7, జనవరి 2023, శనివారం

అధికారం కోసం తెలంగాణ బేరం

 ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ నిర్వహించి తమ్ముళ్ళారా తిరిగి టీడీపీలోకి రండి అంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న రాజకీయం అర్థం చేసుకోవాలి. ఇదేదో ఉబుసుపోక నిర్వహించిన సభ కాదు. తిరిగి రమ్మని పిలుపు ఇచ్చినంత మాత్రాన తమ్ముళ్లు తిరిగి వస్తారు అని అనుకునేంత అమాయకుడేం కాదు బాబు. ఆ సభ వెనుక, ఆ పిలుపు వెనుక బోలెడంత రాజకీయం ఉన్నది.

ఖమ్మం సభ ద్వారా తెలంగాణలో తమ్ముళ్లను రమ్మని పిలిచినప్పటికీ, అసలు ఉద్దేశం మాత్రం ఆంధ్రలో బీజేపీతో పొత్తు కోసమే ఆ పిలుపు. తెలంగాణలో టీడీపీ ఉనికి చూపించి, తెలంగాణలో మా ఓట్లు మీకు కావాలి అంటే జగన్‌ను వదిలేసి ఆంధ్రలో మాతో పొత్తు పెట్టుకోండి అని బీజేపీతో బేరం కోసమే జరిపిన సభ ఇది. ఆంధ్రలో కుల సమీకరణలు, పథకాలతో జగన్‌ బలంగా ఉన్నారు. 2019లో టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. చివరకు కుప్పం మీద కూడా జగన్‌ కన్ను వేశారు. మరోవైపు, పులివెందులలో తమకు డిపాజిట్‌ రాకపోయినా, అభ్యర్థులు లేకపోయినా ఈసారి పులివెందులలో కూడా గెలుస్తాం అని టీడీపీ ప్రతిసారి చెబుతూనే ఉంటుంది. కుప్పంలో కూడా గెలుస్తాం అని జగన్‌ చెప్పడం, టీడీపీ తరహాలో ఏదో ప్రచారం కోసం చెప్పిన మాట కాదు. దానికి పకడ్బందీగా సన్నాహాలు చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీలో వైయస్‌ఆర్‌ పార్టీ విజయం సాధించింది అంటేనే ఆ పార్టీ ప్రయత్నాలు అర్థం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా పోటీ చేస్తే ఏమవుతుందో బాబుకు తెలుసు. అందుకే బలమైన కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ బీజేపీ మిత్రపక్షమే అయినా బాబు డైరెక్షన్‌లోనే పని చేస్తారు. బాబును ఎలాగైనా సీఎంను చేయాలి అనేది పవన్‌ తపన. బాబు కాదు ఈసారి నేను సీఎం అవుతా అని మాటవరుసకు కూడా ఆయన అనటం లేదు. జగన్‌ను మళ్లీ సీఎం కానివ్వను అంటారు కానీ నేను అవుతాను అనడం లేదు. ఆంధ్రాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న కాపులపై పవన్‌ ప్రభావం ఉంటుంది. పవన్‌ ఎలాగూ తన మనిషే. ఇక బీజేపీ అండ కూడా సాధిస్తే గట్టి పోటీ ఇవ్వవచ్చు అనేది బాబు ఆలోచన. జగన్‌ వైపు మొగ్గు చూపుతున్న బీజేపీని తన వైపు తిప్పుకోవడానికి బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ అనేక సార్లు బాబుతో పొత్తు పెట్టుకున్నది. విభజన తరువాత కూడా పొత్తు పెట్టుకొంది. బాబు రాజకీయం బీజేపీకి బాగా తెలుసు. మోదీపై వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతూ బాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లడం బీజేపీ మరిచిపోలేదు. అలా అని ఆయనను బహిరంగంగా వ్యతిరేకించడం లేదు.

ఎందుకంటే, ఆంధ్రలో జగన్‌, బాబుల్లో ఎవరు గెలిచినా మద్దతు ఇచ్చేది తమకే అని బీజేపీకి తెలుసు. అయితే విజయావకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటే వారి వైపు ఉండాలి అనేది బీజేపీ ఆలోచన. దీనిని గ్రహించే చంద్రబాబు.. జగన్‌తో కన్నా తమతో కలువడం వల్ల ఎక్కువ ప్రయోజనం అని బీజేపీకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్‌ వైపు ఉండాలనుకుంటే ఆయనతో బహిరంగంగా పొత్తు పెట్టుకోవలసిన అవసరం బీజేపీకి లేదు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే జగన్‌ పార్టీకి లాభం కన్నా నష్టం ఎక్కువ. ఎన్నికల తర్వాత వైయస్‌ఆర్‌ పార్టీ ఎంపీల మద్దతు బీజేపీకి చాలు. అంతేకానీ ఎన్నికలకు ముందే సీట్ల ఒప్పందం అవసరం లేదు. అదే టీడీపీతో ఐతే సీట్ల సర్దుబాటు కూడా ఉంటుంది. ఈ విధంగా బీజేపీ లెక్కలు బీజేపీకి ఉంటాయి. అటు బాబు అయినా ఇటు జగన్‌ అయినా బీజేపీకి ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు. ఎవరితో కలిస్తే ఎక్కువ లాభం అనే లెక్కలు ఆ పార్టీకి ముఖ్యం. ఇప్పటి లెక్కల ప్రకారం బీజేపీకి జగన్‌తోనే ఎక్కువ లాభం. కానీ, టీడీపీతో కలిస్తేనే ఎక్కువ లాభం అని నమ్మించాలి అనేది చంద్రబాబు ప్రయత్నం. దాంట్లో భాగంగానే తెలంగాణను బేరం పెట్టాలి అనేది ఆయన ప్రయత్నం. దాని కోసమే ఖమ్మంలో టీడీపీ సభ, తమ్ముళ్ళకు తిరిగి రావాలి అనే పిలుపు.

బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలి అని కలలు కంటున్నది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి అనే ప్రయత్నం బెడిసి కొట్టి బ్రోకర్ల వీడియోలు బయటకు రావడం వల్ల జాతీయ స్థాయిలో బీజేపీ పరువు పోయింది. ఇదే సరైన సమయం అని భావించిన చంద్రబాబు తెలంగాణపై కన్నేశారు. తమతో పొత్తు పెట్టుకొంటే తెలంగాణలో బీజేపీకి ప్రయోజనం అని బాబు ఆ పార్టీకి సందేశం ఇస్తున్నారు. ఆంధ్రలో బీజేపీ, పవన్‌లతో పొత్తు కోసం బాబు తెలంగాణలో లేని టీడీపీని బేరం పెట్టారు. విభజన జరిగి ఎనిమిదేండ్లు అయినా చంద్రబాబు నాయుడికి తెలంగాణను తెగనమ్మాలి అనే ఆలోచన పోలేదు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపిన తర్వాతనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాను అని పట్టుబట్టి మోదీ ఏడు మండలాలు కలిపిన తర్వాతే పదవి చేపట్టాను అని బహిరంగంగానే చెబుతున్నారు.

2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు ఆంధ్రలో విజయం సాధించేందుకు బీసీ ఓట్ల కోసం తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్యను ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటో బాబుకు బాగా తెలుసు. కానీ ఆంధ్రలో గెలుపు కోసం తెలంగాణలో బీసీ సీఎం అనే నినాదం. చివరకు ఆంధ్రలో తన భవిష్యత్తు కోసం తెలంగాణ టీడీపీ నాయకుల రాజకీయ జీవితాన్ని కూడా బాబు పణంగా పెట్టారు. ఆంధ్రలో జరిగిన టీడీపీ మహానాడులో తెలంగాణ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా తెలంగాణ టీడీపీ నాయకులతో ఉపన్యాసాలు, తీర్మానాలు చేయించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం తెలంగాణ టీడీపీ నేతలతో బాబు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడించి, వారి రాజకీయ భవిష్యత్తుతో ఆటలాడుకున్నారు. మరోసారి ఆంధ్రలో తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణను అమ్మకానికి పెట్టి, తమ్ముళ్ల రాజకీయ జీవితాన్ని సైతం తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

2018 ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని తెలుగు ఎల్లో మీడియా హడావుడి చేసింది. కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే టీడీపీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. తిరిగి బాబు మీడియా ఖమ్మం సభ ద్వారా బాబుకు తెలంగాణలో ఉనికి ఉన్నదని భ్రమలు కల్పిస్తున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బాబు, లోకేష్‌ విస్తృతంగా ప్రచారం చేస్తే, 150 డివిజన్లు ఉంటే టీడీపీ గెలిచింది ఒకే ఒక డివిజన్‌. బాబు వ్యవహారం తెలిసిన తర్వాత తెలంగాణలో టీడీపీ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. మాది కర్ణ, దుర్యోధన సంబంధం అని టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. బాబు ఆంధ్రకు వెళ్ళాక రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరారు.

అలాంటి రేవంత్‌ కూడా తిరిగి రాడు, తెలుగు తమ్ముళ్లు ఎవరూ తిరిగి రారు అనే విషయం బాబుకు బాగా తెలుసు. ఐతే తెలంగాణలో బీజేపీ అవసరాన్ని గ్రహించి బీజేపీతో ఆంధ్రలో పొత్తు కోసం బాబు తెలంగాణను అమ్మకానికి పెట్టారు. బాబు గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణలో లేని పార్టీని అమ్మకానికి పెట్టిన బాబు వ్యాపారి ఐతే, బీజేపీ దేశమంతా వ్యాపారం చేసే గుజరాతీ వ్యాపారి. వ్యాపారంలో వారిది అందెవేసిన చేయి. బాబు అమ్మకానికి పెట్టినా కొనేంత అమాయక వ్యాపారి కాదు బీజేపీ. అయినా ఇంకా ఏడాది సమయం ఉంది. ఏమైనా జరుగవచ్చు అని బాబు ఆంధ్ర కోసం తెలంగాణను బీజేపీకి అమ్మకానికి పెట్టారు.

– బుద్దా మురళి

అవేం ప్రశ్నలు? ఇవేం అనుమానాలు?

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రకు చెందిన కొందరు మాజీ అధికారులు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఈ చేరికల తర్వాత తెలంగాణ, ఆంధ్రలోని పలు పార్టీల నాయకుల నుంచి చిత్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీల నాయకుల నుంచి అనుమానాలు, సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణవాదం ఇక ముగిసినట్టేనా? రెండు రాష్ర్టాలను కలుపుతారా? ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇప్పిస్తారా? అని కొందరు మేధావులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆంధ్ర మంత్రులతోపాటు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు విచిత్ర వాదన వినిపించారు. కేసీఆర్‌ వల్లనే రాష్ట్ర విభజన, ఆంధ్రకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ఆంధ్ర కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు సంగతి తేల్చాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. వాళ్ల డిమాండ్‌ వింటుంటే కేంద్రంలో ఉన్నది మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమా? కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమా? అనే అనుమానం వస్తున్నది.

ఆంధ్రలో మూడు బలమైన రాజకీయ పక్షాలున్నాయి. అవి అధికారంలో ఉన్న వైస్సార్‌సీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, సినీ గ్లామర్‌ ఉన్న జనసేన. సాధారణంగా ఒక పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉంటే మిగిలిన రెండు పార్టీలు బీజేపీని వ్యతిరేకించాలి. కానీ ఆంధ్రలో ఉన్న విచిత్ర రాజకీయాల వల్ల బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఈ మూడు పార్టీలూ పోటీ పడుతున్నాయి. బీజేపీకి అంత బలం ఉన్నదా.. పోటీ పడి మద్దతు ఇవ్వడానికి అంటే.. ఆంధ్రలో బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనే ప్రత్యేకత తప్ప. తాను వదిలేస్తే బాబు బీజేపీకి చేరువవుతాడనేది జగన్‌ భయం.

జగన్‌ను బీజేపీకి దూరం జరిపి తానూ చేరువ కావాలనేది బాబు వ్యూహం. ఇక పవన్‌ అయితే ఏకంగా తన సొంత పార్టీ కార్యక్రమాలకు సైతం బీజేపీ రూట్‌మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. బీజేపీ ఈ మూడు పార్టీలను ఆటాడిస్తూ ఆంధ్రకు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నది. ఆంధ్రలో బీజేపీకి పెద్ద గా ఉనికి లేదు, తీవ్రంగా ప్రయత్నిస్తే సీట్లు వచ్చే అవకాశం ఉన్నదా అంటే అదీ లేదు. పోనీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయపక్షాల నుంచి హామీల అమలుకు ఒత్తిడి వస్తున్నదా? అంటే అదీ లేదు.

బీజేపీ ఇక దేనికి భయపడాలి. కేంద్రంలో సొంత బలంతో మోదీ అధికారంలోకి వచ్చిన రోజే, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలకు నీళ్లు వదులుకోవాల్సి వచ్చింది. ఇదే అంశాన్ని జగన్‌ సూచనప్రాయంగా అప్పుడే చెప్పారు. ‘బీజేపీ సొంత బలంతో వచ్చింది. మనకు హోదా రాకుండా పోయింది. ఏం చేస్తాం’ అన్నారు. హేమాహేమీలైన మూడు పార్టీల నాయకులను వదిలేసి, ఏపీలో ఇప్పుడే పురుడు పోసుకున్న బీఆర్‌ఎస్‌ ప్రత్యేక హోదాకు, విభజన చట్టం హామీలకు బాధ్యత వహించాలట, ఇప్పించాలట.

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ‘అన్నాదమ్ముల్లా విడిపోదాం, రెండు రాష్ర్టాల్లో అభివృద్ధి సాధిద్ధాం’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. విభజన సమయంలో ‘పార్లమెంట్‌లో హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని’ పార్లమెంట్‌లోనే కవిత డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ అనేకసార్లు విలేకరుల సమావేశాల్లో ‘హోదా ఇవ్వాలి. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

కేంద్రం నుంచి తెలంగాణకు, ఆంధ్రకు రావలసిన వాటిపై కేసీఆర్‌ మొదటినుంచి స్పష్టతతో ఉన్నారు. రెండు రాష్ర్టాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్‌ హైదరాబాద్‌లోనైనా, ఆంధ్రలోనైనా ఒకేరకంగా మాట్లాడగలరు. మాట్లాడే పరిస్థితి ఉన్నది. తప్పించుకోవలసిన అవసరం కేసీఆర్‌కు లేదు. ఆంధ్రలో ఉన్న మూడు రాజకీయపక్షాలకు కేంద్రాన్ని డిమాండ్‌ చేయడంలో ఇబ్బందులు ఉండవచ్చు, కేసీఆర్‌కు అలాంటి ఇబ్బందులేమీ లేవు.

శాసనసభ్యులను కొనడానికి వచ్చిన బ్రోకర్లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని బీజేపీ ‘నెంబర్‌ త్రీ’ గురించి కూడా అందరికీ తెలిసేట్టు చేసి బీజేపీని ధైర్యంగా ఎదుర్కొంటున్న వ్యక్తి కేసీఆర్‌. అలాంటి వ్యక్తి విభజన హామీల గురించి మాట్లాడేందుకు ఎందుకు భయపడుతారు? రెండు రాష్ర్టాలం కలిసి పోరాడుదాం, కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని ఆంధ్ర నేత లు మాట్లాడితే బాగుండేది. కేంద్రంలోని బీజేపీపై అంతో ఇంతో ధిక్కార స్వరం దక్షిణాది నుంచే వినిపిస్తున్నది.

తమ తమ రాష్ర్టాలకు కేంద్రం వల్ల జరుగుతున్న అన్యాయాలపై రెండు రాష్ర్టాలు ఉమ్మడిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ అనే ఆలోచన రాకముందే ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, వివిధ సంఘాలవారు ‘కేసీఆర్‌ ప్రయత్నిస్తే ఆంధ్రకు ప్రత్యేక హోదా వస్తుంది, ప్రయత్నించాలని’ డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ చేసినవారి సంఖ్య స్వల్పమే కావచ్చు, మోదీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చినందున డిమాండ్‌ చేసినా హోదా ఇచ్చేవారు కాదేమో, కానీ కేసీఆర్‌ తలచుకుంటే సాధ్యమవుతుందనే అభిప్రాయం అప్పుడు సాధారణ ప్రజల్లో వ్యక్తమైంది.

బీఆర్‌ఎస్‌పై ఆంధ్ర నాయకుల విమర్శలు అలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ సహా పలు పార్టీల నాయకులూ ఇలాంటి చిత్రమైన వాదనలే వినిపించారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టి ఆంధ్రలో కూడా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నందున తెలంగాణవాదం ఉనికి కోల్పోయిందనేది వారి వాదన. వారి వాదన ఎలా ఉన్నా కేసీఆర్‌తోనే తెలంగాణవాదం అని వారు ఇప్పటికీ అనుకుంటున్నారనేది వారి ప్రకటన తెలుపుతున్నది.

బీజేపీ ఒక జాతీయ పార్టీ, మోదీ ఆ పార్టీ తరఫున ప్రధానిగా ఎన్నికయ్యా రు. ఇటీవల తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎన్నికలు జరిగితే గుజరాత్‌ ఆత్మగౌరవం అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధాని అని కాకుండా గుజరాత్‌ సీఎం తరహాలో మోదీ ప్రచారం సాగింది. విజయం సాధించారు కూడా. ప్రధానే గుజరాత్‌ సీఎం అభ్యర్థి స్థాయిలో ప్రచారం చేస్తే, ఒక ప్రాంతీయ పార్టీ తరఫున పోటీ చేసే కేసీఆర్‌ తెలంగాణను ఎలా వదిలేస్తారు.

టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత, ఇటీవలే ఉపాధి హామీ పథకం కింద రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునే కల్లాలు నిర్మిస్తే కేంద్రం రాష్ర్టానికి జరిమానా విధించింది. దీనిపై ఆందోళన చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీనే. ఉపాధి నిధులతో కల్లాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది. టీఆర్‌ఎస్‌ అయినా బీఆర్‌ఎస్‌ అయినా పేరు ఏదైతేనేం తెలంగాణ గురించి ఉద్యమించేది మేమే అని ఆ పార్టీ నిరూపిస్తుంటే, ప్రత్యర్థుల విమర్శలు కూడా దాన్ని సమర్థించే విధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ను మించి ఉద్యమిస్తామనే ఆలోచన ఉండాలి కానీ తెలంగాణకు అన్యాయం జరిగే విషయాల్లో కేంద్రానికి మద్దతు ఇస్తే ఎవరికి నష్టం?.
(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌)

బుద్దా మురళి

<

ఎమర్జెన్సీని మించిన రోజులు

 చరిత్రలోకి వెళ్తే ఛంఘిజ్‌ఖాన్‌ లాంటి దుర్మార్గుడు పాశవికంగా, ఆటవికంగా దాడులు చేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ రాజ్యాలను జయించడం చదువుతుంటే ఒళ్లు జలదరిస్తుంది. రాజ్యం కోసం తల్లి తండ్రి, సోదరుడు, దాయాదులనే కనికరం లేకుండా రాజ్యవిస్తరణ మాత్రమే న్యాయం అనుకునే పాలకులు చరిత్రలో ఎంతోమంది కనిపిస్తారు. ప్రజాస్వామ్యంలో వీరికి చోటులేదు. కానీ నయా నియంతలు అధికారం కోసం వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చుకొని ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారు. మీ ప్రభుత్వాన్ని పడగొడతానని బహిరంగసభలో ప్రధాని ప్రకటించడం స్వతంత్ర భారతచరిత్రలో ఇదే తొలిసారి.

పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు తన సొంత రాష్ట్రమైన ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నది. ఐటీ భవిష్యత్తును, అనుకూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బెంగళూరు, హైదరాబాద్‌లలో ఐటీ అభివృద్ధికి ఆయన చర్యలు తీసుకున్నారు కానీ, మీ ప్రభుత్వాన్ని పడగొడతాం, మా ప్రభుత్వాన్ని తెస్తామని ప్రకటించలేదు. కానీ మోదీ మాత్రం పశ్చిమబెంగాల్‌ వెళ్లినా, తెలంగాణకు వచ్చినా మీ ప్రభుత్వాన్ని పడగొడతామని బహిరంగసభలలో హెచ్చరిస్తున్నారు.

వాజపేయి ప్రధానిగా పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు ఒకే ఒక్క ఓటు తేడా తో ప్రభుత్వం నుంచి దిగిపోయారు. ఆ ఒక్క ఓటు కూడా అనైతికమైనదే. ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ ఎంపీగా గిరిధర్‌ గొమాంగో తన ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఒకే ఒక ఓటుతో 1999లో వాజపేయి ప్రభుత్వం పడిపోయింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తలుచుకుంటే ఒకటి రెండు ఓట్ల సర్దుబాటు అంత కష్టమేం కాదు, అంతకుముందు చాలాసార్లు అలా సర్దుబాట్లు జరిగాయి. కానీ విలువలకు కట్టుబడి ఉన్న వాజపేయి అడ్డదారుల్లో అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ, ఆ బీజేపీ ఇప్పుడు లేదు. విలువలకు పూర్తిగా తిలోదకాలిచ్చి ఛంఘిజ్‌ఖాన్‌ పాశవిక దాడులను గుర్తుచేస్తూ రాష్ర్టాలను కబళిస్తున్నది. గెరిల్లా దాడులకు పాల్పడుతున్నది. మా వైపు ఉంటే సరి, లేదంటే ప్రభుత్వాలను పడగొడతామని నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నది.

నాలుగు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా అత్యవసరకాలం నాటి చీకటిరోజులు అంటూ మీడియా తద్దినపు వ్యాసాలను వండి వారుస్తున్నది. అయితే ఇప్పటి అప్రకటిత ఎమర్జెన్సీ అంతకన్నా భయంకరంగా ఉన్నా నోరు మెదపలేని పరిస్థితి. ఎమర్జెన్సీలో మీడియాపై ఆంక్షలు విధించినా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లాంటి పత్రికలు ధైర్యంగా పోరాడాయి. పలు పత్రికలు ఆంక్షలకు వ్యతిరేకంగా సంపాదకీయం స్థలాన్ని ఏమీ రాయకుండా వదిలేసి నిరసన వ్యక్తం చేసేవి. ఇప్పుడు అలాంటి నిరసనలకు అవకాశమే లేదు. ఎన్‌డీటీవీ ఛానల్‌ బీజేపీకి నచ్చలేదు. ధైర్యంగా ఆ ఛానల్‌ అభిప్రాయాలు వ్యక్తం చేసేది. బెదిరించాల్సిన అవసరం లేదు, ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు. గుట్టుచప్పుడు కాకుండా ఆ ఛానల్‌ను కొనేస్తే చాలు. ఇప్పుడు మోదీ బీజేపీ అమలుచేస్తున్న సరికొత్త అత్యవసర పరిస్థితి ఇది. ఎన్‌డీటీవీని అప్పటివరకు నిర్వహిస్తున్న వారు విస్తుపోయారు. మాకు తెలియకుండా ఎలా కొంటారని ప్రశ్నించారు. అదానీ ఈ ఛానల్‌ను హస్తగతం చేసుకున్నారు. మోదీ అదానీలది విడదీయరాని బంధం. చివరికి శ్రీలంక అధికారులపై కూడా అదానీ కోసం మోదీ ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని శ్రీలంక అధికారే బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత ఏం ఒత్తిడి వచ్చిందో కానీ ఆ ప్రకటన ఉపసంహరించుకున్నారు.

విలువల గురించి మాట్లాడే బీజేపీ అసలు స్వరూపాన్ని తెలంగాణ దేశానికి చూపింది. తెలుగు మీడియా ఎక్కువగా ఆంధ్ర మూలాలతో ఉండటం, ఆంధ్రలో ప్రధాన పార్టీలు మూడు బీజేపీ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తుండడం వల్ల ఆ ఆడియో, వీడియోలకు తెలుగు మీడియా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా దేశవ్యాప్తంగా ఈ సాక్ష్యాలు బాగానే ప్రభావం చూపాయి.

ఇప్పుడున్నది బీజేపీ కాదు. ఇది మోదీ బీజేపీ. వందల కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేలను కొనడానికి సిద్ధం. 8 రాష్ర్టాల్లో బీజేపీ అలానే అధికారంలోకి వచ్చింది. అటు ఢిల్లీలో కేజ్రీవాల్‌, ఇటు దక్షిణాదిలో కేసీఆర్‌ బీజేపీ కొనుగోళ్ల వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. తమ పార్టీ శాసనసభ్యులకు కోట్ల రూపాయలు ఇస్తామని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్‌ చేసిందని కేజ్రీవాల్‌ ఆరోపించినా మీడియా అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు, మధ్యవర్తుల చర్చల తాలూకు ఆడియో, వీడియో సాక్ష్యం లభించడంతో దేశం విస్తుపోయింది. విలువల గురించి మాట్లాడే బీజేపీ అసలు స్వరూపాన్ని తెలంగాణ దేశానికి చూపింది. తెలుగు మీడియా ఎక్కువగా ఆంధ్ర మూలాలతో ఉండటం, ఆంధ్రలో ప్రధాన పార్టీలు మూడు బీజేపీ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తుండడం వల్ల ఆ ఆడియో, వీడియోలకు తెలుగు మీడియా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా దేశవ్యాప్తంగా ఈ సాక్ష్యాలు బాగానే ప్రభావం చూపాయి. ఎన్‌డీటీవీ ఢిల్లీలో నిర్వహించిన ఒక సదస్సులో మీ ఆరోపణలకు ఆధారాలేమిటి? అని ఒక రిపోర్టర్‌ అడిగితే, తెలంగాణ బయటపెట్టిన ఆడియో, వీడియోల్లో.. ఢిల్లీలో కూడా కొంటున్నామని బీజేపీ మధ్యవర్తులు చెప్పారని కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఒక కేసులో ఈ సాక్ష్యాలను ప్రస్తావించారు.

ఇంత సువిశాలమైన దేశాన్ని పాలించేందుకు మోదీకి వరుసగా రెండుసార్లు అవకాశం దక్కిం ది. ఎనిమిదేండ్లలో ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఏమీ లేక మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు సాధించాలని, శాసనసభ్యులను కొని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారు. అభివృద్ధి చేయడం, హామీ ఇచ్చినట్టు కోట్లాది ఉద్యోగాలు ఇవ్వడం, విదేశాల నుంచి నల్లధనం వెనక్కి తేవడం, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేయడం కష్టం, కానీ మతాల మధ్య చిచ్చుపెట్టి గెలవడం సులభమని మోదీ నాయకత్వంలోని నయా బీజేపీ భావిస్తున్నది. ఇవి అత్యంత ప్రమాదకరమైన రాజకీయాలు. తా త్కాలికంగా మోదీకి ఈ రాజకీయాలు ప్రయోజనం కలిగించవచ్చు కానీ, దీర్ఘకాలికంగా దేశానికి చేటు చేస్తాయి. ప్రజల భవిష్యత్తు అంధకార మవుతుంది. బీజేపీకి కలిగే ప్రయోజనాలు చూ సుకుంటున్నారు కానీ దేశానికి కలిగే ప్రమాదాన్ని చూడటం లేదు.
(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌)

-బుద్ధా మురళి