచ్చితంగా రాజకీయ కోణం కూడా ఉంటుంది. కెసిఆర్ ఏమీ తనను తాను అర్పించుకున్న దదీచి, శిబి చక్రవర్తి కాదు. పక్కా రాజకీయ నాయకుడు. ఐతే ఉద్యమ నాయకునిగా తనను ఆదరించిన ప్రజల సమస్యలు తెలిసినవాడు. తానే కాకుండా తన పాలన ద్వారా తన వారసునికి సైతం రాజకీయ అధికారం దక్కాలి అని కోరుకునే రాజకీయ నాయకుడు. తెలంగాణకు ఏం చేస్తే బాగుంటుందో తెలిసిన నాయకులు. ప్రజలు ఎలా పోయినా పార్టీ ముఖ్యం అనుకుంటే తప్పు. కానీ ప్రజలకు, పార్టీకి మేలు కలగాలి అని కోరుకోవడం తప్పు కాదు.


 జిల్లాల ఏర్పాటు ముమ్మాటికీ నవ తెలంగాణకు నాంది పలికే నిర్ణయం. ఈ నిర్ణయం సరైనదా? కాదా? అన్నది అర్ధం చేసుకోవడానికి సమయం పట్టవచ్చు. కానీ కచ్చితంగా ఈ నిర్ణయం తెలంగాణకు మేలు చేస్తుంది.
-బుద్ధా మురళి 11. 10. 2016 (ఎడిట్ పేజీ )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం