చరిత్రలోకి వెళ్తే ఛంఘిజ్‌ఖాన్ లాంటి దుర్మార్గుడు పాశవికంగా, ఆటవికంగా దాడులు చేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ రాజ్యాలను జయించడం చదువుతుంటే ఒళ్లు జలదరిస్తుంది. రాజ్యం కోసం తల్లి తండ్రి, సోదరుడు, దాయాదులనే కనికరం లేకుండా రాజ్యవిస్తరణ మాత్రమే న్యాయం అనుకునే పాలకులు చరిత్రలో ఎంతోమంది కనిపిస్తారు. ప్రజాస్వామ్యంలో వీరికి చోటులేదు. కానీ నయా నియంతలు అధికారం కోసం వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చుకొని ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారు. మీ ప్రభుత్వాన్ని పడగొడతానని బహిరంగసభలో ప్రధాని ప్రకటించడం స్వతంత్ర భారతచరిత్రలో ఇదే తొలిసారి.
పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు తన సొంత రాష్ట్రమైన ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నది. ఐటీ భవిష్యత్తును, అనుకూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బెంగళూరు, హైదరాబాద్‌లలో ఐటీ అభివృద్ధికి ఆయన చర్యలు తీసుకున్నారు కానీ, మీ ప్రభుత్వాన్ని పడగొడతాం, మా ప్రభుత్వాన్ని తెస్తామని ప్రకటించలేదు. కానీ మోదీ మాత్రం పశ్చిమబెంగాల్ వెళ్లినా, తెలంగాణకు వచ్చినా మీ ప్రభుత్వాన్ని పడగొడతామని బహిరంగసభలలో హెచ్చరిస్తున్నారు.
వాజపేయి ప్రధానిగా పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు ఒకే ఒక్క ఓటు తేడా తో ప్రభుత్వం నుంచి దిగిపోయారు. ఆ ఒక్క ఓటు కూడా అనైతికమైనదే. ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ ఎంపీగా గిరిధర్ గొమాంగో తన ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఒకే ఒక ఓటుతో 1999లో వాజపేయి ప్రభుత్వం పడిపోయింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తలుచుకుంటే ఒకటి రెండు ఓట్ల సర్దుబాటు అంత కష్టమేం కాదు, అంతకుముందు చాలాసార్లు అలా సర్దుబాట్లు జరిగాయి. కానీ విలువలకు కట్టుబడి ఉన్న వాజపేయి అడ్డదారుల్లో అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ, ఆ బీజేపీ ఇప్పుడు లేదు. విలువలకు పూర్తిగా తిలోదకాలిచ్చి ఛంఘిజ్‌ఖాన్ పాశవిక దాడులను గుర్తుచేస్తూ రాష్ర్టాలను కబళిస్తున్నది. గెరిల్లా దాడులకు పాల్పడుతున్నది. మా వైపు ఉంటే సరి, లేదంటే ప్రభుత్వాలను పడగొడతామని నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నది.
నాలుగు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా అత్యవసరకాలం నాటి చీకటిరోజులు అంటూ మీడియా తద్దినపు వ్యాసాలను వండి వారుస్తున్నది. అయితే ఇప్పటి అప్రకటిత ఎమర్జెన్సీ అంతకన్నా భయంకరంగా ఉన్నా నోరు మెదపలేని పరిస్థితి. ఎమర్జెన్సీలో మీడియాపై ఆంక్షలు విధించినా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లాంటి పత్రికలు ధైర్యంగా పోరాడాయి. పలు పత్రికలు ఆంక్షలకు వ్యతిరేకంగా సంపాదకీయం స్థలాన్ని ఏమీ రాయకుండా వదిలేసి నిరసన వ్యక్తం చేసేవి. ఇప్పుడు అలాంటి నిరసనలకు అవకాశమే లేదు. ఎన్‌డీటీవీ ఛానల్ బీజేపీకి నచ్చలేదు. ధైర్యంగా ఆ ఛానల్ అభిప్రాయాలు వ్యక్తం చేసేది. బెదిరించాల్సిన అవసరం లేదు, ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు. గుట్టుచప్పుడు కాకుండా ఆ ఛానల్‌ను కొనేస్తే చాలు. ఇప్పుడు మోదీ బీజేపీ అమలుచేస్తున్న సరికొత్త అత్యవసర పరిస్థితి ఇది. ఎన్‌డీటీవీని అప్పటివరకు నిర్వహిస్తున్న వారు విస్తుపోయారు. మాకు తెలియకుండా ఎలా కొంటారని ప్రశ్నించారు. అదానీ ఈ ఛానల్‌ను హస్తగతం చేసుకున్నారు. మోదీ అదానీలది విడదీయరాని బంధం. చివరికి శ్రీలంక అధికారులపై కూడా అదానీ కోసం మోదీ ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని శ్రీలంక అధికారే బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత ఏం ఒత్తిడి వచ్చిందో కానీ ఆ ప్రకటన ఉపసంహరించుకున్నారు.
విలువల గురించి మాట్లాడే బీజేపీ అసలు స్వరూపాన్ని తెలంగాణ దేశానికి చూపింది. తెలుగు మీడియా ఎక్కువగా ఆంధ్ర మూలాలతో ఉండటం, ఆంధ్రలో ప్రధాన పార్టీలు మూడు బీజేపీ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తుండడం వల్ల ఆ ఆడియో, వీడియోలకు తెలుగు మీడియా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా దేశవ్యాప్తంగా ఈ సాక్ష్యాలు బాగానే ప్రభావం చూపాయి.
ఇప్పుడున్నది బీజేపీ కాదు. ఇది మోదీ బీజేపీ. వందల కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేలను కొనడానికి సిద్ధం. 8 రాష్ర్టాల్లో బీజేపీ అలానే అధికారంలోకి వచ్చింది. అటు ఢిల్లీలో కేజ్రీవాల్, ఇటు దక్షిణాదిలో కేసీఆర్ బీజేపీ కొనుగోళ్ల వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. తమ పార్టీ శాసనసభ్యులకు కోట్ల రూపాయలు ఇస్తామని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించినా మీడియా అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు, మధ్యవర్తుల చర్చల తాలూకు ఆడియో, వీడియో సాక్ష్యం లభించడంతో దేశం విస్తుపోయింది. విలువల గురించి మాట్లాడే బీజేపీ అసలు స్వరూపాన్ని తెలంగాణ దేశానికి చూపింది. తెలుగు మీడియా ఎక్కువగా ఆంధ్ర మూలాలతో ఉండటం, ఆంధ్రలో ప్రధాన పార్టీలు మూడు బీజేపీ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తుండడం వల్ల ఆ ఆడియో, వీడియోలకు తెలుగు మీడియా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా దేశవ్యాప్తంగా ఈ సాక్ష్యాలు బాగానే ప్రభావం చూపాయి. ఎన్‌డీటీవీ ఢిల్లీలో నిర్వహించిన ఒక సదస్సులో మీ ఆరోపణలకు ఆధారాలేమిటి? అని ఒక రిపోర్టర్ అడిగితే, తెలంగాణ బయటపెట్టిన ఆడియో, వీడియోల్లో.. ఢిల్లీలో కూడా కొంటున్నామని బీజేపీ మధ్యవర్తులు చెప్పారని కేజ్రీవాల్ గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఒక కేసులో ఈ సాక్ష్యాలను ప్రస్తావించారు.
ఇంత సువిశాలమైన దేశాన్ని పాలించేందుకు మోదీకి వరుసగా రెండుసార్లు అవకాశం దక్కిం ది. ఎనిమిదేండ్లలో ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఏమీ లేక మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు సాధించాలని, శాసనసభ్యులను కొని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారు. అభివృద్ధి చేయడం, హామీ ఇచ్చినట్టు కోట్లాది ఉద్యోగాలు ఇవ్వడం, విదేశాల నుంచి నల్లధనం వెనక్కి తేవడం, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేయడం కష్టం, కానీ మతాల మధ్య చిచ్చుపెట్టి గెలవడం సులభమని మోదీ నాయకత్వంలోని నయా బీజేపీ భావిస్తున్నది. ఇవి అత్యంత ప్రమాదకరమైన రాజకీయాలు. తా త్కాలికంగా మోదీకి ఈ రాజకీయాలు ప్రయోజనం కలిగించవచ్చు కానీ, దీర్ఘకాలికంగా దేశానికి చేటు చేస్తాయి. ప్రజల భవిష్యత్తు అంధకార మవుతుంది. బీజేపీకి కలిగే ప్రయోజనాలు చూ సుకుంటున్నారు కానీ దేశానికి కలిగే ప్రమాదాన్ని చూడటం లేదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-బుద్ధా మురళి