29, నవంబర్ 2023, బుధవారం

తిక్కవరపు ఇంటికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి .. టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం . జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106

తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106 ---------------------- 1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది . ఆ రోజులు అలా కాదు . ఎన్టీఆర్ ను గద్దె దించడానికి పార్టీలో పుట్టిన ముసలంలో ఈ భోజనం ఎపిసోడ్ కూడా ఒక ప్రధాన పాత్ర వహించింది . ఎన్టీఆర్ దంపతులు సుబ్బిరామిరెడ్డి ఇంటికి వెళ్ళగానే బాబు వర్గం రంగంలోకి దిగింది . లక్ష్మీ పార్వతి పార్టీని అపవిత్రం చేస్తోంది అనేది ఆ వర్గం ప్రచార సారాంశం . భోజనానికి వెళితే అపవిత్రమా ? అంటే వారి దృష్టిలో అంతే .. వారు అలా భావించడానికి ఓ కారణం ఉంది . హిమాయత్ నగర్ లో పార్టీ కార్యాలయం ఉన్నప్పుడు , తరువాత భవన్ లో టీడీపీ నాయకులతో సరదా సంభాషణల్లో మీ పార్టీ సిద్ధాంతం ఏమిటీ అంటే పలువురు రెండు రూపాయలకు కిలో బియ్యం అని గర్వం గా చెప్పేవారు . రెండు రూపాయలకు కిలో బియ్యం సిద్ధాంతం కాదు ఆదో స్కీమ్ అని గుర్తు చేస్తే ... చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అందరు నాయకులు కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అనే వారు . ఒక పార్టీని వ్యతిరేకించడం మరో పార్టీ సిద్ధాంతం ఏమిటో ? ఒక వేళ కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనుకోండి అప్పుడు మీ పార్టీకి సిద్ధాంతం లేకుండా పోతుంది కదా ? అని చమత్కరించేవాడిని . నిజానికి ఆ కాలం లో కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనే మాట ఊహకు అందనిది . ఈ మూడు దశాబ్దాల కాలం లో ఆంధ్ర లో కాంగ్రెస్ లేకుండా పోతే , తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది . ***** తిక్కవరపు ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్ళాక పార్టీలో బాబు వర్గం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు దగ్గర చేస్తోంది అనే గుస గుస ప్రచారం మొదలు పెట్టారు .తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ నాయకుడు , రాజ్యసభ సభ్యులు , కేంద్ర మంత్రి అయినా ఆయన పలుకుబడి కాంగ్రెస్ కె పరిమితం కాలేదు . ఉమ్మడి రాష్ట్రంలో ఆ కాలంలో కూడా ఆయన్ని ప్రచార పిచ్చి ఉన్న నాయకుడు అనే చూశారు కానీ ఢిల్లీలో అయన పలుకుబడి ఎలాంటిదో టీడీపీ రాజ్య సభ సభ్యులుగా ఉన్నప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఓ సారి చెప్పారు . ఆయన ఢిల్లీలో పార్టీ ఇస్తే కేంద్రమంత్రులు ,ఆ న్నీ పార్టీల నాయకులు .... బడా బడా అధికారులు , సినిమా హీరోలు, హీరోయిన్ లు వచ్చేవారట . కనులతోనే ఎవరి అవసరం ఏమిటో గ్రహించేసే వారట .. అక్కడి పెద్దలు .. అంతటి సుబ్బిరామిరెడ్డి కంస్ట్రక్షన్ సంస్థ వేల కోట్ల అప్పులతో చేతులు ఎత్తేసింది . దివాళా ప్రక్రియ సాగుతోంది . లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు చేరువ చేస్తోంది అని ప్రచారం ప్రారంభించిన బాబు వర్గం బాస్ బాబే స్వయంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు . ఆ తరువాత లక్ష్మి పార్వతిపై టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం . ఎన్నికలు వచ్చాయి . కాంగ్రెస్కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోగా ఎన్టీఆర్ సీఎం అయ్యారు . 95 వెన్నుపోటులో ఎన్టీఆర్ ను దించేసిన తరువాత ఎన్టీఆర్ కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయతినించారు అని మళ్ళీ వార్తలు . అప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు జోక్యం చేసుకోక పోవడం ద్వారా పరోక్షంగా బాబుకు సహకరించారు . ఎన్టీఆర్ ను దించేసిన కొద్ది రోజులకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి . లోక్ సభ సీట్లు మీకు , అసెంబ్లీ మాకు .. బాబును దించేయాలి అని ఎన్టీఆర్ కాంగ్రెస్ తో మంతనాలు సాగిస్తున్నారని బాబు మీడియాలో ప్రచారం . బాబు సీఎంగా కుదురుకోవడంతో ఎన్టీఆర్ తెలుగుదేశం అని కొత్త పార్టీ ఏర్పాటు చేసి పోటీకి సిద్ధమయ్యారు కానీ ఎన్నికలు రాకముందే మరణించారు . ఎన్టీఆర్ నిజంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారా ? బేరం కోసం ప్రయత్నించారా ? అంటే ఆ మాట చెప్పల్సింది ఎన్టీఆర్ , వార్తలు రాయించిన బాబు ... చెప్పడానికి ఎన్టీఆర్ లేరు . బాబు చెప్పరు . **** సుబ్బిరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్లడం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే ? ఖమ్మంలో కాంగ్రెస్ నేత ప్రియాంక సభ లో టీడీపీ జెండాలు రెపరెపలడాయి . కాంగ్రెస్ సభల్లో టీడీపీ జెండాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి . ఇదేం కొత్తకాదు 2018 లోనే చెట్టాపట్టాలేసుకొని పోటీ చేశారు కదా ? అంటే నిజమే 2018 లో కాంగ్రెస్ , టీడీపీ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంది . ఈ సారి పొత్తుకాదు ఒక్క సీటు కూడా ఇవ్వకపోయినా కాంగ్రెస్ విజయానికి టీడీపీ పని చేస్తోంది . కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అని సగర్వంగా ప్రకటించుకున్న పార్టీ కాంగ్రెస్ కోసం తమ పార్టీని మూసేసుకుంది . ఒక్క సీటు కూడా లేకుండా షర్మిల పార్టీ కాంగ్రెస్ తో జత కట్టింది . ఒక్క సీటు లేకుండా కోదండరాం పార్టీ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . ఆ రెండు పార్టీల దారిలోనే టీడీపీ సైతం కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . 2014 కాలం లో బాబు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఖాళీ చేయడానికి టీడీపీ బీరు సీసా కాదు అన్నారు . ఖాళీ బీరు సీసాకు కూడా కొంత విలువ ఉంటుంది . కానీ బాబు మాత్రం ఉచితంగానే తెలంగాణలో కాంగ్రెస్ కోసం టీడీపీని ఇచ్చేశారు . బాబు గ్రేట్ ---------- సుబ్బిరామిరెడ్డి ఇంటికి భోజనానికి వెళితే పార్టీని అపవిత్రం చేస్తున్నారని ప్రచారం చేసి దాన్ని నమ్మించిన బాబు ఏకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా , ఉచితంగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నా టీడీపీ శ్రేణులు , నేతలు ఏమంటున్నారు ? అంటే ? ఏమీ అన్నారు బాబు ఏం చేసినా అదే కరెక్ట్ అనుకునేట్టు ట్యూన్ చేయడంలో బాబు విజయం సాధించారు . ప్రజలను ట్యూన్ చేయడంలో బాబు విఫలం అయి ఉండవచ్చు కానీ పార్టీని ట్యూన్ చేయడంలో ఘన విజయం సాధించారు . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం