28, జులై 2018, శనివారం

దేవుడిది ఏ మతం?

ఏదో ఒక రోజు మనం దేవుడిని చూడబోతున్నాం!’’
‘‘దేవుడ్ని చూసే సంగతి ఎలా ఉన్నా- రాక్షసులను మాత్రం రోజూ చూస్తూనే ఉన్నాం ’’
‘‘ఇవి ఉత్తమాటలు కాదు, సైన్స్ పరంగా దేవుడి ఉనికిని చూపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బుడతడు విలియం మిల్లిస్ దేవుడున్నాడని సైన్స్ ద్వారా రుజువు చేస్తానని చాలెంజ్ చేశాడు.’’
‘‘ఇది సాధ్యం అవుతుందా? ’’
‘‘అసాధ్యం అనే మాట నుంచే అన్ని ఆవిష్కరణలు సాధ్యమయ్యాయి. ఫోన్ ద్వారా ఖండాంతరాల్లో ఉన్నవారితో మాట్లాడుకోవచ్చునని ఊహించామా? సెల్‌ఫోన్ మన జీవితంలో ఓ భాగమని అనుకున్నామా? గాలిలో విమానాలు ఎగురుతాయని మొదట అన్నప్పుడు ఎన్నో సందేహాలు వచ్చాయి కదా?’’
‘‘నా అనుమానం అది కాదోయ్. దేవుడు ఉన్నాడా?లేడా? అనేది తరువాత, అసలు దేవుడు ఎలా ఉంటాడని అనుకుంటున్నావ్.. ఆ సంగతి చెప్పు ?’’
‘‘తాతయ్యా.. నేను చెప్పాలా? మొన్న టీవీలో మాయాబజార్ సినిమా చూశా.. దేవుడు అచ్చం ఎన్టీఆర్‌లా ఉంటాడని అమ్మమ్మ చెప్పింది’’
‘‘ పెద్దవాళ్లిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటిరా? ?’’
‘‘పిల్లవాడైనా మంచి మాట చెప్పాడురా! తెలుగు వారిని దేవుడు ఎలా ఉంటాడని అడిగితే ‘ఎన్టీఆర్‌లా..’ అంటారు. అదే తమిళులను అడిగితే ఎంజిఆర్‌లా ఉంటాడంటారు. కన్నడిగులు రాజ్‌కుమారే దేవుడు అంటారు. ఇప్పుడు చెప్పు.. దేవుడు ఎలా ఉంటాడు. ఎన్టీఆర్‌లానా? రాజ్‌కుమార్‌లానా? ’’
‘‘ఇప్పటి తెలుగు కుర్రకారును అడిగితే పవన్ కల్యాణే మా దేవుడని అంటారు. తమిళులు మాత్రం రజనీకాంత్ రూపంలో ఉంటాడంటారు’’
‘‘ఏమో.. ఆ కాలంలో దేవుడు ఎన్టీఆర్‌లా ఉంటే ఇప్పుడు రజనీకాంత్‌లా మారాడేమో! ఫ్యాషన్లు మారినప్పుడు దేవుడి రూపం మారే ఉంటుంది.’’
‘‘సీరియస్‌గా దేవుడి గురించి చర్చిస్తుంటే నువ్వేంటి.. సినిమా దేవుళ్ల గురించి మాట్లాడుతున్నావు’’
‘‘నువ్వు చెప్పు దేవుడు ఎలా ఉంటాడో. దేవుడు నిజంగా బంగారు కిరీటాలు, ఆభరణాలు ధరించి ధగధగా మెరిసిపోతాడా? అంటే దేవుడు లోహయుగం నాటివాడా? లేక లోహయుగం దాకా మనుషులకు కనిపించి ఆ తరువాత కనిపించడం మానేశాడా?’’
‘‘చర్చ ఎక్కడికో వెళుతుందోయ్.. ఆయనెవరో ఇండియాకు దారి కనిపెట్టడానికి వెళ్లి అమెరికాను కనిపెట్టినట్టు.. ఆ అమెరికా ఇప్పుడు భూతల స్వర్గంగా మారినట్టు- ఈ కుర్రాడు దేవుడ్ని కనిపెడతాడేమో! ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?’’
‘‘దేవుడి ఉనికి దొరికితే రాక్షసులు కూడా దొరికి తీరుతారు. ’’
‘‘కొందరు దేవుడిని నమ్మడం లేదు, రాక్షసుల ఉనికిని నమ్ముతున్నారు.’’
‘‘రాక్షసుల ఉనికి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదోయ్.. అడుగడుగునా రాక్షసులు కనిపిస్తూనే ఉండగా ఇంకా వారి జాడ కోసం కష్టపడడం ఎందుకు?’’
‘‘నీకు రాక్షసులు కనిపించారా? ఎక్కడ?’’
‘‘హాస్టల్ బాలికలను ఏళ్లతరబడి అత్యాచారం చేయడం మానవ మాత్రుల వల్ల సాధ్యమా? రాక్షస అంశ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఉగ్రవాదం పేరుతో వందల మందిని పొట్టన పెట్టుకోవాలంటే మానవమాత్రుల వల్ల సాధ్యం కాదు, రాక్షస లక్షణాలుంటే తప్ప. పసిపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే వార్తలు చూస్తుంటే రాక్షసుల ఉనికి వాస్తవమే కదా? దీనికి ఇంకా ఆనే్వషణ ఎందుకు? ’’
‘‘ఓహో.. అలా వచ్చావా? రాక్షసులున్నారని అంగీకరిస్తే దేవుళ్లను కూడా అంగీకరించాలి. కొందరు మేధావులు మాత్రం దేవుడు అబద్ధం, రాక్షసులు నిజం అంటున్నారు. ఎందుకంటావు?’’
‘‘ముందు దేవుడు అంటే ఏమిటో నిర్వచనం ఖరారు చేసుకున్నాక- దేవుడి కోసం అనే్వషిస్తే బాగుంటుందని నాకనిపిస్తోంది. ’’
‘‘దేవుడనే వాడున్నాడా? అని మనిషికి కలిగెను సందేహం.. మనుషులనే వారున్నారా? అని దేవుడికి కలిగెను సందేహం.. అని చాలాకాలం క్రితమే ఓ సినిమా కవి తన సందేహాన్ని బయటపెట్టాడు. ’’
‘‘మనిషి పుట్టినప్పటి నుంచే దేవుడిపై ఈ సందేహాలు ఉన్నాయంటారు ’’
‘‘మనిషి తాను పుట్టిన తరువాత- దేవుడ్ని పుట్టించాడని కొందరంటారు.. ఇంతకూ మనిషి ముందా? దేవుడు ముందా? ’’
‘‘ఒకవేళ అమెరికా బుడతడి పరిశోధన విజయవంతమై దేవుడి ఉనికి కనిపెట్టారనుకో.. ఆ దేవుడు ఏ మతం దేవుడంటావు?’’
‘‘నిజమే- ఈ డౌట్ రాలేదు.. అమెరికా బుడతడు కనిపెట్టిన దేవుడు ఏదో ఒక మతానికి చెందిన దేవుడవుతాడు కదా? అప్పుడు ప్రపంచంలోని మిగతా మతాలు ఊరుకుంటాయా? ’’
‘‘చంద్రమండలంపైకి ఒక దేశం వెళ్లగానే పోటీగా ఇతర దేశాలు వెళ్లాయి కదా? ఇప్పుడు అలానే- తమ మతాల దేవుళ్ల ఉనికిని కనిపెట్టేందుకు అన్ని మతాలూ రంగంలోకి దిగుతాయేమో?’’
‘‘దేవుడి ఉనికి తెలిసి, అతను ఏ మతానికీ చెందనివాడని తేలితే ఏమవుతుందంటావు?’’
‘‘మా మతంలో చేరిపో అని దేవుడిపై అన్ని మతాల వాళ్లు ఒత్తిడి తెస్తారేమో! తమకే చెందాలని దేవుడ్ని కిడ్నాప్ చేసినా చేస్తారు..’’
‘‘ఔను.. మనిషి కనిపిస్తే చాలు మతం మారమని ఒత్తిడి తెస్తున్నారు. ఇక దేవుడు కనిపిస్తే మతం మారమని ఒత్తిడి తేకుండా ఉంటారా?’’
‘‘నీకున్న పరిజ్ఞానం ప్రకారం దేవుడు ఏ మతంలో చేరే అవకాశం ఉంది? ’’
‘‘నాకంత పరిజ్ఞానం లేదు. కానీ నీ సందేహాలు విన్నాక దేవుడి ఉనికిని కనిపెడితే ప్రపంచమే కాదు దేవుడు కూడా ప్రమాదంలో పడతాడేమో? ఏ మతంలో చేరలేక, ఎవరినీ కాదనలేక దేవుడు ప్రాణత్యాగం చేస్తాడేమో? అంటే మళ్లీ అదృశ్యం అవుతాడన్నమాట’’
‘‘కనిపించి మాయం కావడం కన్నా, అసలు కనిపించక పోవడమే మంచిది కదా?’’
‘‘ఏమో ఇవన్నీ ఊహించే దేవుడు ఎవరికీ కనిపించడం లేదేమో’’
‘‘దేవుడి ఉనికిని కనిపెట్టడం కన్నా మనుషుల్లో మానవత్వం మాయం కాకుండా చూడడడం ఈ ప్రంపచానికి తక్షణ అవసరమేమో! ’’

‘‘ నిజమే దేవుని ఉనికి కనిపెట్టడం ఎంత కష్టమో మనిషిలోని మానవత్వం ఉనికి కనిపెట్టడం కూడా భవిష్యత్తులో అంతే కష్టం అవుతుందేమో  అనిపిస్తోంది మారుతున్నకాలాన్ని చూస్తుంటే ’’
‘‘ ఆ కాలం వచ్చే నాటికి మనం ఉండం అదే మన అదృష్టం  ’’

బుద్దా మురళి (జనాంతికం 27-7-2018)

16, జులై 2018, సోమవారం

బాలజ్ఞానులు!

‘‘బయట కూర్చున్నావ్.. మీ ఇంట్లో చక్కని టీ తాగుదామని వస్తే’’
‘‘మా ఇంట్లో ఈ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ’’
‘‘అదేం లేదన్నయ్య గారూ.. అయన బడాయి మాటలు.కరెంట్ బిల్లు కట్టమని వారం క్రితం డబ్బులిచ్చాను. చుట్టలు కాల్చాడో, బీడీలు కాల్చాడో తెలియదు కానీ జేబులో డబ్బుల్లేవట.. బిల్లు విషయమే మరిచిపోయాడట! కరెంట్ కట్ చేశారు’’
‘‘ఇదిగో నీకు లక్షసార్లు చెప్పా.. వాటిని చుట్టలు అనరు సిగార్స్ అంటారు’’
‘‘రెండూ ఒకటే కదోయ్’’
‘‘క్లాస్‌లో కుర్రాడు గోల చేస్తే టీచర్‌గా మీరేం చేస్తారన్నయ్యగారూ? వాడి గోల వల్ల మిగిలిన పిల్లల చదువుకు ఇబ్బంది అవుతుందని క్లాస్ బయటకు పంపిస్తారు కదా? అలా చేస్తే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటాడు ఈయన. 24గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా నిర్ణయం కూడా ప్రజాస్వామ్యానికి చీకటి రోజేనట! చెప్పుకుంటే సిగ్గు చేటు. మొన్న కాకరకాయ పులుసులో ఉప్పు ఎక్కువైందని.. ప్రజాస్వామానికి ముప్పు అంటూ అలిగి తిండి మీది నుంచి లేచిపోయాడు. పోతే పో.. అని చానల్ మార్చి పక్కింటి మొగుడు సీరియల్ 213వ భాగం సీరియస్‌గా చూస్తూ ఉండిపోయా! ఆకలికి తట్టుకోలేక తానే వచ్చి ప్రజాస్వామ్యంలో వాకౌట్లు, సంప్రదింపులు సర్వసాధారణం అంటూ తానే తిండి పెట్టుకుని తిన్నాడు. ఈయనతో వేగడం కన్నా అడవిలోకి వెళ్లడం నయమనిపిస్తోంది’’
‘‘అడవిలో ఉన్నవాళ్లే అక్కడ ఉండి ఏం సాధించామని బయటకు రాలేక, అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. నువ్వెళ్లి ఏం చేస్తావుతల్లీ..’’
‘‘చూడోయ్.. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పవచ్చు.. అంతమాత్రాన ఇంట్లో నుంచి బయటకు పంపిస్తావా? మార్క్స్ ఏం చెప్పాడు? ఏంగెల్స్ ఏమన్నాడో తెలుసా?’’
‘‘ఏమంటాడు? ఈ నెల పాత బాకీ తీర్చకపోతే బియ్యం, పప్పులు ఇచ్చేది లేదని అందరి ముందే ముఖం మీదే అనేశాడు. కాలనీ సెక్రటరీ భార్య ఆ మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వుతుంటే తల కొట్టేసినట్టు అయింది.’’
‘‘ఏంగెల్స్ అంటే పచారీ షాపు లింగయ్య గురించి చెబుతావ్..’’
‘‘నెలనెలా బియ్యం, పప్పులు ఇచ్చేది లింగయ్యే కానీ ఏంగెల్స్ కాదు. ఆ విషయం నువ్వు తెలుసుకో. ఎలాగూ పనీపాటా లేదు కదా? శ్రీ్ధర్ చిల్లాల్ అని ఒకడు పూణెలో 66 ఏళ్ల నుంచి గోళ్లు పెంచుతూ గిన్నిస్ రికార్డులోకి ఎక్కాడట! మీరో పాతిక సంవత్సరాలు అలా ముక్కులో వెంట్రుకలు పెంచుతూ కొత్త రికార్డు సృష్టించవచ్చు కదా? అలాగైనా మీతో పాటు నేనూ టీవీలో కనిపిస్తాను.’’
‘‘66 ఏళ్లపాటు అసహ్యంగా అలా గోళ్లు పెంచి వాడు సాధించింది ఏంటట? జీవితం వృథా చేసుకున్నాడు’’
‘‘ఎవరిష్టం వాళ్లది. మీ పెదనాన్న భార్యా పిల్లలను వారి మానాన వారిని వదిలేసి ముఫ్ఫై ఏళ్లపాటు అడవి బాట పట్టి చివరకు లొంగిపోవడం తప్ప ఏం సాధించాడని ఎప్పుడైనా అడిగానా? ’’
‘‘అంటే గోళ్లు పెంచిన పిచ్చోడికి, సమసమాజ సా థపనకు అడవిబాట పట్టిన మా పెదనాన్నకు పోలికా?’’
‘‘ఎవరి పని వారికి గొప్ప. అనడం కాదు.. దమ్ముంటే మీరూ అలా గోళ్లు పెంచండి చూద్దాం.’’
‘‘నీతో వాదించి వృథా.. నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఇంట్లో కరెంట్ ఉంటే నా రూమ్‌లో నేను ఉండేవాణ్ణి’’
‘‘ఏంటీ.. దంపతులు ఎప్పటి మాదిరిగానే గొడవ పడుతున్నారు? 66 ఏళ్లపాటు గోళ్లు పెంచిన వాడిని భరించిన వాళ్ల ఆవిడకు- నాకే గనుక అధికారం ఉంటే భారతరత్న బిరుదు ఇచ్చేవాణ్ణి’’
‘‘రావోయ్ రా! మా గొడవ ఎప్పుడూ ఉండేదే? ఆ పిల్లాడెవరు?’’
‘‘మనవడు..’’
‘‘ఓలోలే.. క్యూట్‌గా ఉన్నాడు. వాటీజ్ యువర్ నేమ్?’’
‘‘ఓయ్.. ఏం మాట్లాడుతున్నావ్! మావాడు మరీ అంత చిన్నవాడేం కాదు. ఐదవ తరగతి చదువుతున్నాడు. బాలమేధావి’’
‘‘ఓహో.. గ్లోబ్‌ను చుట్టూ తిప్పుతూ కనిపించిన దేశం రాజధాని పేరు అడగ్గానే వచ్చీరాని మాటలతో వాళ్లు చెప్పడం.. తల్లిదండ్రులు మురిసిపోవడం ... ఈ బాలమేధావులను రోజూ పత్రికల్లో జోనల్ పేజీలో చూస్తూనే ఉంటాను లే.. పెద్దయ్యాక ఇంటర్‌లోనో, ఎంసెట్ ర్యాంకుల్లోనో వీళ్లు అస్సలు కనిపించరు ఎందుకంటావ్? ఎంసెట్‌కే దిక్కు లేనప్పుడు ఇక సివిల్స్ సంగతి ఎందుకులే’’
‘‘వీడు రాజధానుల బాలమేధావి కాదు. ఇప్పటికే బోలెడు ఫిల్మ్‌లు తీసి యూ ట్యూబ్‌లో పెట్టాడు. మహాత్మా గాంధీ చేసిన డజను తప్పులు అని బాగా పాపులర్ అయిన వీడియో వీడిదే’’
‘‘అబ్బో.. ఏరా..! గాంధీ పూర్తి పేరు తప్పులు లేకుండా రాయి చూద్దాం’’
‘‘ఇంకా ఏ కాలంలో ఉన్నారంకుల్ ! యూ ట్యూబ్ చానల్‌కు రాయడంతో పనేంటకుల్? గూగుల్‌లో ఫొటోలు తీసుకుని నోటికొచ్చిన చరిత్రను చెప్పడమే. జవహర్‌లాల్ నెహ్రుకు బాబర్ మేనమామ అవుతాడని, హిట్లర్ హిందువు అని, జిజియా పన్ను వెనుక నెహ్రు పిన్నమ్మ హస్తం అని వరుసగా కొన్ని వీడియోలు తీస్తున్నా అంకుల్’’
‘‘ఏరా.. ఇది వీడి సొంత తెలివేనా? లేక..’’
‘‘నీ దగ్గర రహస్యాలెందుకు? ఇంజినీరింగ్ తరువాత కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. ముందు చూపుతో వీడ్ని చిన్నప్పుడే ఈ రంగంలో దించాను. నాకు చిత్ర విచిత్రమైన వాట్సాప్ మెసేజ్‌లు వస్తుంటాయి. పాకిస్తాన్ ఏర్పాటుకు రాహుల్ గాంధీ కారణం అని, మహాత్మా గాంధీ జగన్‌తో కుమ్మక్కు, జగన్ ఎత్తుగడలు ముందే తెలిసి లాలాలజపతి రాయ్ అతన్ని దూరంగా పెట్టాడని, క్వింట్ ఇండియా ఉద్యమంలో మన యువ నేతలు అంటూ చారిత్రక మెసేజ్‌లు వస్తుంటాయి. అవన్నీ వీడికి ఫార్వర్డ్ చేస్తాను. వీడు వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాడు. వాడికి కాలక్షేపం, ఆదాయం ’’
‘‘ ఎన్నికలొస్తున్నాయి కదా? ఇలాంటి చిత్ర విచిత్రాలు కళ్ల ముందే కనిపిస్తుంటే మెసేజ్‌లదేముంది? పిల్లలను ఎత్తుకెళుతున్నారనే వీడియోల వల్ల దేశంలో 30 మందిని చంపేశారట! వాటి కన్నా మీవాడి వీడియోలేమీ ప్రమాదకరమైనవి కాదులే.. మీవాడొక్కడే కాదురోయ్ అడుగడుగునా బాలజ్ఞానులున్నారు. ఎన్నికల నాటికి బాలజ్ఞానం మరింత ప్రకోపిస్తుంది’’
*- బుద్దా మురళి (జనాంతికం 12-7-2018)

6, జులై 2018, శుక్రవారం

శ్రీరాముని దయచేతను..

‘‘తెలియదు  అంటే- తెలివి లేదని నిందిస్తావా? నాగం జనార్దన రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన స్థాపించిన పార్టీ ఏమైంది? బిజెపి నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు? కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి పదవేంటి? టీవీ చర్చల్లో రోజూ కనిపించే ఫలానా నాయకురాలు ఈ రోజు ఏ పార్టీ తరఫున మాట్లాడారు? అనడిగితే ,తెలియదు అన్నందుకు - రాజకీయాల గురించి నాకేమీ తెలియదా? నువ్వడిగిన ప్రశ్నలకు నాగంకే సమాధానం తెలియదు. విలేఖరుల సమావేశంలో అవినీతి కాంగ్రెస్ అంటూ చీల్చి చెండాడాడు. సార్.. ఇప్పుడు మీరు కాంగ్రెస్‌లోనే ఉన్నారని ఆయనకు గుర్తు చేయాల్సి వచ్చింది.’‘‘ఎవరితో మాటలు..? ఫోన్‌లో అంతగా ఊగిపోతున్నావ్?’
‘‘పక్కింటి పిల్లాడికి హోంవర్క్‌లో రాజకీయాల గురించి ప్రశ్నలు అడిగారట! వాళ్ల నాన్న నన్ను అడిగితే తెలియదని నిజాయితీగా చెప్పాను. ఇవి కూడా తెలియదు కానీ అన్నీ తెలిసినట్టు పెద్ద పోజు అని ఎత్తిపొడుపు మాటలకు చిర్రెత్తుకొచ్చింది. మీరు చెప్పండిరా! తెలంగాణ వస్తుందని ముందే చెప్పానా? లేదా? దేశ రాజకీయాలు ఎలా ఉంటాయి? 2019 ఎన్నికల అంచనాలు కూడా చెప్పాను కదా? మరి నాకేమీ తెలియదని ఎంతేసి మాటలంటున్నాడు.’’
‘‘బాధపడకు.. మాలో ఎవరికి సందేహం వచ్చినా నిన్నే  అడుగుతాం కదా? రాజకుమారి ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారని వారి పిల్లలను అడిగినా చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష విరమించారని దేశంలో కెల్లా సీనియర్ రాజకీయ నాయకుడు సృష్టించిన చరిత్ర, ఆయన కనిపెట్టిన పురాణాల ప్రకారం పోతన రాసిన రామాయణం పేరేమిటి? చినబాబు కనిపెట్టిన తెలుగు పదాలు ఏవి? వంటి ప్రశ్నలు అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం ‘గూగుల్’కు కూడా సాధ్యం కాదు. ఇలాంటి వాటితో మూడ్ పాడు చేసుకోవద్దు.’’
‘‘సర్లే.. పొత్తికడుపుపట్టుకుని అంతగా మెలికలు తిరిగిపోతున్నావ్? ఏంటి విషయం? గ్యాసేమో..  టీ తాగడం తగ్గించు’’
‘‘కడుపులో నుంచి తన్నుకొస్తున్న ఈ గ్యాస్ వేరు’’
‘‘అలా మెలికలు తిరగకు. ఫర్వాలేదు సిగ్గుపడకు.. అంతా మన ఫ్రెండ్సే కదా? ఎవరూ ఏమీ అనుకోరు చెప్పు’’
‘‘కడుపులో నుంచి దేశభక్తి తన్నుకొస్తోంది.. దేశం కోసం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అనిపిస్తోంది. అలా అని నా అలవాట్లు మానుకోను. జేబులో నుంచి ఒక్క రూపాయి తీయను’’
‘‘దురద పుట్టినప్పుడు గోక్కోవాలని అనిపించడం ఎంత సహజమో మనిషన్నాక ఈ వయసులో ఏదో ఒకటి చేయాలనిపించడం అంతే సహజం. ఖర్చు లేని మార్గాలు బోలెడు ఉన్నాయి. సెల్ ఫోన్  ఉంది కదా? అదొక్కటి చాలు. ప్రతి బ్యాంకు అకౌంట్ నుంచి ఒక రూపాయి కోత విధించి సరిహద్దుల్లో యుద్ధంలో మరణించే సైనికుడి ఖాతాలో జమ చేయమని ఒక సందేశం తయా రు చేసి వాట్సాప్‌లో పం పించు.. నీకు పైసా ఖర్చు లేదు. నీ దేశభక్తికి బోలెడు గుర్తింపు’’
‘భలే  ఉంది. ఆగాగు.. ముందు వాట్సాప్‌లో ఈ మెసేజ్ అందరికీ పంపిస్తా..’’
‘‘అప్పుడే రంగంలోకి దిగావంటే నీలో దేశభక్తి ప్రవాహం మామూలుగా లేదు. ఇలాంటి దేశభక్తి సందేశాలు నీ శక్తిమేరకు తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో నింపేయ్.’’
‘‘ఏరోయ్.. నువ్వేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టున్నావ్. వాడికిచ్చినట్టే నీకూ సలహా ఇస్తా చెప్పు ’’
‘‘రోజూ ఇలాంటివి వంద దేశభక్తి మెసేజ్‌లు వస్తాయి. అంతమందిలో ఒక బోడిగుండులా ఉండడం నాకు నచ్చదు. నేనసలే మేధావిని’’
‘‘ఓ పని చేయ్! అంతా రాముణ్ణి మొక్కితే, నేను నాస్తికుణ్ణి దేవునిపై నమ్మకం లేదు. రాముడు అబద్ధం, రావణుడు నిజం అని చెప్పు. రావణుడే నిజమైన దేవుడు అని వాదించు. నీ ఇంటి ముందు టీవీ వాళ్లు క్యూ కట్టక పోతే ఓట్టు’’
‘‘రాముడు లేడని, రావణుడు ఉన్నాడని పరస్పర విరుద్ధంగా ఎలా చెప్పాలి?’’
‘‘ఇలా ఆలోచిస్తే నీకు మేధావిగా గుర్తింపు లభించడం కష్టమోయ్.’’
‘‘దీంట్లో రిస్క్ లేదంటావా? ’’
‘‘స్టాక్ మార్కెట్, పూల దుకాణం.. ఏ వ్యాపారంలోనైనా రిస్క్‌ను బట్టే ఆదాయం ఉంటుంది. పాల ప్యాకెట్టు అమ్మితే రూపాయి కమీషన్ వస్తుంది. అదే హెరాయిన్ ప్యాకెట్ అమ్మితే అబ్బో బోలెడు ఆదాయం. రిస్క్ భరించేందుకు సిద్ధపడితేనే పబ్లిసిటీ, మీడియా గుర్తింపు..
‘‘ప్రాణాలు ప్రమాదంలో పడేంత రిస్క్ ఉంటే...’’
‘‘ప్రపంచ పటంలో భూతద్దం పెట్టి వెతికితే కనిపించీ కనిపించకుండా ఉండే చిన్న దేశంలో మతంపై కార్టూన్ వేస్తే మన దేశంతో పాటు అనేక దేశాలు భగ్గుమన్నాయి. ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాంటి వాటి జోలికెళ్లవద్దు. వంద కోట్ల జనాభా ఉన్న హిందువుల ఆరాధ్య దైవాలపై కార్టూన్లు వేసినా, కామెంట్ చేసినా గుర్తింపు తప్ప ఎలాంటి రిస్క్ లేదు. ’’
‘‘మీ చర్చలో జోక్యం చేసుకుంటున్నాను. నువ్వేదో వెటకారంగా చెబుతున్నట్టున్నావ్. మా బామ్మ రంగనాయకమ్మ ఈ అంశంపై చాలా చక్కగా వివరణ ఇచ్చారు. నేను హిందువుగా పుట్టాను, ఆ మతంలో పెరిగాను కాబట్టి హిందుమతం గురించి విమర్శిస్తూ రాస్తున్నాను. తెలియని మతాల గురించి రాయడం లేదని చెప్పారు. నువ్వు చదవలేదా?’’
‘‘అంటే ఆమె పుట్టినప్పుడే ఉగ్గుపాలకు బదులు క్యాపిటల్ పుస్తకం చదువుతూ పెరిగారా? పాలపీకలో మార్క్సిజాన్ని కలుపుకొని తాగుతూ పెరిగారా? క్యాపిటల్ గురించి, మార్క్సిజాన్ని గురించి ఎలా రాశారు? వీటి గురించి తెలుసుకుని రాశారు అంతే కదా? అలానే ఇతర మతాల గురించి తెలుసుకుని రాయవచ్చు కదా? రాస్తే ఏమవుతుందో బామ్మకు బాగా తెలుసు. ఆమె సంగతి మనకెందుకు కానీ మన సంగతి మనం చూసుకుందాం.’’
‘‘ఉద్రిక్తతలు కలిగిస్తున్న చానల్స్, సంస్థల సంగతి తేల్చకుండా.. .’’
‘‘పిచ్చోడా! పార్టీ శ్రేణులు కూడా చేయని మేలును టీవీ చానల్స్ చేస్తుంటే తెలివైన వాడెవడూ వద్దనడు..
లోకల్ గుర్తింపునకు ఇది సరిపోతుంది .. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కావాలంటే .. తన శైలిలో ప్రపంచ శాంతి కోసం తపించిన లాడెన్ కు నోబెల్ శాంతి అవార్డు ప్రకటించాలి అని డిమాండ్ చేయి . మన దేశం లో జైళ్లలో ఉన్న టెర్రరిస్ట్ లను విడుదల చేసి ... రావణున్ని చంపిన రామునిపై హత్యా నేరం , గృహ హింస కేసు , నిర్భయ కేసు పెట్టాలని రామాయణం లో జరిగిన మరణాలన్నింటిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేయి .. అసలు విషయం మరిచిపోయా బంగారు లేడిని చంపినందుకు అటవీజంతువుల సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకో మని డిమాండ్ చేస్తే తిరుగుండదు. శ్రీ రాముని దయతో నీ కోరిక నెరవేరి అంతర్జాతీయ మేధావిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను . బచ్చన్న పేట లో ఉండే అతనెవరో ట్రంప్ ఫొటోకు పూజ చేసి ట్రంప్ దృష్టిలో పడ్డప్పుడు మహానగరం లో ఉండే నువ్వు లాడెన్ కు శాంతి దూత అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ప్రపంచం దృష్టిలో పడకుండా ఉంటావా ?  ’’
‘‘అర్థం అయినట్టు, కాకుండా మాట్లాడుతున్నావు’’
‘‘మోదీ విజయంలో హిందుత్వ శక్తుల ప్రయత్నాల కన్నా, హిందూ వ్యతిరేక శక్తుల కృషి ఎక్కువ ఉంది’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘తుంటిమీద కొడితే పళ్లు రాలాయనే సామెత తెలుసు కదా? తుంటికి, పళ్లకు సంబంధం ఉండదు. కానీ రాజకీయాల్లో ఉంటుంది.’’
*-బుద్దా మురళి (జనాంతికం 6-7-2018)

2, జులై 2018, సోమవారం

ఆస్తి పంపకం.. ఓ కళ

‘పిల్లలు సమర్ధులు అయితే వారి కోసం తల్లిదండ్రులు సంపాదించి పెట్టాల్సిన అవసరం ఏముంది? వారే సంపాదించుకుంటారు.
ఒకవేళ పిల్లలు అసమర్థులు, సంపాదించింది నిలుపుకోలేని అసమర్ధుల కోసం తల్లిదండ్రులు సంపాదించి పెట్టడం ఏందుకు?’ అంటూ యాంగ్రీ యంగ్ మెన్‌గా మూడు దశాబ్దాల క్రితం ఓ సినిమాలో అమితాబ్ చెప్పిన డైలాగు అప్పట్లో బాగా పాపులర్.
‘మా జీవితమంతా పిల్లల బాగు కోసం ధారపోశాం. వయసుడిగిన తరువాత ఇంట్లో నుంచి బయటకు పంపించారు. నిలువ నీడ లేదు.’ హైదరాబాద్‌లో ఇటీవల సీనియర్ సిటిజన్స్ సమావేశాన్ని నిర్వహించినప్పుడు పలువురు వృద్ధులు అవేదనగా చెప్పిన మాట.
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కొంత సంపాదించి పెట్టాలా? వద్దా? తాము సంపాదించింది పిల్లలకు ఏ వయసులో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి?
సంపాదించడమే కాదు సంపాదించింది పిల్లలకు ఇవ్వడం కూడా ఒక కళే.
ఆ కళలో తేడా వస్తే, జీవితం కల తప్పి పోతుంది. హాయిగా గడవాల్సిన జీవితపు చివరి దశ నరక ప్రాయంగా మారుతుంది. పిల్లలకు సంపాదన ఎప్పుడివ్వాలి? ఎలా ఇవ్వాలి అనే సమస్య ఈ కాలం నాటిది కాదు. యుగ యుగాలుగా ఉన్నదే.
12వ శతాబ్దాంలో కాశ్మీర్‌కు చెందిన సంస్కృత పండితుడు యోగేంద్రుడు ఆనాటి పరిస్థితులను చూసి సంపదను పిల్లలకు ఇవ్వడం గురించి ఆనాడే చెప్పాడు. ఆకాలం నాటి కాశ్మీర్ రాజు అనంత దేవుడు తొలుత అధికారం అంతా కుమారుడికి అప్పగిస్తాడు. కుమారిని తీరు నచ్చక తిరిగి తాను అధికారం తీసుకుంటాడు. పరిస్థితులను తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ పరిస్థితులను చూసిన క్షేమేంద్రుడు తాను రాసిన చారుచర్యలో వారసులకు సంపద ఏ విధంగా అప్పగించాలో వివరించారు.
ధృతరాష్ట్రుడు తన కుమారుడిపై ఉన్న విపరీతమైన వ్యామోహంతో రాజ్యాధికారం మొత్తం అతనికే అప్పగిస్తాడు. తీరా యుద్ధాన్ని నివారించేందుకు తండ్రి ప్రయత్నిస్తే, సూదిమోపినంత నేలను కూడా ఇవ్వనని దుర్యోధనుడు తిరస్కరిస్తాడు. ఒకవేళ అధికారం దృతరాష్ట్రుని చేతిలోనే ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా? ఇష్టం లేకపోయినా దుర్యోధనుడు తండ్రి మాట వినాల్సి వచ్చేది. కానీ రాజ్యాధికారం మొత్తం తన చేతిలో ఉన్న తరువాత తండ్రి మాట వినాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కూడా అంతే ఆస్తి మొత్తం వారసుల చేతికి వచ్చిన తరువాత తల్లిదండ్రుల మాట ఎందుకు వింటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో క్షేమేంద్రుడు చెప్పారు. తండ్రి సంపాదన ఎలాగూ సంతానానికే చెందుతుంది. సంతానం బలవంతంగా తీసుకోక ముందే వయసు వచ్చిన పిల్లలకు తండ్రి సంపద అప్పగించాలి. అదే సమయంలో సంపద చేతికి అందిన తరువాత వారెలా ఉంటారనేది కూడా ఒక అంచనాకు రావాలి. అందరూ అలానే అని కాదు. అలా అని అంతా మంచివారే అని కాదు. కాలం ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. మొత్తం సంపద ఒకేసారి వారి చేతిలో పెట్టవద్దు. అనుభవం లేని వారసులు ఒకేసారి సంపద వచ్చి పడితే వృధా చేయవచ్చు. లేదా సంపద మొత్తం వచ్చిన తరువాత ఇక తల్లిదండ్రులను పట్టించుకోవలసిన అవసరం ఏముంది అనుకోవచ్చు. దీని వల్ల వృద్ధాప్యంలో బాధలు తప్పవు. మధ్యేమార్గంగా కొద్ది కొద్దిగా తన సంపదను వారసులకు ఇస్తూ ఉంటే ... తండ్రితో బాగుంటేనే మిగిలిన సంపద దక్కుతుంది అని భావిస్తారు. అదే సమయంలో ఆ సంపదను ఎలా నిర్వహించాలో క్రమంగా అనుభవం గడిస్తారు.
నేను పోయేంత వరకు నా సంపదపై నాదే హక్కు అంటే ఎప్పుడు పోతాడా? అని ఎదురు చూస్తారు. తొందరగా పైకి పంపేందుకు సిద్ధపడే వారు కూడా ఉంటారు. క్రమంగా తన అధికారాన్ని, సంపదను వారసులకు అప్పగించడమే ఉత్తమ పద్దతి అని ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే పెద్దలు సూచించారు.
పిల్లలకు సంపదనంతా ఇచ్చేసి అనాథలుగా మారిన తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలోనే తండ్రి పోతే కానీ సంపదపై అధికారం రాదు అని ఎదురు చూస్తున్న కుటుంబాలూ ఉన్నాయి.
పిల్లలకు సంపదంతా ఇచ్చేసి మోసపోయిన తండ్రులు అడుగడుగునా కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా క్రమంగా సంపద వారసులకు అప్పగించడం ఉత్తమ మార్గం. దీని వల్ల వారసులకు అనుభవం వస్తుంది. పెద్దలకు చివరి దశ హాయిగా గడిచిపోతుంది.
వారసులకు సంపద అప్పగించడం అంటే అది కేవలం ధనం రూపంలో ఉన్న సంపద మాత్రమే కాదు. ఆ సంపదను కాపాడుకునే తెలివి తేటలు, వృద్ధి చేసే తెలివి తేటలు, జీవిత అనుభవాన్ని కూడా పిల్లలకు ఇవ్వాలి. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలపాలి.
పిల్లలు పట్టించుకోవడం అని ఆవేదన చెందే తల్లిదండ్రులు చాలా మంది కనిపిస్తున్నారు. అదే సమయంలో ఇంకా తమ పెత్తనమే సాగాలి అని భావించే తల్లిదండ్రులూ ఉన్నారు. వయసు మీరిన తరువాత హుందాగా దాన్ని అంగీకరించాలి. బాధ్యతలను పిల్లలకు అప్పగించాలి. చివరి దశలో ఎవరిపైనా ఆధారపడకుండా ఏం చేస్తే బాగుటుందో ఒక నిర్ణయానికి రావాలి. మారిన కాలంలో పిల్లలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. వారి స్వతంత్ర భావాలను అర్థం చేసుకోవాలి. మంచి చెడు చెప్పి నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వాలి. పెద్దరికాన్ని నిలుపుకోవాలి.
చేతిలో అధికారం, ఆస్తి ఉన్నప్పుడే రేపటి గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. వయసు మీరి, అధికారం పోయి, సంపద చేజారిన తరువాత ఎంత జీవితానుభవం ఉన్నా ఉపయోగపడదు. అన్నీ చేతిలో ఉన్నప్పుడే సరైన తీరుగా నిర్ణయం తీసుకోవాలి.
-బి.మురళి