27, ఆగస్టు 2023, ఆదివారం
మజ్జిగ ప్యాకెట్ .. నీళ్ల బాటిల్ లోనూ రాజకీయం ఉంటుంది ....జర్నలిస్ట్ జ్ఞాపకాలు -86
డాక్టర్స్ హెల్త్ క్యాంపు అంటే .. ఏ నియోజకవర్గం అనడిగాను ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -86
వీళ్ళిద్దరూ డాక్టర్స్ పార్టీ శిక్షణా శిబిరాల్లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు అని పరిచయం చేయగానే , ఒక్క క్షణం కూడా ఆగకుండా .. ఏ నియోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని ప్రశ్నించగానే ఆ డాక్టర్ జంట బిత్తర పోయింది . చూసే కనులు , ఆలోచించే మెదడు ఉండాలి కానీ రాజకీయాల్లో సినిమాలను మించిన నాటకాలు కనిపిస్తాయి . ఇక్కడ రిహార్సల్స్ ఉండవు , కట్ చెప్పే డైరెక్టర్ ఉండరు , మేకప్ వేసేవారు ఉండరు , డైలాగులు రాసే రైటర్ ఉండరు . అంతా తామే సిద్ధం చేసుకొని తామే నటించాలి . అది నటన కాదు సహజం అనిపించేలా నటనలో జీవించాలి . అలా జీవించారు కాబట్టే విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే కాకుండా స్వయంగా దర్శకుడు కూడా అయిన ఎన్టీఆర్ బాబు నటనలో జీవిస్తే గ్రహించలేక పోయాను అన్నారు . .
తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ పేర్లు ఉంటే , తమిళ డబ్బింగ్ తెలుగు సినిమాలకు చక్కని తెలుగు పేర్లు ఉన్నట్టు ... కొందరి నటన పేలవంగా ఉంటుంది. షర్మిల మాట్లాడితే తెలంగాణ అంటే అచ్చం డబ్బింగ్ సినిమాకు అమలాపురం బుల్లోడు , సీమ వీరుడు అని టైటిల్ లా ఉంటుంది . సీమ మీద ప్రేమతో ఆ సినిమా చూస్తే తమిళ గ్రామాలు , తమిళ బోర్డు లు ఉంటాయి . తమిళ పత్రికలను తెలుగులో చదువుతుంటారు . రాజకీయాల్లో డబ్బింగ్ సినిమాలు నడిచినట్టు చరిత్ర లేదు .
*****
కరోనా సమయంలో మా అబ్బాయి మెదక్ జిల్లాలో సేవా కార్యక్రమాలు చేశారు టికెట్ ఇవ్వరా ? అని మైనం పల్లి హనుమంతరావు గట్టిగా ప్రశ్నిస్తున్నారు . నాకు టికెట్ ఇచ్చారు సరే మా అబ్బాయికి ఇవ్వాలి అనేది అయన డిమాండ్ . కరోనాలో తన కుమారుడి సేవ గురించి ప్రస్తావించి టికెట్ డిమాండ్ చేయడం తో రాజకీయాలలో ఈ నిస్వార్ధ సేవా కార్యక్రమాలుగుర్తుకు వచ్చాయి .
ఎన్టీఆర్ నుంచి బాబు పార్టీ లాక్కున్న తరువాత చంపా పేట లో టీడీపీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు . 97-98 లో ఓ రోజు ఈ శిక్షణా కార్యక్రమాల్లో రాజకీయాల్లో నైతిక విలువలు , క్రమశిక్షణ గురించి బాబు ఉపన్యాసం ముగిశాక మీడియా తిరిగి వెళ్లి పోవడానికి వస్తుంటే పార్టీలో ముఖ్యనాయకుడు పి . ఎన్ వి . ప్రసాద్ మీడియా వద్దకు పరిగెత్తుకు వచ్చి ఒక డాక్టర్ జంటను పరిచయం చేశారు . పార్టీ శిక్షణా కార్యక్రమం లో వీళ్ళు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు సేవా భావం తో అని పరిచయం చేశారు . నవ్వుతూ ఏ నోయోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని అడిగాను . వాళ్ళు అప్పుడు చెప్పలేదు కానీ కానీ 1998 లో99లో ఆ డాక్టర్ సుగుణకుమారికి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కింది . ఆమె గెలిచింది కూడా ., 98లో గెలిచాక కానీ 2004 లో ఓడిపోయాక కానీ మళ్ళీ ఎప్పుడూ ఆమె హెల్త్ క్యాంపు లు నిర్వహించినట్టు కనిపించలేదు . టికెట్ కోసం సేవా కార్యక్రమాలు కానీ టికెట్ వచ్చి గెలిచాక సేవా కార్యక్రమాలు ఏమిటీ మన పిచ్చికానీ ..
**********
పి ఎన్ వి ప్రసాద్ కూడా పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు . ఎన్టీఆర్ కుటుంబ యల్ ఐ సి ఏజెంట్ గా జీవితాన్ని ప్రారంభించి బాబు హయం లో పార్టీలో కీలక నేతగా మారారు . హెలికాఫ్టర్ లో జగన్ ఇడుపుల పాయ ఎస్టేట్ ను రహస్యంగా చిత్రించింది ఈయనే . పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలు తెలిసిన నేత . నియోజక వర్గం టికెట్ ఆశించలేదు కానీ రాజ్య సభ సభ్యత్వం ఆశించారు . దక్కక పోవడం తో కొన్ని రోజులు రాజ్యాధికార వేదిక లో పని చేశారు . తరువాత వై యస్ ఆర్ కాంగ్రెస్ లో తేలారు . జగన్ లక్ష కోట్లు సంపాదించారు అని ఆరోపించి , సాహసోపేతంగా హెలికాఫ్టర్ లో జగన్ సామ్రాజ్యాన్ని చిత్రీకరించి సంచలనం సృష్టించిన వారు అదే జగన్ పార్టీలో చేరడం అంటే రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు ఉంటాయి అంటే నమ్మకుండా ఉంటారా ?
******
మహానాడు వంటి పెద్ద మీటింగ్ లు కావచ్చు ఎన్నికల ముందు జరిగే మీటింగ్ లు కావచ్చు కొందరు మంచి నీళ్ల బాటిల్స్ , మజ్జిగ ప్యాకెట్స్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు . మజ్జిగ చిక్కదనాన్ని ఆస్వాదించడం తో పాటు ఆ మజ్జిగ ప్యాకెట్ మీద ఉన్న సందేశాన్ని చదివితే వాటిని పంచిన నాయకుడు టికెట్ ఆశిస్తున్నా నియోజక వర్గం గురించి స్పష్టం గా ఉంటుంది . తెలంగాణ , ఆంధ్ర , రాయలసీమ అనే తేడా లేదు . సికింద్రాబాద్ మహంకాళి జాతర మొదలుకొని కోటప్ప కొండ , నెల్లూరు రొట్టెల జాతర వరకు నాయకుల హోర్డింగ్ లతో పాటు వారు టికెట్ ఆశిస్తున్న నియోజక వర్గం పేరు స్పష్టంగా కనిపిస్తుంది . నాయకుల పుట్టిన రోజు కావచ్చు శ్రావణ శుక్రవారం కావచ్చు పత్రికల్లో పెద్ద ప్రకటనలు , అమ్మవారి జాతర ల వద్ద పెద్ద పెద్ద హోర్డింగ్ లు కనిపిస్తాయి . వాటిలో నాయకుల బొమ్మలు , వారు టికెట్ ఆశిస్తున్నా నియోజక వర్గం ఉంటుంది . ప్రతి సేవ వెనుక ఒక నియోజక వర్గం టికెట్ లక్ష్యం ఉంటుంది .
సేవా కార్యక్రమాలు చూసి మానవతావాది లో మానవత్వం పొంగిపొర్లుతోంది అని తొందరపడి ఓ నిర్ణయానికి రావద్దు . చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ ప్రవేశం చేసినప్పుడు చెప్పనే చెప్పారు సేవే మార్గం అని . బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయండి తరువాత రాజకీయ ప్రవేశానికి ఉపయోగపడుతుంది అని చిరంజీవికి యండమూరి వీరేంద్ర నాథ్ సలహా ఇచ్చినట్టు ఎక్కడో చదివాను . దివిసీమ తుఫాను సమయంలో ఎన్టీఆర్ , అక్కినేని జోలె పట్టి విరాళాలు వసూలు చేశారు . ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంలో చెప్పుకోవడానికి ఈ సేవ ఎంతో ఉపయోగపడింది .
సేవలందు రాజకీయ సేవలు వేరు .
బుద్దా మురళి .
25, ఆగస్టు 2023, శుక్రవారం
అల్లూరి సినిమాలో తూటాల్లాంటి డైలాగులు ... రాజకీయాల్లో అమాయకత్వం ... అధికారం ఆంధ్ర మాత దే నన్న మహారథి... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 85 ----------------------
అల్లూరి సినిమాలో తూటాల్లాంటి డైలాగులు ... రాజకీయాల్లో అమాయకత్వం ...
అధికారం ఆంధ్ర మాత దే నన్న మహారథి...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 85
----------------------
కొద్ది సేపు వారితో మాట్లాడిన తరువాత ... మీరు మహా రథి గారే కదా ? అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటలు రాసిన మహారథి గారే కదా ? అని మరో సారి అడిగితే .. ఔను అని చెప్పినా నాకెందుకో నమ్మడం ఇష్టం అనిపించలేదు .
ఆంధ్ర మాత పేరుతో పార్టీ పెడుతున్నాం . పార్టీ విధానాలు , సిద్ధాంతాలు అన్నీ సిద్ధం అయ్యాయి . కాంగ్రెస్ , టీడీపీ ల్లో ఎవరూ ఉండరు , అధికారం లోకి వచ్చేది ఆంధ్ర మాత పార్టీనే ... ఇదీ సంక్షిప్తంగా మహారథి చెప్పిన మాటలు .
ఆంధ్ర భూమిలో ఫోకస్ అని ఓ పేజీ ఉండేది . ఒక అంశం పై పలువురు ప్రముఖుల అభిప్రాయాలు ఆ పేజీలో వచ్చేవి . ఏదో రాజకీయ పరిణామం పై మహారథి తో మాట్లాడమని బ్యూరో చీఫ్ చారి మహారథి ఫోన్ నంబర్ ఇస్తే ఫోన్ చేశాను .
చదువుకొనే రోజుల్లో అల్లూరి సీతా రామరాజు సినిమా ప్రభావం తీవ్రంగా ఉంది . అందులో ఈటెల్లాంటి డైలాగులు ఇంకా గుర్తున్నాయి . ఆ డైలాగులను షూటింగ్ లోనే ఏ రోజుకు ఆ రోజు రాసింది మహారథి . అల్లూరి సీతారామరాజుగా కృష్ణ రూపం , దుస్తులు ఎలా ఉండాలో నిర్ణయించింది మహారథి . ఒక యజ్ఞం లా ఈ సినిమాకు ఆయన నిష్ఠ తో పని చేశారు .
అల్లూరి సీతారామరాజు సినిమాకు అలాంటి డైలాగులు రాసిన వారు అంటే , దానికి తగ్గట్టు ఉహించుకుంటాం .. కానీ మహారథి రాజకీయాల గురించి మాట్లాడితే , ఆ సినిమాకు డైలాగులు రాసిన మహారథి , ఫోన్ లో మాట్లాడిన మహారథి ఒకరేనా ? అనే అనుమానం వచ్చింది . ఆ నేనే , ఈ నేను అని అయన చెప్పినప్పటికీ , చారిని మరోసారి అడిగాను . ఏంటీ ఈయన ఆయనేనా ? అని .. ఆయనే ఏంటీ మేం పార్టీ పెడుతున్నాం , అధికారం లోకి వచ్చేస్తున్నాం అని చెప్పాడా ? అని చారి అడిగితే ఔను అన్నాను .
మహారథి పార్టీ పెడుతున్నాం , అధికారంలోకి వచ్చేస్తున్నాం అని నాతోనే కాకుండా అందరికీ సీరియస్ గానే చెప్పేస్తున్నాడని అర్థమైంది .
ఎప్పుడో అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటలు రాసి , పార్టీ పెడితే అధికారంలోకి వచ్చేస్తాం అని ఎలా ఉహించుకుంటారో అర్థం కాలేదు . అప్పుడు కాంగ్రెస్ , టీడీపీ రెండు ప్రధాన పక్షాలు ఉన్నాయి . ఈ రెండు పార్టీలను కాదని అడ్రెస్ లేని ఆంధ్ర మాత పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారో , అంత భ్రమల్లో ఎలా ఉంటారో అర్థం కాలేదు . అధికారంలోకి రావడం మాట దేవుడెరుగు ఆ రెండు పార్టీలను వదిలి నాయకులంతా ఆంధ్ర మాత లోకి చేరిపోతారని మహారథి ఎలా కలలు కంటున్నారో అర్థం కాలేదు . ఒక రంగంలో మేధావులుగా గుర్తింపు పొందిన వారు మరో రంగం గురించి ఇంత అమాయకత్వం తో ఎలా ఉంటారో అనిపించింది మహారథి రాజకీయ జోస్యాలు విన్న తరువాత .
చివరకు మహారథి పార్టీ పుట్టిందో లేదో తెలియకుండానే అదృశ్యం అయింది .
-----------------------------------------------------------------------
పార్టీ కరపత్రాలు పంచిన నూకల చిన సత్యనారాయణ
సికింద్రాబాద్ లోని ఆంధ్రభూమి ఆఫీస్ నుంచి వారాసిగూడ లోని ఇంటికి వెళుతుంటే చిలకలగూడ వద్ద కొంతమంది ఒక రాజకీయ పార్టీ కరపత్రాలు పంచుతూ కనిపించారు . అలా పంచుతున్న వారిలో ఒకరు ప్రఖ్యాత కళాకారుడిలా అనిపించి అలానే చూస్తుండి పోయాను . ఆయన దారిలో కనిపించిన వారందరికీ కరపత్రాలు పంచుతున్నా తీసుకున్న వారిలో పెద్దగా స్పందన లేదు . వారికి ఆయన ఎవరో కూడా తెలియదు . ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత మహా మహోపాధ్యాయ నూకల చిన సత్యనారాయణ . అంతటి వారు రోడ్డు మీద రాజకీయ పార్టీ కరపత్రాలు పంచడం వింతగా అనిపించి , ఓ కరపత్రం తీసుకోని మాట్లాడాను ఇదేంటి అని ...
పత్రీజీ అని ధ్యానం ను ఒక ఉద్యమం గా మారుమూల గ్రామాల్లో సైతం వ్యాపించేట్టు చేశారు . పత్రీజీ పిరమిడ్ పార్టీ అని ఒక రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేశారు . రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికల్లో గెలవాలి అని కాకుండా ధాన్యం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి అనే ఉద్దేశం తో పిరమిడ్ పార్టీ తరపున ఉమ్మడి రాష్ట్రం లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేవారు . దానిలో భాగంగా పత్రీజీ సికింద్రాబాద్ అభ్యర్థిగా నూకల చిన సత్యనారాయణ ను నిలబెట్టారు . దానితో మహా మహోపాధ్యాయుడు కరపత్రాలు పట్టుకొని కనిపించిన వారికల్లా ఇచ్చారు .
గత ఎన్నికల సమయంలో ఓ జడ్జీ గారు తొందరపడి ఇతర పార్టీల టికెట్ల కోసం ప్రయత్నించకండి , ఢిల్లీ వెళుతున్నాను , పార్టీ రిజిస్టర్ చేసుకొని వస్తాను అని వెళ్లారు . పార్టీ రిజిస్టర్ ఐతే చేశారు కానీ పట్టించుకున్న వారు లేరు .. ఈ సారి చివరకు ఆయన కూడా తన పార్టీ గురించి మరిచిపోయారు .
చాలా మంది కళాకారులు , మేధావులు రాజకీయ పార్టీలు పెట్టి , చివరకు పార్టీ పెట్టిన విషయం వాళ్ళు కూడా మరిచిపోతారు .
రాజకీయాలు టివిలో కూర్చొని విశ్లేషణ చేసినంత ఈజీ కాదు . పత్రికల్లో రాసినంత సులభం కాదు .. అంత ఈజీ అయి ఉంటే మీడియాధిపతులే అధికారంలో ఉండేవారు .
- బుద్దా మురళి
4, ఆగస్టు 2023, శుక్రవారం
జెపికి జోస్యం చెప్పి .. భవిష్యత్తును చూపించాను సాంప్రదాయ రాజకీయాలు - సామాజిక రాజకీయాలు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -83
జెపికి జోస్యం చెప్పి .. భవిష్యత్తును చూపించాను
సాంప్రదాయ రాజకీయాలు - సామాజిక రాజకీయాలు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -83
_____________________________
తెలంగాణ కు అదేం దురదృష్టమో కానీ ... మీకు చీకటి తప్పదు అని జోస్యం చెప్పిన వారి కళ్ళు వెలుగులతో మూసుకుపోయేంతగా అభివృద్ధి సాధించిన వారు తెలంగాణ గురించి చెప్పే మాటలకన్నా జీవితంలో ఒక్క సారి గెలిచి అడ్రెస్ లేకుండా పోయిన వారి మాటలకే తెలుగు మీడియా ప్రాధాన్యత ఇస్తుంది . తెలంగాణలో మిగులు విద్యుత్ సాధించే దశకు చేరుకుంటాం అని ప్రకటిస్తే మేధావులు నవ్వారు . ఆరు నెలల్లో ఆంధ్రాలో కలిపేయమని ఉద్యమం తెలంగాణలో వస్తుంది చూడండి అని జ్యోతిష్యం చెప్పారు . బోరు బావులకు విద్యుత్ లేక కరువుతో పోతారు అన్నారు . ఆ మేధావుల్లోని ఒకరు జయప్రకాశ్ నారాయణ మెట్రో గురించి మరో జోష్యం చెప్పారు .
మెట్రో గురించి ఇది మొదటి జ్యోతిష్యం ఏమీ కాదు . వారి ఆలోచన ధోరణికి చెందిన జ్యోతి పత్రిక , ప్రపంచంలో టాప్ యువనాయకుడిగా అవార్డు పొందిన నారా లోకేష్ మెట్రో పై గతంలోనే జోష్యాలు చెప్పారు . హైదరాబాద్ లో మెట్రో మొదలు కాలేదు కానీ మేం విజయవాడలో ప్రారంభించాం అని నారా లోకేష్ బహుశా 2016లో ట్విట్ చేశారు . హైదరాబాద్ మెట్రో పరుగులు తీస్తోంది . విజయవాడ మెట్రో లోకేష్ లాంటి ప్రపంచ స్థాయి నాయకులకు తప్ప సామాన్యులకు కనిపించడం లేదు .
హైదరాబాద్ మెట్రో లాభసాటి కాదు , నిర్మించరు , వెనక్కి వెళతారు అని జ్యోతి అనేక సార్లు రాసింది . మీడియా అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మెట్రోనేమో పరుగులు తీస్తోంది .ఇప్పుడు నగరానికి నాలుగు వైపులా మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు . మెట్రో పై జెపి కొత్త జ్యోస్యం చెప్పాక .. గతం లో నేను ఆయనకు చెప్పిన జోస్యం గుర్తుకు వచ్చింది .
*******
ప్రతి రోజు ఏ బీట్ రిపోర్టర్ అయినా సచివాలయం లో ప్రెస్ రూమ్ బయట , చెట్టు కింద కాసేపు కబుర్లు చెప్పుకొనే అలవాటు ఉండేది . 2006 లో ఓ రోజు నేను అలా ప్రెస్ రూమ్ వద్దకు వెళుతుంటే కొందరు జర్నలిస్ట్ లు అక్కడ సీరియస్ గా చర్చిస్తున్నారు . కొమ్మినేని శ్రీనివాస్ , భార్గవ్ , యాదగిరిరెడ్డి ( గుర్తున్న పేర్లు ) ఇంకా కొంతమంది సీరియస్ చర్చ . జయప్రకాశ్ నారాయణ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడు అనేది ఆ చర్చ అంశం . అప్పటికి నియోజక వర్గాల పునర్విభజన అమలులోకి రాలేదు . అప్పుడు కూకట్పల్లి ప్రాంతం ఖైరతాబాద్ నియోజక వర్గంలో ఉంది . కూకట్ పల్లి ప్రాంతం ఏ నియోజక వర్గం పరిధిలోకి వస్తుందో అక్కడ పోటీ చేస్తే జెపి ఒక్కరు గెలుస్తారు . అంతకు మించి అయన పార్టీకి అంత సీన్ ఉండదు అని జోస్యం చెప్పాను . అంత నెగిటివ్ ఎందుకు ? ఏమో జెపి పార్టీ భవిష్యత్తు బాగుండవచ్చు ఇప్పుడే ఎలా చెప్పగలం అని కొమ్మినేని తన అభిప్రాయం చెప్పారు . లోక్ సత్తా పేరుతో జెపి అంతకు ముందు నుంచే వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించేవారు . కూకట్ పల్లి ప్రాంతంలో లోక్ సత్త సంస్థ సభ్యులు బలంగా ఉండేవారు . మున్సిపాలిటీ వాళ్ళు లంచం తీసుకుంటే నోట్ల నంబర్ లు అన్నీ ఏసుకొని వారి బండారం బయట పెట్టి, తిరిగి ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం అప్పుడో సంచలనం . స్థానిక సంస్థలకు అధికారాలు వంటి అంశాలపై లోక్ సత్తా బాగానే పని చేసింది . ఆ ప్రచారం తో దాన్ని రాజకీయ పార్టీగా మార్చాలి అని జెపి నిర్ణయించుకున్నారు .
****
చంద్రబాబు విఫలం కావడం తో బాబుకు ప్రత్యామ్నాయంగా జేపీని రామోజీరావు తెరపైకి తీసుకువచ్చారు అని అప్పుడు బలంగా ప్రచారం ఉండేది . ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఈనాడులో టీడీపీ తరువాత జెపి కి అంత ప్రచారం లభించేది . జేపీ అందరు ఎడిటర్ లకు ఫోన్ చేసి సీనియర్ జర్నలిస్ట్ లను పంపండి అని కోరేవారు . ఈనాడు మంచి ప్రచారం ఇస్తున్నప్పుడు సాధారణంగా అన్ని పత్రికలు ఈనాడును తోకలా అనుసరిస్తాయి . బాబుకు ప్రత్యామ్నాయంగా జేపీని రామోజీ రంగంలోకి దించారు అనే దానిపై నాకు పెద్దగా నమ్మకం లేదు కానీ ఈనాడులో జేపీకి మంచి ప్రచారం లభించేది . టీడీపీ ని తీవ్రంగా అభిమానించే వర్గాలు టీడీపీతో పాటు జేపీని అభిమానించేవి .
బిర్లా టెంపుల్ నౌబత్ పహాడ్ వద్ద జెపి పార్టీ కార్యాలయం ప్రారంభించారు . శుభమ్ పకాలరా అంటే ఏదో అన్నట్టు ఆ రోజే జేపీకి అయన రాజకీయ భవిష్యత్తు చెప్పాను . మీరు సాంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకం అని చెబుతున్నారు ( కులం , ప్రాంతం, వంటివి సాంప్రదాయ రాజకీయాలు అ నేది జెపి భావన ) కానీ మీరు కూడా సాంప్రదాయ రాజకీయ ఎత్తుగడ తోనే గెలిచారు . మీరు ప్రస్తుతం నివాసం ఉంటున్న నియోజక వర్గం నుంచి పోటీ చేయాలి , లేదా మీరు పుట్టిన ప్రాంతం నియోజక వర్గం నుంచి పోటీ చేయాలి కానీ ఈ రెండు కాకుండా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్నారు అంటే మీరు కూడా సాంప్రదాయ రాజకీయాలు చేస్తున్నట్టే . కూకట్ పల్లిలో ఆంధ్ర ప్రాంతం వారు , మీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే కదా అక్కడి నుంచి పోటీ . ఇది సాంప్రదాయ రాజకీయ కాకా పోతే మరేమిటి అని అడిగాను . ఐతే కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలి అనేది తెలివైన నిర్ణయం . ఇదే వ్యూహం తో 2018 లో టీడీపీ నందమూరి సుహాసినిని కూకట్ పల్లి నుంచి పోటీ చేయించారు . నిజంగానే సాంప్రదాయ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఇంకో చోట నిలబడితే మొదటికే మోసం వచ్చేది . మీ పార్టీ నిలబడదు మీరొక్కరే తప్ప ఇంకొకరు గెలువరు అని ఆయనకే జోష్యం చెప్పాను . మీరు ప్రజలను అర్థం చేసుకోవడం లేదు .. మా పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పుకొచ్చారు . రెండో సారి కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తే ఏమవుతుందో తెలిసి జెపి రెండో ఆసారి ఆ సాహసం చేయలేదు . 2014లో తిరిగి అదే వ్యూహం తో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గం పై గురి పెట్టారు . బీజేపీని బాబును ఆకాశానికెత్తారు . పొత్తులో మల్కాజిగిరి టికెట్ ఆశించారు . సొంతంగా పోటీ చేసి పార్లమెంట్ లో ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడుతాను అని బహిరంగంగా ప్రకటించారు . ఐనా ఓటర్లు పట్టించుకోలేదు .
జేపీని టీడీపీ మీడియా , టీడీపీ వర్గమే ఆకాశానికెత్తింది . కానీ జెపి తమ కొంప ముంచుతున్నాడు అని ఎన్నికల తరువాత గ్రహించింది . 2009 ఎన్నికల్లో లోక్ సత్తా కు దాదాపు 2 శాతం ఓట్లు వచ్చాయి . అవన్నీ టీడీపీని అభిమానించే వారివే అని టీడీపీ భావించింది . మీరు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అని సామెత చెప్పినట్టు జేపీకి మన వాళ్ళే ప్రచారం కల్పిస్తే మన కొంపనే కొల్లేరు చేస్తున్నాడని టీడీపీ జేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది . లోక్ సత్తా కు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో బయటపెట్టాలి అని యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ భవన్ లో రోజూ విలేకరుల సమావేశాలు పెట్టి తీవ్రంగా దాడి చేశారు . యనమల ఆరోపణలకు జెపి స్పష్టంగా సమాధానం చెప్పలేదు .
తెలంగాణ ఏర్పాటును చివరి వరకు వ్యతిరేకించిన జెపి , చివరలో హైదరాబాద్ ఆదాయాన్ని ఆంధ్రకు కేటాయించాలి అని డిమాండ్ చేశారు . తెలంగాణ యేపాటును వ్యతిరేకించడం వేరు కానీ ఒక రాష్ట్రంలో వచ్చిన ఆదాయం ఇంకో రాష్ట్రానికి ఇవ్వాలి అని డిమాండ్ చేయడం అదేం మేధావి తనమో .
పార్టీ పెట్టినప్పుడే మీ వల్లకాదు అని ఆ మేధావికి నేను జోస్యం చెప్పాను .. 2014 తరువాత ఔను నా వల్ల కాదు అని జెపి గ్రహించి పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు . మీరెలా రద్దు చేస్తారు అని కొందరు తిరగబడ్డారు . దాంతో మీరు నడుపుకోండి అని జెపి చెప్పారు . ఇంతకూ జెపి పార్టీ ఉందా ? లేదా ? అంటే ఏమో జెపికే తెలియదు ..నాకెలా తెలుస్తుంది .?
- బుద్దా మురళి
2, ఆగస్టు 2023, బుధవారం
మీడియా లో పుకార్ల పంట.. అదిగో పులి .. ఇదిగో తోక ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -82
మీడియా లో పుకార్ల పంట పండిస్తారు
ఇదిగో పులి .. అదిగో తోక ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -82
------------------------------------
వర్షం పడితేనే రైతులు పంట పండిస్తే మీడియా వార్తల కరువు లో పుకార్ల పంట పండిస్తుంది .
గవర్నర్ కోటా కింద శాసన మండలి సభ్యులుగా ఎంపిక అయ్యె వారి గురించి ఎ బి ఎన్ ఛానల్ లో ఓ స్టోరీ ప్రసారం చేశారు . మోత్కుపల్లి నర్సింహులు మొదలుకొని తమకు తెలిసిన పలువురు నాయకులకు ఈ కోటాలో మండలి సభ్యత్వం కల్పించారు . తీరా చూస్తే కుర్రు సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ లను కెసిఆర్ ఎంపిక చేశారు . ఒక్క ఛానల్ , ఒక్క పత్రిక కూడా ఈ పేర్లను ముందుగా ప్రసారం చేయలేదు . ఇలా ఎందుకు ? అంటే నిర్ణయం తీసుకునేవారు ఏ నిర్ణయం తీసుకుంటారో మీడియాకు తెలియదు . వారు నిర్ణయం తీసుకునేంత వరకు వీరికి గుర్తున్న , తెలిసిన పేర్లన్నీ రాసేయవచ్చు .. మోత్కుపల్లి పై జ్యోతికి అమితమైన ప్రేమ ఉమ్మడి రాష్ట్రంలో వారంలో రెండు మూడు సార్లు మోత్కుపల్లిని గవర్నర్ ను చేసేవారు . విభజన తరువాత శాసన మండలి సభ్యుడి నైనా చేయక పోతే ఎలా అని ఏ ఎన్నిక వచ్చినా వారు తమ మీడియాలో మోత్కుపల్లిని అందలమెక్కిస్తున్నారు .
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఓ జర్నలిస్ట్ మిత్రులు మంత్రివర్గ విస్తరణ పై రాయబోతుంటే ... తెలంగాణ ఉద్యమం , రాష్ట్ర ఏర్పాటు చివరి దశ లో విస్తరణ ఉండదు అని వివరంగా చెబుతున్నాను ... ఆ మిత్రునికి కిరణ్ కుమార్ రెడ్డి బాగా సన్నిహితులు , ఫోన్ లో కబుర్లు చెప్పుకునేంత సన్నిహితం . నేను చెప్పింది విని ... విస్తరణ ఉండదు , ఆ విషయం నీకన్నా నాకే బాగా తెలుసు .. విస్తరణ ఉండదు అంటే ఒకటే వార్త . విస్తరణ ఉంటుంది అని రాస్తే రెండు మూడు రోజులకు ఓ సారి రాసుకోవచ్చు . మరి వార్తలు కావాలి కదా ? అని వార్తల మర్మం తెలియ జేశారు .
మీడియా రాజకీయ నాయకులకు సంబధించే కాదు చివరకు తమ మీద తామే పుకార్లు లేవదీసుకుంటారు . పుకార్లు అంటే ఎవరికైన ఆసక్తిగానే ఉంటుంది . అందులోనూ మీడియాలో ఉన్నప్పుడు వీటిపై మరింత ఆసక్తి ... పత్రికలో రాసిన దానికి , ప్రసారం చేసిన దానికి ఎంతో కొంత బాధ్యత వహించాలి . అది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి .. వాటి విషయంలోనే ఎలాంటి అడ్డు లేనప్పుడు , రికార్డ్ చేయాల్సిన అవసరం లేని పుకార్ల ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో .
*******
వై యస్ రాజశేఖర్ రెడ్డి కి ఆత్మ గా గుర్తింపు పొందిన కెవిపి రామచంద్రరావు ఒక సాహసి ప్రయాణం అని వై యస్ ఆర్ గురించి , పోలవరం గురించి ఓ బుక్ రాశారు . అప్పుడు వైయస్ ఆర్ కు పరిచయం ఉన్న నాయకులు , జర్నలిస్ట్ లను పిలిచారు . సీనియర్ జర్నలిస్ట్ లు భండారు శ్రీనివాసరావు శ్రీనివాసరావు , కొమ్మినేని శ్రీనివాసరావు , కెవి యస్ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లారు . ఈ ముగ్గురు ఉన్న ఫోటోను భండారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే ... ఆ ఫోటోను టీడీపీ వాళ్ళు తీసుకోని ముగ్గురిలో ఒకరికి వై యస్ ఆర్ కమర్షియల్ కాంప్లెక్స్ , ఒకరికి త్రిబుల్ బెడ్ రూమ్ , ఇంకొకరికి విల్లా ఇచ్చారు అని టీడీపీ గ్రూప్ లో రాశారు . ఆ ముగ్గురి లో ఇద్దరి గురించి బాబుకు కూడా బాగా తెలుసు . టీడీపీ వారు పుకారును ప్రచారం లో పెట్టేప్పుడు పుకారులో నిజానిజాలు బాబును అడిగినా చెప్పేవారు .
మీడియా నాయకులపైనే కాదు , నాయకులు మీడియా పై కూడా పుకార్లు లేవదీసే అవకాశం సోషల్ మీడియా కల్పించింది . ఇది జరిగిన కొన్ని రోజులకు మాటల సందర్భంలో సుబ్రహ్మణ్యం 18 మంది సీఎంఓ జర్నలిస్టులకు విల్లాలు ఇప్పించారట కదా ? బయట టాక్ అని చెప్పుకొచ్చారు . ఈ ప్రచారం అన్ని మీడియాల్లో ఉంది . జర్నలిస్ట్ లు అన్నప్పుడు పుకార్లు జన్మ హక్కు . .. నేను దానిని ఏమీ వ్యతిరేకించడం లేదు . కానీ మిగతా ఎవరైనా ఈ పుకారు నమ్మవచ్చు , ప్రచారం చేయవచ్చు కానీ .. మీకు ఆ హక్కు లేదు అన్నాను . వారం క్రితమే కదా ? మీ మీద పుకారు వచ్చింది మీకు వైయస్ ఆర్ త్రిబుల్ బెడ్ రూమ్ విల్లా ఇప్పించారు అని టీడీపీ వాళ్ళు ప్రచారం చేశారు అని గుర్తు చేశాను . సచివాలయం లోకి రానివ్వడం లేదు , వార్తలు దొరకడం లేదు అని మీడియా వాళ్ళు ఏడుస్తుంటే ఇలాంటి పుకారు ఎలా ? పుకారు లో కూడా కొంత నాణ్యత ఉండాలి అని జోకేశాను .
**************
సాధారణంగా ఓ విషయం నాకు తెలియదు అని ఎట్టి పరిస్థితిలోనూ కొందరు ఒప్పుకోరు . ఒక పుకారు వినిపించి నిజమా ? అని అడిగితే దానికి మరింత మసాలా జోడిస్తారు . . ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్ట్ ల ఇంటి స్థలం వ్యవహారం కోర్టు కు వెళ్ళాక .. జనరల్ బాడీ మీటింగ్ లో బిజినెస్ లైన్ రిపోర్టర్ ఒకరు సభ్యుల వద్ద పన్నెండు కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టలేదు . కెవిపి రామచంద్రరావుకు ఇస్తే ఆయన ఆయిల్ బిజినెస్ లో పెట్టారు అని మైకులోనే చెప్పారు . బిజినెస్ రిపోర్టర్ కు భలే బిజినెస్ ఐడియా వచ్చింది అనిపించింది . కెవిపి ఓ వెలుగు వెలిగిపోతున్న కాలం అది .
ఓ జర్నలిస్ట్ ఫోన్ చేసి మన స్థలం ఆరు వందల కోట్లకు అమ్ముకున్నారట అని చెబితే , ఆరు వందల కోట్లు కాదు 650 కోట్లకు అమ్మారు , 50 కోట్లు మీడియేటర్ కు ఇచ్చారు అని బదులిచ్చాను . ఫోన్ చేసిన అతని ఉద్దేశం అమ్మారు అంటే , లేదు అని నేను వాదించాలి అని .... అలాంటి వారి వద్ద నేరుగా మాట్లాడితే ఉపయోగం ఉండదు. నువ్వు చెప్పిన 600 నిజం ఐతే నేను చెప్పిన 650 కూడా నిజమే , నీది పుకారు ఐతే నాదీ పుకారే ... అని బదులిచ్చాను . సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ పేర్లు ఖరారు అయ్యేంత వరకు లెక్క లేనన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినట్టే .. ప్రభుత్వ నిర్ణయం వచ్చే అంత వరకు ఏ విషయంలో నైనా .. ఏ పుకారు అయినా రావచ్చు .
బుద్దా మురళి
1, ఆగస్టు 2023, మంగళవారం
రాజకీయ కామెడీ ప్రయోగం .. తటస్థ రాజకీయం ఓటింగ్ కు దూరంగా ఉండే గాంధేయ వాదులు ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -81
రాజకీయ కామెడీ ప్రయోగం .. తటస్థ రాజకీయం
ఓటింగ్ కు దూరంగా ఉండే గాంధేయ వాదులు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -81
-------------------------------------------------
ఆమె మహాత్మా గాంధీజీ మనవరాలు మేం ఎన్నికల్లో ఓటు వేయం అని చెప్పగానే ఆశ్చర్యం అనిపించింది . అదేంటి ఓట్లను బహిష్కరించాలి అనేది నక్సల్స్ నినాదం . మీరు గాంధేయ వాదులు అని చెబుతూ , మహాత్మా గాంధీజీ మనవరాలు అయి ఉండి , తీవ్రవాదుల్లా ఓటు ను బహిష్కరించడం ఏమిటీ ? అంటే ... ఆమె చెప్పిన సమాధానం తటస్థులం అని ... రాజకీయాల్లో తటస్థులు అనే దానిని ఓ జోక్ గా మార్చారు కానీ వాళ్ళు నిజమైన తటస్థులు . ఎన్టీఆర్ భవన్ లో ఒక సారి మహాత్మ గాంధీజీ మనవరాలు కలిశారు . మానవ విలువలు బోధించే విధంగా కృషి చేసే తమ సంస్థ విధానాలు అన్ని పార్టీల వారికి చెబుతూ ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు . ఎన్నికల్లో ఓటు వేయకుండా దూరంగా ఉండడం తమ సంస్థ సభ్యలు పాటించాల్సిన నియమం . మేము తటస్థంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాం , ఒక పార్టీకి ఓటు వేసిన తరువాత తటస్థులం అని చెప్పడం సరికాదు .. ఏ పార్టీకి ఓటు వేశామో మనం ఆ పార్టీని ఇష్టపడుతున్నట్టు లెక్క , ఓటు వేస్తే ఇక తటస్థులు ఎలా అవుతారు, అందుకే ఓటింగ్ కు దూరంగా ఉంటాం అని చెప్పుకొచ్చారు .
ఆ తరువాత అదే ఎన్టీఆర్ భవన్ తటస్థులతో నిండిపోయింది .
********
1999 ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన తటస్థ రాజకీయ ప్రయోగం రాజకీయాల్లో ఓ విచిత్ర ప్రయోగం గా మిగిలిపోయింది . ఒక పార్టీ తరపున గెలిచి న తరువాత తటస్థులు ఎలా అవుతారో ? గెలవడమే కాదు మంత్రి వర్గంలో చేరిన తరువాత కూడా మేం తటస్థులం అని చెప్పుకునేవారు . మంత్రి వర్గం లో స్థా నేను తటస్తున్ని అని చెప్పుకంటే వంద శాతం పలానా పార్టీ అభిమాని అని చెప్పేసే పరిస్థితి . 99 ప్రయోగం విఫలమైనట్టు 2004 లో కానీ టీడీపీ గుర్తించలేక పోయింది . తరువాత తటస్థులు ఎవరూ పార్టీలో మిగలలేదు .
95లో ఎన్టీఆర్ ను దించి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు కు చెప్పుకోవడానికి బలమైన పథకాలు లేవు . పైగా టీడీపీకి రామబాణం లాంటి రెండు రూపాయలకు కిలో బియ్యం ను రెట్టింపు ధర చేశారు . సొంతంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేమి లేవు . హై టెక్ సిటీ పై పూర్తిగా ఆధారపడలేరు . సమయంలో తటస్థ ప్రయోగానికి తెర లేపారు .
********
ఎన్టీఆర్ భవన్ లో అప్పుడు ఒక జాతరలా ఉండేది . పెద్ద సంఖ్యలో జనం వచ్చి మేం తటస్థులం అని చెప్పి పార్టీలో చేరేవారు . రిపోర్టర్ లకు సైతం వారితో మాట్లాడడం ఓ కాలక్షేపంగా ఉండేది . అప్పుడు శాసన మండలి సభ్యునిగా ఉన్న యాదగిరి టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రిసెప్షనిస్ట్ గా బాధ్యతలు నిర్వహించేవారు . పెద్ద సంఖ్యలో వచ్సిన తటస్థులు రిసెప్షన్ లో ఉన్న యాదగిరి వద్ద సందర్శకుల బుక్ తీసుకోని అందులో వివరాలు , ఫోన్ నంబర్ , అడ్రెస్ రాసేవాళ్ళు . అలా రాసే వారి ఉద్దేశం పార్టీ నుంచి తమకు పిలుపు వస్తుంది , ఏదో ఒక బాధ్యత అప్పగిస్తారు అని .. అలా రాసి వెళ్లిన వారికి పిలుపు వచ్చేది పార్టీ నుంచి కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నుంచి . టైమ్స్ మార్కెటింగ్ అతను రోజూ యాదగిరి వద్దకు వచ్చి అంతకు ముందు రోజు అడ్రెస్ లు రాసిన వారి వివరాలు నాట్ చేసుకొని , టైమ్స్ పత్రిక వేసుకోమని కోరే వారు . అలా రాసి వెళుతున్న వారికి ఇది తెలియదు కానీ రిపోర్టర్ లు గా రోజూ అక్కడే ఉండి ఈ తతంగాన్ని చూసే వారికి ఇదో తమాషా గా ఉండేది .
తాజాగా రిటైర్ అయినట్టు ఉన్నాడు ఓ వ్యక్తి బ్రీఫ్ కేస్ తోనే ఎన్టీఆర్ భవన్ కు వచ్చి .. నాకేదైనా పని అప్పగించండి అని ఉత్సాహ పడ్డారు . అక్కడ తోటి తటస్థులు , జర్నలిస్ట్ లు కనిపించగానే అతనికి జ్ఞాన బోధ చేయాలి అని పించింది . తప్పంతా నెహ్రూదే అన్నట్టుగా అందరికీ ఓటు హక్కు కల్పించడం వల్లనే దేశం ఇలా ఉంది . చదువుకున్న వారికి , ఉన్నత స్థాయి వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటే దేశం ఇలా ఉండదు అని అతను తేల్చేశాడు . అంతా విన్నాక అతనికో మాట చెప్పాను .. ఎన్టీఆర్ భవన్ ఎదురుగానే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంటుంది . బాగా చదువుకున్న వాళ్ళు , సంపన్నులు , ఉన్నతాధికారులు అక్కడ వాకింగ్ చేస్తుంటారు . చేతిలో బ్రీఫ్ కేస్ తో ఇలానే ఆ పార్క్ వద్దకు వెళ్లి గుండెపోటు వచ్చినట్టుగా పడిపోండి . మీరు చెప్పిన ఉన్నత వ్యక్తులు మీకు ఏమైందో అని సహాయం చేయడానికి వస్తారా ? లేక అక్కడ ఉండే ఆటో డ్రైవర్లు , ఇతర చిన్న చిన్న వాళ్ళు వస్తారో చూడండి అని సలహా ఇచ్చాను .
****
1999 ఎన్నికల్లో . తటస్థ కోటలో పలువురికి టికెట్లు ఇచ్చారు . తటస్థ కోటాలో విజయరామారావు , శనక్కాయల అరుణ , లక్ష్మి పద్మావతిలకు బాబు మంత్రివర్గంలో చోటు కల్పించారు . డిజిపిగా , సిబిఐ డైరెక్టెర్ గా మంచి ప్రతిభ చూపారు అని చెప్పి విజయరామారావును హోం మంత్రిని చేస్తారు అని అంతా అనుకుంటే రోడ్లు భవనాలు అప్పగించారు . తటస్థులు మంత్రివర్గంలో ఉన్నా , పార్టీతో మాకేం సంబంధం , మేం తటస్థులం అని చెప్పే వాళ్ళు . అప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా లాల్ జాన్ బాషా పార్టీలో ప్రముఖునిగా ఉండేవారు . ఓ మంత్రికి ఫోన్ చేస్తే పార్టీతో నాకు సంబంధం లేదు అని బదులిచ్చారు . . తటస్థ నాయకులు ఉన్న చోట పార్టీ శ్రేణులు నిర్వీర్యం అయ్యారు . తటస్థ కోటాలో విజయరామారావుకు మంత్రి పదవి ఇవ్వకుండా కెసిఆర్ కు ఇస్తే తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదు అని కొందరు టీడీపీ నాయకుల వాదన .. ఐతే తటస్థుల ప్రయోగాన్ని కన్నా చాలా ముందుగానే తెలంగాణ ఉద్యమానికి సన్నాహాలు జరిగాయి .
*******
తటస్థుల ప్రయోగం టీడీపీ లానే బిజెపి కూడా చేసింది . 2004 ఎన్నికలకు ముందు ఏం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో వైస్ రాయ్ హోటల్ లో కొందరు ప్రముఖులతో సమావేశం నిర్వహించి బీజేపీని గెలిపించాలి అని కోరారు . ఐతే ఇది పార్టీ సమావేశం కాదు బీజేపీని అభిమానించే తటస్థుల సమావేశం అని ప్రకటించారు . టీడీపీకి ఇప్పటికీ స్వదేశంలో , విదేశంలో తటస్థ మద్దతుదారులు ఉన్నారు . స్వల్ప సంఖ్యలోనే కావచ్చు వీరిని చూసి ఇతర పార్టీల వారూ మేము తటస్థులం అని చెప్పుకుంటారు . ఇప్పడు బీజేపీకి కూడా తటస్థ మద్దతుదారులు బాగానే ఉన్నారు .
ఒక్క తెలంగాణ ఉద్యమం లో మాత్రమే అన్ని పార్టీల వాళ్ళు , ఏ పార్టీకి చెందని వారు . లెఫ్ట్ , రైట్ అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు . గుడిలో పూజలు చేసే పూజారులు సైతం...
-బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)