2, ఆగస్టు 2017, బుధవారం

ఇంతకీ ‘ట్రంప్ ఫోబియా’ ఎవరికి?

‘ భూతల స్వర్గం’ అని అందరూ కీర్తిస్తున్న అమెరికాలో నిజంగా మన వాళ్లకు భద్రత లేదా? మన ఐటి ఉద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా, అలవికాని విధంగా ఉందా? మన నేలపై ఉంటూ మన టీవీ చానళ్లలో చూస్తే ఇలానే అనిపిస్తుంది. కానీ, అమెరికాకు వెళ్లి చూస్తే మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ‘అమెరికా దృశ్యాల’ను హైదరాబాద్ నగరం నుంచే ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకుని తెలుగు చానళ్లు కథలు అల్లాయి. మన జాతీయ టీవీ చానళ్లు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడమే తప్పు అన్నట్టు చూపిస్తే, తెలుగు చానళ్లు మరో అడుగు ముందుకేసి ట్రంప్ గెలుపు తమకు నచ్చలేదని తేల్చిచెప్పడంతో పాటు మన వాళ్ల జీవితాలు నడిరోడ్డున పడ్డాయన్నట్టుగా తెగ ఆందోళన వ్యక్తం చేశాయి. నెల రోజుల పాటు అమెరికాలోని అనేక ప్రాంతాల్లో తిరగడంతో పాటు ఐటి ఉద్యోగులతో మాట్లాడితే- మన చానళ్లలో ఎంతో సీరియస్‌గా చెప్పిన విషయాలపై వాళ్లు జోకులేస్తున్నారు. వాస్తవానికి, ప్రచారానికి అంత తేడా ఉంది!
అధికారిక గణాంకాల ప్రకారం 23 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరు కాకుండా విద్యార్థులు, వివిధ రకాల అనుమతులతో అక్కడ ఉద్యోగం చేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అమెరికాలో మన ఐటి ఉద్యోగులు, విద్యార్థులను ‘ట్రంప్ ఫోబియా’ వెంటాడుతోందా? వీళ్లందరినీ ట్రంప్ వెళ్లగొట్టడం ఖాయమా? తెలుగు చానళ్లు చూశాక తలెత్తిన ప్రశ్నలు ఇవి. ఈ వ్యాస రచయిత కొద్దిరోజుల క్రితం అమెరికా పర్యటించినపుడు అసలీ ప్రశ్నలే ఎక్కడా వినిపించలేదు.
భారతీయులను గానీ, మన తెలుగువాళ్లను గానీ ట్రంప్ ఏ విధంగానూ భయపెట్టడం లేదు. ట్రంప్ నివసించే వైట్ హౌస్ ముందే ఎవరో అనామకుడు రెండు నెలల నుంచి గుడారం వేసుకుని ట్రంప్ దిగిపోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నా అక్కడి భద్రతా సిబ్బంది ఎవరూ అడ్డుకోవడం లేదు. అమెరికా అడ్మినిస్ట్రేషన్ భవనం వరకూ ఎలాంటి అనుమతి లేకుండా వెళ్లి వచ్చినా అడ్డుకునే వారు లేరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్న తెలుగు వారు నిశ్చింతగా తమ ఉద్యోగాలు తాము చేసుకుంటున్నారు. యువతీ యువకులు ఉన్నత విద్యాసంస్థలలో హాయిగా చదువులు కొనసాగిస్తున్నారు. అయితే, ఎక్కువగా ఐటి విద్యార్థులు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. గతంలో ఇలానే వెళ్లిన వారు అక్కడే స్థిరపడిపోయారు. ఒకసారి అమెరికా వాతావరణం, అక్కడి పరిస్థితులు అలవాటు అయిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చేవాళ్లు తక్కువ అనే అభిప్రాయం అక్కడ బలంగా వినిపించింది. కెరీర్ పరంగా ఎదిగేందుకు ఉన్న విస్తృత అవకాశాలతో పాటు ప్రజల్లో చట్టం పట్ల భయం, గౌరవం ఆ దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోయిందని అనిపిస్తోంది.
ఎంఎస్ చేసేందుకు రెండేళ్లు అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి జీవన విధానం, క్రమశిక్షణ, చట్టాన్ని ఉల్లంఘించని బాధ్యతాయుతమైన జీవితం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. దీనికి తోడు ఎదిగేందుకు ఉన్న పుష్కలమైన అవకాశాలు, డాలర్ల సంపాదన యువతను కట్టిపడేస్తుంది. ట్రంప్ భయం లేదు కానీ, మనవాళ్లు పెద్ద సంఖ్యలో వస్తుండడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఇటీవలి కాలంలో కాస్త మందగించాయనే అభిప్రాయం అక్కడి వారిలో వినిపించింది. ఎక్కువ మంది కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగాల్లో చేరుతారు. హెచ్1బి వీసా రాక ముందే చదువు ముగిసిన తరువాత విద్యార్థులు ఓపిటిపై ఉద్యోగంలో చేరుతారు. మూడేళ్ల పాటు ఓపిటిపై ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం ఉంది. కనీసం విద్య కోసం తాము ఖర్చు చేసిన డబ్బును తిరిగి అక్కడే సంపాదించుకోవాలనే దృఢమైన అభిప్రాయం అక్కడి విద్యార్థుల్లో కనిపించింది.
గతంలో కన్సల్టెన్సీల్లో చేరితే ఒకటి, రెండు నెలల్లోనే ఏదో ఒక సంస్థలో ఉద్యోగం లభించేది. కానీ ఇప్పుడు చాలా చోట్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొందరు విద్యార్థులు ఆరునెలల నుంచి కన్సల్టెన్సీల్లో ఉంటూ అవకాశం కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఏడాది నుంచి ఎదురు చూస్తున్న వారు సైతం ఉన్నారు. చదువు ముగించి ఏడాది పాటు ఉద్యోగం లేకుండా అమెరికా లాంటి దేశంలో ఉండడం అంటే ఆ విద్యార్థిపై మానసికంగా తీవ్ర ప్రభావం పడుతుంది. మంచి ఉద్యోగం కోసం ఎక్కువ కాలం ఎదురు చూడడం కన్నా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం మేలు అనే భావన కనిపిస్తోంది. ట్రంప్ ప్రభావం లేకపోయినప్పటికీ గత కొంత కాలంగా పెద్ద సంఖ్యలో మన వాళ్లు వస్తున్నారు. దీని వల్ల వెంటనే ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదని చెబుతున్నారు. కన్సల్టెన్సీలది ఇక్కడ లాభసాటి వ్యాపారంగా మారింది. వీటిని ఎక్కువగా తెలుగువారే నిర్వహిస్తున్నారు. ఎన్ని నెలలు అయినా ఈ కన్సల్టెన్సీలే అభ్యర్థికి వసతి కల్పించి ఉద్యోగాల కోసం మార్కెటింగ్ చేస్తాయి. ఉద్యోగం వచ్చిన తరువాత, ఉద్యోగం చేస్తున్నంత కాలం కన్సల్టెన్సీల వారికి వీరి సంపాదనలో కొంత వాటా ఉంటుంది. ఏడాదికి దాదాపు లక్ష డాలర్లు విద్యార్థికి పని చేసే సంస్థ చెల్లిస్తే ఈ కన్సల్టెన్సీలు ఉద్యోగికి 60వేల డాలర్ల వరకు ఇచ్చి నలభై వేల రూపాయల వరకు తాము తీసుకుంటాయి. రెండు మూడు నెలలు వసతి కల్పించి మార్కెట్ చేసినందుకు విద్యార్థి కన్నా కన్సల్టెన్సీలకే ఆదాయం ఎక్కువ. అయినప్పటికీ విద్యార్థులు కన్సల్టెన్సీలనే నమ్ముకోక తప్పడం లేదు. సొంతంగా ప్రయత్నిస్తే లభించే అవకాశాల కన్నా కన్సల్టెన్సీల ద్వారానే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు న్యూయార్క్ లాంటి నగరంలోని విశ్వవిద్యాలయాల్లో రెండేళ్ల ఎంఎస్‌కు దాదాపు 60లక్షల రూపాయల వ్యయం అవుతుంది. ఇంత వ్యయంతో చదువుకోవడం అంత ప్రయోజనకరం కాదని విద్యార్థులు అంటున్నారు. కనీసం ఒక ఏడాది ఉద్యోగం కోసం నిరీక్షించడానికి అవకాశం ఉన్నవారు మాత్రమే ఇప్పుడు అమెరికా వైపు దృష్టిసారించడం మంచిదనే సలహా వినిపిస్తోంది అక్కడ విద్యార్థుల నుంచి. మన దేశం నుంచి వస్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గినట్టయితే అక్కడున్న వారికి కొంత వరకు అవకాశాలు మెరుగు పడతాయి.
‘అమెరికా సంయుక్త రాష్ట్రాలు’ అనడం కన్నా ‘ప్రపంచ దేశాల సంయుక్త దేశం’ అన్నట్టుగా అమెరికా వాతావరణం కనిపించింది. యూనివర్సిటీల్లోనూ, న్యూయార్క్, వాషింగ్టన్ లాంటి నగరాల్లో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల వారు కనిపిస్తూ మినీ ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది. చిన్న చిన్న ఆసియా దేశాలు మొదలుకొని యూరప్ దేశాల, ముస్లిం దేశాల వారు కనిపిస్తారు. విమానాశ్రయాల్లో మాట్లాడుకునే వారిని గమనిస్తే ప్రపంచ భాషలు వినిపిస్తాయి. ప్రపంచ యువతను అమెరికా ఆకర్షిస్తోంది. చదువుకునే రోజుల్లో ‘అమెరికా సామ్రాజ్య వాదం’ అంటూ కొన్ని పడికట్టు పదాలు మనసుపై అలానే ముద్రించుకుని ఉండిపోయినా ఆ దేశంలో మాత్రం చట్టం అంటే ప్రజలకు ఉన్న గౌరవం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే తీరు తెలుస్తుంది’ అన్నట్టుగా రోడ్డుపై వాహనాల నడక చూస్తేనే చాలు చట్టం ఎంత బలంగా పనిచేస్తుందో తెలుస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మన దేశంలో 50 ఏళ్ల పాటు వాహనం నడిపినా ఏమీ కాదు. పట్టుకుంటే ట్రాఫిక్ సిబ్బంది చేతిలో వందనోటు పెడితే చాలు. కానీ అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు స్టీరింగ్ పట్టుకునే ధైర్యం మన వాళ్లు కూడా చేయరు.
‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అందరినీ వెనక్కి పంపించేస్తున్నాడు, వీసాలు ఇవ్వడం లేదు’ అంటూ మన మీడియా రకరకాల ప్రచారం చేసింది. ‘ఒబామా హెల్త్‌కేర్’ సహా ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ ట్రంప్ విధానం అమలు కాలేదు. మనకు ‘తత్కాల్ పాస్‌పోర్ట్’ తరహాలో ప్రత్యేక ఫీజుతో పరిశీలించే హెచ్1బి వీసాల పెండింగ్ పెరిగిపోవడంతో కొత్త దరఖాస్తులు నిలిపివేశారు. పాత వాటిని క్లియర్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంటే మన మీడియా మాత్రం హెచ్1బి విసాల నిలుపుదల అంటూ హడావుడి చేసింది. ‘అదిగో పులి అంటే.. ఇదిగో తోక’ అన్నట్టు తెలుగు మీడియాకు ట్రంప్ ఫోభియా పట్టుకుంది కానీ అమెరికాలోని తెలుగు వారికి మాత్రం ఎలాంటి భయమూ లేదు. స్వయంగా అక్కడి యువతతో మాట్లాడిన తరువాత కలిగిన అభిప్రాయం ఇది.
మన దేశంలో ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రం. నాలుగేళ్ల బిటెక్ చదివాక పది శాతం మందికి క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగాలు, సగటు జీతం 25వేల రూపాయలు. మిగిలిన 90 శాతం మందికి అదీ లేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక అభ్యర్థి అమెరికా వెళితే పోటీలో ఒకరు తగ్గినట్టే కాదు. ఉద్యోగిగా వారు పంపే డాలర్లతో ఒకరిద్దరికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరి వల్ల ముగ్గురికి ఉపాధి లభించినట్టు అవుతుంది.
వారంలో ఐదు రోజులు పని చేసి మిగిలిన రెండు రోజులు జీవితాన్ని అనుభవించాలి. ఉద్యోగం చేసినంత కాలం చేసి, ఆ తర్వాత శేష జీవితం హాయిగా గడపాలనేది అమెరికా వారి జీవన విధానం. మన వాళ్ల జీవితం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. మన యువత మనం ఊహించిన దాని కన్నా ఎక్కువ బాధ్యతా యుతంగా ఉన్నారు. జీవితం గురించి, ఆర్థిక అంశాల గురించి స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. తాము అమెరికాకు ఎందుకు వచ్చాం? ఎలా ఉండాలి? అనే దానిపై వారిలో స్పష్టమైన అవగాహన కనిపించింది. పాతికేళ్ల వయసు వారితో మాట్లాడితే- ‘సొంతగడ్డపై ఉన్నవారిలో కన్నా’ దేశభక్తి ఎక్కువగానే కనిపించింది. భారత్‌లో ఉంటున్న యువతే కాదు, విదేశాల్లో ఉన్న మన యువత సైతం మన జాతి సంపదే.
-బుద్దా మురళి(2.8.2017) 

1 కామెంట్‌:

  1. వాస్తవ పరిస్థితులని సరిగ్గానే అంచనా వేశారు. కొన్ని మీరు చూడనివి ఏమిటంటే, కొందరు వీసాలని దుర్వినియోగం చేయటం, కాలపరిమితి దాటి ఉండి పోవటం, సమాజానికి అనుగుణంగా ప్రవర్తన తీర్చిదిద్దుకోకపోవటం లాంటివి. అలాగే ఈ సమస్యల గురించి మీరు ఎవరైనా అమెరికన్స్తో మాటలాడరా?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం