25, మార్చి 2019, సోమవారం

ఓ ఇంటి కథ

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. ఈ రెండూ చాలా కష్టమైన పనులు అనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ మాటన్నారు. కానీ కాలం మారింది. అడిగి మరీ రుణాలు ఇచ్చే బ్యాంకుల వల్ల గృహ నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. పాత రోజుల్లో ఐతే రిటైర్ అయ్యే టైంలో ఇళ్లు కడితే గొప్ప అన్నట్టుగా ఉండేది. ఈ కాలంలో ఉద్యోగంలో చేరిన కొత్తలోనే బ్యాంకు రుణాలతో చాలా మంది ఇండ్లు కట్టేస్తున్నారు. అబ్బాయిలతో పోటీ పడి అమ్మాయిలు కూడా చదువుకోవడం, ఉద్యోగం చేయడం వల్ల ఈ రోజుల్లో పెళ్లి కూడా అంత కష్టమైనదేమీ కాదు.
కానీ మనం చెప్పుకునే కథ అలా సుఖాంతం అయిన ఇంటి కథ కాదు. తన అభిరుచులకు అనుగుణంగా అద్భుతంగా ఇంటిని నిర్మించుకుని రోడ్డున పడ్డ ఒక మధ్యతరగతి కుటుంబరావు కథ.
సరైన ప్లాన్ లేకుండా ఒక పని చేపట్టడం అనే పొరపాటు చేసినప్పుడు జీవితం ఎలా రోడ్డున పడుతుందో చెప్పే కథ. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నాం, ఏం చేస్తే ఫలితం ఎలా ఉంటుంది. రిస్క్‌ను భరించే శక్తి ఎంత వరకు ఉంది అనే అంచనాలు లేకుండా ముందుకు వెళితే ఏమవుతుందో చెప్పే కథ.
సికిందరాబాద్ రాజేశ్వర్ థియోటర్ వద్ద మధ్యతరగతి కుటుంబరావుకు షాప్ ఉంది. మంచి మనిషి తన ఖాతాదారులతో చక్కగా మాట్లాడతాడు. వ్యాపారం చక్కగా సాగుతోంది. ఆ వ్యాపారికి తన అభిరుచికి అనుగుణంగా ఇళ్లు కట్టుకోవాలని అనిపించిది. వ్యాపారంలో ఎంత ఆదాయం ఉన్నా ఒక ఉద్యోగికి ఇంటి రుణం లభించినంత సులభంగా వ్యాపారికి రుణం లభించదు. ఉద్యోగి మాదిరిగా నెల నెలా ఆదాయం ఎంత వస్తుందనే గ్యారంటీగా చెప్పలేరు.
సొంత డబ్బుతోనే ఆ మధ్యతరగతి వ్యాపారి ఇంటి నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం పూర్తయిన ఇంటిని చూసిన వారు ఎవరైనా ఇళ్లు అంటే ఇలా ఉండాలి అన్నారు. ఎక్కడా రాజీ పడలేదు. ఇళ్లు అద్భుతంగా తయారైంది. ఇంట్లో ఫర్నిచర్ విషయంలోనూ రాజీ పడలేదు. పైకి అంతా బాగానే కనిపిస్తోంది. చక్కని ఇళ్లు కళ్ల ముందు కనిపిస్తుంటే మరో రకంగా ఆలోచించడానికి ఏమీ లేదు.
దగ్గరుండి ఇంటి నిర్మాణం చేపట్టిన ఆ వ్యాపారికి తన వ్యాపారంపై శ్రద్ధ తగ్గింది. కుమారుడికి, పని వాళ్లకు వ్యాపారం అప్పగించాడు. ఇంటి నిర్మాణంలో ప్రతి అణువు తన అభిరుచిగా అనుగుణంగా ఉండాలని దగ్గరుండి మరీ నిర్మాణం చేపట్టాడు. ఎక్కడా రాజీ పడలేదు కాబట్టి బడ్జెట్ తన అంచనాలను మించి  మార్కెట్‌లో మంచి పేరుండడం వల్ల తోటి వ్యాపారి నెలకు రెండు శాతం వడ్డీతో ఇంటి కోసం కొంత రుణం తీసుకున్నాడు.

ఒకవైపు వ్యాపారం క్రమంగా తగ్గుతోంది. ఇంటిపై వడ్డీ భారం రోజు రోజుకు పెరుగుతోంది. ఇళ్లు అద్భుతంగా ఉంది కానీ పరిస్థితే చేయి జారి పోయింది. వ్యాపారంలో వస్తున్న ఆదాయం మొత్తం ఇంటిపై తీసుకున్న ప్రైవేటు వడ్డీకి అప్పుకే సరిపోతోంది. కేవలం వడ్డీ కట్టేందుకు వ్యాపారం చేయడం నా వల్ల కాదు. షాపు, ఇళ్లు ఏదో ఒకటి అమ్మేద్దాం అని ఏదోఒకటి తేల్చుకో అని కుమారుడు చెప్పి బయటకు వెళ్లిపోయాడు. బాగా ఆలోచించిన వ్యాపారి గుండె దిటవు చేసుకుని ఇంటిని అమ్మేశాడు. అప్పులు తీర్చేశాడు. ఐనా వ్యాపారం అంతంత మాత్రమే. పూర్తిగా బంధవిముక్తి కోసం వ్యాపారాన్ని సైతం అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు.
వ్యాపారాన్ని అమ్మేసి అప్పులన్నిటి నుంచి బయటపడ్డాడు. చిత్రమైన విషయం ఏమంటే ఆ వ్యాపారాన్ని కొన్న వ్యక్తి ఆ మధ్యతరగతి కుటుంబారావును ఉద్యోగంలో పెట్టుకున్నారు. మార్కెట్‌లో మీకు మంచి పేరుంది. ఖాతాదారులకు మీరంటే గౌరవం యజమాని స్థానంలో కౌంటర్‌లో మీరే కూర్చోండి నెలకు పాతిక వేల జీతం ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు తన షాపులోనే తాను గుమస్తా. షాపు తనపేరుమీదనే ఉన్నా తాను మాత్రం గుమాస్తా. ఇంటి నిర్మాణంతో వీధిన పడిన ఒక మధ్యతరగతి కుటుంబరావు వాస్తవ కథ ఇది.
***
ఇంటి నిర్మాణంతో ఇలా రోడ్డున పడ్డవారు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. ఇంటి నిర్మాణం తప్పా? అంటే కాదు కానే కాదు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇంటి విలువ రోజు రోజుకు పెరిగిపోతోంది. పెద్దగా రిస్క్ లేకుండా అత్యధిక ఆదాయం సమకూర్చే రంగం రియల్ ఎస్టేట్. మరి తేడా ఎక్కడుంది అంటే...
సరైన ప్లాన్ లేకపోవడమే ఇక్కడ జరిగిన పొరపాటు. ఒక చిన్న పొరపాటు అతని జీవితాన్ని అతలాకుతలం చేసింది.
ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఎంత వరకు భరిస్తాం అనే స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇంటి నిర్మాణం కోసం ఎంత డబ్బయినా వెచ్చించ వచ్చు దానికి అంతు లేదు. కానీ దానిని భరించే స్థాయి మనకు ఎంత వరకు ఉంది అనే స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇంటి నిర్మాణం ఎంతలో పూర్తి చేయాలి, దానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి అనే అవగాహన ఉండాలి. మనం అనుకున్న దాని కన్నా ఎంత శాతం ఎక్కువ ఖర్చును భరించగలం అనే లెక్క ఉండాలి.
అంబానీ తన కుటుంబం కోసం 80 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఐతే ఆయనేమీ తన వ్యాపారాలను పక్కన పెట్టి తన పూర్తి సమయం ఇంటి నిర్మాణానికే పరిమితం కాలేదు.
అలానే ఆ మధ్యతరగతి కుటుంబరావు జీవనాధారం వ్యాపారం. దానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ అదే సమయంలో ఇంటి నిర్మాణం చూసుకుంటే బాగుండేది కానీ వ్యాపారాన్ని గుమాస్తాలకు అప్పగించి పూర్తిగా ఇంటి నిర్మాణానికే పరిమితం కావడం వల్ల అటు వ్యాపారం పోయింది. ఇటు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇళ్లూ పోయింది.
ఇంటి నిర్మాణ సమయంలో బంధువులు, స్నేహితులు పలు ఉచిత సలహాలు ఇస్తారు. ఇంట్లో అలంకరణ ఎలా ఉండాలి అంటూ .. దాంతో వ్యయం చేయి దాటి పోతుంది. వ్యయం ఎంత వరకు భరించగలం అనే స్పష్టమైన అవగాహనతోనే ఇంటి నిర్మాణంలో అడుగు పెట్టాలి. తనకు బతుకు తెరువు అయిన వ్యాపారమే మొదటి ప్రాధాన్యత కావాలి. ఇంటి నిర్మాణం పనులు కుటుంబ సభ్యులకు అప్పగించి, వ్యాపారం తన చేతిలో ఉంచుకుంటే ఆ కుటుంబరావుకు రెండూ దక్కేవి. కానీ చివరకు రెండూ పోయాయి. ఇంటి నిర్మాణంలో హడావుడి, షోకుల కన్నా వ్యయంపై సరైన అవగాహన అవసరం . మనకు ఉపాధి కల్పిస్తున్న పనికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే రోడ్డున పడతామని కుటుంబరావు ఇంటి కథ చెబుతోంది.
-బి.మురళి
23-3-2019

11, మార్చి 2019, సోమవారం

ఉద్యోగమా.. వ్యాపారమా

ప్రతి ఒక్కరూ సంపన్నులు కావాలని కోరుకుంటారు. ప్రశాంతమైన జీవితం, ఆర్థిక భద్రత అందరూ కొరుకుంటారు. దీనికి ఉద్యోగం బెటరా? వ్యాపారమా? అంటే మనలో ఎక్కువ మంది ఉద్యోగమే బెటర్ అంటారు. వ్యాపారం అంటే ఎన్నో సమస్యలు. ఎంతో రిస్క్. కానీ ఉద్యోగం అయితే నెల నెలా జీతం వస్తుంది. ఎలాంటి సమస్య ఉండదు అనుకుంటారు. చిన్నప్పటి నుంచే మనలో ఇలాంటి ఆలోచనలు ఏర్పడతాయి. డబ్బు, చదువు, ఉద్యోగం, జీవితంపై భద్రత వంటి అంశాలపై చిన్నప్పుడే మనలో కొన్ని అభిప్రాయాలు బలంగా ఏర్పడతాయి. తల్లిదండ్రులు, బంధువులు, ఇంట్లో వాళ్లు చెప్పే మాటల వల్ల ఇలాంటి అభిప్రాయాలు బలంగా ఏర్పడతాయి. చిన్నప్పుడే బలంగా ఏర్పడిన ఈ అభిప్రాయాలు అంత త్వరగా మారవు. ఎవరెన్ని చెప్పినా ఈ అభిప్రాయాలను మార్చుకోవడం అంత ఈజీ కాదు.
దేశంలో ఏ మూలకు వెళ్లినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అక్కడ ఉభయ రాష్ట్రాలకు చెందిన తెలుగువారు కనిపిస్తారు. అనేక దేశాల్లో పెద్ద సంఖ్యలో మన వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగాలు చేయడానికి మన తెలుగు వారు సిద్ధంగా ఉంటారు. అదే గుజరాత్ విషయానికి వస్తే దేశంలో ఏ ప్రాంతంలోనైనా వాళ్లు వ్యాపారాల్లో కనిపిస్తారు. హైదరాబాద్ శివార్లలో ఏ కాలనీలో చూసినా మర్వాడి, గుజరాతీ వ్యాపారులు కనిపిస్తారు. చివరకు అమెరికాలో సైతం గుజరాతీలు ముందున్నారు. అమెరికాలో ఐటి ఉద్యోగాల్లో మన వాళ్లు దూసుకువెళుతుంటే, వ్యాపారాల్లో గుజరాతీలు ముందున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. ఉద్యోగం కోసం ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లేందుకు మనం సిద్ధంగా ఉంటే, ప్రపంచంలో ఎక్కడైనా వ్యాపార అవకాశాలు వెతుక్కోవడానికి గుజరాతీలు ముందున్నారు.
ఉద్యోగం చేయాలా? వ్యాపారం చేయాలా? అనేది ఎవరి అభిరుచి మేరకు వారు నిర్ణయం తీసుకోవచ్చు. ఒకరికి వ్యాపారం చేసే లక్షణాలు బలంగా ఉంటే మరొకరికి ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యం ఉండవచ్చు.
ప్రయత్నించి విఫలం అయినా పరవాలేదు కానీ అసలు ప్రయత్నించక పోవడం సరైన నిర్ణయం కాదు.
నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదివి, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కోసం కూడా దరఖాస్తు చేస్తున్నారు. దాని కన్నా ఏదైనా వ్యాపారం చేసుకుందాం. స్వయం ఉపాధి పొందుదాం అనే ఆలోచన చేయడం లేదు.

ఉద్యోగంలో అంత సౌలభ్యం ఉందా? వ్యాపారం అనేది మనం భయపడేంత రిస్క్‌తో కూడుకున్నదా?
సమస్యలు అనేవి రెండింటిలోనూ ఉంటాయి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మించిన టర్నోవర్‌తో ఉన్న నోకియా కంపెనీ చివరకు అడ్రెస్ లేకుండా పోయింది. మరి అందులో పని చేసే ఉద్యోగుల పరిస్థితి. గతంలో ఒక వెలుగు వెలిగిన ఎన్నో కంపెనీలు మారిన టెక్నాలజీతో తెరమరుగయ్యాయి. హమారా బజాజ్ అంటూ వచ్చే ప్రకటన గుర్తుందా? 90వ దశకంలో బజాజ్ స్కూటర్ కావాలంటే దాదాపు ఏడెనిమిదేళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చేది. బైక్‌లు రాజ్యమేలడంతో స్కూటర్ కొనేవారు లేక తయారీ నిలిపివేశారు. ఇవన్నీ ప్రైవేటు సంస్థలు. ఇక బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ ఉండడం అంటే ఒకప్పుడు సోషల్ స్టేటస్. మధ్యతరగతి వారింట్లో కూడా ఫోన్ కనిపించేది కాదు. దాదాపు పదేళ్లపాటు నిరీక్షిస్తే కానీ ఫోన్ కనెక్షన్ వచ్చేది కాదు. ల్యాండ్ లైన్ కనెక్షన్ కోసం పేరు నమోదు చేయించుకుంటే పదేళ్లకు ఇంట్లో ఫోన్ మోగేది. దాదాపు 90వ దశకం చివరి వరకు ఇదే పరిస్థితి. అలాంటి బిఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లు తీసుకోండి అంటూ రోడ్డు మీద ఉద్యోగులు ర్యాలీ తీస్తుంటే చూసేందుకే బాధేసింది. ల్యాండ్ లైన్ ఫోన్ షిఫ్టింగ్ అనేది ఉద్యోగుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది. బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం అంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. అలాంటి బిఎస్‌ఎన్‌లో కూడా ఇప్పుడు ఉద్యోగాలు అంత భరోసాగా ఏమీ లేదు. టెక్నాలజీ పెరగడం, ప్రైవేటు సంస్థలు దూసుకు వెళ్లడంతో సంస్థకు ఉద్యోగులు భారంగా మారారు. సంస్థ ఉంటుందా? ఉండదా? అనే సందేహం. ప్రైవేటు రంగంలోనే కాదు ఈ రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో సైతం ఉద్యోగం గ్యారంటీ లేదు.
ఐటి కంపెనీలో ఉద్యోగం అంటే రాజాలాంటి బతుకు అనుకుంటారు. పీతకష్టాలు పీతవి అన్నట్టు వారికుండే కష్టాలు వారికున్నాయి. ఏ ఐటి కంపెనీలో ఎప్పుడు బయటకు పంపిస్తారో తెలియదు. వ్యాపారంలో రిస్క్ ఉన్నట్టుగానే ఈ రోజుల్లో ఉద్యోగాల్లో సైతం రిస్క్ ఉంది. వ్యాపారంలో రిస్క్ ఉన్నా ఎదిగే అవకాశం ఉంటుంది. సొంత పని కాబట్టి శ్రద్ధగా చేస్తే శక్తిసామర్థ్యాల మేరకు ఎదిగే అవకాశం ఉంటుంది.
ఐతే హాయిగా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉద్యోగం చేసుకునే వారిని హఠాత్తుగా తీసుకు వచ్చి వ్యాపారంలో కూర్చోబెడితే రెంటికీ కాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది.
జీవించేందుకు ఉద్యోగంలో చేరినా ఆర్థికంగా కొంచెం మెరుగైన స్థితికి చేరుకున్న తరువాత వ్యాపార రంగంలో స్థిరపడి ఎదిగిన వారు ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఆ రంగం గురించి తెలుసుకోకుండా ప్రవేశించవద్దు. ముందు ఆ రంగం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అవకాశం ఉంటే ఏ వ్యాపార రంగంలోకి ప్రవేశించాలి అనుకుంటున్నారో ఆ రంగంలో తొలుత ఉద్యోగంలో చేరడం వల్ల మంచి అనుభవం వస్తుంది. మెళకువలు తెలుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా వ్యాపారంలో కోట్లకు పడగలెత్తిన వారు తొలుత చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ ట్యూషన్లు చెప్పడం ద్వారా అనుభవం గడించిన వారే. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారంలో ఎక్కడికో వెళ్లిన వారు ఒకప్పుడు బట్టల దుకాణాల్లో సాధారణ ఉద్యోగులే.
ఉద్యోగం, వ్యాపారం ఎవరికి ఏది ఆసక్తి ఉంటే ఆ రంగంలోకి వెళ్లవచ్చు. ఐతే ఉద్యోగం అంటే భద్రత ఉంటుంది, వ్యాపారం ఐతే భద్రత ఉండదు అనే భావన తప్పు. చిన్నప్పటి నుంచి మనలో ఏర్పడిన ఈ భావన మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. రెండింటిలోనూ సమస్యలున్నాయి, రెండింటిలోనూ ఎదుగుదలకు అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం, ఓర్పు, ఆశావాహ దృక్పథం, శ్రమించే తత్వం, సవాళ్లను ఎదుర్కొనే శక్తి ఉంటే వ్యాపారానికే మొగ్గు చూపవచ్చు. ఎంత చిన్న స్థాయి నుంచి మొదలు పెట్టినా ఎంత ఉన్నత స్థాయికైనా వెళ్లే అవకాశం వ్యాపార రంగంలో ఉంటుంది.
-బి.మురళి

1, మార్చి 2019, శుక్రవారం

టెర్రరిజంపై కవితా యుద్ధం

‘ఏంటీ అంత సీరియస్‌గా రాసుకుంటున్నావ్’’
‘‘కవిత్వం ’’
‘‘దేనిపై’’
‘‘యుద్ధం పైన’’
‘‘వెరీగుడ్ అలాంటి దుర్మార్గుల పీచమణచాలి. భారత్ సహనాన్ని అలుసుగో తీసుకుని చెలరేగిపోతున్నారు. భారత్ తిరగబడితే, ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలియాలి. మన వీర సైనికులను ఉత్తేజపరుస్తూ కవిత్వం బాగా రాయి. నిజానికి కవిత్వం కూడా యుద్ధం లాంటిదే. మనసులో ఎంతో మదన పడిన తరువాత కానీ అక్షరాలు పురుడు పోసుకోవు...’’
‘‘ఇక ఆపుతావా? నేను మన సైనికుల సాహసాన్ని కీర్తిస్తూ కవిత్వం రాయడం లేదు. నా కవితా శీర్షిక యుద్ధం వద్దు శాంతి ముద్దు’’
‘‘శీర్షిక బాగుంది. ఐనా దేశాల మధ్య యుద్ధాలు, దేశాల్లో టెర్రరిస్టుల దాడులు ఎప్పుడూ ఉండేవే కానీ... మీ పక్కింటి వాళ్లతో ఎప్పుడూ గొడవలే ఉండేవి కదా? మీ రెండు ఇళ్లమధ్య ఉన్న చింత చెట్టు నుంచి గాలికి వాడిపోయిన చింతచిగురు రాలి పడితే మీ వైపు నుంచి అని వాళ్లు, వాళ్ల వైపు నుంచి వచ్చి పడిందని మీరు భలే కొట్టుకునే వారు. సమస్య చిన్నదే అనిపించినా అనుభవించిన వాడికి తెలుస్తుంది. రెండిళ్ల మధ్య గొడవలు అంత ఈజీగా పరిష్కారం కావు. ఎలా పరిష్కరించుకున్నావోయ్! ’’
‘‘మా దూరపు బంధువు ఆవారా అని ఉన్నాడొకడు. పిచ్చి తిరుగుళ్లలో వాడికి పోలీసులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. నా బాధ ఓసారి వాడికి చెప్పుకున్నాను. అంతే హెడ్‌కానిస్టేబుల్ ఓ రోజు మా పక్కింటాయన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిచి తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చి. మళ్లీ నా తెరువు రావద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చింత చిగురు కాదు ఏకంగా చింత చెట్టు పడ్డా నా తెరువు రాడు’’
‘‘మాట్లాడుకుని పరిష్కరించుకుంటే పోయేదానికి పోలీసులతో కొట్టించడం అన్యాయం’’
‘‘అన్యాయమా ? ఆవకాయనా? మన పవర్ ఏంటో చూపించాను. ఇప్పుడు నన్ను చూడాలన్నా వాడికి వణుకు’’
‘‘మన సైనికులపై దాడి చేసి చంపిన టెర్రరిస్టులపై కూడా దయ చూపించాలనే మానవతావాదివైన నీలో కనిపించిన ఇంకో మనిషి ఉన్నాడని అస్సలు ఊహించలేదు’’
‘‘ఇది పొరుగింటి సమస్య. అది పొరుగు దేశంతో సమస్య రెండింటికి సంబంధం లేదు. అందుకే అక్కడి విషయంపై నేను గాంధేయవాదిని, నా పొరుగింటి విషయంలో నా అంతటి రాక్షసుడు లేడు.’’
‘‘సర్లే ఇంతకూ నీ కవితలు ఏ పత్రిక కోసం’’
‘‘ఇప్పటికే నా శాంతి కవిత్వంతో సామాజిక మాధ్యమాల్లో మనకు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.’’
‘‘దాడికి ప్రతి దాడి ఉండాల్సిందే అని వాదించే వారిని నువ్వు శాంతి కవిత్వంతో నోరు మూయించడం చూశాను’’
‘‘అంతే కదా? ఇక్కడ కూర్చోని యుద్ధం యుద్ధం దాడికి ప్రతిదాడి అని వాదిస్తున్న వీరిని యుద్ధ రంగానికి తీసుకు వెళ్లాలి అని నేను రాసిన మాట బాగా పాపులర్ అయింది’’
‘‘నాకో ఐడియా వచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తున్న శిబిరాలపైకి సైన్యం బాంబులు వేయడం కన్నా నీలాంటి మేధావుల బృందాన్ని తీసుకు వెళ్లి అక్కడి వదిలేస్తే’’
‘‘ఆ వదిలేస్తే’’
‘‘మీ శాంతికవితలతో వారి మనసు మారవచ్చు కదా?’’
‘‘మారక పోతే?’’
‘‘వారి మనసు మారితే మొత్తం ప్రపంచానికే అదో వరం అవుతుంది. ప్రపంచంలో టెర్రరిజానికి పెద్ద ఎగుమతి దారునిగా పాక్ మారింది కదా? మీ కవిత్వంతో వారు మారితే మన దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి మీరు మేలు చేసిన వారు అవుతారు.’’
‘‘నేనడిగింది మారకపోతే అని?’’
‘‘మేధావుల భారం దేశానికి తగ్గుతుంది’’
‘‘నేను కవిత్వం రాస్తానని నామీద నీకు జెలసీ. అది సరే ఈ దాడులపై నువ్వేమంటావు’’
‘‘వాడొచ్చి బాంబులు వేసి ఇష్టం వచ్చినట్టు చంపుతూ వెళితే చేతులు కట్టుకుని ఉండమని మాత్రం అనను’’
‘‘చర్చలతో పరిష్కారం కాని సమస్య ఉండదు. టెర్రరిస్టులతో చర్చలు జరపాలి. నచ్చజెప్పాలి. ఒప్పించాలి’’
‘‘ఆరేడు దశాబ్దాలైనా చర్చల ద్వారా ప్రభుత్వం సాధించలేక పోయింది. అందుకే మీ శాంతి కవిత్వ బృందమంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంపునకు వెళ్లి ప్రయత్నించాలి అంటున్నాను. మీకు యాత్ర చేసినట్టూ ఉంటుంది. టెర్రరిస్టుల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడినట్టూ ఉంటుంది.’’
‘‘వాడికి అర్థం కాకుండా మనల్ని లేపేస్తే?’’
‘‘వాడికి అర్థం అయ్యే భాషలో చెప్పాలంటున్నాను. ఓ ఉపన్యాసంలో రజనీష్ ఓ సంఘటన చెప్పారు. విమానంలో ఒక ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్ టికెట్‌తో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కూర్చున్నాడు. ఎయిర్ హోస్టెస్ ఎంత చెప్పినా ఆ సీటు నుంచి లేవలేదు. ఇది గమనించిన రజనీష్ ఆ ప్రయాణీకుడి వద్దకు వెళ్లి ఏదో చెప్పాడు. అతను చెంగున ఈ సీటు నుంచి లేచి వెనక్కి వెళ్లి కూర్చున్నాడు. అంత సేపు నచ్చజెప్పినా వినని ప్రయాణీకుడు ఒక్క మాటతో అలా లేచి వెళ్లడంతో ఎయిర్ హోస్టేస్ మీరేం చెప్పి అతన్ని పంపించారని రజనీష్‌ను అడుగుతుంది. ఎవరికి ఎలాఎవరికి ఎలా చెబితే అర్థం అవుతుందో అలా చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్లాలి అని అడిగాను మద్రాస్ అని చెప్పాడు. మరి ముందు వైపు కూర్చున్నావేం ముందు భాగం ముంబై వెళుతుంది. వెనక భాగం మద్రాస్ వెళుతుంది అని చెప్పాను అంతే ఆ ప్రయాణీకుడు ఎగిరి వెళ్లి వెనక కూర్చున్నాడు. అతనికి అలా చెబితేనే అర్థమవుతుంది అందుకే అలా చెప్పానంటాడు రజనీష్’’
‘‘పొరుగు దేశంలో టెర్రరిజమే రాజ్యం ఏలుతుంది. అది ప్రపంచానికి తెలుసు. టెర్రరిస్టులు చెప్పినట్టు అక్కడి పాలకులు వినాలి కానీ, పాలకులు చెప్పినట్టు టెర్రరిస్టులు వినరు. అందుకే టెర్రరిస్టులకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి.’’
^^ అంటే యుద్ధం చేయాలా ’’
^^ దీని గురించి కూడా రజనీష్ చెప్పారు . దేశాల్లో కూడా స్ర్తీ ,పురుష దేశాలు ఉంటాయి . జర్మనీ పురుష దేశం అలానే యూరప్ లోని చిన్న చిన్న దేశాలు కూడా పురుష దేశాలు . అందుకే అవి యుద్దాలు చేశాయి . భారత్ ది స్త్రీ స్వభావం . అందుకే భారత్ గడచిన ఐదువేల ఏళ్లలో ఏ దేశం పై యుద్ధం చేయలేదు . దాడికి ప్రతి దాడి . చేసింది తప్ప ఆక్రమించుకొందామని దాడులు చేయలేదు .’’
.’’హమ్మయ్య అంటే యుద్ధం జరగదు కదా ?.’’
.’’ఏమో యుద్ధం చేయక పోవచ్చు కానీ .. ఉగ్రవాదుల శిబిరాలను మట్టుపెట్ట వచ్చు.’’ 
‘‘ అంతేలే ... యుద్ధం వద్దు... యుద్ధం వల్ల అపారనష్టం అని రాయబారంలో చెప్పిన శ్రీకృష్ణుడే అంతిమంగా కురుక్షేత్రంలో యుద్ధం చేయను అన్న అర్జునుడితో యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకో చెప్పారు. ఎప్పుడు ఏది అవసరమో నాయకత్వం వహించే వారు నిర్ణయిస్తారు. మనం నిమిత్తమాత్రులం.’’
^^ అంతేలే రోజులు రోజులు ఒకేలా ఉండవు ..ఒక జిల్లా అంతాకూడా లేని దేశాలు ఒకప్పుడు మన దేశాన్ని జయించాయి . కానీ స్వాతంత్య్రం రాకముందు బలహీన భారత్ కావచ్చు కానీ స్వతంత్ర భారత్  అజేయ భారత్ .’’
-బుద్దా మురళి (జనాంతికం 1-3-2019)