14, ఏప్రిల్ 2017, శుక్రవారం

రామప్ప పంతులు ఇజం- పవనిజం!

‘‘రామప్ప పంతులు ఇజంపై పరిశోధన చేయాలనుకుంటున్నా.. నువ్వేమంటావ్?’’
‘‘రామాయణంలో మహిళా పాత్రలు, మహాభారతంలో పురుష పాత్రలపై కూడా పరిశోధనలు చేసేస్తున్నారు. రామప్పపంతులిజంపై పరిశోధన చేస్తే వద్దనేదెవరు..? చేసేయ్..! ఐనా హఠాత్తుగా నీకా ఆలోచన ఎందుకొచ్చింది?’’
‘‘కాంగ్రెస్ పార్టీని జాగ్రత్తగా గమినిస్తే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నమ్ముకోవడం కన్నా ‘రామప్ప పంతులిజం’ను నమ్ముకోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నా’’
‘‘గాంధీభవన్ పంతులు అంటే- ప్రకాశం పంతులు కాలం నుంచి పనిచేసి ఆ మధ్య చనిపోయిన గాంధీభవన్ ఉద్యోగి అని అంతా అనుకుంటారు. కానీ రామప్ప పంతులు అని ఓ పాత్ర ఉందని తెలిసిన వారెంతమంది?’’
‘‘కన్యాశుల్కం నాటకంలో నాకు బాగా నచ్చిన పాత్ర రామప్ప పంతులు. ఎంత గొప్ప వాళ్లనయినా కోర్టులకు ఈడ్చి గజగజలాడేట్టు చేస్తానని సవాల్ చేస్తుంటాడు. అన్ని శక్తులనూ ఎదిరించి ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కెసిఆర్‌ను సైతం వణికిస్తున్న ఇజం ఇదే కదా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఖమ్మం ఎన్నికల్లో ఒక్క చోట కూడా కెసిఆర్ చిక్కలేదు. మరి అదే కోర్టుల్లో ఒక్క చోటైనా కెసిఆర్ గెలిచారా? రామప్ప ఇజం పవర్ ఏంటో తెలిసిందా? పొలాలకు నీళ్లు తాగిస్తానని కెసిఆర్ చెబితే, కెసిఆర్‌కు వీళ్లు నీళ్లు తాగిస్తున్నారు. కన్యాశుల్కంలో రామప్ప పంతులు కేసులు వేసి ఒక్కొక్కరి చేత మూడు చెరువుల నీళ్లు తాగిస్తానని చెప్పినట్టు, కాంగ్రెస్ నాయకులు ఇపుడు తెరాస పాలకులను కేసులతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయి ఉండొచ్చు కానీ రామప్ప పంతులు ఇజాన్ని నమ్ముకుని కేసుల్లో తమకు తిరుగులేదని నిరూపించారు’’
‘‘ఏ ఇజంతో వర్కవుట్ అవుతుంది అనుకుంటే ఆ ఇజాన్ని నమ్ముకోవాలి. రాజకీయాల్లో సిగ్గుపడితే కుదరదు.’’
‘‘ఎవరి నమ్మకాలు వారివి.. నీ నమ్మకాన్ని హేళన చేస్తే నీకెంత కోపం వస్తుందో? ఎదుటి వారి నమ్మకాలను హేళన చేసేప్పుడు వారికీ అలానే అనిపిస్తుందని గుర్తుంచుకో!’’
‘‘కాదన్నదెవరు? నేను నీ వాదనకు సపోర్ట్‌గా మాట్లాడినా నీకు వ్యంగ్యం అనిపిస్తుందా? ఇంతకూ ఇజం అంటే ఏంటోయ్’’
‘‘ఎవడికి తెలుసు? పదం గంభీరంగా ఉండాలని వాడేస్తున్నాను. అప్పారావు చేసే పనులు అప్పారావు ఇజం. సుబ్బారావు చేసేవి సుబ్బారావు ఇజం అలానే పవన్ చేసేవి పవనిజం. రామప్ప పంతులు చేసినవి రామప్ప పంతులు ఇజం’’
‘‘ట్రాఫిక్‌ను నియంత్రించే కానిస్టేబుల్‌ది ట్రాఫికిజం అనాలన్నమాట’’
‘‘ అదే.. వెటకారం వద్దనేది.. అన్నీ వేదాల్లోనే ఉన్నాయని కొందరు నమ్మినట్టు! అన్నీ పవనిజంలోనే ఉన్నాయని కొందరు నమ్ముతున్నారు.. అది వాళ్లిష్టం.. నీకేమిటి అభ్యంతరం?’’
‘‘నువ్వు మాట్లాడుతున్నది హనుమంతుడి గురించే కదా? హనుమంతుడు మహాశక్తి సంపన్నుడు. నరేంద్ర మోదీ కూడా ఎంపిలను హనుమంతుడిలా పని చేయాలని చెప్పారు. అతని భక్తి భావాన్ని పవనిజం అని నువ్వు ముద్దుగా పిలుచుకుని పూజిస్తున్నావు.. అది నీ ఇష్టం..’’
‘‘పవనిజం అంటే అదో సిద్ధాంతం ’’
‘‘పిల్లి అంటే మార్జాలం అన్నట్టుగా ఉంది’’
‘‘పవనిజం అంటే ఏంటో చెప్పే ముందు దాని శక్తి గురించి చెబుతా! మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో మనకు 1947లో స్వాతంత్య్రం వచ్చింది కదా? పవనిజంతో ప్రయత్నిస్తే అంత కన్నా 50 ఏళ్ల ముందే వచ్చేది తెలుసా?’’
‘‘వామ్మో.. ఏమైందిరా..? ఇలా మాట్లాడున్నావ్! పిల్లల చదువు, ముసలి తల్లి, రోగిష్టి తండ్రి. పెళ్లి కాని అక్క ఇన్ని కష్టాలున్నాయి నీకు’’
‘‘నాకేం కాలేదు.. ఈ మాట అనగానే నన్ను అనుమానంగా చూస్తావని తెలుసు. కానీ ఈ మాట చెప్పింది నేను కాదు, ఎన్నో మెగా సినిమాలు తీసిన గొప్ప నిర్మాత చెప్పిన మాట. మహాత్మాగాంధీ పవనిజంను నమ్మి పోరాడితే స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చేదని సెలవిచ్చాడు’’
‘‘ఆ నిర్మాత బినామీ గణేష్ కదా? ’’
‘‘ఇజం గురించే తప్ప నిజం గురించి వద్దు. బినామీ అతని వృత్తి కానీ పేరు కాదు.. బండ్ల గణేష్ అని..’’
‘‘సినిమా పేరు గుర్తులేదు కానీ రాత్రులు, చీకట్లు అని అదేదో బూతు సినిమాలో హీరోగా నటించాడని, వాళ్ల ఫ్రెండే పరిచయం చేశాడు. బడుద్దాయ్ నాకు తెలియక పోవడం ఏంటి? చిన్న చిన్న వేషాలతో చిల్లర తిరుగుళ్లు తిరిగే వాడు. బండ్ల గణేష్ కాస్తా బినామీ గణేష్‌గా మారిపోయాడు పవనిజంను నమ్ముకొని.. అతను ఏదో ఒక ఇజాన్ని నమ్ముకుని బాగుపడ్డాడు.. మంచిదే కదా? కోర్టులో కేసులు వేసి ముప్పు తిప్పలు పెట్టడం రామప్ప పంతులు ఇజం అన్నావు బాగానే ఉంది. మరి పవనిజం ఏంటి?’’
‘‘పవనిజం అంటే పవనిజమే అంతే’’
‘‘ముగ్గురు పె....’’
‘‘ఇజం తప్ప నిజం వద్దన్నాను కదా? మళ్లీ’’
‘‘పవనిజం లోకల్- కెఎ పాల్ ఇజం ఇంటర్నేషనల్ అని ఆ మధ్య పాల్ చెప్పాడు కూడా.. ఆయన పార్టీ ఏమైందో? దేశంలో మోదీ ఇజం, తెలంగాణలో కెసిఆర్ ఇజం, ఆంధ్రలో చంద్రబాబు ఇజం మారుమ్రోగిపోతోంది. ఒకప్పుడు బాబు ఎన్టీఆర్ ఇజమే శాశ్వతం అన్నారు, తరువాత టూరిజం తప్ప మరో ఇజం లేదన్నారు. ఇప్పుడు లోక రక్షకుడు లోకేశ్ ఇజంను నమ్ముకోమని పార్టీవాళ్లకు చెబుతున్నారు. పాపం.. ఇంతకాలం ఎర్ర ఇజాలను బట్టీ పట్టి, ఇజాలు తప్ప మరేమీ తెలియని దశకు చేరుకున్న కమ్యూనిస్టులేమో పాదయాత్ర ఇజం నమ్ముకున్నారు. జీవితం కరిగిపోయాక ముగింపు దశలో గద్దర్ లాంటి విప్లవ వీరులు ఇజాలన్నీ అబద్ధం. ఎన్నికలే నిజం అంటున్నారు. బిజెపి వాళ్లేమో మోదీ ఇజంతో పాటు ఉత్తర ప్రదేశ్ సన్యాసి ఇజంపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు ఎప్పుడు ఏ ఇజాన్ని నమ్ముతారో అర్థం చేసుకోవడం కష్టం.’’
‘‘ఒక్క మాట చెప్పాలా? ఇజాలన్నీ ట్రాష్.. నిజం ఒక్కటే నిజం. అధికారం కోసం ఎవరికి తోచిన ఇజం వాళ్లు మార్కెట్ చేస్తుంటారు. నీ బతుకు నీదే, ఇజాలను అమ్ముకునే వాడి బతుకు వాడిదే. నీ పొట్ట తిప్పలు నీవి. వాళ్ల పొట్ట తిప్పలు వాళ్లవి. ఇంతకు మించిన ఇజం లేదు. నిజం లేదు’’ *
- బుద్దా మురళి(జనాంతికం 14. 4. 2017)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం