30, జూన్ 2017, శుక్రవారం

అమ్మా నాన్నా.. జిఎస్‌టి లవ్‌స్టోరీ



‘‘అబ్బాయి తీరు అనుమానంగా ఉంది.. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను వదలడం లేదు’’
‘‘ఆ రెండు లేకుండా కనిపిస్తే అనుమానించాలి. బట్టలు లేకుండా తిరిగితే పిచ్చోళ్లు అన్నట్టు, సెల్‌ఫోన్ లేకుంటే పిచ్చోళ్లు అనుకుంటారు.’’
‘‘ఈ మధ్య ప్రేమ కొటేషన్లు తెగ సేకరిస్తున్నాడు. ఏదో తేడాగా ఉంది. నిన్న వాడు ఫేస్‌బుక్‌లో రాసిన ప్రేమ కొటేషన్లు చూడండి. రామ్‌కో సిమెంట్‌తో కట్టిన గోడైనా కూలుతుంది.. కూలనిది అమర ప్రేమ ఒక్కటే.. ఫెవికాల్‌లా అతుక్కునేదే స్వచ్ఛమైన ప్రేమ. ఆర్ట్ ఫిల్మ్ అనుకొని వెళితే మాస్ మసాలా సినిమా టికెట్లు దొరికినట్టు ఎవరి కోసమో ఎక్కడికో వెళితే నీ ప్రేమ దొరికింది. జీన్స్ ఫ్యాంటు జీవిత కాలం లాంటిదే.. ప్రేమ బోర్ కొట్టినా వదుకోలేనంత కాలం ఉంటుంది. తెలుగు సీరియల్స్‌కు ముగింపు, మన ప్రేమకు ఫుల్‌స్టాప్ ఉండదు.’’
‘‘చాలు రాధా చాలు.. ఇంకేం చెప్పకు.. నాకు అర్థమైంది. మనవాడు ప్రేమలో పడ్డాడు. వీడిది అతితెలివి కదా? ప్రేమ కొటేషన్లను చదివి లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు మార్చి రాస్తున్నాడు. చెబుతా.. వాడి సంగతి’’
***
‘‘ఏంటీ విషయం?’’
‘‘డాడ్.. డొంక తిరుగుడుగా అడగడమెందుకు సూటిగా అడుగు.’’
‘‘ఎవరా? అమ్మాయి?’’
‘‘ఏ అమ్మాయి?’’
‘‘డొంక తిరుగుడుగా వద్దని చెప్పి నువ్వు.. ?’’
‘‘ఓకే డాడ్.. వర్కౌట్ అయ్యాక చెబుతాను’’
‘‘అంత కాన్ఫిడెన్సా? నీ ప్రేమకు చిన్న పరీక్ష పెడతాను.. అందులో పాసైతే నీకు అనుమతి ఇవ్వడమే కాదు.. నీకు మద్దతుగా నేనూ సహకరిస్తాను లేకపోతే నేను చెప్పినట్టు బుద్ధిగా చదువుకోవాలి ’’
‘‘ఏం పరీక్ష డాడ్? బొమ్మరిల్లులో హీరోయిన్ హీరో ఇంట్లో కొంత కాలం ఉండే పరీక్ష లాంటిదా? దేనికైనా ఓకే డాడ్’’
‘‘దరిద్రంగా డాడ్ అని పిలవకురా! నాన్నా, అయ్యా, డాడీ, పితాశ్రీ అని నీ ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా పిలువు తమిళంలో పిలిచినా, ఉర్దూలో పిలిచినా పలుకుతా.’’
‘‘ఓకే.. ఓకే.. కూల్... ’’
‘‘రాజకుమారి కోసం తోట రాముడు మాంత్రికునితో పోరాడ్డం చూశాం, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రేమించిన అమ్మాయి కోసం విలన్ పెట్టిన పరీక్షలో విజయం సాధించి హీరోయిన్‌ను చేపట్టిన కథలూ చూశాం. మాకూ తెలుసు ఈ పరీక్షలు వాటి ఫలితాలు.. నీకు అలాంటి పరీక్ష కాదు చిన్న జనరల్ నాలెడ్జి పరీక్ష పెడతాను. ’’
‘‘సిఎ అయిపోగానే నా టార్గెట్ సివిల్స్.. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నా.. కౌన్ బనేగా కరోడ్‌పతికి సెలక్ట్ అయ్యాను. ఆబిడ్స్‌లో నువ్వు ఆదివారం సెకండ్ హ్యాండ్‌లో కొనుక్కొచ్చిన పాత బుక్స్ అన్నీ ఎప్పుడో చదివేశాను. యక్ష ప్రశ్నలు, లకోటా ప్రశ్నలు, ఇంకేం అడిగినా చెబుతాను. కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే భీష్ముడు ఎందుకు స్పందించలేదు? సీతమ్మను శ్రీరాముడు ఎందుకు అడవులకు పంపాడు? అడుగుతావా? అడుగు.. ఆ పాత బుక్స్ నువ్వు చదివావో లేదో కానీ సివిల్స్ కోసం నేను ఎప్పుడో చదివి పారేశా’’
‘‘ అవి కాదు.. లేటెస్ట్ విషయమే. ఒక రోజంతా ప్రిపేర్ కా.. రేపు ఉదయం అడుగుతాను. గూగుల్ నుంచి గురువు వరకు ఎవరినడిగి చెప్పినా అభ్యంతరం లేదు. నువ్వు కరెక్ట్‌గా చెబితే నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీకు పెళ్లి జరిపిస్తా? ’’
***
‘‘అమ్మా.. నాన్నా.. కాలేజీకి వెళ్లొస్తా.. నన్ను దీవించండి’’
‘‘అలాగే వెళ్లిరా బాబు’’
‘‘ఏమండీ మనవాడికి ఏదో గాలి సోకినట్టుంది.జీవితం లో మొదటి సారి మన ఇద్దరి కళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోని బుద్ధిగా కాలేజీకి వెళుతున్నాడు. ఎవరైనా ప్రేమికులు కనిపించినా చిరాకు పడుతున్నాడు. మామ్, డాడ్ అనడం లేదు. వాడికేమైందండీ? నాకేదో భయంగా ఉంది. నిజం చెప్పండి.. చేతబడి చేయించారా? ’’
‘‘ఆ రోజు ఉదయమే వాడికి పరీక్ష పెడతానని అన్నాను కదా? ఏమైంది ఫ్లాష్‌బ్యాక్‌లోకి రా.. చూపిస్తా రా! ’’
***
‘‘తొందరగా అడగండి డాడ్.. ప్రశ్నలు సివిల్స్ రేంజ్‌లో ఉండాలి ’’
‘‘నిదానం.. నిదానం.. ముందు కూల్‌గా కూర్చో... జిఎస్‌టి అంటే ఏంటి?’’
‘‘ఆ..’’
‘‘జిఎస్‌టి ఫుల్‌ఫామ్ కాదు. వివరంగా చెప్పమని అడుగుతున్నా? జిఎస్‌టి వల్ల ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? ఒక వస్తువుపై పన్నులు పెరిగాయనే వార్త రాగానే వెంటనే ధర పెంచుతారు. అలానే పన్నులు తగ్గించినప్పుడు ఆ వస్తువుల ధర తగ్గాలి కదా? కానీ తగ్గదు. ఒక్కోసారి పన్ను తగ్గితే, రేటు పెరుగుతుంది. ఏ సూత్రం ప్రకారం ఇలా జరుగుతుంది? జిఎస్‌టి వల్ల ప్రజలకు ఉపయోగమా? ప్రభుత్వానికా? ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందా? ప్రజలపై భారం పెరుగుతుందా? ప్రజలకు మేలు అని ప్రభుత్వం చెబుతుందే- ఇంట్లో ఖర్చు లెక్క పెరుగుతుంది. ఇంట్లో అమ్మ లెక్క తప్పా? ప్రభుత్వం చెప్పే లెక్క తప్పా? ’’
‘‘డాడీ.. చిన్న పిల్లాన్ని చేసి ఇలా హింసించడం అన్యాయం’’
‘‘ముందు చెమటలు తూడుచుకో, ఆ ఏసీ ఆన్ చెయ్’’
‘‘సిఎకు ప్రిపేర్ అవుతున్నావు పన్నులు తగ్గినా ధరలు ఎందుకు తగ్గవో చిన్న లెక్క చెప్పలేవా? ’’
‘‘ పన్నులు తగ్గినా ధరలు ఎందుకు తగ్గవో ఏ లెక్కల బుక్కుల్లోనూ సమాధానం ఉండదు. అమర్త్యసేన్ కూడా చెప్పలేడు. చైతన్య, నారాయణల్లో కూడా ఇలాంటి లెక్కలు చెప్పరు. పోనీ 13వ ఎక్కం, 17వ ఎక్కం వరుసగా చెప్పమంటావా? ప్రజారోగ్య శాఖలో ఒక్క అధికారిని ఎసిబి పట్టుకుంటే ఎనిమిది వందల కోట్లు బయటపడితే, అందరు అధికారుల వద్ద ఎంత సొమ్ము ఉంటుంది? నంద్యాలలో ఒక్క ఓటుకు ఐదువేల రూపాయలు అయితే మొత్తం ఓట్లకు ఎన్ని? ఒక రాష్ట్రానికి ఎంత? రెండు రాష్ట్రాలకు ఎంత? ఠకా ఠకా చెప్పమంటావా? ’’
‘‘ పందెం .. పందేమే’’
‘‘ జిఎస్‌టితో ఏం జరుగుతుందో అమలైతే కానీ తెలియదని రాష్ట్ర ఆర్థిక మంత్రి సూటిగా, కేంద్ర ఆర్థిక మంత్రి డొంక తిరుగుడుగా చెప్పాడు. వాళ్లు చెప్పలేని ప్రశ్నను నన్ను అడగడం అన్యాయం పితాశ్రీ’’
***
‘‘ అదీ కథ.. దారి తప్పకుండా మనవాడి జీవితాన్ని కాపాడిన జిఎస్‌టికి ధన్యవాదాలు చెప్పుకుందాం రా.. రాధా... రా’’
‘‘ఏమండీ జిఎస్‌టితో ఉగ్రవాదులు తోక ముడుస్తారని, ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ మాయమవుతుందని, చైనా వణికిపోతుందని వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. నిజంగా ఇలా అవుతుందా?’’
‘‘చూడు రాధా.. మన వాడ్ని దారిలోకి తేవాలని నేను జిఎస్‌టిని నమ్ముకున్నాను. నన్ను నువ్వు ఎప్పుడో దారిలోకి తెచ్చుకున్నావ్, ఇంకెందుకు జిఎస్‌టి. మనకు మంచి చేసిన జి ఎస్ టి కి కృతజ్ఞ తలు చెప్పుకొందాం రా రాధా రా . జిఎస్‌టి వర్థిల్లాలి’’
*బుద్దా మురళి (జనాంతికం 30. 6. 2017)

23, జూన్ 2017, శుక్రవారం

కల్తీలేని స్వచ్ఛమైన బూతు



‘‘ముందు దిగ్భ్రాంతి చెందాను, తర్వాత నిర్ఘాంత పోయాను’’
‘‘ఎందుకు? తెలంగాణ నుంచి బియ్యం అంధ్రకు ఎగుమతి అవుతున్నాయనా? ఈ సీజన్‌లో తెలంగాణలో 60 లక్షల టన్నులు, ఆంధ్రలో 39 లక్షల టన్నుల వరి ధాన్యం పండిందనే వార్త చదివి నిర్ఘాంత పోయావా?’’
‘‘అది కామన్.. పంటపొలాలు ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతున్నప్పుడు- పంట విస్తీర్ణం తగ్గడం సహజం. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, అపార్ట్‌మెంట్స్ ఉన్న ప్రాంతాల్లో ఒకప్పుడు వ్యవసాయం సాగేది. ఇక్కడా అంతే ’’
‘‘కృష్ణారావును బ్రాహ్మణ పరిషత్ పదవి నుంచి తొలగించినందుకే కదా? నిజంగా అన్యాయం కదూ?’’
‘‘ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు తనను విమర్శిస్తేనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలులో వేసేయిస్తున్న బాబు. ఫేస్‌బుక్‌లో వ్యంగ్యోక్తులు విసిరిన వారిని సెంట్రల్ జైలులో చుక్కలు చూపించిన వారు, తమకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులను ‘షేర్’ చేస్తే పదవి నుంచి ఊడబెరకక పోతే ఆ పోస్టులకు లైక్ చేస్తారని అనుకున్నావా? ’’
‘‘ ఆ... తెలిసింది లే.. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకే కదా? రెండు సీట్ల నుంచి రథయాత్రతో బిజెపిని అధికారంలోకి తీసుకు వచ్చిన అద్వానీని ప్రధానిగా చూద్దామనుకుంటే 2004లో ముందస్తు ఎన్నికలు, ‘ఇండియా షైనింగ్’ అంటూ బాబుగారు తానూ మునిగి బిజెపిని ముంచేశారు. రాష్టప్రతి పదవి ఖా యం అనుకుంటే ఇలా కావడం దిగ్భ్రాంతికరమే ? ’’
‘‘ఇంట్లోంచి రోడ్డు మీదకు వెళ్లేప్పుడే పిల్లలకు సవాలక్ష జాగ్రత్తలు చెబుతాం. సైకిల్, బైక్, కారు సీట్లో కూర్చుంటేనే అన్ని జాగ్రత్తలైతే, దేశాన్ని నడిపే వాళ్లు కుర్చీలో ఇంకెంత జాగ్రత్తగా కూర్చోవాలి? ఎంత జాగ్రత్తగా అధికార చక్రం తిప్పాలి? రాబోయే ప్రమాదాలను కూడా ముందే పసిగట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అద్వానీ కలలు కన్న కుర్చీలో మోదీ కూర్చున్నారు. రాష్టప్రతి పదవిలో కూర్చోబెడితే ఎప్పుడే ఇబ్బంది కలిగిస్తారో? వచ్చే ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాకపోతే ఏం చేస్తారో? ఇన్ని సందేహాలు తొలుస్తుంటే అద్వానీకి రాష్టప్రతి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఎలా ఊహించావు?’’
‘‘అధికార పక్షం ఆర్‌ఎస్‌ఎస్ వాదిని రాష్టప్రతి అభ్యర్థిగా ప్రకటించినందుకా? విపక్షాలు సైతం దళిత కులానికి చెందిన మీరాకుమార్‌ను రంగంలో నిలిపినందుకా? ఆ దిగ్భ్రాంతి ? ’’
‘‘బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ కాకపోతే కాంగ్రెస్ వాది రాష్టప్రతి అవుతారా? కమ్యూనిస్టులు అవుతారా? సోనియానో, ఏచూరినో చెప్పిన వాళ్లు అవుతారనుకున్నావా? విపక్షాల నుంచి పోటీ ఊహించిందే కదా? చక్రం తిప్పిన బాబుకే చెప్పలేదు.. మోదీ ఇక వీళ్లకు చెబుతారా?’’
‘‘ నా చెవుల వరకూ వచ్చిందో విషయం.. నాకో మేధావి మిత్రుడున్నాడు అతను చెబితే నమ్మలేదు. ఇది నీ వద్దకూ వచ్చిందా? బహుశా నీ ఆశ్చర్యానికి కచ్చితంగా అదే కారణం అయి ఉంటుంది? ’’
‘‘???’’
‘‘నాతోనే చెప్పించాలని.. కెసిఆర్ పెద్ద కుట్రకు తెర లేపారట! కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడం. లక్షలాది గొర్రెలు, కోట్లాది చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడం ద్వారా గ్రామాల్లోని ప్రజలు కుల వృత్తుల్లో అక్కడే ఉండి తనకు ఎప్పటికీ పోటీకి రాకూడదని కుట్ర పన్నుతున్నారట! కరవు విలయ తాండవం చేస్తే ప్రజల్లో అసహనం పెరిగిపోయి తిరుగుబాటు చేస్తారనే కోటి ఎకరాలకు సాగునీరు పథకాన్ని ప్లాన్ చేశారట! ’’
‘‘అధికారంలో ఉన్న వాళ్లు సాధ్యమైనంత కాలం తామే అధికారంలో ఉండాలని కోరుకుంటారు. కాంగ్రెస్‌లోని మేధావులను మినహాయిస్తే మన ప్రత్యర్థులను ఎలా అధికారంలోకి తేవాలి? అని ఆలోచించే వారు ఎవరూ ఉండరు. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కెసిఆర్, ఆంధ్రలో బాబు తమ పదవులు నిలుపుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతారు. మళ్లీ అధికారంలోకి రావడానికి ఎవరికి చాతనైన పనులు వాళ్లు చేస్తారు. దీనిలో నిర్ఘాంత పోవడానికేముంది’’
‘‘అబ్బా.. ఇక నా వల్ల కాదు.. సస్పెన్స్ భరించలేను.. చైనా మన మీద దాడి చేస్తుందనే సమాచారం ఏమైనా ఉందా? తాలిబాన్లు ప్రపంచాన్ని నాశనం చేయనున్నారా? వాడెవడో కోరియావాడు మనమీదెమన్నా గురిపెట్టాడా? చెప్పు ప్లీజ్ ... చెప్పు’’
‘‘ఇవన్నీ పెద్దగా పట్టించుకోవలసినవి కాదు. నీకు కాబట్టి చెబుతున్నా లోకులకు చెప్పినా అర్థం కాదు. బూతు లేనిదే భవిష్యత్తు లేదని తేల్చి చెప్పిన జబ్బర్‌దస్త్, పటాస్ ప్రోగ్రామ్‌లను నిలిపివేస్తున్నారు అనే వార్త వినగానే ఒక్కసారిగా గుండె ఆగినట్టు అయింది... నిర్ఘాంత పోయాను. సినిమాల్లో హీరోకో హీరోయిన్‌కో కష్టం వస్తే సముద్రంలో పైకి వచ్చిన అలలు అలానే నిలిచిపోతాయి చూడు.. అచ్చం అలానే మెదడు మొద్దుబారి శూన్యం ఆవరించింది. ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా? అని అక్కినేనిలా దేవున్ని నిలదీయాలనుకున్నాను’’
‘‘???’’
‘‘పెద్ద మనుషులుగా బయటకు మనం ఎన్ని నీతులైనా చెప్ప వచ్చు కానీ ఆ ప్రొగ్రామ్స్‌లోని బూతు మన జీవితానికి నూతనోత్తేజాన్ని ఇస్తోంది. నిషేధిత వెబ్‌సైట్స్ చూస్తే లేని పోని సమస్య. పెద్ద మనుషులు రూపొందించి పెద్దమనుషుల చానల్స్‌లో పెద్ద మనుషుల్లా ప్రసారం చేస్తే మనలాంటి పెద్ద మనుషులు ఇంట్లో కూర్చోని నిర్భయంగా చూడవచ్చు. ఏ జన్మలోనో మనం చేసుకున్న పుణ్యం వల్ల ఇలాంటి ప్రసారాల కాలంలో బతికున్నాం. ఈ అదృష్టం నుంచి మనల్ని దూరం చేసే కుట్ర జరుగుతోందని తెలిసి మనసు కకావికలం అయింది. మనమేమన్నా జిఎస్‌టి వద్దన్నామా? తిరుపతిలో గుండు కొట్టించుకున్నా పన్ను కట్టమంటే కట్టమన్నామా? మా సంతోషాల మీద ఎందుకీ కుట్ర..? దేవుడున్నాడు.. వాళ్ల కుట్రలను భగ్నం చేశాడు. మన పెద్దల మీద నాకు పూర్తి విశ్వాసం ఏదో చేసి మనను బూతుకు దూరం కాకుండా చేస్తారు అను కున్నా .. నా నమ్మకమే నిజమైంది సర్వే జన సుఖినోభవంతు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు. కేసులు అడ్డుపెట్టి బూతును అడ్డుకోలేరు. అవసరం అయితే రాజ్యాంగాన్ని సవరించైనా భవిష్యత్తు తరాల కోసం బూతును కొనసాగించాలి. బూతే భవిష్యత్తు. ఒకప్పుడు తెలుగు సినిమాలు బూతును కల్తీ చేసి డబుల్ మీనింగ్డైలాగులు అని వినిపించేవి .. ఇప్పుడు కల్తీ లేకుండా స్వచ్ఛమైన బూతు ఇంటి తెర ద్వారా ఇంట్లోకి పంపిస్తున్నారు 
కవి చౌడప్ప సిగ్గుపడేలా  కల్తీలేని స్వచ్ఛ బూతు భవిష్యత్తు తరాలకు ఏ ఆటంకం లేకుండా కల కాలం ఇలానే అందించాలని కోరుకుందాం.’*
-బుద్దా మురళి(జనాంతికం 23. 6. 2017) 

16, జూన్ 2017, శుక్రవారం

అజ్ఞాన పీఠాలు కావలెను



‘‘ఏంట్రోయ్.. ఈ వయసులో ప్రేమలేఖ రాస్తున్నావా? నేను రాగానే రాయడం ఆపేశావు. కాలేజీలో ఎవడికో డబ్బిచ్చి ప్రేమలేఖ రాయించుకునే వాడివి.. నువ్వేమో అంత కష్టపడి ప్రేమలేఖలు రాయిస్తే- రాసింది సుభాష్ అని తెలుసుకుని అతని ప్రేమలో పడిన కల్పన సంగతి గుర్తుందా? ఏదైతేనేం ఇంత కాలానికైనా సొంతంగా రాస్తున్నావు.. చాలా సంతోషం’’
‘‘ఎందుకు గుర్తులేదు. ఆ సుభాష్ గాడికి బట్టతలొచ్చింది. కల్పనకు తగిన శాస్తి జరిగిందిలే..’’
‘‘తెలివైన వాళ్లకే తొందరగా బట్టతల వస్తుందని వాళ్లయన్ని మురిపెంగ చూస్తూ చెబుతుంది కల్పన.. ఆ మధ్య ఓ పెళ్లిలో కలిశాం లే. ’’
‘‘ఆ కల్పన ఎవరో అదృష్టవంతురాలు అన్నగారూ.. ఈయన ప్రేమను ఒప్పుకున్నా బాగుండేది’’
‘‘ఇంతకూ అంత రహస్యంగా ఏం రాస్తున్నావు. చిన్నప్పటి నుంచి కవిత్వం రాసేవాడివి కదా? పత్రికల్లో ఎక్కడా నీ కవిత్వం కనిపించనే లేదు’’
‘‘నాకీ పత్రికల మీద నమ్మకం లేదు. నేను ఎంతో ఆలోచించి పత్రికలకు పంపితే వాళ్లు తమ సొంత పేరుతో వేసుకుంటారనే భయంతో పత్రికలకు ఎప్పుడూ పంపలేదు. పంపితే శ్రీశ్రీ, నారాయణరెడ్డిలను మించి ఓ వెలుగు వెలిగే వాణ్ణి. మనలోమాట.. నేను కవిత్వం రాస్తే శ్రీశ్రీ, నారాయణరెడ్డి, కాళోజి , విశ్వనాథ సత్యనారాయణ ,కరుణ శ్రీ ,దాశరథిలను మించి పోనూ.. నాలాంటి వాళ్లు రాయకపోవడం వల్లే వాళ్లు మహాకవులుగా వెలిగిపోయారు. ’’
‘‘ఔనవును.. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో కొందరు మేధావుల చర్చలు నేనూ చూశాను.. తాను శ్రీశ్రీని గుర్తించడం లేదని ఒకరు, సినారెను కవిగా గుర్తించడం లేదని ఇంకొకాయన.. గుంపులో గోవిందయ్యనో, దారిన పోయే దానయ్య లాంటి పేరు ఏదో ఉంది గుర్తు రావడం లేదు.. ఆయన తెగ రాసేశాడు.’’
‘‘నిజమే కదా? సినారె తాను పుట్టిన ఊరు గురించి కవిత రాశారు. కానీ మా పుట్టిన ఊరు గురించి రాయలేదు.. మా ఊరి గురించి రాయని ఎవరినీ నేను ఖాతరు చేయను. కనీసం మా బాబాయ్ గురించైనా రాశాడా? శ్రీశ్రీ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరూ అని అడగడం ద్వారా మైనారిటీ సంతృప్తికర విధానం అవలంభించారు .. సోమనాథ్ ఆలయానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరూ అని అడగ వచ్చు కదా ? వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్.. ఇదేం కవిత్వమోయ్. రథాలు అంటే బూర్జువా మనస్తత్వం కదా? హిందుత్వ కాదా  ?  ఐనా ఆ రోజుల్లో ఎడ్లబండ్లు ఉండేవి కాబట్టి రథాల గురించి రాశాడు. వంద రాకెట్లను ఒకేసారి పంపిన కాలంలో ఇంకా శ్రీశ్రీ రథాలు అవసరమా? అదే నేనైతే వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. బుల్లెట్ ట్రైన్‌లు వస్తున్నాయ్.. అంటూ రాసేవాడ్ని.. ’’
‘‘ నువ్వు రాసేవాడివేమో కానీ ఆ నాయకుడెవరో జిల్లాకో బుల్లెట్ ట్రైన్ అని ఎప్పుడో హామీ ఇచ్చేశారు. కవిత్వానికి, నాయకుల హామీలకు పెద్ద తేడా లేకుండా పోతుందోయ్. అయినా ఆ కవులేమైనా వార్తలు రాశారా ?  మా సామజిక వర్గం గురించి ఎందుకు రాయలేదు  అని అడిగేందుకు ... వాళ్ళు రాసింది కవిత్వం ఎంతైనా కవులకు కష్టకాలమే. కవిగారి కవిత్వం బాగుందా? నాయకుని హామీల జాబితా బాగుందా? అంటే తేల్చుకోవడం సామాన్యుడికి కష్టమే. ఆ మహాకవులు చనిపోయి బతికి పోయారు. ఉన్నా నీతో పోటీ పడలేకపోయేవారనుకో! వాళ్లకొచ్చిన నాలుగు ముక్కలేవో రాసి వదిలేసి పోయారు. వాళ్ల సంగతి వదిలేయ్! నువ్వు రాకెట్‌లొస్తున్నాయ్ అని రాయి.. వద్దన్నదెవరు? అడ్డుకునేదెవరు? నువ్వు ఇంత కాలం రాయకపోడవం వల్ల తెలుగు సాహిత్యం ఓ వజ్రాన్ని కోల్పోయిందని అం టావు. ఇంతకూ అంత రహస్యంగా ఏం రాస్తున్నావు’’
‘‘పత్రికల మీద నమ్మకం లేక ఇంత కాలం నా కవిత నా మనసులోనే ఉంచుకున్నా’’
‘‘ఏ వస్తువైనా ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మురిగిపోతుంది. ఇంత కాలం దాచుకున్న కవితలు ఇప్పుడు మార్కెట్‌లోకి వదులుతావా? ఫుడ్ ఫాయిజన్ అవుతుందేమో’’
‘‘ఏడ్చావ్ లే! ఇప్పుడు కవిత్వం రాయాలంటే’’
‘‘బుర్రతో పనిలేదంటావా?’’
‘‘అప్పుడంటే పత్రికల వారి కరుణ ఉంటేనే కవిత్వం బయటికొచ్చేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల పుణ్యమాని క్షణాల్లో జనం లోకి వెళ్లిపోతున్నాయి’’
‘‘మరి అంత భయం భయంగా రాయడం ఎందుకు? జనం దాడి చేస్తారని భయమా? ‘చెల్లికి పెళ్లి.. మళ్లీ మళ్లీ’ అని రాసినందుకు అదేదో సినిమాలో ఎడిటర్‌పై రౌడీ షీటర్ కక్ష తీర్చుకున్నట్టు నీమీద ఎవడైనా దాడి చేస్తాడని భయమా?’’
‘‘అడ్రస్ ఉండదు కాబట్టి దాడి చేసే ప్రసక్తే లేదు’’
‘‘మరి ఇంకెందుకు భయం?’’
‘‘ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మనం రాసే అన్నింటిపైనా నిఘా ఉంటోంది. ఎవరికీ చెప్పవద్దు.. నీకో రహస్యం చెబుతాను. నాపై ఎఫ్‌బిఐ నిఘా ఉంది!’’
‘‘దాన్ని ఏఫ్‌బిఐ అనరు సిబిఐ అంటారు.
అసలే భూముల రిజిస్ట్రేషన్ శాఖలో రైటర్‌గా పని చేశావు. బోలెడు వెనకేసి ఉంటావు.. కేసు సిబిఐ వద్దకు వచ్చినప్పుడు నీపై నిఘా ఉండకుండా ఎలా ఉంటుంది’’
‘‘తెలియకుండా మాట్లాడకు.. నేను చెప్పింది ఎఫ్‌బిఐ గురించే... ఈ మధ్య ట్రంప్‌ను ఏకి పారేస్తూ బోలెడు కవిత్వం రాసి పారేశాను. అప్పటి నుంచి నాపై ఎఫ్‌బిఐ నిఘా ఉందని కచ్చితమైన సమాచారం. నేనేం రాస్తున్నానో ఎఫ్‌బిఐ ఎప్పటికప్పుడు ట్రంప్‌కు సమాచారం ఇస్తూనే ఉంది. ఆయన అమెరికా అధ్యక్షునిగా పోటీ చేస్తారని చినబాబు చేసిన ప్రకటనకు మద్దతు తెలిపినప్పటి నుంచి నన్ను ఎఫ్‌బిఐ టార్గెట్ చేస్తోంది. సరే.. లోకల్‌గా సిబిఐ నిఘా నాపై ఎలాగూ ఉంటుందనుకో, సిఐడి పోలీసుల గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. కవిత్వంతో- నీళ్లలో నిప్పులు సృష్టించే సత్తా నాకుందని వీరి భయం. ఇప్పుడు అలాంటి కవిత్వం ఒకటి రాస్తున్నాను. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నారనే కేసు పెట్టే స్థాయి కవిత్వం రాస్తున్నా’’
‘‘విన్నవాళ్లకు విరేచనాలు అయితే.. కేసులు పెడితే ప్రభుత్వానిదా బాధ్యత?’’
‘‘విన్నవాళ్లు కాదు... ప్రభుత్వమే కేసులు పెడుతుంది చూడు’’
‘‘వచ్చావా దసరా మళ్లీ వచ్చావా. చీకటి నిండిన మా జీవితాల్లో ... ఇదేనా నీ కుట్ర కవిత. ఈ కవిత ఇంతకు ముందు విన్నట్టుగా ఉంది’’
‘‘మనిషన్నాక కాసింత కవితా జ్ఞానం ఉండాలి. ఇది కొత్త కవిత.. నువ్వు విన్నది వచ్చావా ఉగాది మళ్లీ వచ్చావా? అనే కవిత.. ఉగాదికి, దసరాకు తేడా తెలియదు నువ్వేం మనిషివోయ్ కవిత్వం గురించి కొంతైనా అవగాహన లేకపోతే ఎలా? ’’
‘‘ఎలా ఉంది నా కవిత?’’
‘‘తెలుగువాళ్లకు మూడు జ్ఞానపీఠ్‌లు వచ్చాయి చాలు ... కానీ నీ వాదన విన్నాక, నీ కవిత చదివాక మనకు అజ్ఞానపీఠ్‌లు చాలా రావలసి ఉంది అనిపిస్తోంది’’
*
-బుద్దా మురళి( జనాంతికం 16. 6. 2017)

9, జూన్ 2017, శుక్రవారం

మీరు.. ప్లాస్టిక్ మనుషులా?

‘‘రండి.. అన్నయ్య గారూ రండి.. భోజనాల సమయానికి వచ్చారు. భోజనం చేసి వెళ్లండి’’
‘‘వద్దులేమ్మా ఉదయం ఇంట్లోంటి బయటకు వచ్చేప్పుడే కడుపునిండా తినే వ చ్చాను’’
‘‘అదేంటోయ్ చెల్లెమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చేసింది. కనీసం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉదయమే రోడ్డున పడ్డావని చెప్పింది.’’
‘‘అలా చెప్పి తగలడిందా? అదంతేలేవోయ్.. నేను బకాసురుడిలా రోజుకు నాలుగైదు సార్లు తింటాను అనుకుంటుంది. నీమీదొట్టు.. తినే వచ్చాను’’
‘‘ఒట్టు నా మీదెందుకులే? ’’
‘‘భోజనం చేయక పోతే  వేడివేడి ఎగ్ ఆమ్లేట్ వేస్తాను తినండి అన్నయ్య గారూ...’’
‘‘అయ్యో.. నీకీ విషయం ఇప్పటి వరకు తెలియదా? నేను గండర గండ స్వామి దీక్ష పట్టాను. ఈ దీక్షలో ఉన్న వాళ్లు గుడ్డును దూరం నుంచి కూడా చూడకూడదు. ’’
‘‘మనిషి మాంసం తప్ప అన్నీ తింటావు అంటారు.. నీ గురించి తెలిసిన వాళ్లు.. అదేంటిరా.. గుడ్డు కూడా తినకుండా ఎలా ఉంటావు?’’
‘‘మంచి నీళ్లయినా తాగుతావా? ఇదిగో ప్లాస్టిక్..’’
‘‘ఏంటీ.. ప్లాస్టిక్ నీళ్లు కూడా వచ్చేశాయా? ’’
‘‘నీ భయం పాడుగానూ.. ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు అని పూర్తిగా చెప్పక ముందే అలా ఉలిక్కి పడుతున్నావ్. ప్లాస్టిక్ గుడ్లు వచ్చాయనే భయమే కదా.. ఏదీ ముట్టడం లేదు’’
‘‘ప్లాస్టిక్ సర్జరీ నిజం అయినప్పుడు ప్లాస్టిక్ బియ్యం నిజం ఎందుకు కాదు?’’
‘‘వెనకటికొకడు దేవుడ్ని ప్రార్థించి తాను ఏది ముట్టుకున్నా బంగారం కావాలని వరం కోరుకున్నాడు. దాంతో వాడు ఏది ముట్టుకున్నా బంగారం అయింది. చివరకు తిందామని అన్నాన్ని ముట్టుకున్నా, తాగుదామని మంచినీళ్లు ముట్టుకున్నా బంగారం అయింది. దేవుడు వరాలు ఇస్తాడు కానీ తీసుకోడు కదా? ఈ వరం నాకు వద్దు దేవుడా? అని ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. అన్నం, నీళ్లు లేక బంగారంతోనే కన్ను మూశాడు’’
‘‘నువ్వే కాదు.. చిన్నప్పుడు ఈ కథ నేనూ చదివాను. నాకెందుకు చెబుతున్నావు?’’
‘‘నిన్ను చూస్తే వాడు బంగారంతో చచ్చిపోయినట్టు, ప్లాస్టిక్ నీ ప్రాణం తీస్తుందేమో అనిపిస్తోందిరా! మా ఇంట్లో ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నమే అనుకుందాం. మరి మీ ఇంట్లో అన్నం ప్లాస్టిక్ బియ్యంది కాదని నమ్మకమేంటి? చివరకు ఎక్కడ అన్నం చూసినా నీకు ప్లాస్టిక్ కనిపిస్తుంది. తినలేవు, తినకుండా ఉండలేవు. ప్లాస్టిక్‌ను తిన్నాననే భావనతో కుంగి కృశిస్తావు. తిన్నా , తినకున్నా బతకలేవు’’
‘‘చూసిందాన్ని కూడా నమ్మవా? వీడియోలు చూపిస్తా చూడు’’
‘‘అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేశారు తెలుసా?’’
‘‘ఎలా సాధ్యం? సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన చాలా కాలానికి జూనియర్ హీరో అయ్యాడు కదా? ఐనా మనం మాట్లాడుకునే దానికి దీనికి సంబంధం ఏంటోయ్ ’’
‘‘చిన్నప్పుడు చక్కరను భూమిలో పాతి పెడితే చక్కెర పండుతుందని, విరిగిపోయిన పన్ను పాతిపెడితే బంగారం అవుతుందని అందరం గట్టిగా నమ్మేవాళ్లం ’’
‘‘అంటే అసలు కల్తీనే లేదంటావా? ’’
‘‘అవేం అపశకునపు మాటలు. కల్తీ లేని వస్తువే లేదు. కాలుష్యం, కల్తీ లేని జీవితమే లేదు.’’
‘‘అంటే వీడియో కూడా నమ్మవా? ’’
‘‘మరి నేను ఏకంగా జూనియర్, సీనియర్ ఎన్టీఆర్‌లు కలిసి డ్యాన్స్ చేసింది చూపిస్తా అన్నా నమ్మడం లేదు’’
‘‘ఆమ్లేట్ తినను అన్నందుకు ఇంత క్లాస్ తీసుకుంటావా?’’
‘‘సరే కోడిగుడ్డు గురించే మాట్లాడుకుందాం. హోల్‌సేల్ మార్కెట్‌లో కోడిగుడ్డు ధర మూడున్నర రూపాయలు’’
‘‘చైనా వాళ్లను నమ్మేందుకు వీలు లేదు. వాళ్లు ప్లాస్టిక్ గుడ్లను ఇండియాకు పంపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ నిజం. వీడియోలు ఉన్నాయి. నువ్వు చైనాకు ఏజెంట్‌వేమో అని నా అనుమానం. పూర్వం సోవియట్ రష్యాలో ప్రతి ఒక్కరూ ఏజెంట్లుగా ఉండేవారట! రష్యా పతనం తరువాత ఇప్పుడు చైనా వాడిదే పెత్తనం పెరిగింది కదా? ఎవరు ఏజంటో, ఎవరు దేశద్రోహినో తెలియడం లేదు. ’’
‘‘ఔను.. చైనావాళ్లు పిల్లికళ్లతో ఉంటారు. వాళ్లు ఏమైనా చేయగలిగిన వాళ్లు.. గుడ్లు ఎందుకు పెట్టరు. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాల కోసం పిల్లలను మర మనుషులుగా, బొమ్మలుగా మార్చి శిక్షణ ఇచ్చే వాళ్లు వ్యాపారం కోసం గుడ్లు పెట్టినా పెడతారు. వాళ్లే స్వయంగా రోజూ కొన్ని వందల గుడ్డు పెడుతున్నారు అనుకుందాం. ఆ గుడ్లను ఇండియాకు రహస్యంగా ఎలా తెస్తారు?’’
‘‘చైనా వాళ్లు గుడ్లు పెడతారు అని నేను అనడం లేదు. ప్లాస్టిక్ గుడ్డను పరిశ్రమల్లో తయారు చేసి పంపిస్తారు అంటున్నాను’’
‘‘ఏదైనా ఒకటే. మూడున్నర రూపాయలకు హోల్‌సేల్ మార్కెట్‌లో గుడ్డు దొరికితే, చైనావాడికి ఒక ప్లాస్టిక్ గుడ్డు తయారు చేసేందుకు ఎంత ఖర్చవుతుంది. దానిని ఇండియాకు దొంగచాటుగా ఎలా తెస్తారు? తేవడానికి ఎంత ఖర్చు. ప్లాస్టిక్ గుడ్లు చైనా నుంచి మన కంచం వరకు చేరాలి అంటే ఎంత మంది సహకరించాలి’’
‘‘నీకు ఇండియా కన్నా చైనాపైనే ప్రేమ ఎక్కువ కనిపిస్తోంది’’
‘‘నా ప్రేమ సంగతి తరువాత.. మన దేశ సరిహద్దులు దాటి ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్లు , ప్లాస్టిక్ క్యాబేజీలు, ప్లాస్టిక్ మంచి నీళ్లు, చివరకు మనం పీల్చే ప్లాస్టిక్ గాలి చైనా నుంచి దేశంలోకి వస్తోంది అంటే మన దేశ ప్రజల కన్నా చైనా ఏజెంట్లే ఎక్కువ మంది ఉండాలి.’’
‘‘ ఇంతకూ ఏమంటావు?’’
‘‘ నువ్వనుకునేది నిజం.. అయితే ఈ దేశభద్రత ప్రమాదంలో పడినట్టు నేను అనుకున్నది నిజం అయితే మనిషి మనుగడ ప్రమాదంలో పడ్డట్టు..’’
‘‘అర్థం కాలేదు’’
‘‘డజను మంది టెర్రరిస్టులు వస్తేనే దేశం అల్లకల్లోలం అవుతుంది. కోట్లాది మంది తినే బియ్యం, గుడ్లు ప్లాస్టిక్‌వి యథేచ్ఛగా వస్తున్నాయంటే దేశ భద్రత ప్రమాదంలో పడ్డట్టే.. ప్లాస్టిక్ బియ్యం అబద్ధం అని టీవీ చానల్ వారికి తెలుసు.. సంచలనం కోసం ప్రసారం చేస్తున్నారు అని అనుకుంటే ఒక వార్త కోసం దేశాన్ని కూడా తాకట్టు పెడతారేమో అని భయం వేస్తోంది. ’’
‘‘అంతా కనూఫ్యూజ్డ్‌గా ఉంది. నిజం చెప్పండి.. మీ భార్యాభర్తలు ఇద్దరు నిజంగా మనుషులా? ప్లాస్టిక్ మనుషులా? ’’ 
‘‘మీ సంబరాన్ని నేనెందుకు కాదనా లి .. స్కై లాబ్  పడితే తో  భూమి పై ఉన్న వారంతా  పైకి పోతా రని మన చిన్నప్పుడు కూడా నమ్మి ఓ నెల రోజులు ఇవే చివరి రోజులు అని సంతోషంగా గడిపాం. 1999 లో యుగాంతం అని గట్టిగా వినిపించింది .. తరువాత తోక చుక్క అటు ఇటూ తోక ఊపుతుంది ఆ తోక తాకితే అంతే అని తెగ ప్రచారం జరిగింది 2000 సంవత్సరం రాగానే 2 కె సమస్యతో విమానాలు ఆకాశం లో నిలిచి పోతాయి.  ఆస్పత్రుల్లో ఆపరేషన్ లు ఆగి పోతాయి  కంప్యూటర్ తో పాటు మన గుండె ఆగిపోతుంది అంటే  నమ్మలేదా ? అబద్దం అయినా నమ్మామ్ . నమ్మకమే జీవితం నమ్మితే కాస్త మజానే కానీ పోయేదేముంది నమ్ముదాం ’’*
-బుద్దా మురళి(జనాంతికం 9. 6. 2017)