1, మార్చి 2019, శుక్రవారం

టెర్రరిజంపై కవితా యుద్ధం

‘ఏంటీ అంత సీరియస్‌గా రాసుకుంటున్నావ్’’
‘‘కవిత్వం ’’
‘‘దేనిపై’’
‘‘యుద్ధం పైన’’
‘‘వెరీగుడ్ అలాంటి దుర్మార్గుల పీచమణచాలి. భారత్ సహనాన్ని అలుసుగో తీసుకుని చెలరేగిపోతున్నారు. భారత్ తిరగబడితే, ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలియాలి. మన వీర సైనికులను ఉత్తేజపరుస్తూ కవిత్వం బాగా రాయి. నిజానికి కవిత్వం కూడా యుద్ధం లాంటిదే. మనసులో ఎంతో మదన పడిన తరువాత కానీ అక్షరాలు పురుడు పోసుకోవు...’’
‘‘ఇక ఆపుతావా? నేను మన సైనికుల సాహసాన్ని కీర్తిస్తూ కవిత్వం రాయడం లేదు. నా కవితా శీర్షిక యుద్ధం వద్దు శాంతి ముద్దు’’
‘‘శీర్షిక బాగుంది. ఐనా దేశాల మధ్య యుద్ధాలు, దేశాల్లో టెర్రరిస్టుల దాడులు ఎప్పుడూ ఉండేవే కానీ... మీ పక్కింటి వాళ్లతో ఎప్పుడూ గొడవలే ఉండేవి కదా? మీ రెండు ఇళ్లమధ్య ఉన్న చింత చెట్టు నుంచి గాలికి వాడిపోయిన చింతచిగురు రాలి పడితే మీ వైపు నుంచి అని వాళ్లు, వాళ్ల వైపు నుంచి వచ్చి పడిందని మీరు భలే కొట్టుకునే వారు. సమస్య చిన్నదే అనిపించినా అనుభవించిన వాడికి తెలుస్తుంది. రెండిళ్ల మధ్య గొడవలు అంత ఈజీగా పరిష్కారం కావు. ఎలా పరిష్కరించుకున్నావోయ్! ’’
‘‘మా దూరపు బంధువు ఆవారా అని ఉన్నాడొకడు. పిచ్చి తిరుగుళ్లలో వాడికి పోలీసులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. నా బాధ ఓసారి వాడికి చెప్పుకున్నాను. అంతే హెడ్‌కానిస్టేబుల్ ఓ రోజు మా పక్కింటాయన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిచి తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చి. మళ్లీ నా తెరువు రావద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చింత చిగురు కాదు ఏకంగా చింత చెట్టు పడ్డా నా తెరువు రాడు’’
‘‘మాట్లాడుకుని పరిష్కరించుకుంటే పోయేదానికి పోలీసులతో కొట్టించడం అన్యాయం’’
‘‘అన్యాయమా ? ఆవకాయనా? మన పవర్ ఏంటో చూపించాను. ఇప్పుడు నన్ను చూడాలన్నా వాడికి వణుకు’’
‘‘మన సైనికులపై దాడి చేసి చంపిన టెర్రరిస్టులపై కూడా దయ చూపించాలనే మానవతావాదివైన నీలో కనిపించిన ఇంకో మనిషి ఉన్నాడని అస్సలు ఊహించలేదు’’
‘‘ఇది పొరుగింటి సమస్య. అది పొరుగు దేశంతో సమస్య రెండింటికి సంబంధం లేదు. అందుకే అక్కడి విషయంపై నేను గాంధేయవాదిని, నా పొరుగింటి విషయంలో నా అంతటి రాక్షసుడు లేడు.’’
‘‘సర్లే ఇంతకూ నీ కవితలు ఏ పత్రిక కోసం’’
‘‘ఇప్పటికే నా శాంతి కవిత్వంతో సామాజిక మాధ్యమాల్లో మనకు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.’’
‘‘దాడికి ప్రతి దాడి ఉండాల్సిందే అని వాదించే వారిని నువ్వు శాంతి కవిత్వంతో నోరు మూయించడం చూశాను’’
‘‘అంతే కదా? ఇక్కడ కూర్చోని యుద్ధం యుద్ధం దాడికి ప్రతిదాడి అని వాదిస్తున్న వీరిని యుద్ధ రంగానికి తీసుకు వెళ్లాలి అని నేను రాసిన మాట బాగా పాపులర్ అయింది’’
‘‘నాకో ఐడియా వచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తున్న శిబిరాలపైకి సైన్యం బాంబులు వేయడం కన్నా నీలాంటి మేధావుల బృందాన్ని తీసుకు వెళ్లి అక్కడి వదిలేస్తే’’
‘‘ఆ వదిలేస్తే’’
‘‘మీ శాంతికవితలతో వారి మనసు మారవచ్చు కదా?’’
‘‘మారక పోతే?’’
‘‘వారి మనసు మారితే మొత్తం ప్రపంచానికే అదో వరం అవుతుంది. ప్రపంచంలో టెర్రరిజానికి పెద్ద ఎగుమతి దారునిగా పాక్ మారింది కదా? మీ కవిత్వంతో వారు మారితే మన దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి మీరు మేలు చేసిన వారు అవుతారు.’’
‘‘నేనడిగింది మారకపోతే అని?’’
‘‘మేధావుల భారం దేశానికి తగ్గుతుంది’’
‘‘నేను కవిత్వం రాస్తానని నామీద నీకు జెలసీ. అది సరే ఈ దాడులపై నువ్వేమంటావు’’
‘‘వాడొచ్చి బాంబులు వేసి ఇష్టం వచ్చినట్టు చంపుతూ వెళితే చేతులు కట్టుకుని ఉండమని మాత్రం అనను’’
‘‘చర్చలతో పరిష్కారం కాని సమస్య ఉండదు. టెర్రరిస్టులతో చర్చలు జరపాలి. నచ్చజెప్పాలి. ఒప్పించాలి’’
‘‘ఆరేడు దశాబ్దాలైనా చర్చల ద్వారా ప్రభుత్వం సాధించలేక పోయింది. అందుకే మీ శాంతి కవిత్వ బృందమంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంపునకు వెళ్లి ప్రయత్నించాలి అంటున్నాను. మీకు యాత్ర చేసినట్టూ ఉంటుంది. టెర్రరిస్టుల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడినట్టూ ఉంటుంది.’’
‘‘వాడికి అర్థం కాకుండా మనల్ని లేపేస్తే?’’
‘‘వాడికి అర్థం అయ్యే భాషలో చెప్పాలంటున్నాను. ఓ ఉపన్యాసంలో రజనీష్ ఓ సంఘటన చెప్పారు. విమానంలో ఒక ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్ టికెట్‌తో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కూర్చున్నాడు. ఎయిర్ హోస్టెస్ ఎంత చెప్పినా ఆ సీటు నుంచి లేవలేదు. ఇది గమనించిన రజనీష్ ఆ ప్రయాణీకుడి వద్దకు వెళ్లి ఏదో చెప్పాడు. అతను చెంగున ఈ సీటు నుంచి లేచి వెనక్కి వెళ్లి కూర్చున్నాడు. అంత సేపు నచ్చజెప్పినా వినని ప్రయాణీకుడు ఒక్క మాటతో అలా లేచి వెళ్లడంతో ఎయిర్ హోస్టేస్ మీరేం చెప్పి అతన్ని పంపించారని రజనీష్‌ను అడుగుతుంది. ఎవరికి ఎలాఎవరికి ఎలా చెబితే అర్థం అవుతుందో అలా చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్లాలి అని అడిగాను మద్రాస్ అని చెప్పాడు. మరి ముందు వైపు కూర్చున్నావేం ముందు భాగం ముంబై వెళుతుంది. వెనక భాగం మద్రాస్ వెళుతుంది అని చెప్పాను అంతే ఆ ప్రయాణీకుడు ఎగిరి వెళ్లి వెనక కూర్చున్నాడు. అతనికి అలా చెబితేనే అర్థమవుతుంది అందుకే అలా చెప్పానంటాడు రజనీష్’’
‘‘పొరుగు దేశంలో టెర్రరిజమే రాజ్యం ఏలుతుంది. అది ప్రపంచానికి తెలుసు. టెర్రరిస్టులు చెప్పినట్టు అక్కడి పాలకులు వినాలి కానీ, పాలకులు చెప్పినట్టు టెర్రరిస్టులు వినరు. అందుకే టెర్రరిస్టులకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి.’’
^^ అంటే యుద్ధం చేయాలా ’’
^^ దీని గురించి కూడా రజనీష్ చెప్పారు . దేశాల్లో కూడా స్ర్తీ ,పురుష దేశాలు ఉంటాయి . జర్మనీ పురుష దేశం అలానే యూరప్ లోని చిన్న చిన్న దేశాలు కూడా పురుష దేశాలు . అందుకే అవి యుద్దాలు చేశాయి . భారత్ ది స్త్రీ స్వభావం . అందుకే భారత్ గడచిన ఐదువేల ఏళ్లలో ఏ దేశం పై యుద్ధం చేయలేదు . దాడికి ప్రతి దాడి . చేసింది తప్ప ఆక్రమించుకొందామని దాడులు చేయలేదు .’’
.’’హమ్మయ్య అంటే యుద్ధం జరగదు కదా ?.’’
.’’ఏమో యుద్ధం చేయక పోవచ్చు కానీ .. ఉగ్రవాదుల శిబిరాలను మట్టుపెట్ట వచ్చు.’’ 
‘‘ అంతేలే ... యుద్ధం వద్దు... యుద్ధం వల్ల అపారనష్టం అని రాయబారంలో చెప్పిన శ్రీకృష్ణుడే అంతిమంగా కురుక్షేత్రంలో యుద్ధం చేయను అన్న అర్జునుడితో యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకో చెప్పారు. ఎప్పుడు ఏది అవసరమో నాయకత్వం వహించే వారు నిర్ణయిస్తారు. మనం నిమిత్తమాత్రులం.’’
^^ అంతేలే రోజులు రోజులు ఒకేలా ఉండవు ..ఒక జిల్లా అంతాకూడా లేని దేశాలు ఒకప్పుడు మన దేశాన్ని జయించాయి . కానీ స్వాతంత్య్రం రాకముందు బలహీన భారత్ కావచ్చు కానీ స్వతంత్ర భారత్  అజేయ భారత్ .’’
-బుద్దా మురళి (జనాంతికం 1-3-2019)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం