15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

మన కెందుకీ ఆదర్శమూర్తులు

‘‘మీఏరియాలో ప్రజలకు ఉచితంగా వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారా?’’
‘‘అవసరం లేకున్నా గర్భాశయం తొలగించే వైద్యులున్నారు. అమృతాంజనం రాస్తే పోయే తలనొప్పికి కూడా లక్ష రూపాయల చికిత్స చేసే ఖరీదైన డాక్టర్లూ ఉన్నారు. కానీ పుట్టి బుద్ధెరిగిన తరువాత పేదలకు ఉచితంగా వైద్యం చేసే డాక్టర్‌ను చూడలేదు.’’
‘‘నువ్వు చూడకపోతే ఉండరా? ’’
‘‘గుడిసెలో ముసలమ్మ దగ్గినా బ్యాగ్ పట్టుకొచ్చి ఉచితంగా వైద్యం చేసే డాక్టర్లు 1960 నుంచి దాదాపు 75 వరకు సినిమాల్లో కనిపించే వారు. వేటగాడు కాలం నుంచి అలాంటి మంచి డాక్టర్లు కనిపించడం లేదు. చిరంజీవి సినిమాలో చనిపోయిన శవానికి కూడా చికిత్స చేసిన డాక్టర్ కనిపించాడు. కానీ నువ్వన్న మంచి డాక్టర్లు కనిపించలేదు.? ’’
‘‘ధర్మ రాజు  ఊర్లోకి వెళ్లి చూస్తే, అంతా మంచివాళ్లే కనిపించారట! అదే దుర్యోధనుడికి అంతా చెడ్డవాళ్లే కనిపించారు. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది’’
‘‘నీ దృష్టికి ఎవరైనా ఉచిత డాక్టర్లు కనిపించారా? ’’
‘‘కనిపించలేదు కానీ ఉన్నారు. లేకపోతే అదో పెద్ద మిస్టరీ అవుతుంది’’
‘‘కోటిన్నరతో సీటు కొనుక్కున్నవాళ్లు. లక్షలు ఫీజులు కట్టి రాత్రింబవళ్లు చదువుకున్న వాళ్లు ఉచితంగా వైద్యం చేయాలని కోరుకోవడం అత్యాశ కాదా? ’’
‘‘మంచి వైద్యుల లెక్కలు తేలుస్తున్నాను అంతే. ఈ లెక్క చూడు’’
‘‘ అరే ఈ అంకెలన్నీ దాచేపల్లి బుక్ డిపో వాళ్లు ప్రచురించిన ఎక్కాల పుస్తకంలోనివి కదా? నా చిన్నప్పుడు మహంకాళి గుడి దగ్గరున్న ఆ షాపులో ఎక్కాల బుక్ కొన్నాను బాగా గుర్తుంది’’
‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉచితంగా పేదలకు వైద్యం చేసే డాక్టర్ల సంఖ్య ఇది. వాళ్లు ఎక్కడున్నారో కనుక్కోవాలి. ఎవరూ కనిపించడం లేదు అంటే ఏదో మిస్టరీ ఉంది. సమాజంలో ప్రతోడు గుమ్మడిలానే పెద్ద మనిషిలా కనిపిస్తాడు కానీ ఎన్టీఆర్‌లాంటి సిఐడి ఉంటే కానీ ఆ గుమ్మడే విలన్ అని తెలియదు.’’
‘‘అర్థం కావడం లేదు’’
‘‘ఎంసెట్ ఫలితాలు వచ్చినప్పుడు పేపర్ చూడు. టాప్ ర్యాంకర్లు పది మంది ఇంటర్వ్యూలో డాక్టర్‌నై పేద ప్రజలకు సేవ చేస్తాను అంటారు. ఈ లెక్కన మెడికల్ విద్య పుట్టినప్పటి నుంచి, ఎంసెట్ పుట్టినప్పటి నుంచి ఏడాదికి పది మంది అంటే ఎంత మంది డాక్టర్లు అవుతారు. ఒక్కో నియోజక వర్గంలో ఎంత మంది ఉంటారు. అని లెక్క తీస్తున్నా, కనిపించడం లేదు అంటే ఏదో మతలబు ఉంది. అదేదో అక్కినేని సినిమాలో చిన్నపిల్లలందరినీ ఎత్తుకెళ్లి మరో ప్రపంచం సృష్టించాలని ప్రయత్నించినట్టు, ఈ ఉచిత డాక్టర్లను విదేశీ శక్తులో, మరో గ్రహంలోని శక్తులో ఎత్తుకెళ్లి ఉంటారని నా అనుమానం’’
‘‘ఏడ్చినట్టే ఉంది ఐనా నీకీ ఐడియా ఎందుకొచ్చింది?’’
‘‘సమాజంలో ఏ వృత్తిలో ఎంత మంది మంచివాళ్లు ఉన్నారని లెక్క తేల్చాలనుకుంటున్నా? ముందు డాక్టర్లతో మొదలు పెడదాం అని’’
‘‘నీ ఇష్టం వచ్చినట్టు మంచివాళ్ల జాబితాలో చేరిస్తే ఊరుకోరు. ఆధునిక సమాజం మంచితనానికి కొన్ని నియమ నిబంధనలు రూపొందించింది. పాత నిబంధనలు వేరు, లెటెస్ట్ నిబంధనలువేరు. ఉదాహరణకు మీ నియోజక వర్గం నేతపై నీ అభిప్రాయం ?’’
‘‘చాలా మంచోడు. ఇక్కడ రోడ్లన్నీ ఆయనే వేయించాడు. మా ఏరియాకు ఆ ఫ్యాక్టరీలు వచ్చాయంటే ఆయన కృషి కారణం. మా పొలాలు పచ్చగా ఉన్నాయంటే ఆయన పుణ్యమే? ఒకప్పుడు కరువు కాటకాలతో ఉన్న మా ప్రాంతానికి సాగునీరు వచ్చింది. వయసు సహకరించక పోటీ చేయలేదు’’
‘‘ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు.?’’
‘‘ ఆయనకేం పిల్లలు స్థిరపడ్డారు. మనవళ్లతో కాలక్షేపం చేస్తున్నాడు. ఎవరైనా వెళ్లి సహాయం అడిగితే ఇప్పటికీ మాట సహాయం చేస్తారు. మంచి చెడూ చెబుతారు.’’
‘‘అంటే తినడానికి తిండి లేకపోవడం, గుడిసెలో బతకడం, ఆస్పత్రిలో చికిత్సకు డబ్బు లేకపోవడం వంటి అష్టదారిద్య్రాలు ఏమీ లేవా? ’’
‘‘ఛీ ఛీ ఆయన  శత్రువుకూడా అలాంటి కష్టాలు వద్దు’’
‘‘ఐతే మీ నేతకు మంచివాళ్ల జాబితాలో చోటు దక్కే ప్రసక్తే లేదు. ప్రజాప్రతినిధిగా నియోజక వర్గానికి ఆయన ఏం చేశాడు అనేది అనవసరం ఆయన చివరి దశలో అడుక్కు తింటూ బతకాలి. పట్టించుకునే వారు లేక అనాధలా గుడిసెలో కాలం వెళ్లదీయాలి అలా అయితేనే ఆదర్శప్రాయుడు’’
‘‘తన ఆస్తినంతా ప్రజలకు పంచి పెట్టి పేదరికంలో ఉంటే ఆదర్శం అన్నా... నియోజక వర్గానికి మంచి చేస్తే ఆదర్శం అంటే బాగుంటుంది కానీ .. ఏమీ చేయకపోయినా తినడానికి తిండిలేక కటిక పేదరికంలో బతికితేనే ఆదర్శం అంటే ఇదేం రూల్’’
‘‘హలో ఇది నవ సమాజం తయారు చేసి రూల్స్. అలా అయితేనే మేం ఆదర్శమూర్తిగా గుర్తించి ఆకాశానికెత్తుతాం. లక్షల మందికి ఉద్యోగం కల్పించి, లక్షల కోట్లు సంపాదించడం ఆదర్శం కాదు... ఉత్తమ విద్యార్థులను ఏ టీచరైనా తయారు చేస్తాడు కానీ, పిల్లలను అడవులకు పంపి తాను ఎన్‌కౌంటర్‌లో పోవడమే ఆదర్శం. ఒకప్పుడు పెద్ద పారిశ్రామిక వేత్తగా ఓ వెలుగు వెలిగి మోసపోయి రోడ్డున పడి బాబూ ధర్మం అని అడుక్కుతింటూ ఉంటే ఆదర్శ పారిశ్రామిక వేత్త అంటాం. తల్లిదండ్రులను ఎదిరించి స్కూల్ నుంచి పారిపోయి ఎవడో గన్నయ్యను పోలీస్ స్టేషన్‌లో పెళ్లి చేసుకుని తల్లిదండ్రులను అదే లాకప్‌లో వేయించే వారిది ఆదర్శ వివాహం అని డిసైడ్ చేసేశాం. తానున్న వృత్తిలో ఏం చేశాడు అనేది అనవసరం. ఉచ్చదశలో ఉన్నప్పుడు రోజూ తాగి తందనాలు ఆడి జీవితం పట్ల అవగాహన లేక సంపాదించింది తాగుడుకే ధారపోసినా పరవాలేదు. చివరి దశలో దీనంగా బతికితే చాలు
మా ఆదర్శ సమాజం ఆదర్శమూర్తి అనే ముద్ర వేస్తుంది.’’
‘‘పారిశ్రామిక వేత్త, ప్రజాప్రతినిధి, ఉద్యోగి, ఏ వృత్తిలో ఉన్నా, మనిషిగా ఎవరి బాధ్యత వాళ్లు సక్రమంగా నిర్వహించడం ఆదర్శం అవుతుంది.. కానీ అడుక్కుతింటూ బతికితేనే ఆదర్శం అనే నీ ఆదర్శ సూత్రాలు వింటేనే భయమేస్తుంది? ’’
‘‘నీకు మా ఆదర్శ సమాజంలో అడుగుపెట్టే అర్హత లేదు... పో వెళ్లిపో... భయటకు పో... దుర్మార్గుడా!’’
‘‘భగవంతుడా  నేటి కాలం ఆదర్శమూర్తి ముద్ర పడకుండా మమ్ములను నువ్వే కాపాడాలి’’
-బుద్దా మురళి( జనాంతికం 15. 09. 2017)

8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

తెలుగు సినిమా -భాష -కాంగ్రెస్ -చిరంజీవి

‘‘ఇప్పుడెంతో హాయిగా ఉంది. ఏమవుతుందో అనే టెన్షన్‌తో ఇన్నాళ్లూ బుర్ర వేడెక్కింది. ఇ ప్పుడు ఆకాశంలో పక్షిలా విహరిస్తున్నంత హాయిగా ఉంది’’
‘‘దేనికి టెన్షన్? రైళ్లో వచ్చావా? పరీక్షలన్నాక తప్పే వాళ్లూ ఉంటారు. పట్టాలున్నదే తప్పడానికి, అసలు పట్టాలు తప్పినప్పుడే పట్టాలంటూ ఉంటాయని తెలిసేది. దానికి టెన్షన్ ఎందుకు?’’
‘‘రైలు పట్టాలు తప్పితే ఆశ్చర్యపోయేంత అమాయకుడిలా కనిపిస్తున్నానా?’’


‘‘ టెన్షన్ దేనికి? రింగురోడ్డు మీద కారును బస్సు ఢీకొట్టినట్టు వారం రోజుల్లో అదేదో గ్ర హం వచ్చి భూమిని ఢీ కొడుతుంది. అంతా చనిపోతారని వాడెవడో చెప్పిన జోస్యం గురించా?’’
‘‘వారంలో యుగాంతం అని ప్రతి వారం ఎవరో ఒకరు జోస్యం చెబుతూనే ఉంటారు. చిన్నప్పుడు తెగ భయపడేవాడ్ని, ‘నాసా’నో ఇంకేదో కానీ ఐదువేల ఏళ్లలో భూమి అంతరించి పోతుందని ఓ నాలుగు దశాబ్దాల క్రితం ప్రకటించింది. ప్రతి రోజూ నిద్ర పోయేప్పుడు ఐదువేల ఏళ్లలో ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయని లెక్కపెట్టే వాణ్ణి. ఓ నెల గడిచాక బోర్ కొట్టేసి నేను బతికున్నంత వరకు ఐదువేల ఏళ్లు పూర్తి కావని తెలిసింది. నేను పోయాక కొన్ని వేల ఏళ్ల తరువాత భూమి ఆంతరిస్తే ఇప్పటి నుంచే ఆందోళన అవసరమా? అని నన్ను నేను సముదాయించుకున్నాను. చిన్నప్పుడు ‘నాసా’ చెబితేనే తేలిగ్గా తీసుకున్నా. చిలకజోస్యం వాడు చెబితే పట్టించుకుంటామా? ’’


‘‘రోజూ అబద్ధాలతో నీ బుర్ర వేడెక్కింది. ఇప్పుడు బాబుగారు అన్నీ నిజాలే మాట్లాడాలంటూ కర్తవ్యబోధ చేశారు అందుకే కదా నీలో సంతోషం ’’
‘‘పిచ్చోడా!ప్రతివాడూ ఎదుటి వాడు నిజాలు మాట్లాడాలని కోరుకుంటాడు. ఆ ప్రతివాడిలో నువ్వూ ఉంటావు, నేనూ ఉంటాను బాబూ ఉంటారు. తాను తప్ప అంతా నిజాలే మాట్లాడాలని అనుకోవడంతో ఏతావతా తేలేది ఏమంటే నిజాలు ఎవరూ మాట్లాడరు. రాజుగారింట్లో పెళ్లికి తలో చెంబుడు పాలు తెమ్మంటే ప్రతివాడూ ఎవరు చూడొచ్చారని నీళ్లు పోస్తాడు.. ఆ కథ తెలుసు కదా? ఆ పాల చెంబులోని నీళ్ల లాంటివే నిజాలు. టెక్నాలజీ పెరిగితే- ఊపిరి పీల్చుకోకున్నా బతికే రోజులు వస్తాయేమో కానీ, ఎంత టెక్నాలజీ పెరిగినా రాజకీయాల్లో ఉంటూ నిజాలు మాట్లాడే రోజులు రావు. నీ ప్రశ్న సిల్లీగా ఉంది. అబద్ధాలు లేని ప్రపంచాన్ని ఊహించలేం’’
‘‘అంటే అందరివీ అబద్ధాలేనా?’’


‘‘అష్టాదశ పురాణాల్లో అబద్ధం చెప్పని ఏకైక పాత్ర ధర్మరాజు. చివరకు అతనూ అబద్ధం ఆడాడు. దేవుళ్లే అబద్ధాలు అడందే బతకలేనప్పుడు? ఇక మనిషి ఎంత? రాత్రి ఆలస్యంగా ఇంటికెందుకు వచ్చావని భార్య అడిగిన ప్రశ్నకు నిజాలు మాట్లాడితే బతుకు జడ్కాబండికి చేరుతుంది. రోజా చెంప దెబ్బకొడుతుంది, జీవిత తిడుతుంది. సుమలత ఏడిపిస్తుంది. ఇంటర్వ్యూకని చెప్పి ఎక్కడికెళ్లావురా? అని తండ్రి అడిగినపుడు కొడుకు నిజం చెబితే రోడ్డున పడతాడు. బాస్ అడిగిన వాటికి నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది. అంతెందుకు? ఈ భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుందో తెలుసా? అబద్ధం అనే ఇరుసును ఆధారంగా చేసుకుని తిరుగుతుంది. అబద్ధం లేకపోతే జీవితమే కాదు, అసలే భూమి నిలువదు. అంత పవిత్రమైన అబద్ధాన్ని తక్కువ చేయడం అన్యాయం. మన జీవితానికి ఆసరా ఇచ్చే అబద్ధాన్ని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు. ఓటుకు నోటు కేసులో బాబైనా, కెసిఆరైనా నిజం చెబితే ఇంకేమైనా ఉందా? కేసు భయం, పదవీ గండం ఆయనది, సెక్షన్ 8, ఉమ్మడి రాజధాని, గవర్నర్ చేతిలో శాంతిభద్రతల సమస్య ఈయనది. నిజం ఇద్దరికీ నష్టం.. అబద్ధం ఇద్దరికీ క్షేమం. విన్‌విన్ స్ట్రాటజీ అన్నట్టు. అబద్ధం ఇద్దరినీ గెలిపించి, ఆశలు పెట్టుకున్న జగన్‌ను ఓడిచింది. ఇద్దరం జైలు నేతలమే అని జగన్‌కు చెప్పుకునే చాన్స్ లేకుండా చేశారు’’
‘‘ఐతే హైదరాబాద్ పోలీసులు హత్యాయత్నం చేసిన కేసును పన్నెండు  గంటల్లోనే ఛేదించినందుకా సంతోషం?’’
‘‘నువ్వేక్కడున్నావ్? హైదరాబాద్‌లో జరిగిన సంఘటన హైదరాబాద్‌లో ఉండే పోలీసులు చేధించేందుకు పన్నెండు  గంటలు పట్టింది. కానీ దేశంలో అక్కడెక్కడో హత్య జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిజిపి కూడా ఎవరు చేశారో చెప్పలేదు కానీ వాట్సప్‌లో, ఫేస్‌బుక్‌లో ఐదు నిమిషాల్లో నిందితులు ఎవరో చెప్పడమే కాకుండా శిక్షను కూడా ఖరారు చేశారు. టెక్నాలజీ బాగా పెరిగింది.. నువ్వే చాలా వెనుకబడి ఉన్నావ్’’


‘‘నేనూహించలేను నువ్వే చెప్పేయ్. కొంపతీసి ముఖ్యమంత్రి పిల్లలు కనమని చెప్పారని ఆ పనిలో పడతావే ఏంటి? ’’
‘‘మనకంత అదృష్టమా? అది కాదు కానీ.. కనీసం మనం ఇంకా ఓ 20 ఏళ్లు బతుకుతాం కదా?’’
‘‘ఈ పొల్యూషన్ ఇంత కన్నా పెరగకుండా ఉంటే మందులతో బతకొచ్చు’’
‘‘ఈ 20ఏళ్ల జీవితం ఎలా గడపాలా? అని జీవితంలో చాలా టెన్షన్‌గా ఉండేది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, రవితేజ కుమారుడు, పూరీ జగన్నాథ్ కుమారుడు హీరోలుగా నటించేందుకు అంగీకరించారు. ఈ జీవితానికి ఇంకేం కావాలి? మన శేషజీవితం హాయిగా గడిచిపోవడానికి మనమీద కరుణించి వాళ్లు హీరోలుగా నటించేందుకు ఒప్పుకున్నారంటే ఇంత కన్నా అదృష్టం ఏముంటుంది? ఆ వార్త తెలిసినప్పటి నుంచి ఆకాశంలో తేలిపోయినట్టుంది. ఆ తరువాత నాగచైతన్య సమంత సంతానం ఎలాగూ మనల్ని ఆదుకుంటుంది. హీరోలుగా నటించేందుకు ఒప్పుకుంటూ..’


‘‘నీ సంతోషం నీ ఇష్టం. కాంగ్రెస్, తెలుగుసినిమా ఒకే విధంగా ఉందనిపిస్తోంది. ఒకటి వంద దాటింది. ఇంకోటి వందకు చేరువగా ఉంది. రెండూ క్రమంగా క్షీణిస్తున్నాయి. ఆరుపదులు దాటిన  యువ నేతలు, సినిమాల్లో ఆ వయసు వారే హీరోలు. రెండూ ఒకప్పుడు బాగా బతికాయి. కాలం తెచ్చిన మార్పులను అర్థం చేసుకోలేక రెండూ దెబ్బతింటున్నాయి. రెండింటికి వారసులే గుదిబండగా మారారు. అన్ని సినిమాలను హనుమంతన్న ఆదుకోలేడు కదా? ఆ బాబా ఎవరో కాళ్లతో తన్నడమే దీవించడం అట .. పోస్టర్ చింపడమే హనుమన్న దీవెనలు .. సినిమా పోస్టర్ లు చింపడం లో పడిపోయి పార్టీ పోస్టర్ చిరిగిపోతున్న విషయం మరిచి పోతున్నారు  ’’
‘‘కాంగ్రెస్‌కు, తెలుగు భాషకు, తెలుగు సినిమాకు మరణం లేదు.’’
‘‘మరణం లేకపోవడం వేరు, బతకడం వేరు. బతకడం వేరు, బాగా బతకడం వేరు. బతికి బట్టకట్టాలంటే రెండింటికీ కొత్తరక్తం కావాలి. కొత్త ఆలోచనలు కావాలి’’
*బుద్దా మురళి (జనాంతికం 8. 9. 2017) 

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

నువ్వే హీరో.. నువ్వే విలన్

‘‘ ఫ్యాన్స్ గురించి ఏమనుకుంటున్నావ్??’’
‘‘నేను పర్యావరణ ప్రేమికుడిని.. ఏసీలు అస్సలు నాకు నచ్చవు. ఐ లైక్ ఫ్యాన్స్. నువ్వు కూడా ఏసీ వదిలేసి ఫ్యాన్‌ను నమ్ముకో’’
‘‘ నేనడిగింది ఫ్యాన్స్.. అంటే సినీ అభిమానుల గురించి..’’
‘‘జగన్ పార్టీ గుర్తు ఫ్యాన్ గురించా? నంద్యాలలో ఓడిపోయినంత మాత్రాన దిగులెందుకు? మనిషి లాంటి దేవుడు అని పూజలందుకుంటున్న ఎన్టీఆర్‌నే బోల్తా కొట్టించిన ‘గండర గండడు’ అక్కడ జగన్‌కు ప్రత్యర్థి. కవచ కుండలాలు, అధికారం రెండూ కలిసి ఉన్నప్పుడు ఆయన్ని ఢీ కొనడం అంటే ఆషామాషీ కాదు. జగన్ ఇంకా చాలా రాటుదేలాలి. చిన్న వయసే కదా? ’’
‘‘నేనడిగింది హీరోల ఫ్యాన్స్ గురించి’’
‘ఫ్యా న్  హీరోయిన్‌లు, పోర్న్ స్టార్స్‌కూ ఉంటారు. కేరళలో సన్నీలియోన్ ఫ్యాన్స్ ఫొటో చూశావా? సింహగర్జనలు, మహానాడులను మించి జనం కనిపించారు. సన్నీ లియోన్‌ను చూడని కనులు కూడా ఒక కనులేనా? అని కన్నులు విప్పార్చుకుని చూశారు. చెరువుల్లో పడవలపై కనిపించే కేరళ మొత్తం రోడ్డు మీదకు వచ్చిందేమో అనిపించింది.’’
‘‘ఆ ఫ్యాన్స్ వేరు, మన ఫ్యాన్స్ వేరు’’
‘‘నాకైతే పెద్ద తేడా అనిపించలేదు’’
‘‘ఇంతకూ ఫ్యాన్స్‌పై నీ పాలసీ ఏంటో చెప్పనే లేదు’’
‘‘అదే మన్నా కారల్ మార్క్స్ దాస్ క్యాపిటలా? దానిపై మనకో అభిప్రాయం ఏడ్చేందుకు? ఆర్థిక విధానాలు, పాలనా విధానాలు, విప్లవ ఉద్యమాలపై వ్యతిరేకంగానో, అనుకూలంగానో ఓ అభిప్రాయం ఏడుస్తుంది కానీ ఫ్యాన్స్‌పై అభిప్రాయం ఏంటి?’’
‘‘నీ అభిప్రాయం చెప్పాల్సిందే? ’’
‘‘చూడోయ్.. అందమైన రాజకుమారి ముక్కు మీద, పెదవుల మీద కూడా కవిత్వం చేప్పే వాళ్లు పూర్వం కవులు. వాటిని అటూ ఇటూ కాస్త మార్చి కాలేజీ చదువుల కాలంలో క్లాస్‌మేట్ అందంపై కవిత్వం చెప్పే వాళ్లం. ఫ్యాన్స్‌పై చెప్పమంటే ఏం చెబుతాం’’
‘‘చెప్పి తీరాల్సిందే?’’
‘‘అందమైన అమ్మాయి ముఖంపై కవిత్వం చెప్పినట్టు, చిన్న కుర్రాడికి జలుబుతో ముక్కు కారుతుంటే వర్ణించమంటే ఏం వర్ణిస్తాం. వాడి ముక్కు తుడువు తల్లీ.. అని మహా అయితే వాళ్లమ్మకు చెబుతాం ’’
‘‘ఏమీ తెలియని పి ల్లాడినా ? సూటిగా చె ప్పు ?’’
‘‘తెలుగు విప్లవ సినిమాల మాటల రచయిత పరుచూరి బ్రదర్స్ అని ఫ్యాన్స్ గురించి చాలా బాగా చెప్పాడు’’
‘‘ఏం చెప్పాడు? ఫ్యాన్స్ మా దేవుళ్లు అన్నాడా?’’
‘‘ఆ మాట ప్రతి సినిమా పంక్షన్‌లో కామన్‌గా వినిపించే డైలాగు. అది కాదు. ’’
‘‘మరేం చెప్పారు?’’
‘‘నేనే రాజు నేనే మంత్రి అనే అద్భుతమైన సినిమా విడుదలయ్యాక మీలో చాలా మంది రానాకు బానిసలు అవుతారు. గతంలో ఎన్టీఆర్‌కు ఇలానే బానిసలు అయ్యారు. ఇప్పుడు రానాకు బానిసలవుతారు అని చెప్పాడు. సామాన్యులు తిరగబడే కథల సినిమాలంటే తప్పకుండా ఆయన డైలాగులు ఉండాల్సిందే అంతటి సినిమా అభ్యుదయ వాది చెప్పిన తరువాత ఇంకా నేనేం చెప్పాలి?’’
‘‘అంటే బానిసలు అంటున్నావా?’’
‘‘అది నా మాట కాదు. నేనే రాజు నేనే మంత్రి ఫంక్షన్‌లో పరుచూరి అన్న మాట చెప్పాను. యూ ట్యూబ్‌లో వెతుకు.. దొరుకుతుంది. ఎన్నో దశాబ్దాల సినిమా అనుభవం ఉన్న ఆయన ఆ మాట అన్నాడంటే అబద్ధం ఎందుకవుతుంది? ఎంతో మంది బానిసలను చూసిన తరువాతే ఆ మాట అన్నాడనుకుంటున్నాను’’
‘‘డొంక తిరుగుడుగా వద్దు సూటిగా చెప్పు.. భయపడుతున్నావా? బానిసలు అంటూనే భయమెందుకు?’’
‘‘మళ్లీ చెబుతున్నా.. నేను అనని మాటను నాకు అంటగట్టొద్దు. కళామతల్లి ముద్దు బిడ్డ చెప్పిన మాటలు గుర్తు చేశా అం తే. నీ ఉద్దేశంలో బానిసలు అంటే ఏమీ చాత కాక ఓ మూలన కూర్చునే వాళ్లు అనుకుంటున్నావా? రాజ్యాలను ఏలిన బానిస రాజ కుటుంబాలు కూడా ఉన్నాయి తెలుసా? రాజుల కాలం వరకు ఎందుకూ అనుకుంటే మనం చూశాం కదా? డేరా బాబా భక్తి బానిసల వీరత్వం. ఒక నేరస్తుడిని కోర్టుకు తీసుకు వేళ్లేందుకు కూడా ప్రభుత్వాలు గజగజ వణికిపోయేట్టు చేశారు బాబా బానిసలు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేశారు. పూరి సినిమాలో హీరోతో సమాన స్థాయిలో విలన్ ఉన్నట్టు హీరోను మించిన బలవంతులు బానిసలు. డేరాబాబా కోర్టులో కన్నీళ్లు పెట్టుకుని క్షమించి శిక్ష తగ్గించండి అని విలపిస్తే ఆయన బానిసలు మాత్రం ధైర్యంగా బీభత్సం సృష్టించారు. బాబా కన్నా బాబా బానిసలే శక్తిమంతులు. ప్రభుత్వం బాబా కన్నా బాబా బానిసలకే ఎక్కువ భయపడింది. బానిసకు ఆలోచన తక్కువ కావచ్చు కానీ ధైర్యం ఎక్కువ. స్వాతంత్య్రం కోసం సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ లాంటి వారు సాయుధ పోరాటం సాగించిన కాలంలోనే బ్రిటీష్ చల్లని పాలనలోనే ఉంటాం బానిసత్వం మా నర నరాన జీర్ణించుకున్నాం. మా నుంచి బానిసత్వాన్ని దూరం చేయకండి బ్రిటీష్ పాలనే ఉండాలని మహా గ్రంధాలు రాసిన వారూ ఉన్నారు. ప్రతి చోట, ప్రతి అంశంలో వీరోచిత పోరాటాలు చేసిన వారున్నట్టే, మేం బానిసత్వంలోనే ఉంటాం అని అంత కన్నా వీరోచితంగా పోరాడేవాళ్లు ఉంటారు.’’
‘ఫ్యాన్  గురించి అడిగింది తప్ప- నువ్వు అన్నీ చెప్పావు...?’’
‘భగవంతుడు అనుకో,  ప్రకృతి అనుకో ఎవరినీ బానిసగా పుట్టించదు. ఎవరైనా స్వతంత్రుడిగానే పుడతారు. క్రమంగా వయసు పెరిగే కొద్ది నీకు నీవే బంధాలు వేసుకుని ఏవో ఆలోచనలకో, బాబాలకో, నటులకో బానిసవు అవుతావు. నీలోనే హీరో, విలన్, బానిస అందరూ ఉంటారు. ఎవరిని ప్రోత్సహిస్తే వారిగా నువ్వు మారుతావు. అబద్ధం ఎందుకు కానీ.. బద్ధకంలో ఉన్నంత ఆనందం బానిసత్వంలోనూ ఉంటుంది. సొంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సొంత గుర్తింపు కోసం శ్రమించాల్సిన పని ఉండదు. సొంత ఆలోచనలు ఉండవు. ఎవరికి బానిసగా ఉంటే వారి ఆలోచనలే మన ఆలోచనలు, వారి గుర్తింపే మన గుర్తింపు.’’
‘‘ అది తప్పంటావా? ’’
‘‘నువ్వు బానిసగా పుట్టలేదు. బాబాలు, హీరోలు పుట్టినట్టే నువ్వూ పుట్టావు. నీ జీవితానికి నువ్వే హీరో, నువ్వే విలన్. నీ పుట్టుకకు ప్రత్యేకత ఉంది అనుకుంటే అదేంటో అనే్వషించు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అలవాటు చేసుకో.. నీకు నువ్వే ఫ్యాన్ అవుతావు. నీ కన్నా మించిన హీరో ఎవరూ లేరు. నువ్వే నీ జీవితానికి ముఖ్యం. ఆ తరువాతే ఎవరైనా.. అది కష్టం అనుకుంటే బుర్రకు విశ్రాంతి ఇచ్చి ఏ బాబానో, హీరోనో నమ్ముకో. ’’
*బుద్ధా మురళి (జనాంతికం 1. 9. 2017)