9, మార్చి 2018, శుక్రవారం

లాఫింగ్ ఫార్ములా

‘‘హాస్యం లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే వాణ్ణి అని మహాత్మా గాంధీ చెప్పింది అక్షర సత్యం అనిపిస్తోంది.’’
‘‘ఎలా?’’
‘‘ జీవితం రోజురోజుకూ రసహీనంగా మారుతున్నట్టు అనిపిస్తోంది. నువ్వంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావ్? నాకెందుకీ దిగులు?’’
‘‘హాస్యం వల్లే నేనిలా ఉండగలుగుతున్నా’’
‘‘ఈ కాలంలో కూడా నీకు హాస్యం అందుబాటులో ఉందా? నమ్మలేకపోతున్నాను’’
‘‘అసలు హాస్యం లేనిదెక్కడో చెప్పు చూద్దాం’’
‘‘మసీదులో తాగడం తప్పయితే దేవుడు ఎక్కడ లేడో చెప్పు అని గాలిబ్ ప్రశ్నించినట్టుగా ఉందీ ప్రశ్న. చేతిలో ఉన్న ఆ స్మార్ట్ ఫోన్‌లో, ఎడమ చేతిలో ఉన్న ఆ పత్రికలో హాస్యం ఉందా? ’’
‘‘ ఈ స్తంభంలో శ్రీమహావిష్ణువు ఉన్నాడా? చూపించు.. అని హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని సవాల్ చేసినట్టుగా సవాల్ చేస్తున్నావా? ’’
‘‘అడిగిన దానికి సమాధానం చెప్పు’’
‘‘అన్నింటిలోనూ హాస్యం ఉంది.. అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. స్మార్ట్ఫోన్, పత్రికల్లోనే హాస్యం ఎక్కువగా ఉంది.’’
‘‘మాటలకేం.. ఎన్నయినా చెప్పొచ్చు. మనం చదువుకునే రోజుల్లో , జంఘాల శాస్ర్తీ ఉపన్యాసాలు, కన్యాశుల్కం, బాపూ కార్టూన్‌లు, మునిమాణిక్యం కథలు, రాగతి పండరి కార్టూన్‌లు మన ఆకలిని తీర్చాయి. జ్యోతి మాసపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక,ప్రభ, యువ, ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికల్లోని హాస్యకథలు, కార్టూన్‌లు మన హాస్య దాహాన్ని తీర్చేవి. ఆ తరువాత టీవీ వచ్చాక పందుల పెం పకం శిక్షణకే పరిమితం అని మనం జోకులు వేసుకున్న దూ రదర్శన్‌లో ధర్మవరపు సుబ్రమణ్యం ‘ఆనందోబ్రహ్మ’ లాంటి కల్తీలేని హస్యం స్థాయికి ఇంత కాలమైనా మన ప్రైవేట్ చానల్స్ చేరుకోలేదు. ఆ తరువాత జంద్యాల సినిమాలు ఆదుకున్నాయి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు లేవు, అల్లరి నరేష్‌కు అవకాశాలు లేవు. దూరదర్శన్ రాక ముందు ఆదివారం మధ్యాహ్నం రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు కొన్ని టీవీ చానళ్లలో సంక్షిప్త నీలి శబ్దచిత్రాలను ‘జబర్దస్త్’గా చూపించి నవ్వమంటున్నారు. దీనే్న నువ్వు గొప్ప హాస్యంగా భావిస్తూ సంబరపడుతున్నావ్..’’
‘‘మన హాస్య ఖజానాను బాగానే గుర్తు చేశావ్ కానీ .. వీటిని మించిన హాస్యం మన వార్తల్లో ఉంది. అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది. వజ్రం, బొగ్గు ఒకే జాతి. నువ్వు బొగ్గును చూస్తున్నావు కానీ దాని వెనుక ఉన్న వజ్రాన్ని గుర్తించలేకపోతున్నావ్’’
‘‘ఉదయం న్యూస్ చానల్స్‌లో ‘చర్చాగోష్టి’ పేరిట వీధి పోరాటాలను మించిన అరుపులు, అర్థం పర్థం లేని వార్తల న్యూసెన్స్‌లో నీకు వజ్రాలు కనిపించాయా? మా నాయనే’’
‘‘నాగుపాము విషం ప్రాణం తీయడమే కాదు, ప్రాణాలు నిలిపే ఔషధాల తయారీకీ ఉపయోగపడుతుంది’’
‘‘వెబ్‌సైట్స్‌లో న్యూస్, దినపత్రికలను చదువుతూ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే... ఏదో అనుమానంగా ఉంది’’
‘‘తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. లాఫింగ్ ఫార్ములా చె బితే నువ్వు నాకన్నా ఎక్కువగా వీటిని ఎంజాయ్ చేస్తావు. పత్రికలు, వెబ్‌సైట్స్ చూసి సంతోషిస్తానని చెప్పగానే అనుమానంగా చూశావు.. కానీ వివరాలు అడిగావా? అడిగితే లాఫింగ్ రహస్యం తెలిసేది’’
‘‘దీనిలో రహస్యం కూడా ఏడ్చిందా? అవి చూస్తేనే నాకు చిరాగ్గా ఉంటుంది’’
‘‘నిజమే కానీ నేను చెప్పినట్టు చూసి ఎంజాయ్ చేయకపోతే అప్పుడడుగు..’’
‘‘ మచ్చుకు ఒకటి చూపిస్తా.. ఇది చదువు.. ’’
‘‘గణతంత్ర దినోత్సవ వేడుకల తరువాత ఉమ్మడి గవర్నర్ మార్పు- ఐతే?’’
‘‘వెబ్‌సైట్ వార్త పూర్తిగా చదువు. ఈ వార్త ఇప్పటిది కాదు పాత వార్త. పత్రికలు సంచలనం కోసం ఓ రెండేళ్ల పాటు ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ మార్పు అని రోజూ రాశాయి. ఇదే అంశాన్ని వెబ్‌సైట్ వాళ్లు స్వాధీనం చేసుకుని గణతంత్ర వేడుకల్లో ప్రసంగించాల్సి ఉన్నందున గవర్నర్‌ను మార్చలేదని, వేడుకలు ముగియగానే మారుస్తారు అని గల్లీలో ‘సింగిల్ బెడ్ రూమ్ హౌస్ కం ఆఫీసు’లో కూర్చుని వార్త వండేశారు. తాజా వార్త చదివితే చిరాకేస్తుంది. కానీ ఇప్పుడు చదివితే నీ మోము వికసించి తీరుతుంది. ఏదో ఒకటి, రెండు చెప్పాను. తవ్విన కొద్దీ లంకెబిందెల్లా ఇలాంటివి దొరుకుతాయి. తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత. 2014లో దేశమంతా మోదీ హవా సాగుతుంటే ఓ తెలుగు ఆర్‌ఎస్‌ఎస్ వాది ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పాడు. ఎలా? అంటే తెలంగాణ ఏర్పాటును దేశంలో వ్యతిరేకించిన పార్టీలన్నింటినీ మినహాయిస్తూ పోతే మిగిలింది ములాయం పార్టీ మాత్రమే. ప్రధాని పదవి దేవుడెరుగు.. ఆయన ముఖ్యమంత్రి కూడా కాలేదు. ఇప్పుడిది చదివితే నవ్వురాకుండా ఉంటుందా? ఇంకో తెలుగు మేధావి విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు ముగ్గురు గవర్నర్‌లు అంటూ, పార్లమెంటు కన్నా తన బుల్లి చాంబరే శక్తివంతమైందని ఊహాలోకాల్లో బతికిన మేధావులు ఎంతో మంది వార్తల రూపం లో మనకెంతో హాస్యం వండి వార్చారు .  హైదరాబాద్ నగరం కూడా ఓ రాష్ట్రం అవుతుందని వార్తా కథనం వండి వార్చేశాడో మహా మేధావి . విభజన జరిగిన నాలుగేళ్లయినా రెండు రాష్ట్రాలకూ ఒకే గవర్నర్ ఉన్న కాలంలో ఆ వార్త ఇప్పుడు చదివి 
చూడు.. ఆ మేధావి తెలివి నీకు బోలెడు వినోదాన్ని కలిగిస్తుంది. కేంద్ర మంత్రి వర్గం లో కవిత , మోత్కుపల్లికి గవర్నర్ , ముందస్తు ఎన్నికలు అంటూ చిన్న మేధావులు తమకు తోచిన వంటకాలు వండి మనల్ని అలరించారు . విషం ప్రాణాలు తీస్తుంది, ఔషధంగా ఉపయోగపడుతుంది అన్నట్టుగానే తాజా వార్తలను చూస్తే బుర్ర హీటెక్కుతుందేమో కానీ, కొంత కాలం తరువాత అదే వార్తను తిరిగి చదివితే మనసారా నవ్వుకుని రిలాక్స్ అయ్యే అదృష్టం కలిగిస్తుంది. నా ఆరోగ్య రహస్యం, నవ్వుకు ఇదే కారణం. ఇదే లాఫింగ్ ఫార్ములా..
నువ్వూ అనుసరించు గుణం కనిపించి తీరుతుంది.’’
‘‘అంటే..’’
‘‘ లేని బాపూ- రమణ, జంద్యాలను తలచుకుని వగచే కన్నా అందుబాటులో ఉన్న పాతవార్తలను చదివి, చూసి మనసారా నవ్వుకునే ఈ లాఫింగ్ టెక్నిక్‌ను నమ్ముకుని శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని చెబుతున్నా. ద్రాక్షరసం ఎంత పాతదైతే అంత కిక్కిస్తుంది. మేధావుల పాత జోస్యాలు సైతం అంతే..’’
*బుద్దా మురళి (జనాంతికం 9-3-2018)

1 కామెంట్‌:

  1. The old rule of forecasting was to make as many forecasts as possible and publicize the ones you got right. The new rule is to forecast so far into the future that no one will know you got it wrong.

    Ruchir Sharma (Breakout Nations)

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం