1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

నువ్వే హీరో.. నువ్వే విలన్

‘‘ ఫ్యాన్స్ గురించి ఏమనుకుంటున్నావ్??’’
‘‘నేను పర్యావరణ ప్రేమికుడిని.. ఏసీలు అస్సలు నాకు నచ్చవు. ఐ లైక్ ఫ్యాన్స్. నువ్వు కూడా ఏసీ వదిలేసి ఫ్యాన్‌ను నమ్ముకో’’
‘‘ నేనడిగింది ఫ్యాన్స్.. అంటే సినీ అభిమానుల గురించి..’’
‘‘జగన్ పార్టీ గుర్తు ఫ్యాన్ గురించా? నంద్యాలలో ఓడిపోయినంత మాత్రాన దిగులెందుకు? మనిషి లాంటి దేవుడు అని పూజలందుకుంటున్న ఎన్టీఆర్‌నే బోల్తా కొట్టించిన ‘గండర గండడు’ అక్కడ జగన్‌కు ప్రత్యర్థి. కవచ కుండలాలు, అధికారం రెండూ కలిసి ఉన్నప్పుడు ఆయన్ని ఢీ కొనడం అంటే ఆషామాషీ కాదు. జగన్ ఇంకా చాలా రాటుదేలాలి. చిన్న వయసే కదా? ’’
‘‘నేనడిగింది హీరోల ఫ్యాన్స్ గురించి’’
‘ఫ్యా న్  హీరోయిన్‌లు, పోర్న్ స్టార్స్‌కూ ఉంటారు. కేరళలో సన్నీలియోన్ ఫ్యాన్స్ ఫొటో చూశావా? సింహగర్జనలు, మహానాడులను మించి జనం కనిపించారు. సన్నీ లియోన్‌ను చూడని కనులు కూడా ఒక కనులేనా? అని కన్నులు విప్పార్చుకుని చూశారు. చెరువుల్లో పడవలపై కనిపించే కేరళ మొత్తం రోడ్డు మీదకు వచ్చిందేమో అనిపించింది.’’
‘‘ఆ ఫ్యాన్స్ వేరు, మన ఫ్యాన్స్ వేరు’’
‘‘నాకైతే పెద్ద తేడా అనిపించలేదు’’
‘‘ఇంతకూ ఫ్యాన్స్‌పై నీ పాలసీ ఏంటో చెప్పనే లేదు’’
‘‘అదే మన్నా కారల్ మార్క్స్ దాస్ క్యాపిటలా? దానిపై మనకో అభిప్రాయం ఏడ్చేందుకు? ఆర్థిక విధానాలు, పాలనా విధానాలు, విప్లవ ఉద్యమాలపై వ్యతిరేకంగానో, అనుకూలంగానో ఓ అభిప్రాయం ఏడుస్తుంది కానీ ఫ్యాన్స్‌పై అభిప్రాయం ఏంటి?’’
‘‘నీ అభిప్రాయం చెప్పాల్సిందే? ’’
‘‘చూడోయ్.. అందమైన రాజకుమారి ముక్కు మీద, పెదవుల మీద కూడా కవిత్వం చేప్పే వాళ్లు పూర్వం కవులు. వాటిని అటూ ఇటూ కాస్త మార్చి కాలేజీ చదువుల కాలంలో క్లాస్‌మేట్ అందంపై కవిత్వం చెప్పే వాళ్లం. ఫ్యాన్స్‌పై చెప్పమంటే ఏం చెబుతాం’’
‘‘చెప్పి తీరాల్సిందే?’’
‘‘అందమైన అమ్మాయి ముఖంపై కవిత్వం చెప్పినట్టు, చిన్న కుర్రాడికి జలుబుతో ముక్కు కారుతుంటే వర్ణించమంటే ఏం వర్ణిస్తాం. వాడి ముక్కు తుడువు తల్లీ.. అని మహా అయితే వాళ్లమ్మకు చెబుతాం ’’
‘‘ఏమీ తెలియని పి ల్లాడినా ? సూటిగా చె ప్పు ?’’
‘‘తెలుగు విప్లవ సినిమాల మాటల రచయిత పరుచూరి బ్రదర్స్ అని ఫ్యాన్స్ గురించి చాలా బాగా చెప్పాడు’’
‘‘ఏం చెప్పాడు? ఫ్యాన్స్ మా దేవుళ్లు అన్నాడా?’’
‘‘ఆ మాట ప్రతి సినిమా పంక్షన్‌లో కామన్‌గా వినిపించే డైలాగు. అది కాదు. ’’
‘‘మరేం చెప్పారు?’’
‘‘నేనే రాజు నేనే మంత్రి అనే అద్భుతమైన సినిమా విడుదలయ్యాక మీలో చాలా మంది రానాకు బానిసలు అవుతారు. గతంలో ఎన్టీఆర్‌కు ఇలానే బానిసలు అయ్యారు. ఇప్పుడు రానాకు బానిసలవుతారు అని చెప్పాడు. సామాన్యులు తిరగబడే కథల సినిమాలంటే తప్పకుండా ఆయన డైలాగులు ఉండాల్సిందే అంతటి సినిమా అభ్యుదయ వాది చెప్పిన తరువాత ఇంకా నేనేం చెప్పాలి?’’
‘‘అంటే బానిసలు అంటున్నావా?’’
‘‘అది నా మాట కాదు. నేనే రాజు నేనే మంత్రి ఫంక్షన్‌లో పరుచూరి అన్న మాట చెప్పాను. యూ ట్యూబ్‌లో వెతుకు.. దొరుకుతుంది. ఎన్నో దశాబ్దాల సినిమా అనుభవం ఉన్న ఆయన ఆ మాట అన్నాడంటే అబద్ధం ఎందుకవుతుంది? ఎంతో మంది బానిసలను చూసిన తరువాతే ఆ మాట అన్నాడనుకుంటున్నాను’’
‘‘డొంక తిరుగుడుగా వద్దు సూటిగా చెప్పు.. భయపడుతున్నావా? బానిసలు అంటూనే భయమెందుకు?’’
‘‘మళ్లీ చెబుతున్నా.. నేను అనని మాటను నాకు అంటగట్టొద్దు. కళామతల్లి ముద్దు బిడ్డ చెప్పిన మాటలు గుర్తు చేశా అం తే. నీ ఉద్దేశంలో బానిసలు అంటే ఏమీ చాత కాక ఓ మూలన కూర్చునే వాళ్లు అనుకుంటున్నావా? రాజ్యాలను ఏలిన బానిస రాజ కుటుంబాలు కూడా ఉన్నాయి తెలుసా? రాజుల కాలం వరకు ఎందుకూ అనుకుంటే మనం చూశాం కదా? డేరా బాబా భక్తి బానిసల వీరత్వం. ఒక నేరస్తుడిని కోర్టుకు తీసుకు వేళ్లేందుకు కూడా ప్రభుత్వాలు గజగజ వణికిపోయేట్టు చేశారు బాబా బానిసలు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేశారు. పూరి సినిమాలో హీరోతో సమాన స్థాయిలో విలన్ ఉన్నట్టు హీరోను మించిన బలవంతులు బానిసలు. డేరాబాబా కోర్టులో కన్నీళ్లు పెట్టుకుని క్షమించి శిక్ష తగ్గించండి అని విలపిస్తే ఆయన బానిసలు మాత్రం ధైర్యంగా బీభత్సం సృష్టించారు. బాబా కన్నా బాబా బానిసలే శక్తిమంతులు. ప్రభుత్వం బాబా కన్నా బాబా బానిసలకే ఎక్కువ భయపడింది. బానిసకు ఆలోచన తక్కువ కావచ్చు కానీ ధైర్యం ఎక్కువ. స్వాతంత్య్రం కోసం సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ లాంటి వారు సాయుధ పోరాటం సాగించిన కాలంలోనే బ్రిటీష్ చల్లని పాలనలోనే ఉంటాం బానిసత్వం మా నర నరాన జీర్ణించుకున్నాం. మా నుంచి బానిసత్వాన్ని దూరం చేయకండి బ్రిటీష్ పాలనే ఉండాలని మహా గ్రంధాలు రాసిన వారూ ఉన్నారు. ప్రతి చోట, ప్రతి అంశంలో వీరోచిత పోరాటాలు చేసిన వారున్నట్టే, మేం బానిసత్వంలోనే ఉంటాం అని అంత కన్నా వీరోచితంగా పోరాడేవాళ్లు ఉంటారు.’’
‘ఫ్యాన్  గురించి అడిగింది తప్ప- నువ్వు అన్నీ చెప్పావు...?’’
‘భగవంతుడు అనుకో,  ప్రకృతి అనుకో ఎవరినీ బానిసగా పుట్టించదు. ఎవరైనా స్వతంత్రుడిగానే పుడతారు. క్రమంగా వయసు పెరిగే కొద్ది నీకు నీవే బంధాలు వేసుకుని ఏవో ఆలోచనలకో, బాబాలకో, నటులకో బానిసవు అవుతావు. నీలోనే హీరో, విలన్, బానిస అందరూ ఉంటారు. ఎవరిని ప్రోత్సహిస్తే వారిగా నువ్వు మారుతావు. అబద్ధం ఎందుకు కానీ.. బద్ధకంలో ఉన్నంత ఆనందం బానిసత్వంలోనూ ఉంటుంది. సొంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సొంత గుర్తింపు కోసం శ్రమించాల్సిన పని ఉండదు. సొంత ఆలోచనలు ఉండవు. ఎవరికి బానిసగా ఉంటే వారి ఆలోచనలే మన ఆలోచనలు, వారి గుర్తింపే మన గుర్తింపు.’’
‘‘ అది తప్పంటావా? ’’
‘‘నువ్వు బానిసగా పుట్టలేదు. బాబాలు, హీరోలు పుట్టినట్టే నువ్వూ పుట్టావు. నీ జీవితానికి నువ్వే హీరో, నువ్వే విలన్. నీ పుట్టుకకు ప్రత్యేకత ఉంది అనుకుంటే అదేంటో అనే్వషించు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అలవాటు చేసుకో.. నీకు నువ్వే ఫ్యాన్ అవుతావు. నీ కన్నా మించిన హీరో ఎవరూ లేరు. నువ్వే నీ జీవితానికి ముఖ్యం. ఆ తరువాతే ఎవరైనా.. అది కష్టం అనుకుంటే బుర్రకు విశ్రాంతి ఇచ్చి ఏ బాబానో, హీరోనో నమ్ముకో. ’’
*బుద్ధా మురళి (జనాంతికం 1. 9. 2017)

2 కామెంట్‌లు:

  1. ఏం చెప్పారండీ అసలు... మీలో కూడా ఓ బాబా ఉన్నాడనిపిస్తుంది. బాబాలు చెప్పే వేదాంతం అంతా చెప్పేసారుగా !

    రిప్లయితొలగించండి
  2. "నీలోనే హీరో, విలన్, బానిస అందరూ ఉంటారు. ఎవరిని ప్రోత్సహిస్తే వారిగా నువ్వు మారుతావు." - మంచి వాక్యం. ఏదో సినిమాలో చెప్పినట్టు - "నీకు నువ్వే తోపు. నీ గతి నువ్వే చూసుకో" అని బానిసత్వం నుంచి ఎలా బయటపడాలో భలే చెప్పారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం