28, ఏప్రిల్ 2017, శుక్రవారం

న పురుష స్వాతంత్య్రమర్హతి!

‘‘ఏం రాస్తున్నావ్!’’
‘‘పురుషుడి కష్టాల గురించి. న పురుష స్వాతంత్య్ర మర్హతి అని రాస్తున్నా’’
‘‘న పురుష కాదు బాబు న స్ర్తి అని రాయాలి’’
‘‘అది నాకు తెలుసు నేను మనువుకు లేటెస్ట్ వెర్షన్ కావాలనుకుంటున్నాను. అందుకే అలా రాస్తున్నా ’’
‘‘ఇదేమన్నా రాజకీయ పార్టీనా? కొట్టుకొచ్చి, గుంజుకొచ్చి.. కొనుక్కొచ్చి మార్చగానే నీ సొంతం కావడానికి’’
‘‘కొట్టేయడం అంత ఈజీ కాదు... కొనుక్కోవడం అంత కన్నా కష్టం. అప్పట్లో సైకిల్‌ను ఈజీగానే కొట్టేశారు. ఇప్పుడు కోట్ల రూపాయలకు రెండాకులు కొనాలని ప్రయత్నించినందుకే తమిళనాడులో దినకరన్ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు’’
‘‘తప్పు అలా వాదించకు. తరతరాలుగా స్ర్తికి స్వాతంత్య్రం లేకుండా చేశారు. నువ్వేమో దానికి విరుద్ధంగా పురుషుడికి స్వాతంత్య్రం లేదు అని రాయడం వాస్తవాన్ని వక్రీకరించడమే? ప్రభుత్వాలు మారగానే చరిత్ర మారిపోతుందా?’’
‘‘అని నువ్వంటావు.. చరిత్ర అంతా తప్పు అసలు పురుషుడ్నే అణిచివేశారు, అణిచివేత కొనసాగుతోందని నేనంటాను’’
‘‘అనగానే సరిపోదు, ఆధారాలు చూపాలి’’
‘‘పుట్టగానే అమ్మమ్మనో, నానమ్మనో నీకు పేరు పెడుతుంది? తప్పటడుగులు వేస్తుంటే ఓ శుభ ముహూర్తంలో నిన్ను తీసుకెళ్లి స్కూల్‌లో పడేస్తారు. గేటు దగ్గర ఆయ పెద్దరికం క్లాస్‌లోకి వెళ్లాక టీచరమ్మ పెత్తనం. యుక్తవయసు వచ్చి ఒక అమ్మ చేతిలో నిన్ను పెట్టాక భార్యామణి పెద్దరికం ఇంట్లో ఒక బాస్ ఆఫీసుకు వెళ్ళాక మరో బాస్ . ఇక నీకు స్వాతంత్య్రం ఎప్పుడుంది చెప్పు ’’
‘‘నువ్వు రివర్స్‌లో చెబుతున్నావ్! స్వాతంత్య్రం లేనిది మహిళకే పెత్తనం అంతా పురుషులదే’’
‘‘అది నీ భ్రమ. నీకలా అనిపిస్తుంది. ఇందులో పెద్ద రాజకీయం ఉంది. ఆ సంగతి నీతోనే చెప్పిస్తా? ’’
‘‘ రాజకీయమేముంది?
‘‘దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారు?’’
‘‘ప్రధానమంత్రి మోదీ.. తెలంగాణలో కెసిఆర్, ఆంధ్రలో చంద్రబాబు ఈ మాత్రం తెలియదా?’’
‘‘సరిగ్గా ఇప్పుడు నేను అదే చెబుతున్నాను. రికార్డులకు అచరణకు తేడా ఉంటుంది. రికార్డుల ప్రకారం న స్ర్తి స్వాతంత్య్ర మర్హతి, పురుషులదే అధికారం కానీ ఆచరణలో మాత్రం అలా కాదు’’
‘‘దానికీ... దీనికీ సంబంధమే లేదు’’
‘‘ఉంది.. కావాలంటే రాజ్యాంగాన్ని చదువు, అంత ఓపిక లేకపోతే ప్రభుత్వ ప్రకటనలు చూడు. రాష్ట్రాల్లో గవర్నర్ పేరు మీద పాలన సాగుతుంది. కేంద్రంలో రాష్టప్రతి పేరు మీద పాలన సాగుతుంది. సోనియాగాంధీ హయాంలో రాష్టప్రతి అయిన ప్రణబ్ ముఖర్జీ నా ప్రభుత్వం అని ఢిల్లీలో మాట్లాడితే, కాంగ్రెస్ హయాంలో వచ్చిన గవర్నర్ నరసింహన్ ఉభయ రాష్ట్రాల్లో, ఉభయ సభలను ఉద్దేశించి నా ప్రభుత్వం అంటూ తన ప్రభుత్వం ఎలా పాలించిందో చెబుతారు’’
‘‘అది వేరు ఇది వేరు రెండింటిని లింక్ చేయకు’’
‘‘అదీ ఇదీ ఒకటే. దేశాన్ని ఏలే రాష్టప్రతి అబద్ధం చెబుతున్నారా? గవర్నర్ అబద్ధం చెబుతున్నారా? మా ప్రభుత్వం అని స్పష్టంగా చెబుతున్నారు. అది అబద్ధం అందామా? అసలు పాలిస్తున్నది మోదీ, కెసిఆర్, చంద్రబాబు ఇది అబద్ధమా? ’’
‘‘అంటే?’’
‘‘ఏమీ లేదు. పురుషుడిది పేరుకే పెత్తనం. అధికారం అంతా మహిళదే అని చెప్పదలుచుకున్నాను. రాజ్యాంగంలోనే ఈ సౌకర్యం ఉన్నప్పుడు కుటుంబ రావుల ఇంట్లో ఎంత? రాష్టప్రతి పేరు మీద దేశ పాలన జరుగుతుంది. కానీ రాష్టప్రతిలో నిజమైన అధికారాలు ఉండవు. ప్రధానమంత్రికి ఉంటాయి. గవర్నర్ పేరు మీద రాష్ట్రాల్లో పాలన సాగుతుంది కానీ నిజమైన అధికారాలు ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి. సరిగ్గా పురుషాధిక్య సమాజం అని రాజ్యాంగబద్ధంగా పిలుచుకున్నా ఆచరణలో ప్రజాస్వామ్యంలా ఆడవారిదే పెత్తనం అని చెబుతున్నాను అంతే’’
‘‘నువ్వు చెబుతుంటే ఒకవైపు నిజమే అనిపిస్తుంది. మరోవైపు నిజం కాదు అనిపిస్తుంది’’
‘‘కళ్ల ముందు కనిపిస్తున్నా కొన్ని విషయాలను అంత ఈజీగా నమ్మలేం. మొన్న గవర్నర్ స్పీచ్ విన్నావుకదా? గవర్నర్ స్పీచ్ అధికార పక్షం రాసిచ్చినట్టుగా ఉంది అని విపక్షాలు ఆవేశంగా విమర్శించగానే ముఖ్యమంత్రి కెసిఆర్ లేచి అధికార పక్షం రాసి ఇవ్వకపోతే విపక్షం రాసిస్తుందా? బాజాప్తా మేం రాసి, క్యాబినెట్‌లో ఆమోదించి పంపించిందే గవర్నర్ చదువుతారు అని చెప్పారా? లేదా? అదే బాబు గారైతే గవర్నర్ ఉప న్యాసం వినగానే బోలెడు ఆశ్చర్యపోయి ప్రభుత్వ పనితీరుకు అద్ధం పట్టిన స్పీచ్ .. గవర్నర్ అద్భుతంగా మాట్లాడారు అంటూ నిజంగా గవర్నరే పాలిస్తున్నారు అన్నంతగా మాట్లాడేస్తారు. ఎవరి స్కూల్ వారిది.’’
‘‘ఔను విన్నాను నిజమే’’
‘‘కాలం మారింది ఇది పరేష్ రావల్‌ల కాలంలో విలన్ అంటే ఇంకెంత కాలం పాత సినిమాల్లో గుమ్మడిలా నటిస్తారు. పాలకులైనా, కుటుంబ రావులైనా ఓపెన్‌గా ఎవరిది పెత్తనమో? ఎవరి పేరు మీద ఎవరు పాలిస్తున్నారో ఓపెన్‌గా చెబితే ఎంత బాగుంటుంది. ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారో? ఎవరిని ఎన్ని పోట్లు పొడిచారో ఎంత కూడబెట్టారో నిజాయితీగా చెప్పేంతగా ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందితే కనురాలా తిలకించాలనుంది. ఒక్క రూపాయి జీతంతో బతుకుతున్నాను అనడం కన్నా అధికారంలో ఉన్నప్పుడు ఇని కోట్లు సంపాదించాను అని దిగిపోయినప్పుడైనా చెబితే బాగుటుంది. నల్లధనం వెల్లడి ప్రకటన వ్యాపారులకేనా, నాయకులకు ఉండకూడదా? ’’
‘‘ఒకరి పేరు మీద ఇంకొకరి పాలన సాగడం అంటే ఒక రకంగా రాజ్యాంగంలోనే రాజ్యాంగేతర శక్తులకు అవకాశం కల్పించినట్టే... దీనికి తోడు అప్పుడప్పుడు అక్కడక్కడ రాజ్యాంగేతర శక్తులు పుట్టుకొచ్చి అధికారం చెలాయిస్తుంటాయి. దొంగ ఇంట్లో దొంగతనం చేసినట్టు.’’
‘‘ఇంతకూ ఏమంటావు’’
‘‘కాలం మారింది రాజ్యాంగాన్ని, చట్టాలను మార్చాలి. రాజ్యాధి కారం కోసం దంపతులు రాజసూయ యాగం చేసే వాళ్లు ఆ కాలంలో. ఇప్పుడు బ్రహ్మచారులు, అర్ధ బ్రహ్మచారులు, సన్యాసులకే రాజకీయాల్లో క్రేజ్ ఉంది. న పురుష స్వాతంత్య్ర మర్హతి అని తిరిగి రాయాలి. బ్రహ్మచారులకే రాజసూయ యాగం చేసే అధికారం ఉండాలి’’
*
-బుద్దా మురళి(జనాంతికం 28-04-2017)

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

సవాళ్లకు ఎదురీది.. సత్తా చాటిన తెలంగాణ

‘ఎలా బతుకుతుందో..?’ అనే సందేహాల నుంచి తన ప్ర స్థానం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం గత మూడేళ్లలో అనేక అంశాల్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా నిలిచి ప్రగతి పథంలో పరుగులిడుతోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు బారిన పడిన జపాన్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందా? ఆని ప్రపంచం ఎదురు చూసింది. ప్రపంచం ఊహించని విధంగా జపాన్ ప్రతీకారం తీర్చుకుంది. అమెరికాపై బాంబులు వేసి విజయం సాధించలేదు. అమెరికా ఏయే రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తుందో ఆ రంగాలన్నింటిలో తాను మొదటి స్థానంలో నిలవాలని కంకణం కట్టుకుని జపాన్ అద్భుతాలను సాధించింది. తెలంగాణ సైతం అదే బాట పట్టింది. ‘మీకు తినడం నేర్పించాం. మేం లేకపోతే మీకు తిండి గింజలు కూడా దొరకవు, పాతిక లక్షల గొట్టపుబావులకు మా వల్లే విద్యుత్ అందుతోంది. రాష్ట్రం విడిపోతే మీ గతి ఏమవుతుంది?’- అనే మాటలకు మూడేళ్లలో తెలంగాణ దీటైన సమాధానం చెప్పింది.
దక్షిణాది మొత్తంలో యాసంగిలో తెలంగాణలోనే అత్యధిక వరి పంట పండింది. దశాబ్దాల పీడన నుంచి బయటపడిందనే సానుభూతి కావచ్చు, ఐదువందల సంవత్సరాల విదేశీ పాలన, ఆరు దశాబ్దాల సమైక్య పాలన తరువాత తనను తాను పాలించుకుంటున్న తెలంగాణపై ప్రకృతి కూడా కరుణ చూపించింది. పాలన ఎంత అద్భుతంగా సాగినా ప్రకృతి కరణించక పోతే ఏ పాలకుడైనా చేసేదేమీ ఉండదు. ‘తెలంగాణ రైతులు అదృష్టవంతులని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సాధారణ రైతు చెప్పడం, మీ ప్రాంత నాయకుల వలే పోరాడితే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని ఒక సామాన్యుడు చెప్పడం, మీకు పాలన చేత కాదు అని ఈసడించిన నేతల రాష్ట్రానికి చెందిన ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు తెలంగాణలో ఎన్నికల హామీలు అన్నీ నెరవేర్చారని అభినందనలు అని చెప్పడం అమెరికా అధ్యక్షుడి మెచ్చుకోలు కన్నా ఎక్కువ. ప్రొటోకాల్ మెచ్చుకోలు వేరు, సామాన్యుడి మెచ్చుకోలు వేరు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం నడిచిన ప్రాంతంలోనూ కెసిఆర్‌కు క్రేజ్ ఏర్పడింది. ఇది పాలన వల్ల సాధ్యమైందే కానీ, సినిమా గ్లామర్ వల్ల కాదు.
తెలంగాణ ఆవిర్భావం సమయంలో తలెత్తిన విధంగానే టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావంలోనూ అనేక సందేహాలు.. ఆ పార్టీ ఎంత కాలం నిలుస్తుంది? కెసిఆర్ పార్టీని నడపగలరా? అనే మాటలు వినిపించాయి. అంతకు ముందు తెలంగాణ కోసం పుట్టిన కొన్ని పార్టీలు ఆరంభశూరత్వానికే పరిమితం అయ్యాయి. అనుమానాలను పటాపంచలు చేస్తూ టిఆర్‌ఎస్ ఎత్తిన జెండా దించకుండా తుది వరకు పోరాడింది. టిఆర్‌ఎస్ నాయకత్వంలో మలిదశ ఉద్యమం ప్రారంభం అయిన తరువాత ఎంతోమంది నేతలు తెలంగాణ సాధన కెసిఆర్ వల్ల కాదు మేమే సాధిస్తామని పార్టీలు పెట్టి మధ్యలోనే కనిపించకుండా పోయారు. టిఆర్‌ఎస్ కూడా ఎన్నో తిరుగుబాట్లను తట్టుకుని నిలిచింది. టిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన నాయకులు చాలా మంది పార్టీలు పెట్టి ఒకటి రెండు సమావేశాల కన్నా ఎక్కువ నిర్వహించలేకపోయారు. అలాంటిది ఒకటిన్నర దశాబ్దాలు, కొన్ని వందల సమావేశాలు, డజన్ల కొద్దీ ఎన్నికలను తట్టుకుని నిలిచింది టిఆర్‌ఎస్. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కన్నా తెచ్చిన టిఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారు.
17 ఏళ్ల క్రితం 2001లో సచివాలయం ఎదురుగా ఉన్న ‘జలదృశ్యం’లో టిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ. జనం వెయ్యి మందే కావచ్చు కానీ కోటి ఆశలతో ఉద్వేగపూరిత మైన వాతావరణం. తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్ష బలంగా ఉన్నా... సాధ్యం అనే నమ్మకం చాలా కొద్ది మందిలోనే . అసాధ్యం అనుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కన్నా సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకుని నిలిచేట్టు చేయడం ద్వారా సమర్ధ పాలకుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయం సాధించారు.
ఉద్యమకాలంలో టిఆర్‌ఎస్‌కు చాలా సార్లు ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. 2009లో మహాకూటమితో కలిసి పోటీ చేసినా కేవలం పది స్థానాల్లో విజయం సాధించడం టిఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ. వైఎస్‌ఆర్ హయాంలో పది మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా టిఆర్‌ఎస్ చలించలేదు. 2009 ఎన్నికల ఫలితాలు మాత్రం టిఆర్‌ఎస్‌కు గట్టిదెబ్బ. ఓడినా, గెలిచినా, పార్టీలో తిరుగుబాట్లు వచ్చినా, ఢిల్లీ పెద్దలు అవకాశాలు కల్పించినా, ఎలాంటి పరిణామాల్లోనైనా తెలంగాణ ప్రజలనే టిఆర్‌ఎస్ నమ్ముకొంది. ఆ నమ్మకమే టిఆర్‌ఎస్‌ను విజయతీరాలకు నడిపించింది.
తెలంగాణ సాధించేంత వరకు ఒకటే నినాదం. లెఫ్ట్, రైట్ అనే సిద్ధాంతాల తేడా లేదు.. తెలంగాణ సాధించడం ఒక్కటే లక్ష్యం ఆ ప్రాంతంలో కనిపించింది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అయిన తరువాత ఎక్కడో చిన్న అనుమానం... ఉద్యమించిన వారిలోనూ, ఎక్కడో తెలియని గుబులు, సందేహం... ఏం జరుగుతుంది? తెలంగాణ ఏర్పడితే చీకటి మయం అంటూ అప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్లు చేసిన ప్రచారం ఎంతో కొంత ప్రభావం చూపించి అనేక అనుమానాలు రేకెత్తించింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ అనుకున్న విధంగా లేకపోతే నవ్వుల పాలవుతామనే భయం. 60ఏళ్ల కల సాకారం కావడం నమ్మలేని నిజం.. భవిష్యత్ ఎలా ఉంటుంది? ఈ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచుకునే విధంగా తన ప్రస్థానం సాగించింది. ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చింది. టిఆర్‌ఎస్ 17 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పుడు మరింత బలపడింది. ‘మాకు ఉద్యమ రాజకీయాలు తెలుసు, అధికార రాజకీయ లౌక్యం తెలుసు..’ అని టిఆర్‌ఎస్ అధినేత నిరూపించారు. 63 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయాలనుకున్న పార్టీ టిఆర్‌ఎస్‌లో విలీనం అయ్యేట్టు చేశారు. ‘ఇదేమీ మఠం కాదు, టిఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీనే’ అని స్వయంగా కెసిఆరే ప్రకటించారు.
టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, టిడిపి తదితర పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే. కానీ టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి తనను తాను తెలంగాణలో కలిపేసుకుంది. తెలంగాణను, తనను విడదీయలేని విధంగా తన ఆలోచనను మార్చుకుంది. ఇక్కడే అధికార పక్షం విజయానికి, ఇతర పార్టీల పరాజయానికి కారణాలు కనిపిస్తాయి. అన్ని పార్టీల లక్ష్యం అధికారమే అయినా తెలంగాణ కోణంలో అధికారం కోసం ఆలోచించడం, పార్టీ కోణంలో అధికారం కోసం ఆలోచించడంలో తేడా ఉంటుందని పార్టీలు నిరూపిస్తున్నాయి. సగం తెలంగాణను సస్య శ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పొరుగు రాష్ట్రం వ్యతిరేకించినా మాట్లాడలేని రాజకీయ పార్టీ నాయకులు తెలంగాణకు నాయకత్వం వహిస్తారా? తెలంగాణ ప్రజలు వారిని నమ్ముతారా? ఇక్కడే తెలంగాణతో టిఆర్‌ఎస్ విడదీయరాని అనుబంధం ఏర్పడగా- ఇతర పార్టీలు దూరమవుతున్నాయి. ఒక రాజకీయ పార్టీ ఏం చేసినా మరో రాజకీయ పార్టీ వ్యతిరేకించడమే రాజకీయం. టిఆర్‌ఎస్ సహా దేశ రాజకీయాల్లో అన్ని పార్టీలూ అనుసరించే సూత్రం ఇదే. తెలంగాణ కొత్త రాష్ట్రం, ఓటు వేసి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం వేరు. ఉద్యమించి కొత్త రాష్ట్రం తెచ్చుకోవడం వేరు. ప్రజలు ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నారు. ఒక పార్టీ చేసే పనిని మరో పార్టీ వ్యతిరేకించాలనే సాధారణ రాజకీయ సూత్రం ఇప్పుడు పని చేయదు. అందుకే రాష్ట్రంలో విపక్షాలకు ‘స్కోప్’ కనిపించడం లేదు.
హైదరాబాద్ ఇమేజ్ పడిపోతుంది. పరిశ్రమలు తరలిపోతాయి. విద్యుత్ సంక్షోభం తలెత్తి చీకటి మయం అవుతుంది. వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వలేరు’.. ఉద్యమకాలంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారి మాటలు ఇవి. రాష్ట్ర విభజన తర్వాత ఇలా జరిగితే బాగుండునని కోరుకున్నారు. కానీ చిత్రంగా ఈ అంశాలన్నింటిలో పూర్తిగా దీనికి భిన్నంగా జరిగింది. శాపాలనే తెలంగాణ సోపానాలుగా మార్చుకుంది. గూగుల్ వంటి ప్రఖ్యాత కంపెనీ హైదరాబాద్‌కు వచ్చింది. ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రం వీడి వెళ్లలేదు. ప్రత్యర్థులు సైతం ఊహించని విధంగా విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడడమే కాదు. మిగులు విద్యుత్ స్థాయికి చేరుకుంది. తిరిగి విజయం సాధించాలంటే ఆసరా పథకం ఒక్కటి చాలు, డబుల్ బెడ్‌రూమ్ దానికి తోడుగా ఉంటుంది.
రాబోయే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే లక్ష్యం కారాదు. తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే గ్రామాలు పచ్చగా ఉండాలి. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి పథకాలతోనే అది సాధ్యం. హరిత తెలంగాణతోనే ‘బంగారు తెలంగాణ’ సాకారం అవుతుంది. అయిదేళ్ల పాలనలో సగం కాలం ముగిసింది. మిగిలిన ఈ సగం కాలంలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యాన్ని చేరుకుంటే తెలంగాణ కలలు సాకారం అవుతాయి. టిఆర్‌ఎస్ పాలన ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. జరుగుతున్న అభివృద్ధిని చూస్తే, కెసిఆర్ నాయకత్వంలో కోటి ఎకరాలకు సాగునీటి కల సాకారం అవుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదనే భయం ఉంది. ప్రజల నమ్మకాన్ని కెసిఆర్ నిలబెట్టుకోవాలి. ఈనమ్మకాన్ని నిలబెట్టే విధంగా తెరాస ప్లీనరీలో చర్చలు ఉంటాయని ఆశించవచ్చు. మణిపూర్ అంటేనే ఇరోం షర్మిల అన్నంతగా జాతీయ మీడియా ప్రచారం చేసింది. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు కేవలం 90 ఓట్లు వచ్చాయి. వరంగల్‌లో 300 ప్రజాసంఘాలు, 12 వామపక్ష పార్టీలు ఒక అభ్యర్థిని నిలబెడితే డిపాజిట్ రాలేదు. ఇలాంటి పోరాట యోధులు, వారి ప్రకటనలకు తెలంగాణలో కొదవ లేదు. వీరిని పట్టించుకోవలసిన అవసరం లేదు వీరి సంగతి పక్కన పెట్టి, తెలంగాణ ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికే టిఆర్‌ఎస్ ప్రాధాన్యత ఇవ్వాలి. ‘తెలంగాణ ప్రజలే టిఆర్‌ఎస్‌కు బాస్‌లు’ అనే మాటను ఆచరణలో చూపించాలి.
-బుద్దా మురళి(21-4-2017)

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

రామప్ప పంతులు ఇజం- పవనిజం!

‘‘రామప్ప పంతులు ఇజంపై పరిశోధన చేయాలనుకుంటున్నా.. నువ్వేమంటావ్?’’
‘‘రామాయణంలో మహిళా పాత్రలు, మహాభారతంలో పురుష పాత్రలపై కూడా పరిశోధనలు చేసేస్తున్నారు. రామప్పపంతులిజంపై పరిశోధన చేస్తే వద్దనేదెవరు..? చేసేయ్..! ఐనా హఠాత్తుగా నీకా ఆలోచన ఎందుకొచ్చింది?’’
‘‘కాంగ్రెస్ పార్టీని జాగ్రత్తగా గమినిస్తే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నమ్ముకోవడం కన్నా ‘రామప్ప పంతులిజం’ను నమ్ముకోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నా’’
‘‘గాంధీభవన్ పంతులు అంటే- ప్రకాశం పంతులు కాలం నుంచి పనిచేసి ఆ మధ్య చనిపోయిన గాంధీభవన్ ఉద్యోగి అని అంతా అనుకుంటారు. కానీ రామప్ప పంతులు అని ఓ పాత్ర ఉందని తెలిసిన వారెంతమంది?’’
‘‘కన్యాశుల్కం నాటకంలో నాకు బాగా నచ్చిన పాత్ర రామప్ప పంతులు. ఎంత గొప్ప వాళ్లనయినా కోర్టులకు ఈడ్చి గజగజలాడేట్టు చేస్తానని సవాల్ చేస్తుంటాడు. అన్ని శక్తులనూ ఎదిరించి ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కెసిఆర్‌ను సైతం వణికిస్తున్న ఇజం ఇదే కదా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఖమ్మం ఎన్నికల్లో ఒక్క చోట కూడా కెసిఆర్ చిక్కలేదు. మరి అదే కోర్టుల్లో ఒక్క చోటైనా కెసిఆర్ గెలిచారా? రామప్ప ఇజం పవర్ ఏంటో తెలిసిందా? పొలాలకు నీళ్లు తాగిస్తానని కెసిఆర్ చెబితే, కెసిఆర్‌కు వీళ్లు నీళ్లు తాగిస్తున్నారు. కన్యాశుల్కంలో రామప్ప పంతులు కేసులు వేసి ఒక్కొక్కరి చేత మూడు చెరువుల నీళ్లు తాగిస్తానని చెప్పినట్టు, కాంగ్రెస్ నాయకులు ఇపుడు తెరాస పాలకులను కేసులతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయి ఉండొచ్చు కానీ రామప్ప పంతులు ఇజాన్ని నమ్ముకుని కేసుల్లో తమకు తిరుగులేదని నిరూపించారు’’
‘‘ఏ ఇజంతో వర్కవుట్ అవుతుంది అనుకుంటే ఆ ఇజాన్ని నమ్ముకోవాలి. రాజకీయాల్లో సిగ్గుపడితే కుదరదు.’’
‘‘ఎవరి నమ్మకాలు వారివి.. నీ నమ్మకాన్ని హేళన చేస్తే నీకెంత కోపం వస్తుందో? ఎదుటి వారి నమ్మకాలను హేళన చేసేప్పుడు వారికీ అలానే అనిపిస్తుందని గుర్తుంచుకో!’’
‘‘కాదన్నదెవరు? నేను నీ వాదనకు సపోర్ట్‌గా మాట్లాడినా నీకు వ్యంగ్యం అనిపిస్తుందా? ఇంతకూ ఇజం అంటే ఏంటోయ్’’
‘‘ఎవడికి తెలుసు? పదం గంభీరంగా ఉండాలని వాడేస్తున్నాను. అప్పారావు చేసే పనులు అప్పారావు ఇజం. సుబ్బారావు చేసేవి సుబ్బారావు ఇజం అలానే పవన్ చేసేవి పవనిజం. రామప్ప పంతులు చేసినవి రామప్ప పంతులు ఇజం’’
‘‘ట్రాఫిక్‌ను నియంత్రించే కానిస్టేబుల్‌ది ట్రాఫికిజం అనాలన్నమాట’’
‘‘ అదే.. వెటకారం వద్దనేది.. అన్నీ వేదాల్లోనే ఉన్నాయని కొందరు నమ్మినట్టు! అన్నీ పవనిజంలోనే ఉన్నాయని కొందరు నమ్ముతున్నారు.. అది వాళ్లిష్టం.. నీకేమిటి అభ్యంతరం?’’
‘‘నువ్వు మాట్లాడుతున్నది హనుమంతుడి గురించే కదా? హనుమంతుడు మహాశక్తి సంపన్నుడు. నరేంద్ర మోదీ కూడా ఎంపిలను హనుమంతుడిలా పని చేయాలని చెప్పారు. అతని భక్తి భావాన్ని పవనిజం అని నువ్వు ముద్దుగా పిలుచుకుని పూజిస్తున్నావు.. అది నీ ఇష్టం..’’
‘‘పవనిజం అంటే అదో సిద్ధాంతం ’’
‘‘పిల్లి అంటే మార్జాలం అన్నట్టుగా ఉంది’’
‘‘పవనిజం అంటే ఏంటో చెప్పే ముందు దాని శక్తి గురించి చెబుతా! మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో మనకు 1947లో స్వాతంత్య్రం వచ్చింది కదా? పవనిజంతో ప్రయత్నిస్తే అంత కన్నా 50 ఏళ్ల ముందే వచ్చేది తెలుసా?’’
‘‘వామ్మో.. ఏమైందిరా..? ఇలా మాట్లాడున్నావ్! పిల్లల చదువు, ముసలి తల్లి, రోగిష్టి తండ్రి. పెళ్లి కాని అక్క ఇన్ని కష్టాలున్నాయి నీకు’’
‘‘నాకేం కాలేదు.. ఈ మాట అనగానే నన్ను అనుమానంగా చూస్తావని తెలుసు. కానీ ఈ మాట చెప్పింది నేను కాదు, ఎన్నో మెగా సినిమాలు తీసిన గొప్ప నిర్మాత చెప్పిన మాట. మహాత్మాగాంధీ పవనిజంను నమ్మి పోరాడితే స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చేదని సెలవిచ్చాడు’’
‘‘ఆ నిర్మాత బినామీ గణేష్ కదా? ’’
‘‘ఇజం గురించే తప్ప నిజం గురించి వద్దు. బినామీ అతని వృత్తి కానీ పేరు కాదు.. బండ్ల గణేష్ అని..’’
‘‘సినిమా పేరు గుర్తులేదు కానీ రాత్రులు, చీకట్లు అని అదేదో బూతు సినిమాలో హీరోగా నటించాడని, వాళ్ల ఫ్రెండే పరిచయం చేశాడు. బడుద్దాయ్ నాకు తెలియక పోవడం ఏంటి? చిన్న చిన్న వేషాలతో చిల్లర తిరుగుళ్లు తిరిగే వాడు. బండ్ల గణేష్ కాస్తా బినామీ గణేష్‌గా మారిపోయాడు పవనిజంను నమ్ముకొని.. అతను ఏదో ఒక ఇజాన్ని నమ్ముకుని బాగుపడ్డాడు.. మంచిదే కదా? కోర్టులో కేసులు వేసి ముప్పు తిప్పలు పెట్టడం రామప్ప పంతులు ఇజం అన్నావు బాగానే ఉంది. మరి పవనిజం ఏంటి?’’
‘‘పవనిజం అంటే పవనిజమే అంతే’’
‘‘ముగ్గురు పె....’’
‘‘ఇజం తప్ప నిజం వద్దన్నాను కదా? మళ్లీ’’
‘‘పవనిజం లోకల్- కెఎ పాల్ ఇజం ఇంటర్నేషనల్ అని ఆ మధ్య పాల్ చెప్పాడు కూడా.. ఆయన పార్టీ ఏమైందో? దేశంలో మోదీ ఇజం, తెలంగాణలో కెసిఆర్ ఇజం, ఆంధ్రలో చంద్రబాబు ఇజం మారుమ్రోగిపోతోంది. ఒకప్పుడు బాబు ఎన్టీఆర్ ఇజమే శాశ్వతం అన్నారు, తరువాత టూరిజం తప్ప మరో ఇజం లేదన్నారు. ఇప్పుడు లోక రక్షకుడు లోకేశ్ ఇజంను నమ్ముకోమని పార్టీవాళ్లకు చెబుతున్నారు. పాపం.. ఇంతకాలం ఎర్ర ఇజాలను బట్టీ పట్టి, ఇజాలు తప్ప మరేమీ తెలియని దశకు చేరుకున్న కమ్యూనిస్టులేమో పాదయాత్ర ఇజం నమ్ముకున్నారు. జీవితం కరిగిపోయాక ముగింపు దశలో గద్దర్ లాంటి విప్లవ వీరులు ఇజాలన్నీ అబద్ధం. ఎన్నికలే నిజం అంటున్నారు. బిజెపి వాళ్లేమో మోదీ ఇజంతో పాటు ఉత్తర ప్రదేశ్ సన్యాసి ఇజంపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు ఎప్పుడు ఏ ఇజాన్ని నమ్ముతారో అర్థం చేసుకోవడం కష్టం.’’
‘‘ఒక్క మాట చెప్పాలా? ఇజాలన్నీ ట్రాష్.. నిజం ఒక్కటే నిజం. అధికారం కోసం ఎవరికి తోచిన ఇజం వాళ్లు మార్కెట్ చేస్తుంటారు. నీ బతుకు నీదే, ఇజాలను అమ్ముకునే వాడి బతుకు వాడిదే. నీ పొట్ట తిప్పలు నీవి. వాళ్ల పొట్ట తిప్పలు వాళ్లవి. ఇంతకు మించిన ఇజం లేదు. నిజం లేదు’’ *
- బుద్దా మురళి(జనాంతికం 14. 4. 2017)

8, ఏప్రిల్ 2017, శనివారం

నా ఊరిని నాకిచ్చేయ్..!

‘‘మేధావి గారూ.. దిగులుగా ఉన్నారేం? ఈరోజు ‘ప్ర పంచ డిప్రెషన్ డే’ కదా!. సింబాలిక్‌గా- డిప్రెషన్‌లోకి వెళ్లారా? ’’
‘‘కాదు.. మా సొంతూరు వెళ్లి వచ్చా. అప్పటి నుంచి దిగులు మరింత పెరిగింది. నీకేం హాయిగా ఉంటావ్’’


‘‘ఏదో మిడిల్ క్లాస్ ఆలోచనతో డబ్బులే సమస్య అనుకున్నాను. నికరగువాలో ప్రజాస్వామ్య హక్కులు, అమెరికా సామ్రాజ్య వాదం నుంచి అనకాపల్లి సామాజ్ర వాదం వరకు మీకు అన్నీ సమస్యలే కదా? ’’
‘‘ ఆరోజులే వేరోయ్! ట్రుంకాయ్ దేశంలో పౌర హక్కులను కాపాడుదాం అని పిలుపు ఇస్తే రెండు వేల మంది పిల్లకాయలు కాలేజీ ఎగ్గొట్టి పరిగెత్తుకొచ్చేవాళ్లు. ఇప్పుడు ఒక్కడూ రావడం లేదు’’
‘‘ట్రుంకాయ్ అనే దేశం కూడా ఉందాండి? ఎప్పుడూ వినలేదు.’’
‘‘ అదే చెబుతున్నా.. ఇప్పుడు చాలా తెలివి మీరు పోయారు. ఇప్పుడు నేను మాట్లాడుతుండగానే నువ్వు ఇంటర్నెట్‌లో వెతుకుతున్నావ్ ట్రూంకాయ్ పేరుతో దేశం ఉందా? అని’’


‘‘ ఇంటర్నెట్ పుణ్యమాని అరచేతిలో విశ్వం ఇమిడిపోయిందండి!’’
‘‘ అదో వ్యవసనం.. ఇది లేక ముందు- గోడల మీద కనిపించే నినాదాలు ఒక్కసారి గుర్తు చేసుకో. ఏ ఒక్క గోడైనా నినాదాలు లేకుండా కనిపించేదా? యూనివర్సిటీ దారిలో వెళితే గోడలన్నీ నినాదాలతో ... ఆ రోజులే వేరు’’
‘‘గోడలమీద నినాదాలు లేకపోవడమే మీ సమస్యనా?.’’
‘‘ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావ్! సమస్య గోడలు కాదు. ’’
‘‘మరేంటో స్పష్టంగా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నేనేమన్నా మేధావినా?’’
‘‘తెలుగు సాహిత్యం ఇలా ఎందుకు పడకేసిందో తెలుసా?’’
‘‘నాగిరెడ్డి- చక్రపాణి రోజుల్లో ‘చందమామ’ ఓ వెలుగు వెలిగింది.. మా ఇంట్లో ప్రతి నెలా వచ్చేది.. బొమ్మరిల్లు, యువ ,విజయ నెల నెలా చదివే వాడిని.. చదివేవాళ్లు లేక వాటిని మూసేశారట కదా? ’’
‘‘సాహిత్యం పడకేయడం అంటే పత్రికలు మూత పడడం గురించి చెబుతావేం?’’


‘‘మరేంటో మీరే చెప్పండి’’
‘‘కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి ఎంత కష్టం.. ఎంత కష్టం..
మబ్బు పట్టి, గాలి కొట్టి
వాన వస్తే.. వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే
దాని తప్పిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం..
ఇది గుర్తుందా?’’
‘‘గుర్తు లేకపోవడమేంటి..? మహాకవి శ్రీశ్రీ కవిత తెలియని తెలుగు వాడుంటాడా? ’’
‘‘అదే మరి... అప్పుడెప్పుడో పుట్టిన శ్రీశ్రీ మళ్లీ ఎందుకు పుట్టలేదో అర్థమైందా? పివి నరసింహారావే కారణం’’
‘‘ఎంత మాట అనేశారండీ.. పివి గారు మంచి సాహితీ ప్రియులు. ఆయనకు పదహారు భాషలు వచ్చు. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ నవలను హిందీలోకి అనువాదం చేశారు. ‘లోపలి మనిషి’ని బయట పెట్టారు. ఇంకో విషయం తెలుసా? ఇక రాజకీయాలు చాలు వరంగల్‌లో మళ్లీ సాహిత్య గోష్టులు జరుపుకుందాం అని పుస్తకాలన్నీ సర్దుకుని ప్రయాణానికి సిద్ధం అయ్యాక అనుకోని పరిస్థితుల్లో ప్రధాన మంత్రి పదవికి ఎంపిక అయ్యారు. ఆ పదవిలో ఉన్నా, పదవి నుంచి దిగిపోయినా సాహిత్యానికి దూరం కాలేదు కదండీ...అకారణంగా పివి కారణం అంటే నేను ఒప్పుకోను’’


‘‘వస్తా వస్తా.. అక్కడికే వస్తా... ఆకలి రాజ్యం సినిమాలో ఆపిల్ పండు చెత్తకుప్పలోని బురదలో పడిపోతే- ఆకలితో నకనకలాడుతున్న కమల్ హాసన్ పండును బురద నుంచి తీసి కడుక్కోని తింటాడు. అదే రాఘవేంద్ర రావు సినిమాలో అందమైన హీరోయిన్ బొడ్డు మీద ఆపిల్ పండ్లు పడతాయి. అదే ఇప్పటి హీరో అయితే- అత్తతో మాట్లాడేందుకు రైల్వే స్టేషన్‌ను, మరదలితో సరసాలకు విమానాశ్రయాన్ని అద్దెకు తీసుకుంటాడు. కారణం తెలుసా?’’
‘‘కమల్‌హాసన్ బురద ఆపిల్ పండుకు, రమ్యకృష్ణ బోడ్డు నుంచి జారి పడ్డ ఆపిల్ పండ్లకు- పివికి ఎలాంటి సంబంధం లేదు.. బాలచందర్ ఆలోచన, రాఘవేంద్రరావు మార్క్ శృంగారం. హీరోను అలా పేదవాడిగా చూపితే ఫ్యాన్స్ ఒప్పుకోరు. వారు కోరితే సూర్యుడిని కూడా హీరో గుప్పిట్లో బంధిస్తాడు. ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేయడం తప్ప పివికి సంబంధం లేదు.’’
‘‘అక్కడికే వస్తా .. ఎలా సంబంధమో చెబుతా!’’
‘‘మా ఊరు వెళ్లి వచ్చానని చెప్పా కదా? దుఃఖం పొంగుకొచ్చిందంటే నమ్ము’’
‘‘ఊరికి ఏమైంది?’’
‘‘అంతా మారిపోయింది. మట్టి రోడ్లు, గుడిసెలు, పేదరికం తాండవించేది.. చూడగానే అద్భుతమైన కవిత్వం పొంగుకొచ్చేది. అక్కడి ఆకలి కేకల నుంచి ఎంతో అద్భుమైన సాహిత్యం పుట్టింది. ఇప్పుడన్నీ సిమెంట్ రోడ్లు, పక్కా ఇళ్లు మాదా కబళం అని పలికే వాడు వెతికినా ఒక్కడూ కనిపించలేదు. పాలేరు పాండుగాడు గుర్తున్నాడు కదా? వాడి కొడుకు కూడా అమెరికా వెళ్లి డాలర్లు సంపాదిస్తున్నాడు. ప్రతి ఇంట్లో ఒకడు అమెరికాలో ఉన్నాడు. చాలా బాధేసింది.’’
‘‘మేధావి గారూ.. ఆ ఊర్లో మీది కూడా పేద కుటుంబమే కదా? మీరు ఉపాధి కోసం ఊరొదిలి సిటీకి రావాలి. మీ ఊరు మాత్రం పేదరికంతో అలానే ఉండాలి అంటే ఎలాగండి..? అంత అభిమానం ఉంటే ఊర్లోనే ఉండి ఈ మాట మాట్లాడితే బాగుంటుంది.’’


‘‘నీకు భావోద్వేగాలు తెలియవు. నా బాల్యం నాకిచ్చేయ్‌లా నా ఊరును నాకిచ్చేయ్ అని గొప్ప కవిత రాద్దామని ఊరు వెళ్లి వచ్చిన నేనెంత బాధపడ్డానో నువ్వు ఊహించలేవు’’
‘‘ఆ గుడిసెలో సగం కడుపుతో పడుకున్న జీవితాన్ని కూడా తిరిగి ఇచ్చేయమని రాస్తారా? ?’’
‘‘నా ఊరును నాకిచ్చేయ మన్నా కానీ- నా పేదరికాన్ని నాకివ్వమనలేదు. తేడా అర్థం చేసుకో’’
‘‘మీకు తప్ప అందిరికీ పేదరికం ఇమ్మంటారు అంతేనా?’’
‘‘నీకు విషయం అర్థం కాదు వదిలేయ్’’
‘‘మా ఊరికి వచ్చే ఒకే ఒక బస్సును తగలబెడితే విప్లవం ఎలా వస్తుందో? సమసమాజం ఎలా ఏర్పడుతుందో 30ఏళ్ల నుంచి ఆలోచిస్తున్నా నాకు ఇంకా అర్థం కాలేదు’’
‘‘ తగలబెట్టే వారికే అర్థం కాలేదు’’
‘‘ అసలు విషయం చెప్పనేలేదు’’
‘‘దేశంలో ఆర్థిక సంస్కరణలు రాకపోయి ఉంటే ఆకలి, నిరుద్యోగం, పేదరికం అడుగడుకునా ఆహ్వానం పలికేది. ఎంతోమంది శ్రీశ్రీలు పుట్టుకొచ్చి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేవారు. సంస్కరణలు కవిత్వాన్ని చంపేశాయి. ఆఫ్రికా ఆడవుల్లో కోతుల పరిరక్షణ ఉద్యమానికి కదిలి రమ్మన్నా వచ్చే వేలాది మంది యువతను విప్లవానికి దూరం చేశాయి. అందుకే గొంతెత్తి గట్టిగా పాడాలనుకుంటున్నాను హే భగవాన్ నన్ను సంపన్నుడిగా ఇలానే ఉంచి నా పేద ఊరిని నాకిచ్చెయ్  ’’ *

బుద్ధా మురళి (జనాంతికం 7-4-2017)